
కుశాల్ రాజు హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమా ద్వారా ప్రముఖ దర్శకుడు మల్లిడి వశిష్ట సోదరుడు మల్లిడి కృష్ణ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఈ చిత్రాన్ని ఎంఎస్ఆర్ క్రియేషన్స్ ప్రొడక్షన్ బ్యానర్‌లో డా. లతా రాజు నిర్మిస్తున్నారు. ఇవాళ ఈ సినిమా షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో పూజా కార్యక్రమాలతో మొదలైంది. స్టార్ డైరెక్టర్ వీవీ వినాయక్ క్లాప్ కొట్టగా..మల్లిడి వశిష్ట ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు. ఎన్నో హిట్ చిత్రాలకు సంగీతం అందించిన శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు మల్లిడి కృష్ణ మాట్లాడుతూ.. '2012లో నా జర్నీ మొదలైంది. ఎన్నోమలుపులు తిరిగి మీ ముందుకు డైరెక్టర్‌గా వచ్చాను. లత గారికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి. అలాంటి మంచి నిర్మాత దొరకాలంటే అదృష్టం ఉండాలి. ఇదొక స్కైఫై డ్రామా మూవీ. ఓటీటీల యుగంలో ఇలాంటి కథను ఎంచుకోవాలంటే ధైర్యం ఉండాలి. రాబోయే ఈవెంట్స్‌లో మరిన్ని వివరాలు వెల్లడిస్తా' అని చెప్పారు. హీరో కుశాల్ రాజు మాట్లాడుతూ..'నా దర్శకుడు కృష్ణకు థ్యాంక్స్ చెప్పాలి. నన్ను హీరోగా పరిచయం చేయడం కోసం మా అమ్మ లత చాలా కేర్ తీసుకున్నారు. వీవీ వినాయక్, బెల్లంకొండ శ్రీనివాస్, మా టీమ్ మొత్తానికి బిగ్ థ్యాంక్స్' అని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో జగపతి బాబు, పృథ్వీరాజ్, వైవా హర్ష, బబ్లూ కీలక పాత్రలు పోషిస్తున్నారు.