బడ్జెట్‌లో సానుకూల నిర్ణయం తీసుకోవాలి
వీసా ప్రక్రియలను సులభతరం చేయాలి
పరిశ్రమ వర్గాల తాజా డిమాండ్లు
న్యూఢిల్లీ: ఆతిథ్య రంగం తమకు మౌలిక పరిశ్రమ హోదా కల్పించాలని దీర్ఘకాలంగా కోరుతోంది. అయినప్పటికీ ఈ దిశగా నిర్ణయం రావడం లేదు. రానున్న బడ్జెట్‌లో అయినా దీనిపై సానుకూల ప్రకటన చేయాలని ఈ రంగం కోరుతోంది. పన్నులను హేతుబద్దీకరించాలని, వీసా జారీ ప్రక్రియలను సులభంగా మార్చాలని, పెట్టుబడులను ఇతోధికం చేసేందుకు రాష్ట్రాలు మరిన్ని ప్రోత్సాహకాలు ప్రకటించాలని హోటల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ కేబీ కచ్రు డిమాండ్ చేశారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకెళ్లిన పరిశ్రమ డిమాండ్లను ఆయన మీడియాతో పంచుకున్నారు.
డిమాండ్లివీ..
→ సమావేశాలు సదస్సులు, ప్రదర్శనలకు (మైస్) అనుకూలమైన కేంద్రాలను ప్రభుత్వం గుర్తించి, మెరుగైన మౌలిక వసతులు కల్పించాలి. తద్వారా అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించాలి.
→ ఆతిథ్య పరిశ్రమకు పన్ను పెద్ద సమస్యగా ఉంది. దేశవ్యాప్తంగా వివిధ రకాల పన్నులు అమలవుతున్నాయి. వీటిని హేతుబద్దీకరించాలి. సింగపూర్, శ్రీలంక, థాయ్‌లాండ్ అనుసరిస్తున్న మాదిరి అత్యుత్తమ విధానాలను అనుసరించాలి.
→ దక్షిణ కొరియా, థాయ్‌లాండ్, జపాన్ పర్యాటక రంగానికి ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా తమ జీడీపీని వృద్ధి చేసుకున్నాయి.
→ గతంలో ఒక హోటల్ తెరవాలంటే 100 రకాల అనుమతులు అవసరమయ్యేవి. అవి ఇప్పుడు గణనీయంగా తగ్గాయి. అయినప్పటికీ అనుమతుల ప్రక్రియను మరింత సులభంగా మార్చాలి. సింగిల్ విండో విధానం తీసుకురావాలి.
→ రాష్ట్రాల స్థాయిలోనూ పెట్టుబడులను ఆహ్వానిస్తూ, అందుకు ప్రోత్సాహకాలు ప్రకటించాలి.
పెట్టుబడులు కావాలి..
ప్రభుత్వం ఒక్కటే కావాల్సినన్ని పెట్టుబడులు అందించలేదు. ప్రైవేటు రంగం ముందుకు వచ్చి ఇన్వెస్ట్ చేయాలి. పెట్టుబడులపై తగిన రాబడి వచ్చే విధంగా (ఆర్‌వోవై) ప్రోత్సాహకం కల్పిస్తే చాలు. అప్పుడే పెట్టుబడులతో ముందుకు వస్తారు. థాయ్‌లాండ్ జీడీపీలో పర్యాటకం నుంచి 25 శాతం వాటా వస్తుంటే.. మన జీడీపీలో 6 శాతం మించడం లేదు. మౌలిక పరిశ్రమ హోదా కల్పించం వల్ల ఆకర్షణీయమైన రేట్లకే రుణాలు లభిస్తాయి.’’
– కేబీ కచ్రు, హోటల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్
జీఎస్‌టీ తగ్గించాలి..
దేశీయ పర్యాటక రంగం రెండంకెల వృద్ధిని నమోదు చేస్తోంది. పెరుగుతున్న ఆదాయాలు, ప్ర యాణాలకు ప్రాధాన్యం, విస్తరిస్తున్న మధ్య తర గతికి మద్దతుగా నిలుస్తున్నాయి. ఈ వృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు లక్ష్యత చర్యలు అవసరం. ఇందులో పరిశ్రమ హోదా కల్పించాలి. ఆతిథ్య రంగంలో పెట్టుబడులు, అభివృద్ధిని ప్రోత్సహించాలి. హోటల్ నిర్మాణానికి జీఎస్‌టీ క్రెడిట్‌తోపాటు, జీఎస్‌టీ రేట్లను కమ్రబద్దీకరించడం వల్ల మొత్తం నిర్మాణ వ్యయాలు తగ్గుతాయి. ఈ చర్యలు దేశీ పర్యాటకాన్ని సానుకూలంగా ప్రభావితం చేస్తాయి.
–రాజేష్ మాగోవ్, మేక్ మైట్రిప్ సహ వ్యవస్థాపకుడు–సీఈవో
నైపుణ్య కల్పన అవసరం..
రుణాలు పరిశ్రమకు పెద్ద సవాలుగా మారాయి. ముఖ్యంగా చిన్న, మధ్య స్థాయి వ్యాపార సంస్థలపై ఎక్కువ భారం పడుతోంది. ఆతిథ్య రంగానికి రుణాల రేట్లు 10.75% నుంచి 22.50% వరకు ఉన్నాయి. ఈ రేట్లను 7–8%కి తీసుకురావాలి. దీనివల్ల భారం గణనీయంగా తగ్గుతుంది. తద్వారా వృద్ధి, స్థిరత్వం సాధ్యపడతాయి. ఈ రంగంలో నైపుణ్యాలకు కొరత నెలకొంది. నిపుణుల లేమితో 30% ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలపై పెట్టుబడులు అవసరం. దీనివల్ల సేవల నాణ్యత మెరుగుపడుతుంది.
– మేహుల్ శర్మ, సిగ్నమ్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ వ్యవస్థాపకుడు–సీఈవో
Comments
Please login to add a commentAdd a comment