అరకొర వేతనం.. హైదరాబాద్‌లో ఉద్యోగం
ఆసక్తి చూపని ఉద్యోగ మేళా సెలక్షన్ అభ్యర్థులు
నీరుగారిన సింగరేణి కంపెనీ లక్ష్యం
కోల్‌బెల్ట్ : సింగరేణి ఆధ్వర్యంలో చేపట్టిన ‘సింగరేణి ఆణిముత్యాలు-జాబ్‌మేళా’ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించినప్పటికీ ఉద్యోగ అవకాశం కల్పించిన పలు కంపెనీలలో చేరేందుకు నిరుద్యోగులు ఆసక్తి చూపలేదు. భూపా లపల్లి ఏరియాలో జనవరి 27, 28 తేదీల్లో బాజ్ మేళా నిర్వ హించారు. ఎక్కడలేని విధంగా ఏరియాలో నాలుగు కేట గిరీలకు 2,300 మంది తమ బయోడేటాలు సమర్పించారు. చదువులు పూర్తయి ఉద్యోగాలకు ప్రయత్నిస్తున్న సుమారు 813 మందికి 30 సంస్థలు ఇంటర్వ్యూలు నిర్వహించి అర్హత కలిగిన 523 మందిని ఎంపిక చేశారు. అందులో డాక్టర్ ఐటీఎం 17, కంట్రీక్లబ్ 11, మెక్‌లెన్ 21, కిషన్‌లాబ్ 15, అపోలో ఫార్మసీ 16, టాటాడొకోమో 47, వరుణ్‌మోటార్స్ 15, టీంలీస్ 05, నవత రోడ్ ట్రాన్స్‌పోర్ట్ 11, టాటాబీపీఓ 20, ఐసీఐసీఐ 30, సీటూసీ 34, జిఫోర్ సెక్యూరిటీస్ 23, కార్వి 61, నైటింగేల్‌ల్యాబ్స్ 9, మోర్ మార్కెటింగ్ 18, సుభగ్రుహ 15 మందికి, ఎస్‌ఎస్‌సీ-ఇంటర్ విద్యార్హత లతో 85 మందికి ఉద్యోగ అవకాశం లభించింది. కంపెనీ వ్యాప్తంగా నిర్వహిం చిన జాబ్‌మేళాలో భూపాలపల్లి ఏరియా ఉద్యోగాల కల్ప నలో ముందుండటంతో సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ ప్రత్యేకంగా స్థానిక అధికారులను అభినందించారు.
అయితే పలు కంపెనీలు నిర్వహించిన ఇంటర్వ్యూలో సెలక్ట్ అయిన నిరుద్యోగులు మూడు మాసాలు గడచినా కేవలం 13 మంది మాత్రమే ఉద్యోగాల్లో చేరారు. ఇప్పటివరకు ఆదర్శ ఆటోమోబైల్స్‌లో ముగ్గురు, అపోలో ఫార్మసీలో ఒక్కరు, డాక్టర్ ఐటీఎంలో ఇద్దరు, కార్వీలో ముగ్గురు, ఎంసీలీన్‌లో ఒకరు, వెంకటేశ్వర ఏజన్సీస్‌లో ఇద్దరు, కంట్రీక్లబ్‌లో ఒకరు జాయినయ్యారు. ఎంపికైన 523లో కేవలం 13 మంది మాత్రమే చేరడానికి ప్రధానంగా ఆయా కంపెనీలు నిర్ణయించిన తక్కువ వేతనమే కారణంగా తెలుస్తోంది. హైదరాబాద్‌లో ఉద్యోగం.. అరకొర వేతనం.. పైగా పనిఒత్తిడి అధికంగా ఉంటుందనే కారణాలతో అభ్యర్థులు ఉద్యోగాలలో చేరలేదని సమాచారం.