ఉపాధికి చేయూత కావాలి | Industry groups suggests for employment generation | Sakshi
Sakshi News home page

ఉపాధికి చేయూత కావాలి

Published Sat, Jan 25 2025 12:34 AM | Last Updated on Sat, Jan 25 2025 12:34 AM

Industry groups suggests for employment generation

ఇందుకు నైపుణ్య కల్పన, శిక్షణ అవసరం 

ఇన్‌ఫ్రా, ఆతిథ్యం, స్టార్టప్, ఎడ్‌టెక్‌ 

ఈ రంగాల్లో పెట్టుబడులకు ప్రోత్సాహం ఇవ్వాలి 

బడ్జెట్‌ 2025పై పరిశ్రమ వర్గాల డిమాండ్లు

బలమైన ఆర్థిక వృద్ధికి ఉపాధి కల్పన ఎంతో అవసరం. ఇందుకు వీలుగా మౌలిక రంగం, ఆతిథ్యం, స్టార్టప్‌లు, ఎడ్‌టెక్, ఎంఎస్‌ఎంఈ రంగాలకు కావాల్సిన పెట్టుబడులు సమకూర్చడంతోపాటు, ప్రోత్సాహకాలు కల్పించాలని, నైపుణ్యాభివృద్ధి, శిక్షణపై దృష్టి పెట్టాలని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే బడ్జెట్‌లో ఈ మేరకు చర్యలు అవసరమని తెలిపాయి.     

పర్యాటకం–ఆతిథ్యం 
ఉపాధి కల్పనలో, ఆర్థిక వ్యవస్థకు చేయూతలో ఆతిథ్య పరిశ్రమ ఎంతో కీలక పాత్ర పోషిస్తున్నట్టు నూర్‌మహల్‌ గ్రూప్‌ సీఎండీ మన్‌బీర్‌ చౌదరి చెప్పారు. 2047 నాటికి జీడీపీలో 3 ట్రిలియన్‌ డాలర్ల పర్యాటకం లక్ష్యాన్ని చేరుకునేందుకు వీలుగా, ఆతిథ్య పరిశ్రమకు బడ్జెట్‌ 2025లో ప్రోత్సాహకాలకు చోటు కల్పించాలని కోరారు. ఈ రంగానికి పరిశ్రమ హోదా డిమాండ్‌ ఎప్పటి నుంచో అపరిష్కృతంగా ఉన్నట్టు తెలిపారు. ఈ హోదా కల్పిస్తే ఆతిథ్య పరిశ్రమకు రుణ సదుపాయాలు మెరుగుపడతాయన్నారు.  

ఎడ్‌టెక్‌ 
డేటా సైన్స్, పునరుత్పాదక ఇంధనం, కృత్రిమ మేధ (ఏఐ) నైపుణ్యాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని సిల్వర్‌లైన్‌ ప్రెస్టీజ్‌ స్కూల్‌ వైస్‌ చైర్మన్, విద్యా రంగ విధానాల నిపుణుడు నమన్‌ జైన్‌ సూచించారు. నైపుణ్య అభివృద్ధి, శిక్షణపై మరిన్ని పెట్టుబడులు స్థిరమైన వృద్ధికి కీలకమన్నారు. సరిపడా నైపుణ్యాలు లేకపోవడం వల్లే ప్రస్తుతం నిరుద్యోగ సమస్య ఎదుర్కొంటున్నట్టు చెప్పారు. భారత్‌ 7–8 శాతం వృద్ధి రేటును సాధించేందుకు ఉపాధి కల్పనను పెంచాలని ఇటీవలే మెకిన్సే అధ్యయనం సూచించడాన్ని వెర్టెక్స్‌ గ్లోబల్‌ సర్వీసెస్‌ సీఈవో గగన్‌ అరోరా గుర్తు చేశారు. 2030 నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించేందుకు ఉపాధి కల్పన, నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.  

స్టార్టప్‌లు 
స్టార్టప్‌లు, వెంచర్‌ స్టూడియోల అవసరాలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వాలని టీ9ఎల్‌ క్యూబ్‌ వ్యవస్థాపకుడు గౌరవ్‌ గగ్గర్‌ కోరారు. స్టార్టప్‌లకు ఏంజెల్‌ ట్యాక్స్‌ తొలగించడాన్ని గొప్ప చర్యగా అభవర్ణించారు. దీనివల్ల పెట్టుబడులు రాక పెరుగుతుందన్నారు. పరిశ్రమకు నిధుల సమస్య ప్రధానంగా ఉందని, బడ్జెట్‌లో ఈ దిశగా మరిన్ని చర్యలు అవసరమని అభిప్రాయపడ్డారు. దేశంలో స్టార్టప్‌ ఎకోసిస్టమ్‌ (వ్యవస్థ)కు వెంచర్‌ స్టూడియోలు ఊతంగా నిలుస్తున్నట్టు చెప్పారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలను సరళతరం చేయడంతోపాటు, మరింత మెరుగ్గా రుణాలు అందేలా చూడాలని కోరారు. పరిశోధన, అభివృద్ధిపై పెట్టుబడులకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. స్టార్టప్‌లకు నిధులు సమకూర్చే వెంచర్‌ క్యాపిటలిస్టులకు పన్ను రాయితీలు, ప్రోత్సాహకాలు కల్పించాలని గౌరవ్‌ గగ్గర్‌ డిమాండ్‌ చేశారు. దీనివల్ల దేశ స్టార్టప్‌ ఎకోసిస్టమ్‌కు ఎంతో ఊతమిచ్చినట్టు అవుతుందన్నారు. 

 – సాక్షి, బిజినెస్‌ డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement