selection of candidates
-
రీనోటిఫికేషన్ కోర్టు ధిక్కరణే
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 పరీక్షకు మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చే అధికారం టీఎస్పీఎస్సీకి లేదని పలువురు పిటిషనర్లు హైకోర్టులో తమ వాదనలు వినిపించారు. ప్రభుత్వం అనుమతిస్తేనే టీఎస్పీఎస్సీ చర్యలు చేపట్టాల్సి ఉంటుందని చెప్పారు. గతంలో హైకోర్టు ప్రిలిమ్స్‌ను మాత్రమే రద్దు చేసిందని, పరీక్ష మళ్లీ నిర్వహించాలని చెప్పిందని పేర్కొన్నారు. అయితే తొలుత జారీ చేసిన నోటిఫికేషన్‌ను టీఎస్పీఎస్సీ రద్దు చేయడం ధిక్కరణ కిందకే వస్తుందన్నారు.రెండో నోటిఫికేషన్ ప్రకారం నిర్వహించిన ప్రిలిమ్స్‌లో తప్పుడు ప్రశ్నలు తొలగించి, మెయిన్స్‌కు మళ్లీ అభ్యర్థులను ఎంపిక చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. పిటిషనర్ల వాదనను ప్రభుత్వం తప్పుబట్టింది. టీఎస్పీఎస్సీకి అన్ని అధికారా లుంటాయని స్పష్టం చేసింది. అనంతరం హైకోర్టు తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. 6 శాతం ఎస్టీ రిజర్వేషన్లే అమలు చేయాలి: పిటిషనర్లు గ్రూప్–1కు రీ నోటిఫికేషన్ ఇవ్వడాన్ని, తాజా ప్రిలిమ్స్‌లో తప్పుడు ప్రశ్నలను సవాల్ చేస్తూ కొందరు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను జస్టిస్ పుల్ల కార్తీక్ శుక్రవారం విచారించారు. పిటిషనర్ల తరఫున న్యాయ వాది జొన్నలగడ్డ సు«దీర్ వాదనలు వినిపించారు. ‘టీఎస్పీఎస్సీ 503 పోస్టులకు 2022, ఏప్రిల్ 26న తొలి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఎస్టీ రిజర్వేషన్లు 6 శాతమే ఉన్నాయి. ఆ తర్వాత 10 శాతానికి పెంచారు. అప్పటి రిజర్వేషన్ ప్రకారం ఇప్పుడు 6 శాతమే అమలు చేయాలి. లేదంటే జనరల్ అభ్యర్థులకు అన్యాయం జరుగుతుంది..’అని చెప్పారు. రీనోటిఫికేషన్‌తో అభ్యర్థులకు లబ్ధి: ప్రభుత్వం ప్రభుత్వం తరఫున స్పెషల్ జీపీ రాహుల్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘టీఎస్పీఎస్సీ చట్టబద్ధమైన సంస్థ. నియామకాలకు సంబంధించి ఎలాంటి చర్యలైనా చేపట్టే అధికారం కమిషన్‌కు ఉంది. ప్రభుత్వం నుంచి అనుమతి పొందాల్సిన అవసరం లేదు. నేరుగా నిర్ణయాలు తీసుకోవచ్చు. 2024 ఫిబ్ర వరి 19న 563 పోస్టులకు ఇచ్చిన రీ నోటిఫికేషన్‌తో ఎవ రికీ నష్టం కలుగలేదు. పైగా 60 పోస్టులు పెరగడం అభ్యర్థులకు లబ్ధి చేకూర్చింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు కూడా పెరిగారు. కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన ఎక్కడా జరగలేదు..’అని తెలిపారు. అనంతరం సమయం ముగియడంతో న్యాయమూర్తి విచారణను వాయిదా వేశారు. -
టీడీపీలో హాహాకారాలు
సాక్షి, అమరావతి/ఏలూరు (ఆర్‌ఆర్‌పేట)/ఆత్మకూరు రూరల్/అమలాపురం టౌన్/సాక్షి ప్రతినిధి, నెల్లూరు/సాక్షి ప్రతినిధి కర్నూలు: తెలుగుదేశం పార్టీలో ఆగ్రహ జ్వాలలు చల్లారడంలేదు. పొత్తులు, సమీకరణలు, ధన ప్రభావంతో సీట్లు గల్లంతైన సీనియర్ నేతలు చంద్రబాబు తీరుపై గతంలో ఎన్నడూ లేనివిధంగా దుమ్మెత్తిపోస్తున్నారు. అభ్యర్థుల ఎంపికలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని ధ్వజమెత్తుతున్నారు. ప్రతిజిల్లాలోనూ అసమ్మతి తీవ్రస్థాయిలో రాజుకోవడంతో టీడీపీ అధినేత చంద్రబాబుకు ముచ్చెమటలు పడుతున్నాయి. 30కిపైగా నియోజకవర్గాల్లో సీట్లు రాని నేతలు టీడీపీ అభ్యర్థులను ఓడిస్తామని ప్రకటించడంతో బాబు తల పట్టుకుంటున్నారు. తాజాగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా సీనియర్ నేత, మాజీ ఎంపీ మాగంటి బాబు తన అసంతృప్తిని వెళ్లగక్కారు. ఏలూరు ఎంపీ సీటును యనమల రామకృష్ణుడి అల్లుడు మహేశ్ కు కేటాయించడాన్ని తప్పు బట్టారు. చాలాఏళ్లుగా తమ సామాజికవర్గానికి కేటాయించే సీటును బీసీకివ్వడం సరికాదని, ఈ సీటును బీసీలకు ఇవ్వాలని ఎవరడిగారని ఆయన మంగళవారం రాత్రి చంద్రబాబును కలిసినప్పుడు ప్రశ్నించారు. తమకు కనీసం చెప్పకుండా తమ సీటును మార్చడం అవమానించడమేనని నిలదీశారు. బీసీల్లో యనమల కుటుంబం తప్ప మరొకరు దొరకలేదా? ఎక్కడో కడప నుంచి అభ్యర్థిని తీసుకురావడమేమిటీ అంటూ మాగంటి సంధించిన వరుస ప్రశ్నలకు చంద్రబాబు వద్ద సమాధానం లేదని సమాచారం. చంద్రబాబు ఎంత బుజ్జగించినా, ఎన్నికల తర్వాత రాజ్యసభ సీటు ఇస్తానని నమ్మబలికినా మాగంటి శాంతించలేదు. ఆయన తన దారి తాను చూసుకోవడానికి సిద్ధమవుతున్నారని సమాచారం. చంద్రబాబును కలిసి బయటకు వచ్చిన వెంటనే బాబుపై నమ్మకం లేదని వ్యాఖ్యానించి కోపంగా వెళ్లిపోవడం దీనికి బలం చేకూరుస్తోంది. చంద్రబాబుతో చర్చలు ఆశాజనకంగా సాగలేదని పార్టీ శ్రేణులకు మాగంటి బాబు రాసినట్టు చెబుతున్న ఓ లేఖ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ♦ కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని ఆదోని, ఆలూరు, మంత్రాలయం, కోడుమూరు, నంద్యాల, డోన్ నియోజకవర్గాల్లో టికెట్లు దక్కని టీడీపీ ఇన్చార్జులు అసమ్మతిబావుటా ఎగురేశారు. ఆదోనిలో పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న మీనాక్షినాయుడు సీటును బీజేపీకి కేటాయించడంపై మండిపడుతున్నారు. తానుగానీ, తన తనయుడుగానీ ఇండిపెండెంట్‌గా బరిలో దిగాలని యోచిస్తున్నారు. ఆలూరులో టీడీపీ ఇన్చార్జి కోట్ల సుజాతమ్మ పార్టీ అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు. కుటుంబానికి ఒకే సీటు అంటూ తనను పక్కన పెట్టడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. మంత్రాలయంలో రాఘవేంద్ర, నందికొట్కూరులో గిత్త జయసూర్యకు టికెట్లు కేటాయించిన తర్వాత గెలుపు అవకాశాలు సన్నగిల్లాయని నివేదికలు అందడంతో ఈ సీట్లను మార్చే యోచనలో చంద్రబాబు ఉన్నట్టు సమాచారం. కోడుమూరులో ఎదురూరు విష్ణువర్ధన్‌రెడ్డి, కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి వర్గాల మధ్య టిక్కెట్ పంచాయతీ తెగలేదు. విష్ణు ప్రతిపాదించిన బొగ్గుల దస్తగిరి అభ్యర్థిత్వాన్ని కోట్ల వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఆకేపోగు ప్రభాకర్‌కు టిక్కెట్ ఇవాల్సిందేనని పట్టుబట్టినా అధిష్టానం స్పందించకపోవడంతో ప్రచారంలో పాలుపంచుకోవడం లేదు. డోన్ ఇన్చార్జ్ మన్నే సుబ్బారెడ్డిని కాదని కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డికి టికెట్ ఇవ్వడంతో సుబ్బారెడ్డి సైలెంట్ అయ్యారు. ప్రచారంలో మాత్రం పాల్గొనడం లేదు. నంద్యాలలో భూమా బ్రహా్మనందరెడ్డి కూడా అభ్యర్థి ఫరూక్‌కు సహకరించడం లేదు. ♦ విజయనగరం జిల్లా చీపురుపల్లిలో పదేళ్లుగా పని చేస్తున్న కిమిడి నాగార్జునను కనీసం పరిగణన లోకి తీసుకోకుండా ఆ సీటును ఆయన బంధువు కళా వెంకట్రావుకు కేటాయించడంపై పార్టీ శ్రేణుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఉన్నత స్థాయిలో ఉద్యోగం చేస్తున్న తనను బాబు తన అవసరం కోసం రాజకీయాల్లోకి తీసుకువచ్చి ఇప్పుడు కనీసం మాటమాత్రంగానైనా చెప్పకుండా పక్కకు తప్పించడంపై నాగార్జున కన్నీటి పర్యంతమయ్యారు. ♦ పెందుర్తి సీటును జనసేనకు కేటాయించడం, అక్కడ తన వ్యతిరేకి పంచకర్ల రమే‹Ùను ఆ పార్టీ నుంచి పోటీ చేయిస్తుండడాన్ని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి జీర్ణించుకోలేకపోతున్నారు.చంద్రబాబు తనను ఇంతలా మోసం చేస్తారని అనుకోలేదని ఆవేదన చెందుతున్నారు. కొన్నిరోజులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన ఆయన ఇక రాజకీయాల నుంచి విరమిస్తానని నిర్వేదం వ్యక్తం చేయడంపై పార్టీ శ్రేణులు ఆవేదన చెందుతున్నాయి. ♦ అనపర్తి సీటును తొలిజాబితాలోనే తనకు కేటాయించి.. అంతలోనే మళ్లీ బీజేపీకి ఇవ్వడంపై మండిపడుతున్న మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. ♦ రాజంపేట సీటును పార్టీ శ్రేణులకూ తెలియని సుగవాసి సుబ్రహ్మణ్యంకి కేటాయించడంతో బత్యాల చెంగల్రాయుడు తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. ♦హజ్ కమిటీ రాష్ట్ర మాజీ చైర్మన్ మోమిన్ అహమ్మద్ హుసేన్ బుధవారం తెలుగుదేశం పార్టీ క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేశారు. త్వరలో వైఎస్సార్ సీపీలో చేరనున్నట్లు ఆయన కర్నూలు జిల్లా ఆత్మకూరులోని ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రకటించారు. 30 ఏళ్లుగా టీడీపీలో క్రియాశీలకంగా పనిచేసిన హుసేన్ పలు కీలక పదవులలో సేవలందించారు. ఆయనతో పాటు టీడీపీ రాయలసీమ స్థాయి నాయకుడైన కుమారుడు మోమిన్ ముస్తఫా, స్థానిక మున్సిపాలిటీ వార్డు కౌన్సిలర్ అయిన మరో కుమారుడు ముఫ్తి కూడా టీడీపీకి రాజీనామా చేశారు. ♦ టీడీపీ కోవూరు నియోజకవర్గ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి బుచ్చిరెడ్డిపాళెం మండలం పెనుబల్లిలో బుధవారం నిర్వహించిన ప్రచారంలో పార్టీలోని వర్గవిభేదాలు బయటపడ్డాయి. ప్రచార రథమెక్కేందుకు యత్నించిన వవ్వేరు బ్యాంక్ మాజీ చైర్మన్ సూరా శ్రీనివాసులురెడ్డిని పోలంరెడ్డి దినేష్‌రెడ్డితో పాటు స్థానిక టీడీపీ నేతలు అడ్డుకున్నారు. ఆయన అనుచరులనూ మెడపట్టి తోసేశారు. మరొకరిని కాలితో తన్నడంతో కిందపడిపోయారు. దీంతో సూరాతోపాటు ఆయన అనుచరులు అవమానభారంతో వెనుదిరిగారు. సూరా ఇటీవలే టీడీపీలో చేరారు. ఆయన చేరికను పార్టీ శ్రేణులు వ్యతిరేకిస్తున్నారు. ప్రశాంతిరెడ్డి కూడా అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూరాకు హుకుం జారీ చేయడం గమనార్హం. ఇదిలా ఉంటే ప్రశాంతిరెడ్డి ప్రచారానికి ప్రజల నుంచి స్పందన కరువైంది. దీంతో ఆమె అర్ధాంతరంగా ప్రచారాన్ని ఆపేసి వెనుదిరిగారు. ళీ అనంతపురం అర్బన్ సీటును దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ అనే కొత్త వ్యక్తికి ఇవ్వడంతో మాజీ ఎమ్మెల్యే ప్రభాకరచౌదరి వర్గం బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ♦ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి శెట్టిబత్తుల రాజబాబు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా పత్రాన్ని పార్టీ రాష్ట్ర కార్యాలయానికి, జిల్లా అధ్యక్షుడికి ఫ్యాక్స్, వాట్సాప్‌ల ద్వారా బుధవారం పంపించారు. పదేళ్లుగా పార్టీ కోసం కష్టపడినా తనకు న్యాయం జరగలేదని, జనసేనకు పట్టు ఉన్న అమలాపురాన్ని టీడీపీ చేతిలో పెట్టడమేమిటని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని వివరించారు. -
వచ్చే వారంలో కాంగ్రెస్ కీలక భేటీలు
సాక్షి, న్యూఢిల్లీ: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో అధికార బీజేపీని ఎదుర్కొనే వ్యూహాలకు పదునుపెట్టి, వాటిని అమలు పరిచే చర్యల్లో భాగంగా వచ్చే వారం రోజుల్లో కాంగ్రెస్ కీలక భేటీలు నిర్వహించనుంది. దేశ వ్యాప్తంగా పారీ్టకి తన లక్ష్యాలను వివరించేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ), ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికకు స్క్రీనింగ్ కమిటీ, ప్రచారాస్త్రాల ఖరారుకు మేనిఫెస్టో కమిటీలు వారం రోజుల్లో భేటీ అయ్యే అవకాశం ఉంది. పార్టీ అత్యున్నత నిర్ణయాధికార సంస్థ అయిన సీడబ్ల్యూసీ సమావేశంలో అభ్యర్థుల జాబితా, ఎన్నికల వ్యూహంపై చర్చించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆయా రాష్ట్రాల్లో ఇండియా కూటమి పక్షాలతో పొత్తులు, సీట్ల సర్దుబాటు అంశాలపై నేతలకు వివరించే అవకాశాలున్నాయి. రానున్న వారం రోజుల్లో కనీసం 100 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాలని కాంగ్రెస్ భావిస్తోంది. -
ఎంపీగానా.. వద్దుబాబోయ్! అనంతపురం టీడీపీలో అభ్యర్థుల వెనకడుగు
సాక్షి ప్రతినిధి, అనంతపురం: తాము చెప్పిందే వేదం... చేసిందే చట్టం... అన్నరీతిలో సాగుతోంది టీడీపీలో అభ్యర్థుల ఎంపిక విధానం. తండ్రీకొడుకులు వేర్వేరు జాబితాలు సిద్ధం చేసుకోవడంతో వారి మధ్య సయోధ్య నడవక... మరోవైపు ఎక్కడ జాబితా ప్రకటించేస్తే అసమ్మతి నేతలు బయటకు వెళ్లిపోతారోనన్న భయంతో ఎక్కడా అభ్యర్థులను ఖరారు చేయకుండా సాగదీత ధోరణి అవలంబిస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో అయితే పరిస్థితి రోజు రోజుకూ దయనీయంగా తయారవుతోంది. పార్టీ జిల్లా అధ్యక్షులకే తాము కోరుకున్న చోట టికెట్ దొరికే అవకాశం లేకపోవడంతో అయోమయ పరిస్థితి నెలకొంది. మరికొద్ది రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో అధిష్టానం అనుసరిస్తున్న వైఖరి వారిలో ఆందోళన రేకెత్తిస్తోంది. ఎంపీగానే వెళ్లాలని అధిష్టానం హుకుం అనంతపురం జిల్లాకు కాలవ శ్రీనివాసులు, శ్రీసత్యసాయి జిల్లాకు బి.కె.పార్థసారథి అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు వీరిద్దరికీ అసెంబ్లీ టికెట్లు లేవని పరోక్షంగా పార్టీ అధిష్టానం సంకేతాలిచ్చింది. ఎమ్మెల్యేలుగా గెలిచే అవకాశం లేనందున ఎంపీలుగా పోటీ చేయాలని వారికి సూచించినట్లు తెలుస్తోంది. ఇందుకు ఇద్దరూ ససేమిరా అంటున్నారు. రెండు రోజుల క్రితం కాలవ శ్రీనివాసులు తాను రాయదుర్గం నుంచే అసెంబ్లీకి పోటీ చేస్తానని కార్యకర్తల సమావేశంలో బహిరంగంగా ప్రకటించారు. అయితే ఆయన ఎట్టిపరిస్థితుల్లోనూ ఎంపీగానే వెళ్లాలని నారా లోకేశ్ తన సన్నిహితుల వద్ద తెగేసి చెప్పినట్టు తెలిసింది. బీకే పార్థసారథి కూడా ఎంపీగా వెళ్లడానికి సుముఖంగా లేరు. మూడు దశాబ్దాలుగా పార్టీని నమ్ముకుని ఉంటే ఇప్పుడు పెనుకొండ టికెట్ ఇవ్వకుండా ఎంపీగా వెళ్లమనడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఉరవకొండకు చంద్రబాబు వచ్చినప్పుడు కూడా టికెట్ గురించి ప్రస్తావించగా.. ఆయన దాటవేసినట్టు తెలుస్తోంది. టికెట్లు ప్రకటించేస్తే వెళ్లిపోతారేమో.. ఇప్పటికిప్పుడు టికెట్లు ఖరారు చేసేస్తే అసమ్మతి నేతలంతా పార్టీని వదిలి వెళ్లిపోతారేమోననే ఆందోళనతోనే అధినేత చంద్రబాబు సాగదీత ధోరణిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అధికార పార్టీకి చెందిన అభ్యర్థులు దాదాపు ఖరారై... ప్రజల్లో విస్తృతంగా పర్యటిస్తుండగా ఇప్పటికీ టీడీపీలో అభ్యర్థులెవరో తేలకపోవడం విశేషం. తాడిపత్రి, హిందూపురం, ఉరవకొండ మినహా.. మిగతా 11 సెగ్మెంట్లలోనూ అభ్యర్థి ఎవరన్నది తెలియని పరిస్థితి నెలకొంది. అనంతపురం అర్బన్ టికెట్ పొత్తులో భాగంగా జనసేనకు ఇవ్వొచ్చుననే ప్రచారం కూడా జరుగుతోంది. మరోవైపు ఎన్నికల వ్యయం కోసం ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన ప్రవాసాంధ్రులకు చంద్రబాబు, లోకేశ్‌లు గాలం వేస్తున్నట్టు తెలుస్తోంది. -
అత్యధిక స్థానాలపై కమలం గురి
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలోని 17 స్థానాల్లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవడం ద్వారా దక్షిణాదిలో పట్టు సాధించాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది ఈ మేరకు హస్తిన వేదికగా రాష్ట్ర నాయకత్వంతో సమాలోచనలు జరుపుతోంది. పార్టీ పట్ల అంకితభావంతో పనిచేసిన వారు, ప్రజాదరణ ఉన్న నేతలను పరిగణనలోకి తీసుకోవడంతో పాటు సామాజిక సమతుల్యాన్ని పాటిస్తూ అభ్యర్థులను ఎంపిక చేసేలా కసరత్తు చేస్తోంది. రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె.లక్ష్మణ్, ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్, సీనియర్ నేత ఈటల రాజేందర్లు బుధవారం ఢిల్లీలో జాతీయ నాయకత్వంతో భేటీ అయ్యారు. మరోవైపు కిషన్‌రెడ్డి పార్టీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సమావేశమై దాదాపు 40 నిమిషాలు చర్చించారు. కాగా ఆయా సమావేశాల్లో 17 లోక్‌సభ స్థానాల్లో పార్టీ బలాబలాలు, తాజా రాజకీయ పరిస్థితి, బలమైన నేతలు, ఎన్నికల షెడ్యూల్ వచ్చే లోగా క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన పార్టీ కార్యక్రమాలు తదితర అంశాలపై సమగ్రంగా చర్చించినట్టు సమాచారం. నడ్డా దిశా నిర్దేశం మంగళవారం బీజేపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులతో జరిగిన సమావేశంలోనూ లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి అనుసరించాల్సిన ప్రణాళికలపై అధ్యక్షుడు జేపీ నడ్డా దిశా నిర్దేశం చేశారు. ఉత్తరాది రాష్ట్రాల్లో పార్టీ బలంగా ఉన్నందున, దక్షిణాదిలోనూ ముఖ్యంగా కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఎక్కువ లోక్‌సభ స్థానాలు గెలిచేందుకు సిద్ధం చేసిన రోడ్‌మ్యాప్‌పై చర్చించారు. రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాలతో పాటు పలువురు కేంద్ర మంత్రుల ప్రచార సభలు, రోడ్ షోలు తదితర ప్రచార కార్యక్రమాల షెడ్యూల్‌పై పార్టీ ప్రధాన కార్యదర్శులు తరుణ్ ఛుగ్, సునీల్ బన్సల్, బండి సంజయ్ కుమార్‌లు జేపీ నడ్డాతో ప్రత్యేకంగా చర్చించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం లోక్‌సభ ఎ న్నికలపై ఏ విధంగా పడుతుందన్న అంశం వీరి మధ్య చర్చకు వచ్చినట్లు తెలిసింది. మరోవైపు కేవ లం సీనియర్లు అనే కాకుండా యువత, మహిళలు, ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులను సైతం సీట్ల కేటాయింపులో పరిగణనలోకి తీసుకోవాలన్న యోచనలో అధిష్టానం ఉన్నట్లు సమాచారం. -
నేడే కాంగ్రెస్ అభ్యర్థుల తుది జాబితా!
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో ఇంకా ప్రకటించని 19 స్థానాల అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ కసరత్తు తుది దశకు చేరుకుంది. ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక బాధ్యత ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి కట్టబెట్టిన నేపథ్యంలో ఆయన దీనిపై దృష్టి సారించారు. ఆదివారం తెలంగాణ పర్యటన సందర్భంగానే ఆయా స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై రాష్ట్ర నేతల అభిప్రాయాలు తీసుకున్న ఖర్గే సోమవారం కూడా కొందరు నేతలతో చర్చించారు. పటాన్చెరు, నారాయణఖేడ్, జుక్కల్, బాన్సువాడ నియోజకవర్గాలకు సంబంధించి సీడబ్ల్యూసీ సభ్యుడు దామోదర రాజనర్సింహతో మాట్లాడిన ఖర్గే, కమ్యూనిస్టులతో పొత్తులు, వారికి సంబంధించిన సీట్లపై పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో చర్చించారు. నల్లగొండ జిల్లాకు సంబంధించిన స్థానాలపై ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అభిప్రాయాలు తెలుసుకున్నట్లు తెలుస్తోంది. కమ్యూనిస్టులకు ఇచ్చే ఆ నాలుగు మినహా కమ్యూనిస్టులకు ఇవ్వాలని భావిస్తున్న నాలుగు నియోజకవర్గాలు మినహా, మిగతా 15 స్థానాలకు అభ్యర్థులను సోమవారం సాయంత్రానికే ఫైనల్ చేస్తారని భావించారు. అయితే రాజస్తాన్ అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన కసరత్తులో అధిష్టాన పెద్దలు బిజీగా ఉండటంతో ఆ ప్రక్రియను మంగళవారం పూర్తి చేయాలనే నిర్ణయానికి వచ్చి నట్లు తెలుస్తోంది. మంగళవారం రాత్రికి లేదా బుధవారం ఉదయానికి జాబితా ప్రకటించే అవకాశం ఉంటుందని ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఆయా నియోజకవర్గాల నుంచి టికెట్ ఆశిస్తున్న నేతలంతా ఢిల్లీలోనే తిష్టవేసి అధిష్టాన పెద్దలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. -
పెండింగ్ 19పై నేడు భేటీ
సాక్షి, హైదరాబాద్: పెండింగ్‌లో ఉన్న 19 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్‌పార్టీ సోమ వారం తుది చర్చలు జరపనుంది. వామపక్షాలతో పొత్తుతో పాటు పోటీ తీవ్రంగా ఉన్న ఈ స్థానాల్లో ఏం చేయాలన్న దానిపై ఢిల్లీ వేదికగా నేతలు సమా వేశం కానున్నారు. ఈ భేటీ కోసం టీపీసీసీ నేతలు ఆదివారమే ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఏఐసీసీ కార్యాలయంలోని వార్ రూంలో పార్టీ అధిష్టానంతో జరిగే సమావేశానంతరం సోమవారం రాత్రి లేదంటే మంగళవారం తుది జాబితా వస్తుందని గాంధీభవన్ వర్గాలు చెపుతున్నాయి. లెఫ్ట్‌తో ‘లెఫ్టా.. రైటా?’ లెఫ్ట్ పార్టీలతో పొత్తుల విషయంలోనూ సోమవారం జరిగే సమావేశాల్లో స్పష్టత వస్తుందని కాంగ్రెస్ వర్గాలు చెపుతున్నాయి. ముఖ్యంగా సీపీఎం పార్టీతో పీటముడి పడిన వైరా, మిర్యాలగూడ స్థానాల్లో ఏం చేయాలన్న దానిపై కాంగ్రెస్ నేతలు నిర్ణయం తీసుకోనున్నారు. దీంతో పాటు సీపీఐకి ఇవ్వాలనుకుంటున్న కొత్తగూడెం, చెన్నూరు సీట్ల విషయంలోనూ తేడా వచ్చిందనే చర్చ జరుగుతోంది. వివేక్ కుమారుడికి చెన్నూరు సీటు? చెన్నూరు స్థానాన్ని మాజీ ఎంపీ వివేక్ కుమారుడికి కేటాయించేందుకు కాంగ్రెస్ పార్టీ అంగీకరించిందని, ప్రస్తుతం బీజేపీలో ఉన్న వివేక్‌ను పార్టీలో చేర్చుకుని ఆయన్ను పార్లమెంటుకు పోటీ చేయించాలని కాంగ్రెస్ ప్రతిపాదిస్తోందని సమాచారం. ఈ మేరకు శనివారమే మొయినాబాద్‌లోని వివేక్ ఫాంహౌస్‌లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్, వివేక్‌లు భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో సీపీఐకి చెన్నూరు అసెంబ్లీ కేటాయించడం కష్టమేనని, సీపీఐ, సీపీఎంలకు చెరొక్క సీటును మాత్రమే కాంగ్రెస్ ఆఫర్ చేస్తుందని, ఇందుకు ఆ పార్టీలు అంగీకరిస్తే కలిసి ముందుకెళ్లవచ్చని, లేదంటే ఎవరి దారిలో వారు వెళ్లాల్సి వస్తుందని కాంగ్రెస్ నేతలంటుండడం గమనార్హం. -
Congress Party: హస్తినలో పాలమూరు పంచాయితీ!
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్‌లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పరిధిలో అసెంబ్లీ టికెట్లపై పంచాయితీ ముదిరింది. దశాబ్దాలుగా పార్టీకి సేవలు చేస్తున్న తమకే టికెట్లు ఇవ్వాలంటూ కాంగ్రెస్ వాదులు.. గెలుపు అవకాశాలున్న తమకే టికెట్లు కావాలంటూ వలస నేతలు ఎవరికి వారు గట్టిగా పట్టుబట్టడంతో ఈ వ్యవహారం ఢిల్లీలో హైకమాండ్ పెద్దలకు చేరింది. ఉమ్మడి పాలమూరు నేతలు దీనిపై వరుసగా ఫిర్యాదులు చేస్తుండటంపై పార్టీ పెద్దలు స్పందించినట్టు తెలిసింది. ఉమ్మడి జిల్లాలో అభ్యర్థుల ఎంపికపై పునఃపరిశీలన చేయాలని ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు బృందాన్ని ఆదేశించినట్టు సమాచారం. పార్టీకి సేవ చేసినవారికి గుర్తింపేదీ? అభ్యర్థుల ఎంపికపై పార్టీ స్క్రీనింగ్ కమిటీ ప్రతి భేటీలోనూ కాంగ్రెస్ వాదులు, వలసవాదులు అన్న పంచాయితీ కొనసాగుతూ వస్తోంది. ఇతర పార్టీల నుంచి వచ్చిన ప్యారాచూట్లకు టికెట్ల కేటాయింపుపై ఆచితూచి వ్యవహరించాలని సీనియర్ నేతలు ఇప్పటికే పలుమార్లు పేర్కొన్నారు. వారికే 60 శాతానికిపైగా సీట్లిస్తే తొలినుంచీ కాంగ్రెస్‌లో ఉన్నవారిలో నైరాశ్యం నెలకొంటుందని, పార్టీకి పనిచేసేవారు కరువవుతారని వారు స్పష్టం చేస్తున్నారు. పార్టీ అధికారంలోకి వస్తే సరేగానీ, రానిపక్షంలో ప్యారాచూట్లంతా ఎగిరిపోవడం ఖాయమ ని.. అదే జరిగితే పార్టీ ప్రాథమిక నిర్మాణా నికే ముప్పు ఉంటుందని పేర్కొంటున్నారు. అయినా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ని సగానికిపైగా సీట్లను ఇతర పార్టీల నుంచి వచ్చినవారికే ఇచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడుతున్నారు. ఏడింటిలో ఐదు వారికే అయితే.. ♦ నాగర్‌కర్నూల్ లోక్‌సభ స్థానం పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ సీట్లలో ఐదింటిని ప్యారాచూట్ నేతలకే ఇచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి. కల్వకుర్తిలో ఇటీవల పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డికి టికెట్ ఫైనల్ కానుందని.. స్థానిక నేత చల్లా వంశీచంద్‌రెడ్డిని ఒప్పించాకే ఇక్కడ టికెట్ కేటాయింపుపై ముందుకు వెళ్తుండటంతో వివాదం లేదని చెప్తున్నాయి. ♦ నాగర్‌కర్నూల్‌లో సీనియర్ నేత నాగం జనార్దనరెడ్డిని కాదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి కుమారుడు కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డికి టికెట్ ఖరారైందనే ప్రచారం జరుగుతోంది. దీనిపై నాగం వర్గం నేతలు ఇటీవలే గాం«దీభవన్‌లో గొడవ చేశారు కూడా. టికెట్ విషయంలో నాగం స్వయంగా ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే సహా ఇతర పెద్దలకు ఫిర్యాదు చేశా రు. బీఆర్ఎస్ అక్రమాలపై, ప్రాజెక్టుల్లో అవినీతిపై బలంగా పోరాడుతున్న తన ను పక్కనపెట్టే ప్రయత్నాలపై హైకమాండ్ వద్దే తేల్చుకోవాలని భావిస్తున్నారు. ♦ వనపర్తిలో పార్టీ సీనియర్ నేత జి.చిన్నారెడ్డికి ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్ నుంచి వచ్చిన మేఘారెడ్డికి టికెట్ ఇవ్వొచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. దీనితో చిన్నారెడ్డి ఢిల్లీ వెళ్లి కేసీ వేణుగోపాల్ సహా ఏఐసీసీ స్థాయిలో తనకు సన్నిహితంగా ఉండే పెద్దలకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో ఆయన స్క్రీనింగ్ కమిటీ సభ్యులనూ కలిసినట్టు సమాచారం. ♦ బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌లో చేరడంపై తొలి నుంచీ అసంతృప్తితో ఉన్న కొల్లాపూర్ నేత జగదీశ్వర్‌రావు సైతం ఢిల్లీ వెళ్లి హైకమాండ్ పెద్దలను కలిశారు. ♦ గద్వాలలో బీఆర్ఎస్ జెడ్పీచైర్మన్ సరితా తిరుపతయ్యకు కాంగ్రెస్ టికెట్ దక్కిందన్న ప్రచారంతో రగిలిపోతున్న పార్టీ జిల్లా అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్‌రెడ్డి, ఓయూ విద్యార్థి నేత కురువ విజయకుమార్‌లు కూడా ఖర్గే, కేసీ వేణుగోపాల్, మురళీధరన్, నజీర్ హుస్సేన్, జిగ్నేశ్ మేవానీ, ముకుల్‌వాస్నిక్‌లను కలిశారు. కేవలం మూడు నెలల ముందు పార్టీలో చేరిన సరితకు టికెట్ ఇవ్వొద్దని, తమలో ఒకరికి టికెట్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ♦ మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం పరిధిలోని మక్తల్‌లో పదిహేను రోజుల కింద కాంగ్రెస్‌లోకి వచ్చిన కొత్తకోట సిద్ధార్థరెడ్డికి వ్యతిరేకంగా జిల్లా పార్టీ అధ్యక్షుడు వాకాటి శ్రీహరి ఢిల్లీలోనే మకాం వేశారు. ♦ మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో బీజేపీ నుంచి వచ్చిన యెన్నం శ్రీనివాస్‌రెడ్డికి టికెట్ ఇవ్వొద్దంటూ.. స్థానిక నేతలు ఒబేదుల్లా కొత్వాల్, సంజీవ్ ముదిరాజ్, ఎన్పీ వెంకటేశ్ తదితర నేతలు అభ్యంతరాలు చెప్తున్నారు. ♦ ఇన్ని పంచాయితీల నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై పునః పరిశీలన చేయాలని సునీల్ కనుగోలు టీమ్‌కు హైకమాండ్ నుంచి ఆదేశాలు వెళ్లినట్టు తెలిసింది. ఆయా స్థానాల్లో ఇతర అభ్యర్థుల బలాబలాలపై బేరీజు వేయాలని సూచించినట్టు సమాచారం. -
70 సీట్లలో వడపోత పూర్తి!
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీలో అసెంబ్లీ అభ్యర్థుల ఎంపిక ఓ కొలిక్కి వస్తోంది. అభ్యర్థుల ఎంపికపై కొన్నిరోజులుగా కసరత్తు చేస్తున్న కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ.. భిన్నాభిప్రాయాలు, విభిన్న వాదనల మధ్య 70 నియోజకవర్గాలకు సంబంధించి వడపోతను పూర్తి చేసినట్టు తెలిసింది. ఇందులో నలభైకి పైగా సీట్లకు ఒక్కో అభ్యర్థి పేరును, మరో 30 సీట్లకు ఇద్దరి పేర్ల చొప్పున ఫైనల్ చేసినట్టు సమాచారం. ఇద్దరేసి పేర్లను ఎంపిక చేసిన నియోజకవర్గాలకు సంబంధించిన సర్వేల ఆధారంగా అభ్యర్థిని ఖరారు చేసే అధికారాన్ని పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీకి అప్పగించినట్టు కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. మిగతా స్థానాల్లోనూ సర్వేల ప్రకారం పరిశీలన జరిపి షార్ట్ లి‹స్ట్ చేయడం కొలిక్కి వచ్చిందని అంటున్నాయి. నిర్ణయాధికారం కేంద్ర కమిటీకే.. అభ్యర్థుల ఎంపికపై స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ అధ్యక్షతన ఢిల్లీలో వరుసగా రెండోరోజూ నేతల భేటీ జరిగింది. రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మధుయాష్కీగౌడ్, ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలుతోపాటు ఇతర సభ్యులు ఇందులో పాల్గొన్నారు. గురువారం భేటీలో 35 వరకు స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసిన కమిటీ... శుక్రవారం ఐదు గంటల పాటు చర్చించి మరో 5 స్థానాల్లో అభ్యర్థులను ఫైనల్ చేయడంతోపాటు, ఇంకో 30 సీట్లకు వడపోత పూర్తి చేసింది. రాజకీయ, కుల సమీకరణాలు, ప్రజాక్షేత్రంలో బలాబలాలు, సర్వే నివేదికల ఆధారంగా ఈ 30 స్థానాల్లో ఇద్దరేసి నేతలను ఎంపిక చేసినట్టు తెలిసింది. ఈ లిస్టులో ఎల్బీనగర్, చేవెళ్ల, రాజేంద్రనగర్, కుత్బుల్లాపూర్, ఉప్పల్, మేడ్చల్, శేరిలింగంపల్లి, బోథ్, ఖానాపూర్, కరీంనగర్, డోర్నకల్, మహబూబాబాద్, పరకాల, జనగాం, వర్ధన్నపేట, వనపర్తి, నారాయణపేట, నకిరేకల్, తుంగతుర్తి, నర్సాపూర్, దుబ్బాక, నారాయణఖేడ్, జుక్కల్, ఎల్లారెడ్డి, బాన్సువాడ, మునుగోడు, సికింద్రాబాద్, హుస్నాబాద్ తదితర నియోజకవర్గాలు ఉన్నట్టు తెలిసింది. వీటికి ఎంపిక చేసిన ఇద్దరు అభ్యర్థుల్లో ఒకరిని ఫైనల్ చేసే అధికారాన్ని కేంద్ర ఎన్నికల కమిటీకి అప్పగించాలని భేటీలో నిర్ణయించినట్టు సమాచారం. సునీల్ కనుగోలు బృందం చేసిన సర్వేలతోపాటు ఏఐసీసీ తరఫున చేయించిన ఇతర సర్వేల ఆధారంగా అభ్యర్థిని ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. మిగతా 50 స్థానాల్లో అభ్యర్థుల ఖరారు కోసం కమిటీ మరోమారు భేటీ కానుందని అంటున్నాయి. రేవంత్‌ను కలసిన రేఖానాయక్, వేముల వీరేశం అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ నేపథ్యంలో ఢిల్లీలోనే తిష్టవేసిన ఆశావహులు ఏఐసీసీ, పీసీసీ నేతల ఇళ్ల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఖానాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖానాయక్ శుక్రవారం ఉదయం రేవంత్‌తో భేటీ అయ్యారు. బీఆర్ఎస్కు రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కూడా రేవంత్‌ను కలిశారు. మరోవైపు వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శుక్రవారం ఢిల్లీకి వచ్చారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా ఢిల్లీలోనే ఉండటంతో షర్మిల పర్యటనపై ఆసక్తి నెలకొంది. అభ్యర్థుల ఎంపికపై నేతల మధ్య విభేదాలు ఢిల్లీ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశాలు వాడీవేడిగా సాగినట్టు తెలిసింది. 40 స్థానాలు మినహా.. మిగతా సీట్లకు అభ్యర్థుల ఎంపికపై నేతల మధ్య తీవ్రస్థాయిలో భేదాభిప్రాయాలు వ్యక్తమైనట్టు సమాచారం. కొన్ని స్థానాలపై చర్చ సమయంలో తీవ్ర స్థాయిలో వాదనలు చేసుకున్నట్టు తెలిసింది. ‘అసలు కాంగ్రెస్, వలస నేతలు’ అన్న ప్రాతిపదికన ఈ వాగ్వాదం జరిగిందని.. ఎన్నారైలు, ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతల పేర్లను సీఈసీకి పంపే విషయంలో నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినట్టు సమాచారం. మెజార్టీ సభ్యులు ఒక్క పేరే సూచించిన పలు నియోజకవర్గాల్లోనూ అభ్యర్థి ఎంపిక ఫైనల్ కాలేదని.. అలాంటి స్థానాలను ప్రస్తుతానికి పక్కనపెట్టాలని కొందరు నేతలు పట్టు బట్టినట్టు తెలిసింది. ఈ విషయంపై టీపీసీసీ ముఖ్య నేత ఒకరు మాట్లాడుతూ.. ‘‘ఈ సమావేశంలో ఏం జరిగిందని తెలుసు కున్న తర్వాత చాలా స్థానాలౖపై ఏకాభిప్రాయం కుదిరే పరిస్థితే కనిపించడం లేదు. హైకమాండ్ కచ్చితంగా జోక్యం చేసుకోవాల్సిందే. చివరికి ఎవరి పేర్లు వాళ్లు పంపేలా ఉన్నారు. వచ్చే వారంలో జరిగే సమావేశంలో ఏం జరుగుతుందో చూద్దాం..’’ అని వ్యాఖ్యానించడం గమనార్హం. -
నెలాఖరుకు బీజేపీ తొలి జాబితా?
సాక్షి, న్యూఢిల్లీ: ఈ ఏడాది చివరలో జరగనున్న తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించిన బీజేపీ అగ్రనాయకత్వం, అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో తన కసరత్తును వేగవంతం చేసింది. అసెంబ్లీ ఎన్నికలకు మూడు నెలల ముందుగా గత నెల మధ్యప్రదేశ్‌లో 39 స్థానాలకు, ఛత్తీస్‌గఢ్‌లో 21 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల శంఖారావాన్ని పూరించిన బీజేపీ నాయకత్వం తెలంగాణలో కూడా ఈ నెలాఖరులోగా తొలి జాబితా ప్రకటించాలనే దృఢ నిశ్చయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే దరఖాస్తుల సేకరణ ప్రక్రియ ముగిసినందున, వాటిని జల్లెడ పట్టి ఏకైక అభ్యర్థులు, గట్టి నేతలు ఉన్న 25–30 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాలని పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) భేటీలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ముందుగా ఏకైక అభ్యర్థులు ఉన్న స్థానాల గుర్తింపు.. ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం రాత్రి పార్టీ కేంద్ర కార్యాలయంలో సీఈసీ సమావేశం జరిగింది. దీనికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, భూపేంద్ర యాదవ్, శర్బానంద సోనోవాల్, ఎంపీ కె.లక్ష్మణ్, బీజేపీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్య దర్శి బీఎల్ సంతోష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల ఎన్నికలకు పార్టీ అభ్యర్థుల ఎంపికపై చర్చ జరిగినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సన్నాహాలను సమీక్షించడంతో పాటు నేతల నుంచి అభిప్రాయాలను సేకరించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి 6 వేల మందికి పైగా దరఖాస్తు చేసుకున్న దృష్ట్యా, ముందుగా ఏకైక అభ్యర్థులు ఉన్న స్థానాలను గుర్తించి ఈ నెలాఖరులోగా అభ్యర్థులను ప్రకటించాలని నిర్ణయించారు. అలాంటి స్థానాలు 25–30 వరకు ఉంటాయని గుర్తించినట్లు తెలుస్తోంది. తొలిజాబితాలో కిషన్‌రెడ్డి, బండి, ఈటల తదితరుల పేర్లు! ఇదిలా ఉండగా ముఖ్యనేతలైన జి.కిషన్‌రెడ్డి, బండి సంజయ్ కుమార్, డీకే అరుణ, ఈటల రాజేందర్, రఘునందన్ రావు, ఎంపీ ధర్మపురి అరవింద్, జితేందర్ రెడ్డి, వివేక్, కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఆచారి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, విజయశాంతి, బూర నర్సయ్యగౌడ్, చింతల రామచంద్రా రెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, చెన్నమనేని వికాస్, మహేశ్వర్‌రెడ్డిల పేర్లు తొలి జాబితాలో ఉంటాయనే ప్రచారం జరుగుతోంది. ఇక మిగతా స్థానాలకు అభ్యర్థుల ఎంపికను వేగిరం చేసే క్రమంలో భాగంగా ప్రతిస్థానం నుంచి ముగ్గురి పేర్లను ఎంపిక చేసి కమిటీకి పంపిస్తే, సర్వేలు, నేతల బలాబలాలు, కుల సమీకరణల ఆధారంగా అక్టోబర్ రెండో వారానికి మిగతా అభ్యర్థుల ఎంపిక పూర్తి చేయాలని సీఈసీలో నిర్ణయించినట్లు సమాచారం. తర్వాత జరిగే సీఈసీ భేటీ, పూర్తిగా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సన్నద్ధతపైనే ఉంటుందని తెలుస్తోంది. కాగా, సీఈసీ భేటీకి ముందే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, ఇన్చార్జిలు తరుణ్ ఛుగ్, సునీల్ బన్సల్, ఇతర ముఖ్య నేతలతో బీఎల్ సంతోష్ భేటీ అయ్యే అవకాశాలున్నాయని చెబుతున్నారు. -
టీడీపీ కనుసన్నల్లో అభ్యర్థుల ఎంపిక
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమకారులను కాంగ్రెస్ పార్టీ విస్మరించిందని తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ ఆరోపించారు. బుధవారం నాంపల్లిలోని గన్‌పార్కు వద్ద కాంగ్రెస్ వైఖరి పట్ల ఆయన నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ కనుసన్నల్లోనే మహా కూటమి అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారని ధ్వజమెత్తారు. అమరావతి నుంచి కూటమి రాజకీయాలు నడిపిస్తే ఉద్యమకారుల భవిష్యత్ ఏమిటని ప్రశ్నిం చారు. బీసీలకు తీరని అన్యాయం చేశారని దుయ్యబట్టారు. పెద్దిరెడ్డి, పొన్నాల వంటి నాయకులకు సీట్లు నిరాకరించారని, విద్యార్థి నాయకులను సైతం పిలవలేదని విమర్శించారు. ఈ ఎన్నికల్లో తెలంగాణ ఇంటి పార్టీ నుంచి 30 స్థానాల్లో బలమైన అభ్యర్థులను పోటీకి దించుతున్నట్లు తెలిపారు. హుజూర్నగర్ నుంచి తాను పోటీ చేస్తానని పేర్కొన్నారు. త్వరలో భవిష్యత్ కార్యాచరణ.. అమరవీరుల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తామన్న ప్రొఫెసర్ కోదండరాం ఇది నీకు భావ్యమా అని చెరుకు సుధాకర్ ప్రశ్నించారు. బీసీలు ఢిల్లీ గల్లీ ల్లో టికెట్ల కోసం బిచ్చగాళ్లుగా తిరుగుతున్నారన్నా రు. మంద కృష్ణమాదిగ, గద్దర్, ఆర్.కృష్ణయ్య వంటి నాయకులు ఎక్కడున్నారని నిలదీశారు. మనందరం కలిసి ఎందుకు ప్రత్యామ్నాయం కాకూడదని ప్రశ్నిం చారు. త్వరలోనే అందరితో సమావేశమై భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు. -
‘చేయి’ తిరిగినోళ్లు కావాలి!
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో అధికార పీఠం దక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఆచితూచి అడుగులు వేస్తోంది. గెలుపు గుర్రాలను ఎంపిక చేసేందుకు అధిష్టానం కనుసన్నల్లో ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ సుదీర్ఘ కస రత్తు చేస్తోంది. ఇప్పటికే 57 స్థానాల్లో అభ్యర్థుల ఎం పిక పూర్తయి పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోదం కూడా పొందింది. ఇక మిత్రపక్షాల కోసం పక్కనపెట్టిన 24 స్థానాలను తీసేయగా మిగిలిన 38 స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక కోసం స్క్రీనింగ్ కమిటీ మంగళవారం ఢిల్లీలోని కాంగ్రెస్ వార్ రూమ్‌లో సుదీర్ఘంగా కసరత్తు జరిపింది. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన సమావేశం అర్ధరాత్రి వరకూ కొనసాగింది. రాహుల్ ఆంతరంగికుడు కొప్పుల రాజు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్సీ కుంతియా, తెలంగాణ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ భక్తచరణ్‌దాస్, సభ్యులు షర్మిష్ట ముఖర్జీ, జ్యోతిమణి సెన్నిమలై, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత జానారెడ్డి, శాసనమండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, రేవంత్‌రెడ్డి, తెలంగాణ ఇన్చార్జి ఏఐసీసీ కార్యదర్శులు సలీం అహ్మద్, బోసురాజు, శ్రీనివాసన్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. తొలుత ఎస్టీ, ఎస్సీ రిజర్వుడ్ స్థానాలు, తదుపరి జనరల్ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికకు కసరత్తు చేశారు. టీడీపీకి 14, టీజేఎస్‌కి 7 నుంచి 8 సీట్లు ఇచ్చేందుకు అంగీకారం కుదిరినట్టు ప్రచారం జరుగుతున్నా, అవి పోటీ చేసే స్థానాలు నిర్ధిష్టంగా తేలలేదు. ఈ నేపథ్యంలో ప్రాథమికంగా అంగీకారానికి వచ్చిన సీట్లను వదిలేసి మిగిలిన స్థానాల్లో కాంగ్రెస్ తమ అభ్యర్థుల ఎంపికపై చర్చించింది. మెజారిటీ స్థానాల్లో ఒకే పేరును ప్రతి పాదించినప్పటికీ పోటీ ఎక్కువగా ఉన్న స్థానాల్లో రెండేసి పేర్లను ప్రతిపాదించినట్టు సమాచారం. అం తిమంగా సామాజిక సమీకరణాలకు అనుగుణంగా పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ చర్చించి వీటిలో అసలు అభ్యర్థిని ఎంపిక చేయనుంది. ఆశావహుల మధ్య అత్యంత పోటీ ఉండి, ఆయా స్థానాలు మిత్రపక్షాలు అడుగుతున్న పరిస్థితి ఉంటే వాటిని మిత్రపక్షాలకే వదిలేసేందుకు స్క్రీనింగ్ కమిటీ మొగ్గు చూపుతున్న ట్టు తెలిసింది. తాజా ప్రతిపాదనలను స్క్రీనింగ్ కమి టీ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీకి అందజేయనుంది. ఎన్నికల కమిటీ ఈ నెల 8న సమావేశమై అభ్యర్థుల తుది జాబితాను ఖరారు చేసి పార్టీ అధ్యక్షుడి ఆమో దం కోసం పంపనుంది. ఈ నెల 9న అభ్యర్థుల జాబితా వెలువడే అవకాశం ఉంది. ఎంపికకు ఇవే ప్రామాణికం.. గెలిచే సత్తా, సామాజిక న్యాయం, మహిళలు, యువతకు ప్రాతినిధ్యం వంటి అంశాలపై స్క్రీనింగ్ కమిటీ సభ్యులు సమతూకం పాటించే ప్రయత్నం చేయగా, తెలంగాణ కాంగ్రెస్ నేతలు వారి వారి సామాజిక వర్గాల ప్రాతినిధ్యానికి అనుగుణంగా, వారి వెన్నంటి ఉండే నేతలకు అవకాశం కల్పించేందుకు వీలుగా పలు అభ్యర్థనలు స్క్రీనింగ్ కమిటీ ముందుంచినట్టు తెలిసింది. బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతానికి స్క్రీనింగ్ కమిటీ పూర్తిగా చెక్ పెడుతోందని సమాచారం. ముఖ్య నేతలు ఇద్దరు తమ అనుచరవర్గానికి, బంధువర్గానికి స్థానాలు కోరినప్పటికీ స్క్రీనింగ్ కమిటీ వాటికి అంతగా ప్రాధాన్యం ఇవ్వనట్టు తెలిసింది. సామాజిక న్యాయం దిశగా... బీసీలకు 28 నుంచి 30 స్థానాలు కేటాయించేలా స్క్రీనింగ్ కమిటీ కసరత్తు సాగిందని తెలుస్తోంది. టీఆర్ఎస్ కంటే మెరుగ్గా బీసీ ప్రాతినిధ్యం ఉండేలా సం ప్రదింపులు కొనసాగినట్టు సమాచారం. ఎస్సీలకు 19 రిజర్వుడ్ స్థానాలు ఉండగా అదనంగా జడ్చర్ల స్థానాన్ని కేటాయిస్తున్నట్టు తెలుస్తోంది. వీటిలో 12 స్థానాలు మాదిగ సామాజిక వర్గానికి, 8 స్థానాలు మాల సామాజిక వర్గానికి కేటాయించినట్టు సమాచా రం. మాల సామాజిక వర్గానికి చెన్నూరు, బెల్లంపల్లి, చొప్పదండి, జహీరాబాద్, వికారాబాద్, తుంగతుర్తి, మధిర, స్టేషన్ ఘన్పూర్ స్థానాలను కేటాయిస్తున్న ట్టు సమాచారం. వీటిలో చెన్నూరు, బెల్లంపల్లి స్థానా లు మిత్రపక్షాలు కోరుతున్నాయి. ఇక మాదిగలకు జుక్కల్, మానకొండూర్, ధర్మపురి, ఆందోల్, చొప్ప దండి, కంటోన్మెంట్, చేవెళ్ల, అలంపూర్, అచ్చంపేట, నకిరేకల్, సత్తుపల్లి, వర్ధన్నపేట స్థానాలను కేటాయిస్తున్నట్టు తెలిసింది. వీటిలో సత్తుపల్లి, వర్ధన్నపేట సీట్లను మిత్రపక్షాలు అడుగుతున్నాయి. ఇక 12 ఎస్టీ రిజర్వ్డ్ స్థానాల్లో ఒకే పేరును ప్రతిపాదించినట్టు సమాచారం. రిజర్వ్డ్ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికలో లీడర్ డెవలప్మెంట్ మిషన్ ఇన్ రిజర్వ్డ్ కాన్‌స్టిట్యుయెన్సీస్ కమిటీ చేసిన సిఫారసులను పరిగణనలోకి తీసుకున్నట్టు తెలిసింది. తుది జాబితాలో మాజీ ఎంపీలు మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, సురేష్ షెట్కార్, విజయశాంతి, బలరాం నాయక్, మల్లు రవి పేర్లను స్క్రీనింగ్ కమిటీ తుది జాబితాలో చేర్చినట్టు సమాచారం. పొన్నం కరీంనగర్ నుంచి, సురేష్ షెట్కార్ నారాయణఖేడ్ నుంచి, బలరాం నాయక్ మహబూబాబాద్ నుంచి, విజయశాంతి మెదక్ నుంచి, మల్లు రవి జడ్చర్ల నుం చి పోటీ చేసేందుకు ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. మంచిర్యాలలో ప్రేమ్‌సాగర్‌రావు, అరవిందరెడ్డి మధ్య గట్టిపోటీ నెలకొంది. సూర్యాపేటలో రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, పటేల్ రమేష్ మధ్య తీవ్ర పోటీ ఉంది. ఈ రెండు స్థానాలపై స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో చాలాసేపు కసరత్తు జరిగినట్టు సమాచారం. -
మూడోరోజూ ముమ్మర వడపోత
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితా ఖరారుపై స్క్రీనింగ్ కమిటీ మూడోరోజు తీవ్ర కసరత్తు చేసింది. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు వడపోత కార్యక్రమాన్ని కొనసాగించింది. గెలుపు అవకాశాలు, సామాజికాంశాలను దృష్టిలో పెట్టుకుంటూ 119 నియోజకవర్గాల అభ్యర్థులను ఎంపిక చేసేందుకు సూక్ష్మస్థాయిలో పరిశీలన చేసింది. దీనికోసం పార్టీ కీలక నేతలు, సీనియర్లు, జిల్లా కమిటీల అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, మాజీమంత్రులు, ఎమ్మెల్యేలతో భేటీలు జరిపింది. స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ భక్తచరణ్‌దాస్, సభ్యులు శర్మిష్ట ముఖర్జీ, జ్యోతిమణి సెన్నిమలై గోల్కొండ హోటల్లో వరుస భేటీలు జరిపారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహా, మాజీ కేంద్ర మంత్రులు జైపాల్‌రెడ్డి, బలరాం నాయక్, నేతలు డీకే అరుణ, గండ్ర వెంకటరమణారెడ్డి, ఆరేపల్లి మోహన్ కమిటీ తో విడివిడిగా భేటీ అయ్యారు. జిల్లాల్లో పరిస్థితులను, గెలిచే అవ కాశం ఉన్న అభ్యర్థుల వివరాలను అందించారు. అభ్యర్థుల బలాబలాలపై ఆరా నియోజకవర్గాలవారీగా అభ్యర్థుల బలాలు, బలహీనతలపై స్క్రీనింగ్ కమిటీ సభ్యులు సమాచారం సేకరించారు. అభ్యర్థులు సమర్పించిన సెల్ఫ్ అఫిడవిట్లో బలాలనే పేర్కొనగా, కమిటీ సభ్యులు మాత్రం బలహీనతల కోణం నుంచీ సమాచారం రాబట్టారని తెలుస్తోంది. ఇప్పటికే పార్టీ చేయించిన సర్వే వివరాలతో అభ్యర్థుల పేర్లను సరిచూసుకుంటూ జాబితాను వడపోస్తున్నారు. ఇప్పటికే పార్టీ ఎన్నికల కమిటీ 30 స్థానాలకు ఒక్కో పేరుతో కూడిన జాబితాను కమిటీకి అందించింది. మరో పది పన్నెండు చోట్ల రెండేసి పేర్లను సూచించగా, మెజార్టీ స్థానాల్లో మూడు నుంచి ఆరు పేర్లతో జాబితాను కమిటీకి అందించిన విషయం తెలిసిందే. అయితే, కమిటీ ఒక్క పేరున్న స్థానాలను వదిలేసి, మిగతా చోట్ల అభ్యర్థుల పేర్లపై భిన్న కోణాల్లో సమాచారం సేకరించింది. ఈ నెల 15 నాటికి కనీసంగా 90 స్థానాల్లో ఒక్కో పేరును సూచిస్తూ, మిగతా స్థానాల్లో రెండేసి పేర్లతో జాబితాను రూపొందించి పార్టీ కోర్ కమిటీకి అందించే అవకాశముంది. ఈ నెల 16న ఢిల్లీలో జరిగే ఏకే ఆంటోనీ నేతృత్వంలోని కోర్‌కమిటీ సమావేశంలో ఒక్కో పేరుతో ఉన్న జాబితాను ఖరారు చేసే అవకాశం ఉంది. అనంతరం అవసరమైతే టికెట్లు దక్కని నేతలతో కోర్‌కమిటీ కానీ, ఇతర నేతలు కానీ చర్చించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. రెండు పేర్లు సూచించిన స్థానాలపై మరోమారు చర్చించి తుది నిర్ణయానికి రానున్నారు. -
ఈ వారమే బీజేపీ అభ్యర్థుల ఖరారు
సాక్షి, హైదరాబాద్: రానున్న అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులను ఈ వారంలోనే ఖరారు చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ స్పష్టం చేశారు. అభ్యర్థుల ఎంపికపై ఈ నెల 3, 4, 5 తేదీల్లో అభిప్రాయాలను సేకరించి, పూర్తి ప్రజాస్వామ్య పద్ధతిలో గెలుపు గుర్రాలను గుర్తిస్తామన్నారు. వచ్చే వారంలో వాటిని క్రోడీకరించి, పార్టీ పార్లమెంటరీ బోర్డుకు పంపించి, ఆమోదం తీసుకొని ప్రకటిస్తామన్నారు. సోషల్ వర్కర్ రమాకాంత్‌రెడ్డి తన అనుచరులతో మంగళవారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో లక్ష్మణ్, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ నేతృత్వంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ విలేకరులతో మాట్లాడుతూ.. ఇప్పటికే మేనిఫెస్టో కమిటీ సమావేశం జరిగిందని, ఈ నెల 3న పార్టీ రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జి సంతోష్ నేతృత్వంలో ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ భేటీ కానున్నట్లు తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలపై అంశాల వారీగా నివేదికలు రూపొం దించేందుకు చార్జిషీట్ కమిటీని ఏర్పాటు చేశామని, దానికి చైర్మన్‌గా మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి, వైస్‌చైర్మన్‌గా సంకినేని వెంకటేశ్వర్రావు, కన్వీనర్‌గా డాక్టర్ మనోహర్‌రెడ్డి కొనసాగుతారన్నారు. యువ ఓటర్లతో సమ్మేళనాలు ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగా తొలి విడతలో 50 అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారీ సమ్మేళనాలు నిర్వహిస్తామని లక్ష్మణ్ తెలిపారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో యువ ఓటర్లతో సమ్మేళనాలు, ఓబీసీ సదస్సులను నిర్వహిస్తామని చెప్పారు. 40 అసెంబ్లీ స్థానాల్లో భారీ సమ్మేళనాలు, 31 యువ సమ్మేళనాల నిర్వహణ తేదీలనూ ఇప్పటికే ఖరారు చేశామన్నారు. బీజేపీపై, ప్రధాని మోదీపై విమర్శలు చేసే హక్కు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కు లేదన్నారు. టీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలపై దృష్టి పెట్టి కాంగ్రెస్ చిత్త శుద్ధి ఏంటో చాటుకోవాల్సింది పోయి, కాంగ్రెస్, టీఆర్ఎస్ దోబూచులాడుతూ బీజేపీపై పడుతున్నాయని పేర్కొన్నారు. మోదీని కేసీఆర్‌తో పోల్చే విచిత్రమైన స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉందన్నారు. కేసీఆర్ రోజులో 18 గంటలు ఫామ్ హౌస్‌కు పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. ఎప్పుడు మాయం అవుతారో.. ఎప్పుడు తేలుతారో.. ఏ దేశంలో ఉంటారో.. ఎప్పు డు వస్తారో తెలియని రాహుల్‌తో ప్రధానిని పోల్చ డం ఏంటని ప్రశ్నించారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్, మజ్లిస్ కలసి పోటీ చేసిన విషయాన్ని ఉత్తమ్ మరిచిపోయినట్లు ఉన్నారన్నారు. పాతబస్తీ పాము అయిన మజ్లిస్‌ను పెంచి పోషించిందీ కాంగ్రెస్ కాదా అని ప్రశ్నించారు. ఓటు కాంగ్రెస్‌కు వేసినా, టీఆర్ఎస్కు వేసినా మజ్లిస్‌కు వేసినట్లేనన్నారు. దారుస్సలాం కేంద్రంగా బీజేపీని ఓడించేందుకు కుట్రలు పన్నుతున్నారన్నారు. తెలంగాణ వద్దన్న ఎంఐఎంపై టీఆర్ఎస్కు ఉన్న ప్రేమ ఏంటని ప్రశ్నిం చారు. రజాకార్ల నయా వారసులుగా కాంగ్రెస్, టీఆర్ఎస్ పోటీ పడుతున్నాయని తెలిపారు. సీఖో ఔర్ కమావో.. మౌలానా అజాద్ నేషనల్ ఫెలోషిప్, పడావో పర్దేశ్ వంటి అనేక పథకాలను మైనార్టీల కోసం మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. వీటి గురించి ఎంఐఎంకు తెలియదా అని ప్రశ్నించారు. -
ఎంపిక-523 .. చేరింది-13
అరకొర వేతనం.. హైదరాబాద్‌లో ఉద్యోగం ఆసక్తి చూపని ఉద్యోగ మేళా సెలక్షన్ అభ్యర్థులు నీరుగారిన సింగరేణి కంపెనీ లక్ష్యం కోల్‌బెల్ట్ : సింగరేణి ఆధ్వర్యంలో చేపట్టిన ‘సింగరేణి ఆణిముత్యాలు-జాబ్‌మేళా’ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించినప్పటికీ ఉద్యోగ అవకాశం కల్పించిన పలు కంపెనీలలో చేరేందుకు నిరుద్యోగులు ఆసక్తి చూపలేదు. భూపా లపల్లి ఏరియాలో జనవరి 27, 28 తేదీల్లో బాజ్ మేళా నిర్వ హించారు. ఎక్కడలేని విధంగా ఏరియాలో నాలుగు కేట గిరీలకు 2,300 మంది తమ బయోడేటాలు సమర్పించారు. చదువులు పూర్తయి ఉద్యోగాలకు ప్రయత్నిస్తున్న సుమారు 813 మందికి 30 సంస్థలు ఇంటర్వ్యూలు నిర్వహించి అర్హత కలిగిన 523 మందిని ఎంపిక చేశారు. అందులో డాక్టర్ ఐటీఎం 17, కంట్రీక్లబ్ 11, మెక్లెన్ 21, కిషన్లాబ్ 15, అపోలో ఫార్మసీ 16, టాటాడొకోమో 47, వరుణ్‌మోటార్స్ 15, టీంలీస్ 05, నవత రోడ్ ట్రాన్స్పోర్ట్ 11, టాటాబీపీఓ 20, ఐసీఐసీఐ 30, సీటూసీ 34, జిఫోర్ సెక్యూరిటీస్ 23, కార్వి 61, నైటింగేల్ల్యాబ్స్ 9, మోర్ మార్కెటింగ్ 18, సుభగ్రుహ 15 మందికి, ఎస్ఎస్సీ-ఇంటర్ విద్యార్హత లతో 85 మందికి ఉద్యోగ అవకాశం లభించింది. కంపెనీ వ్యాప్తంగా నిర్వహిం చిన జాబ్‌మేళాలో భూపాలపల్లి ఏరియా ఉద్యోగాల కల్ప నలో ముందుండటంతో సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ ప్రత్యేకంగా స్థానిక అధికారులను అభినందించారు. అయితే పలు కంపెనీలు నిర్వహించిన ఇంటర్వ్యూలో సెలక్ట్ అయిన నిరుద్యోగులు మూడు మాసాలు గడచినా కేవలం 13 మంది మాత్రమే ఉద్యోగాల్లో చేరారు. ఇప్పటివరకు ఆదర్శ ఆటోమోబైల్స్లో ముగ్గురు, అపోలో ఫార్మసీలో ఒక్కరు, డాక్టర్ ఐటీఎంలో ఇద్దరు, కార్వీలో ముగ్గురు, ఎంసీలీన్లో ఒకరు, వెంకటేశ్వర ఏజన్సీస్‌లో ఇద్దరు, కంట్రీక్లబ్‌లో ఒకరు జాయినయ్యారు. ఎంపికైన 523లో కేవలం 13 మంది మాత్రమే చేరడానికి ప్రధానంగా ఆయా కంపెనీలు నిర్ణయించిన తక్కువ వేతనమే కారణంగా తెలుస్తోంది. హైదరాబాద్‌లో ఉద్యోగం.. అరకొర వేతనం.. పైగా పనిఒత్తిడి అధికంగా ఉంటుందనే కారణాలతో అభ్యర్థులు ఉద్యోగాలలో చేరలేదని సమాచారం. -
సిద్దిపేట మే సోలిపేట
పురపోరు పగ్గాలు అప్పగింత ♦ అభ్యర్థుల ఎంపిక బాధ్యత రామలింగారెడ్డిదే.. ♦ ఎంపిక కోసం కమిటీ నియామకం ♦ సభ్యులుగా మురళీయాదవ్, దేవేందర్‌రెడ్డి ♦ టికెట్ల కోసం కదిలిన గులాబీ ‘దండు’ ♦ కమిటీకి అందిన 200 మంది బయోడేటా పత్రాలు ♦ తొలిరోజు 16 నామినేషన్లు సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: సిద్దిపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక కోసం టీఆర్ఎస్ పార్టీ నియామక కమిటీని వేసింది. పురపోరుకు గులాబీ ‘దళాన్ని’ నడిపే బాధ్యతను మంత్రి హరీశ్‌రావుకు అత్యంత సన్నిహితుడు, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డికి అప్పగించారు. 34 వార్డులకు గాను గులాబీ దండు నుంచి దాదాపు 250 మందికి పైగా పోటీ పడటంతో నియామక కమిటీ వేయటం తప్పనిసరైంది. వార్డు కౌన్సిలర్ అభ్యర్థుల ఎంపిక బాధ్యతను ఈ కమిటీ చూసుకుంటుంది. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మురళీ యాదవ్, ఆ పార్టీ నేత దేవేందర్‌రెడ్డి కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఇటీవల రా ష్ట్రంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మే జర్ స్థానాలను ఒంటి చేతితో ఏకగ్రీ వం చేయించినపార్టీ ట్రబుల్ షూట ర్, భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు తన సొంత నియోజకవర్గం సిద్దిపేట విషయంలో ఆచీతూచి అడుగులు వేస్తున్నారు. ఇంతకాలం తన వెంట నడిచిన ఏ ఒక్కరినీ టికెట్ల విషయంలో ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతోనే మంత్రి .. నియామక కమిటీని తెరమీదకు తెచ్చినట్లు తెలుస్తోంది. వ్యక్తిగత రాగద్వేషాలకు అవకాశం లేకుండా పూర్తి పారదర్శకతతో అభ్యర్థుల ఎంపిక జరగాలని కమిటీకి మంత్రి ఆదేశించారు. రామలింగారెడ్డి నేతృత్వంలోని నియామక కమిటీ ఆసక్తి గల అభ్యర్థు ల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. సోమవారం ఒక్కరోజే 200 మంది అభ్యర్థులు తమ బయోడేటాను కమిటీకి అందజేశారు. ఉద్యమ కాలంలో టీఆర్ఎస్కి అండగా నిలబడిన తీరు.. మంత్రి హరీశ్‌రావుతో వారికి ఉన్న అనుబంధం, సన్నిహిత సంబంధాలులతో కూడిన ప్రతులను బయోడేటాకు జత చేసి కమిటీకి సమర్పించారు. మంగళవారం మరో 100 నుంచి 150 మంది అభ్యర్థులు వస్తారని కమిటీ అంచనా వేస్తోంది . నియామక కమిటీ ఈ బయోడేటాలను వడపోసి తొలుత 68 మంది సభ్యులతో కూడిన ఒక రహస్య జాబితా రూపొందిస్తుంది. అనంతరం అభ్యర్థుల వ్యక్తిగత ప్రవర్తన, ఇంటలిజెన్సీ నివేదికలతో పాటు కమిటీ స్వతహాగా తెప్పించుకున్న అభ్యర్థుల సమాచారం ఆధారంగా తుది జాబితా రూ పొందిస్తారని తెలిసింది. ఈ మొత్తం ఎపిసోడ్లో మంత్రి హరీశ్‌రావు ఎక్కడా కల్పించుకోరని, కేవలం రాజకీయపరమైన సలహాలు, సూచనలు మాత్రమే చేస్తారని తెలుస్తోంది. తొలిరోజు 16 నామినేషన్లు.... తొలిరోజే 16 మంది నామినేషన్ ప త్రాలను ఎన్నికల అధికారులకు సమర్పించారు. ఇందులో 10 నామినేషన్లు టీఆర్ఎస్ అభ్యర్థులవే కావటం గమనార్హం. బీజేపీ, కాంగ్రెస్ నుంచి ఒక్కొక్కరు, మిగిలిన వారు స్వంతంత్య అభ్యర్థులు. టీఆర్ఎస్ పార్టీ నుంచి రంగధాంపల్లి నుంచి ఇద్దరు, పటేల్‌పురా, సుభాష్‌నగర్, నర్సాపురం, వివేకానందనగర్, ఖాదర్పురా,నాసర్‌పురా, గాంధీ టూ కమాన్ వార్డుల నుంచి ఒక్కొక్కరి చొప్పున నామినేషన్ పత్రాలు సమర్పించారు. -
వ్యూహం.. ప్రతివ్యూహం
సాక్షి, చెన్నై : రాష్ట్రంలోని రాజకీయ పక్షాలు ప్రతి ఎన్నికల్లోనూ అభ్యర్థుల ఎంపికకు దరఖాస్తుల్ని ఆహ్వానించడం జరుగుతూ వస్తోంది. ఈ దరఖాస్తుల రూపంలో పార్టీలకు రాబడి ఎక్కువే. రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆయా పార్టీలు దరఖాస్తుల పర్వంను ఇప్పటికే ముగించాయి. ఇక అభ్యర్థుల ఎంపిక మీద దృష్టి పెట్టే పనిలో పడ్డాయి. అన్నాడీఎంకేలో దరఖాస్తుల పర్వం సాగినా, అభ్యర్థి ఎంపిక మాత్రం అధినేత్రి, సీఎం జయలలిత కనుసన్నల్లో జరగడం పరిపాటే. ఇక డీఎంకే, డీఎండీకే పార్టీలు దరఖాస్తు చేసుకున్న ఆశావహులకు ఇంటర్వ్యూలు జరపడం, తదుపరి తమ దృష్టిలో ఉన్న వాళ్లకు చోటు కల్పించడం జరుగుతూ వస్తోంది. ఆ దిశగా ఇప్పటికే పీఎంకే, తమిళ మానిల కాంగ్రెస్ పార్టీలు ఇంటర్వ్యూల పర్వాన్ని ప్రారంభించాయి. ఇక డీఎంకే, డీఎండీకేలు అభ్యర్థుల ఎంపిక కసరత్తుల్లో భాగంగా ఇంటర్వ్యూల పర్వానికి సోమవారం శ్రీకారం చుట్టాయి. అన్నా అరివాలయంలో మెగా కూటమి ఏర్పాటు, అధికారం లక్ష్యంగా వ్యూహ రచనలతో పరుగులు తీస్తున్న డీఎంకే తరఫున ఎన్నికల బరిలో నిలబడే ఆశావహుల నుంచి దరఖాస్తుల్ని స్వీకరించారు. 234 నియోజకవర్గాల్లో తమ కంటే తమకు సీట్లు ఇవ్వాలని కోరుతూ ఎనిమిది వేల మంది వరకు దరఖాస్తులు చేసుకున్నారు. అలాగే, మరి కొందరు, తమ నియోజకవర్గంలో అంటే, తమ నియోజకవర్గంలో అధినేత కరుణానిధి, దళపతి స్టాలిన్, ఎంపీ కనిమొళిల కోసం దరఖాస్తులు సమర్పించారు. దరఖాస్తు చేసుకున్న ఆశావహులకు ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు అధినేత కరుణానిధి నిర్ణయించారు. వచ్చిన దరఖాస్తులను జిల్లాలు, నియోజకవర్గాల వారీగా విభజించి ఇంటర్వ్యూలకు శ్రీకారం చుట్టారు. అధినేత కరుణానిధి సమక్షంలో ప్రధాన కార్యదర్శి అన్భళగన్, కోశాధికారి ఎంకే స్టాలిన్, సీనియర్‌నేత దురై మురుగన్ల నేతృత్వంలో తేనాం పేటలోని అన్నా అరివాలయంలో ఉదయం ఇంటర్వ్యూలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి కన్యాకుమారి, తిరునల్వేలి, తూత్తుకుడి, రామనాధపురం జిల్లాల్లోని నియోజకవర్గాల వారీగా ఆశావహులకు ఇంటర్వ్యూలు జరిగాయి. సాయంత్రం నాలుగు గంటలకు విరుదునగర్, తేని, దిండుగల్ జిల్లాల్లోని నియోజకవర్గాలకు ఇంటర్వ్యూలు జరిగాయి. మంగళవారం తొమ్మిది గంటలకు శివగంగై, మదురై, ఈరోడ్, సాయంత్రం నాలుగు గంటలకు నీలగిరి, కోయంబత్తూరు, సేలం జిల్లాల్లోని ఆశావహులకు ఇంటర్వ్యూలు జరుగుతాయి. ఈనెల 27వ తేదీతో ఇంటర్వ్యూలు ముగియనున్నాయి. ఈ ఇంటర్వ్యూల్లో ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి, ఆశావహుడికి నియోజకవర్గం మీదున్న పట్టు, అవగాహన, ప్రజా సమస్యలతో పాటుగా గెలుపు అవకాశాలకు సంబంధించి ప్రశ్నల్ని సందిస్తున్నారు. కాగా, ఆశావహుల్లో పలువురు అన్నదమ్ముళ్లు భార్య భర్తలు సైతం ఉండడం, ఒకే నియోజకవర్గం సీటు కోసం వీళ్లంతా దరఖాస్తులు చేసుకుని ఉండడం విశేషం. డీఎండీకే కార్యాలయంలో: పొత్తు ఎవరితో అన్నది తేల్చనప్పటికీ అభ్యర్థుల ఎంపిక కసరత్తుల్లో డీఎండీకే అధినేత విజయకాంత్ నిమగ్నం అయ్యారు. 234 స్థానాల్లోనూ అభ్యర్థుల ఎంపిక అంటూ ఇంటర్వ్యూలకు శ్రీకారం చుట్టినా, తదుపరి పరిణామాల మేరకు పొత్తు ఖారారుతో సీట్ల పంపకాల ఆధారంగా అభ్యర్థుల తుది జాబితాకు ప్రత్యేక కార్యచరణతో విజయకాంత్ ముందుకు సాగుతున్నారు. ఉదయం కోయంబేడులోని పార్టీ కార్యాలయంలో దరఖాస్తులు చేసుకున్న ఆశావహులను విజయకాంత్, ఆయన బావ మరిది, యువజన నేత సుదీష్, పార్టీ నాయకులు చంద్రకుమార్, ఇలంగోవన్, పార్థసారథి ఇంటర్వ్యూలు చేసే పనిలో పడ్డారు. పార్టీలో ఎంత కాలం ఉన్నారో, పార్టీ కోసం ఇన్నాళ్లు ఏమి చేశారో, పార్టీ పిలుపుతో చేపట్టిన కార్యాక్రమాలు, తదితర అంశాలతో ఆశావహుల్ని విజయకాంత్ ప్రశ్నిస్తుండడం విశేషం. అలాగే, స్థానికంగా ఉన్న ప్రజా సమస్యల్ని అడిగి తెలుసుకుంటూ, పార్టీ కోసం శ్రమిస్తున్న వాళ్లకే సీటు అని ఆశావహులకు సూచిస్తున్నారు. తొలి రోజు తిరువళ్లూరు, కన్యాకుమారి, నీలగిరి, తిరునల్వేలి జిల్లాల్లోని నియోజకవర్గాల వారీగా ఆశావహులకు ఇంటర్వ్యూలు జరిగాయి. ఇక, పలువురు ముఖ్య ఆశావహుల వద్ద పొత్తు ఎవరితో పెట్టుకుంటే బాగుంటుంది, ఒంటరి ఎదుర్కొంటే పరిస్థితి ఎలా ఉంటుందని అన్న అభిప్రాయాల్ని విజయకాంత్ సేకరించి ఉన్నారు. అయితే, తామంతా కెప్టెన్ నేతృత్వంలోనే కూటమి ఏర్పాటు కావాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టుగా పలువురు ఆశావహులు పేర్కొన్నారు. -
వీడని సస్పెన్స
- ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై కొనసాగుతున్న జాప్యం! - ‘బాస్’ దృష్టంతా ‘ఓటుకు నోటు’పైనే! - నేరుగా ప్రకటించినా ఆశ్చర్యం లేదంటున్న నేతలు సాక్షి, విజయవాడ : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల ఎంపికలో జాప్యం కొనసాగుతూనే ఉంది. ఎమ్మెల్సీ సీట్లు ఆశిస్తున్న నేతలంతా హైదరాబాద్‌లో మకాం వేసి తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. జిల్లాలో రెండు సీట్లకు ఎన్నికలు జరగనుండగా ముగ్గురు మధ్య ప్రధాన పోటీ నెలకొంది. దీంతో ఎవరికి ఇవ్వాలనే అంశంపై తర్జనభర్జన జరుగుతోంది. ‘బాస్’ దృష్టంతా ఓటుకు నోటుపైనే.. ఓటుకు నోటు కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సీబీఐ నోటీసులు ఇస్తుందని ప్రచారం జరగడంతో ముఖ్యమంత్రి సహా ముఖ్య నేతలంతా ఆ వ్యవహారంలో తలమునకలయ్యారని హైదరాబాద్‌లో మకాం వేసిన పార్టీ నేతలు చెబుతున్నారు. తెలంగాణలో జరుగుతున్న పరిణామాలపై చంద్రబాబు ఇతర నేతలతో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతున్నారని, దీనివల్లే ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై అంతగా ఆసక్తి చూపడం లేదని సమాచారం. శనివారం కర్నూలు, విశాఖపట్నం జిల్లా నేతలతో మాత్రం కొద్దిసేపు మాట్లాడారని తెలిసింది. నామినేషన్లకు ఇంకా మూడు రోజులు వ్యవధి ఉండటంతో ఈ విషయాన్ని పక్కనపెట్టి ఓటుకు నోటు వ్యవహారంపైనే సీఎం బిజిబిజీగా ఉన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే కృష్ణాజిల్లాకు చెందిన నేతల్ని ఇప్పటివరకు పిలిచి మాట్లాడలేద ని సమాచారం. అయితే, జిల్లాపై ఆయనకు పూర్తి అవగాహన ఉండటంతో నేరుగా అభ్యర్థులను ప్రకటించినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని పార్టీ నేతలు చెబుతున్నారు. చివరి నిమిషం వరకు ఆశావహులందరి పేర్లు పరిశీలించి, సీటు ఇవ్వలేని వారితోనూ మాట్లాడిన తరువాత జాబితా ప్రకటించడం ఆనవాయితీ అని, అదేవిధంగా ఈసారీ చేస్తారని ఆ పార్టీ నేతలు పలువురు చెబుతున్నారు. -
తొందరపడ్తున్న కాంగ్రెస్
సాక్షి, న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా తేదీ ప్రకటించలేదు. కానీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను త్వరలోనే ప్రారంభిస్తానని కాంగ్రెస్ చెబుతోంది. సోమవారం లేదా మంగళవారం అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ప్రారంభిస్తామని, దానితో ఎవరెవరు టికెట్లు ఆశిస్తున్నారో స్పష్టమవుతుందని డీపీసీసీ అధ్యక్షుడు అర్విందర్ సింగ్ లవ్లీ చెప్పారు. ఈసారి ఎన్నికలలో గట్టి పోటీ ఇవ్వడం కోసం ప్రజలకు సుపరిచితులైన పలువురు ప్రముఖ నేతలను ఎన్నికల బరిలోకి దింపాలని ఢిల్లీ కాంగ్రెస్ భావిస్తోంది. గతంలో ఈ నేతలు ఎన్నికలలో ఓడిపోయినప్పటికీ కొత్తవారికి టికెట్ ఇచ్చే బదులు పాతవారికే ఇచ్చినట్లయితే విజయావకాశాలు అధికంగా ఉంటాయని, వారితో అసెంబ్లీలో తన సంఖ్యాబలం మెరుగుపడ్తుందని కాంగ్రెస్ ఆశిస్తోంది. పోటీ చేయబోయే అభ్యర్థులను కూడా ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాకమునుపే ప్రకటించాలని కూడా కాంగ్రెస్ భావిస్తోంది. దానివల్ల అభ్యర్థులకు ఎక్కువ ప్రచార సమయం లభిస్తుందని ఆ పార్టీ యోచిస్తోంది. ఈ ఉద్దేశంతోనే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ఒకటి రెండు రోజులలో ఆరంభించాలని నిర్ణయించింది. ఇందుకోసం దరఖాస్తుల ఫారాలను ఖరారు చేస్తున్నారు. వాటిలో టికెట్ ఆశిస్తున్న వారి పేరు, చిరునామా, పార్టీకి అందించిన సేవలతో పాటు వారిపైనున్న కేసులను గూర్చిన వివరాలను అడగనున్నారు. దరఖాస్తు పత్రాలతో పాటు కొంత రుసుమును కూడా వసూలు చేస్తే ఎలా ఉంటుందని పార్టీ యోచిస్తోంది. పార్టీ అధికారంలో లేనందువల్ల నిధుల కొరత ఉందని, ఈ సమస్యను అధిగమించడం కోసం దరఖాస్తుదారుల నుంచి కొత రుసుము వసూలు చేయాలని అనుకుంటన్నారు. దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, 1993 ఎన్నికలలో కూడా దరఖాస్తు ఫారాలతో పాటు రుసుము వసూలు చేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. -
ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ ప్రారంభం
* 7 జిల్లాల నుంచి 6 వేలమందికి పైగా పాల్గొన్న అభ్యర్థులు * ఎత్తు ప్రాతిపదికన 3597 మంది ఎంపిక * ఎంపికైన అభ్యర్థులకు శుక్రవారం పరుగు, లాంగ్ జంప్ పోటీలు విద్యానగర్(గుంటూరు) :నగరంలోని బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో గురువారం ఏడు జిల్లాలకు సంబంధించి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ ప్రారంభమైంది. ఈనెల 20 వతేదీవరకు వివిధ విభాగాల్లో అభ్యర్థుల ఎంపిక కార్యక్రమం కొనసాగుతుంది. మొదటిరోజు గుంటూరు, అనంతపూర్, కడప, నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాలకు చెందిన అభ్యర్థులు 6 వేల మందికి పైగా ఎంపిక ప్రక్రియలో పాల్గొన్నారు. ఉదయం 6 గంటలకు ప్రారంభమైన ఎంపిక కార్యక్రమం సాయంత్రం 5 గంటల వరకు పటిష్ట బందోబస్తు మధ్య జరిగింది. ముందుగా అభ్యర్థులను 400 మంది చొప్పున మైదానంలోకి అనుమతించారు. అనంతరం వారిని క్యూ పద్ధతిలో ఎత్తు ప్రాతిపదికన సర్టిఫికెట్ల పరిశీలనకు పంపారు. కనీస ఎత్తు 166 సెంటీమీటర్లుగా నిర్ణయించడంతో వచ్చిన అభ్యర్థుల్లో 3597 మంది మాత్రమే సర్టిఫికెట్ల పరిశీలనకు ఎంపికయ్యారు. వారిని ఏ జిల్లాకు ఆ జిల్లా వారీగా టెంట్లను ఏర్పాటుచేసి విద్యాశాఖ, రెవెన్యూ శాఖ అధికారులు, ఆర్మీ సిబ్బంది సహకారంతో సర్టిఫికెట్ల పరిశీలన చేశారు. ప్రధానంగా నివాస ధ్రువీకరణ పత్రాలు, ఐడీ ప్రూఫ్, కాండక్ట్ సర్టిఫికెట్లు పరిశీలించారు. తదనంతరం అభ్యర్థులకు తాము ప్రకటించిన పర్సంటేజ్ మార్కుల జాబితాలో ఉందా, లేదా అని ఆర్మీ అధికారులు పరిశీలించి అభ్యర్థుల ఎంపిక పూర్తి చేశారు. సర్టిఫికెట్ల ప్రక్రియలో ఎంపికైన అభ్యర్థులకు శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి రన్నింగ్, లాంగ్‌జంప్ తదితర పోటీలు నిర్వహిస్తామని రిక్రూటింగ్ డెరైక్టర్ కల్నల్ ఆఫ్సర్ అబ్బాస్ జాఫ్రి తెలిపారు. నిర్ణీత ఎత్తు కంటే తక్కువ ఎత్తుగల అభ్యర్థులను ఎంపిక ప్రక్రియ నుంచి తొలగించి వారి చేతికి రంగు రాసి వెనక్కి పంపారు. తక్కువ ఎత్తు ఉండి గురువారం ఎంపిక కాని అభ్యర్థులు తక్కువ ఎత్తు ఉన్న ట్రేడ్ల ఎంపిక రోజున తిరిగి పాల్గొనవచ్చని చెప్పారు.శుక్రవారం జరుగనున్న పరుగు పందెంలో 1.6 కిలో మీటర్ల దూరాన్ని 6 నిమిషాల 20 సెకన్లలో పూర్తి చేయాలని తెలిపారు. 9 అడుగుల లాంగ్ జంప్, పుష్ అప్స్ తదితర ఈవెంట్స్ కూడా నిర్వహిస్తామన్నారు. వీటితో పాటు టెక్నికల్ విభాగానికి ఎంపిక జరుగుతుందని కల్నల్ తెలిపారు. విలువైన వస్తువులు వెంట తేవద్దు ఎంపిక ప్రక్రియలో పాల్గొనే అభ్యర్థుల కోసం మంచినీరు, తదితర వసతులను సంబంధిత శాఖ అధికారులు ఏర్పాటు చేశారు. ఎంతోమంది తమ సెల్ఫోన్లు, విలువైన వస్తువులు, సర్టిఫికెట్లు పోగొట్టుకున్నామని స్థానిక పోలీసులకు ఫిర్యాదులు చేశారు. దీంతో కల్నల్ జాఫ్రి అభ్యర్థులు తమ విలువైన వస్తువులు తమ వెంట తీసుకురావద్దని, కేవలం సర్టిఫికెట్లను మాత్రమే జాగ్రత్తగా తీసుకుని రావాలని తెలిపారు. ఎంపికలో ఆర్మీ అభ్యర్థులకు సహకరించి విధులు నిర్వహించిన ఈస్ట్ డీఎస్పీ గంగాధరానికి, పోలీసు సిబ్బందికి కల్నల్ జాఫ్రి కృతజ్జతలు తెలిపారు. పోలీసుల అత్యుత్సాహం ఎంపిక ప్రక్రియలో పాల్గొనేందుకు ఇతర జిల్లాలనుంచి అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో వచ్చారు. వీరిపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు.ఎంపికలో పాల్గొనాలనే తపనతో అభ్యర్థులు తోసుకుంటుండడంతో పోలీసులు కర్రలు తీసుకుని దాడి చేసినంత పని చేశారు. స్టేడియం పరిసర ప్రాంతాల్లో దాదాపు 70 మంది పోలీసులు విధులు నిర్వహించారు. -
అభ్యర్థుల్లో ఉత్కంఠ
కౌడిపల్లి, న్యూన్లైన్: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనా ఆయా పార్టీల్లో అభ్యర్థుల ఎంపిక ఇంకా కొలిక్కి రాలేదు. దీంతో ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారు టికెట్ వస్తుందా లేదోననే ఉత్కంఠకు గురవుతున్నారు. మండలంలో టీఆర్ఎస్, కాంగ్రెస్, వైఎస్సార్ సీపీ, బీజేపీ, టీడీపీలు ప్రధాన పార్టీలుగా ఉన్నాయి. నామినేషన్ల పర్వం ప్రారంభమైనా ఆయా పార్టీల నాయకులు ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు అ భ్యర్థులను ప్రకటించకపోవడంతో ఆశావహులు ఆందోళన చెందుతున్నారు. ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నా రిజర్వేషన్లు కలిసిరాక కొందరు వెనక్కి తగ్గగా అనుకూలించిన వారు పోటీ చేయాలని భావిస్తున్నా సొంత పార్టీలోనే పోటీ తీవ్రంగా ఉండడంతో బీ-ఫారం వస్తుం దా లేదా అనే సందిగ్ధంలో ఉన్నారు. మండల పరిషత్ అధ్యక్ష పదవి బీసీ మహిళకు, జడ్పీటీసీ స్థానం జనరల్ మహిళకు రిజర్వు అయింది. మండలంలో మొత్తం ఎంపీటీసీ స్థానాలు 15 కాగా ఇందులో ఎనిమిది మహిళలకు, ఏడు స్థానాలు పురుషులకు రిజర్వు అయ్యాయి. కొనసాగుతున్న కసరత్తు.. కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ మంత్రి సునీతారెడ్డి, టీఆర్ఎస్ తరఫున జిల్లా నాయకుడు మధన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆయా పార్టీల మండల కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఆశావహులు అధికంగా ఉండడంతో అభ్యర్థుల ఎంపిక తలనొప్పిగా మారింది. ఒక్కో స్థానానికి ఒకే పార్టీ నుంచి ముగ్గురు, నలుగురు పోటీపడుతుండడంతో ప్రధాన పార్టీలకు ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. జెడ్పీటీసీ టికెట్ కోసం.. జెడ్పీటీసీ స్థానానికి అభ్యర్థి ఎంపిక కూడా ప్రధాన పార్టీలకు సమస్యగా మారింది. సీనియర్ నాయకులు, కొత్తగా వచ్చిన వారు, పార్టీకి దూరంగా ఉన్నవారు సైతం టికెట్లను ఆశిస్తున్నారు. కాంగ్రెస్ తరఫున ఎంపీటీసీల ఫోరం మాజీ మండల అధ్యక్షుడు సంగాగౌడ్, ఎంపీపీ మాజీ అధ్యక్షులు, మాజీ ఉపాధ్యక్షులు గండి యాదాగౌడ్, విశ్వంబరస్వామి, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు చంద్రం కృష్ణాగౌడ్‌లు తమ కుటుంబ సభ్యులకే కేటాయించాలని కోరుతున్నారు. టీఆర్ఎస్ తరఫున మండల పార్టీ అధ్యక్షుడు సారా రామాగౌడ్, మహిళ నాయకురాలు అనిత ఓంప్రకాశ్, కౌడిపల్లి మాజీ సర్పంచ్ మంజుల శివాంజనేయులు ఆశిస్తున్నారు. బీజేపీ మండల అధ్యక్షుడు రాజేందర్ తన కుటుంబ సభ్యులను పోటీలో దింపాలని చూస్తున్నా. అయితే ఇతర పార్టీలకు చెందిన ప్రముఖులు ఎవరైనా వస్తే వారికి అవకాశం కల్పించాలని కూడా భావిస్తున్నట్టు సమాచారం.