సాక్షి, న్యూఢిల్లీ: ఈ ఏడాది చివరలో జరగనున్న తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించిన బీజేపీ అగ్రనాయకత్వం, అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో తన కసరత్తును వేగవంతం చేసింది. అసెంబ్లీ ఎన్నికలకు మూడు నెలల ముందుగా గత నెల మధ్యప్రదేశ్‌లో 39 స్థానాలకు, ఛత్తీస్‌గఢ్‌లో 21 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల శంఖారావాన్ని పూరించిన బీజేపీ నాయకత్వం తెలంగాణలో కూడా ఈ నెలాఖరులోగా తొలి జాబితా ప్రకటించాలనే దృఢ నిశ్చయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే దరఖాస్తుల సేకరణ ప్రక్రియ ముగిసినందున, వాటిని జల్లెడ పట్టి ఏకైక అభ్యర్థులు, గట్టి నేతలు ఉన్న 25–30 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాలని పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) భేటీలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
ముందుగా ఏకైక అభ్యర్థులు ఉన్న స్థానాల గుర్తింపు..
ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం రాత్రి పార్టీ కేంద్ర కార్యాలయంలో సీఈసీ సమావేశం జరిగింది. దీనికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, భూపేంద్ర యాదవ్, శర్బానంద సోనోవాల్, ఎంపీ కె.లక్ష్మణ్, బీజేపీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్య దర్శి బీఎల్ సంతోష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల ఎన్నికలకు పార్టీ అభ్యర్థుల ఎంపికపై చర్చ జరిగినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సన్నాహాలను సమీక్షించడంతో పాటు నేతల నుంచి అభిప్రాయాలను సేకరించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి 6 వేల మందికి పైగా దరఖాస్తు చేసుకున్న దృష్ట్యా, ముందుగా ఏకైక అభ్యర్థులు ఉన్న స్థానాలను గుర్తించి ఈ నెలాఖరులోగా అభ్యర్థులను ప్రకటించాలని నిర్ణయించారు. అలాంటి స్థానాలు 25–30 వరకు ఉంటాయని గుర్తించినట్లు తెలుస్తోంది.
తొలిజాబితాలో కిషన్‌రెడ్డి, బండి, ఈటల తదితరుల పేర్లు!
ఇదిలా ఉండగా ముఖ్యనేతలైన జి.కిషన్‌రెడ్డి, బండి సంజయ్ కుమార్, డీకే అరుణ, ఈటల రాజేందర్, రఘునందన్ రావు, ఎంపీ ధర్మపురి అరవింద్, జితేందర్ రెడ్డి, వివేక్, కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఆచారి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, విజయశాంతి, బూర నర్సయ్యగౌడ్, చింతల రామచంద్రా రెడ్డి, ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్, చెన్నమనేని వికాస్, మహేశ్వర్‌రెడ్డిల పేర్లు తొలి జాబితాలో ఉంటాయనే ప్రచారం జరుగుతోంది.
ఇక మిగతా స్థానాలకు అభ్యర్థుల ఎంపికను వేగిరం చేసే క్రమంలో భాగంగా ప్రతిస్థానం నుంచి ముగ్గురి పేర్లను ఎంపిక చేసి కమిటీకి పంపిస్తే, సర్వేలు, నేతల బలాబలాలు, కుల సమీకరణల ఆధారంగా అక్టోబర్ రెండో వారానికి మిగతా అభ్యర్థుల ఎంపిక పూర్తి చేయాలని సీఈసీలో నిర్ణయించినట్లు సమాచారం.
తర్వాత జరిగే సీఈసీ భేటీ, పూర్తిగా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సన్నద్ధతపైనే ఉంటుందని తెలుస్తోంది. కాగా, సీఈసీ భేటీకి ముందే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, ఇన్‌చార్జిలు తరుణ్ ఛుగ్, సునీల్ బన్సల్, ఇతర ముఖ్య నేతలతో బీఎల్ సంతోష్ భేటీ అయ్యే అవకాశాలున్నాయని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment