ఆర్థిక శాఖకు బీమా సంస్థల వినతులు
జీ 20 దేశాలలో భారత్ వేగవంత వృద్ధి
న్యూఢిల్లీ: రానున్న సార్వత్రిక బడ్జెట్‌లో పన్ను లాభాలు, ప్రోత్సాహకాలు కల్పించవలసిందిగా దేశీ బీమా రంగ కంపెనీలు ఆర్థిక శాఖను కోరుతున్నాయి. బీమా పాలసీల కొనుగోలుదారులకు పన్ను లాభాలు, విక్రయ సంస్థలకు పన్ను ప్రోత్సాహకాలు ప్రకటించవలసిందిగా అభ్యర్థిస్తున్నాయి.
భారత బీమా అభివృద్ధి, అధికారిక నియంత్రణ సంస్థ(ఐఆర్‌డీఏఐ) గణాంకాల ప్రకారం 2023–24లో దేశీయంగా బీమా విస్తృతి 3.7 శాతానికి పరిమితమైంది. అంతక్రితం ఏడాది(2022–23)లో నమోదైన 4 శాతంతో పోలిస్తే స్వల్పంగా క్షీణించింది. జీవిత బీమా రంగంలో 3 శాతం నుంచి 2.8 శాతానికి వెనకడుగు వేయగా.. ఇతర బీమా పరిశ్రమలో విస్తృతి యథాతథంగా 1 శాతంగానే నమోదైంది.
కొత్త తరహా పాలసీలతో
బీమా పరిశ్రమకు ప్రోత్సాహకాలివ్వడం ద్వారా మరింతమంది కొత్త కస్టమర్లను ఆకట్టుకునేందుకు బీమా సంస్థలకు వీలుంటుందని జోపర్ సహవ్యవస్థాపకుడు, సీవోవో మయాంక్ గుప్తా పేర్కొన్నారు. కొత్తతరహా పాలసీల సృష్టి, పంపిణీలో టెక్నాలజీ వినియోగానికి బీమా కంపెనీలను అనుమతించవలసి ఉన్నదని అభిప్రాయపడ్డారు. విభిన్న బీమా పాలసీలతోపాటు.. ఫైనాన్షియల్ ప్రొడక్టులను సైతం విక్రయించేందుకు వీలు కల్పిస్తే పంపిణీ వ్యయాలు తగ్గుతాయని తెలియజేశారు. అంతేకాకుండా పాలసీలు, ప్రొడక్టులు మరింత అందుబాటులోకి వస్తాయని అభిప్రాయపడ్డారు.
జీఎస్‌టీ రేట్ల తగ్గింపు ద్వారా జీవిత బీమా మరింతమందికి అందుబాటులోకి వచ్చే వీలున్నట్లు రీన్యూబయ్ సహవ్యవస్థాపకుడు, సీఈవో బాలచందర్ శేఖర్ పేర్కొన్నారు. బీమా పాలసీల కొనుగోలులో పన్ను మినహాయింపులు ప్రకటించడం ద్వారా ప్రోత్సాహాన్నిందించాలని కోరారు. తద్వారా భద్రత, దీర్ఘకాలిక మూలధనానికి వీలుంటుందని తెలియజేశారు.
అతితక్కువ విస్తృతిగల గ్రామీణ ప్రాంతాలలో బీమాకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ప్రకటిస్తే ప్రభావవంతంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. బీమా రంగంలో అత్యధిక సంస్కరణలకు వీలున్నట్లు ఫ్యూచర్ జనరాలి ఇండియా ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో అనుప్ రావు పేర్కొన్నారు. ఐఆర్‌డీఏఐ ఇప్పటికే ‘2047కల్లా అందరికీ బీమా’ పేరుతో భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు ప్రస్తావించారు. వెరసి బీమా కంపెనీలు అందుబాటులో కొత్తతరహా పాలసీలకు రూపకల్పన చేయవలసి ఉన్నట్లు తెలియజేశారు.
దేశీయంగా
దేశీయంగా 26 జీవిత బీమా కంపెనీలు, 25 సాధారణ బీమా సంస్థలకుతోడు స్టాండెలోన్ ఆరోగ్య బీమా సంస్థలు 8 కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. అంతేకాకుండా 2024 మార్చి31కల్లా.. 12 రీఇన్సూరెన్స్, విదేశీ రీఇన్సూరెన్స్ బ్రాంచీలు, రెండు ప్రత్యేక సంస్థలు రిజిస్టరై ఉన్నాయి.
జీ20 దేశాలలో భారత్ భేష్
బీమా రంగంలో జీ 20 దేశాలలోకెల్లా భారత్ వేగవంత వృద్ధి సాధిస్తున్న మార్కెట్‌గా నిలుస్తున్నట్లు స్విస్ రే నివేదిక అంచనా వేసింది. 2025–29 మధ్య కాలంలో వార్షికంగా సగటున ప్రీమియంలో 7.3 శాతం పురోగతితో ముందు నిలవగలదని అభిప్రాయపడింది. రానున్న ఐదేళ్లలో నిజ ప్రాతిపదికన(ద్రవ్యోల్బణ ప్రభావాన్ని మినహాయించి) జీవిత బీమా, ఇతర బీమా కలిపి మొత్తం ప్రీమియం పరిమాణం సగటున ఏటా 7.3 శాతం పుంజుకోవచ్చని అంచనా వేసింది.
జీవిత బీమా ప్రీమియంలు 6.9 శాతం, నాన్‌లైఫ్ ప్రీమియంలు 7.3 శాతం చొప్పున వృద్ధి సాధించలగలవని అభిప్రాయపడింది. కాగా.. ప్రభుత్వ రంగ సాధారణ బీమా కంపెనీలకు బడ్జెట్లో తిరిగి పెట్టుబడులు ప్రకటిస్తే సానుకూల పరిణామంకాగలదని ఇక్రా లిమిటెడ్ ఫైనాన్షియల్ రంగ రేటింగ్స్ విభాగం హెడ్ నేహా పారిఖ్ అంచనా వేశారు. వీటి బలహీన సాల్వెన్సీ పరిస్థితుల నేపథ్యంలో ఇది ప్రయోజనకరంగా నిలవగలదని పేర్కొన్నారు. బీమా రంగానికి ప్రోత్సాహకాలు ప్రకటిస్తే ప్రధానంగా తక్కువ విలువగల పాలసీలకు బూస్ట్ లభిస్తుందని తెలియజేశారు. ఇది బీమా విస్తృతికి దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment