ఐఆర్‌డీఏఐ చైర్మన్ పాండా
ముంబై: ఇన్సూరెన్స్‌లో ఎదిగేందుకు గణనీయంగా అవకాశాలున్న నేపథ్యంలో మరిన్ని దిగ్గజ సంస్థలు ఈ రంగంలోకి రావాలని బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ ఐఆర్‌డీఏఐ చైర్మన్ దేబశీష్ పాండా సూచించారు. కొత్త సంస్థలు మార్కెట్లో ప్రవేశించేందుకు వీలుగా నిబంధనలను కూడా సరళతరం చేశామని సీఐఐ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా తెలిపారు.
‘‘మేమైతే అనుమతుల ప్రక్రియను వేగవంతం చేశాం. కంపెనీలే మరింత సమయం కోరుతున్నాయి’’ అని ఆయన వ్యాఖ్యానించారు. కన్సాలిడేషన్ కన్నా మార్కెట్లో మరిన్ని సంస్థలు వచ్చేలా చూసేందుకే ఐఆర్‌డీఏఐ ప్రాధాన్యమిస్తోందని తెలిపారు. భారత బీమా రంగంలో అవకాశాలను గ్లోబల్ ఇన్వెస్టర్లకు వివరించేందుకు ఇటీవలే జపాన్, యూరప్, అమెరికాలో రోడ్‌షోలు నిర్వహించామని వెల్లడించారు. మరోవైపు, స్టాక్ మార్కెట్లలో లిస్టయ్యేలా మరిన్ని సంస్థలను ఐఆర్‌డీఏఐ ప్రోత్సహిస్తోందని పాండా చెప్పారు.
దీనితో పారదర్శకత పెరుగుతుందని, అంతిమంగా షేర్‌హోల్డర్లు అలాగే పరిశ్రమకు ప్రయోజనం చేకూరగలదని పేర్కొన్నారు. దేశీయంగా 140 కోట్ల మంది పైగా జనాభా ఉన్న నేపథ్యంలో మొత్తం బీమా సంస్థలు డెభ్భైకి పైగా ఉన్నా .. ఇంకా వ్యాపార అవకాశాలు ఎక్కువే ఉన్నాయని పాండా చెప్పారు. జీఎస్‌టీ తగ్గింపు వార్తలపై నేరుగా ఎటువంటి వ్యాఖ్యలు చేయనప్పటికీ బీమా పాలసీలు అందరికీ అందుబాటు స్థాయిలో ఉండేలా చూడాలనేదే ఐఆర్‌డీఏఐ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. అయితే, పన్నుల తగ్గింపు ఒక్కటే దీనికి పరిష్కారం కాదని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment