
ఆహార ద్రవ్యోల్బణాన్ని(Food Inflation) తగ్గించే దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా పప్పుధాన్యాలు, నూనెగింజల ఉత్పత్తిని పెంచే లక్ష్యంతో భారత ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్(Union Budget 2025-26)లో సమగ్ర ప్యాకేజీని ప్రకటించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. నిత్యావసర సరుకుల కోసం దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి ఈ ప్యాకేజీ ఎంతో ఉపయోగపడుతుందని అభిప్రాయపడుతున్నారు.
ప్యాకేజీలోని అంశాలు ఎలా ఉండబోతున్నాయంటే..
కనీస మద్దతు ధర (MSP)భరోసా
పప్పుధాన్యాలు, నూనెగింజలను రైతుల నుంచి కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ చర్య వల్ల రైతులకు ఆర్థిక భరోసా అందించాలని భావిస్తోంది. దాంతో వారి ఉత్పత్తులకు న్యాయమైన ధర లభిస్తుంది.
ఆర్ అండ్ డీకు కేటాయింపులు
అధిక దిగుబడినిచ్చే విత్తన వంగడాలను అభివృద్ధి చేయడానికి బడ్జెట్‌లో గణనీయమైన భాగాన్ని పరిశోధన, అభివృద్ధి(ఆర్ అండ్ డీ)కు కేటాయించనున్నారు. ఇది ఉత్పాదకతను మెరుగుపరచడానికి, వ్యవసాయ ఖర్చులను తగ్గించడానికి సహాయపడుతుంది.
పంట వైవిధ్యానికి ప్రోత్సాహకాలు
వివిధ ప్రోత్సాహకాల ద్వారా రైతులు తమ పంటలను వైవిధ్యపరచుకునేలా ప్రోత్సహించాలని చూస్తున్నారు. ఇది పప్పుధాన్యాలు, నూనెగింజల ఉత్పత్తిని పెంచడమే కాకుండా సుస్థిర వ్యవసాయ పద్ధతులకు మద్దతు ఇస్తుంది.
సంప్రదాయేతర ప్రాంతాలపై దృష్టి
సంప్రదాయేతర ప్రాంతాల్లో పప్పుధాన్యాలు, నూనెగింజల సాగును ప్రోత్సహించడమే ఈ ప్యాకేజీ లక్ష్యం. ప్రస్తుతం ఈ పంటలు కేవలం 55 జిల్లాల్లో మాత్రమే పండిస్తున్నారు. వాటి సాగును ఇతర ప్రాంతాలకు విస్తరిస్తే పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చేందుకు వీలవుతుందని అభిప్రాయపడుతున్నారు.
రైతులకు మద్దతు
రైతులు తమ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించేలా ధరల మద్దతు పథకం (పీఎస్ఎస్), ధరల స్థిరీకరణ నిధి (పీఎస్ఎఫ్) వంటి పథకాల ద్వారా ప్రభుత్వం మద్దతును అందిస్తుంది.
ఇదీ చదవండి: త్వరలో ప్రభుత్వ యాప్ స్టోర్..?
స్వయం సమృద్ధి సాధించే దిశగా..
ఈ ప్యాకేజీ వ్యవసాయ రంగంపై గణనీయమైన ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. దేశీయ ఉత్పత్తిని పెంచడం ద్వారా ప్రస్తుతం దేశ వార్షిక వినియోగంలో వరుసగా 58%, 15% ఉన్న పప్పుధాన్యాలు, నూనె గింజల దిగుమతిని తగ్గించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది స్వయం సమృద్ధిని సాధించడానికి సహాయపడటమే కాకుండా ధరలను స్థిరీకరించడానికి, ఆహార ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి తోడ్పడుతుంది.