గ్రూప్–1 పరీక్షలపై ఐదుగురు అభ్యర్థుల అప్పీల్
తప్పు ప్రశ్నలపై వాదనలు వినాలని విజ్ఞప్తి
నేడు విచారణ చేపట్టనున్న హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలకు గ్రీన్‌సిగ్నల్ ఇస్తూ మూడురోజుల క్రితం సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టులో అప్పీల్ దాఖలైంది. వికారాబాద్ జిల్లా పరిగికి చెందిన గంగుల దామోదర్‌రెడ్డితోపాటు మరో నలుగురు హైకోర్టులో రిట్ అప్పీల్ దాఖలు చేశారు. తెలంగాణ పబ్లిక్ సచ్చిస్ కమిషన్, జీఏడీ కార్యదర్శిని ప్రతివాదులుగా చేర్చా రు. ఈ అప్పీల్‌పై జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి, జస్టిస్ లక్ష్మీనారాయణ అలిశెట్టి ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టనుంది.
‘ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థుల జాబితాను ప్రచురించే ముందు ప్రాథమిక కీపై వచ్చిన అభ్యంతరాలను నిష్పాక్షికంగా పరిశీలించాలి. ఆ అభ్యంతరాలపై పూర్తి పరిశీలన జరిగిన తర్వాతే మెరిట్ జాబితా ప్రకటించాలి. కానీ టీజీపీఎస్సీ ఆ మేరకు చర్యలు తీసుకోలేదు.
తప్పుగా వచ్చిన ప్రశ్నలను తొలగించి మళ్లీ మెరిట్ జాబితా ప్రకటించేలా ఆదేశించాలి’అని దామోదర్‌రెడ్డితోపాటు మరికొందరు దాఖలుచేసిన రిట్ పిటిషన్‌ను సింగిల్ జడ్జి కొట్టివేశారు. సాంకేతిక అంశాలను నిపుణుల కమిటీకే వదిలేయాలని, కోర్టుల జోక్యం కూడదని వ్యాఖ్యానించారు. ఈ ఉత్తర్వులను కొట్టివేయాలంటూ తాజాగా పిటిషనర్లు ద్విసభ్య ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు.
అప్పీల్‌లో పేర్కొన్న అంశాలివీ..
‘సింగిల్ జడ్జి ఉత్తర్వులు చట్టవిరుద్ధం. గ్రూప్–1 ప్రిలిమ్స్ ‘కీ’లో కొన్ని ప్రశ్నలు, జవాబుల్లో స్పష్టంగా తప్పులు కనిపిస్తున్నాయి. వాటిని, పిటిషనర్ల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండానే రిట్ పిటిషన్ కొట్టివేశారు. నిపుణుల కమిటీ నిర్ణయంపై న్యాయ సమీక్ష అవసరం లేదని చెప్పారు. తప్పుడు ప్రశ్నలు తొలగిస్తే మెరిట్ జాబితా అంతా మారిపోతుందని అందులో జోక్యం చేసుకోవడానికి నిరాకరించారు.
కొన్ని ప్రశ్నలు తప్పుగా రూపొందించిన విషయాన్నీ గ్రహించలేదు. సింగిల్ జడ్జి మా పిటిషన్లను కొట్టివేయడం ద్వారా తప్పుడు ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన వారు కూడా మెయిన్స్‌కు అర్హత సాధించినట్లు అవుతుంది. ఈ తప్పుడు ప్రశ్నలకు అనుకోకుండా పిటిషనర్లు కొందరు సరైన సమాధానం ఇవ్వడాన్ని టీజీపీఎస్సీ సింగిల్ జడ్జి ముందు పేర్కొంది. ప్రిలిమ్స్‌తోనే నేరుగా జాబ్ ఇవ్వకపోయినా మెయిన్స్ పరీక్ష రాయడానికి అదే కీలకం.
ఇలా తప్పుడు ‘కీ’తో అర్హత సాధించి పోస్టుల్లో చేరే వారు తదుపరి మూడు దశాబ్దాల పాటు అధికారులుగా విధులు నిర్వహిస్తారు. రాహుల్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును సింగిల్ జడ్జి పరిగణనలోకి తీసుకోలేదు. ఈనెల 15న సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను కొట్టివేయాలి’అని ద్విసభ్య ధర్మాసనం ముందు దాఖలుచేసిన అప్పీల్‌లో కోరారు.
Comments
Please login to add a commentAdd a comment