రాష్ట్రంలోని 78 గ్రూప్–1 పోస్టుల భర్తీకోసం నిర్వహించే మెయిన్స్ పరీక్షలో అభ్యర్థుల క్వాలిఫయింగ్ మార్కులపై ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శుక్రవారం ప్రకటన విడుదలచేసింది.
గ్రూప్1పై ఏపీపీఎస్సీ ప్రకటన
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని 78 గ్రూప్–1 పోస్టుల భర్తీకోసం నిర్వహించే మెయిన్స్ పరీక్షలో అభ్యర్థుల క్వాలిఫయింగ్ మార్కులపై ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శుక్రవారం ప్రకటన విడుదలచేసింది. జనరల్ ఇంగ్లీషుతో పాటు ఇతర పేపర్లలోనూ క్వాలిఫయింగ్ మార్కులను నిర్దేశించింది. గ్రూప్–1 మెయిన్స్ పరీక్షను ఆగస్టు 17వ తేదీ నుంచి 28 వరకూ నిర్వహించనున్న సంగతి తెలిసిందే. జనరల్ ఇంగ్లీషు మినహా ఇతర పేపర్లను ఇంగ్లీషు, తెలుగు, ఉర్దూ మాధ్యమాల్లో దేన్నయినా అభ్యర్థులు ఎంచుకోవచ్చు. ఓ పేపర్‌ను ఒక మాధ్యమంలో, మరో పేపర్‌ను మరో మాధ్యమంలోనూ రాసేందుకూ వీల్లేదు. జనరల్ ఇంగ్లీషు పేపర్ క్వాలిఫయింగ్ పేపర్ మాత్రమే. ఈ మార్కులను ర్యాంకింగ్‌కు పరిగణనలోకి తీసుకోరు. జనరల్ ఇంగ్లీషులో ఓసీలకు 40 శాతం, బీసీలకు 35 శాతం, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 30 శాతం మార్కులు రావాలి.
ఇతర పేపర్లలో కూడా ఇదే రకంగా క్వాలిఫయింగ్ మార్కులు సాధించాలి. అయితే ఇతర పేపర్లన్నింటిలో వచ్చిన అన్ని మార్కులను (ఏగ్రిగేటింగ్) కలుపుకొని ఈ క్వాలిఫయింగ్ శాతం మార్కులు వచ్చాయో లేదో చూస్తారు. క్వాలిఫయింగ్ మార్కుల విషయంలో ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి కొన్ని మినహాయింపులిచ్చారు. జనరల్ ఇంగ్లీషులో నిర్ణీత శాతంలో క్వాలిఫై మార్కులు వారు సాధించాల్సి ఉంటుంది. ఇతర పేపర్లలో నిర్ణీత క్వాలిఫై మార్కులు సాధించిన వారు లేకపోతే ఆ తర్వాతి స్థానాల్లో ఉన్న వారిని మెరిట్ ప్రాతిపదికన తీసుకుంటారు. గ్రూప్–1 మెయిన్స్ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను కమిషన్ వెబ్‌సైట్లో పొందుపరిచారు.