న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజన పథకాన్ని కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతోపాటుగా మరింత మంది బ్యాంకు అకౌంట్లు తెరిచేందుకు ప్రోత్సాహకాలు అందించనున్నట్లు ప్రకటించింది. ప్రధాని అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపింది. ఈ పథకానికి మంచి ఆదరణ లభిస్తున్నందున.. పథకాన్ని కొనసాగించడంతోపాటు ప్రస్తుతమున్న రూ.5వేల ఓవర్ డ్రాఫ్ట్‌ను రూ.10వేలకు పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. రూ.2వేల వరకు ఓవర్–డ్రాఫ్ట్ ఎలాంటి షరతులు ఉండవని.. ఈ సదుపాయాన్ని పొందేందుకు గరిష్ట వయసును 60 నుంచి 65 ఏళ్లకు పెంచినట్లు మంత్రి పేర్కొన్నారు.
దీంతోపాటుగా ఆగస్టు 28 నుంచి జన్‌ధన్ అకౌంట్లపై ఉన్న ఉచిత ప్రమాదబీమా మొత్తాన్ని రెట్టింపు చేసి రూ.2లక్షలకు పెంచుతున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు నాలుగేళ్లలో దేశవ్యాప్తంగా 32.41కోట్ల జన్‌ధన్ అకౌంట్లు తెరవగా.. వీటిలో రూ.81,200కోట్లు డిపాజిట్లు ఉన్నాయి. ఇందులో 30 లక్షల మంది ఓవర్–డ్రాఫ్ట్ సదుపాయాన్ని వినియోగించుకున్నారన్నారు. ఆగస్టు 2014లో ప్రారంభించిన ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజనను మొదట నాలుగేళ్లు మాత్రమే అమలుచేయాలనుకున్నా.. ప్రజల నుంచి వస్తున్న ఆదరణ కారణంగా కొనసాగించనున్నట్లు జైట్లీ వెల్లడించారు. అటు, దేశవ్యాప్తంగా పులులు, ఏనుగుల సంరక్షణ ప్రయత్నాలను ప్రోత్సహించేందుకు కేంద్రం ప్రభుత్వ నిధులతో నడిచే ‘వన్యప్రాణి నివాస సమగ్రాభివృద్ధి’ పథకాన్ని 2019–20 వరకు కొనసాగించాలని కూడా కేబినెట్ నిర్ణయిచింది.
Comments
Please login to add a commentAdd a comment