IRDA
-
బడ్జెట్లో పన్ను లాభాలు కల్పించాలి
న్యూఢిల్లీ: రానున్న సార్వత్రిక బడ్జెట్లో పన్ను లాభాలు, ప్రోత్సాహకాలు కల్పించవలసిందిగా దేశీ బీమా రంగ కంపెనీలు ఆర్థిక శాఖను కోరుతున్నాయి. బీమా పాలసీల కొనుగోలుదారులకు పన్ను లాభాలు, విక్రయ సంస్థలకు పన్ను ప్రోత్సాహకాలు ప్రకటించవలసిందిగా అభ్యర్థిస్తున్నాయి. భారత బీమా అభివృద్ధి, అధికారిక నియంత్రణ సంస్థ(ఐఆర్డీఏఐ) గణాంకాల ప్రకారం 2023–24లో దేశీయంగా బీమా విస్తృతి 3.7 శాతానికి పరిమితమైంది. అంతక్రితం ఏడాది(2022–23)లో నమోదైన 4 శాతంతో పోలిస్తే స్వల్పంగా క్షీణించింది. జీవిత బీమా రంగంలో 3 శాతం నుంచి 2.8 శాతానికి వెనకడుగు వేయగా.. ఇతర బీమా పరిశ్రమలో విస్తృతి యథాతథంగా 1 శాతంగానే నమోదైంది. కొత్త తరహా పాలసీలతో బీమా పరిశ్రమకు ప్రోత్సాహకాలివ్వడం ద్వారా మరింతమంది కొత్త కస్టమర్లను ఆకట్టుకునేందుకు బీమా సంస్థలకు వీలుంటుందని జోపర్ సహవ్యవస్థాపకుడు, సీవోవో మయాంక్ గుప్తా పేర్కొన్నారు. కొత్తతరహా పాలసీల సృష్టి, పంపిణీలో టెక్నాలజీ వినియోగానికి బీమా కంపెనీలను అనుమతించవలసి ఉన్నదని అభిప్రాయపడ్డారు. విభిన్న బీమా పాలసీలతోపాటు.. ఫైనాన్షియల్ ప్రొడక్టులను సైతం విక్రయించేందుకు వీలు కల్పిస్తే పంపిణీ వ్యయాలు తగ్గుతాయని తెలియజేశారు. అంతేకాకుండా పాలసీలు, ప్రొడక్టులు మరింత అందుబాటులోకి వస్తాయని అభిప్రాయపడ్డారు. జీఎస్టీ రేట్ల తగ్గింపు ద్వారా జీవిత బీమా మరింతమందికి అందుబాటులోకి వచ్చే వీలున్నట్లు రీన్యూబయ్ సహవ్యవస్థాపకుడు, సీఈవో బాలచందర్ శేఖర్ పేర్కొన్నారు. బీమా పాలసీల కొనుగోలులో పన్ను మినహాయింపులు ప్రకటించడం ద్వారా ప్రోత్సాహాన్నిందించాలని కోరారు. తద్వారా భద్రత, దీర్ఘకాలిక మూలధనానికి వీలుంటుందని తెలియజేశారు. అతితక్కువ విస్తృతిగల గ్రామీణ ప్రాంతాలలో బీమాకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ప్రకటిస్తే ప్రభావవంతంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. బీమా రంగంలో అత్యధిక సంస్కరణలకు వీలున్నట్లు ఫ్యూచర్ జనరాలి ఇండియా ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో అనుప్ రావు పేర్కొన్నారు. ఐఆర్డీఏఐ ఇప్పటికే ‘2047కల్లా అందరికీ బీమా’ పేరుతో భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు ప్రస్తావించారు. వెరసి బీమా కంపెనీలు అందుబాటులో కొత్తతరహా పాలసీలకు రూపకల్పన చేయవలసి ఉన్నట్లు తెలియజేశారు. దేశీయంగా దేశీయంగా 26 జీవిత బీమా కంపెనీలు, 25 సాధారణ బీమా సంస్థలకుతోడు స్టాండెలోన్ ఆరోగ్య బీమా సంస్థలు 8 కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. అంతేకాకుండా 2024 మార్చి31కల్లా.. 12 రీఇన్సూరెన్స్, విదేశీ రీఇన్సూరెన్స్ బ్రాంచీలు, రెండు ప్రత్యేక సంస్థలు రిజిస్టరై ఉన్నాయి.జీ20 దేశాలలో భారత్ భేష్ బీమా రంగంలో జీ 20 దేశాలలోకెల్లా భారత్ వేగవంత వృద్ధి సాధిస్తున్న మార్కెట్‌గా నిలుస్తున్నట్లు స్విస్ రే నివేదిక అంచనా వేసింది. 2025–29 మధ్య కాలంలో వార్షికంగా సగటున ప్రీమియంలో 7.3 శాతం పురోగతితో ముందు నిలవగలదని అభిప్రాయపడింది. రానున్న ఐదేళ్లలో నిజ ప్రాతిపదికన(ద్రవ్యోల్బణ ప్రభావాన్ని మినహాయించి) జీవిత బీమా, ఇతర బీమా కలిపి మొత్తం ప్రీమియం పరిమాణం సగటున ఏటా 7.3 శాతం పుంజుకోవచ్చని అంచనా వేసింది. జీవిత బీమా ప్రీమియంలు 6.9 శాతం, నాన్‌లైఫ్ ప్రీమియంలు 7.3 శాతం చొప్పున వృద్ధి సాధించలగలవని అభిప్రాయపడింది. కాగా.. ప్రభుత్వ రంగ సాధారణ బీమా కంపెనీలకు బడ్జెట్లో తిరిగి పెట్టుబడులు ప్రకటిస్తే సానుకూల పరిణామంకాగలదని ఇక్రా లిమిటెడ్ ఫైనాన్షియల్ రంగ రేటింగ్స్ విభాగం హెడ్ నేహా పారిఖ్ అంచనా వేశారు. వీటి బలహీన సాల్వెన్సీ పరిస్థితుల నేపథ్యంలో ఇది ప్రయోజనకరంగా నిలవగలదని పేర్కొన్నారు. బీమా రంగానికి ప్రోత్సాహకాలు ప్రకటిస్తే ప్రధానంగా తక్కువ విలువగల పాలసీలకు బూస్ట్ లభిస్తుందని తెలియజేశారు. ఇది బీమా విస్తృతికి దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. -
బ్యాంకులపై ఆధారపడొద్దు: ఐఆర్డీఏఐ
బీమా పాలసీలను విక్రయించేందుకు ఏదో ఒక సంస్థ మీదో లేదా బ్యాంకులపైనో అధికంగా ఆధారపడకూదని ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఐఆర్డీఏఐ) బీమా కంపెనీలకు సూచించింది. ఇందుకు ప్రత్యామ్నాయాలను వెతకాలని తెలిపింది. పాలసీలను విక్రయించేందుకు ఇతర అనువైన వ్యవస్థలను అభివృద్ధి చేసుకోవాలని పేర్కొంది.బీమా కంపెనీలు వాటి మాతృ సంస్థలుగా ఉన్న బ్యాంకుల ద్వారానే దాదాపు 90 శాతం పాలసీలను విక్రయిస్తున్నాయని బీమా నియంత్రణ సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. దీన్ని అరికట్టేందుకు ఐఆర్డీఏఐ మార్కెట్ నిపుణులతో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. సమీప భవిష్యత్తులో పాలసీల విక్రయానికి సంబంధించి కొత్త నిబంధనలతో ముసాయిదాను తీసుకురావాలని ఐఆర్డీఏఐ యోచిస్తోంది. ఇప్పటివరకు అధికంగా బ్యాంకుల ద్వారానే పాలసీలు విక్రయిస్తున్నందున ఒక్కసారిగా ఈ విధానంలో మార్పు రాదని, అందుకు కొంత సమయం పడుతుందని ఒక అధికారి తెలిపారు. పాలసీల విక్రయానికి సంబంధించి ఐఆర్డీఏఐ నిబంధనలు తీసుకురాబోతున్న నేపథ్యంలో కంపెనీలు ఇతర పంపిణీ వ్యవస్థలను సిద్ధం చేసుకోవాలని ఆయన తెలిపారు.ఇదీ చదవండి: పెట్రోల్, డీజిల్‌పై రూ.5 తగ్గింపు!బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్లు తమ కస్టమర్లకు మోసపూరిత బీమా పాలసీలను అంటగడుతున్నట్లు ఇప్పటికే బీమా నియంత్రణాధికార సంస్థ ఐఆర్డీఏఐ గుర్తించింది. ఇలా మోసపూరితంగా పాలసీలు విక్రయించకూడదని ఐఆర్డీఏఐ ఛైర్మన్ దేబాశీస్ పాండా గతంలో స్పష్టం చేశారు. బ్యాంకర్లు తమ ప్రధాన వ్యాపారంపైనే దృష్టి సారించాలన్నారు. దేశంలో అందరికీ బీమాను చేరువ చేయడంలో బ్యాంకులు కీలకపాత్రే పోషిస్తున్నప్పటికీ, బలవంతంగా మోసపూరిత పాలసీలను అంటగడుతున్నట్లు చెప్పారు. -
బీమాలోకి మరిన్ని కంపెనీలు రావాలి
ముంబై: ఇన్సూరెన్స్‌లో ఎదిగేందుకు గణనీయంగా అవకాశాలున్న నేపథ్యంలో మరిన్ని దిగ్గజ సంస్థలు ఈ రంగంలోకి రావాలని బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ ఐఆర్డీఏఐ చైర్మన్ దేబశీష్ పాండా సూచించారు. కొత్త సంస్థలు మార్కెట్లో ప్రవేశించేందుకు వీలుగా నిబంధనలను కూడా సరళతరం చేశామని సీఐఐ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా తెలిపారు. ‘‘మేమైతే అనుమతుల ప్రక్రియను వేగవంతం చేశాం. కంపెనీలే మరింత సమయం కోరుతున్నాయి’’ అని ఆయన వ్యాఖ్యానించారు. కన్సాలిడేషన్ కన్నా మార్కెట్లో మరిన్ని సంస్థలు వచ్చేలా చూసేందుకే ఐఆర్డీఏఐ ప్రాధాన్యమిస్తోందని తెలిపారు. భారత బీమా రంగంలో అవకాశాలను గ్లోబల్ ఇన్వెస్టర్లకు వివరించేందుకు ఇటీవలే జపాన్, యూరప్, అమెరికాలో రోడ్‌షోలు నిర్వహించామని వెల్లడించారు. మరోవైపు, స్టాక్ మార్కెట్లలో లిస్టయ్యేలా మరిన్ని సంస్థలను ఐఆర్డీఏఐ ప్రోత్సహిస్తోందని పాండా చెప్పారు. దీనితో పారదర్శకత పెరుగుతుందని, అంతిమంగా షేర్హోల్డర్లు అలాగే పరిశ్రమకు ప్రయోజనం చేకూరగలదని పేర్కొన్నారు. దేశీయంగా 140 కోట్ల మంది పైగా జనాభా ఉన్న నేపథ్యంలో మొత్తం బీమా సంస్థలు డెభ్భైకి పైగా ఉన్నా .. ఇంకా వ్యాపార అవకాశాలు ఎక్కువే ఉన్నాయని పాండా చెప్పారు. జీఎస్టీ తగ్గింపు వార్తలపై నేరుగా ఎటువంటి వ్యాఖ్యలు చేయనప్పటికీ బీమా పాలసీలు అందరికీ అందుబాటు స్థాయిలో ఉండేలా చూడాలనేదే ఐఆర్డీఏఐ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. అయితే, పన్నుల తగ్గింపు ఒక్కటే దీనికి పరిష్కారం కాదని తెలిపారు. -
బీమా కంపెనీలకు ఐఆర్డీఏఐ సర్క్యులర్ జారీ
బీమా కంపెనీలు వాటికి నిర్దేశించిన రంగాల్లో తప్పనిసరిగా కనీస వ్యాపారం చేయాలని ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఐఆర్డీఏఐ) మాస్టర్ సర్క్యులర్‌ను జారీ చేసింది. 2047 నాటికి అందరికీ బీమా అందించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది.బీమా కంపెనీలు గ్రామీణ ప్రాంతాల్లో, సామాజిక రంగంలో, మోటారు థర్డ్ పార్టీకి సంబంధించి కనీస లక్ష్యాలు చేరుకోవాలని ఐఆర్డీఏఐ ఆదేశించింది. ఈ ఆదేశాలు జీవిత బీమా సంస్థలతోపాటు నాన్-లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థలకు వర్తిస్తాయని పేర్కొంది. ఆయా కంపెనీలు తప్పనిసరిగా వాటికి కేటాయించిన రంగాల్లో కనీస వ్యాపారాన్ని చేయాలని చెప్పింది.ఇదీ చదవండి: గోల్డ్‌ఫైనాన్స్ తీసుకుంటే రూ.20వేలే ఇస్తారట! మిగతా డబ్బు..?లైఫ్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖతో సంప్రదించి గతంలో ఇన్సూరెన్స్ కంపెనీలకు గ్రామ పంచాయతీలను కేటాయించింది. గ్రామీణరంగ బాధ్యతలను నెరవేర్చాలని ఆదేశించింది. ఆయా కంపెనీలు పంచాయతీల పరిధిలో బీమాలేని వారికి అవగాహన కల్పించి బీమా తీసుకునేలా చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. సామాజిక రంగంలో, మోటార్ థర్డ్ పార్టీ బీమా చేసుకునేలా సంస్థలు బాధ్యత వహించి తమకు నిర్దేశించిన కనీస టార్గెట్‌ను పూర్తి చేయాలి. ప్రస్తుతం దేశంలో ఐదు స్వతంత్ర ఆరోగ్య బీమా కంపెనీలు, 40 సాధారణ బీమా కంపెనీలు రిజిస్టర్ అయ్యాయి. -
Insurance: బీమా కూడా లేకుండా కోట్ల మంది!
ముంబై: బీమా విస్తరణకు ప్రభుత్వం, బీమా రంగ అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) ఎంతో కృషి చేస్తున్నప్పటికీ, దేశ జనాభాలో 95 శాతం మందికి బీమా రక్షణ లేదని నేషనల్ ఇన్సూరెన్స్ అకాడమీ ఓ నివేదికలో తెలిపింది. ఈ నివేదికను ఐఆర్డీఏఐ చైర్మన్ దేవాశిష్ పాండా ఆవిష్కరించారు. యూపీఐ, బ్యాంక్ ఖాతాలు, మొబైల్ ఫోన్ల విస్తరణకు దోహదపడిన చర్యలను అనుసరించాలని బీమా పరిశ్రమకు ఆయన సూచించారు. ఈ నివేదికలో పేర్కొన్నట్టు అధిక రిస్క్ ఉన్న ప్రాంతాల్లో విపత్తుల ఇన్సూరెన్స్ తీసుకోవడాన్ని తప్పనిసరి చేయాలని అభిప్రాయపడ్డారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి నూరేళ్లు పూర్తి చేసుకునే నాటికి అందరికీ బీమా లక్ష్యాన్ని చేరువ చేసేందుకు ఇది అవసరమన్నారు. దేశ జనాభా 144 కోట్లలో 95 శాతం మందికి బీమా కవరేజీ లేని విషయాన్ని ఈ నివేదిక ప్రధానంగా ప్రస్తావించింది. ప్రకృతి విప్తతులు పెరిగిపోయిన క్రమంలో బీమా కవరేజీ ప్రాధాన్యాన్ని ఈ నివేదిక ఎత్తి చూపించింది. రుణానికి బీమా లింక్ దిగువ, మధ్యాదాయ వర్గాల్లో 84 శాతం మంది, తీర ప్రాంతాలు, ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో 77 శాతం మందికి ప్రాపర్టీ ఇన్సూరెన్స్ లేదని ఈ నివేదిక తెలిపింది. బ్యాంకు రుణాలు తీసుకున్న రైతులు క్రాప్ ఇన్సూరెన్స్ తీసుకోవడాన్ని తప్పనిసరి చేయాలని తన నివేదికలో నేషనల్ ఇన్సూరెన్స్ అకాడమీ సూచించింది. నిజానికి బీమా తీసుకున్న వారిలోనూ కవరేజీ సమగ్రంగా లేని అంశాన్ని ప్రస్తావించింది. ఇదీ చదవండి: LIC Credit Card: ఎల్ఐసీ నుంచి క్రెడిట్ కార్డు.. భలే బెనిఫిట్స్! జీవిత బీమా రక్షణలో 87 శాతం అంతరం (వాస్తవ కవరేజీ–తీసుకున్న దానికి మధ్య) ఉందని, ఇది గణనీయమైన వ్యాపార అవకాశాలు వీలు కల్పిస్తుందని తెలిపింది. అలాగే, 73 శాతం మందికి హెల్త్ ఇన్సూరెన్స్ రక్షణ లేదని వెల్లడించింది. ప్రభుత్వం, ఎన్జీవోలు, పరిశ్రమ కలసి సూక్ష్మ ఆరోగ్య బీమా పథకాలను రూపొందించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. యాన్యుటీ, పెన్షన్ ప్లాన్లలో కవరేజీ అంతరం 93 శాతంగా ఉందని తెలిపింది. -
బీమా.. నడిపినోళ్లకు నడిపినంత!
గుప్తా సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా ఢిల్లీలోని ఒక కంపెనీలో పనిచేస్తున్నాడు. వారానికి రెండు రోజులు ఆఫీస్‌కు వెళ్లి వస్తుంటాడు. మూడు రోజులు ఇంటి నుంచే పనిచేస్తుంటాడు. ఢిల్లీకి సమీపంలోని నోయిడాలో నివాసం ఉంటున్నాడు. ఆఫీస్‌కు వెళ్లి వచ్చే సమయంలోనే అతడు కారును ఉపయోగిస్తుంటాడు. తన నివాసం నుంచి ఆఫీస్ 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. 30 ఏళ్ల మణి సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తుంటాడు. రోజూ ఢిల్లీ నుంచి గురుగ్రామ్‌కు వెళ్లి రావడం అతడు ఉద్యోగంలో భాగం. అంతేకాదు, వారాంతంలో దూర ప్రయాణాలు (లాంగ్ డ్రైవ్) చేయడం అతడికి హాబీ. దీంతో ఏటా 30,000 కిలోమీటర్ల మేర అతడు ప్రయాణం చేస్తుంటాడు. కానీ, గుప్తా ఏడాది మొత్తం తిరిగేది 4,000 కిలోమీటర్లు మించదు. వీరిలో రిస్క్ ఎవరికి ఎక్కువగా ఉంటుంది? సాధారణంగా ఎక్కువ దూరం ప్రయాణించే వారికి ప్రమాదాల రిస్క్ ఉంటుంది. ర్యాష్ డ్రైవింగ్ చేసే వారికి రిస్క్ ఉంటుంది. కానీ, ఇక్కడ ఇద్దరూ తమ కారు కోసం ఏటా చెల్లిస్తున్నది ఒకే రకమైన ప్రీమియం. నియమ నిబంధనలను తూ.చా. తప్పకుండా పాటిస్తూ, పరిమిత వేగంతో, తక్కువ దూరం ప్రయాణించే వారిని.. ఎక్కువ దూరం ప్రయాణిస్తూ, ర్యాష్ డ్రైవింగ్ చేసే వారిని ఒకే గాటన కట్టడం సహేతుకంగా అనిపించదు. అందుకే నడిపినంత దూరానికే, నడిపే తీరు ఆధారంగా ప్రీమియం చెల్లించే సదుపాయాన్ని బీమా సంస్థలు తీసుకొచ్చాయి. ‘‘రోజూ ఎక్కువ దూరం పాటు ప్రయాణించే వారు, దూర ప్రయాణాలకు తరచుగా వెళ్లే వారితో పోలిస్తే తక్కువ ప్రీమియం చెల్లించడానికే నా ప్రాధాన్యం. ఎందుకంటే నేను కారులో తిరిగేది చాలా తక్కువ దూరం. పైగా నేను ఎంతో జాగ్రత్తగా డ్రైవ్ చేస్తాను. అందుకే నేను చెల్లించే బీమా ప్రీమియం తక్కువగా ఉండాలని కోరుకున్నాను’’అని గుప్తా తెలిపారు. అందుకే ఆయన ‘పే యాజ్ యూ డ్రైవ్’ (పీఏవైడీ), ‘పే హౌ యూ యూజ్’ (పీహెచ్ఐయూ) యాడాన్స్ను ఎంపిక చేసుకుని, గతంతో పోలిస్తే తక్కువ ప్రీమియం చెల్లిస్తున్నారు. గుప్తా వంటి వారికి ఇప్పుడు పీఏవైడీ పాలసీలు ఒక మంచి ఎంపికగా, ఆకర్షణీయంగా మారాయనడంలో సందేహం లేదు. వాహనం ఎంత దూరం ప్రయాణిస్తుందన్న దాని ఆధారంగా బీమా సంస్థలు ప్రీమియం వసూలు చేయడం ఈ పాలసీల్లో ఉన్న వెసులుబాటు. అందుకే తక్కువ నడిపే వారికి, జాగ్రత్తగా నడిపే వారికి ఇవి పెద్ద ఊరటనిస్తున్నాయి. ఈ పీఏవైడీ, పీహెచ్యూఐ పాలసీలు ఎలా పనిచేస్తాయి? వీటిని తీసుకునే ముందు తెలుసుకోవాల్సిన అంశాలు? ఈ వివరాలను అందించే కథనమే ఇది. నేపథ్యం.. మోటార్ బీమా పాలసీలకు సంబంధించి టెక్నాలజీ ఆధారిత పరిష్కారాలను ప్రవేశపెట్టేందుకు బీమా రంగ అభివృద్ధి, నియంత్రణ సంస్థ (ఐఆర్డీఏఐ) 2022 జూలైలో అనుమతించింది. వినియోగ ఆధారిత వాహన బీమా ప్లాన్లు, రైడర్లు ఆ తర్వాత నుంచి మార్కెట్ ప్రవేశం చేశాయి. టెలీమ్యాటిక్స్ డివైజ్‌లు/గ్యాడ్జెట్ల (పరికరాలు) సాయంతో వాహన వినియోగాన్ని అంచనా వేసి, ఆ మేరకు ప్రీమియాన్ని సాధారణ బీమా సంస్థలు వసూలు చేస్తున్నాయి. కారు నడిపే తీరును కూడా అవి ఈ పరికరాల ద్వారా పరిశీలిస్తాయి. దీంతో సంబంధిత వాహనదారుడి డ్రైవింగ్ తీరు, దూరంపై బీమా కంపెనీలకు కచి్చతమైన సమాచారం లభిస్తుంది. వీటిని విశ్లేషించిన అనంతరం, రిస్క్ ఆధారంగా ప్రీమియం నిర్ణయిస్తాయి. పీఏవైడీ ప్లాన్ల/రైడర్లలో వాహనం తక్కువ నడిపే వారికి ప్రీమియం భారం ఎలా అయితే తగ్గుతుందో.. వాహనం ఎక్కువగా వినియోగించే వారికి ప్రీమియం భారం పెరుగుతుంది. పీఏవైడీ, పీహెచ్ఐయూ యాడాన్లుగా లభిస్తాయి. ప్రస్తుత ప్లాన్‌కు అనుసంధానంగా తీసుకోవచ్చు. రెన్యువల్ సమయంలో బీమా కంపెనీకి ఈ విషయాన్ని చెబితే చాలు. బీమా ఏజెంట్ లేదంటే నేరుగా బీమా కంపెనీ పోర్టల్ నుంచే వీటిని తీసుకోవచ్చు. దరఖాస్తు పత్రాన్ని నింపి, అప్పటికే కలిగి ఉన్న బీమా ప్లాన్ వివరాలను సమరి్పస్తే చాలు. దూరం ఆధారంగా.. పాలసీ కొనుగోలు సమయంలో ఎంపిక చేసుకున్న కిలోమీటర్ల ఆధారంగా పీఏవైడీ పాలసీల ప్రీమియం ఆధారపడి ఉంటుంది. పలు రకాల ప్రీమియం శ్లాబులు ఉంటాయి. వీటి నుంచి పాలసీదారుడు ఎంపిక చేసుకోవచ్చు. ‘‘మన దేశంలో టెలీమ్యాటిక్స్ డివైజ్‌లు కేవలం కొన్ని రకాల కార్ల మోడళ్లకే అందుబాటులో ఉన్నాయి. అందుకని మేము తీసుకొచి్చన పాలసీలో, ఓడోమీటర్ సాయంతో దూరాన్ని లెక్కిస్తున్నాం. ఓడోమీటర్ రీడింగ్‌ను టెలీమ్యాటిక్స్ డివైజ్ లేదంటే మొబైల్ యాప్ ద్వారా ట్రాక్ చేయవచ్చు’’అని హెచ్డీఎఫ్సీ ఎర్గో రిటైల్ బిజినెస్ ప్రెసిడెంట్ పార్థానిల్ ఘోష్ తెలిపారు. సాధారణ ప్రీమియంతో పోలిస్తే బీమా సంస్థలు పీఏవైడీ ప్లాన్ కింద.. 2,500 కిలోమీటర్ల వరకు తిరిగే కార్లకు ప్రీమియంలో 25 శాతం తగ్గింపునిస్తున్నాయి. ఏడాదికి 2,501 కిలోమీటర్ల నుంచి 5,000 కిలోమీటర్ల దూరానికి 17.50 శాతం డిస్కౌంట్ ఇస్తున్నాయి. ఇక 5,001–7,000 కిలోమీటర్ల పరిధిలో తిరిగే వాహనాలకు ప్రీమియంలో 10 శాతం తగ్గింపును ఆఫర్ చేస్తున్నాయి. 7,501–10,000 కిలోమీటర్ల దూరం నడిచే కార్లకు ప్రీమియంలో 5 శాతం తగ్గింపు లభిస్తుంది. ఏడాదికి 10,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం పాటు నడిచే కార్లకు ప్రీమియంలో ఎలాంటి రాయితీ ఉండదు. పాలసీ కొనుగోలు చేసే సమయంలో ఉన్న ఓడోమీటర్ రీడింగ్‌ను బీమా సంస్థలు నమోదు చేస్తాయి. తిరిగి రెన్యువల్ సమయానికి తిరిగిన దూరం ఆధారంగా ప్రీమియంను నిర్ణయిస్తాయి. ‘‘ఇలా ఏడాదిలో తిరిగిన దూరం ఆధారంగా మరుసటి ఏడాది ప్రీమియంలో బీమా కంపెనీలు తగ్గింపును ఇస్తాయి. ఒకవేళ పాలసీదారుడు అదే కంపెనీ వద్ద రెన్యువల్ చేసుకోకుండా, మరొక కంపెనీ వద్ద పాలసీ తీసుకున్నా సరే, గడిచిన ఏడాదికి సంబంధించిన డిస్కౌంట్‌ను నెఫ్ట్ ద్వారా పాలసీదారు ఖాతాకు బదిలీ చేస్తాయి. అదే కంపెనీతో కొనసాగితే రెన్యువల్ ప్రీమియంలో తగ్గించి, మిగిలినది చెల్లిస్తే సరిపోతుంది’’అని పార్థానిల్ ఘోష్ వివరించారు. పాలసీ తీసుకునే సమయంలో ఎంపిక చేసుకున్న కిలోమీటర్లను ఏడాది కాక ముందే అధిగమించేశారనుకుంటే, అప్పుడు టాపప్ చేసుకోవచ్చు. ఉదాహరణకు ఏడాదికి 6,000 కిలోమీటర్ల కోసం పాలసీ తీసుకుని, రెన్యువల్ గడువుకు ముందే ఈ దూరం దాటేస్తే, అప్పుడు దీన్ని పెంచుకోవచ్చు. ‘‘ఒకటికి మించిన కార్లు ఉన్నవారు లేదా తక్కువ దూరం ప్రయాణించే వారికి పీఏవైడీ ప్లాన్లు మంచి ప్రయోజనాన్నిస్తాయి. ప్రీమియంలో తగ్గింపు అనేది కారు మోడల్, దాని వయసు, రిజి్రస్టేషన్ అయిన ప్రాంతం ఆధారంగా నిర్ణయం అవుతుంది. కొన్ని బీమా సంస్థలు రెన్యువల్ సమయంలో అదనపు రివార్డులను కూడా ఇస్తున్నాయి. పాలసీ సంవత్సరంలో కారు తక్కువ వినియోగిస్తాననే స్పష్టత యజమానికి ఉంటే, వాస్తంగా వినియోగించుకున్న మేరకే ప్రీమియం చెల్లించడం సహేతుకంగా ఉంటుంది’’అని పాలసీబజార్ మోటార్ ఇన్సూరెన్స్ ఉత్పత్తుల హెడ్ ఆకర్‡్ష శర్మ సూచించారు. నడిపే తీరు కూడా ముఖ్యమే గుప్తా మాదిరే తాము కూడా డ్రైవింగ్ విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తామని అనుకునే వారు ‘పే హౌ యూ యూజ్’ (పీహెచ్ఐయూ) ప్లాన్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఇందులో వాహనం నడిపే తీరు ఆధారంగా ప్రీమియం చార్జ్ చేస్తారు. పీఏవైడీ మాదిరే, పీహెచ్వైయూ (పే హౌ యు యూజ్) కూడా యాడాన్‌గా వస్తోంది. ‘‘నడిపే తీరు ఆధారితంగా ఆల్గోరిథమ్ ఇంటర్నల్ స్కోర్‌ను ఇస్తుంది. ఈ స్కోరు ఆధారంగా అండర్‌రైటర్స్ (బీమా అధికారులు) ప్రీమియంను కచి్చతంగా లెక్కిస్తారు. దేశంలో కనెక్టెడ్ కార్లను ప్రారంభించడం పీఏవైడీ ఆఫర్ చేయడానికి అనుకూలం. అవి డ్రైవింగ్ తీరుపై బీమా సంస్థలకు నాణ్యమైన సమాచారాన్ని ఇస్తాయి’’అని బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ మోటార్ డి్రస్టిబ్యూషన్ హెడ్ సుభాశిష్ మజుందార్ తెలిపారు. కనెక్టెడ్ కార్స్ అంటే ఇంటర్నెట్తో అనుసంధానమైనవి. వీటిల్లో కమ్యూనికేషన్ డివైజ్‌లు, సెన్సార్లు కూడా ఉంటాయి. ఈ ప్లాన్లను తమకు కావాల్సిన విధంగా ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఉంటుంది. పాలసీని ఆన్, ఆఫ్ చేసుకోవచ్చు. జునో జనరల్ ఇన్సూరెన్స్ ఆఫర్ చేస్తున్న ‘స్విచ్’ అనేది ఆన్ డిమాండ్ పాలసీ. పట్టణానికి వెలుపల ఉండి, కారును నడపని సమయంలో పాలసీని ఆఫ్ చేసుకోవచ్చు. దీనివల్ల బీమా ప్రీమియంలో ఆదా చేసుకోవచ్చు. కానీ, ఇలా ఆఫ్ చేసుకున్న సమయంలో కారుకు ఏదైనా నష్టం ఏర్పడితే అందుకు బీమా కంపెనీ నుంచి పరిహారం రాదని (కొన్ని మినహాయింపులు) గుర్తుంచుకోవాలి. కస్టమర్ కారు నడుపుతున్న తీరు ఆధారంగా డ్రైవింగ్ స్కోర్‌ను బీమా సంస్థలు కేటాయిస్తాయి. అధిక వేగం, పరధాన్యంతో డ్రైవింగ్, ఉన్నట్టుండి బ్రేక్‌లు కొట్టడం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ స్కోర్ కేటాయిస్తాయి. ఒకవేళ పాలసీని స్విచాఫ్ చేసుకున్న తర్వాత, కారును వినియోగించినట్టయితే ఆ సమయంలో స్విచాన్ చేయడం మర్చిపోయినా.. వారి తరఫున యాప్ ఆ పనిచేస్తుంది. అన్నింటిపై కాదు.. నడిపినంత దూరం, జాగ్రత్తగా డ్రైవింగ్ చేయడంపై వచ్చే డిస్కౌంట్ ఆధారపడి ఉంటుందని గుర్తు పెట్టుకోవాలి. ఇక్కడ ఓన్ డ్యామేజ్ అంటే వాహనానికి ఏదైనా కారణం వల్ల నష్టం వాటిల్లినా లేదా చోరీకి గురైనా పరిహారం ఇచ్చేదని అర్థం చేసుకోవాలి. థర్డ్ పార్టీ అంటే తమ వాహనం వల్ల ఎదుటి వాహనానికి, వ్యక్తులకు జరిగే నష్టానికి రక్షణనిచ్చే కవరేజీ. కొన్ని బీమా కంపెనీలు కేవలం ఓన్ డ్యామేజ్ వరకే ఈ డిస్కౌంట్‌ను ఇస్తున్నాయి. ఐసీఐసీఐ లాంబార్డ్ వంటి సంస్థలు థర్డ్ పార్టీ కవరేజీపైనా డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తున్నాయి. కనుక మొత్తంమీద డిస్కౌంట్ ఎంత వస్తుందన్నది ముందే విశ్లేషించుకోవాలి. ఉదాహరణకు కారు ప్రీమియం రూ.5,000 చెల్లిస్తున్నారనుకుంటే.. అందులో రూ.3,000 ఓన్ డ్యామేజ్ కోసం, రూ.2,000 థర్డ్ పార్టీ కోసం అయితే, ఓన్ డ్యామేజ్ రూ.3,000పై 5–25 శాతం వరకు డిస్కౌంట్ అంటే రూ.150–750 వరకు తగ్గుతుందని అర్థం. ఇక్కడ వాహనదారుడి ప్రయాణ సమాచారం ఎప్పటికప్పుడు బీమా కంపెనీలకు తెలుస్తుందని గుర్తు పెట్టుకోవాలి. గోప్యత కోరుకునే వారు దీన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ఈ డేటా ఆధారంగానే బీమా సంస్థలు ప్రీమియంపై నిర్ణయానికి వస్తాయి. డిస్కౌంట్ పొందే వారి డ్రైవింగ్ తీరు సైతం బీమా కంపెనీలకు తెలిసిపోతుంది. భవిష్యత్తులో ప్రమాదాల క్లెయిమ్‌లు వచి్చన సమయంలో ఈ డేటా వాటికి ఉపకరించొచ్చు. రద్దీ సమయాల్లో డ్రైవింగ్, ప్రమాదాలకు అధిక రిస్క్ ఉన్న ప్రాంతాల్లో డ్రైవింగ్‌కు సంబంధించి బీమా కంపెనీలు కొన్ని పరిమితులు విధించే అవకాశం లేకపోలేదు. బీమా కంపెనీ కోరినట్టు టెలీమ్యాటిక్స్, ఇతర పరికరాలు అమర్చుకోవాలంటే, అందుకు కొంత అదనపు వ్యయం అవుతుంది. ఈ పరికరాలకు మెయింటెనెన్స్, మరమ్మతుల ఖర్చు కూడా వాహనదారుడిపైనే పడుతుంది. వాహనంలో ఏవైనా మార్పులు చేయాల్సి వస్తే.. అందుకు సంబంధించి పాలసీ నియమ, నిబంధనలు ఏంటో ముందే తెలుసుకోవాలి. వీటికి కవరేజీ.. ► సంప్రదాయ బీమాలో మాదిరే అన్ని రకాల రిస్క్‌లను పీఏవైడీ కవర్ చేస్తుంది. అయితే ప్రీమియం చెల్లింపుల్లో వ్యత్యాసం ఉంటుంది. ► ప్రమాదం జరిగితే కారు రీపేర్ లేదంటే రీప్లేస్‌కు అయ్యే ఖర్చును బీమా కంపెనీ భరిస్తుంది. ► చోరీకి గురైతే లేదా చోరీ కారణంగా కారు డ్యామేజ్ అయినా పరిహారం లభిస్తుంది. ► వరదలు, భూకంపాలు తదితర విపత్తుల వల్ల కారుకు నష్టం ఏర్పడినా పరిహారం వస్తుంది. ► థర్డ్ పార్టీ కవరేజీ కూడా పీఏవైడీలతో వస్తుంది. ► కొన్ని పీఏవైడీ పాలసీలు గాయాల రక్షణ కవరేజీని ఆఫర్ చేస్తున్నాయి. మినహాయింపులు.. ► ఉద్దేశపూర్వకంగా చేసుకునే నష్టానికి పరిహారం రాదు. ► మద్యం, డ్రగ్స్ ప్రభావంతో కారు నడుపుతూ ప్రమాదం, నష్టం వాటిల్లితే బీమా సంస్థలు పరిహారం చెల్లించవు. ► డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా కారు నడపడం వల్ల ఎదురయ్యే నష్టానికి పరిహారం రాదు. ► రోజువారీ వినియోగం వల్ల వాహనంలో విడిభాగాలను మార్చాల్సి వస్తే వాటికి పరిహారం రాదు. ► ఎలక్ట్రికల్, మెకానికల్ ఫెయిల్యూర్ వల్ల నష్టం ఏర్పడితే పరిహారం చెల్లించవు. ప్రీమియం తగ్గించుకునే టిప్స్.. ► తక్కువ దూరం నడిపే వారికి పీఏవైడీతో ప్రీమియం ఆదా చేసుకోవచ్చు. దగ్గరి దూరానికి కారును ఉపయోగించుకోకుండా ఉండాలి. కార్యాలయానికి వెళ్లేవారు సహచర ఉద్యోగితో కలసి చెరొక రోజు కారును వినియోగించుకోవడం వల్ల ఆదా చేసుకోవచ్చు. ► చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలి. ఏ సందర్భంలోనూ ట్రాఫిక్ నియామాలు ఉల్లంఘించకూడదు. పరిమిత వేగాన్ని మించకుండా ఉండాలి. సడెన్ బ్రేక్‌లు వేయడం, రిస్క్ తీసుకుని క్రాస్ చేయడం ఇలా ప్రమాదాలకు దారితీసే చర్యలకు దూరంగా ఉండాలి. ► ఎయిర్ బ్యాగ్‌ల వంటి భద్రతా ఫీచర్లు ఎక్కువగా ఉన్న కారును ఎంపిక చేసుకోవడం వల్ల కూడా ప్రీమియంలో ఆదా చేసుకోవచ్చు. ► మద్యపానం సేవించే వారు ఆ సమయంలో క్యాబ్ సేవలు వినియోగించుకుని, వ్యక్తిగత డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలి. -
ఐఆర్డీఏ డ్రాఫ్ట్ ఉపసంహరించేదాకా పోరు
కవాడిగూడ (హైదరాబాద్): కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇన్సూరెన్స్ రెగ్యులేషన్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏ) డ్రాఫ్ట్‌ను ఉపసంహరించుకోకపోతే దేశవ్యాప్తంగా ఎల్ఐసీ ఏజెంట్లు పెద్దఎత్తున ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి పిలుపునిచ్చారు. భారత ఆర్థిక వ్యవస్థను ఆగ్రభాగాన నిలబెట్టడంలో ఎల్ఐసీ ఏజెంట్ల పాత్ర మహోన్నతమైందని పేర్కొన్నారు. ఎల్ఐసీ ఏజెంట్ల సమస్యలను దేశ ప్రధాని, తెలంగాణ సీఎంలకు లేఖల ద్వారా పంపించి వివరిస్తామన్నారు. శుక్రవారం ఎల్ఐసీ ఏజెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీఏవోఐ) ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాల నుంచి వేలాదిమంది ఎల్ఐసీ ఏజెంట్లు ఇందిరాపార్కు ధర్నాచౌక్‌లో మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్‌ఐసీఏవోఐ ఆలిండియా ప్రధాన కార్యదర్శి దిలీప్ మాట్లాడుతూ ఐఆర్డీఏ డ్రాఫ్ట్ వల్ల ఎల్ఐసీ ఏజెంట్ల మనుగడకే తీవ్రమైన నష్టం కలగడమే కాకుండా ఎల్ఐసీ వ్యవస్థ కనుమరుగయ్యే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. ఎల్‌ఐసీఏవోఐ సౌత్ జోన్ అధ్యక్షుడు మంజునాథ్, ప్రధాన కార్యదర్శి నరసింహారావు మాట్లాడుతూ బీమా సంగం పేరుతో ఎల్ఐసీని నిర్వీర్యం చేసి కార్పొరేట్ సంస్థలకు అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. కార్యక్రమంలో సీఐటీయూ ఆలిండియా వైస్ ప్రెసిడెంట్ మాజీ ఎంపీ వాసుదేవ్ ఆచార్య, ఏఐఐఈఏ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ మిశ్రా తదితరులు పాల్గొన్నారు. -
బీమాలో భారీ సంస్కరణలు
న్యూఢిల్లీ: బీమా రంగంలో కీలకమైన సంస్కరణకు బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) ఆమోదముద్ర వేసింది. ముఖ్యంగా కొత్త సంస్థల ప్రవేశ నిబంధనలను సడలించింది. సాల్వెన్సీ రేషియోను సైతం తగ్గించింది. దీంతో ప్రస్తు్తత బీమా సంస్థలకు అదనంగా రూ.3,500 కోట్ల నిధులు అందుబాటులోకి రానున్నాయి. బీమా సేవలను మరింత మందికి చేరువ చేసే లక్ష్యంతో ఐఆర్డీఏఐ శుక్రవారం నాటి బోర్డ్ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకుంది. బీమా కంపెనీల్లో నేరుగా పెట్టుబడులు పెట్టేందుకు ప్రైవేటు ఈక్విటీ సంస్థలను (పీఈ) అనుమతించింది. సబ్సి డరీలు బీమా సంస్థలకు ప్రమోటర్లుగా మారేందుకు ఓకే చెప్పింది. 2047 నాటికి అందరికీ బీమా లక్ష్యానికి కట్టుబడి ఉన్నట్టు ఐఆర్డీఏఐ ప్రకటించింది. కీలక నిర్ణయాలు.. ► బీమా రంగంలో సులభతరమైన వ్యాపార విధానాలకు వీలుగా, కొత్త సంస్థల రాకను ప్రోత్సహించేందుకు రిజిస్ట్రేషన్ నిబంధనలను సవరించనున్నట్టు ఐఆర్డీఏఐ తెలిపింది. ► కార్పొరేట్ ఏజెంట్లు ఇక మీదట గరిష్టంగా 9 బీమా సంస్థలతో టైఅప్ పెట్టుకోవచ్చు. ఈ పరిమితి ప్రస్తుతం 3గానే ఉంది. ఇన్సూరెన్స్‌ను మార్కెటింగ్ చేసే ఒక్కో సంస్థ గరిష్టంగా ఆరు బీమా సంస్థలతో ఒప్పందాలు చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ పరిమితి 2గా ఉంది. ► సాధారణ బీమా సంస్థలు తమ నిధులను మరింత సమర్థవంతంగా వినియోగించుకునేందుకు గాను, క్రాప్ ఇన్సూరెన్స్ సాల్వెన్సీ రేషియోను 0.70 శాతం నుంచి 0.50 శాతానికి తగ్గించింది. దీనివల్ల కంపెనీలకు రూ.1,460 కోట్ల నిధులు అందుబాటులోకి వస్తాయి. ► ఇక జీవిత బీమా కంపెనీలకు సంబంధించి యూనిట్ లింక్డ్ ప్లాన్ల (యులిప్‌లు) సాల్వెన్సీ రేషియోను 0.80% నుంచి 0.60% చేసింది. ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన సాల్వెన్సీ రేషియోను 0.10% నుంచి 0.05% చేసింది. దీనివల్ల జీవిత బీమా కంపెనీలకు రూ.2,000 కోట్లు అందుబాటులోకి వస్తాయి. ► బీమా కంపెనీ చెల్లించిన మూలధనంలో ఒక ఇన్వెస్టర్ 25%, ఇన్వెస్టర్లు ఉమ్మడిగా 50% వాటా కలిగి ఉంటే ‘ఇన్వెస్టర్లు’గా పరిగణించనుంది. అంతకుమించితే ప్రమోటర్లుగా పరిగణిస్తారు. ఇప్పటి వరకు ఒక ఇన్వెస్టర్‌కు 10%, ఇన్వెస్టర్ల సమూహానికి 25% పరిమితి ఉంది. ► ప్రమోటర్లు 26 శాతం వరకు వాటాను తగ్గించుకునేందుకు కొత్త నిబంధన తీసుకొచ్చింది. చదవండి: మాదాపూర్ గుర్తుందా.. మళ్లీ అదే తరహా డెవలప్మెంట్ అక్కడ మొదలైంది! -
అగ్ని ప్రమాదాలకు ప్రత్యామ్నాయ బీమా
న్యూఢిల్లీ: అగ్ని ప్రమాదాలు, విపత్తుల వల్ల కలిగే నష్టాలకు బీమా కవరేజీని.. చిన్న నివాసాలు, చిన్న వ్యాపార సంస్థలకు ఆఫర్ చేసే విషయంలో వినూత్న పాలసీల రూపకల్పనకు బీమా రంగ నియంత్రణ సంస్థ (ఐఆర్డీఏఐ) అనుమతించింది. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలను జారీ చేసింది. నివాసాలు, సూక్ష్మ, చిన్న వ్యాపార సంస్థలకు ప్రామాణిక బీమా ఉత్పత్తులకు సంబంధించి ఈ మార్గదర్శకాలు అమలవుతాయి. భారత్ గృహ రక్ష, భారత్ సూక్ష్మ ఉదయం సురక్ష, భారత్ లఘు ఉదయం సురక్షా స్థానంలో స్టాండర్ బీమా ఉత్పత్తులను బీమా సంస్థలు ఆఫర్ చేయాల్సి ఉంటుంది. చదవండి: లైఫ్‌కి ఇన్సురెన్స్ ఉండాలంతే! -
బీమా కంపెనీలు లిస్టింగ్‌కు వెళ్లాలి!
ముంబై: పెట్టుబడులను సులభంగా సమీకరించేందుకు వీలుగా ఇన్సూరెన్స్ కంపెనీలు స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్‌ను పరిశీలించవచ్చని బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్డీఏ చైర్మన్ దేవాశిష్ పాండా పేర్కొన్నారు. పబ్లిక్ ఇష్యూలు చేపట్టడం ద్వారా బీమా కంపెనీలు లిస్టింగును సాధించవచ్చని తెలియజేశారు. దీంతో బిజినెస్‌లో వృద్ధి అవకాశాలకు వీలుగా పెట్టుబడులను సమకూర్చుకునేందుకు వీలు చిక్కుతుందని తెలియజేశారు. అంతేకాకుండా దేశీయంగా బీమా విస్తృతికి సైతం లిస్టింగ్స్ దోహదపడతాయని అభిప్రాయపడ్డారు. బీమా రంగ కంపెనీలను ఐపీవోలకు వెళ్లవలసిందిగా సూచిస్తున్నట్లు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. పీఎస్‌యూ దిగ్గజం ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూకి వస్తే మార్కెట్లో 60 శాతం లిస్టయినట్లేనని వ్యాఖ్యానించారు. ఇది అత్యధిక పారదర్శకత, సమాచార వెల్లడికి దారి చూపుతుందని పేర్కొన్నారు. కంపెనీలు మరింత పురోగమించడానికి లిస్టింగ్ దోహదపడుతుందని, అంతిమంగా ఇది బీమా రంగ వ్యాప్తికి కారణమవుతుందని వివరించారు. ఐఆర్డీఏ చైర్మన్‌గా పాండా గత నెలలో బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. బీమా రంగ సంస్థలతో రెండు రోజులుగా ఇక్కడ పాండా సమావేశాలు నిర్వహిస్తున్నారు. రూ.100 కోట్ల ప్రవేశ నిబంధన ఎత్తివేయాలి బీమా వ్యాపారం ప్రారంభించేందుకు కనీసం రూ.100 కోట్ల పెట్టుబడి పరిమితిని ఎత్తివేయాలంటూ ప్రభుత్వాన్ని కోరే అవకాశం ఉన్నట్టు ఐఆర్డీఏఐ చైర్మన్ దేవాశిష్ పాండా తెలిపారు. ప్రస్తుత నిబంధన సదుపాయ కల్పన కంటే అడ్డంకిగా ఉన్నట్టు తాము గుర్తించామన్నారు. ఈ రంగంలోకి మరిన్ని సంస్థలు ప్రవేశానికి వీలుగా పరిమితిని ఎత్తివేయడం లేదా తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. సవరించిన వ్యాపార ప్రణాళికలు సమర్పించండి ప్రభుత్వ సాధారణ బీమా సంస్థలకు ఐఆర్డీఏ ఆదేశం సవరించిన వ్యాపార ప్రణాళికలు సమర్పించాలంటూ మూడు ప్రభుత్వరంగ సాధారణ బీమా సంస్థలు.. నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్, ఓరియంటల్ ఇన్సూరెన్స్‌ను ఐఆర్డీఏ ఆదేశించింది. ఈ మూడు ప్రభుత్వరంగ బీమా సంస్థలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటుండడం గమనార్హం. ప్రభుత్వరంగ సాధారణ బీమా సంస్థలకు సంబంధించి కొంత సమాచారాన్ని ప్రభుత్వం కోరిందని, దాన్ని అందించినట్టు ఐఆర్డీఏఐ చైర్మన్ పాండా తెలిపారు. ఆయా సంస్థలకు ప్రభుత్వం నిధులను అందించే అవకాశం ఉందన్నారు. ఐఆర్డీఏఐ చైర్మన్ దేవాశిష్ పాండా, ఇతర సీనియర్ అధికారులు, సభ్యులు, బీమా సంస్థల ఉన్నతాధికారుల సమావేశం గురువారం ముంబైలో జరిగింది. -
లాభదాయక సంస్థలనూ అమ్మేస్తే ఎలా?
ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2021–22 బడ్జెట్ ప్రవేశపెడుతూ జీవిత బీమా సంస్థలో ఐపీఓ చేపట్ట డానికి వీలుగా ఎల్ఐసీ చట్టానికి 27 సవరణలు ప్రతిపాదించారు. అలాగే బీమా రంగంలో విదేశీ పెట్టుబడుల శాతాన్ని 74కు పెంచుతూ కేంద్ర కేబి నెట్ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఎల్ఐసీని లిస్టింగ్ చేసే ప్రక్రియలో భాగంగా ఆర్థిక మంత్రిత్వ శాఖకు అనుబంధంగా ఉన్న దీపం సలహాదారులు డెలాయిట్ కంపెనీ, ఎస్బీఐ కాప్స్ కంపెనీలను నియమించింది. ఎల్ఐసీ నిజవిలువను మదింపు చేయడానికి మిల్లిమాన్ కంపెనీని నియమించింది. ఇందులో వాటాలు అమ్మి ఆర్థిక లోటును పూడ్చుకునే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఉందని స్పష్టంగా తెలుస్తోంది.(చదవండి: వాహన బీమా వ్యయం తగ్గించుకుందామా...) మన దేశ బీమా రంగంలో ఎఫ్‌డీఐ పరిమితిని పెంచాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఐఆర్డీఏ చట్టం 1999 ద్వారా బీమా రంగంలోకి 26 శాతం విదేశీ ఈక్విటీని అనుమతించారు. తదనంతరం 2015లో ఈ పరిమితిని 49 శాతానికి పెంచారు. ఇప్పుడు దీన్ని 74 శాతానికి పెంచడం తోపాటు బీమా సంస్థలలో విదేశీ యాజమాన్యాన్ని అనుమ తించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బీమా రంగంలో విదేశీ పెట్టుబడులను ఎక్కువగా అనుమతిస్తే అవి దేశీయ పొదు పుపై నియంత్రణ సాధిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనుభవాలను బట్టి చూస్తే విదేశీ పెట్టుబడులు, దేశీయ పొదుపునకు ఏమాత్రం ప్రత్యామ్నాయం కాదని నిరూపిత మైంది. ఇప్పటికే లిస్టింగ్ అయిన ప్రైవేటు బీమా కంపెనీల బ్యాలెన్స్ షీట్లు చూస్తే, దేశ నిర్మాణం, మౌలిక వనరుల ప్రయోజనాల కోసం అవి పెట్టిన పెట్టుబడులు నామ మాత్రమే. బీమా రంగంలో ఎఫ్‌డీఐలను పెంచడం, విదేశీ యాజమాన్యాన్ని అనుమతించడం మొదలైన నిర్ణయాలు భారతదేశంలోని ప్రజల విలువైన పొదుపును విదేశీ శక్తుల చేతికి అప్పగించడమే.ఎల్ఐసీలో వాటాల అమ్మకం పేరుతో ప్రభుత్వ పెట్టుబడులు ఉపసంహరించడం సంస్థ ప్రైవేటీకరణ దిశగా వేసే మొదటి అడుగు. ప్రజల చిన్న మొత్తాల పొదుపును ప్రీమియంల రూపంలో సమీకరించి, తద్వారా దేశ సర్వతో ముఖాభివృద్ధికి తోడ్పడే లక్ష్యంతో దీన్ని పార్లమెంటు చట్టం ద్వారా 1956లో ఏర్పరిచారు. ‘ప్రజల సొమ్ము, ప్రజా సంక్షే మానికి’ అనే లక్ష్యంతో నాటి నుండి నేటి వరకు విజయ వంతంగా ఎల్ఐసీ ప్రజలకు విశిష్ట సేవలు అందిస్తోంది. లిస్టింగ్ వల్ల పారదర్శకత మెరుగుపడుతుందనే ప్రభుత్వ వాదన అసంబద్ధం. ఎల్ఐసీ ప్రతి నెలా రెగ్యులేటర్ ఐఆర్‌డీఏకు తన పనితీరు నివేదికలను సమర్పిస్తుంది. అలాగే పార్లమెంటు పరిశీలన కోసం తన జమా ఖర్చులు, అకౌంటు పుస్తకాలను ఉంచుతుంది. ఇంత పారదర్శకంగా ఈ సంస్థ పనిచేస్తున్నప్పుడు ఇంకేం పారదర్శకత కావాలి? ‘సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్’ నిర్వహించిన ట్రాన్స్పరెన్సీ ఆడిట్లో గ్రేడ్–ఎ (97 శాతం) సాధించింది. పైగా సంస్థ నిరర్థక ఆస్తులు కేవలం 0.33 శాతం మాత్రమే. భారత ఆర్థిక వ్యవస్థలో ప్రతి సంవత్సరం రూ. 3.5 లక్షల కోట్ల నుంచి రూ. 4 లక్షల కోట్ల వరకు నిధులను పెట్టుబడులుగా పెట్టగల ఈ సంస్థకు నిధుల కోసం మార్కెట్‌ను ఆశ్ర యించాల్సిన పరిస్థితి లేదు. 2020 మార్చి 31 నాటికి రూ 30.67 లక్షల కోట్ల పెట్టుబడులను ప్రజా సంక్షేమానికి అందించింది. దేశ అంతర్గత వనరుల సమీకరణలో సంస్థ వాటా 25 శాతంపైనే. 440 బిలియన్ డాలర్ల విలువైన ఆస్తులు కలిగి (ఐక్యరాజ్యసమితి జాబి తాలో ఉన్న 75 శాతం దేశాల జీడీపీ కంటే ఎక్కువ), ఆర్జించిన ఆదాయ పరంగా ఫార్చూన్ 500 కంపెనీల జాబితాలో స్థానం పొందిన ఎల్ఐసీకి మార్కెట్ నుండి నిధుల అవసరం ఉందనేది హాస్యాస్పదం. లిస్టింగ్ చేయటం వలన పాలసీదారులకు లాభం కలుగుతుందనే వాదనలు పూర్తిగా అర్థరహితం. 1956 నుండీ పాలసీదారుల నిధులను పరిపూర్ణంగా సంరక్షిస్తూ వారికి మంచి బోనస్ అందిస్తోంది. 98.27 శాతం క్లెయి మ్‌లను పరిష్కరించడం ద్వారా ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచింది. 2019–20 ఆర్థిక సంవత్సరంలో 2.15 కోట్ల క్లెయిమ్స్ చెల్లించి ప్రపంచంలోనే అత్యుత్తమ బీమా సంస్థగా పేరొందింది. ఐఆర్డీఏ వార్షిక నివేదిక 2018–19 ప్రకారం 99.57% డెత్ క్లెయిమ్‌లను పరిష్కరించింది. పెట్టు బడులు ఉపసంహరించి అందులో 10% షేర్లు పాలసీ దారులకు ఇస్తామని ప్రభుత్వం ఆశ చూపుతోంది. కానీ ప్రభుత్వం చేస్తున్న సవరణలు పాలసీదారుల ప్రయో జనా లకు గండికొట్టేలా ఉన్నాయి. పేద, మధ్యతరగతి, బలహీన వర్గాలకు చౌకగా బీమా సౌకర్యాన్ని అందించే సామాజిక లక్ష్యం కుంటుపడి, లాభరహితంగా గ్రామీణ ప్రాంతాల్లో బీమాను విస్తరించే లక్ష్యం కూడా వీగిపోతుంది. 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం ధాటికి ఏఐజీ వంటి అతిపెద్ద బీమా కంపెనీని కూడా అమెరికా ప్రభుత్వం ఆదుకోక తప్పలేదు. సెప్టెంబర్ 11, 2001న అమెరికాలో ట్విన్ టవర్లు తీవ్రవాద దాడిలో కూలిపోతే ప్రభుత్వ సాయం ఉంటేనే క్లెయిములు చెల్లిస్తామని అక్కడి బీమా కంపెనీలు తెగేసి చెప్పాయి. ఇవన్నీ ప్రపంచ ప్రఖ్యాత స్టాక్ మార్కెట్ల లోని లిస్టింగ్ కంపెనీలే. దీనికి భిన్నంగా, దేశంలో ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా అన్ని నిబంధనలు సడలించి పాలసీదారుల క్లెయిములను ఒక్క రూపాయి ప్రభుత్వ సాయం కోరకుండానే ఎల్ఐసీ పరి ష్కరించింది. గత 20 సంవత్సరాలుగా 23 ప్రైవేటు బీమా కంపెనీల పోటీని ఎదుర్కొంటూ నేటికీ 71 శాతానికి పైగా మార్కెట్ షేర్‌తో మార్కెట్ లీడర్‌గా కొనసాగుతోంది. తన 2,547 కార్యాలయాలను (52.1%) యాభై వేల కంటే తక్కువ జనాభా కలిగిన గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో నెల కొల్పింది. దీనికి భిన్నంగా ప్రైవేట్ బీమా కంపెనీల 77.1% కార్యాలయాలు మెట్రో, అర్బన్ ప్రాంతాల్లోనే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఐపీఓ ప్రయత్నాలను, బీమా రంగంలో ఎఫ్‌డీఐ పెంపు బిల్లుని విరమించుకోవాలని కోరుతూ ఇప్పటికే ఎల్ఐసీలోని ఉద్యోగ సంఘాలు, ఏజెంట్లతో కలిసి దేశవ్యాప్తంగా దాదాపు 450 మంది పార్ల మెంట్ సభ్యులను కలిసి వినతిపత్రాలు సమర్పించాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా బడ్జెట్ పత్రాలతో పాటే ఎల్ఐసీ చట్ట సవరణలను ఆమోదించుకోవాలన్న ప్రభుత్వ ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా సంస్థలోని దాదాపు అన్ని ఉద్యోగ సంఘాలు, ఏజెంట్ల సంఘాలు ఎల్ఐసీ పరిరక్షణే ధ్యేయంగా మార్చి 18న సమ్మెకు పిలుపు నిచ్చాయి. పి. సతీష్ వ్యాసకర్త ఎల్ఐసీ ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల సంఘ రాష్ట్ర నాయకులు, మొబైల్ : 94417 97900 -
సంపూర్ణ ఆరోగ్య రక్షణ మీకుందా..?
ఈ రోజుల్లో బీమా పాలసీ లేకుండా వైద్య చికిత్సల ఖర్చులను భరించడం సామాన్యుల వల్ల అయ్యే పని కాదు. ఏటేటా వైద్య ఖర్చులు అనూహ్యంగా పెరిగిపోతున్న తరుణంలో ప్రతీ ఒక్కరి ప్రణాళికలో ఆరోగ్య బీమా (హెల్త్ పాలసీ) అవసరం ఎంతో ఉంది. అలా అని ఏదో నామమాత్రపు కవరేజీతో హెల్త్ పాలసీ తీసుకుని.. ‘హమ్మయ్య నాకు హెల్త్ కవరేజీ ఉందిలే’ అని అనుకోవద్దు. ఎందుకంటే మధ్య వయసు నుంచి వృద్ధాప్యానికి చేరువవుతున్న కొద్దీ అనారోగ్య సమస్యలు, జీవనశైలి వ్యాధుల ముప్పు ఎక్కువవుతుంది. కనుక 20ల్లో తీసుకున్న కవరేజీయే జీవితాంతం సరిపోతుందని అనుకోవద్దు. అంతేకాదు ఒక్కొక్కరి జీవన విధానం, జీవనశైలి వేర్వేరుగా ఉండొచ్చు. కొందరికి జీవనశైలి వ్యాధుల ముప్పు ఎక్కువగా ఉంటుంది. అందుకే వయసుకు తగ్గ హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ (బీమా రక్షణ) అవసరం. అప్పటికే పలు వ్యాధులతో బాధపడుతుంటే.. ఎదురయ్యే ఖర్చులను తీర్చే స్థాయిలో బీమా రక్షణ ఉండాలి. ఇక కోవిడ్–19 వైరస్‌కు ప్రైవేటులో చికిత్స తీసుకోవాల్సి వస్తే పేదలు, మధ్యతరగతి వారు లబోదిబోమనే పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది. ఎందుకంటే రోజుకు రూ.లక్ష వరకు వసూలు చేస్తున్న కార్పొరేట్ ఆస్పత్రులు కొన్ని ఉన్నాయి. దీంతో కోవిడ్ చికిత్సకు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించాలంటే భయపడే పరిస్థితి. ఈ పరిణామాలు సైతం హెల్త్ ఇన్సూరెన్స్‌పాలసీ అవసరాన్ని గుర్తు చేస్తున్నాయి. 20–30 మధ్య వయస్సువారు... సాధారణంగా జీవనశైలి ఆరోగ్యంగానే ఉంటుంది. అయినప్పటికీ వైద్యపరంగా అత్యవసర పరిస్థితి ఏర్పడితే అందుకు సన్నద్ధమై ఉండాలి. కనుక ఇండివిడ్యువల్ హెల్త్ పాలసీ తీసుకోవాలి. ఆస్పత్రిలో చేరాల్సి వస్తే ఇది ఆదుకుంటుంది. ఔట్ పేషెంట్ చికిత్సలకు కవరేజీ ఇచ్చే పాలసీ మంచిది. పెరిగే వయసు, వైద్య ద్రవ్యోల్బణానికి తగ్గట్టు బీమా కవరేజీ పెంచుకునే ఆప్షన్ తప్పకుండా ఉండాలి. ఐఆర్డీఏఐ ఆదేశాలతో చాలా బీమా కంపెనీలు ఆరోగ్య సంజీవని పేరుతో ఓ ప్రామాణిక హెల్త్ పాలసీని తీసుకొచ్చాయి. కనుక యువత ఈ ప్లాన్‌ను పరిశీలించొచ్చు. మెట్రో నగరాలు, టైర్–1 పట్టణాల్లో ఉంటుంటే కవరేజీ కనీసం రూ.5లక్షలు, ఇతర పట్టణాల్లో ఉంటున్న వారు రూ.3 లక్షలు ఉండేలా ఎంచుకోవాలి. ఇక ఉద్యోగం ఉండి, తరచూ ప్రయాణాలు చేయాల్సి ఉంటే, రిస్క్ ఎక్కువ ఉండే రంగాల్లో పనిచేస్తుంటే.. ప్రమాదాల కారణంగా ఏర్పడే వైకల్యానికి... యాక్సిడెంటల్ డిజేబిలిటీ రైడర్ తీసుకోవాలి. కవరేజీ రూ.20 లక్షలు అయినా ఉండాలి. 30ప్లస్‌లోకి చేరితే... ఈ వయసులో వైవాహిక జీవితంలోకి ప్రవేశించడంతోపాటు తల్లిదండ్రులు అవుతుంటారు. కనుక మొత్తం కుటుంబానికి హెల్త్ కవరేజీ అవసరం. అప్పటికే తీసుకున్న ఆరోగ్య బీమా ప్లాన్‌ను ఫ్యామిలీ ఫ్లోటర్‌గా మార్చుకోవాలి. ఆ అవకాశం లేకపోతే అదే కంపెనీలో లేదా మరో మంచి కంపెనీలో ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీని ఎంచుకోవాలి. ముఖ్యంగా మెటర్నిటీ కవరేజీ, పుట్టిన బేబీకి కూడా ఆటోమేటిక్ కవరేజీ లభించే ప్లాన్‌ను ఎంచుకోవాలి. కనీసం రూ.3 నుంచి రూ.5 లక్షలు అయినా బీమా రక్షణ ఉండేలా చూసుకోవాలి. దీనికి అదనంగా రూ.10–20 లక్షల కవరేజీతో టాపప్ ప్లాన్ తీసుకోవాలి. అప్పుడు బేసిక్ కవరేజీకి మించి ఆస్పత్రి బిల్లు అయితే టాపప్ ప్లాన్ నుంచి చెల్లింపులు వెళ్లిపోతాయి. అదే విధంగా యాక్సిడెంటల్ డిజేబిలిటీ కవరేజీ తప్పక ఉండాలి. 40–50 మధ్యకు ఉన్నట్టయితే... ఈ వయసులోని వారి పిల్లలు ఎదుగుతుంటారు. దీంతో ఒత్తిళ్లు పెరిగిపోతుండడం సహజం. ఫలితంగా జీవనశైలి వ్యాధుల రిస్క్ పెరుగుతుంది. అంటే గుండెపోటు, మధుమేహం వాటి రిస్క్ ఉంటుంది. కనుక ఆరోగ్యకరమైన ఆహార, జీవన అలవాట్లు ఉండేలా చూసుకోవాలి. ప్రీమియం భారంగా మారుతున్నా కానీ ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్‌ను తప్పకుండా కొనసాగించుకోవాలి. అదనంగా కనీసం రూ.10–20 లక్షల టాపప్ ప్లాన్ ఉండాలి. దీనికి అదనంగా రూ.20–30 లక్షలతో క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్‌ను తీసుకోవడం అవసరం. ఈ ప్లాన్ తీసుకున్న వారికి.. గుండెపోటు, క్యాన్సర్, స్ట్రోక్, మూత్రపిండాల వైఫల్యం తదితర తీవ్ర వ్యాధుల్లో ఏవైనా నిర్ధారణ అయితే వెంటనే పూర్తి కవరేజీని ఏక మొత్తంలో బీమా సంస్థ చెల్లించేస్తుంది. అదే విధంగా యాక్సిడెంటల్ డిజేబిలిటీ కవర్ రూ.25 లక్షలు అవసరం. 50 ప్లస్‌లోకి వచ్చేస్తే.. 50–60 మధ్యలో ఉన్న వారి పిల్లలు ఉన్నత విద్యకు చేరువ కావడం, ఉద్యోగాల్లోకి చేరిపోవడం చూస్తుంటాం. పిల్లలు 18 ప్లస్‌లోకి చేరిపోతే వారికంటూ ఇండివిడ్యువల్ ప్లాన్ తీసుకుని, దంపతుల వరకే ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ కొనసాగించుకోవడం లేదా వారు సైతం ఇండివిడ్యువల్ ప్లాన్‌కు పోర్టింగ్ పెట్టుకోవడం చేయవచ్చు. ప్రీమియం భారం తగ్గేట్టు ఉంటేనే మారడం సరైనది. లేకపోతే ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీని అలాగే కొనసాగించుకోవాలి. ఇక ఈ వయసులో బాధ్యతలు తీరిపోతే ప్రమాద వైకల్య బీమా అవసరం అంతగా ఉండనట్టే. కాకపోతే మీకున్న హెల్త్ ప్లాన్ జీవితాంతం రెన్యువల్ చేసుకునే ఆప్షన్‌తో ఉండేలా జాగ్రత్త పడడం ఎంతో అవసరం. కనీసం రూ.5 లక్షల కవరేజీ, దీనికి అదనంగా రూ.20 లక్షల టాపప్ ప్లాన్ ఉంటే మంచిది. అదే విధంగా రూ.30 లక్షలతో క్రిటికల్ ఇన్నెస్ ప్లాన్ కూడా తీసుకోవాలి. 60 ఏళ్లు దాటితే.. ఉద్యోగులకు రిటైర్మెంట్ వయసు ఇది. వృత్తి, వ్యాపారాల్లోని వారికి మాత్రం ఆర్జనా శక్తి కొనసాగుతుంది. ఈ వయసులో దాదాపు పిల్లలకు సంబంధించిన బాధ్యతలన్నీ పూర్తయి ఉంటాయి. ఈ వయసులో వైద్య ఖర్చులు పెరుగుతుంటాయి. కనుక ఆరోగ్యపరంగా అత్యవసర పరిస్థితులకు సన్నద్ధం కావాలి. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు ల్యాప్స్ అవకుండా ప్రీమియం ఆటోమేటిగ్గా బ్యాంకు ఖాతా నుంచి డెబిట్ అయ్యే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. ఇక విడిగా దంపతులు ఇద్దరికీ హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే బెటర్. ఒకవేళ ప్రీమియం భారంగా అనిపిస్తే తమ పిల్లలు ఉద్యోగం చేస్తుంటే వారి సంస్థల నుంచి లభించే గ్రూపు హెల్త్ కవరేజీలో భాగస్వాములుగా చేరాలి. ఇటువంటి పాలసీల్లో ప్రీమియం తక్కువగా ఉంటుంది. బేసిక్ ప్లాన్‌కు అదనంగా రూ.15–25 లక్షలకు సూపర్ టాపప్ ప్లాన్ తీసుకోవాలి. అలాగే, రూ.20–30 లక్షలకు క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్ కూడా ఉండే విధంగా చూసుకోవాలి. ఇవి తెలుసుకోవాలి... కోపే: ఆస్పత్రిలో చేరినప్పుడు అయ్యే బిల్లులో పాలసీదారు తను సొంతంగా చెల్లించాల్సిన మొత్తమే కోపే. ఉదాహరణకు రూ.5 లక్షల కవరేజీ పాలసీలో 10 శాతం కోపే షరతు ఉందనుకుంటే.. అప్పుడు ఆస్పత్రి బిల్లులో 10 శాతం పాలసీదారే భరించాల్సి వస్తుంది. మిగిలిన 90 శాతం బీమా సంస్థ చెల్లిస్తుంది. డిడక్టబుల్: ఇది కూడా ఒక విధంగా వైద్య ఖర్చుల్లో పాలసీదారు స్వయంగా భరించాల్సిన అంశమే. ఎప్పుడు ఆస్పత్రిలో చేరినా కానీ అయ్యే బిల్లులో నిర్ణీత మొత్తాన్ని మినహాయించి, ఆ తర్వాత మిగిలిన మేర బీమా సంస్థ చెల్లిస్తుంది. డిడక్టబుల్ అన్నది పాలసీ డాక్యుమెంట్లో పేర్కొనడం జరుగుతుంది. సెటిల్మెంట్ రేషియో: బీమా సంస్థకు వచ్చే క్లెయిమ్‌లలో (పరిహారం కోసం వచ్చే దరఖాస్తులు) ఎన్నింటికి చెల్లింపులు చేసింది, ఎన్నింటిని తిరస్కరించిందన్న వివరాలను ఇది తెలియజేస్తుంది. ఎక్స్‌క్లూజన్: బీమా పాలసీలో వేటికి కవరేజీ మినహాయించేది ఈ క్లాజులో వివరంగా ఉంటుంది. హెల్త్ పాలసీల్లో కొన్నింటికి మినహాయింపులు ఉంటాయి. ఫ్రీ లుక్ పీరియడ్: పాలసీ జారీ చేసిన తర్వాత సాధారణంగా 15 రోజుల కాలాన్ని ఫ్రీ లుక్ పీరియడ్‌గా పరిగణిస్తుంటారు. ఈ కాలంలో పాలసీ వద్దనుకుంటే అదే విషయాన్ని బీమా సంస్థకు తెలియజేస్తే ఎటువంటి చార్జీలు, పెనాల్టీలు లేకుండా ప్రీమియం వెనక్కి వచ్చేస్తుంది. -
‘మానసిక అనారోగ్యాలకూ బీమా భద్రత’
సాక్షి, న్యూఢిల్లీ : మానసిక అస్వస్థతకూ బీమా భద్రతను కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్ధానం మంగళవారం కేంద్ర ప్రభుత్వం, ఐఆర్‌డీఏకు నోటీసులు జారీ చేసింది. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు మానసిక సమస్యలకూ బీమా కవరేజ్‌ను ఎందుకు వర్తింపచేయరాదో బదులివ్వాలని కోరింది. తదుపరి విచారణను రెండు వారాల పాటు వాయిదా వేసింది. కోవిడ్-19 దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తుండటం బాలీవుడ్ యువ హీరో సుశాంత్ రాజ్పుట్ బలవన్మరణం నేపథ్యంలో కుంగుబాటు, యాంగ్జైటీలపై చర్చ సాగుతున్న క్రమంలో సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ దాఖలు కావడం గమనార్హం. కాగా, బీమా పాలసీల్లో మానసిక అస్వస్థతకూ బీమా భద్రత కల్పించేలా కేటాయింపులు చేపట్టాలని 2018లో ఐఆర్డీఏ బీమా కంపెనీలను ఆదేశించింది. శారీరక అనారోగ్యానికి అవసరమయ్యే చికిత్సల తరహాలో మానసిక అనారోగ్యానికి బీమా కవరేజ్ కల్పించాలని బీమా కంపెనీలను ఆదేశిస్తూ ఐఆర్డీఏ 2018 మేలో ఉత్తర్వులు జారీ చేసింది. చదవండి : కరోనా మృతదేహాలను పట్టించుకోరా?: సుప్రీంకోర్టు -
ప్రీమియంల చెల్లింపునకు మరో 30 రోజుల వ్యవధి
న్యూఢిల్లీ: కరోనావైరస్ కట్టడిపరమైన లాక్డౌన్ అమలవుతున్న నేపథ్యంలో జీవిత బీమా పాలసీదారులకు ప్రీమియంల చెల్లింపు విషయంలో వెసులుబాటునిస్తూ బీమా రంగ అభివృద్ధి, నియంత్రణ సంస్థ ఐఆర్డీఏఐ నిర్ణయం తీసుకుంది. మార్చి, ఏప్రిల్‌లో కట్టాల్సిన రెన్యువల్ ప్రీమియంలకు సంబంధించి పాలసీదారులకు మరో 30 రోజుల వ్యవధి ఉంటుందని వెల్లడించింది. జీవిత బీమా సంస్థలు, లైఫ్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ విజ్ఞప్తుల మేరకు తాజా నిర్ణయం తీసుకుంది. ఆరోగ్య బీమా, వాహన థర్డ్ పార్టీ బీమా పాలసీలకు ఐఆర్డీఏఐ ఇప్పటికే ఈ వెసులుబాటు ప్రకటించింది. మార్చి 25 – ఏప్రిల్ 14 మధ్య కట్టాల్సిన మోటార్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలను ఏప్రిల్ 21లోగా చెల్లించవచ్చని వెసులుబాటు ఇచ్చింది. ఈ వ్యవధిలో రిస్క్ కవర్ కొనసాగుతుందని పేర్కొంది. మరోవైపు, నియంత్రణ సంస్థకు బీమా రంగ సంస్థలు సమర్పించాల్సిన రిటర్న్స్ విషయంలోనూ మరికాస్త వ్యవధినిచ్చింది. నెలవారీ రిటర్న్‌లకు అదనంగా 15 రోజులు, త్రైమాసిక, అర్ధ సంవత్సర, వార్షిక రిటర్నులు సమర్పించేందుకు 30 రోజుల వ్యవధి లభిస్తుంది. -
వచ్చే ఏడాది పాలసీల వెల్లువ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బీమా కంపెనీల నుంచి వచ్చే ఏడాది పాలసీలు వెల్లువలా వచ్చిపడతాయని ఇండియా ఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ తెలిపింది. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏ) చొరవతో వినూత్న పాలసీలు రానున్నాయని ఇండియాఫస్ట్ డిప్యూటీ సీఈవో రుషభ్ గాంధీ బుధవారమిక్కడ మీడియాకు తెలిపారు. పాలసీదారులకు అనుకూలంగా ఉండేలా కంపెనీలు వీటిని రూపొందిస్తున్నాయని చెప్పారు. మూడు పాలసీలకు తాము దరఖాస్తు చేశామన్నారు. గత ఆర్థిక సంవత్సరం మాదిరిగా 2019–20లో కంపెనీ సుమారు రూ.3,200 కోట్ల వ్యాపారం అంచనా వేస్తోందని తెలిపారు. ఇందులో నూతన వ్యాపారం రూ.1,000 కోట్లు ఆశిస్తున్నట్టు వెల్లడించారు. కాగా, సాండ్‌బాక్స్ పేరుతో ఐఆర్డీఏ ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం ఉన్న పాలసీలకు భిన్నంగా.. కస్టమర్లకు అనుకూలంగా ఉండే పాలసీలను రూపొందించేలా బీమా కంపెనీలను ప్రోత్సహిస్తోంది. సాండ్‌బాక్స్ కింద అనుమతి పొందిన బీమా ప్లాన్‌కు తొలుత నియంత్రణ పరంగా కొంత వెసులుబాటు ఉంటుంది. పరిమిత కాలానికి, పరిమిత సంఖ్యలో పాలసీలను కంపెనీలు విక్రయించాల్సి ఉంటుంది. ఫలితాలనుబట్టి అట్టి ప్లాన్‌ను కొనసాగించాలా లేదా అన్నది ఐఆర్డీఏ నిర్ణయిస్తుంది. -
తగ్గుతున్న ఎల్ఐసీ ఆధిపత్యం!
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ మార్కెట్ వాటా 70 శాతం లోపునకు పడిపోయింది. 2018 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి ఎల్ఐసీ వాటా అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఉన్న 71.81 శాతం నుంచి 69.36 శాతానికి తగ్గింది. ఈ వివరాలను ఐఆర్డీఏ ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరంలో ప్రైవేటు బీమా సంస్థల మార్కెట్ వాటా 30.64 శాతానికి పెరిగింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ప్రైవేటు బీమా కంపెనీల వాటా 28.19 శాతంతో పోలిస్తే రెండు శాతానికి పైగా ఇవి వాటాను పెంచుకున్నాయి. నూతన వ్యాపార ప్రీమియం (కొత్త పాలసీల నుంచి) విభాగంలోనూ ప్రైవేటు కంపెనీలు వృద్ధిని నమోదు చేశాయి. నూతన పాలసీల్లో 8.47 శాతం వృద్ధి నమోదు చేశాయి. అదే సమయంలో ఎల్ఐసీ కొత్త పాలసీల వృద్ధి 5.99%గా ఉంది. పాత పాలసీల రెన్యువల్ ప్రీమియంలో ఎల్ఐసీ వాటా 72.31 శాతం నుంచి క్రితం ఆర్థిక సంవత్సరంలో 69.35 శాతానికి తగ్గింది. ఎల్ఐసీ ఓపెన్ ఆఫర్‌కు పరిమిత స్పందన ఐడీబీఐ బ్యాంకులో ఎల్ఐసీ ఇచ్చిన ఓపెన్ ఆఫర్ (వాటాల కొనుగోలు) ను మైనారిటీ వాటాదారుల్లో 22 శాతం మంది వినియోగించుకున్నారు. మెజారిటీ వాటాదారులు మాత్రం ఎల్ఐసీ యాజమాన్యంపై నమ్మకంతో ఆఫర్‌కు దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది. -
ఎల్ఐసీ-ఐడీబీఐ డీల్‌కు ఐఆర్డీఐ గ్రీన్ సిగ్నల్
సాక్షి, న్యూఢిల్లీ: బిజినెస్వర్గాల్లో ఆసక్తిని రేపిన ఎల్ఐసీ- ఐబీడీఐ బ్యాంకు డీల్‌ను కీలకమైన ఆమోదం లభించింది. ఐడీబీఐ బ్యాంకులో వాటాల కొనుగోలుకు సంబంధించిన డీల్‌లో ఎల్ఐసీకి ఐడీబీఐ గ్రీన సిగ్నల్ ఇచ్చింది. డీల్‌లో భాగంగా బ్యాంక్‌లోకి ఎల్ఐసీ దాదాపు రూ. 13వేల కోట్లను పెట్టుబడులు పెట్టనుంది. బ్యాంకులో వాటాను 5-7 సంవత్సరాలలో 15 శాతానికి పరిమితం చేయనుంది. సెబీ నిబంధనల ప్రకారం వాల్యూయేషన్స్ నిర్ణయించబడతాయి. మరోవైపు ఐడీబీఐ బ్యాంకులో మెజారిటీ వాటాను ఎల్ఐసీ కొనుగోలు వార్తలతో ఇవాల్టి బుల్ మార్కెట్లో ఐడీబీఐ షేర్ భారీగా లాభపడింది. ఇన్వెసర్ల కొనుగోళ్లతో 10శాతానికిపైగా ఎగిసింది. దీంతో బ్యాంకు మార్కెట్ వాల్యూ 7వేలకోట్ల రూపాయలు పుంజుకుని రూ. 23వేల కోట్లకు చేరింది. -
ప్రైవేటు బీమా కంపెనీల అడ్డగోలు దారులు!
ముంబై: ప్రైవేటు బీమా సంస్థలు బ్యాంకుల భాగస్వామ్యంతో విక్రయించే పాలసీల విషయంలో నిబంధనలను పాటించడం లేదనే ఆరోపణలు రావడంతో బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏ) రంగంలోకి దిగింది. సాధారణంగా బీమా సంస్థలు బ్యాంకులతో ఒప్పందం చేసుకుని పాలసీలను విక్రయిస్తుంటాయి. అయితే, కొన్ని బీమా కంపెనీలు తమ పాలసీల విక్రయంపై నిబంధనలకు మించి అధిక కమీషన్లు, ప్రతిఫలాలను బ్యాంకులకు ఆఫర్ చేస్తున్నట్టు ఐఆర్డీఏ దృష్టికి వచ్చిందని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. అధికారి వెల్లడించిన సమాచారం ప్రకారం... ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ ‘‘కొన్ని పెద్ద బీమా కంపెనీలు, వాటి మాతృ సంస్థలు పలు బ్యాంకుల వద్ద కరెంటు అకౌంట్ బ్యాలన్స్‌లను నిర్వహిస్తున్నాయి. ఈ బ్యాలన్స్‌లపై వడ్డీని బీమా కంపెనీలు వదులుకుంటున్నాయి. బీమా ఉత్పత్తుల విక్రయంపై పరిహారంగా వాటిని పరిగణిస్తున్నాయి. దీంతో ఈ విధమైన చర్యలు పాలసీదారుల ప్రయోజనాలకు చేటు చేస్తాయని, బ్యాంకుల్లో ఉంచే ఈ డిపాజిట్లపై రాబడులు సున్నాయే’’నని ఆ అధికారి వివరించారు. ఈ తరహా విధానాలు ఐఆర్డీఏ నిబంధనలకు పూర్తి విరుద్ధమని తెలిపారు. దీనిపై ఐఆర్డీఏ ప్రభుత్వానికి తెలియజేయగా, వాటికి వ్యతిరేకంగా చర్యలు తీసుకునేందుకు ఆమోదం లభించినట్టు చెప్పారు. ‘‘కార్పొరేట్ ఏజెన్సీ నిబంధనల మేరకు బ్యాంకుల ద్వారా బీమా కంపెనీలు పాలసీలను విక్రయిస్తే, వాటిపై బ్యాంకులకు కేవలం కమీషన్లను మాత్రమే ఇవ్వాలి. ఇక బ్యాంకులు బీమా సంస్థలకు మార్కెట్ రేటు కంటే అధిక ఫారెక్స్ రేట్లను ఆఫర్ చేయడం, మార్కెట్ రేటు, ఆఫర్ చేసిన రేటు మధ్య వ్యత్యాసం బ్యాంకులకు పాలసీలను విక్రయించినందుకు ప్రోత్సాహకరంగా వెళుతోంది. అలాగే, చాలా బీమా కంపెనీలు బ్యాంకుల ఏటీఎంలపై తమ ఉత్పత్తుల ప్రకటనలను ప్రదర్శించినందుకు ఫీజులు చెల్లిస్తున్నా యి. నిజానికి బ్యాంకులు ఫీజులు వసూలు చేయరాదు. ఆ భారాన్ని అవే భరించాలి. కానీ, ఈ ఫీజుల భారం పాలసీదారులపైనే పడుతోంది’’ అని అన్నారు. -
ఐఆర్డీఏ చైర్మన్‌గా సుభాష్ చంద్ర కుంతియా
న్యూఢిల్లీ: ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ ‘ఐఆర్డీఏ’ చైర్మన్‌గా టి.ఎస్.విజయన్ స్థానంలో మాజీ ఐఏఎస్ అధికారి సుభాష్ చంద్ర కుంతియా నియమితులయ్యారు. ఈయన మూడేళ్లపాటు బాధ్యతలు నిర్వహిస్తారు. క్యాబినెట్ నియామకాల కమిటీ(ఏసీసీ) సుభాష్ చంద్ర నియామకానికి ఆమోదం తెలిపిందని ఐఆర్డీఏ పేర్కొంది. ఐఆర్డీఏ చైర్మన్‌గా ఐదేళ్ల పాటు బాధ్యతలు నిర్వహించిన విజయన్ ఫిబ్రవరిలో పదవీ విరమణ చేశారు. అప్పటి నుంచి ఆ పదవి ఖాళీగా ఉంది. సుభాష్ చంద్ర 1981 బ్యాచ్‌కు చెందిన కర్ణాటక కేడర్ అధికారి. గతంలో కర్ణాటక ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. -
బీమా సంస్థల కొత్త ప్రీమియం ఆదాయంలో 47% వృద్ధి
న్యూఢిల్లీ: దేశంలోని మొత్తం 24 జీవిత బీమా కంపెనీల కొత్త ప్రీమియం ఆదాయంలో జూలై నెలలో 47.4 శాతం వృద్ధి నమోదయ్యింది. ఇది రూ.20,428 కోట్లకు చేరింది. కాగా గతేడాది ఇదే కాలంలో సంస్థల కొత్త ప్రీమియం ఆదాయం రూ.13,854 కోట్లుగా ఉంది. ఐఆర్డీఏ తాజా గణాంకాల ప్రకారం.. ఒకే ఒక ప్రభుత్వ రంగ ఎల్ఐసీ ప్రీమియం ఆదాయం 51 శాతం వృద్ధితో రూ.10,738 కోట్ల నుంచి రూ.16,255 కోట్లకు పెరిగింది. ఇక మిగిలిన 23 ప్రైవేట్ సంస్థల ప్రీమియం ఆదాయం 34 శాతం వృద్ధితో రూ.3,117 కోట్ల నుంచి రూ.4,173 కోట్లకు ఎగసింది. ఎస్బీఐ లైఫ్ ప్రీమియం ఆదాయం 25 శాతం వృద్ధితో రూ.848 కోట్లకు, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ప్రీమియం ఆదాయం 34 శాతం వృద్ధితో రూ.759 కోట్లకు చేరింది. హెచ్డీఎఫ్సీ స్టాండర్డ్ లైఫ్ ప్రీమియం ఆదాయంలో 69 శాతం వృద్ధి చెందింది. ఇది రూ.521 కోట్ల నుంచి రూ.880 కోట్లకు పెరిగింది. బిర్లా సన్ లైఫ్ ప్రీమియం ఆదాయం 57 శాతం వృద్ధితో రూ.196 కోట్లకు, కెనరా హెచ్ఎస్బీసీ ఓబీసీ లైఫ్ ప్రీమియం ఆదాయం 75 శాతం వృద్ధితో రూ.100 కోట్లకు చేరింది. -
30 రోజుల్లో పరిష్కరించాలి
♦ గడువు దాటితే వడ్డీ చెల్లించాలి ♦ హెల్త్ పాలసీ క్లెయిమ్ పరిష్కారంపై ఐఆర్డీఏ ఆదేశం న్యూఢిల్లీ: వైద్య బీమా పాలసీల్లో పరిహారం కోరుతూ వచ్చే క్లెయిమ్ దరఖాస్తులను 30 రోజుల్లోగా పరిష్కరించాలని బీమా నియంత్రణ ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏ) బీమా కంపెనీలను ఆదేశించింది. జాప్యం చేస్తే క్లెయిమ్ మొత్తంపై బ్యాంకు వడ్డీ రేటుకు అదనంగా 2 శాతం కలిపి చెల్లించాల్సి ఉంటుందని తాజాగా జారీ చేసిన ఆదేశాల్లో స్పష్టం చేసింది. పాలసీదారుల ప్రయోజనాల పరిరక్షణ చట్టం కింద ఐఆర్డీఏ ఈ చర్య తీసుకుంది. ‘‘తమకు దరఖాస్తు అందిన (అవసరమైన ప్రతీ పత్రం) చివరి తేదీ నుంచి 30 రోజుల్లోగా బీమా కంపెనీ పరిష్కరించాలి. పరిహారం చెల్లింపులో ఆలస్యం జరిగితే... పాలసీదారుడి నుంచి అవసరమైన అన్ని పత్రాలు తమకు అందిన చివరి తేదీ నుంచి చెల్లింపు జరిగే తేదీ వరకు బ్యాంకు వడ్డీ రేటుపై 2 శాతం ఎక్కువ కలిపి చెల్లించాలి’’ అని ఐఆర్డీఏ తన నోటిఫికేషన్లో పేర్కొంది. ఒకవేళ క్లెయిమ్ దరఖాస్తుల విషయమై తమవైపు నుంచి విచారణ అవసరమైన కేసుల్లో పరిహారాన్ని 45 రోజుల్లోగా పరిష్కరించాలని ఆదేశించింది. ఆలస్యం అయితే దరఖాస్తు, రుజువులు అందిన చివరి తేదీ నుంచి చెల్లించే వరకు ఉన్న గడువుకు గాను బ్యాంకు వడ్డీ రేటుకు అదనంగా 2 శాతం కలిపి చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. పాలసీ దారుల ఫిర్యాదులను వేగంగా, సమర్థవంతంగా పరిష్కరించేందుకు ఓ విధానాన్ని ఆచరణలో పెట్టాలని... పాలసీ పత్రాల్లో ప్రయోజనాలు, బీమా కవరేజీ, రైడర్లు, యాడాన్ కవర్ల గురించి స్పష్టంగా తెలియజేయాలని కోరింది. ‘‘హెల్త్ లేదా క్రిటికల్ ఇల్నెస్కు సంబంధించిన రైడర్ల ప్రీమియం బేసిక్ పాలసీ ప్రీమియంలో 100 శాతం మించకూడదు. ఇతర జీవిత బీమాయేతర పాలసీలలో రైడర్ల ప్రీమియం బేసిక్ పాలసీ ప్రీమియంలో 30 శాతం దాటరాదు’’ అని ఐఆర్డీఏ తన నోటిఫికేషన్లో స్పష్టం చేసింది. -
బీమా లేదు..ధీమా లేదు
రోజుకో కొత్త రోగం పుట్టుకొస్తున్న రోజులివీ.. కాసింత పెద్ద జబ్బు చేస్తే.. ముందు వైద్యానికయ్యే బిల్లు చూసి గుండె గుభేల్మనే రోజులివీ.. వీటికి చేసిన అప్పులు తీరక.. వడ్డీలు కడుతూ నడ్డి విరగ్గొట్టుకుంటున్న రోజులివీ.. అసలు మన దేశంలో ఎంతమందికి వైద్య బీమా ఉంది? ఇందులో ప్రభుత్వం తాలూకు వాటా ఎంత అంటే 32% మాత్రమే అని ఇన్యూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ(ఐఆర్డీఏ) చెబుతోంది. అదే బ్రిటన్‌లో ప్రజారోగ్య బీమా రంగంలో ప్రభుత్వ వాటా 83.5 శాతం అట.. అసలు మన దేశంలో ఎంతమందికి బీమా ధీమా ఉంది.. ఎంత మందికి లేదు అన్న వివరాలను ఓసారి పరిశీలిస్తే.. -
వాహన బీమా పాలసీ రేట్లు భారీ పెంపు
థర్డ్ పార్టీ ప్రీమియంను 41 శాతం పెంచుతూ ఐఆర్డీఏఐ ఉత్తర్వులు ముంబై: వాహన బీమా థర్డ్ పార్టీ ప్రీమియం రేట్లను 41 శాతం వరకు పెంచుతూ ఐఆర్డీఏఐ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ఒక లీటర్‌కు మించి ఒకటిన్నర లీటర్ ఇంజన్ సామర్థ్యం ఉన్న ప్రైవేటు వాహనాలకు థర్డ్ పార్టీ ప్రీమియం ప్రస్తుతం రూ.2,237 ఉండగా తాజా పెంపుతో అది రూ.3,132కు పెరగనుంది. ఈ కొత్త రేట్లు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని ఐఆర్డీఏ తెలిపింది. ఒక లీటర్ ఇంజన్ సామర్థ్యం ఉన్న ప్రైవేటు వాహనాలకు పెంపు వర్తించదు. ప్రైవేటు నాలుగు చక్రాల వాహనాలు 1,500 సీసీ సామర్థ్యం కంటే అధికంగా ఉన్న వాటికి ప్రీమియం రూ.6,164 ఉండగా, తాజా పెంపుతో రూ.8,630 కానుంది. రూ.7,500 కిలోల కంటే అధిక లోడ్ సామర్థ్యం గల వాణిజ్య వాహనాలకు ప్రీమియం తగ్గుతుంది. 75 సీసీ వరకు గల ద్విచక్ర వాహనాలకు పెంపు లేదు. ఆపై 150 సీసీ వరకు ఉన్న వాటికి ప్రీమియం రూ.619 నుంచి 720కి పెరుగుతోంది. ఆపై 350 సీసీ వరకు గల వాహనాలకు రూ.970, అంతకు మించితే రూ.1,114 ప్రీమియం ఉంటుంది. త్రిచక్ర వాహనాలకు ప్రీమియం రూ.4,200 నుంచి రూ.5,680కి పెరగనుంది. -
ఆన్లైన్ పాలసీలకు డిస్కౌంట్లు ఇవ్వవచ్చు
⇒ బీమాలో ఈ కామర్స్‌పై ⇒ ఐఆర్డీఏఐ మార్గదర్శకాలు న్యూఢిల్లీ: బీమా సంస్థలు ఆన్లైన్లో పాలసీలను విక్రయిస్తే, డిస్కౌంట్లను ఆఫర్ చేయవచ్చని బీమా నియంత్రణ సంస్థ, ఐఆర్డీఏ తెలిపింది. బీమా ఈ–కామర్స్ అంశంపై ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అధారిటీ ఆఫ్ ఇండియా(ఐఆర్డీఏఐ)తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. బీమా సంస్థలు తమ పాలసీలను ఐఎస్ఎన్పీ(ఇన్సూరెన్స్ సెల్ఫ్–నెట్వర్క్ ప్లాట్ఫార్మ్) ద్వారా విక్రయిస్తే, డిస్కౌంట్లు ఇవ్వవచ్చని పేర్కొంది. ఈ–కామర్స్ సేవలను అందించడానికి ఐఆర్డీఏఐ అనుమతితో బీమా సంస్థలు ఏర్పాటు చేసే ఎలక్ట్రానిక్ ప్లాట్ఫార్మ్ను ఐఎస్ఎన్పీగా వ్యవహరిస్తారు. తక్కువ ఖర్చుతో బీమాను మరింత మందికి అందుబాటులోకి తేవడమే.... బీమాలో ఈ కామర్స్ ముఖ్య ఉద్దేశమని ఐఆర్డీఏఐ పేర్కొంది. ఆన్లైన్ ద్వారా పాలసీలు విక్రయించే కంపెనీలు పాలసీ ముఖ్య ఫీచర్లు, ఆప్షన్లు, కవరేజ్, మొత్తం ప్రీమియమ్, ఇతర చార్జీలు, పాలసీని రద్దు చేసుకునే విధానాల గురించి సవివరంగా తెలియజేయాల్సి ఉంటుందని వివరించింది. -
జీవిత బీమా కంపెనీల లాభాల్లో కోత
న్యూఢిల్లీ: దేశీయ జీవిత బీమా కంపెనీల లాభాలు 2015–16లో కొద్దిగా క్షీణించాయి. రూ.7,415 కోట్ల పన్ను అనంతర లాభాల్ని ఆర్జించాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో రూ.7,611 కోట్లతో పోలిస్తే ఈ రంగం లాభాలు మొత్తం మీద 2.57 శాతం తగ్గాయి. జీవిత బీమా రంగంలో మొత్తం 24 కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తుండగా గత ఆర్థిక సంవత్సరం నాటికి 19 కంపెనీలు మాత్రమే లాభాల్లో ఉన్నాయి. ఈ మేరకు జీవిత బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏ) నివేదిక విడుదల చేసింది. లాభాల్లో ఉన్న 19 కంపెనీల్లో... ప్రభుత్వరంగ ఎల్ఐసీ రూ.2,517 కోట్ల లాభంతో అగ్ర స్థానంలో ఉంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో వచ్చిన లాభాలతో పోలిస్తే 38% పెరిగాయి. నష్టాల్లో ఉన్న జీవిత బీమా కంపెనీల్లో ఏగాన్ లైఫ్ ఇన్సూరెన్స్, ఎడెల్వీజ్ టోకియో లైఫ్ ఇన్సూరెన్స్, భారతీ ఆక్సా, ఫ్యూచర్ జనరాలి, రిలయన్స్ నిప్పన్ ఉన్నాయి. మిగిలినవన్నీ లాభాల్లో ఉన్నవే. ఇక జీవిత బీమాయేతర రంగం నికర లాభం సైతం 2014–15లో రూ.4,639 కోట్లుగా ఉండగా... గత ఆర్థిక సంవత్సరంలో రూ.3,238 కోట్లకు క్షీణించింది. -
నాన్-లైఫ్ బీమా ప్రీమియం వసూళ్లు 86% అప్
న్యూఢిల్లీ: నాన్-లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీల స్థూల ప్రీమియం వసూళ్లు ఈ ఆర్థిక సంవత్సరపు సెప్టెంబర్ నెలలో 86.2% పెరుగుదలతో రూ.14,950 కోట్లకు ఎగసాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే నెలలో ఈ కంపెనీల ప్రీమియం వసూళ్లు రూ. 8,030 కోట్లుగా ఉన్నాయి. ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ ఐఆర్డీఏ గణాంకాల ప్రకారం.. మొత్తం ప్రీమియం వసూళ్లలో ప్రభుత్వ రంగ నాన్-లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీల వాటా రూ.9,164 కోట్లుగా, ప్రైవేట్ కంపెనీల వాటా రూ.5,786 కోట్లుగా ఉంది. ప్రభుత్వ రంగంలోని యునెటైడ్ ఇండియా ఇన్సూరెన్స్ ప్రీమియం వసూళ్లు రూ.1,797 కోట్లు (105% వృద్ధి)గా, ఓరియెంటల్ ఇన్సూరెన్స్ ప్రీమియం వసూళ్లు రూ.1,332 కోట్లు (78% వృద్ధి), నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రీమియం వసూళ్లు రూ.945 కోట్లు(8% వృద్ధి)గా, న్యూ ఇండియా ఇన్సూరెన్స్ ప్రీమియం వసూళ్లు రూ.1,554 కోట్లు (27% వృద్ధి) ఉన్నాయి. ఇక 23 ప్రైవేట్ కంపెనీల్లో.. హెచ్డీఎఫ్సీ ఎర్గో జనరల్ ప్రీమియం వసూళ్లు రూ.976 కోట్లు (3 రెట్లు వృద్ధి)గా, ఐసీఐసీఐ లంబార్డ్ ప్రీమియం వసూళ్లు రూ.998 కోట్లు (58% వృద్ధి)గా నమోదయ్యాయి. ఎల్ఐసీ సౌత్ సెంట్రల్ జోన్ కొత్త ప్రీమియం ఆదాయం రూ.2,000 కోట్లు దక్షిణ సెంట్రల్ జోన్‌కు సంబంధించి ఎల్ఐసీ కొత్త ప్రీమియం ఆదాయం అక్టోబర్‌లో 67% వృద్ధితో రూ.2,035 కోట్లకు చేరింది. దక్షిణ సెంట్రల్ జోన్ పరిధిలోకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు వస్తాయి. ఎల్ఐసీకి దేశంలో ఉన్న 8 జోన్లలోనూ మొత్తం ప్రీమియం ఆదాయంపరంగా దక్షిణ సెంట్రల్ జోన్ 3వ స్థానాన్ని కైవసం చేసుకున్నట్లు జోనల్ మేనేజర్ టి.సి. సుశీల్‌కుమార్ తెలిపారు. -
క్లెయిమ్ పరిష్కారం కష్టమేం కాదు!
♦ పాలసీ తీసుకున్నప్పుడే జాగ్రత్త అవసరం ♦ ఆరోగ్య వివరాలేవీ దాచిపెట్టకుంటే ఉత్తమం ♦ చిరునామా, నామినీలు మారితే వెంటనే సవరణ ♦ అన్నీ సరిగా ఉన్నా క్లెయిమ్ కాకుంటే ప్రత్యామ్నాయాలు ♦ అంబుడ్స్‌మన్ నుంచి ఐఆర్‌డీఏకు కూడా... అసలు బీమా పాలసీ తీసుకునేదే కుటుంబ రక్షణ కోసం. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కనుక... ఆపత్కాలంలో ఆదుకుంటుందనే బీమా పాలసీని తీసుకుంటాం. మరి అనుకోని సంఘటన జరిగాక... ఆ దురదృష్టకర పరిస్థితుల్లో పాలసీ అక్కరకు రాకపోతే..? ఇక్కడ క్లెయిమ్ పరిష్కారం విధాన ప్రక్రియ సులభంగా జరగడం ముఖ్యం. చాలా మంది ఇక్కడే ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. నిజానికి బీమా క్లెయిములంటే.. చాలా కష్టంతో కూడుకున్నవని అనిపించే ఉదంతాలు మనకు తరచూ ఎదురవుతుంటాయి. గందరగోళాన్ని తొలగించి, క్లెయిమ్ ప్రక్రియపై అవగాహన కల్పించడానికే ఈ కథనం. క్లెయిమ్ ప్రక్రియ నిజంగానే సులభంగా జరగాలంటే పాలసీదారులు దృష్టిలో ఉంచుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. అవేంటంటే.. ⇔ ముందుగా తీసుకోదల్చుకున్న బీమా పథకం గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. సందేహాలుంటే ఏజెంటును లేదా బీమా కంపెనీని అడిగి నివృత్తి చేసుకోవాలి. సంతృప్తికరమైన సమాధానాలు పొందాకే సంతకం చేయాలి. ⇔ సంతకం చేసే ముందు దరఖాస్తు ఫారాన్ని కూడా చదవాలి. ఖాళీ ఫారంపై సంతకం చేయొద్దు. వివరాలన్నీ మీరే నింపడం మంచిది. ఒకవేళ ఎవరిదైనా సహాయం తీసుకుంటే అన్నీ సరిగ్గా నింపారో లేదో చూసుకోవాలి. ఇంగ్లిషులోని ఫారంను అర్థం చేసుకోవడం కష్టమైతే .. సన్నిహితులో, స్నేహితులో, బంధువులో నమ్మకస్తుల సహాయం తీసుకోవాలి. ⇔ మీ వయస్సు, చదువు, ఆదాయం, వృత్తి, అలవాట్లు, కుటుంబ సభ్యుల ఆరోగ్య చరిత్ర, ఇతరత్రా బీమా పాలసీలుంటే ఆ వివరాలు... అన్నీ వాస్తవాలనే తెలపాలి. ⇔ సరైన బ్యాంకు అకౌంటు వివరాలు పొందుపరిస్తే, మెచ్యూరిటీ లేదా క్లెయిమ్ మొత్తాలు నేరుగా ఖాతాలోకి డిపాజిట్ అవుతాయి. జీవిత భాగస్వామి, పిల్లలు లేదా తల్లిదండ్రులను నామినీలుగా పెట్టొచ్చు. వారి పేరు, పుట్టిన తేదీ, బంధుత్వం, చిరునామా మొదలైన వివరాలు కచ్చితమైనవిగా ఉండాలి. ఒకవేళ నామినీలు ఒకరికంటే ఎక్కువుంటే.. ఏ నిష్పత్తిలో వాటాలుండాలనేది కూడా పొందుపర్చాలి. బీమా పాలసీ వివరాలను.. నామినీలకు కూడా తెలియపర్చాలి. క్లెయిమ్ సులభ పరిష్కారంలో ఇది ఎంతో కీలకం. ⇔ ఇన్సూరెన్స్ కంపెనీ.. మీరు సంతకం చేసిన దరఖాస్తు ఫారం కాపీ, పాలసీ ప్రయోజనాల పత్రాన్ని పంపాలి. బీమా పాలసీ చేతికొచ్చాక మరోసారి వివరాలన్నీ సరిచూసుకోవాలి. తప్పులేమైనా కనిపిస్తే వెంటనే కంపెనీ దృష్టికి తీసుకెళ్లాలి. ⇔పాలసీని సురక్షితమైన ప్రదేశంలో ఉంచి, నామినీకి కూడా తెలియజేయాలి. పాలసీ పత్రాల్లో కంపెనీ కాంటాక్ట్ వివరాలుంటాయి. అవసరమైన సందర్భంలో బీమా సంస్థను వెంటనే ఎలా సంప్రదించాలో నామినీకి చెప్పాలి. అలాగే నామినీకి ఆధార్ కార్డు, పాస్‌పోర్టు, డ్రైవింగ్ లెసైన్సు, పాన్ కార్డు వంటి సరైన గుర్తింపు, చిరునామా ధృవీకరణ పత్రాలు, బ్యాంక్ ఖాతా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ⇔ చిరునామా లేదా నామినీల వివరాల్లో మార్పులేమైనా ఉంటే తక్షణం బీమా కంపెనీకి తెలియజేయాలి. ఈ విషయంలో ఆలస్యం సరికాదు. వివరాలు అన్నీ క్షుణ్ణంగా సంబంధిత అధికారికి అందజేయాలి. ⇔ క్లెయిమ్ సమయంలో దాఖలు చేయాల్సిన పత్రాల గురించి పాలసీ కాంట్రాక్టులోనే ఉంటుంది (ఉదా. డెత్ సర్టిఫికెట్, డాక్టర్ రిపోర్టు, నామినీ కేవైసీ పత్రాలు మొదలైనవి). వాటి గురించి తెలుసుకోవాలి. ⇔ క్లెయిమ్ చేయాల్సి వస్తే సాధ్యమైనంత త్వరగా ఘటన గురించి బీమా కంపెనీకి తెలియజేయాలి. అవసరమైన పత్రాలన్నీ అందించాలి. ⇔ క్రమం తప్పకుండా ప్రీమియంలు కట్టడం చాలా ముఖ్యం. లేకపోతే పాలసీ ప్రయోజనాలు కోల్పోవాల్సి వస్తుంది. ఇలా బీమా పాలసీ విషయంలో జాగ్రత్తలన్నీ పాటిస్తే.. క్లెయిమ్ ప్రక్రియ వేగంగా, సులభంగా పూర్తవుతుంది. ప్రత్యామ్నాయాలూ ఉన్నాయి... అన్నీ సరిగ్గా చేసినా క్లెయిమ్ పరిష్కారంలో సమస్యలెదురైతే ప్రత్యామ్నాయాలేంటి? ఒకసారి చూద్దాం... పాలసీ క్లెయిమ్ వస్తే బీమా కంపెనీ 30 రోజుల్లోపు పరిష్కరించాలి. తిరస్కరిస్తే దానికి కారణాలు కూడా చెప్పాలి. కంపెనీ అలా చెయ్యకుంటే బీమా అంబుడ్స్‌మన్‌ను ఆశ్రయించొచ్చు. రూ.20 లక్షల విలువ వరకు గల పాలసీ కేసులను అంబుడ్స్‌మన్ విచారించే అవకాశం ఉంది. ఒకవేళ క్లెయిమ్ కరెక్టేనని, బీమా కంపెనీ తప్పిదం వల్లే అది ఆలస్యమవుతోందని అంబుడ్స్‌మన్ భావిస్తే... పరిహారం విషయమై బీమా కంపెనీలకు ఆదేశాలివ్వటం కూడా జరుగుతుంది. ఐఆర్డీఏ సాయం కూడా... బీమా కంపెనీల సేవా లోపాలు, ఏజెంట్ల తీరుపై పాలసీదారులు బీమా నియంత్రణ ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏ)కు ఫిర్యాదు చేయవచ్చు. కాల్ సెంటర్‌కు 155255కు ఫోన్ కాల్ ద్వారా లేదా ఐఆర్డీఏ తాలూకు ఐఆర్జీఏ పోర్టల్‌లో igms.irda.gov.in ఫిర్యాదు దాఖలు చేసే అవకాశం ఉంది. వినియోగదారుల ఫోరానికి... ఈ వేదికల్లో సమస్యకు పరిష్కారం లభించకపోతే పాలసీదారులు నేరుగా వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించవచ్చు. అతి తక్కువ వ్యయంతో తక్కువ సమయంలోనే తగిన న్యాయ సహాయం పొందడానికి ఇక్కడ అవకాశం ఉంటుంది. -
బీమా రంగానికి టెక్నాలజీ ఊతం
♦ అప్పుడే చౌకగా పాలసీలు సాధ్యం ♦ ఐఆర్డీఏ చైర్మన్ టీఎస్ విజయన్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెక్నాలజీని సమర్ధంగా ఉపయోగించడం ద్వారా దేశీయంగా అందరికీ బీమా ప్రయోజనాలను చౌకగా అందుబాటులోకి తేవడంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్డీఏఐ చైర్మన్ టీఎస్ విజయన్ చెప్పారు. బీమాకు కూడా ఆధార్‌ను అనుసంధానిస్తే ఇది మరింత సులభసాధ్యం కాగలదని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం ఇక్కడ ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ అండ్ రేట్‌మేకింగ్ ఫోరం ఆఫ్ ఏషియా (ఐఐఆర్‌ఎఫ్‌ఏ) 2016 సదస్సులో పాల్గొన్న సందర్భంగా విజయన్ ఈ విషయాలు వివరించారు. ప్రధానంగా ఆరోగ్య బీమా, వాహన బీమాపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. మరోవైపు, దేశీయంగా ఇంకా అత్యధిక శాతం మందికి బీమా కవరేజీ లేని నేపథ్యంలో దీనిపై అవగాహన పెంచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, బీమా కంపెనీలు చేతులు కలపాలని ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (ఐఐబీ) సీఈవో ఆర్ రాఘవన్ అభిప్రాయపడ్డారు. అలాగే, వ్యవసాయ బీమా పథకాలను కూడా తక్కువ వ్యయాలతో అందుబాటులోకి తేవడంలో నూ టెక్నాలజీ ప్రధాన పాత్ర పోషించాలని ఆయన పేర్కొన్నారు. వీటన్నింటికి గణాంకాలు, వాటి విశ్లేషణ కీలకమని రాఘవన్ చెప్పారు. భారత్ సహా ఐఐఆర్ఎఫ్ఏలో ఏడు సభ్య దేశాలకు చెందిన 200 మంది పైగా ప్రతినిధులు సదస్సులో పాల్గొన్నారు. రేట్‌మేకింగ్.. అనలిటిక్స్, కొంగ్రొత్త టెక్నాలజీలు మొదలైన వాటిపై ఇందులో చర్చించారు. -
బీమా ఐపీవోలకు త్వరలో కొత్త మార్గదర్శకాలు
ఐఆర్డీఏ చీఫ్ టీఎస్ విజయన్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పెట్టుబడి పరిమితులను సడలించిన అనంతరం బీమా రంగ సంస్థల్లోకి సుమారు రూ. 15 వేల కోట్ల మేర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) వచ్చాయని బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్డీఏఐ చైర్మన్ టీఎస్ విజయన్ చెప్పారు. గత ఆర్థిక సంవత్సరం హెల్త్, నాన్-లైఫ్ బీమా విభాగాలు సుమారు 14 శాతం, జీవిత బీమా విభాగం 12% వృద్ధి నమోదు చేసినట్లు పేర్కొన్నారు. బీమా సంస్థల ఐపీవోలకు సంబంధించి త్వరలో సవరించిన మార్గదర్శకాలను విడుదల చేసే అవకాశమున్నట్లు బుధవారమిక్కడ ఐఐఆర్‌ఎఫ్‌ఏ వార్షిక సదస్సు వివరాల వెల్లడికి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా విజయన్ తెలిపారు. హెచ్డీఎఫ్సీ స్టాండర్డ్ లైఫ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ సంస్థలు ఐపీవో యోచనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నెల 26 నుంచి ఐఐఆర్‌ఎఫ్‌ఏ సదస్సు.. మరోవైపు, ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ అండ్ రేట్‌మేకింగ్ ఫోరం ఆఫ్ ఏషియా (ఐఐఆర్‌ఎఫ్‌ఏ) వార్షిక సదస్సును ఈ ఏడాది హైదరాబాద్‌లో మే 26,27 తారీఖుల్లో నిర్వహించనున్నట్లు ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ బ్యూరో సీఈవో ఆర్ రాఘవన్ తెలిపారు. భారత్ సహా జపాన్, థాయ్‌లాండ్ తదితర ఏడు సభ్య దేశాలకు చెందిన సుమారు 200 మంది పైగా ప్రతినిధులు ఇందులో పాల్గొంటారని వివరించారు. బీమా రంగానికి డేటా సేకరణ, విశ్లేషణ కీలకంగా మారిన నేపథ్యంలో ఆయా దేశాల బీమా రంగ తీరుతెన్నులను తెలుసుకునేందుకు ఈ సదస్సు తోడ్పడగలదన్నారు. ప్రధానంగా వివిధ రిస్కుల ప్రాతిపదికగా ప్రీమియంల నిర్ణయానికి తోడ్పడే రేట్‌మేకింగ్.. అనలిటిక్స్, కొంగొత్త టెక్నాలజీలు మొదలైన వాటిపై సదస్సులో చర్చించడం జరుగుతుందని రాఘవన్ చెప్పారు. -
కారు బీమా తగ్గించుకుందామా!!
ఏటా ఏప్రిల్ వచ్చిందంటే చాలు. ఇంట్లో ఉండే కారు గానీ, మోటార్ సైకిల్ గానీ ఓ పెద్ద భారంలా కనిపిస్తుంది. ఎందుకంటే బీమా రెన్యువల్ చేయించాలి మరి. ఇక గోరుచుట్టుపై రోకలిపోటు మాదిరి ఈ మధ్యే బీమా నియంత్రణ సంస్థ (ఐఆర్డీ) థర్డ్ పార్టీ బీమా ప్రీమియంను కూడా బాగా పెంచేసింది. మీ కారు ఇంజిన్ సామర్థ్యాన్ని బట్టి ఇవి ఏకంగా 25 నుంచి 40 శాతం వరకూ పెరుగుతున్నాయి. మామూలుగా చూస్తే ఇంజిన్ సామర్థ్యం 1,500 సీసీ వరకూ ఉన్న వాహనాలకు ప్రీమియం 5 నుంచి 6 శాతం పెరుగుతోంది. ఇక 1,500 సీసీ సామర్థ్యం దాటితే పెరుగుదల 15 నుంచి 20 శాతం వరకూ ఉంది. ఇవి ఐఆర్డీఏ నిర్దేశించిన రేట్లు గనక మనమేమీ చేయలేం. కాకపోతే కొన్ని చిట్కాలు పాటించటం ద్వారా కొంతలో కొంత ప్రీమియంను ఈజీగా తగ్గించుకోవచ్చు. ఆ చిట్కాలు మీకోసం... -సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం * ఎన్సీబీ పెంచుకోవటానికీ మార్గాలు * సొంత చెల్లింపు కాస్త పెంచుకుంటే మేలు * కొన్ని సంఘాల్లో సభ్యత్వంతోనూ చక్కని రాయితీ స్వచ్ఛంద చెల్లింపు ఎక్కువ పెట్టండి... స్వచ్ఛంద చెల్లింపు అంటే... క్లెయిమ్ చేసేటపుడు మీరు సొంతగా చెల్లించే మొత్తం. మిగిలిన మొత్తాన్ని బీమా కంపెనీ చెల్లిస్తుంది. ఈ స్వచ్ఛంద మొత్తాన్ని పెంచుకోవటం ద్వారా మీ ప్రీమియం తగ్గుతుంది. అత్యధిక ఎన్సీబీ ఉన్నవాళ్లు ఎక్కువ స్వచ్ఛంద మొత్తాన్ని ఎంచుకోవటం ఉత్తమం. అయితే నిజానికి 50 శాతం వరకూ ఎన్సీబీ ఉన్న వ్యక్తి... తన వాహనం డ్యామేజ్ కోసం రూ.5,000కు క్లెయిమ్ చేస్తాడని ఊహించలేం కదా!!. అంతేకాదు. ఈ స్వచ్ఛంద మొత్తమనేది మీరు ఎంత చెల్లించగలరు? ఎంత రిస్క్‌ను భరించగలరు? కారు ఎలాంటిది? అనేదానిపై కూడా ఆధారపడి ఉంటుంది. ‘‘కొన్ని కార్లకు డ్యామేజీ జరిగితే దానికయ్యే ఖర్చును భరించటం వ్యక్తులకు చాలా కష్టం. అలాంటివాళ్లు స్వచ్ఛంద మొత్తాన్ని కాస్త ఎక్కువగానే ఉంచుకోవటం బెటర్. అలాగే తక్కువ ఖర్చుతోనే రిపేర్లు జరిగే పక్షంలో వారు తక్కువ స్వచ్ఛంద మొత్తాన్ని ఎంచుకోవటం మంచిది’’ అని బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్‌లో వాహన బీమా విభాగానికి చీఫ్ టెక్నికల్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తున్న విజయ్ కుమార్ చెప్పారు. ఆన్లైన్లో ప్రీమియం రేట్లను పోల్చిచూడటం... ఇపుడు ప్రతీదీ ఆన్లైన్లోనే. అలాగే చాలా వెబ్సైట్లు బీమా ప్రీమియం ఏ కంపెనీ వద్ద ఎంత ఉందో పోల్చిచూసుకునే అవకాశం ఇస్తున్నాయి. ఒకే వాహనానికి, ఒకే విభాగమైనా.. కంపెనీని బట్టి రేట్లలో బాగా తేడాలుండొచ్చు. దీనిక్కారణం ఆయా కంపెనీలకు వచ్చిన క్లెయిమ్‌ల సంఖ్యే. అందుకే వీటిని ఆయా వెబ్సైట్లలో పోల్చిచూడాలి. దీంతో పాటు కొన్ని సందర్భాల్లో సదరు బీమా కంపెనీ లేదా పోర్టల్‌తో బేరసారాలు కూడా సాగించవచ్చు. వ్యాపారాన్ని పోగొట్టుకోరాదన్న ఉద్దేశంతో వారు కాస్త ఎక్కువ డిస్కౌంటే ఆఫర్ చేసే అవకాశముంటుంది. దీంతో పాటు కార్లకు యాంటీ-థె ఫ్ట్ డివైజ్‌ను పెట్టుకోవటం, ఆటోమొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వంటి సంఘాల్లో సభ్యత్వం తీసుకోవటం వల్ల కూడా కొంత మేర డిస్కౌంట్ పొందే అవకాశం ఉంటుంది. నో క్లెయిమ్ బోనస్‌ను పెంచుకోవాలి... బీమా కట్టేది వాహనానికి ఏదైనా జరిగినపుడు క్లెయిమ్ చెయ్యడానికే. అందులో సందేహం లేదు. కాకపోతే క్లెయిమ్ చేసేముందు కాస్త విశ్లేషణ అవసరం. ప్రతి సంస్థా ఆ ఏడాది గనక క్లెయిమ్ చెయ్యకపోతే నోక్లెయిమ్ బోనస్ కింద మరుసటి ఏడాది ప్రీమియంలో కొంత మొత్తం తగ్గిస్తుంది. అదెంతో ముందు తెలుసుకోవాలి. ఒకవేళ మీరు క్లెయిమ్ చేస్తున్న మొత్తం గనక నో క్లెయిమ్ బోనస్కన్నా తక్కువ ఉంటే... క్లెయిమ్ మానేయటమే బెటర్. దీంతో పాటు మీ కారు గనక ఐదేళ్లకు మించి పాతబడిపోతే... ‘నోక్లెయిమ్ బోనస్ ప్రొటెక్టర్’ అనే యాడ్ ఆన్ కవర్‌ను తీసుకోవటం మంచిది. దీంతో మీరు క్లెయిమ్ చేసినా కూడా మీ నోక్లెయిమ్ బోనస్ మీకు తిరిగొస్తుంది. ఉదాహరణకు మీ పాలసీపై 40 శాతం వరకూ నోక్లెయిమ్ బోనస్ ఉంది. కానీ మీరు క్లెయిమ్ చేశారు. నిజానికి క్లెయిమ్ చేశారు గనక మీ ఎన్సీబీ మొత్తం పోవాలి. కానీ ప్రొటెక్టర్ ఉండటం వల్ల 40 కన్నా 10 శాతం తక్కువగా... అంటే 30 శాతం నోక్లెయిమ్ బోనస్ అలాగే ఉంటుంది. ఒకవేళ మీరు గనక క్లెయిమ్ చెయ్యకపోతే... ప్రొటెక్టర్ కారణంగా మీ ఎన్సీబీ మరో 10 శాతం పెరుగుతుంది. అంటే 50 శాతానికి చేరుతుంది. అంతేకాదు! మీ పాలసీ రెన్యువల్ సమయంలో మీ నోక్లెయిమ్ బోనస్ ఎంత ఉందో అంత వేశారా లేదా? అన్నది కూడా మీరే చూసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు! మీ వాహనాన్ని విక్రయిస్తున్నపుడు మీ బీమా కంపెనీ నుంచి ఎన్ సీబీ సర్టిఫికెట్‌ను కూడా తీసుకోవాల్సి ఉంటుంది. దీనిద్వారా మీకు అప్పటిదాకా ఎంత ఎన్సీబీ జతపడిందో తెలుస్తుంది. -
త్వరలో ఇన్సూరెన్స్ బ్రోకింగ్ విధివిధానాలు
♦ బ్రోకింగ్ కమీషన్లపై నియంత్రణ తీసేయలేం ♦ 2025కి 4 లక్షల కోట్లకు సాధారణ బీమా ♦ ఐఆర్డీఏ చైర్మన్ టి.ఎస్.విజయన్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బీమా బ్రోకింగ్ కంపెనీలకు ఇచ్చే కమీషన్లపై నియంత్రణలను తొలిగించే ఆలోచన లేదని బీమా నియంత్రణ, అభివృద్ధి మండలి (ఐఆర్డీఏ) స్పష్టం చేసింది. కానీ ప్రస్తుతం ఇస్తున్న కమీషన్లపై వున్న పరిమితిని పెంచే యోచనలో ఉన్నామని, దీనికి సంబంధించి బ్రోకర్లతో కలసి ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేసినట్లు ఐఆర్డీఏ చైర్మన్ టి.ఎస్.విజయన్ తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన 12వ ఇన్సూరెన్స్ బ్రోకర్ల సమావేశానికి విజయన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సంరక్షణను దృష్టిలో పెట్టుకొనే నిర్ణయాలు తీసుకుంటామని, మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా కమీషన్లు తీసుకునే అవకాశాన్ని కల్పించలేమన్నారు. కమీషన్లు అధికంగా పెంచడంవల్ల మొత్తం వ్యాపారమే దెబ్బతినే అవకాశం కూడా ఉందన్నారు. కానీ ఇక నుంచి ఒక్కొక్క వ్యాపారానికి ఒక్కో కమీషన్ రేటును నిర్ణయించే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఇవి చర్చల దశలో ఉన్నాయని, మార్చిలోగా తుది బ్రోకరేజ్ నిబంధనలను విడుదల చేయనున్నట్లు తెలిపారు. గరిష్టంగా 15 శాతం వరకు కమీషన్ తీసుకోవడానికి అనుమతిస్తూ నిబంధనలు ఉండే అవకాశం ఉందని సూత్రప్రాయంగా వెల్లడించారు. అంతకుముందు విజయన్ ఎర్నెస్ట్ యంగ్ విడుదల చేసిన విజన్ 2025 నివేదికను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఐబీఏఐ ప్రెసిడెంట్ సంజయ్ కేడియా మాట్లాడుతూ పోటీ ప్రపంచంలో కమీషన్ల రేట్లపై పరిమితులు ఉండకూడదని, వీటిని మార్కెట్ రేట్లకే వదిలిపెట్టే విధంగా నిర్ణయం తీసుకోవాలని ఐఆర్‌డీఏని కోరారు. ప్రస్తుతం సాధారణ బీమా వ్యాపారంలో 27% బ్రోకింగ్ సంస్థల నుంచే వస్తోం దని, ఇది వచ్చే పదేళ్లలో 40 శాతం చేరుతుందన్నారు. ఎర్నెస్ట్ అండ్ యంగ్ నివేదిక ప్రకారం వచ్చే పదేళ్లలో దేశీయ సాధారణ బీమా వ్యాపారం రూ. 83,048 కోట్ల నుంచి రూ. 4,00,000 కోట్లకు చేరుతుందని, ఈ విధంగా చూస్తే బ్రోకింగ్ వ్యాపారం రూ. 20,000 కోట్ల నుంచి రూ. 1.60 లక్షల కోట్లకు చేరుతుందన్నారు. ఆన్లైన్ ద్వారా కూడా కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి అనుమతులు ఇవ్వాల్సిందిగా ఐఆర్‌డీఏని కోరినట్లు తెలిపారు. -
మీకు ‘ఈ-వాహన బీమా’ ఉందా?
ఇక డిజిటల్ రూపంలోనే వాహన బీమా పాలసీ ⇒ గతనెల నుంచే తొలిసారి అమల్లోకి తెచ్చిన తెలంగాణ ⇒ వచ్చే ఏడాదికల్లా మిగిలిన రాష్ట్రాలూ చేయాలన్న ఐఆర్డీఏ ⇒ డిజిటల్ కాపీని మొబైల్లో స్టోర్ చేసుకుంటే చాలు ⇒ ట్రాఫిక్ పోలీసులు అడిగితే మొబైల్లోనే చూపించొచ్చు ⇒ వారు ధ్రువీకరించుకోవటానికి వీలుగా దాన్లోనే క్యూ.ఆర్. కోడ్ ⇒ అంతటా అమల్లోకి వస్తే బీమా ప్రీమియంలోనూ తగ్గుదల సాక్షి పర్సనల్ ఫైనాన్స్ విభాగం: స్నేహితుడిని ఆసుపత్రిలో చేర్చటంతో సుధీర్ హడావుడిగా తన కార్లో బయల్దేరాడు. దార్లో ప్రతి వాహనాన్నీ తనిఖీ చేస్తున్న పోలీసులు సుధీర్ వాహనాన్ని కూడా ఆపారు. డ్రైవింగ్ లెసైన్స్.. ఆర్సీ రెండూ చూపించటంతో పోలీసులు ఇన్సూరెన్స్ పత్రాలడిగారు. సుధీర్ ఈ ఏడాది వాహన బీమా రెన్యువల్ చేయించాడు గానీ... ఆ పత్రాల్ని కార్లో ఉంచుకోవటం మర్చిపోయాడు. అంతే! కారు ఆపి కిందికి దిగాల్సిందిగా పోలీసులు చెప్పారు. ఇంటికి ఫోన్‌చేసి మొబైల్ ఫోన్లో వాట్సాప్ ద్వారా తెప్పించుకుంటానని, చూపిస్తానని సుధీర్ చెప్పినా వాళ్లు వినలేదు. తమకు ఒరిజినల్ బీమా పాలసీ పత్రాన్ని చూపించాలని, జిరాక్స్ కూడా పనికిరాదని కచ్చితంగా చెప్పేశారు. అసలే అర్జంటుగా వెళదామనుకున్న సుధీర్‌కు ఈ సంఘటన చాలా చికాకు తెప్పించింది. చివరకు పోలీసులు చెప్పిన జరిమానా చెల్లించి బతుకు జీవుడా... అనుకుంటూ బయటపడ్డాడు. అదండీ సుధీర్ కథ. అయినా సుధీర్ ఒక్కడికే కాదు. మనలో చాలామందికి ఇలాంటి సంఘటనలు ఎప్పుడో ఒకప్పుడు ఎదురయ్యే ఉంటాయి. అయితే ఫైన్ చెల్లించటమో... లేకపోతే పోలీసుల్ని బతిమాలుకొని వారికే ఎంతో కొంత చెల్లించటమో చేసి ఉంటాం. అయినా! బీమా పాలసీ లేనివారైతే ఇలాంటివి చెయ్యొచ్చు. ఉండి కూడా కేవలం ఆ సమయానికి తన వద్ద ఉంచుకోకపోవటం వల్ల జరిమానా కట్టడమంటే చాలా ఇబ్బందే. అందుకే..!! ఇలాంటి ఇబ్బందులు ఇకపై ఎదురు కాకుండా ఉండేందుకు బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏ) కొత్తగా డిజిటల్ రూపంలో ఉండే ‘ఈ-వాహన బీమా’ పాలసీలను అమల్లోకి తెచ్చింది. ఇంకో విశేషం ఏంటంటే... గతనెల 2 నుంచి అమల్లోకి వచ్చిన ఈ-వాహన బీమా పాలసీల్ని మొట్టమొదట జారీ చేసింది, గుర్తిస్తున్నది తెలంగాణ రాష్ట్రం కావటం. ప్రస్తుతానికి ఈ రాష్ట్రం ఒక్కటే వీటిని జారీ చేయటం, గుర్తించటం చేస్తుండగా... 2017 నాటికి అన్ని రాష్ట్రాలూ తెలంగాణను అనుసరించాలని ఐఆర్డీఏ ఇప్పటికే ఆదేశాలిచ్చింది. ఈ-వాహన బీమా అర్థమేంటి? 1988 నాటి మోటారు వాహనాల చట్టం ప్రకారం ప్రతి వాహనానికీ కనీసం థర్డ్ పార్టీ బీమా తప్పనిసరిగా ఉండి తీరాలి. థర్డ్ పార్టీ పాలసీ అంటే... మీ వాహనం వల్ల ఏదైనా యాక్సిడెంట్ జరిగినపుడు మీ వల్ల ఎదుటి వాహ నానికో, వ్యక్తులకో ప్రమాదం జరగొచ్చు. అపుడు ఆ వాహనానికో, వ్యక్తులకో అయ్యే ఖర్చు మీరు భరించలేని పరిస్థితి ఉండొచ్చు. దాన్ని థర్డ్ పార్టీ పాలసీ జారీ చేసిన బీమా కంపెనీ చెల్లిస్తుందన్న మాట. మీరు డ్రైవింగ్ చేస్తూ ఏదైనా చెట్టుకో, మరోదానికో యాక్సిడెంట్ చేసినా, లేక మీ వాహనంలోని భాగాలో, వాహనమో దొంగతనానికి గురైనా ఈ థర్డ్ పార్టీ బీమా వర్తించదు. అలాంటివాటికి కూడా కవరేజీ ఉండాలంటే సమగ్ర (కాంప్రిహెన్సివ్) పాలసీ ఉండాలి. ఇపుడు దీన్ని కూడా ఐఆర్డీఏ తప్పనిసరి చేసింది. నిజానికి చట్టం ప్రకారం బీమా తప్పనిసరి. అయినా సరే తీసుకుంటున్న వారు మాత్రం తక్కువే ఉంటున్నారన్నది ఐఆర్డీఏ ఉద్దేశం. ‘‘ఇటీవల భారత బీమా సమాచార బ్యూరో (ఐఐబీ), బీమా పరిశ్రమ కలసి ఓ సర్వే చేశాయి. దీని ప్రకారం 45-55 శాతం వాహనాలకు మాత్రమే బీమా ఉంది. ప్రయివేటు కార్లలో 50 శాతం వరకూ మొదటి ఏడాది తరవాత బీమా చేయించటం లేదు. చట్టప్రకారం బీమా లేని వాహనాలు రోడ్లపై తిరక్కూడదు. కానీ కొన్ని అక్రమ మార్గాల వల్ల, బీమా తేదీల్ని మార్చి ఫోర్జరీ చేసిన పత్రాలను పోలీసులకు చూపించటం వల్ల ఇలాంటి వాహనాలు స్వేచ్ఛగా రోడ్లపై తిరగ్గలుగుతున్నాయి. వీటిని పట్టుకోవటానికి పోలీసుల దగ్గర కూడా తగిన యంత్రాంగం లేదు’’ అని కామ్స్.. రిపాజిటరీ సర్వీసెస్ సీఈఓ ఎస్.వి.రమణన్ చెప్పారు. బీమా రిపాజిటరీ సర్వీసులంటే పాలసీదారుల పేరిట ఈ-ఖాతాలు తెరిచి అన్ని పాలసీలనూ డిజిటలైజ్ చేసి భద్రంగా దాచే సంస్థలు, ఖాతాదారులు కూడా ఆన్లైన్లో వీటిని ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు. ప్రస్తుతానికి తెలంగాణలో మాత్రమే! గత నెల 2 నుంచి ఎలక్ట్రానిక్ రూపంలో ఉండే ఈ-వాహన బీమా పాలసీలను తెలంగాణ రాష్ట్రంలో బీమా కంపెనీలు అమల్లోకి తెచ్చాయి. ప్రస్తుతానికి వీటిని గుర్తిస్తున్నది తెలంగాణ ఒక్కటే. దీనివల్ల స్మార్ట్ఫోన్లలో సాఫ్ట్ కాపీ ఉంటే చాలు. పోలీసులు ఒకవేళ బీమా పాలసీ అడిగితే దాన్ని చూపించాలి. అవసరమనుకుంటే వాళ్లే క్యు.ఆర్. కోడ్ ద్వారా ధ్రువీకరణ చేసుకుంటారు. ‘‘ప్రత్యేకించి తెలంగాణలో ఇకపై కొత్త పాలసీలకు గానీ, రెన్యువల్ చేసుకున్న పాత పాలసీలకు గానీ డాక్యుమెంట్లను డిజిటల్ రూపంలో జారీ చేస్తాం. పాలసీదారుకు భౌతికంగా పాలసీ డాక్యుమెంట్లను పంపటంతో పాటు తన మెయిల్ ఐడీకి పీడీఎఫ్ ఫార్మాట్లో డిజిటల్ కాపీనీ పంపిస్తాం. ధ్రువీకరణకు వీలుగా వాటిపై క్యు.ఆర్. కోడ్ కూడా ఉంటుంది’’ అని రాయల్ సుందరం జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ సీఐఓ టి.ఎం.శ్యాంసుందర్ చెప్పారు. ‘‘ఒకవేళ ఈ-బీమా ఖాతా ఉన్నట్లయితే అన్ని పాలసీలూ అందులోనే స్టోర్ అయి ఉంటాయి. అయితే ఇందుకు ఇన్సూరెన్స్ రిపాజిటరీలతో సదరు బీమా సంస్థ ఒప్పందం చేసుకుని ఉండాలి. ఇలాంటి ఖాతా ఉన్నవారికి బీమా కంపెనీలు భౌతిక పాలసీలను పంపించవు’’ అని ఆయన వివరించారు. మిగతా రాష్ట్రాలింకా దీన్ని అమల్లోకి తేలేదు కనక తెలంగాణ వాసులు ఇతర రాష్ట్రాలకు వెళ్లేటపుడు తప్పనిసరిగా భౌతిక రూపంలో పాలసీలను వెంట తీసుకెళ్లాల్సి ఉంటుందని చెప్పారు. ఈ-వాహన బీమా పనిచేసేదిలా... ♦ కొత్త పాలసీ తీసుకున్నా, పాత బీమా పాలసీని రెన్యువల్ చేయించుకున్నా కంపెనీలు పాలసీదారు మెయిల్‌కు పీడీఎఫ్ రూపంలో ఒక పాలసీని పంపిస్తాయి. దాన్ని డౌన్లోడ్ చేసుకుని మొబైల్ ఫోన్లో స్టోర్ చేసుకుంటే చాలు. ♦ ఎక్కడైనా పోలీసులు ఆపి బీమా పత్రాలను చూపించమని అడిగినపుడు మొబైల్లో స్టోర్ చేసిన డిజిటల్ పాలసీని చూపించాల్సి ఉంటుంది. ఆ పాలసీపై ఉన్న క్విక్ రెస్పాన్స్ (క్యు.ఆర్.) కోడ్‌ను పోలీసులు తమ మొబైల్ ఫోన్ ద్వారా కూడా స్కాన్ చేస్తారు. ♦ ఇపుడు క్యు.ఆర్. కోడ్‌ను స్కాన్ చేసే సాఫ్ట్వేర్ అప్లికేషన్లు చాలా వచ్చాయి. ఆండ్రాయిడ్ ఫోన్లు వాడేవారైతే గూగుల్ ప్లేస్టోర్ నుంచి, యాపిల్ ఫోన్లు వాడేవారైతే యాపిల్ స్టోర్ నుంచి వీటిని ఉచితంగానే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ♦ పోలీసులు ఈ క్యు.ఆర్. కోడ్‌ను స్కాన్ చేసిన వెంటనే మొబైల్ తెరపై ఆ పాలసీకి సంబంధించిన వివరాలన్నీ ప్రత్యక్షమవుతాయి. ఆ పాలసీ ఎప్పటిదాకా అమల్లో ఉంటుంది? పాలసీదారు పేరు... అది అసలైనదా? నకిలీదా? తదితర వివరాలన్నీ కనిపిస్తాయి. ♦ ఈ వివరాలన్నీ నిజానికి బీమా సమాచార బ్యూరో డేటా బేస్ నుంచి గానీ, బీమా కంపెనీ డాటాబేస్ నుంచి గానీ వివరాలన్నీ మొబైల్ తెరపై ప్రత్యక్షమవుతాయి. ఈ క్యూ.ఆర్. కోడ్ ను స్కాన్ చేసే అప్లికేషన్లను మొబైల్ ఫోన్లలోకి సులువుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులందరూ తమ మొబైల్ ఫోన్లలో వీటిని డౌన్లోడ్ చేసుకున్నారు కూడా’’ అని రమణన్ చెప్పారు. ♦ వాటి ఆధారంగా పోలీసులు ఆ పాలసీ సరైనదో కాదో అక్కడికక్కడే ఆన్లైన్లోనే పరిశీలించి ధ్రువీకరించుకునే వీలుంటుంది. డిజిటల్ పాలసీ లాభాలివీ... ♦ వాహనదారులు పాలసీ పత్రాన్ని స్టోర్ చేసుకున్న మొబైల్‌ను వెంట తీసుకెళితే చాలు. ♦ అధికారులు వాహనాల్ని ఆపితే... బీమా పత్రాల్ని ఎక్కడికక్కడ పరిశీలించి ధ్రువీకరించుకోవచ్చు. ♦ డిజిటల్ పాలసీ వల్ల పాలసీదారులకు ఖర్చు కూడా తగ్గుతుంది. ఈ తగ్గుదల థర్డ్ పార్టీ పాలసీల్లో ఉండకపోవచ్చు. ఎందుకంటే వాటి ప్రీమియంను ఏటా ఐఆర్డీఏ నిర్ణయిస్తూ ఉంటుంది. ♦ కాంప్రిహెన్సివ్ పాలసీల రేట్లను బీమా కంపెనీలే నిర్ణయిస్తాయి. డిజిటల్ వల్ల ఖర్చులు తగ్గుతాయి కనుక ఆ తగ్గుదలను పాలసీదారులకు బదలాయించే అవకాశం ఉంది. ♦ ప్రస్తుతం బీమా సంస్థలు డిజిటల్‌తో పాటు భౌతిక పాలసీలనూ జారీ చేయాల్సి వస్తోంది కనుక కంపెనీలకు ఖర్చుల్లో తగ్గుదల ఉండదు. మున్ముందు అన్ని రాష్ట్రాలూ దీన్ని అమల్లోకి తెచ్చి... డిజిటల్‌ను మాత్రమే తప్పనిసరి చేస్తే తగ్గుదల ప్రయోజనం అందుతుంది. ఐఆర్డీఏ ఉత్తర్వుల్లో ఏముంది? 2015 డిసెంబర్ 1 తరవాత జారీ చేసిన వాహన బీమా పాలసీలన్నిటికీ క్యూ.ఆర్. కోడ్ తప్పనిసరిగా ఉండాలని, పాలసీ అధికారికమైనదో, కాదో ధ్రువీకరించుకోవటానికి ఈ కోడ్ ఉపయోగపడుతుందని ఐఆర్డీఏ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. దీనివల్ల ఎక్కువ మంది వాహన బీమా పాలసీలు తీసుకుంటారని, అవినీతి కూడా తగ్గుతుందని బీమా అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం భౌతికంగా పాలసీలున్న వారందరికీ క్యూ.ఆర్. కోడ్ ఉన్న డిజిటల్ పాలసీలు జారీ చేయాలని బీమా కంపెనీలకు కూడా సూచించినట్లు ఐఆర్డీఏ తెలిపింది. -
త్వరలో దీర్ఘకాలిక ఆరోగ్య బీమా పథకాలు
సాధ్యాసాధ్యాలపై కమిటీ ఎఫ్‌డీఐ వాటా పెంచుకోవడానికి ముందుకొచ్చిన ఏడు కంపెనీలు చౌకగా పాలసీలను అందించడంపై కంపెనీలు దృష్టిపెట్టాలి ఐఆర్డీఏ చైర్మన్ టి.ఎస్.విజయన్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రతి ఏటా పాలసీని రెన్యువల్ చేయించుకోనవసరం లేకుండా బహుళ సంవత్సరాలు అమల్లో ఉండే ఆరోగ్య బీమా పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చే యోచనలో ఐఆర్డీఏ ఉంది. అన్ని వైపుల నుంచి దీర్ఘకాలిక ఆరోగ్య బీమా పథకాలకు డిమాండ్ రావడంతో దీని సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు బీమా నియంత్రణ, అభివృద్ధి మండలి (ఐఆర్డీఏ) చైర్మన్ టి.ఎస్.విజయన్ తెలిపారు. త్వరలోనే ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా దీనిపై ఒక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లో ఐసీఐసీఐ లాంబార్డ్ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన విజయన్ కలసిన విలేకరులతో మాట్లాడుతూ ద్విచక్ర వాహన రంగంలో ప్రవేశపెట్టిన దీర్ఘకాలిక పాలసీలకు డిమాండ్ బాగుండటంతో కార్లు, ఆరోగ్య బీమా పాలసీల్లో కూడా దీన్ని అమలు చేయాలని కంపెనీలు కోరుతున్నాయన్నారు. తక్కువ కాలంలోనే దీర్ఘకాలిక ద్విచక్ర వాహన పాలసీల అమ్మకాలు లక్ష మార్కును అందుకోవడంపై విజయన్ సంతోషం వ్యక్తం చేశారు. కంపెనీలు డిజిటలైజేషన్‌ను వినియోగించడం ద్వారా వ్యయాలను తగ్గించుకొని తక్కువ ప్రీమియంకే పాలసీలను అందించడంపై కంపెనీలు దృష్టిపెట్టాలన్నారు. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో 80 శాతం ఆస్తులకు బీమా రక్షణ ఉందని, కానీ ఇండియాలో ఇది కేవలం 7 శాతంగా ఉందన్నారు. బీమా కంపెనీల్లో ఎఫ్‌డీఐ పెంపు అనుమతి కోరుతూ కంపెనీల నుంచి అధికారికంగా ఎటువంటి దరఖాస్తులు అందలేదని, కానీ ఆరు నుంచి ఏడు కంపెనీలు ఎఫ్‌డీఐ వాటాను పెంచుకోవడానికి చర్చలు జరుపుతున్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. పరిశ్రమకంటే బెటర్ ఈ ఏడాది పరిశ్రమ సగటు కంటే ఎక్కువ వృద్ధిని సాధించగలమన్న ధీమాను సాధారణ బీమా కంపెనీ ఐసీఐసీఐ లాంబార్డ్ వ్యక్తం చేసింది. ఈ ఏడాది మొదటి ఐదు నెలల కాలంలో సాధారణ బీమా రంగంలో 10 నుంచి 11 శాతం వృద్ధి నమోదైతే, ఇదే సమయంలో తాము 18 శాతం వృద్ధిని నమోదు చేసినట్లు ఐసీఐసీఐ లాంబార్డ్ ఎండీ, సీఈవో భార్గవ్ దాస్ గుప్తా తెలిపారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ. 7,000 కోట్ల ప్రీమియం ఆదాయాన్ని ఆర్జించింది. -
బీమా కంపెనీల ఐపీవోలకు ఐఆర్డీఏ సానుకూలం
న్యూఢిల్లీ: సాధారణ బీమా సంస్థలు అవసరాన్ని బట్టి పబ్లిక్ ఇష్యూ (ఐపీవో)కి రావొచ్చంటూ బీమా రంగ నియంత్రణ సంస్థ (ఐఆర్డీఏ) ఒక ముసాయిదా ప్రతిపాదనలో పేర్కొంది. దీని ప్రకారం ఐఆర్డీఏ నుంచి అనుమతి పొందిన ఏడాది వ్యవధిలోగా సదరు సంస్థ నిర్దేశిత నిబంధనలను పూర్తి చేయాల్సి ఉంటుంది. నియంత్రణ సంస్థ అనుమతి లేకుండా నాన్-లైఫ్ ఇన్సూరెన్స్, రీఇన్సూరెన్స్ కార్యకలాపాలు నిర్వహించే సంస్థలు, కేవలం ఆరోగ్య బీమాకే పరిమితమైన సంస్థలు.. పబ్లిక్ ఇష్యూ కోసం సెబీకి దరఖాస్తు చేసుకోవడానికి ఉండదు. -
‘ఈ’ ధీమా మీకుందా!?
- ఎలక్ట్రానిక్ పద్ధతిలో బీమా పాలసీలు - రోజురోజుకూ పెరుగుతున్న ఆదరణ - పాలసీదారులకు ప్రయోజనాలెన్నో.. హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బ్యాంకింగ్ కార్యక లాపాలన్నీ దాదాపుగా ఎలక్ట్రానిక్ పద్ధతిలోకి మారిపోయాయి. స్టాక్ మార్కెట్ లావాదేవీలూ ఇదే బాటపట్టాయి. ఇప్పుడు జాబితాలో బీమా కంపెనీలూ చేరాయి. బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏ) కొన్నాళ్ల కిందటే ఈ-ఇన్సూరెన్స్ పాలసీలకు వీలు కల్పించినా... దేశంలో తొలి డిజిటలైజ్ బీమా పాలసీ 2013 సెప్టెంబర్‌లో ఆరంభమైనా... ఇప్పటివరకు 2 శాతం కంటే తక్కువ పాలసీలు మాత్రమే ఎలక్ట్రానిక్ పద్ధతిలో అమ్ముడుపోయాయి. ఈ మధ్య కాలంలో కాగిత రహిత ఎలక్ట్రానిక్ రికార్డుల వైపు ప్రపంచం మొగ్గుచూపుతుండటం.. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీల్లో ఎలక్ట్రానిక్ రికార్డుల వినియోగం ఎంతగానో పెరుగుతుండటంతో ఈ-ఇన్సూరెన్స్లకు గిరాకీ పెరిగిందన్నది పరిశ్రమ వర్గాల మాట. ప్రత్యేకంగా రిపాజిటరీలుంటాయ్.. బీమా పాలసీలను ఎలక్ట్రానిక్ పద్ధతిలో జారీ చేయడానికి 2013లో ఐఆర్డీఏ అనుమతించింది. ఈ సేవలను అందించటానికి ఇన్సూరెన్స్ రిపాజిటరీలకు లెసైన్సులు జారీ చేసింది. ఎన్ఎస్డీఎల్ డేటాబేస్ మేనేజ్మెంట్, సెంట్రల్ ఇన్సూరెన్స్, షిల్ ప్రాజెక్ట్స్, కార్వీ ఇన్సూరెన్స్, క్యామ్స్ వంటివి ఇందులో ఉన్నా యి. దాదాపు అన్ని బీమా కంపెనీలూ ఎలక్ట్రానిక్ పద్ధతిలో పాలసీలను అందించేందుకు రిపాజిటరీ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నాయి కూడా. ఏం చేయాలంటే.. బీమా వినియోగదారులు ఎలక్ట్రానిక్ పద్ధతిలో బీమా పాలసీలు భద్రపరుచుకోవాలంటే ముందుగా ఏదైనా ఇన్సూరెన్స్ రిపాజిటరీ సంస్థ వద్ద ఖాతాను తెరవాల్సి ఉంటుంది. ఆ తర్వాత పాలసీ కొనుగోలు చేస్తే, ఆ పాలసీ వివరాలు ఇన్సూరెన్స్ రిపాజిటరీ ఖాతాలో కనిపిస్తాయి. ఒక్కో పాలసీకి ఒక్కో ఖాతా కాకుండా ఎన్ని బీమా కంపెనీల నుంచి ఎటువంటి పాలసీలు కొనుగోలు చేసినా వాటన్నింటినీ ఒకే రిపాజిటరీ ఖాతాలో భద్రపరుచుకునే వీలుంటుంది. అంతేకాకుండా అప్పటికే ఫిజికల్ సర్టిఫికెట్ల రూపంలో ఉన్న బీమా పాలసీలను సైతం ఎలక్ట్రానిక్ పద్ధతిలో రిపాజిటరీ ఖాతాలోకి మార్చుకోవచ్చు. రూ.100 కోట్ల ఆదా.. ఈ-ఇన్సూరెన్స్‌కు ఒక్కో పాలసీకి రూ.75-80 ఖర్చవుతుంది. దీనికి సర్వీసు ఛార్జీలు అదనం. ఇవి ఏటా రూ.500-900 వరకు ఉంటాయి. ఇవన్నీ పాలసీదారులే భరించాల్సి ఉంటుంది. ఫిజికల్ రూపంలో పాలసీలు నిర్వహించడానికి ఒకో పాలసీకి ఏటా రూ.150-200 ఖర్చవుతుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. కానీ, ఎలక్ట్రానిక్ రూపంలో పాలసీలుంటే పరిశ్రమకు ఏటా రూ.100 కోట్ల ఆదా అవుతుందని ఐఆర్డీఏ చెబుతోంది. దీంతో నాలుగైదేళ్లలో బీమా పాలసీలన్నీ ఎలక్ట్రానిక్ పద్ధతిలోనే జారీ అయ్యే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ప్రయోజనాలెన్నో.. - విడివిడిగా ప్రతి పాలసీకి ఒక పాలసీ సర్టిఫికెట్ తీసుకుని భద్రపరుచుకోవాల్సిన పని ఉండదు. ఒకసారి రిపాజిటరీ ఖాతా తెరిస్తే చాలు.. ఎన్ని బీమా పాలసీలు కొనుగోలు చేసినా వాటన్నింటినీ ఇందులోనే జమ చేసుకోవచ్చు. - ఎలక్ట్రానిక్ ఖాతా కాబట్టి పాలసీదారు వద్ద సర్టిఫికెట్లు ఉండవు. దీంతో సర్టిఫికెట్లు పోతాయనే భయం.. భద్రపరచాల్సిన అవసరమూ ఉండదు. - వరదలు, తుఫాన్లు, అగ్ని ప్రమాదాల వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు సర్టిఫికెట్లు, ముఖ్యమైన పత్రాలు పోతాయన్న భయం అవసరం లేదు. - పాలసీ ప్రీమియం చెల్లింపులు, మెచ్యూరిటీ బెనిఫిట్లకు సంబంధించి సమాచారం ఎప్పటికప్పుడు ఎస్ఎంఎస్లు, ఈ-మెయిల్స్ రూపంలో పాలసీదారులకు వస్తుంటుంది. - ఈ-ఇన్సూరెన్స్‌తో క్లెయిమ్ పరిష్కారం చాలా సులువు. పాలసీ సర్టిఫికెట్, దానికి సంబంధించిన ఇతరత్రా పత్రాలు, ధృవీకరణ అంతగా అవసరం ఉండదు. - ఏడాదికోసారి లేదా కోరినప్పుడు రిపాజిటరీ సంస్థ ఈ-ఇన్సూరెన్స్ పాలసీల ఖాతా స్టేట్మెంట్ పాలసీదారుకు అందజేస్తుంది. -
పెన్షన్ చెల్లింపులు వేగంగా జరపండి!
బీమా కంపెనీలను ఆదేశించిన ఐఆర్డీఏ న్యూఢిల్లీ : పాలసీదారులకు పెన్షన్ చెల్లింపుల్లో ఆలస్యం చెయొద్దని బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్డీఏ బీమా కంపెనీలను ఆదేశించింది. ఇం దుకోసం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. పెన్షన్ ఉత్పత్తులను తీసుకున్న పాలసీదారులతో చర్చలు జరపాలని బీమా కంపెనీలకు తెలియజేసింది. ఈ చర్చల్లో పాలసీదారులు వారి పెన్షన్ చెల్లింపుల కోసం ఏలాంటి ఆప్షన్ కోరుకుంటారో బీమా కంపెనీలు తెలుసుకుంటాయి. అలాగే సదరు బీమా కంపెనీ పెన్షన్‌ను ఏ విధానంలో చెల్లిస్తుందో పాలసీదారులకు 6 నెలల ముందే తెలియజేయాల్సి ఉంటుంది. ఒకవేళ పాలసీదారులు ఎలాంటి ఆప్షన్ ఇవ్వకపోతే.. అప్పుడు బీమా కంపెనీ ఆ పాలసీదారు బీమా తీసుకునే సమయంలో ఇచ్చిన సమాచారం ఆధారంగా చెల్లింపులు జరుపుతుంది. అలాగే నిబంధనలను అతిక్రమించడంతో రిలయన్స్ లైఫ్‌కు ఐఆర్డీఏ రూ.85 లక్షల జరిమానా విధించింది. -
ఆస్పత్రుల డిస్కౌంట్లు పాలసీదారులకు ఇవ్వండి
ఆరోగ్య బీమా సంస్థలకు ఐఆర్డీఏ సూచన న్యూఢిల్లీ : క్లెయిమ్ సెటిల్మెంట్ సమయంలో ఆస్పత్రుల నుంచి తమకు డిస్కౌంట్ లభించిన పక్షంలో ఆ ప్రయోజనాలను పాలసీదారులు/క్లెయిమెంట్లకు బదలాయించాలని ఆరోగ్య బీమా సంస్థలు, థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్లకు (టీపీఏ) బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ ఐఆర్డీఏ సూచించింది. అలాగే, ఆస్పత్రులు ఇచ్చిన డిస్కౌంట్లు, వాస్తవంగా వేసిన బిల్లు తదితర వివరాలు పాలసీదారులకు కూడా తెలిసేలా తగిన ప్రక్రియ రూపొందించాలని ఆదేశించింది. -
75 శాతం ద్విచక్రవాహనాలకు బీమా లేదు!
న్యూఢిల్లీ: వాహనం ఏదైనా ఇన్సూరెన్స్ చేయించుకోవడం అనేది తప్పనిసరి. వాహనాన్ని కొనుగోలు చేసిన తర్వాత దానికి బీమా చేయించుకోకపోతే అది చట్టరీత్యా నేరం. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ చేయించడం వల్ల మన వాహనం కారణంగా ప్రమాదం జరిగితే.. అవతలి వాళ్లకు బీమా కంపెనీయే పరిహారం చెల్లిస్తుంది. అయితే ఈ విషయం వాహన వినియోగదారులకు అంతగా బోధపడినట్టు లేదు. దేశంలో 75శాతానికి పైగా ద్విచక్ర వాహనదారులు బీమా అనే అంశాన్ని గాలికి వదిలేశారట. బీమా నియంత్రణ సంస్థ ఐఆర్డీఏ తాజాగా సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో ఈ విషయం స్పష్టం చేసింది. కాగా, ఇందులో కొంతమంది వినియోగదారులు తొలిసారి రిజిస్ట్రేషన్ కోసం ఇన్సూరెన్స్ చేసి, దాని కాల పరిమితి ముగిసిన తర్వాత తిరిగి రెన్యువల్ చేయించుకోవడం లేదని రహదారి భద్రతపై సుప్రీంకోర్టు నియమించిన కమిటీ స్పష్టం చేసింది. దేశంలో 82 శాతం ప్రైవేట్ వాహనాలు ఉంటే వాటిలో అత్యధిక శాతం ద్విచక్రవాహనాలకు బీమా లేదని రిటైర్డ్ జడ్జి కేఎస్ రాధాకృష్ణన్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ స్పష్టం చేసింది. -
మోసపూరిత కాల్స్ పట్ల అప్రమత్తం: ఐఆర్డీఏ
న్యూఢిల్లీ: బీమా వ్యాపారంలో మోసపూరిత కార్యకలాపాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఐఆర్డీఏ ప్రజలను హెచ్చరించింది. దీనికి సంబంధించి విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహిస్తోంది. ఐఆర్డీఏ ఆధ్వర్యంలో అధిక రాబడులు వచ్చే బీమా పాలసీలు ఉన్నాయని, బోనస్‌లు ఇస్తోందంటూ ఫోన్‌కాల్స్ వస్తున్నాయని, ఐఆర్డీఏ బీమా వ్యాపారంలో లేదని ఇలాంటి కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ప్రజలెవరైనా ఇలాంటి ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకుంటే, తక్షణం సమీపంలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని పేర్కొంది. -
బీమా ఏజెంట్ల నియామకానికి ఐఆర్డీఏ పరీక్ష పాసవ్వాల్సిందే..
న్యూఢిల్లీ: ఇన్సూరెన్స్ ఏజెంట్ కావాలంటే తాము నిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణత తప్పనిసరి అని ఇన్సూరెన్స్ రంగ నియంత్రణ సంస్థ, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ, డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఐఆర్డీఏ) తెలిపింది. ఈ పరీక్షలో లైఫ్, జనరల్, ఆరోగ్య బీమాలకు సంబంధించిన సబ్జెక్ట్‌లు ఉంటాయని, అలాగే ఇన్సూరెన్స్ ఏజెంట్ నియామకానికి కొత్తగా రూపొందించిన నిబంధనలు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తాయని పేర్కొంది. కేవలం ఆరోగ్య బీమా కంపెనీలు ఇన్సూరెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఐఐఐ) పరీక్షల నమూనా ఆధారంగానే జూన్ 30 వరకు ఏజెంట్లను నియమించుకోవచ్చని తర్వాత ఆ కంపెనీలు కూడా ఐఆర్డీఏఐ నియమావళిని అనుసరించాల్సి ఉంటుందని తెలిపింది. -
ఏజెంట్ల తప్పులకు బీమా సంస్థలదే బాధ్యత
న్యూఢిల్లీ: ఏజెంట్లు చేసే తప్పొప్పులన్నింటికీ బీమా కంపెనీలే బాధ్యత వహించాల్సి ఉంటుందని బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్డీఏ స్పష్టం చేసింది. ఒకవేళ ఏజెంట్లు నిబంధనలు ఉల్లంఘించిన పక్షంలో బీమా కంపెనీ రూ. 1 కోటి దాకా జరిమానా కట్టాల్సి ఉంటుందని పేర్కొంది. ఇన్సూరెన్స్ ఏజెంట్ల నియామకానికి సంబంధించి మంగళవారం విడుదల చేసిన మార్గదర్శకాల్లో ఐఆర్డీఏ ఈ విషయాలు పేర్కొంది. ఈ మార్గదర్శకాల ప్రకారం నిబంధనలకు విరుద్ధంగా బీమా ఏజెంట్ల కింద వ్యవహరించే వ్యక్తులపై రూ. 10,000 దాకా జరిమానా విధించే అవకాశం ఉంది. ఎవరైనా సరే జీవిత బీమా, సాధారణ బీమా, వైద్య బీమా విషయంలో ఒకటికి మించి కంపెనీలకు ఏజెంట్లుగా వ్యవహరించకూడదు. బీమా కంపెనీలు నియమించుకున్న ఏజెంట్లందరి వివరాలతో కూడిన ఒక జాబితా ఉండాల్సిన అవసరం ఉంది. -
రియాక్టర్లకు రూ.1,500 కోట్ల రిస్క్ కవర్!
బీమా సంస్థల విజ్ఞప్తికి ఐఆర్డీఏ సానుకూల స్పందన న్యూఢిల్లీ: అణు రియాక్టర్లకు రిస్క్ కవరేజ్ కల్పించడానికి సంబంధించి రూ.1,500 కోట్ల మూలనిధి (లైబిలిటీ పూల్) ఏర్పాటుకు బీమా రంగ రెగ్యులేటర్- ఐఆర్డీఏ సూత్రప్రాయ అంగీకారం తెలిపింది. చైర్మన్ టీఎస్ విజయన్ ఇక్కడ సోమవారం ఈ విషయాన్ని తెలిపారు. ‘రియాక్టర్ల కవరింగ్‌కు డిమాండ్ ఉంది. భారత్ పరిధిలో ఇందుకు సంబంధించి రూ.1,500 కోట్ల ప్రత్యేక మూల నిధిని ఏర్పాటు చేయాలన్నది ప్రతిపాదన. బీమా కంపెనీలు ఈ మూలనిధి ఏర్పాటుకు మా ఆమోదం కోరాయి. అయితే ఈ నిధులు ఎలా సమీకరిస్తారన్న విషయాన్ని మాత్రం అవి ఇంకా వెల్లడించలేదు.ఆయా అంశాలను మా ముందు ఉంచితే- సానుకూల రీతిలో ఈ ప్రతిపాదనను పరిశీలిస్తాం’ అని విజయన్ అన్నారు. భారత్ బీమా బ్రోకర్ల సంఘం సమావేశంలో పాల్గొన్న ఆయన, ఈ సందర్భంగా ఈ వివరాలను తెలియజేశారు. రూ.1,500 కోట్ల నిధి ఏర్పాటుకు రీ-ఇన్సూరర్ కంపెనీ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఇందుకు సంబంధించి విధివిధానాల రూపకల్పన జరుగుతున్నట్లు కూడా ఆయా వర్గాలు తెలిపాయి. కస్టమర్లలో చైతన్యం పెంచాలి... కాగా కస్టమర్లలో చైతన్యాన్ని పెంపొందించడంలో బీమా బ్రోకర్లు సంబంధిత వర్గాలదే కీలకపాత్ర అని విజయన్ పేర్కొన్నారు. బహిరంగ నోటీసులు, వెబ్సైట్లు, వార్తా పత్రికల్లో ప్రకటనల ద్వారా పాలసీ హోల్డర్లు ఎటువంటి మోసాలకూ గురికాకుండా ఐఆర్డీఏ కూడా తగిన చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా విజయన్ వివరించారు. బీమా బిల్లుపై ఆర్డినెన్స్‌ను ఆపేయాలి హైదరాబాద్ , బిజినెస్ బ్యూరో: ఎన్డీఏ ప్రభుత్వం బీమా బిల్లుపై ఆర్డినెన్స్‌ను తీసుకురావడాన్ని నేషనల్, న్యూ ఇండియా, ఓరియంటల్, యునెటైడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలు దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం చేశాయి. బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ)లను 26 శాతం నుంచి 49 శాతానికి పెంచడాన్ని, ఈ నాలుగు సాధారణ బీమా కంపెనీల వాటాలను అమ్మడాన్ని వెంటనే విరమించుకోవాలని ఈ సందర్భంగా యూనియన్లు డిమాండ్ చేశాయి. -
బీమా బిల్లుతో మరింత ధీమా
బీమా చట్టాల సవరణల బిల్లును ఇటీవలే కేంద్ర క్యాబినెట్ ఆమోదించింది. బీమా కంపెనీల్లో విదేశీ పెట్టుబడుల పెంపు మొదలైనవి కార్పొరేట్ స్థాయికి చెందినవే అయినా.. పాలసీదారులకు కూడా ప్రయోజనాలు కల్పించే నిబంధనలు సైతం ఇందులో ఉన్నాయి. అలాంటి వాటిల్లో కొన్ని ఇవి.. మూడేళ్లు దాటితే.. తాజా నిబంధనల ప్రకారం బీమా తీసుకునేటప్పుడు సరైన సమాచారం ఇవ్వలేదనే కారణంతో .. పాలసీ జారీ చేసిన మూడేళ్ల తర్వాత వచ్చే క్లెయిమును కంపెనీ తిరస్కరించడానికి వీల్లేదు. కాబట్టి పాలసీ ఇచ్చేటప్పుడే సంస్థలు మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. సరైన వివరాలు సేకరించాల్సి ఉంటుంది. ఏజెంట్లు మోసం చేసినా.. కొత్త చట్ట సవరణ ప్రకారం.. ఏజెంట్లు చేసే తప్పులకు కూడా బీమా కంపెనీనే బాధ్యత వహించాల్సి ఉంటుంది. నిబంధనలకు విరుద్ధంగా వారు వ్యవహరించిన పక్షంలో కంపెనీలు ఏకంగా రూ. 1 కోటి దాకా జరిమానా కట్టాల్సి వస్తుంది. ఎలక్ట్రానిక్ పద్ధతిలో రికార్డులు: బీమా కంపెనీలు పాలసీ రికార్డులను, క్లెయిములను ఎలక్ట్రానిక్ పద్ధతిలో నిర్వహించాల్సి ఉంటుంది. వీటిని తమ వెబ్సైట్లలో ఉంచాలి. పారదర్శకతను మరింతగా పెంచేందుకు ఈ నిబంధనను ఉద్దేశించారు. ఏజెంట్ల సంఖ్య పెంపు.. ప్రస్తుతం బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్డీఏ.. ఏజెంట్లకు లెసైన్సులు ఇస్తోంది. అయితే, రాబోయే రోజుల్లో ఐఆర్డీఏ నిర్దేశించిన అర్హతా ప్రమాణాలు కలిగి ఉండి, నిర్దేశిత పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారిని బీమా సంస్థలు నేరుగా ఏజెంట్లు కింద నియమించుకునే వీలు లభించనుంది. దేశవ్యాప్తంగా బీమాను మరింత మందికి చేరువ చేసేందుకు ఉద్దేశించిన సవరణ ఇది. దీని వల్ల బీమా సంస్థలు మరింత మంది ఏజెంట్లను తీసుకోవడం ద్వారా నెట్‌వర్క్‌ను విస్తృతం చేసుకోవచ్చు. అయితే, పాలసీదారుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు అవసరమైతే ఏజెంట్లపై చర్యలు తీసుకునేందుకు ఐఆర్డీఏకి పూర్తి అధికారాలు ఉంటాయి. రిక్రూట్మెంట్ విషయంలో పెద్దగా అడ్డంకులేమీ లేకపోయినా.. ఏజెంట్లు తప్పులు చేస్తే భారీ పెనాల్టీలు తప్పవు కాబట్టి, కంపెనీలు అత్యంత జాగ్రత్తగా నియామకాలు జరపాల్సి ఉంటుంది. -
ఒకే ఖాతా ద్వారా ఆస్తుల సమాచారం!
అవకాశాలపై నియంత్రణ సంస్థల చర్చలు కోల్‌కతా: వ్యక్తిగత ఆస్తుల సమాచారాన్ని ఒకే ఖాతాలో క్రోడీకరించేందుకు వీలుగా ఆర్థిక వ్యవహారాల నియంత్రణ సంస్థలు ఆర్బీఐ, సెబీ, ఐఆర్డీఏ చేతులు కలిపాయి. తద్వారా ఎవరైనా ఒక వ్యక్తి ఒకే ఖాతా ద్వారా తనకు సంబంధించిన వివిధ ఆస్తుల వివరాలను పొందేందుకు వీలు కల్పించాలని భావిస్తున్నాయి. వెరసి బ్యాంక్ ఖాతాలు, షేర్లు, బాండ్లు, బీమా పథకాలు, మ్యూచువల్ ఫండ్ యూనిట్లు తదితర ఆస్తులను ఒకే ఖాతా ద్వారా క్రోడీకరించే యోచనలో ఉన్నాయి. ఈ దిశలో అంతర్నియంత్రణ సాంకేతిక బృందం(ఐఆర్టీజీ) ఇచ్చిన సూచనమేరకు ఆర్థిక స్థిరీకరణ, అభివృద్ధి మండలి(ఎఫ్ఎస్డీసీ)పై ఏర్పాటైన ఉపకమిటీ గురువారమిక్కడ సమావేశమై చర్చలు నిర్వహించింది. ఉపకమిటీలో సభ్యులైన ఆర్బీఐ, సెబీ, ఐఆర్డీఏ, పీఎఫ్ఆర్డీఏ, ఎఫ్‌ఎంసీల చీఫ్‌లతోపాటు, ఆర్థిక శాఖ ప్రతినిధులు సమావేశానికి హాజరయ్యారు. సమావేశం తరువాత ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ ఒకే ఖాతా ద్వారా వివిధ ఆస్తుల అంశానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఇందుకు ఉన్న అవకాశాలపై తామంతా చర్చించినట్లు తెలిపారు. -
జన బీమా యోజనను ప్రారంభించండి
ముంబై: బీమా పథకాలనూ అందరికీ అందుబాటులోకి తీసుకురావడం, ప్రజల్లో అవగాహన పెంచడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బీమా నియంత్రణ సంస్థ(ఐఆర్డీఏ) పేర్కొంది. బ్యాంకింగ్ సేవల విస్తరణ కోసం ఇటీవలే ప్రారంభించిన జన ధన యోజన మాదిరిగానే ప్రధాన మంత్రి జన బీమా యోజన పథకాన్ని ప్రవేశపెట్టాలని ఐఆర్డీఏ చైర్మన్ టీఎస్ విజయన్ ప్రభుత్వానికి సూచించారు. సోమవారమిక్కడ పారిశ్రామిక మండలి ఫీక్కీ 16వ వార్షిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. ‘బ్యాంకింగ్లాగే బీమా సేవలు కూడా మారుమూలలకు చేరడం లేదు. బీమాపై ప్రజల్లో అవగాహన పెంచడానికి మరిన్ని చర్యలు అవసరం’ అని విజయన్ పేర్కొన్నారు. ఇక బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) పరిమితిని ఇప్పుడున్న 26 శాతం నుంచి 49 శాతానికి పెంచాలన్న పరిశ్రమ డిమాండ్లపై కూడా విజయన్ స్పందించారు. దీనివల్ల పరిశ్రమ వృద్ధి ప్రస్తుత 3.9 శాతం నుంచి 7.2 శాతానికి పెరుగుతుందా అనేది పరిశ్రమే సమాధానం చెప్పాలన్నారు. బీమా రంగంలో అపార వృద్ధి అవకాశాలున్నాయని... అయితే, ఎఫ్‌డీఐల పెంపు వల్ల మొత్తం దేశానికి, అదేవిధంగా పాలసీదారులకు అంతిమంగా ప్రయోజనం దక్కుతుందాలేదా అనేది చూసుకోవాలని విజయన్ అభిప్రాయపడ్డారు. నాన్-లైఫ్ బీమా విభాగంలో కూడా భారీ అవకాశలున్నాయని.. వాహనాల సంఖ్య ఏటా లక్షల్లో పెరుగుతుండటమే దీనికి కారణమని పేర్కొన్నారు. మరోపక్క, ఏజెంట్లకు నెలకు రూ.10 వేల చొప్పున కనీస వేతనాలను ఇవ్వడంతో పాటు పరిశ్రమలో ఉద్యోగావకాలను కల్పించాల్సిందిగా బీమా కంపెనీలను విజయన్ కోరారు. -
ఐసీఐసీఐ లాంబార్డ్‌కు 50 లక్షల జరిమానా
ఐసీఐసీఐ లాంబార్డ్ సాధారణ బీమా సంస్థకు బీమా నియంత్రణ సంస్థ ఐఆర్డీఏ 50 లక్షల జరిమానా విధించింది. 2011, 2012, 2013, 2014 ఆర్థిక సంవత్సరాలలో పలు నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈ జరిమానా విధించారు. ఉత్తర్వులు జారీ అయిన 15 రోజుల్లోగా ఈ జరిమానా మొత్తాన్ని చెల్లించాలని ఐఆర్డీఏ తెలిపింది. తప్పుడు ఎంట్రీలు వేసినందుకు, ఒకే పాలసీకి వేరే్వేరు పత్రాలు చూపినందుకు, ఫైళ్ల నిబంధనలను ఉల్లంఘించడం లాంటి చర్యల కారణంగా ఈ జరిమానా వేశారు. ప్రభుత్వ సెక్యూరిటీలు, ఇతర గ్యారంటీడ్ సెక్యూరిటీలలో కనీసం 30 శాతం పెట్టుబడి పెట్టాల్సి ఉండగా, 2009 ఫిబ్రవరి 13 నాటికి కేవలం 28.87 శాతం మాత్రమే ఉన్నాయి. అలాగే క్లెయిముల పరిష్కారం విషయంలో కూడా ఆలస్యం చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. -
బీమాపై అన్ని రంగాలవారికీ ఆసక్తి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయ బీమా రంగంలో అపారమైన అవకాశాలున్నాయని, వ్యాపార విస్తరణకు, మూలధనం పెంపునకు ఎటువంటి సంబంధం లేదని బీమా నియంత్రణ అభివృద్ధి మండలి(ఐఆర్డీఏ) చైర్మన్ టి.ఎస్ విజయన్ అన్నారు. మూల ధనం పెంచుకున్నంత మాత్రాన పెరుగుతుందని లేదని, చాలా కాలంపాటు ఎల్ఐసీ కేవలం రూ. 5 కోట్ల మూలధనంతోనే వ్యాపారం భారీ వ్యాపారం నమోదు చేసిందన్న విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు. బీమా రంగంలో ఎఫ్‌డీఐల వాటాను 49 శాతానికి పెంచిన విషయంపై ఆయన మాట్లాడుతూ ఎంతో కీలకమైన రక్షణరంగంలోనే ఎఫ్‌డీఐలకు అనుమతించినా అంతగా పట్టించుకోని వారు సైతం బీమా రంగంలో ఎఫ్‌డీఐ పెంపుపై మాత్రం అమితాసక్తిని చూపిస్తున్నారన్నారు. ఈ రంగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి మూల ధనం పెంచుకోవడం కన్నా సరైన మార్కెటింగ్, నిపుణులైన సిబ్బంది అవసరం అని విజయన్ పేర్కొన్నారు. నాలుగేళ్లుగా బీమా రంగం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నా, ఈ రంగంలో పెట్టుబడులు చేసేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారని ఆయన చెప్పారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్సూరెన్స్ అండ్ రిస్క్‌మేనేజ్‌మెంట్(ఐఐఆర్ఎం) తొమ్మిదవ స్నాతకోత్సవంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న విజయన్ మాట్లాడుతూ జన ధన యోజన పథకం విజయవంతం కావడానికి ఉచిత బీమా ఆఫరు కూడా ఒక కారణమన్నారు. అందరికీ ఒకే రకమైన పథకాలు కాకుండా ఎవరి అవసరాలకు అనుగుణంగా వారికోసం ప్రత్యేక పథకాలను రూపొం దించినప్పుడే విజయం సాధిం చగలరని, ఈ అంశంపై బీమా కంపెనీలు దృష్టిసారించాలని కోరారు. ఈ సందర్భంగా కలిసిన విలేకరులతో మాట్లాడుతూ ఈ ఏడాది తొలి త్రైమాసికంలో జీవిత బీమా వ్యాపారంలో 15% వృద్ధి నమోదైందని, రానున్న కాలంలోనూ ఇదే విధమైన వృద్ధి కొనసాగగలదన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్(ఎన్ఎస్ఈ) ఎండీ,సీఈవో చిత్రా రామకృష్ణ మాట్లాడుతూ బీమా సాంద్రత, అధిక జనాభా వంటి అన్ని గణాంకాలు ఈ రంగ వృద్ధికి అనుకూలంగానే ఉన్నాయన్నారు. ఐఐఆర్ఎం డిప్లొమో కోర్సుల్లో అత్యధిక మార్కులు పొందిన సౌమ్య కుప్పిలి, ఆర్. చారులతలకు చిత్రా రామకృష్ణ, విజయన్ చేతుల మీదుగా గోల్డ్ మెడల్స్‌తో పాటు లక్ష రూపాయల అవార్డును అందచేశారు. -
కుటుంబానికి ధీమా.. జీవిత బీమా
జీవిత బీమా పాలసీలను ఇతర ఆర్థిక సాధనాలతో పోలుస్తూ తరచుగా పేపర్లలోనూ, మ్యాగజైన్లలోనూ మనకు కథనాలు కనిపిస్తుంటాయి. బీమా పాలసీ తీసుకునేందుకు పెట్టే పెట్టుబడిపై ఎంత వస్తుంది, అదే ఇతర సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తే ఎంత రాబడి వస్తుందీ లాంటి అంశాలను కూడా కొన్ని కథనాల్లో విశ్లేషిస్తుంటారు. అయితే, ఈ క్రమంలో బీమా పాలసీల ప్రధానోద్దేశాన్ని విస్మరిస్తుంటారు. పాలసీదారు ఉన్నా లేకపోయినా.. వారి కుటుంబాలకు ఆర్థికంగా ఎటువంటి సమస్యలు లేకుండా భరోసా కల్పించేది బీమా పాలసీ అన్నది తెలుసుకోరు. మనం ఎంతగానో ప్రేమించే కుటుంబ సభ్యులు ఆర్థికంగా ఎలాంటి కష్టాలు పడకూడదని మనం జీవితాంతం శ్రమిస్తుంటాం. మనం ఉన్నా లేకున్నా వారు ఇబ్బందిపడకుండా సాధ్యమైనంత నిధిని వారికి అందించాలని తాపత్రయపడతాం. కనుక, పాలసీదారు లేకపోయినా.. రుణ బకాయిలు మొదలుకుని ఇతరత్రా వ్యయాల దాకా ఏదీ కూడా భారం కాకుండా కుటుంబసభ్యులను ఆదుకోగలిగే శక్తిమంతమైన సాధనాలు జీవిత బీమా పాలసీలు. కనుక, వీటిపై ఇన్వెస్ట్ చేసే ప్రతి పైసా ఎంతో ఉపయోగకరమైనదే. ఆర్థిక లక్ష్యాలపై స్పష్టమైన అవగాహనతో ఇన్వెస్ట్ చేస్తే జీవిత బీమా పాలసీలకోసం వెచ్చించేది కచ్చితంగా వివేకవంతమైన పెట్టుబడే. బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్డీఏ తీసుకుంటున్న చర్యలతో గతంతో పోలిస్తే బీమా పాలసీల ప్రీమియంలు ప్రస్తుతం గణనీయంగా తగ్గాయి. అందుబాటు ప్రీమియంలతో పాలసీలు లభిస్తున్నాయి. సంప్రదాయ బీమా పథకాలు మరింత అధిక డెత్ కవరేజీ ఇచ్చేలా ఈ మధ్యే నిబంధనలు కూడా మారాయి. ఈ నేపథ్యంలో కొంచెం జాగ్రత్తగా సరైన పథకాన్ని ఎంచుకోగలిగితే నిశ్చింతగా రిటైర్ అయ్యేందుకు, కుటుంబానికి ఆర్థికపరమైన భరోసానిచ్చేందుకు బీమా పాలసీలు తోడ్పడగలవు. అదనపు ధీమా కోసం వివిధ రకాల రైడర్లు కూడా కావాలంటే వీటికి జతగా తీసుకోవచ్చు. -
బీమా నచ్చకుంటే మారిపోండి!
పోర్టబిలిటీతో పలు లాభాలు రెండేళ్ల క్రితం... ఆరోగ్య బీమా ప్లాన్ తీసుకున్నాక అది నచ్చకపోతే సొమ్మో, ప్రయోజనాలో నష్టపోకుండా దాన్నుంచి బయటపడే మార్గం ఉండేది కాదు. ఇప్పుడా పరిస్థితి లేదు. పాలసీదారుల ప్రయోజనాల పరిరక్షణ కోసం ఆరోగ్య బీమా పోర్టబిలిటీని బీమా రెగ్యులేటర్ ఐఆర్డీఏ అమల్లోకి తెచ్చింది. దీంతో... ప్రయోజనాలను కోల్పోనవసరం లేకుండానే ఒక బీమా కంపెనీ నుంచి మరో కంపెనీకి మారే స్వేచ్ఛ పాలసీదారులకు లభించింది. ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మారడమే కాకుండా ఒకే కంపెనీలోని ఒక ప్లాన్ నుంచి మరో ప్లాన్‌కు మారే వెసులుబాటు కూడా దక్కింది. పోర్టబిలిటీ ద్వారా ఖాతాదారులకు సమకూరిన హక్కులేంటంటే... 1) జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ, స్పెషలైజ్డ్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీల్లో దేని నుంచి దేనికైనా పాలసీలను మార్చుకోవచ్చు. 2) వ్యక్తిగత పాలసీలతో పాటు కుటుంబ పాలసీలకు వర్తిస్తుంది. అయితే ఇలా ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మారినపుడు, పాలసీ తీసుకున్నపుడు ఉండే 30 రోజుల వెయిటింగ్ పీరియడ్‌ను రద్దు చేస్తారు. దీనికి తోడు కొత్త కంపెనీలో బీమా చేసిన మొత్తం ఇంతకుముందు కంపెనీలో చేసిన మొత్తం కంటే తక్కువ ఉండకూడదు. చేయాల్సిందేమిటంటే... ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మారే ముందు అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. కంపెనీని మార్చినపుడు కొత్త పాలసీదారు మాదిరిగానే అండర్‌రైటింగ్ ప్రక్రియలన్నీ పూర్తిచేయాలి. అండర్‌రైటింగ్ మార్గదర్శకాల ప్రకారం ఏ పాలసీనైనా తిరస్కరించే అధికారం కొత్త కంపెనీకి ఉంది. ఆరోగ్య బీమా పాలసీ పోర్టబిలిటీ తీసుకున్నప్పటికీ మునుపటి ప్రయోజనాలన్నీ కొనసాగుతాయి. పోర్టబిలిటీ అంటే పాలసీని మధ్యలో ఆపేయడం కాదు, కొనసాగించడమే. అంతకుముందు ఉన్న వ్యాధులకు బీమా కవరేజీని నష్టపోవాల్సిన అవసరం లేదు. కొత్త కంపెనీల్లో ప్రీమియం చార్జీలు తక్కువగా ఉండడం, పాలసీదారులకు మరింత మెరుగైన సేవలు అందడం, కొత్త ప్లానులు అందుబాటులోకి రావడం, మరింత పారదర్శకత వంటి అదనపు ప్రయోజనాలు పోర్టబిలిటీ ద్వారా సమకూరుతాయి. ప్రీమియం, బెనిఫిట్ల పరంగా తమకు అనుకూలమైన కొత్త ప్లాన్‌ను పాలసీదారులు ఎంచుకోగలుగుతారు. పోర్టబిలిటీని వినియోగించుకునే ముందు, ప్రస్తుత పాలసీతో పొందుతున్న ప్రయోజనాలను తాము మారదలుచుకున్న ప్లాన్‌తో వచ్చే లాభాలతో పోల్చిచూసుకోవడం ఎంతైనా అవసరం. సదరు ప్లాన్‌లోని ఫ్లెక్సిబిలిటీ, ధర, గరిష్ట వయోపరిమితి, వెయిటింగ్ పీరియడ్, వ్యాధుల కవరేజీ, పాలసీ తీసుకోవడానికి ముందునుంచే ఉన్న వ్యాధులకు సంబంధించిన నిబంధనలు, హాస్పిటల్ నెట్వర్క్ తదితర అంశాలను పరిశీలించడం ముఖ్యం. -
ఎల్ఐసీకి షోకాజ్ నోటీసులు
జీవిత బీమా సంస్థ ఎల్ఐసీకి షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. వినియోగదారులకు తప్పుడు సమాచారం ఇచ్చారంటూ ఎల్ఐసీకి బీమా నియంత్రణ సంస్థ (ఐఆర్డీఏ) నోటీసులు జారీచేసింది. జీవన్ ఆనంద్, జీవన్ తరంగ్, బీమా బచత్ లాంటి మొత్తం 34 ఉత్పత్తులను జనవరి 1 తర్వాత ఎల్ఐసీ మార్కెట్ నుంచి ఉపసంహరించుకుంది. కానీ, డిసెంబర్ నెలలోనే ఇందుకు సంబంధించిన ప్రకటనలను జారీచేసి, వినియోగదారులను తప్పుదోవ పట్టించింది. దీంతో ఎల్ఐసీని తప్పుపడుతూ ఐఆర్డీఏ షోకాజ్ నోటీసులు జారీచేసింది. -
అన్ని అవసరాలకు ఒకే పాలసీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రజల కనీస బీమా అవసరాలను తీర్చుకోవడానికి ఇప్పుడున్న బహుళ పథకాల విధానం దేశీయ బీమా వృద్ధికి ప్రతిబంధకంగా ఉందని, ఇలా కాకుండా కనీస అవసరాలన్నీ తీర్చేవిధంగా ఒకే పథకాన్ని తీసుకురావల్సిన అవసరం ఉందని ఐఆర్డీఏ ప్రకటించింది. జీవిత బీమా, ఆరోగ్యం, వాహనం, అగ్ని ప్రమాదం ఇలా విభిన్న అవసరాల కోసం విడివిడిగా పాలసీలను తీసుకోవాల్సి వస్తోందని, ఇది బీమా విస్తరణకు ప్రధాన అడ్డంకిగా ఉందని బీమా అభివృద్ధి నియంత్రణ మండలి (ఐఆర్డీఏ) చైర్మన్ టి.ఎస్.విజయన్ తెలిపారు. అసోచామ్ బుధవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఏడవ అంతర్జాతీయ బీమా సదస్సులో పాల్గొన్న ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలసీదారుల అవసరాలకు తగ్గట్టుగా ఎంపిక చేసుకునేలా జీవిత, సాధారణ బీమా పథకాలను కలిపి ఒకే పథకం కింద అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న రాష్ట్ర గవర్నర్ నరసింహన్ మాట్లాడుతూ ప్రస్తుతం బీమా రంగంలో ఉన్న పోకడలను సునిశితంగా విమర్శించారు. కంపెనీలు పథకాలను విక్రయించేటప్పుడు పాలసీదారులపై చూపిస్తున్న ప్రేమ క్లెయింలు వచ్చినప్పుడు ఉండటం లేదని, దీనిపై ఐఆర్డీఏ దృష్టిసారించాలన్నారు. వైద్య, పంటల, సాధారణ బీమా రంగాల్లో సామాన్యులకు కూడా అర్థమయ్యే విధంగా సులభమైన పాలసీలను అందించాల్సిన బాధ్యత కంపెనీలపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బీమా, బ్యాంకింగ్ రంగానికి చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. -
క్లెయిమ్‌ల పరిష్కారంలో ఎల్ఐసీ భేష్: ఐఆర్డీఏ
న్యూఢిల్లీ: ప్రైవేటు బీమా కంపెనీలతో పోల్చితే ‘డెత్ క్లెయిమ్’ల విషయంలో జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) పనితీరు అత్యుత్తమంగా ఉందని ఈ రంగ నియంత్రణ సంస్థ- ఐఆర్డీఏ తన వార్షిక నివేదికలో పేర్కొంది. గణాంకాల ప్రకారం ముఖ్యాంశాలు... గతేడాది (2012-13)లో ఎల్ఐసీ క్లెయిమ్‌ల పరిష్కార నిష్పత్తి 97.73%. 2011-12లో ఈ నిష్పత్తి 97.42%. అయితే ప్రైవేటు బీమా సంస్థల విషయంలో ఈ రేట్లు వరుసగా 88.65%, 89.34%గా ఉన్నాయి. ఏడాది ముగింపునాటికి ప్రైవేటు బీమా కంపెనీల వద్ద పెండింగులో ఉన్న (పరిష్కరించాల్సిన) క్లెయిమ్‌లు 3.47శాతం. ఎల్ఐసీ విషయంలో ఈ రేటు 1.04 శాతం. 2012-13లో జీవిత బీమా పరిశ్రమల ప్రీమియం ఆదాయం రూ.2.87 లక్షల కోట్లు. అంతక్రితం ఏడాదితో పోల్చితే ఇది 0.05% అధికం. ప్రీమియం వసూళ్ల విషయంలో ప్రైవేటు రంగంలో 2012-13లో (2011-12తో పోల్చి) అసలు వృద్ధిలేకపోగా 6.87% క్షీణత నమోదయ్యింది. అయితే ఈ విషయంలో ఎల్ఐసీ 2.92% వృద్ధిని సాధించింది. -
వృద్ధిబాటలో జీవిత బీమా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మూడేళ్ళ విరామం తర్వాత ఈ ఏడాది జీవిత బీమా పరిశ్రమలో వృద్ధి నమోదవుతుందని బీమా నియంత్రణ, అభివృద్ధి మండలి (ఐఆర్డీఏ) ఆశాభావం వ్యక్తం చేసింది. ప్రస్తుత సంవత్సరం తొలి ఆరు నెలల కాలంలో జీవిత బీమా వ్యాపారంలో వృద్ధి కనిపించిందని, మలి రెండు త్రైమాసికాల్లో ఇదే విధమైన వృద్ధి నమోదవుతుందన్న విశ్వాసాన్ని ఐఆర్డీఏ చైర్మన్ టి.ఎస్.విజయన్ వ్యక్తం చేశారు. ఐఆర్డీఏ అనుబంధ సంస్థ ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా (ఐఐబీ) కొత్త కార్యాలయాన్ని సోమవారం ప్రారంభించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ ఏడాది జీవిత బీమాలో పది శాతం లోపు, సాధారణ బీమాలో 16 నుంచి 17 శాతం వృద్ధిని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ఈ ఏడాది మొత్తం మీద జీవిత, సాధారణ బీమా వ్యాపార పరిమాణం రూ. 4 లక్షల కోట్లు దాటుతుందన్నారు. గతంలో కొత్త పథకాలను ఆమోదించడానికి మూడు నెలలకు పైగా సమయం పట్టేదని, ఐఐబీ సమాచారం అందుబాటులోకి వస్తే ఈ సమయం మరింత తగ్గుతుందన్నారు. ఇతర దేశాలకు అనుగుణంగానే దేశంలో జీవిత బీమా సాంద్రత ఉన్నప్పటికీ ఇంకా వ్యాపారం విస్తరించడానికి అవకాశాలు ఉన్నాయన్నారు. జీవిత బీమా సమాచారం కూడా సేకరిస్తాం ప్రస్తుతం వాహన, ఆరోగ్య బీమాలతో పాటు ఇతర సాధారణ బీమా పథకాల సమాచారాన్ని సేకరిస్తున్నామని, త్వరలోనే జీవిత బీమాకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఐఐబీ సీఈవో ఆర్.రాఘవన్ తెలిపారు. పాలసీదారులకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఈ సమాచారంతో బీమా కంపెనీలు, ఐఆర్డీఏ కొత్త పథకాలు, నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగపడుతుందన్నారు. ఇప్పటికే మోటార్ ఇన్సూరెన్స్‌లో వీసేవాను ప్రవేశపెట్టామని, అలాగే హాస్పిటల్స్ అన్నింటికి ఏకీకృత సంఖ్యను ఇస్తూ పెలైట్ ప్రాజెక్టును మొదలు పెట్టినట్లు రాఘవన్ తెలిపారు. -
హెచ్ఐవీ రోగులకు అధిక బీమా ప్రీమియం: ఐఆర్డీఏ
న్యూఢిల్లీ: హెచ్ఐవీ/ఎయిడ్స్ రోగులు అధిక జీవిత బీమా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుందని నియంత్రణ సంస్థ ఐఆర్డీఏ స్పష్టం చేసింది. బీమా పథకం తీసుకొనేటప్పుడు ఇతర వ్యాధులు ఏవైనా ఉన్నా అధిక ప్రీమియం చెల్లింపు వర్తిస్తుందని ఐఆర్డీఐ చైర్మన్ టీఎస్ విజయన్ శుక్రవారం స్పష్టంచేశారు. బీమా ప్రొడక్ట్‌లు కొనేటప్పటికే వ్యాధులు ఏమైనా ఉన్నా, బీమా కంపెనీలు లైఫ్ కవర్ సదుపాయాన్ని అందిస్తాయని అయితే వాణిజ్యపరమైన గిట్టుబాటుకు వీలుగా తగిన ప్రీమియంను చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఇక్కడ జరిగిన ఫిక్కీ కార్యక్రమంలో పాల్గొన్న విజయన్ ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. హెచ్ఐవీ/ఎయిడ్స్ రోగులకు కొన్ని బీమా కంపెనీలు ఇప్పటికే బీమా కవరేజ్‌లు కల్పిస్తున్నాయని, మరిన్ని కంపెనీలు సైతం ఈ దశలో ముందుకు వస్తాయని తాను భావిస్తున్నానని అన్నారు. హెచ్ఐవీ/ఎయిడ్స్ రోగులను జీవిత బీమా కవర్లోకి తీసుకురావడంసహా పలు అంశాలపై అక్టోబర్‌లో ఐఆర్డీఏ ముసాయిదా మార్గదర్శకాలను ఆవిష్కరించింది. వీటిపై డిసెంబర్‌లోపు సంబంధిత వర్గాలు సూచనలు, సలహాలూ ఇవ్వాల్సి ఉంటుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచీ ఈ తాజా మార్గదర్శకాలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. -
ఎయిడ్స్ రోగులకూ బీమా పాలసీలు!
న్యూఢిల్లీ: హెచ్ఐవీ/ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల (పీఎల్హెచ్ఏ) కోసం కూడా బీమా కవరేజి లభించేలా చూడాలని జీవిత బీమా సంస్థలను బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్డీఏ ఆదేశించింది. ఇందుకోసం తగిన పాలసీలను రూపొందించాలంటూ ఇటీవల సర్క్యులర్ జారీ చేసింది. నిబంధనలను బట్టి అర్హత ఉన్న ఏ ఒక్క పీఎల్హెచ్ఏకి కూడా బీమా కవరేజిని నిరాకరించరాదంటూ ఐఆర్డీఏ పేర్కొంది. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి నమో నారాయణ్ మీనా..లోక్‌సభకి ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో ఈ విషయాలు వివ రించారు. సర్క్యులర్ ప్రకారం.. పాలసీ తీసుకునే సమయంలో పాలసీదారుకి హెచ్ఐవీ లేకున్నా .. ఆ తర్వాత అది సంక్రమించిన పక్షంలో క్లెయిమ్‌లను నిరాకరించరాదు. బీమా సంస్థల నుంచి ఈ ప్రతిపాదనలపై ఐఆర్డీఏ అభిప్రాయాలు ఆహ్వానించింది. -
పాత బీమా పాలసీలకు గడువు పొడిగించం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుతమున్న జీవిత బీమా పాలసీలను విక్రయించడానికి డిసెంబర్ 31 వరకు మాత్రమే అనుమతిస్తామని, వచ్చే జనవరి 1 నుంచి కొత్త మార్గదర్శకాలతో కూడిన పాలసీలనే విక్రయించాల్సి ఉంటుందని నియంత్రణ సంస్థ ఐఆర్డీఏ స్పష్టం చేసింది. కొత్త మార్గదర్శకాలకు అనుగుణంగా పథకాలను విక్రయించడానికి అన్ని బీమా కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని, ఈ గడువును ఇక పెంచేది లేదని ఐఆర్డీఏ మెంబర్ (లైఫ్) సుధీన్ రాయ్ చౌదరి తెలిపారు. కొత్త మార్గదర్శకాలకు అనుగుణంగా సుమారు 460 కొత్త పథకాలు అనుమతి కోసం రాగా ఇప్పటికే 400 పథకాలకు ఓకే చెప్పినట్లు ఆయన తెలిపారు. తొలుత అక్టోబర్ 1లోపు పాత పథకాల స్థానే కొత్త మార్గదర్శకాలతో కూడిన ప్రోడక్టులను ప్రవేశపెట్టాలని ఐఆర్డీఏ నిబంధన విధించినా, బీమా కంపెనీల కోరిక మేరకు ఈ గడువును డిసెంబర్ 31 వరకు పెంచుతూ ఐఆర్డీఏ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే పాలసీదారులకు అధిక బీమా రక్షణతో పాటు, పాలసీలను మధ్యలో ఆపేస్తే వచ్చే సరెండర్ వేల్యూ కూడా పెరుగుతుంది. గురువారం హైదరాబాద్‌లో జరిగిన ఐఐఆర్ఎం-ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఏడవ గ్రాడ్యుయేషన్ వేడుకలో పాల్గొన్న చౌదరి మాట్లాడుతూ మూడేళ్ల తర్వాత జీవిత బీమా రంగం తిరిగి ఈ ఏడాది వృద్ధిని నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఐఐఆర్ఎం మేనేజింగ్ డెరైక్టర్ టి.నరసింహారావు, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఎండీ, సీఈవో సందీప్ బక్షి తదితరులు పాల్గొన్నారు. -
ఎయిడ్స్ రోగులకు శుభవార్త
ముంబై: ఎయిడ్స్ ఉన్న వారి ఇన్సూరెన్స్ క్లయిమ్‌లను తిరస్కరించకూడాదని బీమా కంపెనీలకు ఐఆర్డిఏ సూచించింది. పాలసీ తీసుకునే సమయానికి హెచ్ఐవి బాధితులు కాకపోతే అలాంటి వ్యక్తుల క్లయిమ్‌లను తిరస్కరించడం సమంజసం కాదని ఈ సంస్థ అభిప్రాయపడింది. ఐఆర్డిఏ అనేది మన దేశంలో ఇన్సూరెన్స్ రంగాన్ని నియంత్రించడం కోసం ఉద్దేశించింది. పాలసీ తీసుకున్నాక హెచ్ఐవి వస్తే దాన్ని కూడా ఒక తీవ్రమైన వ్యాధిగా గుర్తించాలని బీమా నియంత్రణ సంస్థ తెలిపింది. పాలసీ ప్రకారం ఏకమొత్తంగా గానీ లేదా విడతల వారీగా కానీ క్లయిమ్‌లు చెల్లించాలని తెలిపింది. ఎయిడ్స్ రోగులకు, వారి బంధువులకు ఇది శుభవార్తే గదా. -
4 లక్షల కోట్లకు బీమా వ్యాపారం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయ బీమా వ్యాపార పరిమాణం రూ. నాలుగు లక్షల కోట్లకు చేరుకుంటుందని బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్డీఏ అంచనా వేస్తోంది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో దేశీయ బీమా వ్యాపారం (జీవిత, సాధారణ) పరిమాణం రూ.3.75 లక్షల కోట్లుగా ఉంది. ఈ సంవత్సరం బీమా వ్యాపారంలో వృద్ధిని ఆశిస్తున్నామని, దీంతో ఈ సంఖ్య రూ. నాలుగు లక్షల కోట్లకు చేరుకుంటుందన్న ఆశాభావాన్ని ఐఆర్డీఏ చైర్మన్ టి.ఎస్.విజయన్ వ్యక్తం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్సూరెన్స్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ (ఐఐఆర్ఎం) స్నాతకోత్సవానికి విజయన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తనను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడుతూ పాత జీవిత బీమా పథకాలను ఉపసంహరించుకోవడానికి డిసెంబర్ వరకు గడువిచ్చినట్లు తెలిపారు. కొత్త మార్గదర్శకాలతో రూపొందించిన పథకాలను వేగంగా ఆమోదిస్తున్నామని, ఇప్పటివరకు 450 పథకాలు అనుమతుల కోసం రాగా ఇప్పటికే 300 పథకాలకు అనుమతులను జారీ చేసినట్లు తెలిపారు. బీమా పథకాల్లో డీ-మ్యాట్‌ను తప్పనిసరి చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి పీ చిదంబరం చేసిన సూచనపై ఆయన స్పందిస్తూ ప్రస్తుత పరిస్థితుల్లో దీన్ని తప్పనిసరి చేయలేమని, దీనికి ఇంకా సమయం పడుతుందన్నారు. పాలసీల విక్రయంలో బ్యాంకులను ఏజెంట్లుగా ఒక కంపెనీకి చెందిన పథకాలనే విక్రయించే విధంగా కాకుండా బ్రోకర్ వలే అన్ని కంపెనీల పథకాలనూ విక్రయించడం వంటి సంస్కరణలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది 15 నుంచి 20 మంది ఆఫీసర్లను నియమించుకోనున్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. -
బీమాకూ ఆన్లైన్ ఖాతా
హైదరాబాద్‌లోనే పుట్టిపెరిగిన రాఘవకి ఇప్పుడు ఉద్యోగరీత్యా వైజాగ్‌కి బదిలీ అయ్యింది. అక్కడికి వెళ్ళి స్థిరపడిన తర్వాత తీసుకున్న వివిధ బీమా కంపెనీ పథకాల్లో చిరునామా మార్పించుకునే సరికి తలప్రాణం తోకకొచ్చింది. ఇక నుంచి ఇటువంటి ఇబ్బందులు అక్కర్లేదు అంటోంది నియంత్రణ సంస్థ ఐఆర్డీఏ. ఒక్కసారి ఎలక్ట్రానిక్ ఇన్సూరెన్స్ అకౌంట్ ప్రారంభించి అందులో చిరునామా మార్పించుకుంటే మీ దగ్గర పది బీమా కంపెనీల పాలసీలున్నా వాటన్నింటిలోనూ చిరునామా మారిపోతుంది. ఇలా బహుళ ప్రయోజనాలను అందించే ఈ-పాలసీల గురించి సమగ్ర సమాచారమే ఈ వారం ప్రాఫిట్ ముఖ్య కథనం.. షేర్లను కాగితరహిత రూపంలో ఎలక్ట్రానిక్ విధానంలో భద్రపర్చుకోవడానికి డీమ్యాట్ అకౌంట్ ఎలా ఉందో ఇప్పుడు బీమా పథకాలను దాచుకోవడానికి కొత్త విధానం అమల్లోకి వచ్చింది. అదే రిపాజిటరీ సర్వీస్ లేదా ఈ-పాలసీలు. ఇప్పటికే తీసుకున్న పాలసీల దగ్గర నుంచి కొత్తగా తీసుకోబోయే పాలసీల వరకు అన్నీ ఎలక్ట్రానిక్ రూపంలో అంటే డీమ్యాట్ తరహాలో భద్రపర్చుకోవచ్చు. ప్రస్తుతానికి కేవలం జీవిత బీమా కంపెనీలకు అది కూడా మీకు ఎలక్ట్రానిక్ రూపంలో లేక ఫిజికల్ (కాగితం) రూపంలో తీసుకునే అవకాశాన్ని ఐఆర్డీఏ కల్పించింది. ఎలక్ట్రానిక్ రూపంలో పాలసీలను తీసుకుంటే ప్రయోజనాలు ఏంటి? ఈ-పాలసీలు ఏవిధంగా తీసుకోవాలి? పాత పాలసీలను ఈ-పాలసీలుగా ఎలా మార్చుకోవాలన్న అన్న అంశాలను ఇప్పుడు పరిశీలిద్దాం... ప్రయోజనాలు ఒకటి కంటే ఎక్కువ కంపెనీల పాల సీలు ఉన్నప్పటికీ వాటన్నింటినీ ఒకే అకౌంట్లో భద్రపర్చుకునే అవకాశం ఈ-పాలసీ ద్వారా కలుగుతుంది. ఎలక్ట్రానిక్ అకౌంట్ ద్వారానే పాలసీల ప్రీమియంలు చెల్లించవచ్చు. అలాగే చిరునామా మారినా లేక ఏ ఇతర వివరాల్లో మార్పులు చేయాలన్నా ప్రతీ బీమా కంపెనీకి తిరగనవసరం లేకుండా కేవలం ఈ-అకౌంట్లో ఆ వివరాలను అందిస్తే ఆటోమేటిక్‌గా మిగిలిన పాలసీల్లో కూడా మారిపోతాయి. ఒక్కసారి ఎలక్ట్రానిక్ ఇన్సూరెన్స్ అకౌంట్ నంబర్‌ను కలిగి ఉంటే పాలసీ తీసుకున్న ప్రతీ సందర్భంలోనూ ‘నో యువర్ క్లయింట్’ (కేవైసీ) నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉండదు. అంటే ఒకసారి ఆన్లైన్ అకౌంట్ తెరిస్తే పాలసీ తీసుకునేటప్పుడు అడిగే నివాస ధ్రువీకరణ, ఆదాయధ్రువీకరణ, వ్యక్తిగత ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాల్సిన తలనొప్పులు పోతాయి. ఒక విధంగా చెప్పాలంటే ఒకేచోట బీమాకు సంబంధించిన అన్ని సేవలనూ పొందొచ్చన్నమాట. వీటన్నింటికంటే ముఖ్యమైనది డాక్యుమెంట్లు పోతాయన్న భయం ఉండదు. మొన్న ఉత్తరాఖండ్ వరదల్లో ఇళ్లకుఇళ్లే కొట్టుకుపోవడంతో బీమా క్లెయిమ్ చేసుకుందామంటే కాగితాలు కూడా లేకుండా పోయాయి. అదే ఈ-అకౌంట్ ఉంటే ఇలాంటి ఇబ్బందులకు ఆస్కారం ఉండదు. అందుకు ఈ-అకౌంట్ ప్రారంభించేటప్పుడే తదనంతరం ఈ-అకౌంట్ వివరాలను చూడటానికి, నిర్వహించడానికి ఎవరికి అనుమతించవచ్చని ముందే అడుగుతారు. అంటే ఒక విధంగా నామినీ కిందన్న మాట. ఇక్కడ ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్ అంటారు. అకౌంట్ హోల్డర్‌కి జరగరానిది ఏమైనా జరిగితే ఈ అకౌంట్‌పై హక్కులు ఆ వ్యక్తికి బదలాయించబడతాయి. ఈ-ఇన్సూరెన్స్ అకౌంట్ కావాలి... ఈ ప్రయోజనాలన్నీ పొందాలంటే ముందుగా మీకు ఈ- ఇన్సూరెన్స్ అకౌంట్ ఉండాలి. ఇందుకోసం ఐఆర్డీఏ ఐదు ఇన్సూరెన్స్ రిపాజిటరీ సంస్థలకు అనుమతి ఇచ్చింది. ఈ ఐదు సంస్థల్లో ఏదో ఒక దాంట్లో అకౌంట్ ప్రారంభించవచ్చు. బీమా కంపెనీలు ఈ రిపాజిటరీ సంస్థలతో నేరుగా ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. ఆ విధంగా మీ బీమా కంపెనీ ఎంచుకున్న రిపాజిటరీ సంస్థ నుంచి కాని లేదా మీకు నచ్చిన రిపాజిటరీ సంస్థ నుంచైనా అకౌంట్‌ను ప్రారంభించవచ్చు. కాని ఈ అకౌంట్ ప్రారంభించాలంటే మాత్రం పాన్‌కార్డు కాని ఆధార్ కార్డు కాని తప్పనిసరిగా ఉండాలి. అకౌంట్‌ను ప్రారంభించాలంటే ముందుగా మీకు నచ్చిన రిపాజిటరీ సంస్థ లేదా బీమా కంపెనీకి చెందిన వెబ్సైట్ నుంచి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. లేకపోతే మీ దగ్గరలోని రిపాజిటరీ కార్యాలయం లేదా బీమా ఏజెంట్ దగ్గర నుంచైనా వీటిని పొందవచ్చు. ఈ అప్లికేషన్‌ను పూర్తి చేసి వీటితోపాటు, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, ఐడీ ప్రూఫ్, నివాస ధ్రువపత్రం, పాన్ కార్డు లేదా ఆధార్‌కార్డు కాపీలను ఇవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ పరిశీలించిన తర్వాత ఏడు పనిదినాల్లోగా రిపాజిటరీ సంస్థ యూనిక్ ఈ-ఇన్సూరెన్స్ అకౌంట్ నెంబర్‌ను ఇవ్వడం జరుగుతుంది. తదుపరి లావాదేవీలు నిర్వహించేటప్పుడు ఈ-నంబర్‌ను కోట్ చేయాల్సి ఉంటుంది. దీంతోపాటు ఆన్లైన్లో అకౌంట్ నిర్వహించుకోవడానికి యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ను కూడా కేటాయించడం జరుగుతుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఒక వ్యక్తి కేవలం ఒక ఈ-ఇన్సూరెన్స్ అకౌంట్‌ను మాత్రమే కలిగి ఉంటాడు. అంటే ఐదు రిపాజిటరీ సం స్థల్లో కేవలం ఒకదాం ట్లోనే అకౌంట్‌ను తెరవగలడు. ఒక దాంట్లో అకౌంట్ తెరిచిన తర్వాత మిగిలిన రిపాజిటరీలు అకౌంట్‌ను తెరవడానికి దరఖాస్తు చేస్తే తిరస్కరిస్తాయి. ఈ-అకౌంట్‌తోనే మిగిలిన అన్ని బీమా లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ-అకౌంట్ ప్రారంభించడానికి ఎలాంటి రుసుములు చెల్లించనవసరం లేదు. పాత పాలసీలు మార్చుకోవాలంటే.. మీరు అకౌంట్ తెరిచిన రిపాజిటరీ సంస్థలోనే కాగితం రూపంలో ఉన్న పాత పథకాలను ఈ-పాలసీలుగా మార్చుకోవడానికి ఒక ప్రత్యేక అప్లికేషన్ ఉంటుంది. దీన్ని డౌన్లోడ్ చేసుకుని అందులో మీ యునిక్ ఈ-ఇన్సూరెన్స్ అకౌంట్ నంబర్‌తోపాటు మీ దగ్గర ఉన్న వివిధ బీమా పథకాల పాలసీ నెంబర్లు పొందుపర్చి దాఖలు చేస్తే పాత పాలసీలన్నీ కూడా ఈ-పాలసీలుగా మారిపోతాయి. లేకపోతే మీ బీమా కంపెనీకి యునిక్ ఈ-ఇన్సూరెన్స్ నంబర్‌ను తెలియచేస్తూ, పాలసీలన్నింటినీ ఈ-అకౌంట్లోకి మార్చమని దరఖాస్తు చేసుకున్నా చాలు. ఇలా మార్చిన దానికి కూడా ఎటువంటి రుసుము చెల్లించనక్కర్లేదు. దీనికయ్యే ఖర్చులన్నీ ఆయా బీమా కంపెనీలే భరిస్తాయి. ఇన్సూరెన్స్ రిపాజిటరీ సంస్థలు కార్వీ ఇన్సూరెన్స్ రిపాజిటరీ ఎన్ఎస్డీఎల్ డేటాబేస్ మేనేజ్మెంట్ ఎస్‌హెచ్‌సీఐఎల్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ కామ్స్ రిపాజిటరీ సర్వీసెస్ సెంట్రల్ ఇన్సూరెన్స్ రిపాజిటరీ - సాక్షి పర్సనల్ ఫైనాన్స్ విభాగం -
బీమా పాలసీలకూ డీ-మ్యాట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జీవిత బీమాతో పాటు ఆరోగ్య, వాహన బీమాలనూ ఎలక్ట్రానిక్ రూపంలో జారీ చేయాలని, దీనికి సంబంధించి నిర్దిష్ట కాలపరిమితిని ప్రకటించాలని ఐఆర్‌డీఏను కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం కోరారు. ప్రస్తుతం జీవిత బీమా పథకాలను మాత్రమే... అది కూడా కోరిన వారికి మాత్రమే ఎలక్ట్రానిక్ రూపంలో అందించే ఏర్పాట్లు చేశారని, దీన్ని సాధారణ బీమా పథకాలకూ వర్తింపజేయాలని, అంతేకాకుండా అందరికీ తప్పనిసరి చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. అలాచేస్తే ఆశించిన ప్రయోజనం నెరవేరుతుందన్నారు. ప్రపంచంలోనే తొలిసారిగా దేశీయంగా అభివృద్ధి చేసిన ఇన్సూరెన్స్ రిపాజిటరీ సిస్టమ్‌ను (ఐఆర్ఎస్) చిదంబరం సోమవారమిక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలక్ట్రానిక్ రూపంలో బీమా పథకాలు అందించడం వల్ల ఇటు పాలసీదారులతో పాటు, అటు బీమా కంపెనీలకూ నిర్వహణ వ్యయం గణనీయంగా తగ్గుతుందన్నారు. గత పదేళ్ళ నుంచీ షేర్లను డీమ్యాట్ రూపంలోనే అందించాలనే నిబంధన విధించామని, దీనివల్ల ఇన్వెస్టర్లు వాటిని సులభంగా భద్రపరచుకునే అవకాశం కలిగిందని, అనేక మోసాలకు అడ్డుకట్ట పడిందని తెలియజేశారు. అలాగే బీమా పథకాలు కూడా డీ-మ్యాట్ రూపంలో అందిస్తే పాలసీదారులు ఒక ఊరి నుంచి మరో ఊరికి వలస వెళ్ళినా, లేదా ప్రకృతి వైపరీత్యాల్లో ఆస్తులను పోగొట్టుకున్నా... పాలసీ డాక్యుమెంట్లు ఎలక్ట్రానిక్ రూపంలో భద్రంగా ఉండటమే కాకుండా వేగంగా క్లెయిమ్ చేసుకోవచ్చని చెప్పారు. ప్రస్తు తం ఎలక్ట్రానిక్ రూపంలో అకౌంట్ ప్రారంభించడానికి రూ.150 వరకు ఖర్చవుతోందని, అదే గనక సేవలు విస్తరిస్తే ఈ వ్యయం రూ.20 తగ్గుతుందనే ఆశాభావాన్ని చిదంబరం వ్యక్తం చేశారు. రిపాజిటరీ సేవలకు ఐదు సంస్థలు: బీమా పథకాలను కాగిత రహితంగా ఎలక్ట్రానిక్ రూపంలో అందించడానికి రాష్ట్రానికి చెందిన కార్వీ రిపాజిటరీ లిమిటెడ్‌తో పాటు ఎన్ఎస్డీఎస్ఎల్, సెంట్రల్ ఇన్సూరెన్స్ రిపాజిటరీ, కామ్స్, ఎస్‌హెచ్‌ఐఎల్ వంటి ఐదు సంస్థలను ఐఆర్డీఏ ఎంపిక చేసింది. రిపాజిటరీ సేవలు ప్రారంభం సందర్భంగా ప్రారంభ కిట్లను ఈ ఐదు కంపెనీలకు చెందిన ప్రతినిధులకు చిందంబరం చేతుల మీదుగా అందచేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఐఆర్డీఏ చైర్మన్ టి.ఎస్.విజయన్ మాట్లాడుతూ అన్ని బీమా పథకాలనూ ఒకే అకౌంట్లో భద్రపర్చుకునేలా దీన్ని రూపొందించామని, ఒకసారి ఈ-ఇన్సూరెన్స్ అకౌంట్ ప్రారంభిస్తే తదుపరి పాలసీలకు ఎటువంటి కేవైసీ నిబంధనల అవసరం ఉండదని తెలియజేశారు. బీమా పథకాలను డీ-మ్యాట్ రూపంలో అందించడానికి విశేష కృషి చేసిన ఐఆర్డీఏ మాజీ చైర్మన్ జంధ్యాల హరినారాయణకి ఈ సందర్భంగా విజయన్ అభినందనలు తెలిపారు. ప్రపంచ సగటు బీమా సాంద్రత 6.5 శాతంగా ఉంటే అది ఇండియాలో 3.96 శాతంగా ఉందని, బీమా రంగంలో ఇంకా వ్యాపార విస్తరణకు అపారమైన అవకాశాలు ఉన్నాయనడానికి ఈ గణాంకాలే నిదర్శనమన్నారు. అందుబాటు ధరలో వ్యక్తిగత అవసరాలను తీర్చే విధంగా బీమా పథకాలు రావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ బీమా కంపెనీల ప్రతినిధులతో పాటు, రిపాజిటరీ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.