incentives
-
కార్పొరేట్లకు రెడ్ కార్పెట్
ప్రపంచంలోనే అతి పెద్ద విమానయాన మార్కెట్లలో భారత్‌ది మూడో స్థానం. పదేళ్ల వ్యవధిలో (2024 ఏప్రిల్ నాటికి) సీటింగ్ సామర్థ్యం 79 లక్షల నుంచి 1.55 కోట్లకు పెరిగింది. విమానయానం మరింతగా వృద్ధి చెందుతున్న అంచనాల మధ్య వేల కొద్దీ విమానాలకు ఆర్డర్లిచ్చిన ఎయిరిండియా, ఇండిగో లాంటి దిగ్గజాలు.. గణనీయంగా పెరుగుతున్న కార్పొరేట్ ప్రయాణికులపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నాయి. కన్సల్టెన్సీ సంస్థ డెలాయిట్ నివేదిక ప్రకారం 2023 ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా కార్పొరేట్ ట్రావెల్ మార్కెట్ (హోటళ్లు, విమానయాన సంస్థలు, రైళ్లు, క్యాబ్‌లు కలిపి) దాదాపు 10.6 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఇందులో ఎయిర్‌లైన్స్ మార్కెట్ వాటా 53 శాతంగా (5.6 బిలియన్ డాలర్లు) ఉంది. కార్పొరేట్ల ప్రయాణాలు మరింతగా పెరుగుతాయన్న అంచనాల నేపథ్యంలో విమానయాన సంస్థలు కూడా ఈ విభాగంపై మరింతగా దృష్టి పెడుతున్నాయి. ప్రత్యేక ఆఫర్లతో కార్పొరేట్, సంపన్న ప్రయాణికులను ఆకట్టుకునేందుకు దేశ విదేశ ఎయిర్‌లైన్స్ పోటీపడుతున్నాయి. ఈ క్రమంలోనే చిన్న, మధ్య తరహా సంస్థలపై (ఎస్ఎంఈ) ఎయిరిండియా దృష్టి సారించింది. సాధారణంగా మార్కెటింగ్‌పరంగా వాటిని చేరుకోవడం కొంత కష్టతరం కావడంతో, అవే నేరుగా బుకింగ్ చేసుకునేందుకు వీలు కల్పిస్తూ విడిగా పోర్టల్ ఏర్పాటు చేసింది. దీని ద్వారా బుక్ చేసుకుంటే ఆకర్షణీయమైన చార్జీలను కూడా ఆఫర్ చేస్తోంది. దీంతో పాటు విస్తారా ను విలీనం చేసుకున్న తర్వాత సేల్స్ టీమ్ పటిష్టం కావడం, నెట్వర్క్ విస్తరించడం వంటి అంశాలు కార్పొరేట్ బిజినెస్ పెంచుకునేందుకు ఎయిరిండియాకు ఉపయోగపడుతున్నాయి. గత కొన్నాళ్లుగా కంపెనీ సుమారు 1,700 పైచిలుకు కార్పొరేట్ క్లయింట్లను దక్కించుకుంది. మరోవైపు బడ్జెట్ విమానయా న సంస్థగా పేరొందిన ఇండిగో కూడా కార్పొరేట్ క్లయింట్లను ఆకట్టుకునేందుకు కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా కొన్ని కీలక రూట్లలో బిజినెస్ క్లాస్‌ను ప్రవేశపెడుతోంది. గతేడాది నవంబర్‌లో ప్రారంభించిన ఈ కొత్త సర్వీసులకు మంచి స్పందన రావడంతో ఢిల్లీ–చెన్నై రూట్లో కూడా ఈ కేటగిరీని ప్రవేశపెట్టడంపై కసరత్తు చేస్తున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. 2025 ఆఖరు నాటికి 45 విమానాల్లో బిజినెస్ క్లాస్ సీట్లు ఉంటాయని కంపెనీ సీఈవో పీటర్స్ ఎల్బర్స్ పేర్కొన్నారు. 2025 జూన్ నాటికే ఇలాంటి 94 విమానాలను సమకూర్చుకోవాలని ఎయిరిండియా లక్ష్యంగా పెట్టుకుంది. ప్రత్యేక సదుపాయాలు.. బిజినెస్ క్లాస్ ప్రయాణికులకు లగ్జరీ అనుభూతిని అందించేందుకు విమానయాన సంస్థలు పోటీపడుతున్నాయి. ఇండిగోలో సీట్ల వరుసల మధ్య స్థలం 38 అంగుళాలుగా ఉంటే, ఎయిరిండియాకు 40 అంగుళాల స్థాయిలో ఉంటోంది. ఇండిగో సీట్లు అయిదు అంగుళాల మేర రిక్లైన్ అయితే, ఎయిరిండియావి 7 అంగుళాల వరకు రిక్లైన్ అవుతాయి. ఇక రెండు ఎయిర్‌లైన్స్ చెకిన్, బోర్డింగ్, బ్యాగేజ్ హ్యాండ్లింగ్ విషయాల్లో బిజినెస్ క్లాస్ ప్రయాణికులకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తున్నాయి.అంతర్జాతీయ ఎయిర్‌లైన్స్ కూడా.. ఆర్థిక పరిస్థితులపై సానుకూల దృక్పథంతో ప్రయాణాలు మరింతగా పుంజుకుంటాయన్న అంచనాల నేపథ్యంలో బిజినెస్ క్లాస్‌లో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు అంతర్జాతీయ ఎయిర్‌లైన్స్ కూడా పోటీపడుతున్నాయి. మలేసియా ఎయిర్‌లైన్స్ కొన్నాళ్ల క్రితమే తమ కార్పొరేట్ ట్రావెల్ ప్రోడక్ట్‌ను సరికొత్తగా తీర్చిదిద్దింది. అప్‌గ్రెడేషన్, అదనపు బ్యాగేజ్ అలవెన్స్ మొదలైన వాటికి రివార్డు పాయింట్లను అందించడంతో పాటు వాటిని రిడీమ్ కూడా చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది. అలాగే ఎస్ఎంఈలకు ప్రత్యేక చార్జీలు, వ్యక్తిగత అవసరాలకు అనుగుణమైన తోడ్పాటు అందిస్తోంది. తమ దేశంలో సమావేశాలు, కాన్ఫరెన్సులు, ఈవెంట్లను నిర్వహించుకునేందుకు క్లయింట్లను ప్రోత్సహించేలా ట్రావెల్ ఏజెంట్లకు ఎయిర్ మారిషస్ ప్రోత్సాహకాలు ఇస్తోంది. ఈ స్కీము కింద గ్రూప్ సైజు, ప్రయాణించిన ప్యాసింజర్లను బట్టి ఒక్కొక్కరి మీద రూ. 500–1,000 వరకు కమీషన్లు ఇస్తోంది. అజర్బైజాన్, జార్జియా, కజక్‌స్తాన్, ఉజ్బెకిస్తాన్ తదితర ప్రాంతాలకు డైరెక్ట్ కనెక్టివిటీ పెరగడంతో, ఆయా దేశాలకు ప్రయాణం చేసే వారి సంఖ్య కూడా పెరుగుతోందని థామస్ కుక్ ఇండియా వర్గాలు తెలిపాయి. థామస్ కుక్ ఇండియాకి సంబంధించి బిజినెస్ ట్రావెల్ సెగ్మెంట్ వార్షికంగా సుమారు 13 శాతం పెరిగింది. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
కష్టానికి తగ్గ ఫలితం
సింగరేణి (కొత్తగూడెం): వార్షిక ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకునేందుకు సింగరేణి కార్మికులకు ఆ సంస్థ ప్రోత్సాహకాలు ప్రకటించింది. ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇంకా సుమారు రెండు నెలల సమయం ఉంది. 2024 – 25 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకోగా, గత పది నెలల్లో 53.73 మిలియన్ టన్నుల ఉత్పత్తి మాత్రమే నమోదైంది. మిగిలిన 18.27 మిలియన్ టన్నులను మార్చి 31లోగా ఉత్పత్తి చేయాలన్న లక్ష్యంతో అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా సింగరేణి వ్యాప్తంగా ఉన్న 18 ఓపెన్ కాస్ట్ గనులు, 24 భూగర్భ గనులతో పాటు సీహెచ్‌పీ (కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్)లను కేటగిరీ 1, 2గా విభజించారు. ఆయా పని ప్రాంతాల్లో రానున్న రెండు నెలల్లో సెలవులు తీసుకోకుండా నెలకు 20 మస్టర్లు చేసే కార్మికులకు ప్రోత్సాహకాలు ఇస్తామని యాజమాన్యం ప్రకటించింది. ప్రోత్సాహకాలు ఇలా... » భూగర్భ గనుల్లో నెలకు 20 వేల టన్నుల కంటే ఎక్కువ బొగ్గు ఉత్పత్తి చేసే గనులను కేటగిరి – 1గా పరిగణిస్తారు. వీటిలో 100 నుంచి 104 శాతం ఉత్పత్తి జరిగితే, అక్కడ పనిచేసే కార్మికులకు రెండు నెలల్లో రూ.1,500 ప్రోత్సాహకంగా ఇస్తారు. 105 నుంచి 109 శాతం ఉత్పత్తి చేస్తే రూ.2 వేలు, 110 శాతం కంటే అధికంగా ఉత్పత్తి చేసిన వారికి రూ.2,500 చెల్లిస్తారు. » భూగర్భ గనుల్లో 20 వేల టన్నుల కంటే తక్కువ ఉత్పత్తి చేసే గనులను కేటగిరీ–2గా పరిగణిస్తారు. వీటిలో 100 నుంచి 104 శాతం ఉత్పత్తి చేస్తే రూ.1,200 ప్రోత్సాహం ఇస్తారు. 105 నుంచి 109 శాతం ఉత్పత్తి చేస్తే రూ.1,700.. 110 కంటే అధికంగా ఉత్పత్తి చేస్తే రూ.2,200 చొప్పున సంస్థ చెల్లించనుంది. » రోజుకు 30 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసే ఓపెన్ కాస్ట్ గనులను కేటగిరీ–1గా పరిగణిస్తారు. వీరు 100 నుంచి 104 శాతం ఉత్పత్తి చేస్తే రూ.1,500 ప్రోత్సాహం ఇస్తారు. 105 నుంచి 109 శాతం ఉత్పత్తి చేస్తే రూ.2 వేలు, 110 శాతం కంటే అధికంగా చేసిన వారికి రూ.2,500 ప్రోత్సాహకంగా చెల్లిస్తారు. »కేటగిరీ–2లో రోజుకు 30 వేల టన్నుల కంటే తక్కువ ఉత్పత్తి చేసే ఓసీలు ఉన్నాయి. వీటిల్లో 100 నుంచి 104 శాతం ఉత్పత్తి చేస్తే రూ.1,200.. 105 నుంచి 109 శాతం ఉత్పత్తి చేస్తే రూ.1,700, 110 శాతం కంటే అధికంగా ఉత్పత్తి చేస్తే రూ.2,200 చెల్లించనున్నారు. »రోజుకు 8 రేక్‌లు (32 వేల టన్నులు) రవాణా చేసే సీహెచ్పీలను కేటగిరీ–1గా, అంతకంటే తక్కువ రవాణా చేసేవాటిని కేటగిరీ–2గా పరిగణిస్తారు. ఈ రెండు కేటగిరీల్లోని ఉద్యోగులకు రవాణాకు అనుగుణంగా ప్రోత్సాహక నగదు చెల్లించాలని యాజమాన్యం నిర్ణయించింది.రక్షణ, హాజరుతో లక్ష్యసాధన సింగరేణి యాజమాన్యం రెండు నెలల కోసం కేటగిరీ – 1, 2లను ప్రకటించింది. ఆయా కేటగిరీల్లో పనిచేస్తున్న అన్ని రకాల ఉద్యోగులు(సర్పేస్, అండర్ గ్రౌండ్) లక్ష్యాల సాధనకు కృషి చేయాలి. ఇదే సమయాన రక్షణ సూత్రాలు పాటిస్తూ హాజరు శాతం తగ్గకుండా పనిచేస్తే ప్రోత్సాహకాలు అందుకోవచ్చు. – శాలేం రాజు, కొత్తగూడెం ఏరియా జీఎం అందరికీ పని కల్పిస్తే ఫలితం భూగర్భగనుల్లో చాలా మంది ఉద్యోగులకు మైనింగ్ అధికారులు పని ప్రదేశాలను చూపెట్టడం లేదు. దీంతో ఖాళీగా ఉండి వెనుదిరుగుతున్నారు. అలాగే, మైన్స్ కమిటీ అలంకారప్రాయంగా మారింది. కొందరు గనుల మేనేజర్లు క్షేత్రస్థాయిలో పరిశీలన చేయకుండానే వాట్సాప్ నివేదికలు ఇస్తారు. ఇలాంటివి సరిచేస్తే లక్ష్యాలను సాధించవచ్చు. – రియాజ్ అహ్మద్, హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శిసమస్యల పరిష్కారానికి సమరం» సింగరేణి అధికారుల కార్యాచరణ » వెంటనే డైరెక్టర్ల నియామకానికి డిమాండ్గోదావరిఖని: తమ సమస్యలను పరిష్కరించడంతోపాటు.. అనిశ్చితికి కారణమైన డైరెక్టర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలనే డిమాండ్‌తో సింగరేణి అధికారులు సమరానికి సిద్ధమయ్యారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని సీఎంవోఏఐ కార్యాలయంలో సమావేశమైన అధికారుల సంఘం నేతలు.. భవిష్యత్ కార్యాచరణ సిద్ధం చేశారు.మొత్తం 11 ఏరియాలకు చెందిన సుమారు 2,500 మంది అధికారులు ఇందులో భాగస్వాములవుతున్నారు. తొలుత ఏరియా జీఎంలకు వినతిపత్రాలు అందజేసి, రోజూ సాయంత్రం జీఎం కార్యాలయాల ఎదుట సమావేశమై ప్రణాళిక రూపొందించుకోవాలని నిర్ణయించారు. ఈమేరకు శనివారం జీఎంలకు వినతిపత్రాలు అందజేశారు. 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఫెర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే(పీఆర్పీ) చెల్లించాలని కోరుతున్నారు. ప్రధాన డిమాండ్లు ఇవే.. » గతేడాది రావలసిన పీఆర్పీ (పెర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే) చెల్లించాలి » కీలకమైన డైరెక్టర్ ప్రాజెక్టు అండ్ ప్లానింగ్, డైరెక్టర్ ఆపరేషన్ పోస్టులు భర్తీ చేయాలి » ఏడేళ్ల పీఆర్పీతోపాటు 2007 – 2014 వరకు బకాయిలు చెల్లించాలి » పదోన్నతుల విధానాన్ని సరిచేయాలి » ఎస్సీడబ్ల్యూఏ నుంచి అధికారిగా పదోన్నతి పొందిన వారికి ఈ–2 నుంచి ఏడాదికే ఈ–3 ఇవ్వాలి » ఎన్సీడబ్ల్యూఏ నుంచి ఈ–1కు వచ్చే జేఎంవో, జేటీవో అధికారులకు ఈ–5 వరకు పదోన్నతి విధానాన్ని వర్తింపజేయాలి » ఈ–6 గ్రేడ్ ఏడేళ్లు దాటిన వారికి డీజీఎంగా పదోన్నతి కలి్పంచాలి » డీపీసీ (డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ) ఏడాదిలో రెండు ఏర్పాటు చేయాలి » ఎఫ్ఎంఎంసీ (ఫస్ట్‌క్లాస్ మైన్ మేనేజ్మెంట్) సరి్టఫికెట్ ఉండి 12 ఏళ్ల సరీ్వసు నిండిన వారికి ఎస్వోఎం హోదా ఇవ్వాలి » కన్వేయన్స్, హెచ్‌వోడీ వాహనాలకు, ఆఫీస్ కార్యాలయాలకు ఏసీ సౌకర్యం కలి్పంచాలి » సత్తుపల్లి ఏరియాలో మాదిరిగా మూడు బెడ్రూంలతో కూడిన నూతన క్వార్టర్లు నిర్మించాలి » ఉద్యోగ విరమణ చేసేవారికి చెల్లింపుల్లో ఆటంకం లేకుండా సీడీఏ నిబంధనలు మార్చాలి » కాలపరిమితితో విచారణలు పూర్తిచేయాలి » కోల్ ఇండియాలో మాదిరిగా టీఏ, డీఏ నిబంధనలు అమలు చేయాలి » రిటైర్డ్ అధికారులకు మెడికల్ బిల్లు పరిమితి పెంచాలి » కోల్ ఇండియా మాదిరిగా హోదా ఇవ్వాలి » ఖాళీలను పూరించాలి, పదోన్నతులు కల్పించాలిప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం పదోన్నతులు, పీఆర్పీ చెల్లింపులో అధికారులకు అన్యాయం జరిగింది. మా సమస్యల పరిష్కారం కోసం ఐక్య కార్యాచరణకు సిద్ధమయ్యాం. సమస్యలు పరిష్కారం కాకుంటే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. – పొనుగోటి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు, సీఎంవోఏఐ -
పరిశ్రమ ఆధారిత ప్రోత్సాహకాలు మరింత అవసరం
దేశ వైద్య పరికరాల రంగం ప్రపంచవ్యాప్తంగా గణనీయమైన వృద్ధిని సాధించిందని, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) పథకం వంటివి ఇందుకు దోహదం చేశాయని మెరిల్ లైఫ్ సైన్సెస్‌లో కార్పొరేట్ స్ట్రాటజీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సంజీవ్ భట్ అభిప్రాయపడ్డారు. ఈ ఊపును కొనసాగించడానికి రానున్న కేంద్ర బడ్జెట్లో ఆర్&డీ, ఎగుమతులు, పరిశ్రమ ఆధారిత ప్రోత్సాహకాలలో నిరంతర మద్దతు ఆశిస్తున్నట్లు తెలిపారు.“ప్రపంచవ్యాప్తంగా వైద్య పరికరాల రంగం గణనీయమైన వృద్ధిని సాధించింది. రోగులకు మెరుగైన ఫలితాలు, అవకాశాలను అభివృద్ధి చేయడం ద్వారా ఆధునిక ఆరోగ్య సంరక్షణకు మూలస్తంభంగా మారింది. భారతదేశంలో 21వ శతాబ్దం మొదటి పాతికేళ్లు ఎంతో పరివర్తన చెందాయి. దేశాన్ని అధిక-నాణ్యత, సరసమైన వైద్య సాంకేతికతలకు ప్రపంచ కేంద్రంగా నిలిపాయి.ఈ పురోగతికి భారత ప్రభుత్వ ముందుచూపు కార్యక్రమాలు, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) పథకం, ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలపై బలమైన దృష్టి గణనీయంగా మద్దతు ఇచ్చాయి. ఈ చర్యలు మెడ్‌టెక్ తయారీలో ఆవిష్కరణ, పెట్టుబడులు, స్వావలంబనను ప్రోత్సహించాయి. కేంద్ర బడ్జెట్ సమీపిస్తున్న తరుణంలో ఈ ఊపును కొనసాగించడానికి ఆర్&డీ, ఎగుమతులు, పరిశ్రమ ఆధారిత ప్రోత్సాహకాలలో నిరంతర మద్దతు ఆశిస్తున్నాం.ప్రజల జీవితాలను మార్చే ప్రపంచ స్థాయి పరిష్కారాలను అందించడం ద్వారా భారతదేశ మెడ్‌టెక్ అభివృద్ధికి మెరిల్ దోహదపడుతుండటం పట్ల సంతోషంగా ఉన్నాం. ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం ప్రపంచ ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలలో అగ్రగామిగా భారతదేశం స్థానాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మేము కట్టుబడి ఉన్నాం” అన్నారు. -
ఆతిథ్యానికి మౌలిక పరిశ్రమ హోదా
న్యూఢిల్లీ: ఆతిథ్య రంగం తమకు మౌలిక పరిశ్రమ హోదా కల్పించాలని దీర్ఘకాలంగా కోరుతోంది. అయినప్పటికీ ఈ దిశగా నిర్ణయం రావడం లేదు. రానున్న బడ్జెట్లో అయినా దీనిపై సానుకూల ప్రకటన చేయాలని ఈ రంగం కోరుతోంది. పన్నులను హేతుబద్దీకరించాలని, వీసా జారీ ప్రక్రియలను సులభంగా మార్చాలని, పెట్టుబడులను ఇతోధికం చేసేందుకు రాష్ట్రాలు మరిన్ని ప్రోత్సాహకాలు ప్రకటించాలని హోటల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ కేబీ కచ్రు డిమాండ్ చేశారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకెళ్లిన పరిశ్రమ డిమాండ్లను ఆయన మీడియాతో పంచుకున్నారు.డిమాండ్లివీ..→ సమావేశాలు సదస్సులు, ప్రదర్శనలకు (మైస్) అనుకూలమైన కేంద్రాలను ప్రభుత్వం గుర్తించి, మెరుగైన మౌలిక వసతులు కల్పించాలి. తద్వారా అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించాలి. → ఆతిథ్య పరిశ్రమకు పన్ను పెద్ద సమస్యగా ఉంది. దేశవ్యాప్తంగా వివిధ రకాల పన్నులు అమలవుతున్నాయి. వీటిని హేతుబద్దీకరించాలి. సింగపూర్, శ్రీలంక, థాయ్‌లాండ్ అనుసరిస్తున్న మాదిరి అత్యుత్తమ విధానాలను అనుసరించాలి. → దక్షిణ కొరియా, థాయ్‌లాండ్, జపాన్ పర్యాటక రంగానికి ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా తమ జీడీపీని వృద్ధి చేసుకున్నాయి. → గతంలో ఒక హోటల్ తెరవాలంటే 100 రకాల అనుమతులు అవసరమయ్యేవి. అవి ఇప్పుడు గణనీయంగా తగ్గాయి. అయినప్పటికీ అనుమతుల ప్రక్రియను మరింత సులభంగా మార్చాలి. సింగిల్ విండో విధానం తీసుకురావాలి.→ రాష్ట్రాల స్థాయిలోనూ పెట్టుబడులను ఆహ్వానిస్తూ, అందుకు ప్రోత్సాహకాలు ప్రకటించాలి. పెట్టుబడులు కావాలి..ప్రభుత్వం ఒక్కటే కావాల్సినన్ని పెట్టుబడులు అందించలేదు. ప్రైవేటు రంగం ముందుకు వచ్చి ఇన్వెస్ట్ చేయాలి. పెట్టుబడులపై తగిన రాబడి వచ్చే విధంగా (ఆర్వోవై) ప్రోత్సాహకం కల్పిస్తే చాలు. అప్పుడే పెట్టుబడులతో ముందుకు వస్తారు. థాయ్‌లాండ్ జీడీపీలో పర్యాటకం నుంచి 25 శాతం వాటా వస్తుంటే.. మన జీడీపీలో 6 శాతం మించడం లేదు. మౌలిక పరిశ్రమ హోదా కల్పించం వల్ల ఆకర్షణీయమైన రేట్లకే రుణాలు లభిస్తాయి.’’– కేబీ కచ్రు, హోటల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్జీఎస్టీ తగ్గించాలి.. దేశీయ పర్యాటక రంగం రెండంకెల వృద్ధిని నమోదు చేస్తోంది. పెరుగుతున్న ఆదాయాలు, ప్ర యాణాలకు ప్రాధాన్యం, విస్తరిస్తున్న మధ్య తర గతికి మద్దతుగా నిలుస్తున్నాయి. ఈ వృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు లక్ష్యత చర్యలు అవసరం. ఇందులో పరిశ్రమ హోదా కల్పించాలి. ఆతిథ్య రంగంలో పెట్టుబడులు, అభివృద్ధిని ప్రోత్సహించాలి. హోటల్ నిర్మాణానికి జీఎస్టీ క్రెడిట్‌తోపాటు, జీఎస్టీ రేట్లను కమ్రబద్దీకరించడం వల్ల మొత్తం నిర్మాణ వ్యయాలు తగ్గుతాయి. ఈ చర్యలు దేశీ పర్యాటకాన్ని సానుకూలంగా ప్రభావితం చేస్తాయి.–రాజేష్ మాగోవ్, మేక్ మైట్రిప్ సహ వ్యవస్థాపకుడు–సీఈవో నైపుణ్య కల్పన అవసరం..రుణాలు పరిశ్రమకు పెద్ద సవాలుగా మారాయి. ముఖ్యంగా చిన్న, మధ్య స్థాయి వ్యాపార సంస్థలపై ఎక్కువ భారం పడుతోంది. ఆతిథ్య రంగానికి రుణాల రేట్లు 10.75% నుంచి 22.50% వరకు ఉన్నాయి. ఈ రేట్లను 7–8%కి తీసుకురావాలి. దీనివల్ల భారం గణనీయంగా తగ్గుతుంది. తద్వారా వృద్ధి, స్థిరత్వం సాధ్యపడతాయి. ఈ రంగంలో నైపుణ్యాలకు కొరత నెలకొంది. నిపుణుల లేమితో 30% ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలపై పెట్టుబడులు అవసరం. దీనివల్ల సేవల నాణ్యత మెరుగుపడుతుంది.– మేహుల్ శర్మ, సిగ్నమ్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ వ్యవస్థాపకుడు–సీఈవో -
బీమాకు లభించేనా ధీమా..?
న్యూఢిల్లీ: పౌరులందరికీ బీమా రక్షణను చేరువ చేసే దిశగా 2025 బడ్జెట్లో కీలక చర్యలు ఉంటాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ‘2047 నాటికి అందరికీ బీమా’ లక్ష్యాన్ని చేరుకునేందుకు వీలుగా ఇన్సూరెన్స్‌కు పన్ను ప్రయోజనాలు, ఆరోగ్య సంరక్షణకు ప్రోత్సాహకాలు కల్పించాని పరిశ్రమ ఇప్పటికే కేంద్ర ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకెళ్లింది. దీనిపై ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో నవీన్ చంద్ర ఝా మాట్లాడుతూ.. రానున్న బడ్జెట్లో హెల్త్ ఇన్సూరెన్స్ విస్తరణ దిశగా మరిన్ని చర్యలు ఉంటాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ‘బీమా సుగమ్’కు నియంత్రణ, నిధుల పరమైన మద్దతు అవసరమన్నారు. ఆర్థిక సేవలు తగినంత అందుబాటులో లేని ప్రాంతాల్లోని వారికి బీమా సేవలు చేరువ చేసేందుకు ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం, సబ్సిడీలపైనా బడ్జెట్లో దృష్టి సారించొచ్చని అభిప్రాయపడ్డారు. → ఎన్పీఎస్ మాదిరి పన్ను ప్రయోజనాలను లైఫ్ ఇన్సూరెన్స్ యాన్యుటీ ఉత్పత్తులకు సైతం కల్పించాలని బజాజ్ అలియాంజ్ లైఫ్ ఎండీ, సీఈవో తరుణ్ ఛుగ్ కోరారు. కొత్త పన్ను విధానంలోనూ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలపై పన్ను ప్రయోజనాన్ని కల్పించాలని, టర్మ్ ఇన్సూరెన్స్ కోసం ప్రత్యేక పన్ను మినహాయింపు తీసుకురావాలని డిమాండ్ చేశారు. → ఐఆర్డీఏఐ నివేదిక ఆధారంగా జీవిత బీమా విస్తరణ (జీడీపీలో) 2022–23లో ఉన్న 4 శాతం నుంచి 2023–24లో 3.7 శాతానికి తగ్గినట్టు తెలుస్తోంది. → బడ్జెట్లో పెన్షన్, యాన్యుటీ ప్లాన్లకు మద్దతు చర్యలు ఉండొచ్చని పీఎన్బీ మెట్‌లైఫ్ ఎండీ, సీఈవో సమీర్ బన్సాల్ పేర్కొన్నారు. పెన్షనర్లకు ప్రోత్సాహకంగా యాన్యుటీ ప్లాన్ల ప్రీమియంపై జీఎస్టీని తొలగించాలని బన్సాల్ డిమాండ్ చేశారు. దీంతో యాన్యుటీలు మరింత అందుబాటులోకి వస్తాయన్నారు. → బీమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించేందుకు, బీమా ఉత్పత్తుల స్వీకరణను ప్రోత్సహించే దిశగా సంస్కరణలు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వానికి బడ్జెట్ అవకాశం కల్పిస్తోందని ఇఫ్కో టోకియో జనరల్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో సుబ్రత మోండల్ పేర్కొన్నారు. మరింత మంది బీమా రక్షణను తీసుకునేందుకు వీలుగా పన్ను రాయితీలు కల్పిస్తారన్న అంచనాను ఆయన వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన, ఆయుష్మాన్ భారత్‌కు సైతం బడ్జెట్లో కేటాయింపులు పెంచొచ్చని భావిస్తున్నారు. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లోని వారు, ఆర్థికంగా బలహీన వర్గాలకు బీమా అందుబాటులోకి వస్తుందన్నారు. → హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై జీఎస్టీని తొలగించడం ఎంతో అవసరమని యూనివర్సల్ సోంపో జనరల్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో శరద్ మాధుర్ అభిప్రాయపడ్డారు. బీమా మరింత మందికి చేరేందుకు వీలుగా ఆవిష్కరణలను ప్రోత్సహించాలని కోరారు.సుంకాలు, లైసెన్సు ఫీజులు తగ్గించాలిఓటీటీలు కూడా యూఎస్‌వో ఫండ్‌కి నిధులివ్వాలి కేంద్రానికి టెల్కోల బడ్జెట్ వినతులు న్యూఢిల్లీ: 4జీ, 5జీ నెట్వర్క్ ఉత్పత్తులపై కస్టమ్స్ సుంకాలను, లైసెన్సు ఫీజులను తగ్గించాలని కేంద్రాన్ని టెలికం సంస్థలు కోరాయి. అలాగే భారీగా డేటా వినియోగానికి కారణమయ్యే ఓటీటీ ప్లాట్‌ఫాంలు, స్ట్రీమింగ్ సేవల సంస్థలు (ఎల్‌టీజీ) కూడా యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ (యూఎస్‌వోఎఫ్)/డిజిటల్ భారత్ నిధి ఫండ్‌కి తప్పనిసరిగా చందా ఇచ్చేలా బడ్జెట్లో చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశాయి. టెలికం సంస్థల సమాఖ్య సీవోఏఐ ఈ మేరకు బడ్జెట్‌పై తమ వినతులను కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. రిలయన్స్ జియో, భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా మొదలైనవి ఇందులో సభ్యులుగా ఉన్నాయి. లైసెన్సు ఫీజును 3 శాతం నుంచి 1 శాతానికి తగ్గిస్తే టెలికం సంస్థలపై అదనపు ఆర్థిక భారం తగ్గుతుందని సీవోఏఐ తెలిపింది. ఇక తాము బోలెడంత ఖర్చు పెట్టి నెలకొల్పిన నెట్‌వర్క్‌ల ద్వారా కార్యకలాపాలు సాగిస్తూ, లాభాలు గడిస్తున్నా ఎల్టీజీలు .. పైసా కూడా కట్టడం లేదని పేర్కొంది. ఈ నేపథ్యంలో అవి కూడా తమలాగే యూఎస్‌వో ఫండ్‌కి చందా కట్టేలా చూడాలని కోరింది. తమపై విధిస్తున్న యూఎస్‌వో లెవీని పూర్తిగా తొలగించవచ్చని లేదా ప్రస్తుతమున్న రూ. 86,000 కోట్ల కార్పస్ పూర్తిగా ఖర్చు చేసేంతవరకైనా చందాలను నిలిపివేయొచ్చని సీవోఏఐ పేర్కొంది. టెల్కోలపై సుంకాల భారాన్ని తగ్గించడం, పెట్టుబడి అవకాశాలను ప్రోత్సహించడం వల్ల దేశ భవిష్యత్తుపై వ్యూహాత్మకంగా పెట్టుబడులు పెట్టినట్లవుతుందని వివరించింది. -
ఉపాధికి చేయూత కావాలి
బలమైన ఆర్థిక వృద్ధికి ఉపాధి కల్పన ఎంతో అవసరం. ఇందుకు వీలుగా మౌలిక రంగం, ఆతిథ్యం, స్టార్టప్‌లు, ఎడ్టెక్, ఎంఎస్ఎంఈ రంగాలకు కావాల్సిన పెట్టుబడులు సమకూర్చడంతోపాటు, ప్రోత్సాహకాలు కల్పించాలని, నైపుణ్యాభివృద్ధి, శిక్షణపై దృష్టి పెట్టాలని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టే బడ్జెట్లో ఈ మేరకు చర్యలు అవసరమని తెలిపాయి. పర్యాటకం–ఆతిథ్యం ఉపాధి కల్పనలో, ఆర్థిక వ్యవస్థకు చేయూతలో ఆతిథ్య పరిశ్రమ ఎంతో కీలక పాత్ర పోషిస్తున్నట్టు నూర్మహల్ గ్రూప్ సీఎండీ మన్బీర్ చౌదరి చెప్పారు. 2047 నాటికి జీడీపీలో 3 ట్రిలియన్ డాలర్ల పర్యాటకం లక్ష్యాన్ని చేరుకునేందుకు వీలుగా, ఆతిథ్య పరిశ్రమకు బడ్జెట్ 2025లో ప్రోత్సాహకాలకు చోటు కల్పించాలని కోరారు. ఈ రంగానికి పరిశ్రమ హోదా డిమాండ్ ఎప్పటి నుంచో అపరిష్కృతంగా ఉన్నట్టు తెలిపారు. ఈ హోదా కల్పిస్తే ఆతిథ్య పరిశ్రమకు రుణ సదుపాయాలు మెరుగుపడతాయన్నారు. ఎడ్టెక్ డేటా సైన్స్, పునరుత్పాదక ఇంధనం, కృత్రిమ మేధ (ఏఐ) నైపుణ్యాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని సిల్వర్‌లైన్ ప్రెస్టీజ్ స్కూల్ వైస్ చైర్మన్, విద్యా రంగ విధానాల నిపుణుడు నమన్ జైన్ సూచించారు. నైపుణ్య అభివృద్ధి, శిక్షణపై మరిన్ని పెట్టుబడులు స్థిరమైన వృద్ధికి కీలకమన్నారు. సరిపడా నైపుణ్యాలు లేకపోవడం వల్లే ప్రస్తుతం నిరుద్యోగ సమస్య ఎదుర్కొంటున్నట్టు చెప్పారు. భారత్ 7–8 శాతం వృద్ధి రేటును సాధించేందుకు ఉపాధి కల్పనను పెంచాలని ఇటీవలే మెకిన్సే అధ్యయనం సూచించడాన్ని వెర్టెక్స్ గ్లోబల్ సర్వీసెస్ సీఈవో గగన్ అరోరా గుర్తు చేశారు. 2030 నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించేందుకు ఉపాధి కల్పన, నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. స్టార్టప్‌లు స్టార్టప్‌లు, వెంచర్ స్టూడియోల అవసరాలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వాలని టీ9ఎల్ క్యూబ్ వ్యవస్థాపకుడు గౌరవ్ గగ్గర్ కోరారు. స్టార్టప్‌లకు ఏంజెల్ ట్యాక్స్ తొలగించడాన్ని గొప్ప చర్యగా అభవర్ణించారు. దీనివల్ల పెట్టుబడులు రాక పెరుగుతుందన్నారు. పరిశ్రమకు నిధుల సమస్య ప్రధానంగా ఉందని, బడ్జెట్లో ఈ దిశగా మరిన్ని చర్యలు అవసరమని అభిప్రాయపడ్డారు. దేశంలో స్టార్టప్ ఎకోసిస్టమ్ (వ్యవస్థ)కు వెంచర్ స్టూడియోలు ఊతంగా నిలుస్తున్నట్టు చెప్పారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలను సరళతరం చేయడంతోపాటు, మరింత మెరుగ్గా రుణాలు అందేలా చూడాలని కోరారు. పరిశోధన, అభివృద్ధిపై పెట్టుబడులకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. స్టార్టప్‌లకు నిధులు సమకూర్చే వెంచర్ క్యాపిటలిస్టులకు పన్ను రాయితీలు, ప్రోత్సాహకాలు కల్పించాలని గౌరవ్ గగ్గర్ డిమాండ్ చేశారు. దీనివల్ల దేశ స్టార్టప్ ఎకోసిస్టమ్‌కు ఎంతో ఊతమిచ్చినట్టు అవుతుందన్నారు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
బడ్జెట్లో పన్ను లాభాలు కల్పించాలి
న్యూఢిల్లీ: రానున్న సార్వత్రిక బడ్జెట్లో పన్ను లాభాలు, ప్రోత్సాహకాలు కల్పించవలసిందిగా దేశీ బీమా రంగ కంపెనీలు ఆర్థిక శాఖను కోరుతున్నాయి. బీమా పాలసీల కొనుగోలుదారులకు పన్ను లాభాలు, విక్రయ సంస్థలకు పన్ను ప్రోత్సాహకాలు ప్రకటించవలసిందిగా అభ్యర్థిస్తున్నాయి. భారత బీమా అభివృద్ధి, అధికారిక నియంత్రణ సంస్థ(ఐఆర్డీఏఐ) గణాంకాల ప్రకారం 2023–24లో దేశీయంగా బీమా విస్తృతి 3.7 శాతానికి పరిమితమైంది. అంతక్రితం ఏడాది(2022–23)లో నమోదైన 4 శాతంతో పోలిస్తే స్వల్పంగా క్షీణించింది. జీవిత బీమా రంగంలో 3 శాతం నుంచి 2.8 శాతానికి వెనకడుగు వేయగా.. ఇతర బీమా పరిశ్రమలో విస్తృతి యథాతథంగా 1 శాతంగానే నమోదైంది. కొత్త తరహా పాలసీలతో బీమా పరిశ్రమకు ప్రోత్సాహకాలివ్వడం ద్వారా మరింతమంది కొత్త కస్టమర్లను ఆకట్టుకునేందుకు బీమా సంస్థలకు వీలుంటుందని జోపర్ సహవ్యవస్థాపకుడు, సీవోవో మయాంక్ గుప్తా పేర్కొన్నారు. కొత్తతరహా పాలసీల సృష్టి, పంపిణీలో టెక్నాలజీ వినియోగానికి బీమా కంపెనీలను అనుమతించవలసి ఉన్నదని అభిప్రాయపడ్డారు. విభిన్న బీమా పాలసీలతోపాటు.. ఫైనాన్షియల్ ప్రొడక్టులను సైతం విక్రయించేందుకు వీలు కల్పిస్తే పంపిణీ వ్యయాలు తగ్గుతాయని తెలియజేశారు. అంతేకాకుండా పాలసీలు, ప్రొడక్టులు మరింత అందుబాటులోకి వస్తాయని అభిప్రాయపడ్డారు. జీఎస్టీ రేట్ల తగ్గింపు ద్వారా జీవిత బీమా మరింతమందికి అందుబాటులోకి వచ్చే వీలున్నట్లు రీన్యూబయ్ సహవ్యవస్థాపకుడు, సీఈవో బాలచందర్ శేఖర్ పేర్కొన్నారు. బీమా పాలసీల కొనుగోలులో పన్ను మినహాయింపులు ప్రకటించడం ద్వారా ప్రోత్సాహాన్నిందించాలని కోరారు. తద్వారా భద్రత, దీర్ఘకాలిక మూలధనానికి వీలుంటుందని తెలియజేశారు. అతితక్కువ విస్తృతిగల గ్రామీణ ప్రాంతాలలో బీమాకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ప్రకటిస్తే ప్రభావవంతంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. బీమా రంగంలో అత్యధిక సంస్కరణలకు వీలున్నట్లు ఫ్యూచర్ జనరాలి ఇండియా ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో అనుప్ రావు పేర్కొన్నారు. ఐఆర్డీఏఐ ఇప్పటికే ‘2047కల్లా అందరికీ బీమా’ పేరుతో భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు ప్రస్తావించారు. వెరసి బీమా కంపెనీలు అందుబాటులో కొత్తతరహా పాలసీలకు రూపకల్పన చేయవలసి ఉన్నట్లు తెలియజేశారు. దేశీయంగా దేశీయంగా 26 జీవిత బీమా కంపెనీలు, 25 సాధారణ బీమా సంస్థలకుతోడు స్టాండెలోన్ ఆరోగ్య బీమా సంస్థలు 8 కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. అంతేకాకుండా 2024 మార్చి31కల్లా.. 12 రీఇన్సూరెన్స్, విదేశీ రీఇన్సూరెన్స్ బ్రాంచీలు, రెండు ప్రత్యేక సంస్థలు రిజిస్టరై ఉన్నాయి.జీ20 దేశాలలో భారత్ భేష్ బీమా రంగంలో జీ 20 దేశాలలోకెల్లా భారత్ వేగవంత వృద్ధి సాధిస్తున్న మార్కెట్‌గా నిలుస్తున్నట్లు స్విస్ రే నివేదిక అంచనా వేసింది. 2025–29 మధ్య కాలంలో వార్షికంగా సగటున ప్రీమియంలో 7.3 శాతం పురోగతితో ముందు నిలవగలదని అభిప్రాయపడింది. రానున్న ఐదేళ్లలో నిజ ప్రాతిపదికన(ద్రవ్యోల్బణ ప్రభావాన్ని మినహాయించి) జీవిత బీమా, ఇతర బీమా కలిపి మొత్తం ప్రీమియం పరిమాణం సగటున ఏటా 7.3 శాతం పుంజుకోవచ్చని అంచనా వేసింది. జీవిత బీమా ప్రీమియంలు 6.9 శాతం, నాన్‌లైఫ్ ప్రీమియంలు 7.3 శాతం చొప్పున వృద్ధి సాధించలగలవని అభిప్రాయపడింది. కాగా.. ప్రభుత్వ రంగ సాధారణ బీమా కంపెనీలకు బడ్జెట్లో తిరిగి పెట్టుబడులు ప్రకటిస్తే సానుకూల పరిణామంకాగలదని ఇక్రా లిమిటెడ్ ఫైనాన్షియల్ రంగ రేటింగ్స్ విభాగం హెడ్ నేహా పారిఖ్ అంచనా వేశారు. వీటి బలహీన సాల్వెన్సీ పరిస్థితుల నేపథ్యంలో ఇది ప్రయోజనకరంగా నిలవగలదని పేర్కొన్నారు. బీమా రంగానికి ప్రోత్సాహకాలు ప్రకటిస్తే ప్రధానంగా తక్కువ విలువగల పాలసీలకు బూస్ట్ లభిస్తుందని తెలియజేశారు. ఇది బీమా విస్తృతికి దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. -
పనితీరు బాగుంటే ప్రోత్సాహకాలు
ప్రభుత్వ రంగ బ్యాంకులు సమర్థంగా పని చేసేందుకు వీలుగా కేంద్రం చర్యలు చేపడుతోంది. బ్యాంకులను సారథ్యం వహిస్తున్న సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు, హోల్‌టైమ్ డైరెక్టర్ల పనితీరును పరిగణనలోకి తీసుకుని ప్రత్యేకంగా ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ‘పర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్(పీఎల్ఐ)’లో సవరణలు చేస్తున్నట్లు ప్రకటించింది.పీఎల్ఐ అందుకోవాలంటే అర్హతలురిటర్న్ ఆన్ అసెట్స్ (ఆర్‌ఓఏ): బ్యాంకులకు పాజిటివ్ ఆర్‌ఓఏ ఉండాలి. మొత్తం బ్యాంకు మిగులుపై మెరుగైన రాబడులుండాలి.ఎన్పీఏ: నికర నిరర్థక ఆస్తులు (ఎన్పీఏ) 1.5 శాతం లేదా అంతకంటే తక్కువగా ఉండాలి. ఒకవేళ అంతకంటే ఎక్కువగా ఉంటే ఆర్థిక సంవత్సరంలో కనీసం 25 బేసిస్ పాయింట్లు ఎన్పీఏ తగ్గించాలి.కాస్ట్ టు ఇన్కమ్ రేషియో (సీఐఆర్): సీఐఆర్ 50% లేదా అంతకంటే తక్కువగా ఉండాలి. వచ్చే ఆదాయం, చేసే ఖర్చుల మధ్య నిష్పత్తిని అది సూచిస్తుంది. ఒకవేళ ఇది 50 శాతం కంటే ఎక్కువగా ఉంటే ఏడాదిలో మెరుగుదల చూపించాలి.ప్రోత్సాహకాలు.. ఇతర వివరాలునిబంధనల ప్రకారం బ్యాంకులు మెరుగ్గా పనితీరు కనబరిస్తే వారి సారథులకు పీఎల్ఐలో భాగంగా ఒకే విడతలో నగదు చెల్లిస్తారు. లేటరల్ నియామకాల్లో వచ్చిన వారు, డిప్యుటేషన్ పై ఉన్న అధికారులు సహా స్కేల్ 4, ఆపై అధికారులు ఈ పథకానికి అర్హులు. ఉద్యోగం నుంచి తొలగించిన వారు దీనికి అనర్హులు.ఇదీ చదవండి: రూ.25 వేలతో మూడేళ్లలో రూ.33 కోట్ల వ్యాపారం!2023-24 ఆర్థిక సంవత్సరం పనితీరును పరిగణనలోకి తీసుకుని ఈ పథకాన్ని అమల్లోకి తీసుకురాబోతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రతి ఆర్థిక సంవత్సరం మార్చి 31 నాటికి బ్యాంకు ఆడిట్ చేసిన గణాంకాల ఆధారంగా పనితీరును లెక్కించనున్నారు. -
ఖనిజాల వెలికితీతకు ప్రోత్సాహకాలు
భారత ప్రభుత్వం అరుదైన ఖనిజాలను వెలికితీసి అభివృద్ధి చేసేందుకు ప్రోత్సాహకాలు అందించాలని యోచిస్తోంది. ‘నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్’పై ఇటీవల జరిగిన బడ్జెట్ సెమినార్లో కేంద్ర గనుల శాఖ అదనపు కార్యదర్శి వీణా కుమారి మాట్లాడారు. అరుదైన ఖనిజాలను వెలికితీసే సంస్థలు రుణాలు పొందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు.ఈ సందర్భంగా వీణా మాట్లాడుతూ..‘లిథియం వంటి కీలకమైన ఖనిజాలను వెలికితీసి అభివృద్ధి చేయాలి. అందుకోసం ప్రభుత్వం సహకారం అందిస్తుంది. సంస్థలు రుణాలు పొందేలా ఏర్పాటు చేస్తాం. మరిన్ని ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. మైనింగ్‌కు అవసరమైన మౌలిక సదుపాయాల ఏర్పాటు కోసం సంస్థలకు కొన్ని రాయితీలు ఇవ్వాలనే చర్చలు సాగుతున్నాయి. గ్లోబల్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సహకారంపై భారత్ దృష్టి సారిస్తుంది. వెలికితీసిన ఖనిజాల తరలింపునకు గనుల మంత్రిత్వ శాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో కలిసి పని చేస్తుంది’ అని చెప్పారు.ఇదీ చదవండి: ప్రపంచంలోనే బలమైన బ్యాంకులుప్రపంచవ్యాప్తంగా క్రిటికల్ మినరల్స్ వాడకం పెరుగుతోంది. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఎలక్ట్రానిక్ పరికరాల్లో ఉపయోగించే ట్రాన్సిస్టర్లు, రెసిస్టర్లు, బ్యాటరీలు, మధర్‌బోర్డులు, ప్రాసెసర్లు, ఇతర వస్తువుల తయారీలో లిథియం వంటి అరుదైన ఖనిజాలను వాడుతున్నారు. వీటిని విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడం ఖర్చుతోపాటు, రవాణా క్లిష్టంగా మారుతుంది. ఇప్పటికే ప్రభుత్వం జమ్ముకశ్మీర్‌లో లిథియం నిల్వలు ఉన్నట్లు గుర్తించింది. అయితే వాటిని వెలికితీసి అభివృద్ధి చేయడం సవాలుగా మారింది. దేశవ్యాప్తంగా ఖనిజాల అన్వేషణ, మైనింగ్, శుద్ధీకరణ, ప్రాసెసింగ్, రీసైక్లింగ్‌లో మరిన్ని ఆవిష్కరణలు జరగాలని ప్రభుత్వం కోరుతోంది. -
ఇలాంటి బంపర్ ఆఫర్ ఇస్తే..బరువు తగ్గడం ఖాయం!
ప్రస్తుతం అందర్నీ బాగా వేదించే సమస్య అధిక బరువు. నేటి జీవన విధానం, శారీరక శ్రమ లేకుండా ఏసీ గదుల్లో కంప్యూటర్ల మందు గంటగంటలు కూర్చొని చేసే ఉద్యోగాలతో చిన్న, పెద్దా అంతా అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. ఒకవేళ వ్యాయామాలు చేద్దామనుకున్నా..కొన్ని రోజులు చేసి బద్ధకంతో స్కిప్ చేస్తూ పోతుండటంతో బరువులో పెద్ద మార్పు ఉండదు. దీంతో అధిక బరువు అన్నది భారమైన సమస్యగా మిగిలిపోతోంది చాలామందికి. తాజగా ఓ కంపెనీ తమ ఉద్యోగులకు ఓ మంచి బంపర్ ఆఫర్ ఇచ్చింది. తన ఉద్యోగులు ఆరోగ్యకరంగా మంచి సామర్థ్యంతో పనిచేయాలన్న లక్ష్యంతో ఈ ఆఫర్‌ని పెట్టిందట. ఆ ఆఫర్ వింటే ఇలాంటి కంపెనీలు కూడా ఉంటాయా?.. అని విస్తుపోతారు. ఎక్కడంటే..చైనాలో షెన్జెన్లోని ఇన్‌స్టా360 అనే టెక్ కంపెనీ తన ఉద్యోగులకు మంచి ఆరోగ్యంతో హాయిగా పనిచేసుకోండి అంటూ ఓ గొప్ప ఆఫర్ ఇచ్చింది. అదేంటంటే హాయిగా బరువు తగ్గండి దగ్గర దగ్గర కోటి రూపాయాల వరకు బోనస్‌లు పొందండి అని ఆఫర్ ఇచ్చింది. ఈ టెక్ కంపెనీ తన ఉద్యోగులు ఊబకాయ సమస్య నుంచి బయటపడేలా బరువు తగ్గించే బ్యూట్ క్యాంప్ అనే కార్యక్రమాన్ని ప్రారండించింది. ఈ కార్యక్రమంలో మూడు నెలల పాటు సాగుతుంది. ప్రతి సెషన్లో సుమారు 30 మంది ఉద్యోగుల వరకు నమోదు చేసుకునే వెసులుబాటు ఉంది. ఈ కార్యక్రమంలో ఊబకాయం ఉన్నవారికి తొలి ప్రాధాన్యత ఇస్తారు.ప్రతి సెషన్ మూడు గ్రూపులుగా విభజించి, వారంలో సముహం మొత్తం బరువు సగటు ఆధారంగా బోనస్‌లు అందిస్తుంది. ఈ ప్రోగ్రామ్ విజయాన్ని ఆయా సముహాలకే ఇస్తుంది. ఎందుకంటే గ్రూప్‌లో ఉన్నవాళ్లంతా తగ్గితేనే కదా డబ్బులు వస్తాయి. కాబట్టి బరువు తగ్గాలన్న సంకల్పం వారిలో అనుకోకుండా రావడమే గాక పక్కవారిని మోటీవేట్ చేస్తారు. దీంతో సమిష్టిగా బరువు తగ్గే ప్రయత్నం తోపాటు వారి మధ్య సత్సంబంధాలు బాగుంటాయి. ఈ కార్యక్రమాన్ని ఆ కంపెనీ 2023లో ప్రారంభించింది. ఆ కంపెనీ అనుకున్నట్లు తమ ఉద్యోగలు సత్వరమే బరువు తగ్గేలా చేయడంలో అద్భుతమైన ఫలితాలు కూడా సాధించింది. ఇలా ప్రస్తుతం ఆ కంపెనీలో సుమారు 150 మంది ఉద్యోగులు దాక ఏకంగా 800 కిలోలు బరువు తగ్గి దాదాపు రూ. 83 లక్షల దాక రివార్డులు సంపాదించుకున్నారు. ఈ మేరకు ఆ కంపెనీలో పనిచేసే లి అనే వ్యక్తి మాట్లాడుతూ..తాను ఈ కార్యక్రమంలో నవంబర్ 2023లో చేరానని చెప్పాడు. ఆ శిక్షణ కార్యక్రమంలో రన్నింగ్, బాస్కెట్‌బాల్, స్విమ్మింగ్ వంటివి చేసి సుమారు 17.5 కిలోల మేర బరువు తగ్గి రూ. 80 వేలు బోనస్‌గా పొందానని తెలిపాడు. ఈ ప్రోగ్రాం తన ఆరోగ్యాన్ని, ఆర్థికస్థితిని మెరుగుపరిచిందని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు ఆ కంపెనీలో వెంటనే జాయిన్ అవుతానని ఒకరూ, మరోకరూ తాను ఏకంగా 10 కి.మీ వరుకు పరుగెత్తగలనని, తనలాంటి సిబ్బందితో తొందరగా ఆ కంపెనీ దివాలా తీసేస్తుందని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. (చదవండి: మూత పెట్టకుండా వండుతున్నారా? ఐసీఎంఆర్ స్ట్రాంగ్ వార్నింగ్) -
సెమీకండక్టర్స్ తయారీలోకి జోహో
న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ సేవల సంస్థ జోహో తాజాగా సెమీకండక్టర్ల తయారీలోకి ఎంట్రీ ఇవ్వనుంది. దీనిపై 700 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టే యోచనలో సంస్థ ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి కంపెనీ ప్రోత్సాహకాలు కోరుతోందని పేర్కొన్నాయి. ప్రస్తుతం జోహో ప్రతిపాదనను ఐటీ శాఖ కమిటీ పరిశీలిస్తోందని, వ్యాపార ప్రణాళికలపై మరింత స్పష్టతనివ్వాలని కంపెనీని కోరిందని వివరించాయి. జోహో ఇప్పటికే టెక్నాలజీ భాగస్వామిని కూడా ఎంచుకున్నట్లు తెలిపాయి. 1996లో ఏర్పాటైన జోహో .. గత ఆర్థిక సంవత్సరం 1 బిలియన్ డాలర్లకు పైగా ఆదాయం నమోదు చేసింది. తమిళనాడులో చిప్ డిజైన్ తయారీ ప్రాజెక్టు ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో శ్రీధర్ వెంబు మార్చిలో వెల్లడించిన నేపథ్యంలో తాజా వార్తలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. దేశీయంగా 15 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో సెమీకండక్టర్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు టాటా గ్రూప్, సీజీ పవర్ తదితర సంస్థలకు కేంద్రం ఫిబ్రవరిలో గ్రీన్ సిగ్నల్ ఇచి్చన సంగతి తెలిసిందే. భారత్‌లో సెమీకండక్టర్ల మార్కెట్ 2026 నాటికి 63 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా. -
కొత్త ఈవీ పాలసీ
న్యూఢిల్లీ: టెస్లా వంటి అంతర్జాతీయ విద్యుత్ వాహనాల దిగ్గజాల నుంచి పెట్టుబడులను ఆకర్షించే దిశగా కేంద్ర ప్రభుత్వం కొత్త ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) పాలసీకి ఆమోదముద్ర వేసింది. దీని ప్రకారం దేశీయంగా తయారీ యూనిట్లపై కనీసం 500 మిలియన్ డాలర్లు (రూ. 4,150 కోట్లు) ఇన్వెస్ట్ చేసే సంస్థలకు సుంకాలపరమైన ప్రోత్సాహకాలు ఇవ్వనుంది. అధికారిక ప్రకటన ప్రకారం ఈవీ ప్యాసింజర్ కార్లను ఏర్పాటు చేసే కంపెనీలు 35,000 డాలర్లకు పైబడి విలువ చేసే వాహనాలపై 15 శాతం సుంకాలతో పరిమిత సంఖ్యలో కార్లను దిగుమతి చేసుకునేందుకు వీలుంటుంది. ప్రభుత్వం అనుమతి లేఖ ఇచి్చన తేదీ నుంచి అయిదేళ్ల వ్యవధికి ఇది వర్తిస్తుంది. ప్రస్తుతం పూర్తి స్థాయి కారును (సీబీయూ)ని దిగుమతి చేసుకుంటే.. ఇంజిన్ పరిమాణం, ఖరీదు, బీమా, రవాణా (సీఐఎఫ్) మొదలైనవి కలిపి విలువను బట్టి 70 శాతం నుంచి 100 శాతం దాకా కస్టమ్స్ సుంకాలు ఉంటున్నాయి. దీనికి 40,000 డాలర్ల విలువను ప్రామాణికంగా పరిగణిస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి భారత్‌ను గమ్యస్థానంగా మార్చేందుకు, పేరొందిన అంతర్జాతీయ ఈవీల తయారీ సంస్థల నుంచి పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈ పాలసీ ఉపయోగపడగలదని కేంద్రం పేర్కొంది. భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ పెరుగుతుండటం, అమెరికాకు చెందిన టెస్లా, వియత్నాం సంస్థ విన్‌ఫాస్ట్ మొదలైనవి ఇక్కడ ఇన్వెస్ట్ చేయడంపై ఆసక్తిగా ఉన్న నేపథ్యంలో కొత్త విధానం ప్రాధాన్యం సంతరించుకుంది. స్కీముకి సంబంధించి మరిన్ని వివరాలు.. ► ఆమోదం పొందిన దరఖాస్తుదారులు ఎలక్ట్రిక్ 4 వీలర్ల ఉత్పత్తి కోసం భారత్‌లో కనీసం రూ. 4,150 కోట్ల (500 మిలియన్ డాలర్ల) పెట్టుబడితో తయారీ ప్లాంటు నెలకొల్పాలి. ► కేంద్ర భారీ పరిశ్రమల శాఖ అనుమతి మంజూరు చేసిన తేదీ నుంచి 3 సంవత్సరాల్లోగా ప్లాంటును ఏర్పాటు చేయాలి. ప్రాథమికంగా దేశీయంగా కనీసం 25 శాతం విలువను (డీవీఏ) జోడించాలి. అయిదేళ్లలో దీన్ని 50 శాతానికి పెంచాలి. డీవీఏని 50 శాతానికి పెంచి, కనీసం రూ. 4,150 కోట్లు ఇన్వెస్ట్ చేయడం పూర్తయిన తర్వాతే బ్యాంక్ గ్యారంటీలను ప్రభుత్వం వాపసు చేస్తుంది. ► తక్కువ సుంకాలతో గరిష్టంగా ఏడాదికి 8,000 ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్లను దిగుమతి చేసుకోవచ్చు. వార్షిక పరిమితి కన్నా తక్కువగా దిగుమతి చేసుకుంటే మిగతాది తర్వాత ఏడాదికి క్యారీఫార్వార్డ్ చేసుకునేందుకు వీలుంటుంది. ► స్కీమును నోటిఫై చేసిన సుమారు 120 రోజుల్లో దరఖాస్తులను ఆహా్వనిస్తారు. కంపెనీలు దరఖాస్తు చేసుకున్న 120 రోజుల్లోగా వాటిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. -
పాత వాహనాలను ఈవీలుగా మార్చేందుకు ప్రోత్సాహకాలు?
ముంబై: పాత వాహనాలను తుక్కు కింద వేసే బదులు వాటిని ఎలక్ట్రిక్ వాహనాలుగా రెట్రోఫిట్ చేసే ప్రయత్నాలకు తోడ్పాటునివ్వడం లేదా ప్రోత్సాహకాలు ఇవ్వడాన్ని కేంద్రం పరిశీలించే అవకాశముందని మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ సంస్థ ప్రైమస్ పార్ట్నర్స్, ఈటీబీ (యూరోపియన్ బిజినెస్ అండ్ టెక్నాలజీ సెంటర్) ఒక నివేదికలో పేర్కొన్నాయి. సాంప్రదాయ ఇంజిన్ల ఆధారిత వాహనాలను ఎలక్ట్రిక్‌గా మార్చడంలో పలు సవాళ్లు ఎదురు కావచ్చని తెలిపాయి. కానీ ప్రభుత్వ, పరిశ్రమ, ప్రజల సమన్వయంతో వీటిని సమర్ధంగా అధిగమించడానికి వీలుంటుందని వివరించాయి. కాలుష్యకారకంగా మారే 15 ఏళ్లు పైబడిన వాణిజ్య వాహనాలు, 20 ఏళ్లు పైబడిన ప్యాసింజర్ వాహనాల వినియోగాన్ని తగ్గించేందుకు రీ–రిజిస్ట్రేషన్ ఫీజు భారీగా పెంచేసిన సంగతి తెలిసిందే. ‘పాత వాహనాలను తుక్కు కింద మార్చే బదులు విద్యుత్‌తో నడిచేలా వాటిని రెట్రోఫిట్ చేయడానికి ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వొచ్చు. తద్వారా ప్రస్తుత వాహనాల జీవితకాలం కూడా పెరుగుతుంది‘ అని ప్రైమస్ పార్ట్నర్స్, ఈటీబీ సంయుక్త నివేదికలో తెలిపాయి. -
పీఎల్ఐ కింద రూ.4,415 కోట్ల ప్రోత్సాహకాలు
న్యూఢిల్లీ: ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ) కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్ నాటికి, ఎనిమిది రంగాలకు రూ.4,415 కోట్ల ప్రోత్సాహకాలను కేంద్ర సర్కారు మంజూరు చేసింది. ఈ విషయాన్ని వాణిజ్య శాఖ విభాగం డీపీఐఐటీ అదనపు కార్యదర్శి రాజీవ్ సింగ్ ఠాకూర్ వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరికి రూ.11,000 కోట్లను మంజూరు చేయాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నట్టు ప్రకటించారు. కేవలం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వరకే చూస్తే అక్టోబర్ నాటికి జారీ చేసిన మొత్తం రూ.1,515 కోట్లుగా ఉన్నట్టు, 2022–23లో రూ.2,900 కోట్లు మంజూరు చేసినట్టు వివరించారు. పెద్ద స్థాయి ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీ, ఐటీ హార్డ్‌వేర్, బల్క్ డ్రగ్స్, వైద్య పరికరాలు, ఫార్మా, టెలికం, ఫుడ్ ప్రాసెసింగ్, డ్రోన్స్ రంగాలకు ఈ ప్రోత్సాహకాలను అందించినట్టు తెలిపారు. శామ్సంగ్ కంపెనీకి సంబంధించి ప్రోత్సాహకాల క్లెయిమ్‌లలో ఒక కేసు పరిష్కారమైనట్టు చెప్పారు. 2021లో కేంద్ర సర్కారు 14 రంగాలకు పీఎల్ఐ పథకాల కింద ప్రోత్సాహకాలను ప్రకటించడం గమనార్హం. టెలికం, వైట్ గూడ్స్, టెక్స్టైల్స్, వైద్య పరికరాల తయారీ, ఆటోమొబైల్స్, స్పెషాలిటీ స్టీల్, ఆహారోత్పత్తులు, అధిక సామర్థ్యం కలిగిన సోలార్ పీవీ మాడ్యూల్స్, అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్ బ్యాటరీ, డ్రోన్లు, ఫార్మా తదితర రంగాలకు రూ.1.97 లక్షల కోట్ల ప్రోత్సాహకాలను ప్రకటించింది. వీటికి సంబంధించి దేశీ తయారీని ప్రోత్సహించాలన్నది కేంద్ర సర్కారు లక్ష్యంగా ఉంది. పీఎల్ఐ కింద ప్రోత్సాహకాల పంపిణీ అన్నది ఆయా శాఖల బాధ్యతగా ఠాకూర్ చెప్పారు. ప్రాజెక్టు పర్యవేక్షక ఏజెన్సీలు (పీఎంఏలు), కంపెనీల మధ్య సరైన సమాచారం లేకపోవడం వల్ల సమయం వృధా అవుతున్న సందర్భాలున్నట్టు తెలిపారు. దీంతో దరఖాస్తుల మదింపు ప్రక్రియకు పట్టే సమయాన్ని తగ్గించేందుకు వీలుగా ప్రామాణిక విధానాన్ని రూపొందించుకోవాలని ఆదేశించినట్టు వెల్లడించారు. రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు ఇప్పటి వరకు పీఎల్ఐ కింద 14 రంగాల్లోని కంపెనీల నుంచి 746 దరఖాస్తులు వచ్చాయని, ఇవి రూ.3 లక్షల కోట్లను పెట్టుబడిగా పెట్టనున్నట్టు రాజీవ్‌సింగ్ ఠాకూర్ తెలిపారు. 2023 నవంబర్ నాటికి రూ.1.03 లక్షల కోట్ల పెట్టుబడులు నమోదైనట్టు చెప్పారు. వీటి ద్వారా రూ.8.61 లక్షల కోట్ల అమ్మకాలు, 6.78 లక్షల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. ఫార్మా, టెలికం తదితర రంగాల్లో ప్రోత్సాహకాలను అందుకునే వాటిల్లో 176 ఎంఎస్ఎంఈలు కూడా ఉన్నట్టు పేర్కొన్నారు. పీఎల్ఐ ప్రోత్సాహకాల మద్దతుతో రూ.3.2 లక్షల కోట్ల ఎగుమతులు నమోదైనట్టు ఠాకూర్ తెలిపారు. ఎగుమతుల్లో ఎలక్ట్రానిక్స్, ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్, టెలికం రంగాల భాగస్వామ్యం ఎక్కువగా ఉందన్నారు. -
ఓటర్లను ‘ఉచిత’రీతినే గౌరవించుకుందాం
విదేశాలవాళ్లందరూ ఫ్రీ వల్చర్స్, మన దంతా ఫైన్ అండ్ రిఫైన్డ్ కల్చర్ అని గొప్పలు పోతుంటాం గానీ... నిజానికి మనదే నిజమైన ‘ఫ్రీ’ సంస్కృతి. ఇది వినగానే ఫెడేల్మంటూ గుండెలవీ బాదుకోనక్కర్లేదు. స్వేచ్ఛా, స్వాతంత్య్రాల్ని హాయిగా అనుభవించే ఫ్రీడమ్ కాదిది. ‘ఫ్రీగా వస్తే ఫినాయిలైనా’ అనే అద్భు త సంస్కృతి మనది. ఎన్నికలన్నప్పుడల్లా ‘అయ్యో... పింఛన్లంటూ, ఫ్రీలంటూ ఎడాపెడా పంచేస్తున్నారూ, దేశాన్ని వంచిస్తున్నారం’టూ శోకాలు పెడుతుంటారుగానీ అది సరి కాదు. ఉచితమనేది మన సంస్కృతిలో భాగమెలాగో గుర్తెరిగి... ఉచితరీతిన నడవాలి. మాంఛి హోటలుకెళ్లి డాబుగా బిర్యానీ ఏదో ఆర్డరిస్తామా! వాడిచ్చిన ‘నీంబూ, ప్యాజ్’ కాకుండా సిగ్గుపడకుండా ఎగస్ట్రా ‘ఫ్రీ’లడిగి మళ్లీ మళ్లీ తీసుకుంటుంటాం. అంతెందుకు... మొన్నెప్పుడో పంజాగుట్టలోని ఓ హోటల్లో ఫ్రీ రైతా (పెరుగు) అడిగినందుకు పంజా విసిరారు కొందరు బేరర్స్. బహుశా... ఉచితాలవీ ఇచ్చేసి ప్రజల్ని సోమరుల్ని చేయడం నచ్చని నికార్సైన కష్టజీవుల బ్యాచీ తాలూకు క్యాపిటలిస్టిక్, కార్పొరేటిక్, కన్సర్వేటిక్ (ఫ్లాగ్)‘బేరర్స్’ కాబోలు వాళ్లంతా. పాపం... అమాయకుడైన ఆ వినియోగదారుడు చచ్చిపోయి, ‘ఫ్రీ’ల కోసం ప్రాణాలర్పిం చిన త్యాగధనుల లిస్టులోకి చేరిపోయాడు. నిజానికి అందరి సానుభూతికీ ఎంతో అర్హుడతడు. ఎందుకంటే... హోటల్వాడు ఎంత ఫ్రీగా ఇచ్చి నా, లెక్కలుగట్టి చూస్తే... మొత్తం ఆ ఫ్రీ ఉల్లిముక్కలూ, నిమ్మచెక్కలూ, రైతా విలువ సదరు కస్టమరిచ్చే టిప్పు–డబ్బు కంటే చాలా చాలా తక్కువ. అదే లెక్క సోంపుకీ వర్తిస్తుంది. ఎంతగా ‘ఫిల్దీ రిచ్చు’ ఆసామైనా, ఎంతగా డబ్బున్న మొనగాడైనా... ఆ ఫ్రీ సోంపును ఆబగా, ఆత్రంగా తినేవాళ్లే అందరూ! కొందరైతే కక్కుర్తిగా కర్చిఫ్లోనో, టిష్యూలోనో పొట్లం కట్టుకుపోతారు. మోజంజాహి మార్కెట్టయినా, మోండా మార్కెట్టయినా, చింతలబస్తీ, చిల్కల్గూడా, చింతల్కుంటా మరెక్కడైనా... టమాటాలూ, పచ్చి మిరపకాయా, ఉల్లిగడ్డలూ, కూరగాయలూ కొన్నాక, కొసరడగని ఇల్లాలంటూ ఉంటుందా? ఫ్రీగా వస్తే సంతోషించని గృహిణులెవరైనా ఉంటారా? కేవలం మన నేటివ్స్యే కాదు, ఇక్కడే ఓటేసే ఉత్తర భారతీయులు సైతం ‘తర్కారీ కే సాథ్... ఫ్రీ ధనియా భీ’ అంటూ కూరగాయల్తో పాటూ కొసరి కొసరి కొత్తిమీర అడిగి మరీ తీసుకుంటుంటారు. అడక్కపోయినా వాళ్ళయినా ఇచ్చిపోతుంటారు. ఇన్ని ఉదాహరణల తర్వాత చెప్పేదొక్కటే... ‘ఫ్రీ’ కాన్సెప్టు ఇంతగా రక్తంలోకి ఇంకిపోయాక, ‘ఉచితాలం’టూ లేకుండా ఓటేద్దామా? ఓటేస్తామా? చివరగా ఒక్కమాట... సాక్షాత్తూ దేశ పాలకుల సొంత రాష్ట్రానికి చెందిన ‘సంజయ్ ఎఝావా’ అనే సామాజిక కార్యకర్తగారు... ఓ ‘ఆర్టీఐ’ అభ్యర్థన ద్వారా ఆర్బీఐని అడిగినప్పుడు వచ్చిన సమాధానం ప్రకారం... ఏలినవారి ఎన్డీయే ప్రభుత్వం కార్పొరేట్లకు ‘రైటాఫ్’ చేసిన మొత్తం రూ. 25 లక్షల కోట్లు! బ్యాంకు సొమ్ములెగ్గొట్టేసి సోగ్గా పారిపోయినవారి సొమ్ములకివి అదనం. కార్పొరేట్ ఇన్సెంటివ్లనీ ఇతర ప్రోత్సాహకాలనేవి మరో ఎక్స్ట్రా. ఇవన్నీ కలుపుకుంటే సంక్షేమానికి ఇచ్చేది... ఆ్రస్టిచ్గుడ్డు పక్కన ఆవగుండంత! -
రూ.13,000 కోట్ల పీఎల్ఐ ప్రోత్సాహకాలు
న్యూఢిల్లీ: ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక పథకం కింద అర్హత కలిగిన సంస్థలకు కేంద్ర ప్రభుత్వం రూ.13,000 కోట్లను మంజూరు చేయనుంది. ఇక మీదట పీఎల్ఐ కింద ఏటా ఇచ్చే ప్రోత్సాహకాల మొత్తం గణనీయంగా ఉంటుందని పారిశ్రామిక ప్రోత్సాహక, అంతర్గత వాణిజ్య విభాగం కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ తెలిపారు. ఈ ఏడాది ఇలా విడుదల చేసే మొత్తం రూ.13వేల కోట్లుగా ఉండొచ్చన్నారు. పీఎల్ఐ కింద కేంద్ర సర్కారు 14 రంగాలకు ప్రోత్సహకాలను ఇప్పటి వరకు ప్రకటించగా, మరిన్ని రంగాలు సైతం ప్రోత్సాహకాల కోసం డిమాండ్ చేస్తున్నాయి. టెలీకమ్యూనికేషన్స్, వైట్ గూడ్స్, టెక్స్టైల్స్, వైద్య ఉపకరణాల తయారీ, ఆటోమొబైల్స్, స్పెషాలిటీ స్టీల్, ఫుడ్ ఉత్పత్తులు, అధిక సామర్థ్యం కలిగిన సోలార్ పీవీ మాడ్యూల్స్, అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్ బ్యాటరీ, డ్రోన్లు, ఫార్మా రంగాలకు ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.1.97 లక్షల కోట్ల ప్రోత్సాహకాలను ప్రకటించింది. అయితే వీటిల్లో సోలార్ పీవీ మాడ్యూళ్లు, అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్ (ఏసీసీ) బ్యాటరీలు, టెక్స్టైల్ ఉత్పత్తులు, స్పెషాలిటీ స్టీల్ రంగాలకు పీఎల్ఐ కింద ప్రోత్సాహకాల విడుదల మొదలు కావాల్సి ఉంది. దేశీయ తయారీని పెంచడం, దిగుమతులు తగ్గించడం, అంతర్జాతీయంగా ఎగుమతుల్లో పోటీ పడడం అనే లక్ష్యాలతో కేంద్ర సర్కారు 2021లో పీఎల్ఐ పథకాన్ని తీసుకురావడం గమనార్హం. 4 లక్షల మందికి ఉపాధి.. పర్యావరణ అనుమతుల్లో జాప్యం, చైనా నుంచి నిపుణుల సాయం పొందేందుకు వీసా మంజూరులో సమస్యలను భాగస్వాములు ప్రస్తావించారని, వాటి పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తున్నట్టు రాజేష్ కుమార్ సింగ్ తెలిపారు. పీఎల్ఐ కింద ఇప్పటికే రూ.78వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, రూ.6 లక్షల కోట్ల అమ్మకాలు నమోదయ్యాయని వెల్లడించారు. 4 లక్షల మందికి ఉపాధి అవకాశాలు వచి్చనట్టు తెలిపారు. ఆట»ొమ్మలు, ఇతర రంగాలకు పీఎల్ఐ అభ్యర్థనలు అంతర్గత మంత్రిత్వ శాఖల పరిశీలనలో ఉన్నట్టు సింగ్ పేర్కొన్నారు. ఇటీవలే ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లు, కంప్యూటర్ల దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు అమలు చేయగా, తర్వాత అక్టోబర్ 31 వరకు వాయిదా వేయడం తెలిసిందే. దీనిపై సింగ్ మాట్లాడుతూ.. ఇది స్వేచ్ఛాయుత లైసెన్సింగ్ విధానమని ప్రభుత్వం స్పష్టం చేసిందన్నారు. దీని పట్ల పెద్దగా ఆందోళన అవసరం లేదన్నారు. -
రీసైక్లింగ్ పరిశ్రమల అభివృద్ధిపై కేంద్రం దృష్టి
కోల్‌కతా: తయారీ సంస్థలకు మరిన్ని బాధ్యతలు కట్టబెట్టడం (ఈపీఆర్) వంటి విధానపరమైన చర్యల ద్వారా రీసైక్లింగ్‌ను మరింతగా ప్రోత్సహించాలని కేంద్రం యోచిస్తోంది. తద్వారా వ్యర్ధాలను కనిష్ట స్థాయికి తగ్గించవచ్చని, పునర్వినియోగాన్ని పెంపొందించవచ్చని భావిస్తోంది. కేంద్ర గనుల శాఖ సంయుక్త కార్యదర్శి ఉపేంద్ర సి జోషి ఈ విషయాలు తెలిపారు. ఈపీఆర్ విధానం కింద వాడేసిన ఉత్పత్తుల సేకరణకు నిధులు సమకూర్చడం, రీసైక్లింగ్ ఖర్చులను భరించడం తద్వారా పర్యావరణంపై ప్రభావాలను తగ్గించడం వంటి వాటికి తయారీ సంస్థలు బాధ్యత వహించాల్సి ఉంటుంది. దీనివల్ల రీసైక్లింగ్ పరిశ్రమకు తోడ్పాటు లభిస్తుంది. అధునాతన సాంకేతికత తోడ్పాటుతో వనరుల వినియోగ సామర్థ్యాలను పెంచుకునేలా పరిశ్రమను అభివృద్ధి చేయాలని కేంద్రం భావిస్తోందని జోషి చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఈపీఆర్ వంటి విధానపరమైన చర్యలను పరిశీలిస్తోందని వివరించారు. మరోవైపు మెటల్ స్క్రాప్‌పై ప్రస్తుతం 18 శాతంగా ఉన్న జీఎస్టీని 5 శాతానికి తగ్గించాలని మెటీరియల్ రీసైక్లింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎంఆర్‌ఏఐ) సీనియర్ వైస్–ప్రెసిడెంట్ ధవళ్ షా కేంద్రాన్ని కోరారు. 2030 నాటికి 30 కోట్ల టన్నుల ఉక్కు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించేందుకు రీసైక్లింగ్ రంగంలో పెట్టుబడులు వచ్చేలా ఆకర్షణీయమైన పాలసీలను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. దేశీయంగా ఉక్కు ఉత్పత్తిలో రీసైకిల్ చేసిన స్టీల్ వాటా 22 శాతంగా ఉంటుంది. -
పీఎల్ఐని సులభతరం చేయాలి
న్యూఢిల్లీ: ఉత్పత్తి అనుసంధానిత పథకం (పీఎల్ఐ) కింద కంపెనీలకు ఇచ్చే ద్రవ్యపరమైన ప్రోత్సాహకాల విషయంలో అర్హత నిబంధనలను సరళీకరించాలని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ అనే పరిశోధనా సంస్థ (జీటీఆర్ఐ) కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వం ఈ పథకం కింద ప్రకటించిన ప్రోత్సాహకాలు దుర్వినియోగం కాకుండా రక్షణ కూడా ఉండాల్సిన అవసరాన్ని ప్రస్తావించింది. కేంద్ర సర్కారు భారత్‌లో తయారీని పెంచి, దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించి, స్వావలంబన సాధించేందుకు పీఎల్ఐ పథకాన్ని తీసుకురావడం తెలిసిందే. దీని కింద 14 రంగాల్లో అదనపు ఉత్పత్తిని సాధించేందుకు రూ.1.97 లక్షల కోట్ల ద్రవ్య ప్రోత్సాహకలను ప్రకటించడం గమనార్హం. ఈ క్రమంలో జీటీఆర్ఐ చేసిన సూచనలకు ప్రాధాన్యం ఏర్పడింది. కంపెనీలు కాంట్రాక్టు తయారీదారులు లేదా గ్రూపు సంస్థల మద్దతుతో ఉత్పత్తి గణాంకాల్లో మోసాలకు పాల్పడే అవకాశం లేకపోలేదని జీటీఆర్ఐ హెచ్చరించింది. ఇందుకు 2003–06 మధ్య టార్గెట్ ప్లస్ పథకం కింద జరిగిన దుర్వినియోగాన్ని ప్రస్తావించింది. ‘‘పీఎల్ఐ పథకాన్ని అమలు చేసే ప్రభుత్వ విభాగాలు గతంలో టార్గెట్ ప్లస్ పథకం దుర్వినియోగాన్ని అధ్యయనం చేసి, అప్రమత్తంగా ఉండాలి. త్రైమాసికం వారీగా ప్రోత్సాహకాలను విడుదల చేసే సమయంలో ఈ రిస్క్ మరింత పెరుగుతుంది’’అని జీటీఆర్ఐ సహ వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ సూచించారు. విడిభాగాల తయారీని ప్రోత్సహించాలి.. నిర్ధేశిత పెట్టుబడులు, ఉత్పత్తి, అమ్మకాలు, స్థానిక విడిభాగాలు/ముడి పదార్థాల వినియోగం తదితర అర్హత నిబంధనల్లో అన్నింటికీ తయారీ దారులు అర్హత పొందలేకపోవచ్చని జీటీఆర్ఐ తన నివేదికలో ప్రస్తావించింది. ‘‘చాలా కేసుల్లో ఉత్పత్తి అసలు విలువ లేదా ఇన్వాయిస్ వ్యాల్యూని తెలుసుకోవడం కష్టం. నిబంధనలు తక్కువగా, పారదర్శకంగా ఉండాలి’’అని పేర్కొంది. తుది ఉత్పత్తికి బదులు విడిభాగాల స్థానిక ఉత్పత్తికి ప్రోత్సాహకాలు ఇవ్వడం మెరుగైన విధానంగా అభిప్రాయపడింది. ఐరోపా యూనియన్ విధించిన కార్బన్ బోర్డర్ పన్నును త్వరలో మరిన్ని దేశాలు కూడా అనుసరించొచ్చని, ఈ అనుభవాల నేపథ్యంలో భారత్ శుద్ధ ఇంధన టెక్నాలజీలపై ఇన్వెస్ట్ చేయాలని సూచించింది. -
టెన్త్ టాపర్లకు సీఎం వైఎస్ జగన్ బొనాంజా..
సాక్షి, అమరావతి: టెన్త్ టాపర్లకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బొనాంజా ప్రకటించారు. నియోజకవర్గాల్లోని టాపర్లకూ ప్రోత్సాహకాలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. గవర్నమెంటు స్కూళ్లలో టెన్త్‌లో టాప్ విద్యార్థులకు ప్రోత్సాహకాలను విస్తరించనున్నారు. రాష్ట్ర, జిల్లాస్థాయి టాపర్లకే కాకుండా నియోజకవర్గాల వారీ టాపర్లరూ ప్రోత్సాహకాలు ఇవ్వనున్నారు. నియోజకవర్గంలో 1,2,3 స్థానాల్లోని విద్యార్థులకు వరుసగా రూ.15వేలు, రూ.10వేలు, రూ.5వేలు చొప్పున నగదు ప్రోత్సాహకాలు అందించనున్నారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విప్లవాత్మక సంస్కరణలతో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో విద్యా ప్రమాణాలు పెరిగాయి. టెన్త్, ఇంటర్ ఫలితాలే అందుకు నిదర్శనం. ఈ విద్యా సంవత్సరం పదో తరగతి, ఇంటర్ ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులను సన్మానించనున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించిన సంగతి తెలిసిందే. చదవండి: గేరు మార్చి.. స్పీడ్ పెంచి.. సీఎం జగన్ బలం అదే.. ఇదీ లెక్క..! నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయిలో తొలి మూడు స్థానాల్లో నిలిచిన ప్రభుత్వ విద్యాసంస్థల విద్యార్థులను అవార్డులు, నగదు పురస్కారాలతో సత్కరించనున్నారు. జడ్పీ, ప్రభుత్వ, మున్సిపల్, ఏపీ మోడల్, బీసీ రెసిడెన్షియల్, ఏపీ రెసిడెన్షియల్, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, జీటీడబ్ల్యూ ఆశ్రమ స్కూళ్లు, కేజీబీవీ విద్యార్థులకు ఈ అవకాశం కల్పించినట్లు తెలిపారు. మార్కుల ఆధారంగా టెన్త్, ఇంటర్లో 2,831 మంది విద్యార్థులను సత్కరించనున్నట్లు మంత్రి చెప్పారు. -
జనాభాను పెంచేందుకు సిక్కింలో ప్రభుత్వోద్యోగినులకు వరాలు
గాంగ్టాక్: సిక్కిం రాష్ట్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు సీఎం ప్రేమ్ సింగ్ తమంగ్ పలు ప్రోత్సాహకాలను ప్రకటించారు. వారి చిన్నారులకు ఇంటి వద్దే సహాయకులను ఉచితంగా ఏర్పాటు చేస్తామని తెలిపారు. చిన్నారుల బాధ్యత తీసుకునే ఆయాలకు నెలకు రూ.10 వేలను ప్రభుత్వమే ఇస్తుందన్నారు. 40 ఏళ్లు, ఆపైన వయస్సుండే మహిళలకు చిన్నారులను ఏడాది వరకు చూసుకునే బాధ్యతలను అప్పగిస్తామన్నారు. మహిళా ఉద్యోగుల ప్రసూతి సెలవులను 365 రోజులకు, తండ్రులకైతే నెల రోజులు సెలవులు ఇస్తామని చెప్పారు. రెండో బిడ్డను పోషించేందుకు ఒక ఇంక్రిమెంట్, మూడో బిడ్డకైతే రెండు ఇంక్రిమెంట్లు ఇస్తామన్నారు. తరిగిపోతున్న జననాల రేటు చాలా ఆందోళన కలిగించే అంశమన్నారు. క్షీణిస్తున్న స్థానిక జాతుల జనాభాను పెంచేందుకు ప్రభుత్వం సాధ్యమైన అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. తల్లులవ్వాలనుకునే ఉద్యోగినులు పుట్టబోయే తమ సంతానం బాగోగుల గురించి ఆందోళన చెందరాదనే ఈ నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు. జననాల రేటు పెంచేందుకు సాధారణ ప్రజానీకానికి కూడా ప్రోత్సహకాలు ప్రకటించనున్నట్లు ఆయన వెల్లడించారు. సంతానం కలగడంలో ఇబ్బందులు ఎదురయ్యే వారి కోసం ఐవీఎఫ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ కేంద్రాల్లో చికిత్స తీసుకునే వారికి రూ. 3 లక్షలు గ్రాంటుగా అందజేస్తామన్నారు. సిక్కింలోని 7 లక్షల లోపు జనాభాలో 80 శాతం మంది స్థానిక తెగల ప్రజలే. సంతానోత్పత్తి రేటు 1.1%గా ఉంది. -
రిటర్న్ టు ఆఫీస్: టీసీఎస్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్
సాక్షి,ముంబై: దేశీయ అతిపెద్ద ఐటీ దిగ్గజం టీసీఎస్ ఆఫీసులకు వచ్చే ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. కోవిడ్ తరువాత క్రమంగా వర్క్ ఫ్రం హోం విధానానికి స్వస్తి పలికిన మేజర్ కంపెనీలన్నీ ఉద్యోగులకు ఆఫీసులకు రప్పించేందుకు నానా కష్టాలు పడుతున్నాయి.ఆ ఫీసు నుండే పని చేసేలా ఉద్యోగులనుప్రేరేపించేందుకు వారు కొత్త మార్గాలను ప్రయత్నిస్తున్నాయనిహెచ్‌ఆర్ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు ఈ క్రమంలో టీసీఎస్ ఉద్యోగులను ఆఫీసు నుంచి పనిచేసేలా చేసేందుకు ఈ ప్రోత్సాహకాలను అందిస్తోంది. ఉద్యోగులు ఆఫీసు నుండి పనిచేసే రోజులకు పాయింట్లను చేర్చనుంది. అప్రైజల్ సిస్టమ్‌లో వర్క్ ఫ్రమ్ ఆఫీస్ పాయింట్లను అందించనుంది. ఈ మేరకు కంపెనీలోని మేనేజర్లు, టీమ్ లీడ్‌లకు ఈమెయిల్ పంపించినట్టు తెలుస్తోంది. టీమ్ మెంబర్లందరికీ ఈ క్రింది RTO (రిటర్న్ టు ఆఫీస్)కు వచ్చేలా చూడాలని కోరింది. తమ టీం సభ్యులు వారానికి సగటున మూడు రోజులు ఆఫీసులకు రావాలని కోరుతోంది. అయితే తాజా పరిణామంపై హెచ్ఆర్ నిపుణులు విభిన్నంగా స్పందించారు. ఒక ఉద్యోగి పనితీరు వారు ఆఫీసు నుండి పని చేస్తున్నా లేదా రిమోట్‌గా పని చేస్తున్నారా అనే దానితో సంబంధం లేకుండా వారు ఉత్పత్తి చేసే ఫలితాలపై మాత్రమే నిర్దారించుకోవాలని, ఆఫీసు నుండి పని చేసే ఉద్యోగులు ఉండవచ్చు కానీ వారి లక్ష్యాలను చేరుకోలేరు, కేవలం ఆఫీసుల నుండి పని చేసినవారికి మదింపు పాయింట్లు ఇవ్వడం అనేది వారి పనితీరును మెరుగు పర్చడంలో సహాయ పడదని సీఐఇఎల్ హెచ్ఆర్ సర్వీసెస్ సీఎండీ ఆదిత్య నారాయణ్ మిశ్రా పేర్కొన్నారు. -
పీవోఎస్, యూపీఐ లావాదేవీలకు ప్రోత్సాహకాలు
న్యూఢిల్లీ: పాయింట్ ఆఫ్ సేల్, ఈ కామర్స్ సంస్థలకు రూపే డెబిట్ కార్ట్‌తో చేసే చెల్లింపులు, వరక్తుల వద్ద భీమ్ యూపీఐ ప్లాట్‌ఫామ్ సాయంతో చేసిన తక్కువ విలువ లావాదేవీలకు ప్రోత్సాహకాలను కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ వెబ్సైట్లో ఈ నోటిఫికేషన్ ఉంచారు. రూపే కార్డు, భీమ్ యూపీఐ లావాదేవీ రూ.2,000లోపున్న వాటిపై ఈ ప్రోత్సాహకాలు అందనున్నాయి. పాయింట్ ఆఫ్ సేల్ (పీవోఎస్) మెషిన్లపై, ఈ కామర్స్ సైట్లపై రూపే డెబిట్ కార్డుతో చెల్లింపులు చేసినప్పుడు.. స్వీకరించే బ్యాంకులకు 0.4 శాతం, గరిష్టంగా రూ.100 ప్రోత్సాహకంగా లభిస్తుంది. భీమ్ యూపీఐ ఆధారిత లావాదేవీలపై చెల్లింపులను స్వీకరించే బ్యాంకులకు 0.25 ప్రోత్సాహకం లభిస్తుంది. ఇవి రిటైల్ చెల్లింపులకు సంబంధించినవి. అలా కాకుండా ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్స్, ప్రభుత్వం, విద్య, రైల్వే తదితర రంగాల్లోని లావాదేవీలపై ప్రోత్సాహకాలు భిన్నంగా ఉన్నాయి. 2022 ఏప్రిల్ 1 నుంచి ఈ ప్రోత్సాహకాలు ఏడాది పాటు అమల్లో ఉంటాయి. గరిష్టంగా రూ.2,600 కోట్లను ఈ ప్రోత్సాహకాల కోసం కేంద్రం కేటాయించింది. -
Defence stocks rally: డిఫెన్స్ షేర్లు లాభాల గన్స్
న్యూఢిల్లీ: రక్షణ రంగ పరికరాలు, సాంకేతిక సేవలందిచే కంపెనీలు కొద్ది రోజులుగా దేశీస్టాక్ మార్కెట్లలో వెలుగులో నిలుస్తున్నాయి. డిఫెన్స్ సంబంధ షేర్లకు ఇటీవల డిమాండు బలపడుతున్నట్లు మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. దేశీయంగా రక్షణ రంగ పరికరాలు, ప్రొడక్టుల తయారీకి ప్రభుత్వ ప్రోత్సాహం, భారీ ఎగుమతి అవకాశాలు వంటి అంశాలు ఇందుకు దోహదపడుతున్నట్లు తెలియజేశారు. ప్రధాని మోడీ తాజాగా 101 వస్తువులతో జాబితాను విడుదల చేసిన నేపథ్యంలో డిఫెన్స్ కౌంటర్లకు జోష్ వచ్చినట్లు తెలియజేశారు. దీంతో గత వారం డిఫెన్స్ సంబంధ కంపెనీల షేర్లు జోరు చూపాయి. జాబితా పెద్దదే గత వారం లాభాల బాటలో సాగిన డిఫెన్స్ సంబంధ షేర్లలో మజ్గావ్ డాక్‌యార్డ్, భారత్ డైనమిక్స్, కొచిన్ షిప్‌యార్డ్, మిశ్రధాతు నిగమ్, భారత్ ఎలక్ట్రానిక్స్, భారత్ ఫోర్జ్, ఆస్ట్రా మైక్రోవేవ్, పరస్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీస్ తదితరాలున్నాయి. ఇకపైన కూడా డిఫెన్స్ కౌంటర్లు ఇన్వెస్టర్ల కు లాభాలనిచ్చే వీలున్నట్లు స్టాక్ విశ్లేషకులు భావిస్తున్నారు. కొద్ది రోజులుగా ఈ రంగంలోని ఇతర కౌంటర్లలో డేటా ప్యాటర్న్స్(ఇండియా), హిందుస్తాన్ ఏరోనాటిక్స్ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నట్లు తెలియజేశారు. మూడు నెలలుగా ఈ రంగం వెలుగులో నిలుస్తున్నట్లు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ దీపక్ జాసానీ వెల్లడించారు. కారణాలున్నాయ్.. ప్రభుత్వం నుంచి భారీ ఆర్డర్లకు వీలుండటం, దేశీయంగా తయారీకి ఊతం, పలు దేశాలకు ఎగుమతి అవకాశాలు వంటి అంశాలు డిఫెన్స్ కంపెనీల ఆదాయ వృద్ధికి అద్దం పడుతున్నట్లు వివరించారు. అయితే ఇటీవల పలు కౌంటర్లు ర్యాలీ బాటలో సాగడంతో కొంతమేర దిద్దుబాటుకు చాన్స్ ఉన్నట్లు అంచనా వేశారు. ఇది కన్సాలిడేషన్‌కు దారి చూపవచ్చని అభిప్రాయపడ్డారు. కొంతకాలంగా టాటా గ్రూప్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎల్అండ్టీ తదితర దిగ్గజాలు సైతం డిఫెన్స్ తయారీకి ప్రాధాన్యం ఇస్తుండటం ఈ సందర్భంగా ప్రస్తావించదగ్గ అంశంకాగా.. ఏడాది కాలంగా డిఫెన్స్ సంబంధ కంపెనీలకు డిమాండు కొనసాగుతున్నట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ గౌరంగ్ షా తెలియజేశారు. భవిష్యత్‌లో బీఈఎల్, హెచ్ఏఎల్, భారత్ డైనమిక్స్, మజ్గావ్ డాక్, కొచిన్ షిప్‌యార్డ్ తదితరాలు భారీ ఆర్డర్లను పొందే వీలున్నట్లు అంచనా వేశారు. దిగుమతి ప్రత్యామ్నాయం అభివృద్ధి చెందిన దేశాలపై రక్షణ రంగ పరికరాల కోసం ఆధారపడటం ఇటీవల తగ్గుతూ వస్తున్నట్లు ఎల్కేపీ సెక్యూరిటీస్ సీనియర్ రీసెర్చ్ విశ్లేషకులు అశ్విన్ పాటిల్ పేర్కొన్నారు. దేశీ తయారీకి రక్షణ శాఖ ఆత్మనిర్భరత పేరుతో ఇస్తున్న దన్ను ఇందుకు సహకరిస్తున్నట్లు తెలియజేశారు. దీంతో రక్షణ శాఖకు సులభంగా, చౌకగా పరికరాలు అందుబాటులోకి వచ్చే వీలుంటుందని వివరించారు. దేశీ తయారీకి ఊతమిస్తూ 2020 ఆగస్ట్ నుంచీ ప్రభుత్వం నాలుగు దఫాలలో 310 ఐటమ్స్‌తో విడుదల చేసిన జాబితా డిఫెన్స్ రంగానికి బలిమినిస్తున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. -
ఎకానమీకి పీఎల్ఐ దన్ను: ఎంకే నివేదిక
ముంబై: ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ) భారత్ ఎకానమీకి వెన్నుదన్నుగా నిలవనుందని ఎంకే ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ (బ్రోకరేజ్ ఎంకే గ్లోబల్ పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ విభాగం) నివేదిక విశ్లేషించింది. వచ్చే ఐదేళ్లలో దాదాపు రూ. 2.4 లక్షల కోట్ల ప్రోత్సాహకాలను అందించడం ద్వారా కీలకరంగాల్లో తయారీ పెంచేందుకు ఉద్దేశించిన ఈ పథకం, వార్షికంగా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)కి 4 శాతం అదనపు విలువను జోడించవచ్చని నివేదిక అభిప్రాయపడింది. ఇప్పటివరకు ఈ పథకం ఎల్రక్టానిక్స్, ఆటో కాంపోనెంట్స్, ఫార్మా రంగాల నుండి గరిష్ట స్పందనను చూసిందని వివరించింది. నివేదికలో మరికొన్ని అంశాలన పరిశీలిస్తే.. ► పీఎల్ఐ పథకం విజయవంతం కావడానికి చైనా ప్లస్ 1 వ్యూహమే కారణం. మహమ్మారి ప్రారంభమైన నుండి చైనాలో పెట్టుబడులకు అనేక పాశ్చాత్య కంపెనీలు, ప్రభుత్వాలు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నాయి. తాజా లాక్డౌన్లు ఆ దేశంలో సరఫరాల సమస్యలను తీవ్రతరం చేస్తున్నాయి. దీనికితోడు ఆ దేశానికి చెందిన అనేక వస్తువులపై అభివృద్ధి చెందిన దేశాలు యాంటీ డంపింగ్ డ్యూటీలను విధించాయి. ► ఉత్పాదక కంపెనీలు బలమైన రాబడుల కారణంగా సామర్థ్యాలను పెంచుకుంటున్నాయి. కంపెనీలు విస్తరిస్తున్నాయి. నమోదైన కొత్త తయారీ కంపెనీల సంఖ్యను బట్టి ఇది స్పష్టమవుతుంది. ► తయారీ కంపెనీల నమోదు గత ఏడు సంవత్సరాలలో ఎన్నడూ లేనంతగా పెరిగింది. మొత్తం రిజిస్ట్రేషన్లలో తయారీ కంపెనీల వాటా గత దశాబ్దం నుండి దాదాపు అత్యధిక స్థాయిలో ఉండడం గమనార్హం. ► మార్చితో ముగిసిన 2021-22 ఆర్థిక సంవత్సరంలో కోరిన-మంజూరైన పర్యావరణ అనుమతుల సంఖ్య అత్యధికంగా ఉంది. 2018-21లో ఆవిష్కరించిన నిర్మాణాత్మక మార్పులు ఎకానమీపై సానుకూల ప్రభావాన్ని చూపుతోంది. 2003-06లో నెలకొన్న సానుకూల పరిస్థితులను తాజా పరిణామాలు గుర్తుకు తెస్తున్నాయి. ► నోట్ల రద్దు, జీఎస్టీ అమలు తొలిరోజుల్లో దేశీయ తయారీ రంగం దెబ్బతింది. తాజాగా మహమ్మారి వినియోగదారుల డిమాండ్‌పై ప్రభావం చూపింది. ఆయా పరిస్థితుల నుంచి ఎదురైన సవాళ్లు తయారీ పరిశ్రమపై కొనసాగుతున్నాయి. మూలధన సవాళ్లు, సమస్యలు ఇంకా తొలగిపోలేదు. ► 2021-22లో తలసరి ఆదాయం 2020-21కన్నా పెరిగింది. మార్చితో ప్రారంభమైన ఈ ఆర్థిక సంవత్సరం నుండి విచక్షణాపరమైన ఆదాయం పెరిగే అవకాశం ఉంది. రూపాయి బలహీనత బలం... చైనీస్ యువాన్‌తో రూపాయి విలువ క్షీణించడం భారత్ తయారీ రంగానికి సానుకూలంగా మారింది. ఈ పరిణామాల వల్ల ఆటో, ఆటో విడి భాగాలు, వ్రస్తాలు, రసాయనాలు, భారీ పరిశ్రమలకు సంబంధించి క్యాపిటల్ గూడ్స్ ప్రయోజనం పొందుతున్నాయి. – వికాస్ ఎం సచ్‌దేవా, ఎంకే ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ సీఈఓ -
ఈవీల విస్తరణలో టెక్నాలజీ కీలకం
న్యూఢిల్లీ: దేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల వినియోగం మరింత పెంచేందుకు టెక్నాలజీ పురోగతి, ప్రోత్సాహకాలు అవసరమని నీతి ఆయోగ్ సూచించింది. ‘భారత్‌లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విస్తరణ అంచనా’ పేరుతో నీతి ఆయోగ్ ఒక నివేది క రూపొందించింది. భవిష్యత్తులో ఏదో ఒక సమ యంలో ఎలక్ట్రిక్ రవాణా లేదా మరో పర్యావరణ అనుకూల రవాణాకు అయినా నియంత్రణ వ్యవస్థ అవసరమని అభిప్రాయపడింది. మెరుగైన టెక్నాలజీలు, ప్రభుత్వం వైపు నుంచి మరిన్ని చర్యల మద్దతుతో దేశంలో ఈవీల వినియోగాన్ని భారీగా పెంచే అవకాశాలున్నట్టు ఈ నివేదిక పేర్కొంది. వినియోగదారుల్లో ఎలక్ట్రిక్ వాహనాల పట్ల సానుకూల దృక్పథం ఉందంటూ, ఇటీవల పెట్రోల్ ధరలు భారీగా పెరగడం కూడా వినియోగదారులు ఈవీల వైపు అడుగులు వేయడంలో కీలక పాత్ర పోషించినట్టు తెలిపింది. ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) పట్ల ప్రజల్లో అవగామన విస్తృతమైనట్టు వివరించింది. తయారీ వ్యయం ఈవీల తయారీ వ్యయం ప్రధాన అంశంగా నీతి ఆయోగ్ నివేదిక పేర్కొంది. వాహనం ధరలో బ్యాటరీ ఖర్చే ఎక్కువగా ఉంటున్న విషయాన్ని ప్రస్తావించింది. ఎలక్ట్రిక్ వాహనాల విడిభాగాల దిగుమతులను తగ్గించుకోవడం, ఇతర విధానపరమైన చర్యలు.. దేశీయంగా తయారీని పెంచేందుకు అవసరమని సూచించింది. తొలి దశలో ఎలక్ట్రిక్ వాహనాలతో పోలిస్తే అధిక చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు ద్వారా వినియోగదారుల్లో విశ్వాసాన్ని పెంచొచ్చని అభిప్రాయపడింది. ఆ తర్వాత ఈ రేషియో దిగొస్తుందని పేర్కొంది. విధానాలు, సదుపాయాలకు తోడు, టెక్నాలజీ కూడా ఈవీల వ్యాప్తిని పెంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తుందని నీతి ఆయోగ్ అభిప్రాయపడింది. మూడేళ్ల కాలంలో ఈవీ ఎలాంటి పనితీరు చూపిస్తుంది? బ్యాటరీ సామర్థ్యం వాహనాల విస్తరణపై ప్రభావం చూపిస్తాయని పేర్కొంది. -
ఎలక్ట్రిక్ సైకిల్ కొంటున్నారా? భారీ రాయితీలు ప్రకటించిన ఢిల్లీ సర్కారు
వాతావరణ కాలుష్యం తగ్గించే ప్రయత్నంలో ప్రతీ అవకాశం వినియోగించుకోవాలని ఢిల్లీ సర్కారు డిసైడ్ అయ్యింది. అందులో భాగంగా మరోసారి ఎలక్ట్రిక్ వాహన కొనుగోలుదారులకు భారీ ప్రోత్సాహకాలను ప్రకటించింది. వ్యక్తిగత, రవాణా, కార్గోలలో ఏ తరహా ద్విచక్ర వాహనమైనా సరే, ఈవీ అయితే చాలు ప్రోత్సాహం అందిస్తామని తెలిపింది. ఢిల్లీలోని ఆప్ సర్కారు ప్రకటించిన రాయితీల ప్రకారం.. ఢిల్లీలో రిజిస్ట్రర్ అయ్యే మొదటి పది వేల ఎలక్ట్రిక్ ద్వి చక్ర వాహనాలకు ఈ ఇన్సెంటీవ్ వర్తిస్తుంది. ఇందులో ఒక్కో వాహనంపై గరిష్టంగా రూ.5,500ల వరకు ప్రోత్సాహంగా అందివ్వనుంది. కార్గో, పర్సనల్, వ్యక్తిగత అన్ని కేటగిరీల వాహనాలకు ఇందులో చేర్చారు. దీనికి అదనంగా మొదటి వెయ్యి వ్యక్తిగత వాహనాలకు అదనంగా మరో రూ.2000లు ప్రోత్సాహక నగదు అందివ్వాలని కేజ్రీవాల్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చదవండి: అవును నిజం.. త్వరలో ఎలక్ట్రిక్ ‘అంబాసిడర్’ కారు! -
ఆటకు ఆర్థిక అండ... దాదాపు రూ.9.60 కోట్ల నగదు ప్రోత్సాహకాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో క్రీడల అభివృద్ధితో పాటు క్రీడాకారులకు ఆర్థిక భరోసా కల్పించడంలో ప్రభుత్వం ఉదారంగా వ్యవహరిస్తోంది. మూడేళ్ల కాలంలో జాతీయ, అంతర్జాతీయస్థాయిలో పతకాలు సాధించిన 1,500 మంది క్రీడాకారులకు రూ.9,59,99,859 నగదు ప్రోత్సాహకాలను అందజేసింది. సుమారు 80 క్రీడాంశాల్లోని ఆటగాళ్ల ప్రతిభకు పట్టంకడుతూ.. వారిని మరింతగా ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా శిక్షణకు అవసరమైన ఆర్థిక సాయానిచ్చింది. అంతకుముందు టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రత్యేక విధానమంటూ లేకపోవడంతో చాలామంది క్రీడాకారులు నష్టపోయారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ క్రీడాప్రోత్సాహకాలను ప్రవేశపెట్టారు. గతంలో ఇచ్చే నగదు మొత్తాన్ని భారీగా పెంచారు. ఇందులో భాగంగానే జాతీయ పోటీల్లో పతకాలు గెలుపొందిన క్రీడాకారులకు రూ.4.58 కోట్లు ఇవ్వడం విశేషం. దీంతో 2014–19 మధ్య కాలంలో పతకాలు సాధించినా అప్పటి ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురైన ఎందరో క్రీడాకారులకు లబ్ధిచేకూరింది. ఎన్నికల ముందు హడావుడిగా.. టీడీపీ ఐదేళ్ల పాలనలో రూ.13.76 కోట్లు అందించినప్పటికీ చిన్న క్రీడాకారులకు ఏమాత్రం మేలు జరగలేదు. క్రీడలను కూడా రాజకీయాలతో చూసే చంద్రబాబు ఎన్నికలకు ముందు హడావుడిగా 2018–19లో 115 మందికి రూ.7.75 కోట్లు ఇచ్చారు. అంతకుముందు ఇచ్చింది కేవలం రూ.6 కోట్లు అయితే వీటిల్లో సింహభాగం అంతర్జాతీయ క్రీడాకారులకు కేటాయించినదే కావడం గమనార్హం. జాతీయస్థాయిలో పతకాలు పొందినవారికి నామమాత్రంగా ఆర్థిక సాయం దక్కేది. (చదవండి: ఉద్యాన విస్తరణకు డిజిటల్ సేవలు) -
ఉద్యోగులకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించిన ఢిల్లీ సర్కారు
దేశ రాజధాని వాయు కాలుష్యం కొరల్లో చిక్కుకుని ఎప్పటి నుంచో విలవిలాడుతోంది. సరి బేసి సంఖ్య విధానం ప్రవేవపెట్టిన పరిస్థితి అదుపులోకి రాలేదు. ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడకం ప్రోత్సహించేందుకు ఇప్పటికే అనేక పథకాలు ప్రవేశపెట్టింది. ఐప్పటికీ ఆశించిన స్థాయిలో ఈవీలు ఢిల్లీలో పెరగలేదు. దీంతో మరోసారి ప్రభుత్వం నేరుగా రంగంలోకి దిగింది. ప్రభుత్వ ఉద్యోగులకు ఈజీ మంత్లీ ఇన్స్టాల్మెంట్ కింద ఈవీ వెహికల్స్ అందివ్వాలని నిర్ణయించింది. ఈ పథకం తొలి దశలో టూ వీలర్స్ అందివ్వనున్నారు. అంతేకాదు ముందుగా ఈవీ వెహికల్ కొనుగోలు చేసిన పది వేల మంది ఉద్యోగులకు రూ. 5000 ఇన్సెంటీవ్గా అందిస్తామని ఢిల్లీ సర్కార్ ప్రకటించింది. దీంతో పాటు మొదటి వెయ్యి ఈవీ కొనుగోలుదారులకు అదనంగా మరో రూ.2000 ప్రోత్సాహక నగదు ఇస్తామని చెబుతోంది ఆప్ సర్కారు. మొత్తంగా వాయు కాలుష్యాన్ని సాధ్యమైనంత తగ్గించేందుకు కేజ్రీవాల్ ప్రభుత్వం శ్రమిస్తోంది. చదవండి: Electric Vehicle: రెండేళ్లే! ఎలక్ట్రిక్ వెహికల్ కొనుగోలు దారులకు కేంద్రం అదిరిపోయే శుభవార్త! -
గతి శక్తి, పీఎల్ఐ స్కీమ్‌తో ఎకానమీకి రక్ష
న్యూఢిల్లీ: గతిశక్తి, ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక పథకాలు భారత్ ఎకానమీని అంతర్జాతీయంగా ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితుల నుంచి రక్షిస్తాయని ఆర్థికశాఖ పేర్కొంది. దీనితోపాటు సంబంధిత పథకాలు దేశంలో పెట్టుబడులను పెంచుతాయని విశ్లేషించింది. ఫలితంగా భారత ఆర్థిక వ్యవస్థ వేగవంతమైన పునరుద్ధరణ, అధిక వృద్ధిని సాధిస్తుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ నివేదిక తెలిపింది. కాగా భౌగోళిక రాజకీయ వైరుధ్యాలు, వాటి ప్రభావాలు ప్రపంచ వ్యాప్తంగా ఆహారం, ఎరువులు, ముడి చమురు ధరలపై ప్రభావం చూపుతాయని నెలవారీ విశ్లేషణా నివేదిక పేర్కొంది. దీని పర్యవసాన ప్రభావం ప్రపంచవ్యాప్త వృద్ధి అవుట్‌లుక్‌పై పడుతుందని తెలిపింది. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే... ► ఇంధన ధరల తీవ్రత, ఆహార మార్కెట్లో సరఫరాల సమస్యలు ఆర్థిక సంవత్సరంలో ఎంతకాలం కొనసాగుతాయన్న అంశం భారత్ ఎకానమీకి కీలకం. అయితే తాత్కాలిక అవాంతరాలు దేశ వాస్తవిక వృద్ధి, ద్రవ్యోల్బణంపై పెద్ద ప్రభావాన్ని చూపకపోవచ్చు. ఎకానమీ ఫండమెంటల్స్ పటిష్టత దీనికి కారణం. ► భారత్ ఎకానమీకి సవాళ్లు ఎదరయినప్పటికీ, వీటి తీవ్రతను తగ్గించడానికి గతిశక్తి, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్‌లు దోహదపడతాయి. పెట్టుబడులు, వేగవంతమైన రికవరీ, పటిష్ట వృద్ధికి ఈ పథకాలు సహాయపడతాయి. దీనికితోడు గత కొన్నేళ్లుగా తీసుకున్న నిర్మాణాత్మక సంస్కరణల ద్వారా సరఫరాల సవాళ్లు తగ్గుతాయని భావిస్తున్నాం. ► శ్రామిక శక్తి వినియోగం మెరుగుదల, నిరుద్యోగం రేటు తగ్గడం, ఆర్థికంగా పేదలకు నిరంతర మద్దతు అందించడానికి ప్రభుత్వ పటిష్ట చర్యలు (పీఎం గరీబ్ కళ్యాణ్ యోజనను సెప్టెంబర్ 2022 చివరి వరకు మరో ఆరు నెలల పాటు పొడిగించడం) ఎకానమీని విస్తృత స్థాయిలో సుస్థిర వృద్ధి బాటలో ముందుకు నడుపుతాయి. ► వస్తు సేవల పన్నుల (జీఎస్టీ) వసూళ్లు మార్చి 2022లో రూ. 1.4 లక్షల కోట్లను దాటి రికార్డు సృష్టించాయి. రికవరీ అనంతర వృద్ధి ప్రారంభాన్ని ఇది సూచిస్తోంది. రాష్ట్రాలు క్రమంగా మహమ్మారి ప్రేరేపిత పరిమితులను సడలిస్తుండడం ఎకానమీకి లాభిస్తోంది. ముడి పదార్థాల ధరల పెరిగినా, సేవల రంగం పటిష్టంగా ఉంది. ఇన్పుట్స్ వ్యయం 11 సంవత్సరాల గరిష్ట స్థాయికి నమోదయినప్పటికీ ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా సర్వీసెస్ పీఎంఐ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ ఫిబ్రవరిలో 51.8 వద్ద ఉంటే, మార్చిలో 53.6కు ఎగసింది. వ్యాక్సినేషన్ విస్తృతితో కోవిడ్–19 కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. ఇవన్నీ ఎకానమీ వేగవంతమైన పురోగతిని సూచిస్తున్నాయి. ► ప్రైవేట్ వినియోగంలో వృద్ధి రికవరీ వేగవంతం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. యూపీఐ లావాదేవీల విలువలు, పరిమాణాలు 2021– 22లో రెండింతలు పెరిగాయి. మార్చి 2022లో యూపీఐ లావాదేవీల పరిమాణం మొదటిసారిగా ఒక నెలలో 5 బిలియన్లను దాటింది. ► ఏప్రిల్ 2021 నుండి ఫిబ్రవరి 2022 వరకు కేంద్ర ప్రభుత్వం చేసిన మూలధన పెట్టుబడులు మహమ్మారి ప్రేరిత, అంతకుముందు ఆర్థిక సంవత్సరాల (2019–20, 2020–21) స్థాయిలను అధిగమించాయి. ప్రైవేటు పెట్టుబడులు కూడా మరింత ఊపందుకునే వీలుంది. ► విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) భారత్ భారీగా ఆకర్షిస్తోంది. ఆర్థిక వ్యవస్థలోకి స్థూల ఎఫ్‌డీఐల ప్రవాహం 2021 ఏప్రిల్– 2022 జనవరి మధ్య 69.7 బిలియన్ డాలర్లకు పెరిగింది. విదేశీ వాణిజ్య రుణాల (ఈసీబీ)ద్వారా పెట్టుబడుల్లో 2021 ఏప్రిల్– 2022 ఫిబ్రవరి మధ్య (అంతక్రితం ఏడాది ఇదే కాలంలో పోల్చి) 29.7 శాతం వృద్ధి నమోదయ్యింది. దీనివల్ల భారత్ విదేశీ మారకద్రవ్య నిల్వలు 630 డాలర్లకుపైగా పెరిగాయి. ఇవి 12 నెలలకుపైగా దిగుమతులకు సరిపోతాయి. ► 2022 జనవరిలో నికర ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ చందాదారుల సంఖ్య 15.3 లక్షలుగా నమోదయ్యింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చితే ఇది 37.4 శాతం అధికం. ఇది విస్తృత ఆర్థిక పునరుద్ధరణ ఉపాధి అవకాశాల వృద్ధిని కూడా పెంచిందని సూచిస్తోంది. ఆర్థికరంగం బాగుంది భారత్ ఎకానమీ పరిస్థితి ప్రస్తుతం బాగుంది. విదేశీ మారకద్రవ్య నిల్వలు అంతర్జాతీయ ఒత్తిడులను తట్టుకునే స్థాయిలో ఉన్నాయి. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితిని తట్టుకోగలిగిన స్థాయిలో దేశం ఆర్థిక రంగం ఉంది. నిరుద్యోగం, ద్రవ్యోల్బణంపై అధిక దృష్టి అవసరం. – బిమల్ జలాన్, ఆర్బీఐ మాజీ గవర్నర్ -
ఆటో పీఎల్ఐ స్కీమ్‌కి 20 కంపెనీల ఎంపిక
న్యూఢిల్లీ: ఆటోమొబైల్, ఆటోమొబైల్ విడిభాగాల పరిశ్రమకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ) కింద 20 కంపెనీల ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. టాటా మోటార్స్, మారుతి సుజుకీ, హ్యుందాయ్, కియా, మహీంద్రా అండ్ మహీంద్రా తదితర కంపెనీలు ఈ అవకాశాన్ని సొంతం చేసుకున్నాయి. ఆమోదించిన దరఖాస్తుదారుల నుంచి రూ.45,016 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చినట్టు భారీ పరిశ్రమల శాఖ తెలిపింది. చాంపియన్ ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చురర్స్ (ఓఈఎం) ఇన్సెంటివ్స్ స్కీమ్ కింద అశోక్‌లేలాండ్, ఐచర్ మోటార్స్, ఫోర్డ్ ఇండియా, హ్యుందాయ్ మోటార్ ఇండియా, కియా ఇండియా, మహీంద్రా అండ్ మహీంద్రా, పీసీఏ ఆటోమొబైల్స్, పినాకిల్ మొబిలిటీ సొల్యూషన్స్, సుజుకీ మోటార్ గుజరాత్, టాటా మోటార్స్ లిమిటెడ్ ఉన్నాయి. ఈ కేటగిరీలో ద్విచక్ర, త్రిచక్ర వాహనాలను కలపలేదు. ద్విచక్ర, త్రిచక్ర వాహనతయారీదారులకు ప్రోత్సాహకాల కింద బజాజ్ ఆటో, హీరో మోటోకార్ప్, పియాజియో వెహికల్స్, టీవీఎస్ మోటార్ ఎంపికయ్యాయి. నాన్ ఆటోమోటివ్ ఇన్వెస్టర్ కేటగిరీ కింద యాక్సిస్ క్లీన్ మొబిలిటీ, భూమ ఇన్నోవేటివ్ ట్రాన్స్పోర్ట్ సొల్యూషన్స్, ఎలెస్ట్, హోప్ ఎలక్ట్రిక్ మ్యానుఫ్యాక్చరింగ్, ఓలా ఎలక్ట్రిక్ టక్నాలజీస్, పవర్‌హాల్ వెహికల్ కంపెనీలు రాయితీలకు అర్హత పొందాయి. 18 శాతం వరకు ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా దేశీయంగా విడిభాగాల తయారీకి, అత్యాధునిక టెక్నాలజీల ఆవిష్కారానికి ఈ పథకం మద్దతుగా నిలవనుంది.మొత్తం రూ.25,938 కోట్లను ప్రోత్సాహకాలుగా ఇవ్వాలని గతంలోనే సర్కారు నిర్ణయించింది. -
ప్రకృతి సేద్యం.. ఎస్సీ రైతులకు ప్రోత్సాహం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రకృతి సేద్యం చేస్తున్న ఎస్సీ రైతులకు ప్రోత్సాహం అందించేందుకు కార్యాచరణ ఖరారైంది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 71,560 మంది ఎస్సీ రైతుల ఎంపిక పూర్తయింది. వారందరికీ కనీసం రూ.50 వేల చొప్పున సబ్సిడీ రుణాలు అందించేందుకు కసరత్తు మొదలైంది. ఆ మొత్తంలో రూ.10 వేలు సబ్సిడీ, రూ.40 వేలు రుణంగా ఇవ్వనున్నారు. సబ్సిడీ పోను మిగిలిన మొత్తాన్ని వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఏడాది మార్చి నెలాఖరులోగా మూడు విడతల్లో ఎస్సీ రైతులకు ఈ రుణాలను పంపిణీ చేయనున్నారు. తొలి విడతలో 8,198 మందికి, రెండో విడతలో 34,100 మందికి, మూడో విడతలో 29,262 మందికి అందించనున్నారు. ఆ మొత్తాలను ఎస్సీ రైతులు ప్రకృతి సేద్యానికి పెట్టుబడిగా వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఎస్సీ రైతు కుటుంబంలో మహిళల పేరిట రుణాలు మంజూరు చేస్తారు. ఎస్సీ కౌలు రైతులను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. శిక్షణతోపాటు పరికరాలూ ఇస్తాం ఎస్సీ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ కె.హర్షవర్ధన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ఈ పథకం అమలు చేస్తున్నామని చెప్పారు. రైతు సాధికార సంస్థ, ఎన్ఎస్ఎఫ్డీసీ, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సమన్వయంతో కార్యాచరణకు సహకరిస్తాయని తెలిపారు. సబ్సిడీ రుణాలే కాకుండా ప్రకృతి సేద్యంలో శిక్షణ ఇస్తామన్నారు. పంట రవాణా, మార్కెటింగ్ సదుపాయాల కోసం వినియోగించే వాహనాలను రాయితీలపై అందిస్తామని వివరించారు. -
హిప్.. చిప్.. భారత్!
న్యూఢిల్లీ: భారత్‌ను ప్రపంచానికి తయారీ కేంద్రంగా మలిచే లక్ష్యంతో కేంద్ర సర్కారు మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. సెమీ కండక్టర్ల తయారీ (చిప్‌లు), డిస్ప్లే తయారీ ఎకోసిస్టమ్‌కు రూ.76,000 కోట్ల ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. తద్వారా స్వీయ సమృద్ధి సాధించడమే కాకుండా, చైనా మార్కెట్‌పై ఆధారపడడం తగ్గుతుందని కేంద్ర సర్కారు భావిస్తోంది. సెమీ కండక్టర్లు, డిస్ప్లే తయారీ, డిజైన్ కంపెనీలకు అంతర్జాతీయంగా ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలను ఈ పథకం కింద అందించడం వల్ల.. ఎలక్ట్రానిక్స్ తయారీలో కొత్త శకానికి దారితీస్తుందని కేంద్రం పేర్కొంది. కేబినెట్ సమావేశం వివరాలను ఐటీ, టెలికం మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. నిత్య జీవితంలో ఎలక్ట్రానిక్స్ ముఖ్య పాత్ర పోషిస్తుంటే.. ఎలక్ట్రానిక్స్ తయారీలో సెమీ కండక్టర్లకు కీలక పాత్ర ఉందన్నారు. లక్ష్యాలు..: మూలధన, సాంకేతిక సహకారాన్ని ఈ పథకం కింద కంపెనీలు పొందొచ్చు. అర్హులైన దరఖాస్తులకు ప్రాజెక్టు వ్యయంలో 50 శాతం నిధుల సహకారాన్ని ప్రభుత్వం అందించనుంది. సిలికాన్ సెమీకండక్టర్ ఫ్యాబ్‌లు, డిస్ప్లే ఫ్యాబ్‌లు, కాంపౌండ్ సెమీకండక్టర్లు, సిలికాన్ ఫోటోనిక్స్, సెన్సార్ ఫ్యాబ్‌లు, సెమీకండక్టర్ ప్యాకేజింగ్, సెమీ కండక్టర్ డిజైన్లకు ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలను కూడా ప్రభుత్వం ఇవ్వనుంది. ప్రాజెక్టులకు అవసరమైన మౌలిక సదుపాయాల (భూమి, నీరు, విద్యుత్తు, రవాణా, పరిశోధన సదుపాయాలు) ఏర్పాటులో రాష్ట్ర ప్రభుత్వాలతో కలసి కేంద్రం పనిచేయనుంది. కనీసం రెండు గ్రీన్‌ఫీల్డ్ సెమీ కండక్టర్ ఫ్యాబ్‌లు, రెండు డిస్ప్లే ఫ్యాబ్‌లను ఏర్పాటు చేయాలన్నది కేంద్రం లక్ష్యంగా ఉంది. ఈ ప్రతిపాదిత పథకం కింద కనీసం 15 కాంపౌండ్ సెమీకండక్టర్లు, సెమీకండక్టర్ల ప్యాకేజింగ్ యూనిట్లు ఏర్పాటవుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. డిజైన్ అనుసంధాన ప్రోత్సాహక పథకం (డీఎల్ఐ) కింద ప్రాజెక్టు ఏర్పాటు వ్యయంలో 50 శాతాన్ని ప్రోత్సాహకంగా ప్రభుత్వం సమకూర్చనుంది. అలాగే, ఐదేళ్లపాటు విక్రయాలపై 6–4 శాతం మేర ప్రోత్సాహకాలను ఇవ్వనుంది. ‘‘దేశీయంగా 100 వరకు సెమీకండక్టర్ డిజైన్ ఫర్ ఇంటెగ్రేటెడ్ సర్క్యూట్స్, చిప్సెట్లు, సిస్టమ్ ఆన్ చిప్స్, సెమీకండక్టర్ డిజైన్ కంపెనీలకు మద్దతు లభించనుంది. వచ్చే ఐదేళ్లలో రూ.1,500 కోట్ల టర్నోవర్ సాధించిన కంపెనీలకు ప్రోత్సాహకాలు లభిస్తాయి’’ అని ప్రభుత్వం నుంచి విడుదలైన ప్రకటన తెలిపింది. ఈ పరిశ్రమ దీర్ఘకాల వృద్ధికి వీలుగా అంతర్జాతీయ నిపుణులతో సెమీకండక్టర్ మిషన్‌ను కూడా ఏర్పాటు చేయనుంది. 1.35 లక్షల మందికి ఉపాధి వచ్చే నాలుగేళ్లలో ఈ పథకం కింద దేశంలోకి 1.7 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని.. ప్రత్యక్షంగా, పరోక్షంగా 1.35 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తున్నట్టు కేంద్ర మంత్రి అశ్వినివైష్ణవ్ తెలిపారు. ప్రస్తుతానికి దేశంలో 75 బిలియన్ డాలర్లుగా ఉన్న ఎలక్ట్రానిక్స్ తయారీ ఆరేళ్లలో 300 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందన్నారు. టాటా గ్రూపు ఇప్పటికే సెమీకండక్టర్ల తయారీలోకి ప్రవేశించనున్నట్టు ప్రకటించగా.. వేదాంత గ్రూపు సైతం ప్లాంట్ ఏర్పాటుకు ఆసక్తితో ఉంది. రెండు అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ చిప్ తయారీ కంపెనీలు, రెండు డిస్ప్లే తయారీ కంపెనీలు ఒక్కోటీ రూ.30,000–50,000 కోట్ల స్థాయి పెట్టుబడులతో వచ్చే నాలుగేళ్లలో ముందుకు రావచ్చని ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ అంచనా వేస్తోంది. ఆవిష్కరణలు, తయారీకి ఊతం: ప్రధాని మోదీ సెమీకండక్టర్లకు సం బంధించి కేబినెట్ తీసుకున్న నిర్ణయం ఈ రంగంలో పరిశోధన, ఆవిష్కరణలకు, తయారీకి ఊతమిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమాన్ని మరింత బలోపేతం చేస్తుందంటూ ప్రధాని ట్వీట్ చేశారు. డిజిటల్ చెల్లింపులకు మరింత మద్దతు న్యూఢిల్లీ: దేశంలో డిజిటల్ చెల్లింపుల లావాదేవీలు ఇప్పటికే గరిష్టాలకు చేరుకోగా.. వీటిని మరింత ప్రోత్సహించాలని కేంద్ర సర్కారు నిర్ణయించింది. యూపీఐ, రూపే డెబిట్ కార్టులతో చేసే చెల్లింపులను ప్రోత్సహించేందుకు రూ.1,300 కోట్ల పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలియజేసింది. వ్యక్తులు వర్తకులకు చేసే డిజిటల్ చెల్లింపులకు అయ్యే వ్యయాలను ప్రభుత్వం రీయింబర్స్ చేస్తుందని టెలికం మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. రూపే డెబిట్ కార్డు, భీమ్ యూపీఐతో రూ.2,000 వరకు చెల్లింపులపై అయ్యే వ్యయాలను ప్రభుత్వం భరిస్తుందని చెప్పారు. వచ్చే ఏడాది కాలంలో ప్రభత్వం రూ.1,300 కోట్లను ఖర్చు చేయడం వల్ల మరింత మంది డిజిటల్ చెల్లింపులకు ముందుకు వస్తారని అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది నవంబర్‌లో 7.56 లక్షల కోట్ల విలువైన 423 కోట్ల డిజిటల్ చెల్లింపుల లావాదేవీలు నమోదైనట్టు వెల్లడించారు. -
8.3 శాతం వృద్ధికి అవకాశం
వాషింగ్టన్: భారత్ జీడీపీ వృద్ధి అంచనాలను ప్రపంచబ్యాంకు తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22)లో 8.3 శాతం మేర వృద్ధిని నమోదు చేయవచ్చని తాజాగా అంచనా వేసింది. పెరిగిన ప్రభుత్వ పెట్టుబడులు, తయారీని పెంచేందుకు ఇస్తున్న ప్రోత్సాహకాలు వృద్ధికి తోడ్పడతాయని తాజాగా విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. కరోనా రెండో విడత ప్రబలడానికి ముందు ఈ ఏడాది ఆరంభంలో వేసిన అంచనాల కంటే ఇది తక్కువేనని తెలిపింది. కరోనా రెండో విడత ప్రభావంతో ఆర్థిక రికవరీ నిలిచిపోయిందని.. వాస్తవానికి రికవరీ క్షీణించినట్టు కొన్ని సంకేతాల ఆధారంగా తెలుస్తోందని ప్రపంచబ్యాంకు దక్షిణాసియా ప్రాంత ముఖ్య ఆర్థికవేత్త హన్స్ టిమ్మర్ అన్నారు. ఈ ఏడాది మార్చిలో విడుదల చేసిన నివేదికలో భారత్ జీడీపీ వృద్ధి 2021–22లో 7.5–12.5 మధ్య ఉంటుందని పేర్కొనడం గమనార్హం. ఈ ఏడాది ఏప్రిల్–మే నెలల్లో దేశంలో కరోనా కేసులు గణనీయంగా పెరగడం తెలిసిందే. దీంతో తన తాజా అంచనాల్లో దిగువ స్థాయికి వృద్ధి అంచనాలను సవరించినట్టు టిమ్మర్ పేర్కొన్నారు. కరోనా రెండో విడత ప్రభావం ఆర్థిక వ్యవస్థమీద ఎక్కువే ఉందన్నారు. కార్మిక, వ్యవసాయ సంస్కరణలు అవసరం కార్మిక, వ్యవసాయ సంస్కరణలు అవసరానికి అనుగుణంగానే ఉన్నాయని టిమ్మర్ అభిప్రాయపడ్డారు. ఇవి ఆర్థిక వ్యవస్థలో వెలుగు చూడని సామర్థ్యాలని బయటకు తీసుకొస్తాయని చెప్పారు. సామాజిక భద్రతా వ్యవస్థల కోసం నిధులను ఏర్పాటు చేయడం వంటివి సంఘటిత రంగంలోని కారి్మకులకే కాకుండా.. అసంఘటిత రంగంలోని వారికీ మేలు చేస్తుందన్నారు. ‘‘భారత్‌లో అమలు చేస్తున్న ఎన్నో స్వల్పకాలిక ఉపశమన చర్యలు దీర్ఘకాలం కోసం కాదు. దేశం మొత్తానికి సంబంధించి బలమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ప్రస్తుత సంస్కరణలు (కారి్మక, వ్యవసాయ) ఆ దిశలోనే ఉన్నాయి. కానీ, అదే సమయంలో చేయాల్సింది ఎంతో ఉంది’’ అని టిమ్మర్ వివరించారు. -
ఆటో పీఎల్ఐ నోటిఫికేషన్ విడుదల
న్యూఢిల్లీ: అత్యాధునిక ఆటోమోటివ్ టెక్నాలజీ ఆధారిత వాహనాలు (ముందస్తు అనుమతి కలిగిన), అన్ని రకాల ఆటో విడిభాగాల తయారీపై ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు (పీఎల్ఐ పథకం) అందుకోవచ్చని కేంద్రం స్పష్టం చేసింది. ఆటోమొబైల్ రంగానికి రూ.25,938 కోట్ల ప్రోత్సాహకాలను ఇవ్వనున్నట్టు ఇటీవలే ప్రకటించగా.. ఇందుకు సంబంధించి పీఎల్ఐ పథకం కింద రాయితీలు కలి్పంచే నోటిఫికేషన్‌ను కేంద్ర భారీ పరిశ్రమల శాఖ శుక్రవారం జారీ చేసింది. సైనిక వినియోగానికి సంబంధించిన వాహనాలకూ ఈ పథకం కింద ప్రయోజనాలు లభించనున్నాయి. సీకేడీ/ఎస్కేడీ కిట్లు, ద్విచక్ర, త్రిచక్ర, ప్యాసింజర్, వాణిజ్య, ట్రాక్టర్ల అగ్రిగేట్స్ సబ్సిడీలకు అర్హతగా నోటిఫికేషన్లో ప్రభుత్వం పేర్కొంది. ప్రస్తుత ఆటోమొబైల్ కంపెనీలతోపాటు.. కొత్త నాన్ ఆటోమోటివ్ పెట్టుబడి సంస్థలూ పథకం కింద ధరఖాస్తు చేసుకోవచ్చు. ఛాంపియన్ ఓఈఎం, కాంపోనెంట్ చాంఫియన్ ఇన్సెంటివ్ స్కీమ్ అనే రెండు భాగాల కింద ధరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పథకం కింద ఒక గ్రూపు పరిధిలోని కంపెనీలకు మొత్తం ప్రోత్సాహకాల్లో 25 శాతానికి మించకుండా (అంటే రూ.6,485 కోట్లకు మించకుండా) ప్రోత్సాహకాలు లభిస్తాయి. చాంపియన్ ఓఈఎం పథకం కింద విక్రయాలు కనీసం రూ.125 కోట్లుగాను, కాంపోనెంట్ చాంపియన్ ఇన్సెంటివ్ స్కీమ్ కింద విక్రయాలు కనీసం రూ.25 కోట్లుగాను ఉండాలని ఈ నోటిఫికేషన్ స్పష్టం చేస్తోంది. -
ఆటోమొబైల్ ఇండస్ట్రీకి బిగ్ బూస్ట్ ! పీఎల్ఐకి ఒకే చెప్పిన కేంద్రం
Production-Linked Incentive scheme: కరోనా కాటుకు తోడు చిప్సెట్ల కొరతతో సతమతం అవుతున్న ఆటోమొబైల్ ఇండస్ట్రీకి కేంద్రం తీపి కబురు చెప్పింది. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సహకాలు అందిస్తామంటూ ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఢిల్లీలో మీడియాకు వెల్లడించారు. పీఎం అధ్యక్షతన సమావేశం వివిధ రంగాలకు ఉత్పత్తి అధారిత ప్రోత్సహకాలు అందించేందుకు కేంద్ర కేబినేట్ ప్రధానీ మోదీ అధ్యక్షతన న్యూ ఢిల్లీలో సమావేశమైంది. ఈ సమావేశంలో వాహన తయారీ, వాహన విడిభాగాల తయారీ, డ్రోన్ల తయారీ పరిశ్రమకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు అందివ్వాలంటూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. వాహన రంగంలో ప్రోత్సాహకాల కోసం రూ. 26,058 కోట్లు కేటాయింపు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. టెక్నాలజీలో మార్పులు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటీవ్ విధానం ద్వారా భారత్‌లోకి ఆధునిక ఆటోమోటివ్ టెక్నాలజీ వస్తుందని కేబినేట్ అభిప్రాయపడింది. పీఎల్ఐ విధానం వల్ల కొత్తగా రూ. 42,500 కోట్ల పెట్టుబడులకు ఆస్కారం ఉందని కేంద్రం పేర్కొంది. అంతేకాదు అదనపు ఉత్పత్తి విలువ రూ. 2.3 లక్షల కోట్లకు పెరుగుతుందని అంచనా వేసింది. కేబినేట్లో తీసుకున్న ఇతర నిర్ణయాలు, వెలిబుచ్చిన అభిప్రాయాలు - డ్రోన్ల తయారీలో ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ ద్వారా రానున్న మూడేళ్లలో రూ. 5,000 కోట్లు పెట్టబడులు రావడంతో పాటు రూ. 1,500 కోట్ల మేర అదనపు ఉత్పత్తి జరుగుతుందని అంచనా. ఈ సెక్టార్‌కి ప్రోత్సహకాలు అందించేందుకు రూ. 120 కోట్ల కేటాయింపులు. - పీఎల్ఐ వల్ల భారత్‌లో తయారీ సామర్థ్యం పెరుగుతుంది. చైనాకు పోటీగా మాన్యుఫ్యాక్చరింగ్ సెక్టార్లో బలపడే అవకాశం - పర్యావరణహిత ఎలక్ట్రిక్ వాహనాలు, హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ వాహనాల తయారీలో భారత్‌ను ముందువరుసలో నిలబెడుతుంది - ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి పీఎల్ఐ బిగ్ బూస్ట్‌లా మారుతుంది - మాన్యుఫ్యాక్చరింగ్ సెక్టార్లో కొత్తగా 7.6 లక్షల మందికి అదనంగా ఉపాధి లభిస్తుంది - అంతర్జాతీయ ఆటోమొబైల్ మార్కెట్లో భారత్ వాటా కేవలం 2 శాతంగా ఉందని, తాజా నిర్ణయంతో అది పెరుగుతుంది. - టెలికాం కంపెనీల్లో వంద శాతం విదేశీ పెట్టుబడులకు ఆహ్వానం - ఏజీఆర్ బకాయిలకు సంబంధించి నాలుగేళ్ల పాటు టెల్కోలకు మారటోరియం విధించింది. చదవండి : ఆర్థికమంత్రి హెచ్చరికలు.. ఒత్తిడిలో ఇన్ఫోసిస్.. నేడు ఆఖరు! -
ఇథనాల్ తయారీకి ప్రోత్సాహకాలు
న్యూఢిల్లీ: చక్కెర మిల్లులకు ప్రోత్సాహకాలతో కూడిన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రానున్న సీజన్ 2021–22కు సంబంధించి అదనపు దేశీయ విక్రయకోటాను ప్రకటించింది. ఇందులో భాగంగా చెరకును ఇథనాల్ తయారీకి వినియోగించే మిల్లులకు ప్రోత్సాహకాలు లభించనున్నాయి. అంతర్జాతీయంగా ఉన్న గరిష్ట ధరలను సానుకూలంగా మలుచుకుని అక్టోబర్ నుంచి మొదలయ్యే కొత్త సీజన్ తొలినాళ్లలోనే ఎగుమతులకు ప్రణాళిక రూపొందించుకోవాలని మిల్లులకు సూచించింది. దీంతో ఎగుమతులకు సబ్సిడీలను కొనసాగించకపోవచ్చని తెలుస్తోంది. ప్రపంచంలో రెండో అతిపెద్ద చక్కెర ఉత్పత్తి దేశంగా ఉన్న భారత్.. గత రెండేళ్ల నుంచి చక్కెర ఎగుమతులకు ప్రోత్సాహకాలు అందిస్తోంది. దేశీయంగా వినియోగం కంటే ఉత్పత్తి అధికంగా ఉండడమే దీనికి కారణం. ఖరీదైన చమురు ఉత్పత్తులకు ప్రత్యామ్నాయంగా దేశీయంగా ఇథనాల్ వినియోగాన్ని ప్రోత్సహించాలని కేంద్రం పట్టుదలతో ఉంది. ఇందులో భాగంగానే ఇథనాల్ తయారీకి చెరకును మళ్లించే పరిశ్రమలకు ప్రోత్సాహకాలను ప్రకటించింది. రెండు విధాలుగా ప్రయోజనం చక్కెరను ఎగుమతి చేసే మిల్లులు.. ఇథనాల్ తయారీకి మళ్లించడం ద్వారా ‘అదనపు నెలవారీ దేశీయ కోటా’ కింద ప్రోత్సాహకాలు అందుకోవచ్చంటూ ఆహార శాఖ ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతానికి దేశీయ మార్కెట్లో చక్కెర విక్రయాలకు నెలవారీ కోటాను (సుమారు 21 లక్షల టన్నులు) కేంద్రం నిర్ణయిస్తోంది. ‘గత నెలరోజుల్లో అంతర్జాతీయంగా చక్కెర ధరలు గణనీయంగా పెరిగాయి. భారత ముడి చక్కెరకు ఎంతో డిమాండ్ ఉంది. కనుక రానున్న సీజన్లో ఎగుమతులకు సంబంధించి మిల్లులు ముందే ప్రణాళిక రూపొందించుకోవాలి. చక్కెర ఎగుమతితోపాటు.. ఇథనాల్ తయారీకి మళ్లించడం వల్ల మిల్లులకు నిధుల ప్రవాహం పెరిగి చెరకు రైతులకు సకాలంలో చెల్లింపులు చేయగలుగుతాయి. ఇది దేశీయంగా ధరల స్థిరత్వానికి, మిల్లులకు ఆదాయం పెరిగేందుకు తోడ్పడుతుంది’ అని ఆహార శాఖ పేర్కొంది. మూడు సీజన్లలో రూ.22,000 కోట్లు గడిచిన మూడు చెరకు సీజన్లలో ఇథనాల్ తయారీ వల్ల మిల్లులు రూ.22,000 కోట్ల ఆదాయన్ని పొందినట్టు కేంద్ర ఆహార శాఖ తెలిపింది. ప్రస్తుత సీజన్లో ఇథనాల్ విక్రయం ద్వారా మిల్లులకు రూ.15,000 కోట్ల ఆదాయం లభించినట్టు వివరించింది. 2019–20 సీజన్లో 9,26,000 టన్నుల చక్కెరను ఇథనాల్ తయారీకి మిల్లులు వినియోగించాయి. 2018–19లో 3,37,000 టన్ను లతో పోలిస్తే మూడింతలు పెరగడం గమనార్హం. -
మహిళా స్టార్టప్‌లకు కొత్త ప్రోత్సాహకాలు
సాక్షి, హైదరాబాద్: ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ఐటీశాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. మహిళలు స్థాపించిన స్టార్టప్‌లను వర్గీకరిస్తూ మంగళవారం ఐటీ కమ్యూనికేషన్ల శాఖ ఉత్తర్వులు జారీచేసింది. కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ సంస్థల వద్ద నమోదైన స్టార్టప్‌లలో మహిళల వాటా 33% ఉంటే, ఇకపై వాటిని మహిళా స్టార్టప్‌లుగా.. స్టార్టప్‌లలో వారివాటా 20% ఉంటే మహిళా ఎంటర్ ప్రెన్యూ ర్లుగా గుర్తిస్తారు. రాష్ట్రంలో 2 కోట్ల కంటే ఎక్కువ మంది గ్రామాల్లోనే ఉంటున్నారు. దీంతో సాంకేతికత లోపం, సంప్రదాయ వ్యవసాయ విధానాలను అనుసరించటం, ఆర్థిక వెనుకబాటు, నిరక్షరాస్యత వంటివి వారి ఎదుగదలను దెబ్బతీస్తున్నాయి. ఈ నేపథ్యంలో వారిలోని నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ఐటీశాఖ ప్రత్యేక చర్యలకు సిద్ధమైంది. క్షేత్ర స్థాయి ఆవిష్కరణల్లో ఎంపికైన వారికి రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు గ్రాంటుగా అందజేస్తుంది. కాగా, ప్రభుత్వం 2017లో ప్రకటించిన ఎస్జీఎస్టీ, పేటెంట్ ధర, ఇంట ర్నేషనల్ మార్కెట్, రిక్రూట్మెంట్ అసెస్మెంట్, పనితీరు ఆధారిత గ్రాంటు తదితర విషయాల్లో గతంలో ప్రకటించిన మార్గదర్శకాల్లో తాజాగా స్వల్ప మార్పులు చేసింది. -
హెచ్‌సీఎల్ ఉద్యోగులకు ఉచితంగా బెంజ్ కార్లు..!
పలు ఐటీ దిగ్గజ కంపెనీలు తమ ఉద్యోగులకు ఉత్తమ ప్రతిభను కనబర్చినందుకుగాను ప్రోత్సాహాకాలను అందిస్తాయి. ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ తన కంపెనీ ఉద్యోగుల కోసం బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. కంపెనీల్లో ప్రతిభ కనబర్చిన ఉద్యోగుల కోసం భారీ బహుమతులను అందిస్తున్నట్లు తెలుస్తోంది. కంపెనీలోని టాప్ పెర్పామర్లకు మెర్సిడెస్ బెంజ్ కార్లను ఇవ్వాలని హెచ్‌సీఎల్ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనపై బోర్డు ఆమోదం తెలపాల్సి ఉందని కంపెనీ చీఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్ అప్పారావు వీవీ పేర్కొన్నారు. అట్రిషన్ విధానాన్ని నివారించేందుకు పలు ఐటీ కంపెనీలు ఉద్యోగులకు ప్రోత్సాహకాలను అందిస్తాయి. రీప్లేస్మెంట్ హైరింగ్ కాస్ట్ 15 నుంచి 20 శాతం ఎక్కువ ఉండడంతో తమ ఉద్యోగుల్లో నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు ప్రాధాన్యత ఇస్తున్నామని వీవీ అప్పారావు పేర్కొన్నారు. జావా డెవలపర్‌ను ప్రస్తుతం ఇచ్చే ప్యాకేజ్‌లో హైర్ చేసుకోవచ్చు, కానీ క్లౌడ్ ప్రోఫెషనల్స్‌ను సేమ్ ప్యాకేజ్‌లపై హైర్ చేసుకోలేమని తెలిపారు. హెచ్‌సీఎల్‌లో మంచి రిటెన్షన్ ప్యాకేజ్ ఉందని, ప్రతి సంవత్సరం ఉద్యోగుల జీతంలో 50 నుంచి 100 శాతం వరకు క్యాష్ ఇన్సెంటివ్ స్కీమ్‌ను అందిస్తున్నామని వెల్లడించారు. ఈ స్కీమ్‌తో సుమారు 10 శాతం మందికి కీలక నైపుణ్యాలు కల్గిన ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. అంతేకాకుండా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను సుమారు 22 వేల మందిని కొత్తగా ఉద్యోగులను హైర్ చేసేందుకు కంపెనీ ప్రణాళికలు చేస్తోందని పేర్కొన్నారు ఇదిలా ఉండగా హెచ్‌సీఎల్ కంపెనీలో ఈ తైమాసికంలో ఉద్యోగుల అట్రిషన్ గత త్రైమాసికం కంటే 1.9 శాతం పెరిగి 11.8 శాతంగా నమోదైంది. -
పెట్టుబడులతో రండి.. ప్రోత్సాహకాలు పొందండి
సాక్షి, అమరావతి: కేంద్రం తరహాలోనే ఎలక్ట్రానిక్స్, టెలీకమ్యూనికేషన్ రంగంలో భారీ పెట్టుబడులను ఆకర్షించడానికి ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు(పీఎల్ఐ) అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ఐటీ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. కనీసం రూ.100 కోట్ల పెట్టుబడులు పెట్టి 1,000 మందికి ఉపాధి కల్పించే సంస్థలకు పదేళ్లపాటు అమ్మకాలపై ప్రోత్సాహకాలు ఇవ్వనున్నారు. 2020–21ని బేస్ సంవత్సరంగా పరిగణించి అమ్మకాలను లెక్కిస్తారు. రూ.500 కోట్ల పెట్టుబడి.. 4,000 మందికిపైగా ఉపాధి కల్పించే మెగా ప్రాజెక్టులకు ఆయా పెట్టుబడుల ఆధారంగా మరిన్ని ప్రోత్సాహకాలు అందించనున్నారు. త్వరలో విడుదల చేయనున్న ఐటీ–ఎలక్ట్రానిక్స్ పాలసీ సందర్భంగా ఈ పీఎల్ఐ స్కీంను కూడా ప్రకటించనున్నారు. ఇప్పటికే ఈ ప్రతిపాదనలను సీఎం వైఎస్ జగన్‌కు వివరించామని, ఆయన కొన్ని సూచనలు చేశారని మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ‘సాక్షి’కి వివరించారు. వాటిని పరిగణనలోకి తీసుకొని త్వరలోనే నూతన పాలసీని విడుదల చేస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన పీఎల్ఐ స్కీం కింద దేశంలో పెట్టుబడులు పెట్టే సంస్థలను రాష్ట్రానికి ఆకర్షించేలా ఈ నూతన విధానం రూపొందిస్తున్నట్లు తెలిపారు. కాగా, వచ్చే ఐదేళ్లలో ఎలక్ట్రానిక్స్ రంగం విలువ 100 బిలియన్ డాలర్ల నుంచి 400 బిలియన్ డాలర్లకు చేరుతుందని.. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి రాష్ట్రంలో పీఎల్ఐ స్కీం ప్రవేశపెట్టనున్నట్లు ఈ మధ్య కలిసిన జపాన్ ప్రతినిధి బృందానికి సీఎం వైఎస్ జగన్ వివరించారు. చదవండి: (ఆర్టీసీ బస్టాండ్లలో ఆప్కో స్టాళ్లు) -
దివాళి బొనాంజా : కేంద్రం ప్రోత్సాహకాలు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రూ 2 లక్షల కోట్ల విలువైన ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహకాలకు బుధవారం కేబినెట్ ఆమోదం తెలిపింది. దేశీ తయారీరంగాన్ని ప్రోత్సహించేందుకు పది రంగాల్లో ఈ పథకాన్ని అమలు చేసేందుకు నిర్ణయించినట్టు కేబినెట్ భేటీ అనంతరం కేంద్ర సమాచార, ప్రసార మంత్రి ప్రకాష్ జవదేకర్ వెల్లడించారు. ఫార్మా, ఆటో, స్టీల్, టెలికాం, జౌళి, ఆహోరోత్పత్తులు, సోలార్ ఫోటోవోల్టిక్, సెల్ బ్యాటరీ వంటి పది రంగాలకు వర్తింపచేసినట్టు తెలిపారు. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య పథకాలకు మరింత ఊతమిస్తామని, వయబులిటి గ్యాప్ ఫండింగ్ కింద 8100 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని మంత్రి తెలిపారు. దేశీ తయారీరంగాన్ని అంతర్జాతీయ స్ధాయిలో దీటుగా మలిచేందుకు చర్యలు చేపడతామని ప్రకాష్ జవదేకర్ తెలిపారు. తయారీ రంగంలో పెట్టుబడులను ప్రోత్సహిస్తామని చెప్పారు. చదవండి : జౌళి సంచుల్లోనే ఆహార ధాన్యాలు -
ఆ వాహనాలు కొనేవారికి బంపర్ ఆఫర్
లండన్ : ఎలక్ర్టిక్ వాహనాల వినియోగాన్ని పలు దేశాలు ప్రోత్సహిస్తున్న క్రమంలో బ్రిటన్ ఓ ఆకర్షణీయ ప్రతిపాదనతో ముందుకురానుంది. డీజిల్, పెట్రోల్ వాహన యజమానులు ఎలక్ర్టిక్ వాహనాల కొనుగోలుకు ముందుకు వస్తే వారికి 6000 పౌండ్లు అందించేందుకు బ్రిటన్ కసరత్తు చేస్తోంది. నూతన వాహనాలకు డిమాండ్ పెంచడంతో పాటు పర్యావరణ పరిరక్షణ వంటి రెండు ప్రయోజనాలు నెరవేరేలా ఈ ప్రతిపాదనపై బ్రిటన్ యోచిస్తోంది. ఫ్రాన్స్, జర్మనీ వంటి పలుదేశాలు ఎలక్ర్టిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్న క్రమంలో బ్రిటన్ ఈ దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. కోవిడ్-19 సంక్షోభ సమయంలో ఆటోమొబైల్ రంగానికి ఊతమిచ్చేందుకు కార్ స్క్రాపేజ్ స్కీమ్‌ను బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ పరిశీలిస్తున్నారని టెలిగ్రాఫ్ పేర్కొంది. కరోనా లాక్‌డౌన్‌తో కార్ల తయారీదారుల ఉత్పత్తి, సరఫరాలు తగ్గుముఖం పట్టడమే కాకుండా వాహనాలకు డిమాండ్ సైతం రికార్డు కనిష్టాలకు పడిపోయింది. కొత్తగా ఎలక్ర్టిక్ వాహనాల కొనుగోళ్లకు రాయితీలు అందిస్తే బ్రిటన్‌లో వాహన తయారీ కంపెనీలకు ఊతమిచ్చినట్టు అవుతుందని టెలిగ్రాఫ్ పేర్కొంది. భారత్‌లోనూ.. పాత కార్లను వదిలించుకుని ఎలక్ర్టిక్ వాహనాలు, నూతన వాహనాలను కొనుగోలుచేసే వారికి ప్రోత్సాహకంగా కార్ స్ర్కాపేజ్ పాలసీకి భారత్ తుదిమెరుగులుదిద్దుతోంది. ఈ ప్రతిపాదన భారత ఆటోమొబైల్ పరిశ్రమకు కొత్త ఊపునిస్తుందని భావిస్తున్నారు. ఈ దిశగా నూతన విధానానికి శ్రీకారం చుడతామని ఎంఎస్ఎంఈ, ఉపరితల రవాణా, హైవేల మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల సానుకూల సంకేతాలు పంపారు. చదవండి : మాల్యా అప్పగింతలో మరింత జాప్యం -
బడ్జెట్లో తగినన్ని ప్రోత్సాహకాలు కల్పించాం
ముంబై: తాజాగా తాను సమర్పించిన బడ్జెట్లో వివేకంతో, జాగ్రత్తతో కూడిన ప్రోత్సాహక చర్యలను ప్రకటించినట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. శుక్రవారం ముంబైలో పారిశ్రామిక ప్రతినిధులతో సమావేశమైన సందర్భంగా మంత్రి మాట్లాడారు. ‘‘దశాబ్ద కనిష్టానికి వృద్ధి రేటు క్షీణించిన సమయంలో కొన్ని నియోజకవర్గాలు బడ్జెట్లో భారీ ప్రకటనలు లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసినట్టు గుర్తించాం. గతంలో ప్రోత్సాహకాలకు సంబంధించిన అనుభవం ఆధారంగా మేము.. తగినంత జాగ్రత్తతో, వివేకంతోనే బడ్జెట్లో వ్యవహరించాం. స్థూల ఆర్థిక అంశాలను దృష్టిలో ఉంచుకుని.. వినియోగం పెంచేందుకు, దీర్ఘకాలం పాటు పెట్టుబడుల ఆకర్షణ ద్వారా ఆస్తుల కల్పనకు తగినన్ని ప్రోత్సాహకాలు కల్పించాం’’ అని సీతారామన్ వివరించారు. ఎఫ్ఆర్డీఐ బిల్లుపై పని జరుగుతోంది.. వివాదాస్పద ఫైనాన్షియల్ రిజల్యూషన్స్ అండ్ డిపాజిట్ ఇన్సూరెన్స్ (ఎఫ్ఆర్డీఐ) బిల్లుపై ఆర్థిక శాఖా పని కొనసాగిస్తోందని మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ బిల్లు పార్లమెంటు ముందుకు తిరిగి ఎప్పుడు వస్తుందన్నది స్పష్టంగా చెప్పలేనన్నారు. సంక్షోభంలో ఉన్న బ్యాంకులను ఒడ్డెక్కించేందుకు డిపాజిటర్ల డబ్బులను కూడా వినియోగించుకోవచ్చన్న వివాదాస్పద క్లాజులు బిల్లులో ఉండడంతో ప్రతిపక్షాల నుంచి తీవ్ర అభ్యంతరాలు రావడం వల్ల గతంలో ఈ బిల్లును సభ నుంచి ప్రభుత్వం ఉపసంహరించుకుంది. -
ఆదర్శ వివాహాలకు ప్రభుత్వం చేయూత
సాక్షి, మిర్యాలగూడ: ఇరువురు ఇష్టపడి కులాంతర వివాహం చేసుకున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందజేస్తోంది. కాగా ఈ కులాంతరం చేసుకున్న వారికి 1980 నుంచి ప్రోత్సాహకాలను అందిస్తుండగా.. అప్పట్లో ఈ ప్రోత్సాహకం రూ. 30వేలు ఉండేది. 1993లో దీనిని రూ. 40వేలకు పెంచింది. 2011లో రూ. రూ. 50వేలకు చేయగా.. 2019 అక్టోబరు 30న ఎస్సీలకు చెందిన యువతీ, యువకులను వివాహ చేసుకున్న వారికి నజరానా రూ. 2.50లక్షలకు పెంచింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను కూడా జారీ చేసింది. జిల్లాలో ఎస్సీ కులాంతర వివాహాల ప్రోత్సాహకాల బాధ్యతను జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారులకు అప్పగించింది. కులాంతర వివాహాలు చేసుకున్న జంటలు సమాజంలో ఎదురయ్యే పరిణామాలను దీటుగా ఎదుర్కొనేందుకు ఆ కుటుంబానికి ఆసరాగా నిలిచే విధంగా ప్రభుత్వం చేయూతనిస్తోంది. ఇందుకోసం కులాంతర వివాహం చేసుకున్న జంటలు ఆన్లైన్లో www.telanganaepass.cgg.gov.in లో దరఖాస్తు చేసుకోవాలని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారులు పేర్కొంటున్నారు. కాగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వధువు కాని వరుడు కాని కులాంతర వివాహం చేసుకొని ఉండాలని, వదుధు లేదా వరుడికి రూ. 2లక్షల లోపు ఆదాయం ఉండాలని అధికారులు పేర్కొంటున్నారు. సమర్పించాల్సిన పత్రాలు.. ఇరువురి ఆధార్ కార్డులను జత చేయాలి వధూవరులకు బ్యాంకులో జాయింట్ అకౌంట్ కలిగి ఉండాలి. కుల, ఆధాయ ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరిగా ఉండాలి వివాహం జరిగినట్లు రిజిస్ట్రేషన్ ధ్రువీకరణ పత్రాలు జత చేయాల్సి ఉంటుంది. కులాంతర వివాహం చేసుకున్నట్లు సాక్షుల ఆధార్ కార్డులు సైతం జత చేయాల్సి ఉంటుంది. వధూవరులు పూర్తి చిరునామా కలిగి ఉండాలి. ఇప్పటి వరకు ఎవరూ దరఖాస్తు చేసుకోలేదు కులాంతర వివాహం చేసుకున్న వారికి ఇప్పటివరకు రూ. 50వేలు ఉండగా.. ప్రభుత్వం వారికి చేయూతనిచ్చేందుకు రూ. 2.50లక్షలకు పెంచింది. అయితే కులాంతర వివాహం చేసుకున్న వారికి 3 ఏళ్ల పాటు డిపాజిట్ చేసిన చెక్కును అందించడం జరుగుతుంది. దరఖాస్తు చేసుకున్న వారికి ఈ ప్రోత్సాహకాలు తప్పనిసరిగా అందుతాయి. పూర్తి స్థాయిలో అన్ని ఆధారాలతో దరఖాస్తు చేసుకోవాలి. – రాజ్‌కుమార్, షెడ్యూల్డ్ కులాల సంక్షేమ శాఖ అధికారి, నల్లగొండ -
విదేశీ పెట్టుబడులకు గాలం
అమెరికా–చైనా మధ్య వాణిజ్య యుద్ధం నేపథ్యంలో పెట్టుబడుల అవకాశాలను అందిపుచ్చుకోవడంపై భారత్ దృష్టి సారిస్తోంది. బహుళజాతి సంస్థ(ఎంఎన్సీ)లను రప్పించేందుకు తీసుకోతగిన చర్యలపై కసరత్తు చేస్తోంది. టెస్లా, గ్లాక్సోస్మిత్‌క్లెయిన్ వంటి 324 కంపెనీలకు ప్రోత్సాహకాలు ఇచ్చే ప్రతిపాదనలు పరిశీలిస్తోంది. ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసే సంస్థలకు స్థలం ఇవ్వడంతో పాటు విద్యుత్, నీరు, రోడ్డు మార్గం వంటి సదుపాయాలు కూడా కల్పించడం తదితర అంశాలు వీటిలో ఉన్నాయి. పరిశ్రమ, అంతర్గత వాణిజ్యం పెట్టుబడుల ప్రోత్సాహక విభాగం ఈ మేరకు ఒక ముసాయిదా రూపొందించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అమెరికన్ దిగ్గజం ఎలీ లిలీ అండ్ కో, దక్షిణ కొరియాకు చెందిన హన్వా కెమికల్ కార్పొరేషన్, తైవాన్ సంస్థ హాన్ హాయ్ ప్రెసిషన్ ఇండస్ట్రీ తదితర దిగ్గజ కంపెనీలతో కేంద్రంలోని ఉన్నతాధికారులు సంప్రదింపులు జరపనున్నట్లు వివరించాయి. భూ, కార్మిక చట్టాలతోనే సవాలు... వాణిజ్య యుద్ధాల నేపథ్యంలో పలు పెద్ద కంపెనీలు చైనాకు ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తున్నాయి. వియత్నాం, మలేషియా వంటి దేశాలను ఎంచుకుంటున్నాయి. కఠినమైన భూసేకరణ నిబంధనలు, కార్మిక చట్టాలున్న కారణంగా భారత్‌ను పక్కన పెడుతున్నాయి. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలనుకునే సంస్థలు.. తామే స్థలాన్ని సేకరించుకోవాల్సి ఉంటోంది. అయితే, వివిధ కారణాల రీత్యా దీనికి చాలా సమయం పట్టేస్తుండటంతో అసలు ప్రాజెక్టును ప్రారంభించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో ఇన్వెస్ట్ చేసేందుకు కంపెనీలు ముందుకు రావడం లేదు. ఇలాంటి ప్రతికూలాంశాలను గుర్తించిన కేంద్రం.. విదేశీ పెట్టుబడులను మరింతగా ఆకర్షించేందుకు తీసుకోతగిన చర్యలపై దృష్టి పెడుతోంది. ప్రతిపాదనలు ఇవీ... ముసాయిదా ప్రతిపాదనల ప్రకారం తక్షణమే కార్యకలాపాలు ప్రారంభించేందుకు అనువైన పారిశ్రామిక క్లస్టర్స్ కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేస్తుంది. అలాగే పెట్టుబడులు, ఎంచుకున్న ప్రాంతం ప్రాతిపదికగా ప్రోత్సాహకాలు ఇస్తుంది. యాంటీ–డంపింగ్ సుంకాలను క్రమబద్ధీకరిస్తుంది. ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాలు, ఇంధనాన్ని ఆదా చేసే వాహనాల తయారీకి ప్రోత్సాహకాలు ఉంటాయి. అటు ఎలక్ట్రానిక్స్, టెలికం రంగాలకు సంబంధించి ఉద్యోగాలపరమైన వెసులుబాట్లు, పెట్టుబడుల ప్రాతిపదికన తయారీ సంబంధ ప్రోత్సాహకాలు మొదలైనవి పరిశీలనలో ఉన్నాయి. ఈ ప్రతిపాదనలన్నింటినీ ప్రధాని కార్యాలయం పరిశీలిస్తోందని, త్వరలోనే నిర్ణయం తీసుకోవచ్చని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ దిశగా... 2025 నాటికి 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని భారత్ నిర్దేశించుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వృద్ధికి దోహదపడే అన్ని అవకాశాలను అందిపుచ్చుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా.. ఎగుమతులను ప్రోత్సహించేందుకు, పెట్టుబడులను ఆకర్షించేందుకు, వ్యాపారాల నిర్వహణకు అనుకూల పరిస్థితులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే కార్పొరేట్ ట్యాక్స్ రేటు తగ్గించడం, విదేశీ పెట్టుబడుల నిబంధనలు సడలించడం తదితర సంస్కరణలు ప్రవేశపెట్టింది. వీటి ఊతంతో వ్యాపారాలకు అనువైన దేశాల జాబితాలో ర్యాంకింగ్స్‌ను గణనీయంగా మెరుగుపర్చుకుంటోంది. ప్రపంచ బ్యాంక్ రూపొందించే ఈ లిస్టులో 2017 నుంచి ఏకంగా 37 ర్యాంకులు పైకి ఎగబాకింది. అయినప్పటికీ రువాండా, కొసొవో వంటి దేశాల కన్నా ఇంకా దిగువనే 63వ ర్యాంకులో ఉంది. దీంతో మరిన్ని సంస్కరణలపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. -
స్త్రీలోక సంచారం
టెన్నిస్ సూపర్‌స్టార్ సెరెనా విలియమ్స్ టాప్‌లెస్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రత్యక్షమై ఇంటర్నెట్లో సందేశం ఇచ్చారు. బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కల్పించడం కోసం సెరెనా తన రెండు వక్షోజాలపై చేతులను అడ్డుగా పెట్టుకుని, ‘ఐ టచ్ మైసెల్ఫ్’ అనే పాటను పాడుతూ తీసుకున్న వీడియోను ఆదివారం నాడు అప్లోడ్ చేసిన మొదటి పది గంటల్లోనే 10 లక్షల 30 వేల ‘వ్యూ’స్ వచ్చాయి! ఆస్ట్రేలియన్ పాప్ బ్యాండ్ ‘డీవైనల్స్’ 1991లో ‘బ్రెస్ట్ క్యాన్సర్ నెట్వర్క్ ఆస్ట్రేలియా’కు కోసం రాసిన హిట్ ‘ఐ టచ్ మైసెల్ఫ్’ నే ఆమె ఆలపించారు. ‘‘క్రమం తప్పకుండా బ్రెస్ట్‌లను చెక్ చేయించుకోవాలని మహిళలకు చెప్పడానికి నేను ఈ పాటను ఎంపిక చేసుకున్నాను. ఇలా టాప్‌లెస్‌గా నేనీ మాట చెప్పడం నాక్కొంత అసౌకర్యం కలిగించే విషయమే. అయితే నేను ఈ విషయంపై మాట్లాడాలనే అనుకున్నాను. శరీరవర్ణంతో నిమిత్తం లేకుండా ప్రపంచ మహిళలంతా ఎదుర్కొనడానికి అవకాశం ఉన్న సమస్య ఇది. తొలి దశలో గుర్తిస్తే ప్రాణాపాయం తప్పుతుంది’’ అని తన వీడియో కింద కామెంట్ పెట్టారు సెరెనా. ‘‘అమేజింగ్ సెరెనా! మీ అందమైన స్వరంతో ఈ సందేశం ఇవ్వడం ఎంతో బాగుంది’’ అని సోషల్ మీడియా ఆమెను ప్రశంసిస్తోంది. అక్టోబర్.. బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్. ఈ నెలంతా ప్రపంచవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. సదస్సులు, సెమినార్లలో మహిళలు తక్కువగా ప్రశ్నిస్తారట! 10 దేశాల్లో జరిగిన 250 ఈవెంట్లలో పాల్గొన్న వారిపై అధ్యయనం జరిపి యు.కె.లోని కేంబ్రిడ్జి యూనివర్సిటీ పరిశోధకులు ఈ విషయం కనిపెట్టారు. ఆ వివరాలను ‘ప్లస్ వన్’ అనే పత్రిక ప్రచురించింది. అసలు సెమినార్లలో పొల్గొనడంలోనే స్త్రీ పురుషుల మధ్య అంతరం చాలా ఎక్కువగా ఉందట. సెమినార్లకు వచ్చే ఆ కొద్దిమంది మహిళలు కూడా ప్రశ్నించేందుకు చొరవ చూపడంలేదని తమ అధ్యయనంలో స్పష్టమైందని పరిశోధకుల ప్రతినిధి అలేషియా కార్టర్ తమ నివేదికలో తెలిపారు. అకాడమీలలో జూనియర్ స్కాలర్లకు రోల్ మోడళ్లుగా మహిళలు ఎందుకు ఉండటం లేదని శోధించినప్పుడు అందుకు కారణంగా ఈ సంగతి (సెమినార్లలో మహిళలు తక్కువగా ప్రశ్నించే సంగతి) బయటపడిందట. ఈ పరిశోధకులు.. 20 దేశాలకు చెందిన 600 మంది స్త్రీ, పురుషుల్ని ప్రశ్నించారు. వీరిలో పోస్టుగ్రాడ్యుయేట్ విద్యార్థులు, ఫ్యాకల్టీ సభ్యులు ఉన్నారు. వీళ్లందరితో మాట్లాడినప్పుడు.. విద్యారంగ సదస్సులు, సెమినార్లలో పురుషులతో పోలిస్తే స్త్రీలు తక్కువ ప్రశ్నలు అడుగుతున్నట్లు తెలిసిందనీ, అయితే అందుకు కారణమేమిటో తెలియరాలేదని అలేషియా తమ గమనింపులకు ముగింపునిచ్చారు. దేశంలోనే తొలిసారిగా అసోమ్ ప్రభుత్వం తేయాకు తోటల్లో పని చేసే గర్భిణులకు ఆర్థిక ప్రోత్సాహకాలను ప్రకటించింది. అంతేకాదు, ఆరో నెల నిండినప్పటి నుండీ, ప్రసవం అయ్యాక మూడు నెలల వరకు.. మొత్తం ఆరు నెలలు వారు పనికి రానవసరం లేదు. ఈ ఆరు నెలల కాలానికీ నేరుగా వాళ్ల ఇళ్లకే జీత భత్యాలు వెళతాయి. ఇక ప్రభుత్వం.. గర్భిణి ఒకరికి ప్రకటించిన ఆర్థిక సహాయం ఎంతంటే 12 వేలు! ఇదంతా ఆమె ఆరోగ్యం కోసం, బిడ్డ ఎదుగుదల కోసం అవసరమైన పౌష్టికాహారం తీసుకోడానికి, ఇతరత్రా అవసరాలకు. గర్భం దాల్చిన తొలి మూడు నెలల కాలానికి 2 వేలు, తర్వాతి మూడు నెలలకు 4 వేలు, ఆసుపత్రిలో డెలివరీ సమయానికి 3 వేలు, బిడ్డ జననాన్ని నమోదు చేయించేటప్పుడు 3 వేలు.. ఇలా నాలుగు విడతలుగా పై మొత్తాన్ని అందచేస్తారు. ఇది కాకుండా.. ఆ గర్భిణి కనుక ఇద్దరు పిల్లల నియంత్రణ పాటిస్తే, 18 ఏళ్ల తర్వాత మాత్రమే ఆమె తల్లి అయితే, ఇంట్లో కాకుండా ఆసుపత్రిలో మాత్రమే కాన్పు జరిపించుకుంటే, పని చేస్తున్న తేయాకు తోటల్లోనే నివాసం ఉంటున్నట్లయితే, భారతీయ పౌరురాలైతే.. అదనంగా మరికొన్ని సదుపాయాలను, వసతులను ప్రభుత్వం కల్పిస్తుంది. -
జన్‌ధన్ ఓవర్–డ్రాఫ్ట్ రెట్టింపు
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజన పథకాన్ని కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతోపాటుగా మరింత మంది బ్యాంకు అకౌంట్లు తెరిచేందుకు ప్రోత్సాహకాలు అందించనున్నట్లు ప్రకటించింది. ప్రధాని అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపింది. ఈ పథకానికి మంచి ఆదరణ లభిస్తున్నందున.. పథకాన్ని కొనసాగించడంతోపాటు ప్రస్తుతమున్న రూ.5వేల ఓవర్ డ్రాఫ్ట్‌ను రూ.10వేలకు పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. రూ.2వేల వరకు ఓవర్–డ్రాఫ్ట్ ఎలాంటి షరతులు ఉండవని.. ఈ సదుపాయాన్ని పొందేందుకు గరిష్ట వయసును 60 నుంచి 65 ఏళ్లకు పెంచినట్లు మంత్రి పేర్కొన్నారు. దీంతోపాటుగా ఆగస్టు 28 నుంచి జన్‌ధన్ అకౌంట్లపై ఉన్న ఉచిత ప్రమాదబీమా మొత్తాన్ని రెట్టింపు చేసి రూ.2లక్షలకు పెంచుతున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు నాలుగేళ్లలో దేశవ్యాప్తంగా 32.41కోట్ల జన్‌ధన్ అకౌంట్లు తెరవగా.. వీటిలో రూ.81,200కోట్లు డిపాజిట్లు ఉన్నాయి. ఇందులో 30 లక్షల మంది ఓవర్–డ్రాఫ్ట్ సదుపాయాన్ని వినియోగించుకున్నారన్నారు. ఆగస్టు 2014లో ప్రారంభించిన ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజనను మొదట నాలుగేళ్లు మాత్రమే అమలుచేయాలనుకున్నా.. ప్రజల నుంచి వస్తున్న ఆదరణ కారణంగా కొనసాగించనున్నట్లు జైట్లీ వెల్లడించారు. అటు, దేశవ్యాప్తంగా పులులు, ఏనుగుల సంరక్షణ ప్రయత్నాలను ప్రోత్సహించేందుకు కేంద్రం ప్రభుత్వ నిధులతో నడిచే ‘వన్యప్రాణి నివాస సమగ్రాభివృద్ధి’ పథకాన్ని 2019–20 వరకు కొనసాగించాలని కూడా కేబినెట్ నిర్ణయిచింది. -
టెక్స్టైల్స్ పరిశ్రమకు ప్రోత్సాహకాలు!
న్యూఢిల్లీ: దేశీయ టెక్స్టైల్స్ పరిశ్రమకు మరింత జీవం పోసేందుకు కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకోనుంది. 300 రకాల వస్త్రోత్పత్తుల దిగుమతులపై సుంకాలు పెంచనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. తద్వారా దేశీయ తయారీకి ప్రోత్సాహాన్నిచ్చి మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించాలన్నది ప్రభుత్వ ఆలోచనగా పేర్కొన్నాయి. అలాగే, ఈ రంగానికి సంబంధించి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నిబంధనలను సైతం సరళీకరించనున్నట్టు ఆ వర్గాలు తెలిపాయి. ఇలా దిగుమతి సుంకాలు పెంచే వాటిలో కొన్ని రకాల ఫ్యాబ్రిక్స్, గార్మెంట్స్, మానవ తయారీ ఫైబర్స్ ఉన్నట్టు చెప్పాయి. ప్రస్తుతం వీటిపై సుంకాలు 5–10 శాతం స్థాయిలో ఉండగా, 20 శాతానికి పెంచనున్నట్టు తెలిపాయి. ఇందుకు సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు వెల్లడించాయి. ఈ వారంలోనే సుంకాలు పెంచాలని నిర్ణయిస్తే ముందుగా పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశం ఉందని ఆ వర్గాలు తెలిపాయి. సుంకాలు పెంచడం వల్ల విదేశీ ఉత్పత్తుల కంటే దేశీయ తయారీ ఉత్పత్తుల ధరలు తక్కువగా ఉండేందుకు అవకాశం కలుగుతుంది. -
20% జీఎస్టీ క్యాష్‌బ్యాక్
న్యూఢిల్లీ: నగదురహిత లావాదేవీలు జరిపే వారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలన్న ప్రతిపాదనలకు జీఎస్టీ మండలి ఆమోదం తెలిపింది. రుపే కార్డులు, భీమ్ యాప్, యూపీఐ వ్యవస్థల ద్వారా గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో నగదురహిత లావాదేవీలు జరిపే వారికి ప్రయోగాత్మకంగా ప్రోత్సాహకాలివ్వాలని నిర్ణయించింది. రాష్ట్రాలే ఈ చెల్లింపులు జరపాలని శనివారం ఢిల్లీలో జరిగిన జీఎస్టీ మండలి సమావేశంలో నిర్ణయించారు. జీఎస్టీఎన్, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా ఓ వ్యవస్థను ఏర్పాటుచేయనున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి గోయల్ చెప్పారు. ఒక్కసారి ఈ విధానం అమల్లోకి వస్తే రూపే కార్డు, భీమ్ యాప్, యూపీఐల ద్వారా చెల్లింపులు జరిపే వారు జీఎస్టీలో 20% క్యాష్‌బ్యాక్ పొందుతారు. ఇది గరిష్టంగా రూ.100 వరకు ఉండొచ్చు. ‘ఈ ప్రయత్నాన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాలని నిర్ణయించాం. రూపే కార్డు, భీమ్ యాప్, ఆధార్, యూపీఐ, యూఎస్ఎస్డీ లావాదేవీలు జరిపే వారికి ప్రోత్సాహకాలిస్తాం. ఎందుకంటే వీటిని పేద, మధ్యతరగతి ప్రజలే ఎక్కువగా వాడతారు’ అని ఆయన చెప్పారు. బిహార్ ఆర్థిక మంత్రి సుశీల్ మోదీ నేతృత్వంలోని మంత్రుల బృందం క్యాష్‌బ్యాక్ విధానంపై అధ్యయనం చేసి నివేదికను జీఎస్టీ మండలికి అందజేసింది. ఎంఎస్ఎంఈ రంగం ఎదుర్కొంటున్న సమస్యలను అధ్యయనం చేసేందుకు కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి శివ్‌ప్రతాప్ శుక్లా నేతృత్వంలో ఆరుగురు సభ్యుల కమిటీని ఏర్పాటుచేశారు. డిజిటల్ లావాదేవీలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలన్న ప్రతిపాదనను ఆర్థిక నిపుణులు స్వాగతిస్తున్నారు. భవిష్యత్తులో 3 జీఎస్టీ శ్లాబులే వస్తుసేవల పన్ను శ్లాబుల సంఖ్య భవిష్యత్తులో తగ్గే అవకాశం ఉందని ఆర్థిక శాఖ ప్రధాన సలహాదారు సంజీవ్ సన్యాల్ వెల్లడించారు. ప్రస్తుతమున్న నాలుగు శా>్లబుల (5, 12, 18, 28%) విధానం (పన్నురహిత శ్లాబు మినహాయించి) దీర్ఘకాలంలో మూడు శ్లాబులకు (5, 15, 25%) మారే అవకాశం ఉందన్నారు. 12%, 18% శ్లాబులను కలుపుకుని 15% మార్చే సూచనలున్నాయని భారత్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో సన్యాల్ ఈ విషయాన్ని వెల్లడించారు. -
చిరుధాన్యాల రైతుకు ఎకరానికి రూ.4 వేలు!
జాతీయ ఆహార భద్రతా మిషన్‌లో భాగంగా చిరుధాన్యాల సాగు విస్తీర్ణాన్ని, వినియోగాన్ని పెంపొందించడం ద్వారా పోషకాహార లోపాన్ని రూపుమాపాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకోసం దేశవ్యాప్తంగా ‘మిల్లెట్ మిషన్’ను 2018–19 నుంచి అమల్లోకి తెస్తున్నది. ఐదేళ్లలో రూ. 1,700 కోట్లను కేంద్రం ఖర్చు చేయనుంది. తొలి ఏడాదిలో రూ. 300 కోట్లు కేటాయించారు. చిరుధాన్యాలను సాగు చేసే రైతులకు ఎకరానికి రూ. 4 వేల వరకు నగదు ప్రోత్సాహకాన్ని అందించనున్నట్లు భారతీయ చిరుధాన్యాల పరిశోధనా సంస్థ(ఐ.ఐ.ఎం.ఆర్.) సంచాలకులు డా. విలాస్ ఎ. తొనపి వెల్లడించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా 13 రాష్ట్రాల్లో తొలుత మిల్లెట్ మిషన్ ఈ ఖరీఫ్ నుంచే అమల్లోకి వస్తుందని ‘సాక్షి సాగుబడి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపారు. ముఖ్యాంశాలు.. ► ‘మిల్లెట్ మిషన్’ విశేషాలేమిటి? హరిత విప్లవ కాలంలో వరి, గోధుమల సాగుపై దృష్టి కేంద్రీకరించడంతో పోషకాల గనులైన చిరుధాన్యాలు నిర్లక్ష్యానికి గురయ్యాయి. ఫలితంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజల్లో పౌష్టికాహార లోపం ఏర్పడడంతోపాటు జీవన శైలి వ్యాధులు ప్రబలుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాదిని కేంద్ర ప్రభుత్వం చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది. చిరుధాన్యాల సాగును, వినియోగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల మిల్లెట్ మిషన్ అమలుకు తొలి అడుగు పడింది. తొలుత 13 రాష్ట్రాల్లో మిల్లెట్ మిషన్‌ను ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ నుంచే అమల్లోకి తెస్తున్నాం. ఐదేళ్లలో రూ.1,700 కోట్లు ఖర్చు చేస్తాం. 2018–19లో రూ. 300 ఖర్చు చేయనున్నాం. ► చిరుధాన్యాలు సాగు చేసే రైతులకు ఎటువంటి ప్రోత్సాహకాలు ఇవ్వనున్నారు..? జొన్నలు, రాగులు, సజ్జలు, కొర్రలు, అండుకొర్రలు, సామలు, అరికెలు, ఊదలు వంటి చిరుధాన్యాలను సాగు చేసే రైతులతో క్లస్టర్లు ఏర్పాటు చేసి ప్రోత్సహిస్తాం. రాష్ట్రస్థాయిలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఆత్మ, నాబార్డు, ఐ.ఐ.ఎం.ఆర్. బాధ్యులతో కూడిన వర్కింగ్ గ్రూప్ మిల్లెట్ మిషన్ అమలును పర్యవేక్షిస్తుంది. 2018–19 ఖరీఫ్ సీజన్ నుంచే చిరుధాన్యాలు సాగు చేసే రైతులకు ఎకరానికి రూ. 4 వేల వరకు నేరుగా నగదు బదిలీ చేస్తాం. చిరుధాన్యాల ప్రదర్శనా క్షేత్రాలను ఏర్పాటు చేయడానికి రాష్ట్రాలు చర్యలు తీసుకుంటాయి. ప్రస్తుతం ప్రపంచదేశాల్లో అత్యధికంగా చిరుధాన్యాలను సాగు చేస్తున్నది మన దేశమే. దేశంలో 1.7 కోట్ల హెక్టార్లలో చిరుధాన్యాలు సాగవుతున్నాయి. 1.8 కోట్ల టన్నుల చిరుధాన్యాల ఉత్పత్తి జరుగుతోంది. ప్రతి సంవత్సరం పది శాతం సాగు పెంచాలన్నది లక్ష్యం. ► ప్రోత్సాహకాలు రైతులకా.. రైతు బృందాలకా? రైతులకు వ్యక్తిగతంగా కాదు. చిరుధాన్యాలు పండించే రైతుల ఉత్పత్తిదారుల సంఘం (ఎఫ్.పి.ఓ.) ద్వారా అందిస్తాం. నాబార్డు ద్వారా ఎఫ్.పి.ఓ.లను ఏర్పాటు చేస్తాం. ఎఫ్.పి.ఓ.లను ఏర్పాటు చేయడానికి అయ్యే ఖర్చును కూడా మిల్లెట్ మిషన్ నిధుల నుంచి కేటాయిస్తాం. తెలంగాణా రాష్ట్రంలో 8 జిల్లాల్లో చిరుధాన్యాల సాగును ప్రోత్సాహానికి ఏర్పాటు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోనూ అనేక జిల్లాల్లో చిరుధాన్యాల సాగును ప్రోత్సహిస్తున్నాం. ముఖ్యంగా చిన్న చిరుధాన్యాలైన కొర్రలు, అండుకొర్రలు, సామలు, అరికెలు, ఊదలు, ఒరిగల సాగును విలేజ్ క్లస్టర్ల ద్వారా ప్రోత్సహించడం.. స్థానికంగానే వినియోగంలోకి తేవడానికి మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టిసారిస్తున్నాం. స్వయం సహాయక బృందాల ద్వారా 100 మిల్లెట్ ప్రాసెసింగ్ క్లస్టర్లను ఏర్పాటు చేస్తాం. ఎఫ్.పి.ఓ.లు కొన్నిటిని కలిపి ఫెడరేషన్‌గా ఏర్పాటు చేస్తాం. ► విత్తనం కోసం ఎవరిని సంప్రదించాలి? హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని భారతీయ చిరుధాన్యాల పరిశోధనా సంస్థ (డా.రఘునా«ద్: 99842 15020, డా. వెంకటేష్ భట్: 94406 44040)లో, నంద్యాలలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం (డా. సుబ్బారావు: 99896 25227), విజయనగరంలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం(డా. పాత్రో: 97010 23194) చిరుధాన్య విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. ► ప్రాసెసింగ్ యంత్రాలపై సబ్సిడీ ఇస్తారా? పౌష్టికాహార లోపం, జీవనశైలి వ్యాధుల బెడద ప్రస్తుతం పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంత వాసుల్లో కూడా అధికంగానే ఉన్నాయి. అందువల్ల చిరుధాన్యాల వినియోగాన్ని గ్రామీణ ప్రాంతాల్లో కూడా బాగా పెంచాలన్నదే లక్ష్యంగా పెట్టుకున్నాం. రైతులు సాగు చేసిన చిరుధాన్యాలను రాష్ట్ర ప్రభుత్వాలు సేకరించి స్థానికంగానే ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేస్తాయి. రైతుల పొలాల దగ్గరలోనే ప్రాథమిక స్థాయి ప్రాసెసింగ్ సదుపాయాలను అందుబాటులోకి తేవాలన్నది లక్ష్యం. ఎఫ్.పి.ఓ.లకు ప్రాసెసింగ్ మిషన్లను సబ్సిడీపై అందిస్తాం. చిరుధాన్యాలను నిల్వ చేసుకోవడానికి గోదాముల నిర్మాణానికి కూడా తోడ్పాటునందిస్తాం. ప్రభుత్వ సంస్థలతోపాటు స్వచ్ఛంద సంస్థల సహకారం కూడా తీసుకుంటాం. ప్రస్తుతం ప్రోసెసర్లు చిరుధాన్యాల రైతులను దోపిడీ చేస్తున్నారు. అలా కాకుండా రైతులకు సాగు ఖర్చులకు 50% అదనంగా ధర వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ► చిరుధాన్య ఉత్పత్తులకు ప్రోత్సాహం చర్యలేమిటì ? హైదరాబాద్‌లోని ఐ.ఐ.ఎం.ఆర్.లో ఔత్సాహిక వ్యాపారవేత్తలకు ప్రత్యేక శిక్షణా సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నాం. అగ్రి బిజినెస్ ఇంక్యుబేటర్‌ను ఏర్పాటు చేస్తున్నాం. ఇందుకోసం వివరాలకు డా. దయాకర్‌రావు (99897 10405), డా. సంగప్ప (98800 45728)లను సంప్రదించవచ్చు. ► డాక్టర్ ఖాదర్‌వలి చిరుధాన్యాలకు సిరిధాన్యాలని పేరుపెట్టి.. రోగులకు ఔషధాలుగా ఇచ్చి జబ్బులు నయం చేస్తున్నారు. దీనిపై ఐ.ఐ.ఎం.ఆర్. అభిప్రాయం ఏమిటి.? అవును. మా దృష్టికి వచ్చింది. డాక్టర్ ఖాదర్ వలి గారు గొప్ప సేవ చేస్తున్నారు. ఆయనను ఆహ్వానించి గౌరవించాలనుకుంటున్నాం. ఆయన అనుసరిస్తున్న చికిత్సా పద్ధతిపై అధ్యయనం చేయించి.. చిరుధాన్యాల వినియోగం వ్యాప్తికి చేపట్టనున్న ప్రచారోద్యమంలో ఈ భావనను అంతర్భాగం చేస్తాం. ఈ కృషిలో ఆయుష్ శాఖ నిపుణుల తోడ్పాటు కూడా తీసుకుంటాం. (డా. తొనపిని 85018 78645 నంబరులో సంప్రదించవచ్చు. millets.icar@nic.in director.millets@icar.gov.in) -
అలా చేస్తే ఎంఆర్పీపై తగ్గింపు
సాక్షి, న్యూఢిల్లీ : డిజిటల్ లావాదేవీలను పెంచేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది. డిజిటల్ ద్వారా చెల్లింపులు చేపట్టే వినియోగదారులకు ఎంఆర్పీపై డిస్కౌంట్ ఇచ్చే ప్రతిపాదనకు రెవెన్యూ విభాగం తుదిమెరుగులు దిద్దుతోంది. ఈ డిస్కాంట్‌ను గరిష్టంగా రూ 100గా నిర్ణయించనున్నారు. ఇక డిజిటల్ పద్ధతిలో లావాదేవీలు నిర్వహించే వ్యాపారులకు టర్నోవర్ పరిమాణం ఆధారంగా క్యాష్‌బ్యాక్‌ను వర్తింపచేయనున్నారు. మే 4న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన జరిగే జీఎస్టీ కౌన్సిల్ భేటీ ముందు ఈ ప్రతిపాదనలను ఆర్థిక శాఖ సిద్ధం చేస్తోంది. ప్రధాని కార్యాలయంలో ఇటీవల జరిగిన సమావేశంలో డిజిటల్ లావాదేవీలను పెంచేందుకు ఈ తరహా ప్రోత్సాహకాలు ప్రకటించాలనే అంశంపై విస్తృతంగా చర్చించారు. ఇక డిజిటల్ లావాదేవీలు నిర్వహించే వ్యాపారులకు ఎలాంటి ప్రోత్సాహకాలు ఇవ్వాలనేదానిపైనా భారీ కసరత్తు జరిగింది. డిజిటల్ లావాదేవీలు చేపట్టే వ్యాపారులకు టర్నోవర్‌పై నిర్థిష్ట మొత్తంలో క్యాష్‌బ్యాక్ ప్రకటించడానికే రెవిన్యూ విభాగం మొగ్గుచూపినట్టు తెలిసింది. -
మా డబ్బులు ఇప్పించండి!
సాక్షి, హైదరాబాద్: ఎప్పుడో రెండేళ్ల క్రితం 2016 ఫిబ్రవరిలో దక్షిణాసియా (శాఫ్) క్రీడలు జరిగితే విజేతలకు ప్రకటించిన ప్రోత్సాహకాలు మాత్రం ఇప్పటికీ దక్కలేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇవ్వాల్సిన నగదు పురస్కారాల కోసం ఇప్పటికీ ప్రభుత్వం కార్యాలయాల చుట్టూ ఆటగాళ్లు తిరగాల్సిన పరిస్థితి... చివరకు నిధులు విడుదల చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత కూడా ఆటగాళ్లకు డబ్బులు అందలేదు! కామన్వెల్త్ క్రీడలకు బయల్దేరాల్సిన సమయంలో తమకు రావాల్సిన డబ్బు కోసం క్రీడాకారులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికీ తమ సమస్య తీరకపోవడంతో ఆవేదనగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పి. సుమీత్ రెడ్డి ‘శాఫ్’ క్రీడల పురుషుల డబుల్స్, టీమ్ విభాగాల్లో రెండు స్వర్ణాలు సాధించాడు. నిబంధనల ప్రకారం అతనికి రూ. 8.10 లక్షలు రావాల్సి ఉంది. అయితే అతనికి ఒక్క పైసా అందలేదు. తనకు రావాల్సిన డబ్బులు ఇప్పించమంటూ ఈ నెల 20న సుమీత్... రాష్ట్ర క్రీడా శాఖ మంత్రికి లేఖ రాశాడు. నిజానికి గత డిసెంబర్ 30న అకౌంట్ విభాగం మొత్తం రూ. 65 లక్షల 20 వేలు విడుదల చేస్తున్నట్లు ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. కానీ అధికారులు మూడు నెలలుగా తిప్పుతూనే ఉన్నారు. కామన్వెల్త్ క్రీడలకు వెళ్లాల్సిన సమయంలో ప్రభుత్వం తమకు అండగా నిలవాలని వారు కోరుతున్నారు. ఈ జాబితాలో సుమీత్‌తో పాటు షట్లర్లు సిక్కి రెడ్డి (రూ. 12.6 లక్షలు), మనీషా (రూ.6.6 లక్షలు), రుత్విక (రూ.9.6 లక్షలు), పీవీ సింధు (రూ.7.6 లక్షలు), జ్వాల (రూ.8.1 లక్షలు), సాయిప్రణీత్ (రూ. 3.6 లక్షలు) ఉన్నారు. ఇతర క్రీడాకారుల్లో అథ్లెట్ ప్రేమ్‌కుమార్‌కు రూ. 4 లక్షలు... మహేందర్ రెడ్డి, తేజస్విని (కబడ్డీ), రంజిత్, నందిని (ఖోఖో)లకు తలా రూ.1.25 లక్షలు రావాల్సి ఉంది. -
ఓలా, ఉబెర్ సేవలకు బ్రేక్!
సాక్షి, బిజినెస్ బ్యూరో/సిటీబ్యూరో : డ్రైవర్లకు చెల్లించే నగదు ప్రోత్సాహకాలు నిలిచిపోవటంతో దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఉబెర్, ఓలా ట్యాక్సీ డ్రైవర్లు ఆదివారం అర్థరాత్రి నుంచి సమ్మెకు దిగారు. హైదరాబాద్‌లో దాదాపు 50 శాతం మంది స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొన్నట్లు సమాచారం. ముంబైలో ఈ నిరసన ప్రభావం కొట్టొచ్చినట్టు కనపడింది. ఢిల్లీ, బెంగళూరు, పుణేలో మాత్రం ప్రభావం తక్కువే ఉంది. ఇరు కంపెనీలు ఒప్పంద సమయంలో ఇచ్చిన హామీ మేరకు తమకు ఆదాయాలు రావటం లేదని, అందుకే సమ్మెకు దిగామని డ్రైవర్లు చెబుతున్నారు. హైదరాబాద్‌లోనూ సమ్మె ప్రభావం... దేశవ్యాప్తంగా చేపట్టిన సమ్మెలో భాగంగా సోమవారం హైదరాబాద్‌లో ట్యాక్సీ డ్రైవర్లు సర్వీసులను నిలిపేశారు. దీంతో చాలాచోట్ల మధ్యాహ్నం వరకు క్యాబ్ సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. ఓలా, ఉబెర్‌లు తమను మొదట భాగస్వాములుగా గుర్తిస్తున్నట్లు ప్రకటించి ఎలాంటి ఒప్పందాలు, అంగీకార పత్రాలు లేకుండా నిలువుదోపిడీ చేస్తున్నాయని తెలంగాణ ఫోర్ వీలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సలావుద్దీన్ ఈ సందర్భంగా విమర్శించారు. నగరంలో రెండు క్యాబ్ సంస్థల్లో వాహనాల సంఖ్య ఒకానొక స్థాయిలో 1.25 లక్షలకు పెరిగింది. డ్రైవర్ ఓనర్లు ప్రత్యామ్నాయాలు చూసుకోవడంతో ఇప్పుడు ఈ సంఖ్య సగానికి పడిపోయిందని సమాచారం. మరోవైపు ఓలా సంస్థ లీజు ప్రాతిపదికన పెద్ద ఎత్తున వాహనాలను సమకూర్చుకుంది. దీంతో అప్పటి వరకు బుకింగ్లపైన ఆధారపడి వాహనాలు నడిపిన డ్రైవర్ల పరిస్థితి తలకిందులైంది. అన్నిచోట్లా ఇదే వాతావరణం ఉండటంతో లీజ్ ఒప్పందాలను రద్దు చేయాలనేది కూడా డ్రైవర్ల సమ్మె డిమాండ్లలోకి చేరింది. నెలకు రూ.75,000 ఉండాలి.. ప్రతి నెలా కనీసం రూ.75 వేలు లభించేలా బుకింగ్‌లు, ఇన్సెంటివ్‌లు ఇవ్వాలనేది డ్రైవర్ల ప్రధాన డిమాండ్. ప్రస్తుతం చాలా మంది డ్రైవర్లు నెలకు రూ.25 వేలు కూడా సంపాదించలేని పరిస్థితి నెలకొంది. లీజు క్యాబ్‌లకు అధిక బుకింగ్‌లు ఇవ్వటం, సొంత వాహనాలు ఉన్న డ్రైవర్లకు బుకింగ్‌లను భారీగా తగ్గించడమే దీనికి అసలు కారణం. హైదరాబాద్‌లో ఓలా, ఉబెర్‌లకు ప్రత్యామ్నాయంగా క్యాబ్ డ్రైవర్లే స్వయంగా నిర్వహించుకునేలా ‘టీసీడీఓఏ’ పేరిట మొబైల్ యాప్‌ను తెచ్చేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. క్యాబ్ డ్రైవర్ల ఉపాధికి కనీస గ్యారెంటీ లభించేలా దీన్ని రూపొందిస్తున్నట్లు టీసీడీఓఏ అధ్యక్షుడు శివ చెప్పారు. శంషాబాద్ కేంద్రంగా రెండు నెలల్లో ఈ సంస్థను ప్రారంభించనున్నట్లు ఆయన తెలియజేశారు. 5,000 మంది డ్రైవర్లతో ప్రారంభించి క్రమంగా దీన్ని విస్తరిస్తామన్నారు. ఈ మేరకు సోమవారం బాగ్ లింగంపల్లిలో సమావేశం కూడా నిర్వహించారు. టీసీడీఓఏ లక్ష్యాలు... ♦ ప్రతి డ్రైవర్‌కు రోజుకు రూ.3000 నుంచి రూ.5000 ఆదాయం ♦ ఆర్టీసీ డ్రైవర్ల తరహాలో 8 గంటల పని విధానం ♦ లాభాపేక్ష లేకుండా డ్రైవర్లే స్వయంగా నిర్వహించుకొనే వెసులుబాటు ♦ ప్రయాణికులకు మరింత మెరుగైన, నాణ్యమైన రవాణా సదుపాయాలు ♦ డ్రైవర్ల బీమా, ఇతర అన్ని సదుపాయాలు ఒకే వేదిక నుంచి అమలయ్యేలా చర్యలు తప్పనిసరి కావటంతోనే... ఓలా, ఉబెర్ సంస్థల్లో ఉపాధి అవకాశాలను మెరుగుపర్చుకొనేందుకు, బుకింగ్‌లు పెంచుకొనేందుకు అన్ని విధాలుగా ప్రయత్నం చేశాం. రెండేళ్ల పాటు పోరాటం చేశాం. జైలుకు కూడా వెళ్లాం. కానీ ఫలితం లేదు. ప్రభుత్వం కూడా మా బాధలను పట్టించుకోలేదు. గత్యంతరం లేక మేమే స్వయంగా మొబైల్ యాప్‌ను తెస్తున్నాం. –శివ (టీసీడీఓఏ) బండ్లు తాకట్టు పెట్టాను ఓలా, ఉబెర్‌లో ఉపాధి బాగుందని మంచిర్యాల నుంచి హైదరాబాద్ వచ్చా. ఏడాది పాటు బాగానే ఉంది. రెండు బండ్లు కొన్నా. ఓలాలో పెట్టా. కానీ క్రమంగా ఆదాయం పడిపోయింది. బండి ఫైనాన్స్ కూడా కష్టమైంది. వాహనాలు తాకట్టు పెట్టాల్సి వచ్చింది. ఎవరిపైనా ఆధారపడకుండా మేమే ఒక యాప్ ఏర్పాటు చేసుకోవడం మంచిదనిపిస్తోంది. –కమలహాసన్, డ్రైవర్ -
రైల్వే ఉద్యోగులకు ప్రోత్సాహకాలు
న్యూఢిల్లీ: ఉద్యోగుల్లో మనోధైర్యం, ఉత్సాహం పెంచడానికి ప్రత్యేక రివార్డులు, ప్రోత్సాహకాలు, బోనస్‌లు ఇవ్వాలని రైల్వే శాఖ యోచిస్తోంది. ఉత్తమ పనితీరు కనబరిచే వారికి మెరుగైన రివార్డులు ఇచ్చేలా పదోన్నతుల ప్రాతిపదికల్లో మార్పులు చేయాలని భావిస్తోంది. నిపుణుల కమిటీ పలు సిఫార్సులతో సమర్పించిన నివేదిక రైల్వే బోర్డుకు చేరింది. ఉద్యోగులకు ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు వార్షిక పనితీరు మదింపు నివేదికలకు బదులు చివరి ఏడేళ్లలో ఉత్తమ పనితీరు కనబరిచిన ఐదేళ్లను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. సిబ్బంది తల్లిదండ్రులకూ వైద్య, ఉచిత ప్రయాణ సదుపాయాలు కల్పించాలంది. ఉన్నత విద్య కొనసాగించే ఉద్యోగులకు ఆర్థిక సాయం, దిగువ స్థాయి సిబ్బందికే కాకుండా ఏ, బీ గ్రేడ్ ఉద్యోగులకు బోనస్‌లు ఇవ్వాలని పేర్కొంది. కాగా, రైల్వేల్లో నిర్వహణ సమయంలో పాటిస్తున్న ప్రమాదకరమైన పద్ధతుల గురించి తెలియజేయాలని ఉద్యోగులందరికీ రైల్వే బోర్డు చైర్మన్ లేఖ రాశారు. -
బడ్జెట్ 2018 : ఈ - వెహికల్స్‌కు వరాలు
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర బడ్జెట్లో ఎలక్ర్టిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు భారీగా వరాలు, రాయితీలు ప్రకటించవచ్చని భావిస్తున్నారు. సంప్రదాయ వాహనాలతో కాలుష్యం, పెట్రోల్ వాడకం విపరీతంగా పెరుగుతున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఎలక్ర్టిక్ వాహనాలను ప్రోత్సహించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. మరోవైపు రానున్న బడ్జెట్లో ఈ వెహికల్స్‌కు తక్కువ జీఎస్టీ, ఈ వాహనాల కొనుగోలుదారులకు పన్ను రాయితీలను కల్పించే దిశగా పలు చర్యలు ప్రకటించవచ్చు. ఈ వెహికల్స్‌ను ప్రోత్సహించే క్రమంలో కేంద్రం ఎప్పటినుంచో కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సమర్పించే బడ్జెట్లో ఈ దిశగా చర్యలుంటాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎలక్ర్టిక్ వాహనాలపై ప్రస్తుతం 12 శాతంగా ఉన్న జీఎస్టీని ప్రభుత్వం 5 శాతానికి తగ్గించవచ్చని భావిస్తున్నారు. ఎలక్ర్టిక్ వాహనాల కొనుగోలుదారులను ప్రోత్సహించేందుకు ఐటీ రాయితీలనూ అందించే దిశగా చర్యలు ప్రకటిస్తారని అంచనా. -
బడ్జెట్ 2018: టీవీ, ఫ్రిజ్, ఏసీ ధరలు తగ్గుతాయా?
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టనున్న సార్వత్రిక బడ్జెట్‌పై వ్యాపారవర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఫిబ్రవరి 1న(గురువారం) ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలోని పూర్తిస్థాయి బడ్జెట్లో తమకెలాంటి రాయితీలు లభించనున్నాయోననే ఉత్కంఠ నెలకొంది. దీంతోపాటు తమకు కల్సించాల్సిన రాయితీలు, ప్రోత్సాహకాలపై పలు అంచనాలను వ్యక్తపరుస్తున్నాయి. పన్నులను తగ్గించాలని, స్థానిక తయారీదారులకు ప్రోత్సాహకాలను కల్పించాలని గృహోపకరణాల తయారీ సంస్థలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. తద్వారా సరసమైన ధరలకు గృహోపకరణాలన్నింటినీ వినియోగదారులకు అందించాలంటున్నాయి.. కన్స్యూమర్ డ్యూరబుల్స్, హోమ్ అప్లైన్సెస్ కు చెందిన పలు కంపెనీలు ఈమేరకు తక్కువ పన్ను రేట్లు, రాయితీలు, కల్పించాలని భావిస్తున్నాయి. ముఖ్యంగా పానసోనిక్, గోద్రెజ్ గృహోపకరణాలు, ఇంటెక్స్, ఫిలిప్స్ తదితర కంపనీలు దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీని పెంచాలని కోరుకుంటున్నాయి. అలాగే ఇంధన సామర్థ్య ఉత్పత్తుల ఉత్పత్తిని ప్రోత్సహించాలని హోం అప్లైన్సెస్ & కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ కోరుకుంటోంది. ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు, ఎసీలు లాంటి ఉపకరణాలు ప్రస్తుతం విలాసవస్తువుల కిందికి రావని.. ఈ నేపథ్యంలో వీటిని మరింత సరసమైన ధరల్లో వినియోగదారులకు అందుబాటులోకి తేవాలని గోద్రెజ్ అప్లైన్సెస్ బిజినెస్ హెడ్ కమల్ నంది పేర్కొన్నారు. మరోవైపు స్థానిక తయారీదారులకు ప్రోత్సాహమిచ్చేలా దిగుమతులపై సుంకాన్ని పెంచాలని మరో సంస్థ పానసోనిక్ కోరుతోంది.స్మార్ట్ఫోన్లు, టీవీలు తదితర ఉత్పత్తులపై పెంచినట్టుగానూ గృహోపకరణాలపై కూడాబీసీడీ (బేసిక్ కస్టమ్స్ డ్యూటీ) పెంచాలని పానసోనిక్ ఇండియా సీఈవో మనీష్ శర్మ తెలిపారు. మొబైల్ ఫోన్ల తయారీలో ప్రస్తుతం ఉన్న జీఎస్టీ 28 శాతం నుంచి 12 శాతానికి తగ్గించాలని ఇంటెక్స్‌కోరుతోంది. మొబైల్ ఫోన్ల తయారీలో ఉపయోగించే అన్ని భాగాలపై ఉన్న అధిక జిఎస్టీ రేట్లతో ఖర్చుపెరిగి భారతదేశంలో ఫోన్ల తయారీని దెబ్బతీస్తుందని ఇంటెక్స్ సీఈవో రాజీవ్ జైన్ అభిప్రాయపడ్డారు. అలాగే అన్ని పూర్తిస్థాయి లైటింగ్ ఉత్పత్తులపై కస్టమ్స్ డ్యూటీ పెంచాలని ఫిలిప్స్ లైటింగ్ ఇండియా వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సుమిత్ జోషి చెప్పారు. మరోవైపు మరికొద్ది రోజుల్లో పార్లమెంటు ముందుకు రానున్న బడ్జెట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆర్ధిక వృద్ధే ప్రధాన టార్గెట్ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల స్పష్టం చేసినప్పటికీ రానున్న ఆరు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికల నేపథ్యంలో బీజేపీ సర్కార్ ప్రజాకర్షక బడ్జెట్‌తో వస్తోందన్న అంచనాలు భారీగా నెలకొన్నాయి. -
ఫారిన్ ట్రేడ్ పాలసీ రివ్యూ: ఈజీ బిజినెస్, ఎగుమతులే లక్ష్యం
సాక్షి, న్యూఢిల్లీ: 2015-20కిగాను ఫారిన్ ట్రేడ్ పాలసీ రివ్యూను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వస్తువులు, సేవల ఎగుమతులను పెంచడానికి, దేశంలో ఉపాధి అవకాశాలు, విలువలను పెంచుకోవడానికి, విధాన పరమైన చర్యలు చేపట్టే లక్ష్యంతో, విదేశీ వాణిజ్యం పాలసీ మధ్యంతర సమీక్ష మంగళవారం కేంద్రం విడుదల చేసింది. 2020 నాటికి సుమారు 900 బిలియన్ డాలర్ల మేర రెట్టింపు వృద్ధి సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఐదు సంవత్సరాల విదేశీ వాణిజ్య విధానంలో ఏప్రిల్ 2015 ప్రత్యేక ఆర్ధిక మండలాలలో ఎగుమతిదారులు , విభాగాలకు ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలను ప్రకటించింది. దాదాపు రూ. 8,500 కోట్ల కొత్త ప్రోత్సాహకాలను ప్రకటించింది. ముఖ్యంగా మైక్రో, చిన్న, మధ్య తరహా పరిశ్రమల, కార్మిక-ఇంటెన్సివ్ విభాగాలు, వ్యవసాయ రంగంపై దృష్టి పెట్టింది. ఫారిన్ ట్రేడ్ డైరెక్టర్ జనరల్ అలోక్ చతుర్వేది మాట్లాడుతూ వ్యాపారాన్ని సులభతరం చేయనున్నామని పేర్కొన్నారు. ఈ క్రమంలో జీఎస్టీని గేమ్ చేంజర్ గా అభివర్ణించారు. వార్షిక ప్రోత్సాహకాలను 34శాతం పెంచి రూ.8,450కోట్లుగా నిర్ణయించామన్నారు. ఎఫ్టీపీ డైనమిక్ పత్రం.. దీని ద్వారా దేశంలో విలువలను పెంచుకోవడానికి, మరిన్ని ఉపాధి అవకాశాలను కల్పించడానికి , ఎగుమతులను పెంపు లక్ష్యంమని చెప్పారు. వస్తువుల ఎగుమతుల కోసం రూ. 4,567 కోట్లు, సేవల ఎగుమతులు రూ. 1,140 కోట్ల ఇంటెన్సివ్‌లను అందించనుంది. ఇటీవల రెడీమేడ్ దుస్తులపై ప్రకటించిన ప్రోత్సాహకాలు ఇవి అదనం.డ్యూటీ-ఫ్రీ దిగుమతుల కోసం స్వీయ ధృవీకరణ పథకాన్ని ప్రకటించింది. జీఎస్టీ నెట్వర్క్ పరిధిలో ఈ గడువును 18నెలలకు 24 నెలలకు పొడిగించింది. మర్చండైస్ ఎగుమతుల యొక్క ప్రోత్సాహక రేట్లు ప్రతి ఒక్కరికి 2శాతం పెంచింది. తోలు మరియు పాదరక్షల కోసం రూ .749 కోట్లు, వ్యవసాయం, సంబంధిత వస్తువులకు రూ. 1354 కోట్లు, మెరైన్ ఎగుమతులకు రూ .759 కోట్లు, టెలికాం మరియు ఎలక్ట్రానిక్ వస్తువులకు రూ .369 కోట్లు, హ్యాండ్ మేడ్ కార్పెట్లకు 921 కోట్లు, మెడికల్ అండ్ సర్జికల్ పరికరాలకోసం రూ. 193 కోట్లు, వస్త్రాలకు , రెడీమేడ్ వస్త్రాలకు రూ .1140 కోట్లు కేటాయించింది. -
సబ్సీడీలు కాదు ప్రోత్సాహకాలు కావాలి
న్యూఢిల్లీ: దేశంలో సేంద్రీయ వ్యవసాయాన్ని పోత్సహించడానికి ఎరువుల సబ్సిడీలకు బదులు రైతులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని సిక్కిం ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ ప్రతిపాదించారు. దేశంలో తొలి ఆర్గానిక్ రాష్ట్రం సిక్కిం అని 2016లో ప్రధాని మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. సిక్కిం ప్రజలు వదులుకున్న ఎరువుల సబ్సిడీలకి రెండు రెట్ల మొత్తాన్ని నగదుగా ఇవ్వాలని కోరితే ప్రధాని స్పందించలేదని అని చామ్లింగ్ గుర్తు చేశారు. సేంద్రీయ వ్యవసాయానికి మారడానికి బిహార్, ఇతర ఈశాన్య రాష్ట్రాలు సిక్కిం సాయం కోరుతున్నాయని తెలిపారు. సేంద్రీయ విధానానికి మారకుంటే మన భవిష్యత్ సురక్షితం కాదని హెచ్చరించారు. -
రేపటి నుంచే ‘పాల’ ప్రోత్సాహకం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పలు పాల సహకార సంఘాల్లోని రైతులకు ప్రోత్సాహకం అందజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే విజయ డెయిరీ రైతులకు అందజేస్తున్న తరహాలో లీటర్‌కు రూ. 4 చొప్పున ప్రోత్సాహకంగా అందజేస్తామని, 24వ తేదీ నుంచే ఇది అమల్లోకి వస్తుందని అందులో పేర్కొంది. సచివాలయంలో పాడి పరిశ్రమ అభివృద్ధిపై శుక్రవారం తలసాని సమీక్ష నిర్వహించారు. ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, పశు సంవర్థక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సురేష్ చందా, తెలంగాణ డెయిరీ చైర్మన్ లోక భూమారెడ్డి, విజయ డెయిరీ ఎండీ నిర్మల, మదర్ డెయిరీ చైర్మన్ గుత్తా జితేందర్‌రెడ్డి, కరీంనగర్ డెయిరీ చైర్మన్ రాజేశ్వర్‌రావు, ముల్కనూరు డెయిరీ చైర్మన్ విజయ, పశుసంవర్థకశాఖ అదనపు డైరెక్టర్ రాంచందర్‌రావు తదితరులు పాల్గొ న్నారు. ఇతర డెయిరీలకు పాలు విక్రయించే రైతులకు ప్రోత్సాహకం చెల్లిస్తామన్న సీఎం హామీ మేరకు జీవో విడుదల చేశామని సమావేశం అనంతరం తలసాని తెలిపారు. 1.98 లక్షల మందికి ప్రయోజనం మదర్ డెయిరీకి పాలుపోస్తున్న 55 వేల మంది, ముల్కనూరు డెయిరీ పరిధిలోని 20 వేల మంది, కరీంనగర్ డెయిరీ పరిధిలోని 70 వేల మంది రైతులకు ప్రయోజనం కలుగుతుందని వివరించారు. మొత్తంగా ప్రోత్సాహకంతో 1.98 లక్షల మంది రైతులు లబ్ధిపొందుతారని మంత్రి తెలిపారు. ఈ ప్రోత్సాహకం సొమ్మును పాల బిల్లు చెల్లింపులతో పాటే లబ్ధిదారుల ఖాతాలో జమచేస్తామని వెల్లడించారు. అలాగే ప్రోత్సాహకం పొందే రైతులకు సబ్సిడీపై పాడి గేదెలను అందిస్తామని, ఈ పథకంతో ప్రభుత్వంపై రూ.600 కోట్ల మేర భారం పడుతుందని పేర్కొన్నారు. సబ్సిడీ గేదెలు పొందిన రైతులకు 75 శాతం సబ్సిడీపై గడ్డి విత్తనాలనూ సరఫరా చేస్తామన్నారు. హైదరాబాద్ విజయ డెయిరీలో రూ.170 కోట్ల వ్యయంతో 4.50 లక్షల లీటర్ల సామర్థ్యంతో పాల ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. పాల పొడి ఉత్పత్తి కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. కాగా పాడిరంగం అభివృద్ధిలో గుత్తా సుఖేంద ర్‌రెడ్డికి ఎంతో అనుభవం ఉన్నందున.. ఆయన సలహాలు, సూచనలను స్వీకరించేందుకు ఈ సమావేశానికి ఆహ్వానించామన్నారు. రాజీనామాపై గుత్తా మౌనం నల్లగొండ ఎంపీ స్థానానికి రాజీ నామా చేసే అంశంపై గుత్తా సుఖేందర్‌రెడ్డి మౌనం దాల్చారు. రైతు సమన్వయ సమితి రాష్ట్రస్థాయి సమన్వయకర్తగా గుత్తాను నియమించి కేబినెట్ ర్యాంకు ఇస్తారని.. తన ఎంపీ స్థానానికి ఆయన రాజీనామా చేస్తారని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. శుక్రవారం సచివాలయంలో సమీక్షా సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియా రాజీనామా అంశాన్ని ప్రస్తావించగా.. ఎటువంటి సమాధానం ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
ఇన్వెస్ట్ మెంట్ ఫండ్స్‌కు మరిన్ని పన్ను ప్రోత్సాహకాలు
నారాయణ మూర్తి కమిటీ సిఫార్సు న్యూఢిల్లీ: స్టార్టప్‌ల్లో పెట్టుబడి చేసే ఆల్ట్రనేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స (ఏఐఎఫ్‌లు)కు మరిన్ని పన్ను ప్రోత్సాహకాలు అందించాలని ఎన్ఆర్ నారాయణమూర్తి కమిటీ సిఫార్సుచేసింది. వెంచర్‌క్యాపిటల్, ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స నిబంధనల్లో గణనీయమైన మార్పులు చేయాలని కూడా సెబి నియమించిన ఈ కమిటీ సూచించింది. కమిటీ తన రెండో నివేదికను తాజాగా సెబికి సమర్పించింది. నివేదికలోని ముఖ్యాంశాలు.... ⇔ బీమా కంపెనీలు, పెన్షన్ ఫండ్సను క్యాటగిరీ- 2 ఏఐఎఫ్ల్లో పెట్టుబడికి అనుమతించాలి. ⇔ ఒక్కో ఇన్వెస్టరు నుంచి రూ. 10 కోట్ల లోపు మొత్తాన్ని సమీకరించే ఏఐఎఫ్‌లు జరిపే ప్రైవేట్ ప్లేస్‌మెంట్స్ ఒప్పందాల్ని వెల్లడించాలి. ⇔ అన్ని రకాల ఏఐఎఫ్‌లకు 12% జీఎస్టీ విధించాలి. -
సినిమాల నిర్మాణానికి టర్కీ రాయితీలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విదేశీ సినీ నిర్మాణ సంస్థలను ఆకర్షించే దిశగా టర్కీ ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తోంది. తమ దేశంలో చిత్రీకరించే సమయంలో చేసే వ్యయాలపై దాదాపు 18% దాకా పన్ను రీఫండ్ ఇస్తున్నట్లు టర్కీ టూరిజం శాఖలో భాగమైన డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ ప్రమోషన్ కోఆర్డినేటర్ ఒజ్గుర్ అయ్‌టుర్క్ తెలిపారు. అలాగే, చిత్ర నిర్మాణ సామగ్రి సత్వర కస్టమ్స్ క్లియరెన్స్, చిత్రీకరణ లొకేషన్స్ ఎంపిక మొదలైన వాటిలో తోడ్పాటునిస్తున్నట్లు వివరించారు. భారత్‌లో 8 నగరాల్లో తలపెట్టిన రోడ్ షోలలో భాగంగా సోమవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఒజ్గుర్ ఈ అంశాలు చెప్పారు. దిల్ ధడక్‌నేదో, ఏక్ థా టైగర్ తదితర బాలీవుడ్ సినిమాలు టర్కీలో చిత్రీకరణ జరుపుకున్నాయి. మరోవైపు, గతేడాది మొత్తం 2.6 కోట్ల మంది పర్యాటకులు తమ దేశాన్ని సందర్శించగా వీరిలో 1.31 లక్షల మంది భారత టూరిస్టులు ఉన్నారని ఒజ్గుర్ తెలిపారు. దేశీయంగా నెలకొన్న పరిస్థితుల కారణంగా ఈసారి కొంత తగ్గినా.. వచ్చేసారి భారత టూరిస్టుల సంఖ్య 20 శాతం పైగా వృద్ధి చెందవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. టూరిజం ద్వారా 31 బిలియన్ డాలర్ల ఆదాయం సమకూరుతోందన్నారు. -
ఆ ప్రోత్సాహకాలపై సమీక్ష
న్యూఢిల్లీ: ఉద్యోగులు సర్వీసులో ఉండగా.. సాధించే విద్యార్హతల ఆధారంగా ఇచ్చే ప్రోత్సాహకాలను సమీక్షించాలని కేంద్రం భావిస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ తాజా విద్యార్హతల ఆధారంగా ఇచ్చే ప్రోత్సాహాలను పెద్ద మొత్తంలో పెంచాలని కూడా యోచిస్తోంది. విద్యార్హతలను బట్టి ప్రోత్సాహకాల మొత్తం రూ. 2 వేల నుంచి రూ. 10 వేల వరకూ ఇవ్వాలని భావిస్తోంది. అయితే ఉద్యోగుల వర్గీకరణ, గ్రేడ్, డిపార్ట్మెంట్లను బట్టి కాకుండా అందరికీ ఒకే విధంగా ప్రోత్సాహకాలను అందించనున్నారు. ఈ మేరకు కేంద్ర సిబ్బంది, శిక్షణ మంత్రిత్వ శాఖ(డీవోపీటీ) విద్యార్హతల జాబితాలో మార్పు చేర్పులకు సిద్ధమైంది. 16 ఏళ్ల క్రితం నాటి ఈ జాబితాలో తాజాగా కొన్ని విద్యార్హతలను చేర్చి.. మరికొన్నింటిని తొలగించనున్నారు. -
నారాజ్..
ఏకగ్రీవ పంచాయతీలకు అందని నజరానా 73 గ్రామాల ఎదురుచూపు పంచాయతీ పాలనకు ఏడాది పూర్తి హన్మకొండ అర్బన్ : ఏకగ్రీవ పంచాయతీలకు ఏడాది గడిచినా ప్రోత్సాహకాలు అందలేదు. దీంతో పాలకవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్న ప్రజలు ఆవేదనకు గురవుతున్నారు. ప్రోత్సాహకాలకు తోడు పంచాయతీలకు అభివృద్ధి నిధులొస్తే తమ గ్రామాలను అభివృద్ధి చేసుకుందామనుకున్న ప్రజలకు నిరాశే ఎదురవుతోంది. గ్రామ పంచాయతీ సర్పంచ్‌తోపాటు వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్న పంచాయతీలకు గత ప్రభుత్వం రూ.5లక్షల చొప్పున నజరానా అందజేసిన విషయం విదితమే. దీనిని స్ఫూర్తిగా తీసుకుని జిల్లాలో 2013లో జరిగిన ఎన్నికల్లో 73 గ్రామ పంచాయతీలకు ప్రతినిధులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఏడాది గడిచినా ప్రోత్సాహక నగదు బహుమతి ప్రభుత్వం నుంచి అంద లేదు. ప్రస్తుతం ఏకగ్రీవ పంచాయతీలకు రూ.15లక్షల వరకు ఇస్తామని ఎన్నికలకు ముందు ప్రభుత్వం ప్రకటించింది. కానీ నిధులు మాత్రం విడుదల చేయకపోవడంతో ప్రజలు, ప్రజాపతినిధులు నిరుత్సాహంతో ఉన్నారు. నిధుల వరద... 2014 ప్రథమార్థంలో గ్రామ పంచాయతీలకు రావాల్సిన అన్ని రకాల నిధులను ప్రభుత్వం దాదాపు పూర్తి స్థాయిలో విడుదల చేసింది. దీంతో జిల్లాలోని పంచాయతీలకు కోట్లలో నిధులు వచ్చాయి. సర్పంచ్ల కు సాంకేతిక కారణాల వల్ల పదవిలో చేరిన వెంటనే కాకుండా సుమారు రెండు నెలల తర్వాత(31-10-2013)నుంచి చెక్‌పవర్ ఇచ్చారు. అనంతరం సర్పంచ్‌లకు కలెక్టర్ ఆదేశాలతో మొత్తం 29 రకాల శాఖలపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసి పాలనపై అవగాహన కల్పించారు. ఇది కొత్తగా ఎన్నికైన, రాజకీయ అనుభవం లేని వారికి ఎంతగానో ఉపయోగపడింది. పంచాయతీలకు ఇచ్చిన నిధుల వివరాలు రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు రూ.1,42,72,000 13వ ఆర్థిక సంఘం నిధులు రూ.16,81,40,200 షెడ్యూల్డ్ ఏరియా నిధులు రూ.66,37,600 గతంలో ఆగిపోయిన నిధులు రూ.15,27,93,000 పర్క్యాపిటల్ నిధులు రూ.17,48,600 {పొఫెషనల్ ట్యాక్స్ నిధులు రూ.59,61,400 సీనరేజ్ నిధులు రూ.23,07,000 ‘మన ప్రణాళిక’తో పెరిగిన ప్రాధాన్యం ప్రస్తుతం మన ఊరు-మన ప్రణాళిక కార్యక్రమాన్ని గ్రామస్థాయి నుంచి పక్కాగా అమలు చేస్తుండటంతో పంచాయతీలకు, సర్పంచ్‌లకు ప్రాధాన్యం పెరిగింది. ప్రస్తుతం గ్రామస్థాయి ప్రణాళికలకే ప్రభుత్వం నిధులు మంజూరు చేసే అవకాశం ఉంది. దీంతో గ్రామాలకు అవసరమైన అన్ని రకాల విషయాలను ప్రణాళికల్లో పొందుపరిచారు. -
నేటికీ అందని నజరానా..
మార్కాపురం : ‘ఎన్నికలు జరగకుండా సర్పంచ్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ఆ పంచాయతీలకు ప్రోత్సాహకాలు అందజేస్తాం.. ఆ నిధులతో గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడంతో పాటు ప్రజల మధ్య స్నేహభావం కూడా పెంపొందుతుంది..’ ఈ మాటలు అన్నది సాక్షాత్ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి. పంచాయతీల సర్పంచ్‌లను ఏకగ్రీవంగా ఎన్నకుంటే ప్రోత్సాహ కాలు అందజేస్తామని, తద్వారా గ్రామాలను అభివృద్ధి చేసుకోవచ్చని చెప్పారు. అంతేకాదు గ్రామీణుల మధ్య వివాదాలు ఉండవని, అంతా స్నేహపూర్వకంగా మెలుగుతారని సీఎం చెప్పుకొచ్చారు. ఇంకేముంది జిల్లాలో కొన్ని పంచాయతీల సర్పంచ్‌లను ప్రజలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికలు పూర్తయి 11 నెలలు దాటినా నిధులు విడుదల చేయకపోవటంతో ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్‌లు ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. = రాష్ట్ర ప్రభుత్వం ప్రొత్సాహక నిధులు విడుదల చేయకపోవటంతో సర్పంచ్‌ల్లో నిరాశ నిస్పృహలు అలుముకున్నాయి. = దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తన పాలనలో నోటిఫైడ్ ఏకగ్రీవ పంచాయతీలకు రూ.10 లక్షలు, నాన్ నోటిఫైడ్ పంచాయతీలకు రూ. 5 లక్షలు విడుదల చేశారు. = ఆ నిధులతో ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్‌లు పంచాయతీల్లో వివిధ అభివృద్ధి పనులు చేపట్టారు. = గత ఏడాది జూలైలో జిల్లాలో మూడు విడతలుగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. జిల్లా మొత్తం మీద 1028 గ్రామ పంచాయతీలుండగా అందులో 125 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. = మార్కాపురం డివిజన్లో 25 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. = ప్రస్తుతం గ్రామ పంచాయతీలకు 13వ ఆర్థిక సంఘం నిధులు, భూమి పన్ను, ఇంటి పన్ను, నీటి పన్ను, సీనరేజీ ద్వారా మాత్రమే ఆదాయం వస్తోంది. = సర్పంచ్‌లుగా ఎన్నికై నెలలు కావస్తున్నా ప్రోత్సాహకాలు విడుదల చేయకుండా జాప్యం చేయటంతో పంచాయతీల అభివృద్ధిపై ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధ ఏపాటిదో అర్థమవుతోందని ఏకగ్రీవ సర్పంచ్ లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. = 13వ ఆర్థిక సంఘం నిధులు గ్రామ జనాభా నిష్పత్తి ఆధారంగా కేటాయిస్తారు. ఈ నిధులను ప్రభుత్వం నాలుగు విడతలుగా విడుదల చేస్తోంది. = అరకొర నిధులతో ఆశించిన స్థాయిలో పంచాయతీల్లో అభివృద్ధి జరగడం లేదు. = మార్కాపురం మండలం ఇడుపూరు, గోగులదిన్నె గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. = కొనకనమిట్ల మండలం వింజవర్తిపాడు, నాగరాజుకుంట, నాగిరెడ్డిపల్లె, సిద్ధవరం, నాగంపల్లి, కాట్రగుంట, తువ్వపాడు, బచ్చలకూరపాడు పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. = పొదిలి మండలం అన్నవరం, ఈగలపాడు, మాదాలవారిపాలెం, నందిపాలెం, ఓబులక్కపల్లె, పాములపాడు, తలమళ్ల, సూదనకుంట, జువ్వలేరు పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. = పుల్లలచెరువు మండలం నాయుడుపాలెం, మల్లాపాలెం ఏకగ్రీవమయ్యాయి. ప్రొత్సాహక నిధులు ఇస్తే ఏకగ్రీవ పంచాయతీల్లో అంతర్గత రోడ్ల నిర్మాణం, వేసవిలో తాగు నీటి ఎద్దడి నివారణకు డీప్‌బోర్ల ఏర్పాటు, డ్రైనేజీలు నిర్మించుకునే అవకాశం ఉందని సర్పంచ్‌లు చెబుతున్నారు. = ప్రస్తుత టీడీపీ ప్రభుత్వంలోనైనా ఏకగ్రీవ పంచాయతీలకు నిధులు విడుదల చేయాలని పలువురు సర్పంచులు కోరుతున్నారు. నిధులు విడుదల చేయాలి : రామాంజులురెడ్డి, ఇడుపూరు ఏకగ్రీవ సర్పంచ్ మా గ్రామ ప్రజలు సర్పంచ్‌గా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఏడాది కావస్తున్నా ప్రభుత్వం ఇంతవరకూ ప్రొత్సాహక నగదు విడుదల చేయలేదు. ఆ నిధులు వస్తే గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేస్తాం. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఏకగ్రీవ పంచాయతీలకు ప్రొత్సాహక నిధులు విడుదల చేయాలి. -
ప్రోత్సాహకం కరువు
నా పేరు బెయిరి సత్యనారాయణ. మాది మంచిర్యాల. డిగ్రీ వరకు చదువుకున్న. నేను పుట్టుకతోనే వికలాంగుడిని. డిసెంబర్లో సకలాంగ యువతితో నాకు వివాహమైంది. ఆ సమయంలోనే ప్రభుత్వం ఇచ్చే వివాహ ప్రోత్సాహకం(రూ. 50 వేలు) కోసం దరఖాస్తు చేసుకున్న. ఇంతవరకు నాకు నయాపైసా రాలేదు. కుటుంబపోషణ భారం కావడంతో మంచిర్యాలలో మీ సేవ నిర్వహించుకుంటున్న. ప్రభుత్వం స్పందించి ప్రోత్సాహకం తొందరగా ఇవ్వాలి. సాక్షి, మంచిర్యాల : జిల్లాలో ఆదర్శ వివాహం చేసుకున్న జంటలను ప్రభుత్వం నిరుత్సాహ పరుస్తోంది. వికలాంగులను వివాహం చేసుకున్న సకలాంగులకు ప్రోత్సాహకాల కింద రూ.50 వేలు ఇస్తామని విస్మరించింది. నిధులు విడుదల చేయకుండా తాత్సారం చేస్తోంది. జిల్లా వ్యాప్తంగా 142 ఆదర్శ జంటలు దరఖాస్తు చేసుకుంటే కేవలం 16 జంటలకే నగదు అందజేసి చే తులు దులుపుకుంది. ప్రభుత్వం ఇవ్వాల్సిన ప్రోత్సాహకాల కోసం 126 మంది వికలాంగులు జిల్లా వికలాంగుల సంక్షేమ శాఖ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. నిరుత్సాహమే మిగిలింది.. జిల్లా వ్యాప్తంగా ఆరు వేలకు పైగా వికలాంగులున్నారు. వీరిలో 3,900 వరకు వయోవృద్ధులు ఉన్నారు. మిగిలిన వారు విద్యార్థులు, యువతీయువకులు. సమాజంలో అంగవైకల్యం, మానసిక వికలాంగులపై కొనసాగుతున్న వివక్ష, చిన్నచూపును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వారిలో ఆత్మవిశ్వాసం పెంచాలని నిర్ణయించింది. ఎవరైన సకలాంగులు వికలాంగులను పెళ్లాడితే వారిని ఆదర్శ జంటలుగా పరిగణించి రూ.50 వేల ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరమే మార్గదర్శకాలు విడుదల చేసింది. వివాహం జరిగినట్లు నిరూపించే పెళ్లి ఫొటోలు, వైకల్యం ఉన్నట్లు ధ్రువీకరించే సర్టిఫికెట్, గుర్తింపు కార్డు, తహశీల్దార్లు, గ్రామ కార్యదర్శులు ధ్రువీకరించే పత్రాలతో ప్రోత్సాహకాల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ క్రమంలో రెండేళ్ల కాలంలో జిల్లా వ్యాప్తంగా 142 వికలాంగ జంటలు దరఖాస్తు చేసుకున్నాయి. కొందరికే ప్రోత్సాహకం వికలాంగులను వివాహం చేసుకుని ఆదర్శంగా నిలిచిన యువ జంటలను కాదని కొందరికే ప్రోత్సాహకాలు ఇవ్వాలన్న ప్రభుత్వ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 22 జూలై, 2011 తర్వాత వివాహం చేసుకున్న జంటలే దరఖాస్తు చేసుకోవాలని, వారికి మాత్రమే ప్రోత్సాహక నగదు ఇస్తామని ప్రకటించడంతో అంతకు ముందు వివాహం చేసుకున్న జంటలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. మరోపక్క.. దరఖాస్తు విధానంపై అవగాహన లేకపోవడంతో చాలా జంటలు దరఖాస్తు చేసుకోలేద. 142 జంటలకు రూ.71 లక్షలు విడుదల చేయాల్సి ఉండగా, ప్రభుత్వం కేవలం రూ. 8 లక్ష లు విడుదల చేసింది. ఇందులో 16 మందికి మాత్రమే లబ్ధి చేకూరింది. దీంతో దరఖాస్తు చేసుకున్న అర్హులైన ఆదర్శ జంటలు ప్రోత్సాహకాల కోసం ఎదురుచూస్తున్నారు. ఇదిలావుంటే ఇప్పటి వరకు ఆదర్శ జంటలకు ప్రభుత్వం నేరుగా నగదు ఇచ్చింది. కానీ ఇక మీదట ప్రోత్సాహక నగదును ఆధార్ కు అనుసంధానం చేయాలని నిర్ణయించింది. దీంతో భవిష్యత్తులో ప్రోత్సాహకాల పంపిణీలో జాప్యమవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం ప్రోత్సాహకాలు త్వరగా అందజేస్తే మిగతా సకలాంగులనూ ప్రోత్సహించినట్లు ఉంటుంది. నిధులు విడుదల కాకపోవడంతోనే.. వికలాంగ వివాహ ప్రోత్సాహక నిధులు విడుదల కాకపోవడంతోనే ఆదర్శ జంటలకు నగదు ఇవ్వలేకపోతున్నాం. నిధులు విడుదల అయిన వెంటనే మిగతా అర్హులైన వారందరికీ అందజేస్తాం. అప్పటి వరకు ఆగాల్సిందే. - ఏవీడీ నారాయణరావు, అసిస్టెంట్ డెరైక్టర్, వికలాంగ సంక్షేమ శాఖ