
టాలీవుడ్‌లో 'నేనింతే' సినిమాతో పరిచయం అయిన నటి అభినయ తనకు కాబోయే భర్తను సోషల్‌మీడియా ద్వారా పరిచయం చేసింది. తెలుగులో కింగ్, శంభో శివ శంభో వంటి సినిమాల్లో ఆమె నటించినప్పటికీ 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' మూవీలో చిన్ని పాత్రలో బాగా ఆకట్టుకుంది. అలా టాలీవుడ్‌లో చాలా సినిమాల్లో అభినయకు ఛాన్సులు వచ్చాయి.

త్వరలో తాను వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నానని కాబోయే భర్తతో కలిసి గుడిగంట కొడుతోన్న ఫొటోను అభినయ పంచుకుంది. ఈ క్రమంలోనే మార్చి 9న తమ నిశ్చితార్థం జరిగినట్లు కాబోయే భర్తను పరిచయం చేస్తూ ఆమె ఫోటోలు షేర్ చేసింది. అతని పేరు 'సన్నీ వర్మ' అని తెలిపింది. ప్రముఖ కన్‌స్ట్రక్షన్ కంపెనీలో ఆయన ఉద్యోగం చేస్తున్నట్లు తెలుస్తోంది. రోడ్లు, భవనాలు, నీటిపారుదల, ఎలక్ట్రికల్, మైనింగ్, రైల్వేల నిర్మాణంలో భాగమైన ఒక అంతర్జాతీయ సంస్థలో అతను పనిచేస్తున్నట్లు సమాచారం.
కొద్దిరోజుల క్రితం ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అభినయ తన ప్రేమను మొదటిసారి ఇలా రివీల్ చేసింది. 'నా చిన్ననాటి స్నేహితుడితో రిలేషన్‌లో ఉన్నాను. 15 ఏళ్లుగా మా మధ్య బంధం ఉంది. త్వరలో అతన్ని పెళ్లి చేసుకోబోతున్నాను. నా వ్యక్తిగత విషయం ఏదైనా సరే ఎలాంటి భయం లేకుండా అతనితో పంచుకోగలను' అని పేర్కొంది.