టెక్ కంపెనీలతో ఎంఈఐటీవై చర్చలు
భారత ప్రభుత్వం తన పౌరులకు సైబర్ భద్రతను పెంచే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. ప్రభుత్వ అధికారిక మొబైల్ యాప్‌లను ఒకే వేదికపై ఏకీకృతం చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (ఎంఈఐటీవై) ప్రభుత్వ మద్దతుతో GOV.in అనే యాప్ స్టోర్‌ను రూపొందించాలని ప్రతిపాదించింది. ఇది ప్రభుత్వ ఆధ్వర్యంలోని అన్ని యాప్‌లకు నెలవు కానుంది.
ప్రభుత్వం భావిస్తున్న ప్రతిపాదనలను సులభతరం చేయడానికి గూగుల్, ఆపిల్ సహా ప్రధాన టెక్ కంపెనీలతో పాటు స్మార్ట్‌ఫోన్ తయారీదారులను ఎంఈఐటీవై సంప్రదించింది. ఈ యాప్‌లను ఒకే గొడుగు కిందకు తీసుకురావడం ద్వారా ప్రజా సేవలను మరింత అందుబాటులోకి తేవడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపింది. GOV.in యాప్‌స్టోర్‌ను గూగుల్ ప్లే, యాప్ స్టోర్(యాపిల్) వంటి ప్లాట్‌ఫామ్ నుంచి నేరుగా డౌన్‌లోడ్ చేసుకునే ఏర్పాటు చేయాలని పేర్కొంది. ఫోన్ తయారీ కంపెనీలు తమ ఉత్పత్తుల తయారీ క్రమంలోనే, వినియోగదారులకు చేరకముందే స్మార్ట్‌ఫోన్లలో ఈ ప్రభుత్వ యాప్ స్టోర్‌ను ప్రీ-ఇన్‌స్టాల్ చేయాలని తెలిపింది.
ప్రయోజనాలు ఇలా..
ఒకవేళ ప్రభుత్వం అనుకున్న విధంగా ఈ సదుపాయాన్ని తీసుకొస్తే GOV.inయాప్ స్టోర్ దేశంలో డిజిటల్ సేవలను మరింత విస్తరించగలదని నిపుణులు భావిస్తున్నారు. పరిమిత స్థాయిలో ఉండే ప్రభుత్వ ఆమోదిత యాప్‌లకు మెరుగైన సైబర్ భద్రత అందించవచ్చని నమ్ముతున్నారు. ప్రపంచ టాప్ కంపెనీ యాపిల్ ఇప్పటికే 2021లో రష్యా నిబంధనలకు కట్టుబడి ఉంది. ఇక్కడ ప్రభుత్వం ఆమోదించిన యాప్‌స్టోర్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి యాపిల్ అనుమతించింది.
ఇదీ చదవండి: ఉపాధికి చేయూత కావాలి
సవాళ్లు ఇవే..
ఈ ప్రతిపాదనకు టెక్ సంస్థల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. తమ ఆపరేటింగ్ సిస్టమ్‌తో భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్లో ఆధిపత్యం చెలాయిస్తున్న గూగుల్, యాపిల్ ప్లాట్‌ఫామ్‌ల్లోని యాప్‌లపై కఠినమైన నియంత్రణను కలిగి ఉంటాయి. డెవలపర్లు తమ స్టోర్ల ద్వారా ఆర్జించే ఆదాయంపై 30% కమీషన్ వసూలు చేస్తాయి. ప్రభుత్వ మద్దతు ఉన్న యాప్ స్టోర్ వారి నియంత్రణను, ఆదాయాన్ని తగ్గిస్తుంది. అయితే దీనిపై ఇంకా కంపెనీలు ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.
Comments
Please login to add a commentAdd a comment