రియాక్టర్లకు రూ.1,500 కోట్ల రిస్క్ కవర్!
బీమా సంస్థల విజ్ఞప్తికి ఐఆర్‌డీఏ సానుకూల స్పందన
న్యూఢిల్లీ: అణు రియాక్టర్లకు రిస్క్ కవరేజ్ కల్పించడానికి సంబంధించి రూ.1,500 కోట్ల మూలనిధి (లైబిలిటీ పూల్) ఏర్పాటుకు బీమా రంగ రెగ్యులేటర్- ఐఆర్‌డీఏ సూత్రప్రాయ అంగీకారం తెలిపింది. చైర్మన్ టీఎస్ విజయన్ ఇక్కడ సోమవారం ఈ విషయాన్ని తెలిపారు. ‘రియాక్టర్ల కవరింగ్‌కు డిమాండ్ ఉంది. భారత్ పరిధిలో ఇందుకు సంబంధించి రూ.1,500 కోట్ల ప్రత్యేక మూల నిధిని ఏర్పాటు చేయాలన్నది ప్రతిపాదన.
బీమా కంపెనీలు ఈ మూలనిధి ఏర్పాటుకు మా ఆమోదం కోరాయి. అయితే ఈ నిధులు ఎలా సమీకరిస్తారన్న విషయాన్ని మాత్రం అవి ఇంకా వెల్లడించలేదు.ఆయా అంశాలను మా ముందు ఉంచితే- సానుకూల రీతిలో ఈ ప్రతిపాదనను పరిశీలిస్తాం’ అని విజయన్ అన్నారు. భారత్ బీమా బ్రోకర్ల సంఘం సమావేశంలో పాల్గొన్న ఆయన, ఈ సందర్భంగా ఈ వివరాలను తెలియజేశారు. రూ.1,500 కోట్ల నిధి ఏర్పాటుకు రీ-ఇన్సూరర్ కంపెనీ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఇందుకు సంబంధించి విధివిధానాల రూపకల్పన జరుగుతున్నట్లు కూడా ఆయా వర్గాలు తెలిపాయి.
కస్టమర్లలో చైతన్యం పెంచాలి...
కాగా కస్టమర్లలో చైతన్యాన్ని పెంపొందించడంలో బీమా బ్రోకర్లు సంబంధిత వర్గాలదే కీలకపాత్ర అని విజయన్ పేర్కొన్నారు. బహిరంగ నోటీసులు, వెబ్‌సైట్లు, వార్తా పత్రికల్లో ప్రకటనల ద్వారా పాలసీ హోల్డర్లు ఎటువంటి మోసాలకూ గురికాకుండా ఐఆర్‌డీఏ కూడా తగిన చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా విజయన్ వివరించారు.
బీమా బిల్లుపై ఆర్డినెన్స్‌ను ఆపేయాలి
హైదరాబాద్ , బిజినెస్ బ్యూరో: ఎన్‌డీఏ ప్రభుత్వం బీమా బిల్లుపై ఆర్డినెన్స్‌ను తీసుకురావడాన్ని నేషనల్, న్యూ ఇండియా, ఓరియంటల్, యునెటైడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలు దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం చేశాయి. బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ)లను 26 శాతం నుంచి 49 శాతానికి పెంచడాన్ని, ఈ నాలుగు సాధారణ బీమా కంపెనీల వాటాలను అమ్మడాన్ని వెంటనే విరమించుకోవాలని ఈ సందర్భంగా యూనియన్లు డిమాండ్ చేశాయి.