IRDAI
-
మభ్యపెట్టి అంటగట్టొద్దు
బ్యాంకులో డబ్బు డిపాజిట్, విత్‌డ్రా, క్రెడిట్ కార్డులు, లోన్లు జారీ.. వంటి కార్యకలాపాలు సాగిస్తుంటారు. దాంతోపాటు వివిధ బీమా పాలసీలు కూడా విక్రయిస్తారు. అయితే కొన్ని బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్లు తమ కస్టమర్లకు మోసపూరిత బీమా పాలసీలను అంటగడుతున్నట్లు బీమా నియంత్రణాధికార సంస్థ ఐఆర్డీఏఐ గుర్తించింది. ఇలా మోసపూరితంగా పాలసీలు విక్రయించకూడదని ఐఆర్డీఏఐ ఛైర్మన్ దేబాశీస్ పాండా తెలిపారు.ఈ సందర్భంగా పాండా మాట్లాడుతూ..‘బ్యాంకర్లు తమ ప్రధాన వ్యాపారంపైనే దృష్టి సారించాలి. మోసపూరిత బీమా పాలసీలు విక్రయించకూడదు. దేశంలో అందరికీ బీమాను చేరువ చేయడంలో బ్యాంకస్యూరెన్స్ (బ్యాంక్ శాఖల ద్వారా బీమా పాలసీలు విక్రయించే) మార్గం చాలా ఉపయోగపడుతోంది. అయితే దీన్ని కస్టమర్లకు అందించడంలో అప్రమత్తంగా ఉండాలి. చాలా జాగ్రత్త వహించాలి. మోసపూరిత పాలసీలను అంటగట్టకూడదు. ఆర్థిక వ్యవస్థలో బ్యాంకర్ల పాత్ర కీలకం. బీమా పాలసీలను అమ్మడాన్ని ప్రాధాన్యతగా తీసుకోకూడదు’ అని చెప్పారు.ఇదీ చదవండి: నిబంధనలు పాటించని బ్యాంకులపై చర్యలుప్రస్తుతం మార్కెట్లో చాలా బీమా పాలసీలు అందుబాటులో ఉన్నాయి. కొన్ని పాలసీలు విక్రయించినందుకు సిబ్బందికి ఇన్సెంటివ్‌లు ప్రకటిస్తున్నారు. దాంతో కస్టమర్లకు అధిక ప్రయోజనాలు చేకూర్చని పాలసీలను, నిబంధనలు సరిగా తెలియజేయకుండా మోసపూరితంగా అంటగడుతున్నారు. దాంతో ఇటీవల ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ వ్యవహారంపై స్పందిస్తూ బ్యాంకులకు కొన్ని సూచనలు చేశారు. తాజాగా ఐఆర్డీఏఐ ఛైర్మన్ దీనిపై స్పందించారు. -
‘అందరికీ బీమా’.. 100% ఎఫ్‌డీఐలు రావాల్సిందే..
ముంబై: ప్రజలందరికీ 2027 నాటికల్లా బీమా రక్షణ కల్పించాలన్న లక్ష్యం సాకారం కావాలంటే ఇన్సూరెన్స్ రంగంలోకి భారీగా పెట్టుబడులు రావాల్సిన అవసరం ఉందని బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ ఐఆర్డీఏఐ చైర్మన్ దేబాశీష్ పాండా తెలిపారు.ఈ నేపథ్యంలో ఇన్సూరెన్స్ రంగంలోకి 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) అనుమతించాల్సి ఉంటుందని ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. బీమా విస్తృతిని పెంచేందుకు ఈ రంగంలో మరిన్ని సంస్థలు రావాల్సిన అవసరం ఉందన్నారు. 2000 నుంచి భారత్‌లో ప్రైవేట్, విదేశీ పెట్టుబడులను క్రమంగా అనుమతిస్తున్నారు.ప్రస్తుతం జనరల్, లైఫ్, హెల్త్ ఇన్సూరెన్స్ విభాగాల్లో 74 శాతం వరకు ఎఫ్‌డీఐలకు అనుమతి ఉంది. దీన్ని వంద శాతానికి పెంచిన పక్షంలో దేశీయంగా వచ్చే పెట్టుబడులకు కూడా కొంత దన్ను లభించగలదని పాండా చెప్పారు. మరోవైపు, బీమా సుగమ్ ప్లాట్‌ఫాం అనేది పాలసీదార్లకు సమగ్రమైన పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌గా వ్యవహరిస్తూ బీమా రంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తోందని ఆయన పేర్కొన్నారు. -
బీమాలోకి మరిన్ని కంపెనీలు రావాలి
ముంబై: ఇన్సూరెన్స్‌లో ఎదిగేందుకు గణనీయంగా అవకాశాలున్న నేపథ్యంలో మరిన్ని దిగ్గజ సంస్థలు ఈ రంగంలోకి రావాలని బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ ఐఆర్డీఏఐ చైర్మన్ దేబశీష్ పాండా సూచించారు. కొత్త సంస్థలు మార్కెట్లో ప్రవేశించేందుకు వీలుగా నిబంధనలను కూడా సరళతరం చేశామని సీఐఐ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా తెలిపారు. ‘‘మేమైతే అనుమతుల ప్రక్రియను వేగవంతం చేశాం. కంపెనీలే మరింత సమయం కోరుతున్నాయి’’ అని ఆయన వ్యాఖ్యానించారు. కన్సాలిడేషన్ కన్నా మార్కెట్లో మరిన్ని సంస్థలు వచ్చేలా చూసేందుకే ఐఆర్డీఏఐ ప్రాధాన్యమిస్తోందని తెలిపారు. భారత బీమా రంగంలో అవకాశాలను గ్లోబల్ ఇన్వెస్టర్లకు వివరించేందుకు ఇటీవలే జపాన్, యూరప్, అమెరికాలో రోడ్‌షోలు నిర్వహించామని వెల్లడించారు. మరోవైపు, స్టాక్ మార్కెట్లలో లిస్టయ్యేలా మరిన్ని సంస్థలను ఐఆర్డీఏఐ ప్రోత్సహిస్తోందని పాండా చెప్పారు. దీనితో పారదర్శకత పెరుగుతుందని, అంతిమంగా షేర్హోల్డర్లు అలాగే పరిశ్రమకు ప్రయోజనం చేకూరగలదని పేర్కొన్నారు. దేశీయంగా 140 కోట్ల మంది పైగా జనాభా ఉన్న నేపథ్యంలో మొత్తం బీమా సంస్థలు డెభ్భైకి పైగా ఉన్నా .. ఇంకా వ్యాపార అవకాశాలు ఎక్కువే ఉన్నాయని పాండా చెప్పారు. జీఎస్టీ తగ్గింపు వార్తలపై నేరుగా ఎటువంటి వ్యాఖ్యలు చేయనప్పటికీ బీమా పాలసీలు అందరికీ అందుబాటు స్థాయిలో ఉండేలా చూడాలనేదే ఐఆర్డీఏఐ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. అయితే, పన్నుల తగ్గింపు ఒక్కటే దీనికి పరిష్కారం కాదని తెలిపారు. -
పాలసీదారుల డేటా లీక్..! ఐటీ సిస్టమ్‌ల ఆడిట్
పాలసీదారుల డేటా లీకేజీ ఉదంతాల నేపథ్యంలో ఐటీ సిస్టమ్‌లను ఆడిట్ చేయాలని బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్డీఏఐ బీమా కంపెనీలను ఆదేశించింది. ఇందుకోసం స్వతంత్ర ఆడిటర్‌ను నియమించుకోవాలని సూచించింది. ఆయా సంస్థల యాజమాన్యాలతో కలిసి పరిస్థితిని పర్యవేక్షిస్తామని వివరించింది.ఐఆర్డీఏఐ ప్రకటనలోని వివరాల ప్రకారం..‘డేటా ఉల్లంఘనలను చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాం. పాలసీదారుల ప్రయోజనాలు కాపాడేందుకు సంస్థ చర్యలు తీసుకుంటోంది. బీమా తీసుకున్నవారి డేటా లీకేజీ ఉదంతాల నేపథ్యంలో రెండు సంస్థలకు(పేర్లు వెల్లడించలేదు) చెందిన ఐటీ సిస్టమ్‌లను ఆడిట్ చేయాలి. ఇందుకు స్వతంత్ర ఆడిటర్‌ను నియమించుకోవాలి. ఆయా సంస్థల యాజమాన్యాలతో కలిసి ఐఆర్డీఏఐ పరిస్థితిని పర్యవేక్షిస్తుంది’ అని తెలిపింది.ఇదీ చదవండి: పెట్రోల్ కల్తీని ఎలా గుర్తించాలంటే..రెండు సంస్థల పేర్లను ఐఆర్డీఏఐ వెల్లడించకపోయినప్పటికీ ఆ జాబితాలో స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నట్లుగా భావిస్తున్నారు. డేటా లీకేజీ జరిగిన మాట వాస్తవమేనని ఆ కంపెనీ ఇటీవలే వెల్లడించడం ఇందుకు కారణం. ఇక డేటా ఉల్లంఘన బారిన పడిన రెండో సంస్థ పేరు తెలియరాలేదు. ఇదిలాఉండగా, స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్‌కు చెందిన 3.1 కోట్ల మంది చందాదారుల వ్యక్తిగత డేటా ఆన్లైన్లో అమ్మకానికి పెట్టారు. హ్యాకర్ షెన్జెన్ ఏర్పాటు చేసిన ఓ వెబ్ పోర్టల్‌లో స్టార్ హెల్త్ కస్టమర్ల ఫోన్ నంబర్, పాన్, చిరునామా, ముందస్తు వ్యాధుల చరిత్ర తదితర వివరాలు విక్రయానికి పెట్టినట్టు తెలిసింది. -
బీమా పాలసీ వెనక్కిస్తే మెరుగైన ప్రయోజనాలు!
జీవిత బీమా పాలసీని వెనక్కిచ్చేసినప్పుడు (సరెండర్) పొందే ప్రయోజనాలపై నూతన నిబంధనలు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఇందుకు బీమా సంస్థలు ఇప్పటికే సన్నద్ధం అయ్యాయి. బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) సవరించిన సరెండర్ వ్యాల్యూ నిబంధనలను ఈ ఏడాది ఆరంభంలోనే ప్రకటించడం గమనార్హం.జీవిత బీమా పాలసీల గడువు ముగిసే వరకు వేచి చూడకుండా, ముందస్తుగానే వైదొలగాలని భావించే వారికి మెరుగైన రాబడులు అందించడమే కొత్త నిబంధనల ఉద్దేశం. జీవిత బీమా పాలసీని తీసుకున్న తర్వాత నుంచి ఎన్నేళ్ల పాటు ప్రీమియం చెల్లించారు, అప్పటి వరకు ఎంత బోనస్‌లు జమయ్యాయన్న తదితర అంశాల ఆధారంగా సరెండర్ వ్యాల్యూని బీమా సంస్థలు నిర్ణయిస్తుంటాయి. ఇలా సరెండర్ చేసే పాలసీలపై బీమా సంస్థలు గతంలో తక్కువ ప్రయోజనాలనే పాలసీదారులకు చెల్లించేవి. దీనివల్ల పాలసీ సరెండర్‌పై పాలసీదారులు సరైన విలువను పొందలేకపోయేవారు. నూతన నిబంధనలతో పాలసీ కమీషన్లో మార్పులు చోటు చేసుకోవచ్చని, ప్రీమియం రేట్లలో హెచ్చుతగ్గులు ఉండొచ్చని కేర్ ఎడ్జ్ రేటింగ్స్ డైరెక్టర్ గౌవర్ దీక్షిత్ అభిప్రాయపడ్డారు.ఇదీ చదవండి: 2030 నాటికి భారత ఎకానమీ రెట్టింపు -
పాలసీ సరెండర్ చేస్తే.. ఇక ఊరట!
ప్రతి కుటుంబానికి జీవిత బీమా రక్షణ ఎంతో అవసరం. జీవిత బీమాను పెట్టుబడి సాధనంగా చూసే ధోరణి మన సమాజంలో ఎక్కువగానే ఉంది. నేటికీ సంప్రదాయ బీమా పాలసీలు (ఎండోమెంట్, మనీబ్యాక్/జీవించి ఉన్నా రాబడులు వచ్చేవి) ఎక్కువగా విక్రయమవుతుండడం దీనికి నిదర్శనం. నిజానికి ఈ తరహా ప్లాన్లలో తక్కువ రక్షణకే ఎక్కువ ప్రీమియం చెల్లించాల్సి వస్తుంది. దీంతో ప్రీమియం భారంగా మారి కట్టలేని పరిస్థితుల్లో అర్ధాంతరంగా విడిచిపెట్టేసేవారు ఉన్నారు. ఇక పాలసీ వద్దనుకుని వెనక్కి ఇచ్చేస్తే (సరెండర్) బీమా సంస్థలు నిబంధనల మేరకు కొంత మొత్తాన్ని వెనక్కి ఇస్తుంటాయి. పాలసీ తీసుకున్న తొలినాళ్లలో రద్దు చేసుకుంటే చేతికి వచ్చేది పిసరంతే. ఇది గమనించిన బీమారంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) పాలసీదారుల ప్రయోజనాల పరిరక్షణకు వీలుగా నిబంధనల్లో మార్పులు తీసుకొచ్చింది. కనుక పాలసీని సరెండర్ చేస్తే ఎంత మొత్తం వెనక్కి వస్తుందన్న దానిపై పాలసీదారులు అవగాహన కలిగి ఉండడం అవసరం. ఆ వివరాలే ఈ వారం ప్రాఫిట్ ప్లస్ కథనం.సరెండర్ వేల్యూ? జీవిత బీమాలో సరెండర్ వేల్యూ అంటే.. గడువు తీరకుండానే పాలసీని రద్దు చేసుకుంటే పాలసీదారుకు బీమా సంస్థ తిరిగి చెల్లించే మొత్తం. పాలసీ కాల వ్యవధి మధ్యలో వైదొలిగితే కట్టిన ప్రీమియంల నుంచి కొంత మొత్తాన్ని బీమా సంస్థ వెనక్కి ఇస్తుంది. సరెండర్ చార్జీల (స్వాధీనపు చార్జీలు) పేరుతో కొంత మినహాయించుకుంటుంది. సరెండర్ చేయడం కంటే పాలసీని కొనసాగించడమే నయమనే విధంగా, పాలసీ ముందస్తు రద్దును నిరుత్సాహపరిచే స్థాయిలో సరెండర్ చార్జీలు ఇంతకుముందు అమల్లో ఉండేవి. ఇది అసమంజసమని భావించిన ఐఆర్డీఏఐ పాలసీదారుల ప్రయోజనాల కోణంలో నిబంధనలు మార్చింది. సరెండర్ వేల్యూ అన్నది.. గ్యారంటీడ్ సరెండర్ వ్యాల్యూ (జీఎస్వీ), స్పెషల్ సరెండర్ వ్యాల్యూ (ఎస్ఎస్వీ) అని రెండు రకాలుగా ఉంటుంది. గ్యారంటీడ్ అంటే పాలసీ రద్దుతో బీమా సంస్థ చెల్లించాల్సిన కనీస మొత్తం. ఇందులో పాలసీ గడువు తీరినప్పుడు ఇచ్చే బోనస్‌లను కలపరు. అదే స్పెషల్ సరెండర్ వేల్యూలో అప్పటి వరకు సమకూరిన బోనస్‌లు, ఇతర ప్రయోజనాలు కూడా కలుస్తాయి. బీమా సంస్థలతో సంప్రదింపుల మీదట ఐఆర్డీఏఐ కొత్త నిబంధనలు తీసుకొస్తూ జూన్ 12న జీవిత బీమా సంస్థలకు మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రధానంగా స్పెషల్ సరెండర్ వ్యాల్యూ నిబంధనల్లో కీలకమైన మార్పును ఐఆర్డీఏఐ తీసుకొచ్చింది.ఎంతొస్తుంది..? పాలసీ తీసుకున్న ఏడాది తర్వాత వైదొలిగితే గతంలో ఏమీ వచ్చేది కాదు. కానీ, ఇక మీదట కొంత మొత్తం చెల్లించక తప్పదు. అలాగే పాలసీ తీసుకున్న మొదటి ఐదేళ్లలో సరెండర్ చేస్తే గతంలో పెద్దగా తిరిగొచ్చేది కాదు. కానీ ఇప్పుడు బీమా సంస్థలు అధిక మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. పాలసీ వారీగా గ్యారంటీడ్ సరెండర్ వేల్యూ, స్పెషల్ సరెండర్ వేల్యూ, చెల్లింపుల సరెండర్ వేల్యూ గురించి పాలసీ ఇల్రస్టేషన్ (ప్రయోజనాల) పత్రంలో పేర్కొనాలని ఐఆర్డీఏఐ నిర్దేశించింది. ఈ పత్రంపై పాలసీ కొనుగోలుదారు, బీమా ఏజెంట్ లేదా బీమా సంస్థ అ«దీకృత మధ్యవర్తి లేదా పంపిణీ ఉద్యోగి సంతకం కూడా చేయాల్సి ఉంటుంది. సంప్రదాయ ఎండోమెంట్ పాలసీని సరెండర్ చేస్తే ఎంతొస్తుందన్నది ఉదాహరణ ద్వారా సులభంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రవికిరణ్ రూ.5 లక్షల సమ్ అష్యూర్డ్ (బీమా కవరేజీ)తో పదేళ్ల కాలానికి (టర్మ్) పాలసీ తీసుకున్నాడని అనుకుందాం. ఏటా రూ.50,000 ప్రీమియం చెల్లించాలి. నాలుగేళ్లపాటు ఏటా రూ.50,000 చొప్పున ప్రీమియం చెల్లించిన తర్వాత అతడు పాలసీని సరెండర్ చేద్దామనుకున్నాడు. అప్పటి వరకు ప్రీమియం రూపంలో అతడు బీమా సంస్థకు రూ.2,00,000 చెల్లించాడు. ఏటా రూ.10,000 చొప్పున బోనస్ అతడికి జమ అయింది. గత నిబంధనల ప్రకారం పాలసీ తీసుకున్న తర్వాత నాలుగో ఏడాది నుంచి ఏడో ఏడాది మధ్య సరెండర్ చేస్తే అప్పటి వరకు తాము వసూలు చేసిన ప్రీమియంలలో 50 శాతాన్ని బీమా సంస్థలు వెనక్కి ఇచ్చేవి. ‘అంటే పాత నిబంధనల ప్రకారం రవికిరణ్ నాలుగేళ్ల తర్వాత పాలసీని సరెండర్ చేస్తే వచ్చే మొత్తం రూ.1,20,000 అవుతుంది. చెల్లించిన ప్రీమియంతోపాటు బోనస్‌లు కూడా కలుపుకుని చూస్తే అప్పటికి రూ.2,40,000 సమకూరింది. అంటే ఇందులో సగం కోల్పోవాల్సి వచ్చేది. కానీ, నూతన స్పెషల్ సరెండర్ వేల్యూ నిబంధనల కింద నాలుగేళ్ల తర్వాత సరెండర్ చేస్తే ఇదే ఉదాహరణ కింద రవికిరణ్‌కు రూ.1.55 లక్షలు వెనక్కి వస్తాయి’ అని సెబీ నమోదిత ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్, సహజ్‌మనీ వ్యవస్థాపకుడు అభిõÙక్ కుమార్ వివరించారు. ఆయా అంశాలకు సంబంధించి నిపుణుల సలహాలు తీసుకోవడం అవసరమన్నారు. ఒకవేళ ఇదే పాలసీని మొదటి ఏడాది ప్రీమియం రూ.50,000 చెల్లించిన తర్వాత రవికిరణ్ సరెండర్ చేస్తే పాత నిబంధనల కింద రూపాయి కూడా వెనక్కి రాదు. కానీ, కొత్త నిబంధల కింద రూ.31,295 వెనక్కి వస్తుంది. అంటే చెల్లించిన ప్రీమియంలో 62.59 శాతానికి సమానం. ఇలా ఏటా పెరుగుతూ వెళుతుంది. రెండో ఏడాది సరెండర్ చేస్తే అప్పటికి చెల్లించిన ప్రీమియంలో 67.28 శాతం వెనక్కి వస్తుంది. మూడో ఏట 72.33 శాతం, నాలుగో ఏట 77.76 శాతం, ఐదో ఏటా 83.59 శాతం, ఆరో ఏట 89.86 శాతం, ఏడో ఏట 96.60 శాతం, ఎనిమిదో ఏడాది ప్రీమియం చెల్లించిన తర్వాత అప్పటికి చెల్లించిన ప్రీమియంపై 103.84 శాతం, తొమ్మిదో ఏట 111.63 శాతం బీమా సంస్థ వెనక్కి ఇస్తుంది. లిమిటెడ్ ప్రీమియం పేమెంట్ పాలసీలు, సింగిల్ ప్రీమియం పాలసీల్లోనూ ఒక్కసారి ప్రీమియం చెల్లించినా సరే స్పెషల్ సరెండర్ వేల్యూ వెనక్కి ఇవ్వాల్సిందేనని ఐఆర్డీఏఐ కొత్త నిబంధనల్లో నిర్ధేశించింది. ఎప్పటి నుంచి..? స్పెషల్ సరెండర్ వేల్యూ కొత్త నిబంధనలను ఈ ఏడాది సెప్టెంబర్ 30 నాటికి అమలు చేయాలని ఐఆర్డీఏఐ ఆదేశించింది. స్పెషల్ సరెండర్ వేల్యూ నిబంధనలు కొత్తగా తీసుకునే ఎండోమెంట్ పాలసీలకే వర్తిస్తాయని బంధన్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో బి.సతీశ్వర్ తెలిపారు. నూతన నిబంధనలు అమల్లోకి వచి్చన తర్వాత తీసుకునే పాలసీలకే ఐఆర్డీఏఐ తీసుకొచి్చన స్పెషల్ సరెండర్ వేల్యూ నిబంధనలు అమలవుతాయి.ప్రత్యామ్నాయాలు... ఎండోమెంట్ ప్లాన్లను తీసుకుని కొన్నేళ్లపాటు ప్రీమియం చెల్లించిన తర్వాత, ఆపై కొనసాగించడం భారంగా మారిన వారికి సరెండర్ చేయడం ఒక్కటే ఆప్షన్ కాదు. ఆ పాలసీని పెయిడప్‌గా మార్చుకోవచ్చు. పెయిడప్‌గా మార్చుకోవడం వల్ల బీమా రక్షణ కొనసాగుతుంది. అప్పటి నుంచి పాలసీ ముగిసే వరకు ఏటా ప్రీమియం కూడా చెల్లించనక్కర్లేదు. అప్పటి వరకు ఎన్నేళ్లపాటు, ఎంత మేర ప్రీమియం చెల్లించారన్న దాని ఆధారంగా బీమా కవరేజీని నిర్ణయిస్తారు. ఉదాహరణకు రూ. 5 లక్షల సమ్ అష్యూర్డ్ పాలసీని 20 ఏళ్ల కాలానికి తీసుకుని, ఏటా రూ. 50వేల చొప్పున ఐదేళ్లపాటు ప్రీమియం చెల్లించారని అనుకుందాం. ఆ తర్వాత ఇక కొనసాగించడం వీలు కాని వారు పెయిడప్‌గా మార్చుకుంటే, అదే పాలసీ రూ.5 లక్షలకు బదులు రూ.1–1.5 లక్షల సమ్ అష్యూర్డ్‌తో 20 ఏళ్ల వరకు కొనసాగుతుంది. గడువు తీరిన తర్వాత నిబంధనల మేరకు, అప్పటి వరకు సమకూరిన బోనస్ ప్రయోజనాలతో కలిపి చెల్లింపులు లభిస్తాయి. మరో మార్గంగా పెయిడప్‌గా మార్చి, సమ్ అష్యూర్డ్ తగ్గించుకుని, అప్పటి నుంచి తక్కువే ప్రీమియం చెల్లిస్తూ వెళ్లొచ్చు. దీనివల్ల పెయిడప్ సమ్ అష్యూర్డ్ కవరేజీ కొంత పెరుగుతుంది. కాకపోతే పెయిడప్ చేసేందుకు బీమా సంస్థలు చార్జీలు వసూలు చేయడమే ప్రతికూలం. ఒకవేళ నిధుల అవసరం ఏర్పడి, పాలసీని సరెండర్ చేస్తే తిరిగొచ్చే మొత్తం ఆదుకుంటుందని భావిస్తే అప్పుడు అదే ఆప్షన్‌ను పరిశీలించొచ్చు. ప్రయోజనాలునూతన నిబంధనలు పాలసీదారులకు ప్రయోజనమన్నది నిపుణుల విశ్లేషణ. ఏజెంట్ చెప్పిన మాటలు విని లేదా తెలిసిన వారు చెప్పారనో ఏదైనా పాలసీ కొనుగోలు చేసిన తర్వాత.. అది తమకు సరిపడేది కాదని గుర్తించిన సందర్భాల్లో దాన్ని సరెండర్ చేసి బయటకు రావచ్చు. తమ అవసరాలకు తగిన మరో ప్లాన్‌ను కొనుగోలు చేసుకోవచ్చని చెబుతున్నారు. అనుచిత వ్యాపార విధానాలపై (బీమా కంపెనీలకు సంబంధించి) పాలసీదారుల నుంచి వచ్చే ఫిర్యాదులు 1.5 శాతం పెరిగినట్టు ఐఆర్డీఏఐ 2022–23 నివేదిక సైతం తెలియజేస్తోంది. ముఖ్యంగా ప్రైవేటు బీమా కంపెనీలకు సంబంధించిన ఫిర్యాదులే ఎక్కువగా ఉన్నాయి. పాలసీదారులను తప్పుదోవ పట్టించి, వారితో పాలసీలు కొనుగోలు చేయించే అనైతిక ధోరణలకు చెక్ పెట్టడం కూడా సరెండర్ వేల్యూ పెంచడంలోని ఉద్దేశమని నిపుణులు చెబుతున్నారు. సంప్రదాయ పాలసీలు / టర్మ్ ప్లాన్లుఎండోమెంట్ ప్లాన్లలో పాలసీదారు కాల వ్యవధి ముగియక ముందే మరణించినట్టయితే సమ్ అష్యూర్డ్ (బీమా కవరేజీ)తోపాటు అప్పటి వరకు సమకూరిన బోనస్‌లు చెల్లిస్తారు. పాలసీ కాల వ్యవధి ముగిసే వరకు పాలసీదారు జీవించి ఉన్నప్పటికీ.. ఈ ప్లాన్లలో నిర్దేశిత మొత్తం తిరిగొస్తుంది. ఇది సమ్ అష్యూర్డ్ కంటే ఎక్కువే ఉంటుంది. అంటే ఒకవైపు బీమా రక్షణతోపాటు, రాబడి ప్రయోజనం కూడా ఈ ప్లాన్లలో భాగంగా ఉంటుంది. అందుకే ఈ ప్లాన్ల ప్రీమియం ఎక్కువగా ఉంటుంది. అయినా సరే తాము అప్పటి వరకు కట్టిన దానికంటే ఎక్కువే వస్తుందని చాలా మంది ఈ తరహా ప్లాన్లకే మొగ్గు చూపిస్తుంటారు. కానీ, 20 ఏళ్లు, అంతకు మించిన కాలవ్యవధి గల ఎండోమెంట్ ప్లాన్లలో వచ్చే నికర వార్షిక రాబడి 5 శాతంగానే ఉంటుందని అంచనా. అంటే ద్రవ్యోల్బణం రేటుకు సమానం. కనుక పాలసీదారులకు ఈ ప్లాన్లపై వచ్చే నికర రాబడి సున్నాయే అవుతుంది. టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్లు వీటికి భిన్నం. ఇవి అచ్చమైన బీమా రక్షణకే పరిమితం అవుతాయి. అంటే పాలసీ కాల వ్యవధిలో (టర్మ్) పాలసీదారు మరణించినట్టయితే సమ్ అష్యూర్డ్ మొత్తం నామినీ లేదా వారసులకు లభిస్తుంది. ఒకవేళ పాలసీ కాల వ్యవధి ముగిసే వరకు పాలసీదారు జీవించి ఉంటే ఏమీ రాదు. పాలసీదారు జీవించి ఉన్నా, అప్పటి వరకు చెల్లించిన ప్రీమియంలను వెనక్కిచ్చే టర్మ్ ప్లాన్లు కూడా వచ్చాయి. కాకపోతే అచ్చమైన టర్మ్ ప్లాన్లతో పోలిస్తే వీటి ప్రీమియం 50–100 శాతం ఎక్కువే ఉంటుంది. 30 ఏళ్ల వ్యక్తి రూ.కోటి జీవిత బీమా కవరేజీని కేవలం రూ.10 వేల వార్షిక ప్రీమియానికే టర్మ్ ప్లాన్‌తో సొంతం చేసుకోవచ్చు. -
క్యాష్‌లెస్ చికిత్సపై గంటలోనే నిర్ణయం..ఐఆర్డీఏఐ ఆదేశాలు
ఆరోగ్య బీమా పాలసీదారు క్లెయిమ్ చేసిన గంటలోపే నగదు రహిత చికిత్సపై నిర్ణయం తీసుకోవాలని బీమా సంస్థలకు ఐఆర్డీఏఐ ఆదేశాలు జారీ చేసింది. ఆసుపత్రి తుది బిల్లు వచ్చాక మూడు గంటల్లోపు అనుమతి ఇవ్వాలని తెలియజేసింది. బుధవారం ఈమేరకు భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) మాస్టర్ సర్క్యులర్ విడుదల చేసింది. ఆరోగ్య బీమా ఉత్పత్తులపై ఉన్న 55కు పైగా ఆదేశాలను క్రోడీకరించి దీన్ని రూపొందించినట్లు పేర్కొంది.సర్క్యూలర్‌లోని వివరాల ప్రకారం..క్లెయిమ్ పరిష్కారాల కోసం పాలసీదారులు ఎలాంటి డాక్యుమెంట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. బీమా సంస్థలు, థర్డ్‌పార్టీ ఏజెన్సీలు తమకు అవసరమైన పత్రాలను పాలసీదారుల నుంచి కాకుండా నేరుగా ఆసుపత్రుల నుంచే సేకరించాలి. వయసు, ప్రాంతం, ఆరోగ్య పరిస్థితులతో సంబంధం లేకుండా బీమా పాలసీని అందించాలి. అవసరాన్ని బట్టి కొత్త పాలసీలను తీసుకొచ్చే అవకాశం బీమా సంస్థలకు ఉంది.ఐఆర్డీఏఐ చేసిన కొన్ని మార్పులు..డిశ్చార్జీకి మూడు గంటల కంటే ఎక్కువ ఆలస్యం జరిగి ఆసుపత్రి ఏదైనా అదనపు ఛార్జీలు విధిస్తే ఆ మొత్తాన్ని కూడా బీమా సంస్థ భరిస్తుంది.చికిత్స సమయంలో పాలసీదారుడు మరణిస్తే వెంటనే క్లెయిమ్ ప్రాసెస్ చేయాలి. తక్షణమే ఆసుపత్రి నుంచి మృత దేహాన్ని తమ బంధువులకు అప్పగించాలి.పాలసీదారులకు సహాయం చేయడానికి బీమా కంపెనీలు ఆసుపత్రిలో ఫిజికల్ మోడ్‌లో ప్రత్యేక హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేయవచ్చు.ఒకటి కంటే ఎక్కువ పాలసీలు ఉన్న పాలసీదారులు తమకు ఆమోదయోగ్యమైన క్లెయిమ్ పొందగలిగే పాలసీని ఎంచుకోవచ్చు.పాలసీ తీసుకునేందుకూ, పాలసీ పునరుద్ధరణ, సేవలు, ఫిర్యాదుల పరిష్కారం తదితరాల కోసం అవసరమైన సాంకేతిక సేవలను అందించాలి.బీమా కంపెనీలు పాలసీ డాక్యుమెంట్‌తో పాటు కస్టమర్ ఇన్ఫర్మేషన్ షీట్ (సీఐఎస్)ని కూడా అందించాలి. బీమా పాలసీ రకం, బీమా మొత్తం, కవరేజీ వివరాలు, మినహాయింపులు.. వంటివి సులభ పదాల్లో తెలియజేయాలి.పాలసీ వ్యవధిలో ఎలాంటి క్లెయిమ్‌లు చేయకపోతే వారికి నో క్లెయిమ్ బోనస్ లేదా ప్రీమియం తగ్గించే అవకాశాన్ని కల్పించవచ్చు.ఇదీ చదవండి: పర్యాటకులకు స్వర్గధామాలు ఈ బీచ్‌లుఇటీవల లోకల్ సర్కిల్ చేసిన సర్వేలో 43 శాతం బీమా పాలసీదారులు గత మూడేళ్లలో తమ బీమా క్లెయిమ్‌లను ప్రాసెస్ చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిసింది. చాలామంది పాలసీదారులు ఆసుపత్రిలో చేరిన చివరి రోజు వరకు తమ క్లెయిమ్ ప్రాసెస్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు సర్వే తెలిపింది. -
వృద్ధులకు ఆరోగ్య ధీమా!
అరవై అయిదేళ్ళు పైబడిన సీనియర్ సిటిజన్లకు ఇది అక్షరాలా ఆనందం కలిగించే వార్త. పిల్లలు, విద్యార్థులు, గర్భిణులు, సీనియర్ సిటిజన్లతో సహా అన్ని వర్గాలకూ ఆరోగ్య బీమా పాలసీలు అందివ్వాలనే కొత్త నిర్ణయం వచ్చింది. దేశంలోని బీమా పాలసీలకు సంబంధించి అత్యున్నత నియంత్రణ సంస్థ అయిన ‘భారత బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ’ (ఐఆర్డీఏఐ) ఆ మేరకు బీమా సంస్థలన్నిటికీ ఆదేశాలు జారీ చేసింది. ఇకపై క్యాన్సర్, హృద్రోగం, మూత్రపిండాల వైఫల్యం, ఎయిడ్స్ లాంటి వ్యాధులున్నాయని ఆరోగ్య బీమా పాలసీలు నిరాకరించడానికి వీల్లేదని తేల్చింది. అదే సమయంలో, నియమ నిబంధనలు పాటిస్తూ ఆ యా వయసుల వారికి తగ్గట్టుగా ప్రత్యేకమైన బీమా పాలసీలు రూపొందించుకొనే స్వేచ్ఛ సంస్థలకు ఇచ్చింది. దీంతో, ఇప్పుడిక 65 ఏళ్ళు, ఆపై బడిన తర్వాత కూడా కొత్తగా ఆరోగ్య బీమా పాలసీ తీసుకొనే వీలు చిక్కింది. 70 ఏళ్ళ పైబడిన ప్రతి ఒక్కరినీ కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య పథకం కిందకు తెస్తామని అధికార పక్షం పేర్కొన్న కొద్ది రోజులకే ఈ నిర్ణయం రావడం గమనార్హం. అలాగే, సీనియర్ సిటిజన్ల సమస్యలు, ఆరోగ్య బీమా క్లెయిమ్‌ల సత్వర పరిష్కారానికై ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని బీమా సంస్థలకు ప్రాధికార సంస్థ సూచించింది. పాలసీ కొనడానికి ముందే ఆరోగ్య ఇబ్బందులు ఉన్నప్పటికీ వారికి తగిన ఆరోగ్య బీమా పాలసీలు తప్పక ఇవ్వాలని పేర్కొంది. ముందుగానే ఉన్న వ్యాధుల (పీఈడీ) విషయంలో బీమా రక్షణకు నిరీక్షించే కాలాన్ని మునుపటి 48 నెలల నుంచి 36 నెలలకే తగ్గించింది. బీమా అంశంలో ఈ సరికొత్త సంస్కరణలు అటు ఊహించని ఆరోగ్య ఖర్చులు ఎదురైన వృద్ధులకే కాక, వయసు మీద పడ్డ తల్లితండ్రుల సంరక్షణ బాధ్యతలు చూసుకుంటున్న ఉద్యోగులకూ పెద్ద ఊరట. తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, వ్యాధుల బారి నుంచి తమకు ప్రేమాస్పదులైన వ్యక్తులకు రక్షణనిచ్చేందుకు కొండంత అండ. వయోవృద్ధులకు పరిమిత ప్రయోజనాలే అందిస్తున్న ప్రస్తుత ధోరణి నుంచి బీమా సంస్థలు బయటకొచ్చి, తల్లితండ్రులతో సహా పాలసీదారు కుటుంబం మొత్తానికీ సమగ్ర బీమా వసతి కల్పించేలా కొత్త పాలసీలు తేగలుగుతాయి. ఇప్పటికే ఉన్న పాలసీలను సైతం మార్చగలుగుతాయి.నిజానికి, వయసు మీద పడ్డాకనే ఎవరికైనా ఆరోగ్య బీమా మరింత అవసరం, ఉపయోగం. ఇప్పటి దాకా నిర్ణీత వయసు దాటాక వ్యక్తిగత ఆరోగ్య బీమాకు వీలుండేది కాదు. కానీ, కొత్త సంస్క రణలతో ఆ అడ్డంకి తొలగింది. ప్రత్యేకించి రానున్న రోజుల్లో మన దేశ జనాభాకు ఇది కీలకం. 2011 తర్వాత దేశంలో జనగణన జరగలేదన్న మాటే కానీ, ఐరాస జనాభా నిధి, ఇతర నిపుణుల లెక్క ప్రకారం భారత జనాభా చైనాకు సమానంగా ఉంది. 2023లో ఒక దశలో మనం చైనాను దాటినట్టు కూడా అంచనా. ఈ ఐరాస అంచనాల ఆధారంగా నిరుడు ‘భారత వార్ధక్య నివేదిక – 2023’ను సిద్ధం చేశారు. దాని ప్రకారం దేశంలో 10 శాతమున్న సీనియర్ సిటిజన్ల జనాభా వచ్చే 2050 నాటికి ఏకంగా 30 శాతానికి పెరగనుంది. మరోమాటలో అరవై ఏళ్ళ పైబడిన వారి సంఖ్య 2022 నాటి 14.9 కోట్ల నుంచి 34.7 కోట్లకు చేరుతుంది. అది అమెరికా ప్రస్తుత జనాభా కన్నా ఎక్కువ. ఒక్క భారత్‌లోనే కాదు... అభివృద్ధి చెందిన అనేక దేశాల్లో వయోవృద్ధులు దాదాపు 16 నుంచి 28 శాతం దాకా ఉన్నారు. మెరుగైన ఆరోగ్య వసతులు, పెరిగిన ఆయుఃప్రమాణం వల్ల ఈ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ సీనియర్ సిటిజన్ల ఆరోగ్య రక్షణకు ప్రభుత్వ నిధులతో ప్రజారోగ్య వ్యవస్థలున్నా, ఇతర దేశాల్లో మాత్రం ఖరీదైన ప్రైవేట్ ఆరోగ్య సంరక్షణే దిక్కు. అలాంటి చోట్ల ఖర్చెక్కువ, వయసు పెరిగే కొద్దీ ఆరోగ్య బీమాకు చెల్లించాల్సిన ప్రీమియమ్లూ ఎక్కువన్నది నిజమే. కానీ, 65 ఏళ్ళు దాటితే కొత్తగా ఆరోగ్య బీమా తీసుకోవడానికి వీలు కాదనే నిబంధన చాలా దేశాల్లో లేదని గమనించాలి. ఇప్పుడు మన దేశమూ ఆ మార్గంలోకి వచ్చి, గరిష్ఠ వయఃపరిమితి షరతు లేకుండా, అన్ని వయసుల వారికీ ఆరోగ్య బీమా పాలసీలు అందుబాటులోకి తెచ్చిందన్న మాట. దానికి తోడు పీఈడీ నిరీక్షణ కాలాన్ని తగ్గించడం, తీవ్ర వ్యాధులున్నా సరే బీమా ఇవ్వాలనడం ప్రజానుకూల, ప్రశంసాత్మక నిర్ణయాలు. ప్రాధికార సంస్థ ఆ మధ్య జీవిత బీమా పథకాల సరెండర్ ఛార్జీల విషయంలో సంస్కరణలు తెచ్చింది. మళ్ళీ ఇప్పుడిలా వినియోగదారుల పక్షాన మరోసారి మరికొన్ని నిబంధనల్ని సవరించడం విశేషం. అయితే, అదే సమయంలో బీమా సంస్థలు తమ ఉత్పత్తులను వినియోగదారులకు స్నేహపూర్వకంగా ఉండేలా చూడడం అవసరం. ప్రాధికార సంస్థ ఆదేశాల స్ఫూర్తిని విస్మరించి, అందుబాటులో లేని అతి ఖరీదైన పాలసీలను సంస్థలు తీసుకొస్తే నిష్ప్రయోజనం. అర్థం కాని సాంకేతిక పదజాలం, సంక్లిష్టతలతో పాలసీలు తీసుకొచ్చినా కస్టమర్లు విముఖత చూపుతారు. పాలసీలలో పారదర్శకత పాటిస్తూ, ఇబ్బంది లేకుండా సులభంగా క్లెయిమ్‌లు పరిష్కారమయ్యే మార్గాన్ని బీమా సంస్థలు అనుసరిస్తే మంచిది. అప్పుడే వినియోగదారులు ఉత్సాహంగా ముందుకు వస్తారు. తాజా బీమా సంస్కరణల తాలూకు ఫలితమూ సమాజానికి అందివస్తుంది. దేశంలోని సీనియర్ సిటి జన్లలో నూటికి 98 మందికి ఇవాళ్టికీ ఆరోగ్య బీమా లేకపోవడం సిగ్గుచేటు. అంతకంతకూ పెరుగు తున్న వైద్య, ఆరోగ్యసేవల ఖర్చు రీత్యా బీమా ఆపత్కాలంలో బలమైన భరోసా. జీవితం పొడు గునా కుటుంబానికీ, సమాజానికీ తమ వంతు సేవ చేసి, ప్రకృతి సహజపరిణామంగా వయసుపై పడ్డ ఈ పండుటాకుల గురించి పాలకులు లోతుగా ఆలోచించాలి. బీమా పాలసీలొక్కటే సరిపోవు. ఆర్థికంగానే కాక ఆరోగ్యపరంగానూ వారి బాగు కోసం ఇతర ప్రత్యామ్నాయాలనూ అన్వేషించాలి. -
రూ.7.83లక్షల కోట్లకు చేరిన జీవిత బీమా ప్రీమియం
న్యూఢిల్లీ: గడిచిన ఆర్థిక సంవత్సరంలో జీవిత, సాధారణ బీమా సంస్థలు మెరుగైన వృద్ధిని చూపించాయి. జీవిత బీమా ప్రీమియం 2022–23 ఆర్థిక సంవత్సరంలో 13 శాతం పెరిగి రూ.7.83 లక్షల కోట్లకు చేరుకుంది. సాధారణ బీమా సంస్థల ప్రీమియం ఆదాయం సైతం 16.4 శాతం వృద్ధితో రూ.2.57 లక్షల కోట్లుగా ఉంది. గడిచిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన గణాంకాలను బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి (ఐఆర్డీఏఐ) సంస్థ విడుదల చేసింది. ప్రైవేటు జీవిత బీమా సంస్థల ఆదాయం 16.34 శాతం పెరగ్గా, ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థల (ఎల్ఐసీ) ఆదాయం 10.90 శాతం వృద్ధి చెందింది. మొత్తం ప్రీమియంలో రెన్యువల్ (పాత పాలసీల పునరుద్ధరణ) ప్రీమియం 52.56 శాతం వాటాను ఆక్రమించింది. మిగిలిన 47.44 శాతం ప్రీమియం నూతన పాలసీల రూపంలో సమకూరింది. రెన్యువల్ ప్రీమియం 8.88 శాతమే పెరగ్గా.. నూతన పాలసీ ప్రీమియం ఆదాయం 17.90 శాతం వృద్ధి చెందినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 285 లక్షల పాలసీలు 2022–23లో లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు 284.70 లక్షల నూతన పాలసీలను జారీ చేశాయి. ఇందులో ప్రభుత్వరంగ బీమా సంస్థలు జారీ చేసినవి 204.29 లక్షలుగా (71.75 శాతం) ఉన్నాయి. ప్రైవేటు జీవిత బీమా సంస్థలు 80.42 లక్షల పాలసీలను (28.25 శాతం) జారీ చేశాయి. జీవిత బీమా సంస్థల పన్ను అనంతరం లాభం ఐదు రెట్లు పెరిగి రూ.42,788 కోట్లుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.7,751 కోట్లుగా ఉంది. ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థల లాభం 800 శాతం పెరిగితే, ప్రైవేటు జీవిత బీమా సంస్థల లాభం 72.36 శాతం వృద్ధిని చూసింది. నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ (సాధారణ బీమా) రంగం మొత్తం రూ.257 లక్షల కోట్ల స్థూల ప్రీమియాన్ని అండర్ రైటింగ్ చేసింది. 27 ప్రైవేటు రంగ బీమా సంస్థలు (స్టాండలోన్ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థలు సహా) రూ.1.58 లక్షల కోట్ల ప్రీమియాన్ని అండర్రైట్ చేశాయి. ప్రభుత్వరంగ సాధారణ బీమా సంస్థలు 38.42 శాతం వాటా కలిగి ఉంటే, ప్రైవేటు సాధారణ బీమా సంస్థల వాటా 61.58 శాతంగా ఉంది. మొత్తం వ్యయాల్లో కమీషన్ (మధ్యవర్తులకు), నిర్వహణ వ్యయాలు ఎక్కువగా ఉంటున్నాయి. నాన్ లైఫ్ బీమా సంస్థల అండర్‌రైటింగ్ నష్టాలు రూ.32,797 కోట్లకు పెరిగిపోయాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఇవి రూ.31,810 కోట్లుగా ఉన్నాయి. వార్షికంగా నష్టాలు 3 శాతం పెరిగాయి. స్విస్ ఆర్ఈ సిగ్నా నివేదిక ప్రకారం మన దేశంలో జీవిత బీమా విస్తరణ 2022–23లో 3 శాతానికి తగ్గింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఇది 3.2 శాతంగా ఉంది. -
వంద శాతం క్యాష్‌లెస్ హెల్త్ క్లెయిమ్ - ఐఆర్డీఏఐ
ముంబై: పాలసీదారులు త్వరలోనే నూరు శాతం నగదు రహిత వైద్య సదుపాయం పొందేందుకు వీలుగా బీమా సంస్థలతో కలసి పనిచేస్తున్నట్టు బీమా రంగ అభివృద్ధి, నియంత్రణ సంస్థ (ఐఆర్డీఏఐ) ప్రకటించింది. నూరు శాతం క్యాష్‌లెస్ క్లెయిమ్ పరిష్కారాల కోసం బీమా సంస్థలు, నేషనల్ హెల్త్ అథారిటీ, బీమా కౌన్సిల్‌తో చర్చిస్తున్నట్టు ఐఆర్డీఏఐ చైర్మన్ దేవాశిష్ పాండా వెల్లడించారు. ముంబైలో జరుగుతున్న ఫిన్‌టెక్ ఫెస్ట్‌లో భాగంగా ఆయన ఈ అంశంపై మాట్లాడారు. పాలసీదారులు నగదు రహిత చికిత్సలు పొందే విషయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో పాండా దీన్ని ప్రస్తావించడం గమనార్హం. క్లెయిమ్ మొత్తంలో బీమా సంస్థలు నిబంధనల పేరుతో కొంత కోత పెడుతుండగా, కొన్ని క్లెయిమ్‌లను తిరస్కరించడం, రీయింబర్స్మెంట్ విధానంలో రావాలని కోరుతున్నాయి. నేషనల్ హెల్త్ ఎక్సే్ఛంజ్ పరిధిలోకి మరిన్ని హాస్పిటల్స్ చేర్చేందుకు కూడా ఇన్సూరెన్స్ కౌన్సిల్, నేషనల్ హెల్త్ అథారిటీతో సంప్రదింపులు చేస్తున్నట్టు పాండా తెలిపారు. వృద్ధులకు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీఇయం అందుబాటులో ఉండేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నట్టు చెప్పారు. -
ఈసారి బీమా సంస్థలకు అదనపు మూలధనం లేనట్లే..
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రభుత్వ రంగంలోని (పీఎస్‌యూ) సాధారణ బీమా సంస్థలకు కేంద్రం నుంచి అదనపు మూలధనం లభించకపోవచ్చని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. తమ అవసరాలకు తగినన్ని నిధులు ఆయా సంస్థల దగ్గర ఉండవచ్చని, ఈసారి ఒక కంపెనీ నుంచి కేంద్రానికి డివిడెండ్ కూడా వచ్చే అవకాశం ఉందని ఆయన వివరించారు. మూడు పీఎస్‌యూ బీమా సంస్థలు.. నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలకు కేంద్రం గతేడాది రూ. 5,000 కోట్ల మేర మూలధనం సమకూర్చింది. అయితే, 2023–24 బడ్జెట్లో మాత్రం బీమా కంపెనీలకు ఎలాంటి కేటాయింపులు జరపలేదు. బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్డీఏఐ నిబంధనల ప్రకారం బీమా సంస్థలు తాము చెల్లించాల్సి వచ్చే క్లెయిమ్ మొత్తాలకన్నా కొంత ఎక్కువగా మూలధన నిల్వలను ఉంచుకోవాలి. ఒకవేళ తీవ్రమైన పరిస్థితులేమైనా తలెత్తితే అన్ని క్లెయిమ్‌లను చెల్లించగలిగేందుకు (సాల్వెన్సీ మార్జిన్) ఈ నిధులు ఉపయోగపడతాయి. ప్రస్తుతం దేశీయంగా నాలుగు పీఎస్‌యూ బీమా సంస్థలు ఉండగా.. వాటిలో న్యూ ఇండియా అష్యూరెన్స్ మాత్రమే మెరుగ్గా రాణిస్తోంది. 2024 మార్చి నాటికి మూడు పీఎస్‌యూ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థలకు రూ. 17,200–17,500 కోట్ల మేర నిధులు అవసరమని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. 2020–21లో మూడు పీఎస్‌యూ సాధారణ బీమా సంస్థలకు కేంద్రం రూ. 9,950 కోట్లు కేటాయించింది. -
ఘోర ప్రమాదాలు, కీలక నిర్ణయం: రైల్వే ప్రయాణికులూ అలర్ట్!
ఇటీవల జరిగిన ఘోర రైలు ప్రమాదం తరువాత ఇండియన్ రైల్వేస్ కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఐఆర్సీటీసీ ప్రయాణీకులకు బీమా సౌకర్యాన్ని డీఫాల్ట్‌గా అందివ్వనుంది. తాజా నిర్ణయంతో వెబ్సైట్/యాప్‌లో టికెట్ బుక్ చేసుకొనే సమయంలో ట్రావెల్ ఇన్సూరెన్స్ కోసం బీమా ఆప్షన్ పక్కనున్న టిక్ బాక్స్‌ను ప్రత్యేకంగా ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇక నుంచి ఈ ఆప్షన్‌ను ఐఆర్సీటీసీ డిఫాల్ట్‌గా ఇస్తోంది. అంటే ఐఆర్సీటీసీ ద్వారా ట్రైన్ టికెట్ బుక్ చేసుకునే ప్రతి ఒక్కరికీ ఇన్సూరెన్స్ అనేది ఆటోమెటిక్‌గానే వస్తుంది. ఒకవేళ బీమా ప్రయోజనాలను వద్దనుకున్నవారు మాత్రం ఆ టిక్ మార్క్‌ను తొలగించుకునే సౌలభ్యం కూడా ఉంది. కానీ ప్రతి ప్రయాణీకులు దీన్ని వినియోగించుకోవడమే చాలా అవసరం. ఐఆర్సీటీసీ పోర్టల్‌లో తమ రైలు టిక్కెట్లను బుక్ చేసుకునే ప్రయాణీకులకు ఇప్పుడు ఆటోమేటిక్‌గా రూ. 10 లక్షల బీమా సౌకర్యం లభిస్తుందని బీమా పరిశ్రమలోని సీనియర్ అధికారి పేర్కొన్నారని ఐఏఎన్ రిపోర్ట్ చేసింది. అయితే దీనిపై ఐఆర్సీటీసీ అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన జారీ చేయలేదు. ఇందుకోసం భారత బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డిఎఐ)ఐఆర్సీటీసీకి మాత్రం వెసులుబాటు ఇచ్చింది. రైల్వే బీమాను ఎంచుకున్న ప్రయాణికుడికి రూ.10 లక్షల వరకు బీమా సదుపాయం లభిస్తుంది. రైలు ప్రమాదంలో మరణించినా, లేదా శాశ్వతంగా అంగవైకల్యం ఏర్పడితే బాధిత కుటుంబాలకు రూ.10 లక్షలు ఇన్సూరెన్స్‌ను రైల్వే శాఖ అందిస్తుంది. ఒకవేళ తీవ్రంగా గాయపడి పాక్షిక అంగ వైకల్యం ఏర్పడినప్పుడు రూ.7.5 లక్షల వరకు బీమా లభిస్తుంది. అలాగే గాయపడిన వైద్యఖర్చుల నిమిత్తం రూ.2 లక్షల వరకు అందిస్తారు. అయితే బీమా పాలసీని ఎంచుకున్న ప్రయాణికులు నామినీ వివరాలను జత చేయాల్సి ఉంటుంది. కాగా ఇప్పటివరకు రైల్వే టికెట్లు బుక్ చేసుకునే సమయంలో రైల్వే ట్రావెల్ ఇన్సూరెన్స్ ఆప్షన్ క్లిక్ చేసి నపుడు బీమా సౌకర్యం అందించే సౌకర్యం ఉండేది. ఈ రూ. 10 లక్షల ట్రావెల్ ఇన్సూరెన్స్ కోసం ఐఆర్సీటీసీ కేవలం 35 పైసలు మాత్రమే చార్జ్ చేసేది. ఈ బీమా కింద ప్రయాణికులు తమ రైలు ప్రయాణంలో విలువైన వస్తువులు, లగేజీని పోగొట్టుకుంటే పరిహారం లభించే సౌకర్య అందుబాటులోఉండేదన్న సంగతి తెలిసిందే. -
అప్పటికల్లా అందరికీ బీమా! మూడంచెల విధానం.. యూపీఐ తరహా విప్లవం
న్యూఢిల్లీ: దేశంలో 2047 నాటికి బీమాను అందరికీ చేరువ చేసేందుకు.. లభ్యత, పొందడం, అందుబాటు అనే మూడంచెల విధానాన్ని అనుసరిస్తున్నట్టు బీమా రంగ నియంత్రణ సంస్థ (ఐఆర్డీఏఐ) చైర్మన్ దేవాశిష్ పాండా తెలిపారు. 2047 నాటికి స్వాతంత్య్రం సిద్ధించి నూరేళ్లు అవుతున్నందున అప్పటికీ, బీమాను అందరికీ చేరువ చేయాలని ఐఆర్డీఏఐ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు సంబంధించి గడిచిన ఏడాది కాలంలో పలు చర్యలు కూడా తీసుకుంది. సీఐఐ నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా పాండా ఈ అంశంపై మాట్లాడారు. ‘‘బీమా రంగంలో యూపీఐ తరహా విప్లవాన్ని తీసుకొచ్చేందుకు లైఫ్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిళ్లతో కలసి పనిచేస్తున్నాం. ఇందుకు సంబంధించి ఓ ఊహాత్మక కార్యాచరణ గురించి ఆలోచించాం’’అని పాండా తెలిపారు. దేశంలో బీమా వ్యాప్తి తక్కువగా ఉండడం, పెద్ద మార్కెట్ కావడంతో ఈ రంగంలో పెట్టుబడులకు అపార అవకాశాలున్నట్టు చెప్పారు. -
బీమా పాలసీపై క్రెడిట్ కార్డ్ లోన్స్: ఇకపై ఇలా చేయలేరు!
సాక్షి, ముంబై: ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ) కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇన్సూరెన్స్ పాలసీలపై తీసుకున్న రుణాల చెల్లింపులకు క్రెడిట్ కార్డు వినియోగింకూడదని తేల్చి చెప్పింది. ఈ నిర్ణయం తక్షణమే అమలులోకి వస్తుందనీ, జీవిత బీమా సంస్థలన్నింటికీ ఇది వర్తిస్తుందని తెలిపింది. ఈ మేరకు గురువారం ఒక సర్క్యులర్ జారీ చేసింది. (కర్మను నమ్ముతారా? లేదా?ఈ వీడియోను చూడాల్సిందే: ఆనంద్ మహీంద్ర) ఇన్సూరెన్స్ పాలసీలను తనఖా పెట్టి తీసుకున్న రుణాలు చెల్లించేందుకు క్రెడిట్ కార్డును ఉపయోగించే సౌకర్యాన్ని నిలిపేయాలని ఐఆర్డీఏఐ జీవిత బీమా సంస్థలను కోరింది. పాలసీ లోన్ అంటే జీవిత బీమా సంస్థలు పాలసీదారుని పాలసీ సరెండర్ విలువ ఆధారంగా స్వల్పకాలిక లోన్స్ ఇవ్వడం. పాలసీదారులు తమ ఇన్సూరెన్స్ పాలసీలను తనఖాపెట్టి రుణాలు తీసుకోవడం. ఎండోమెంట్, మనీ-బ్యాక్ లేదా ఫుల్-లైఫ్ పాలసీ లాంటి జీవిత బీమా పాలసీల ద్వారా లోన్ ఫెసిలిటీ అందిస్తోంది. అయితే, టర్మ్,యూనిట్-లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీలు (యూలిప్స్) ఈ సదుపాయం లేదు. కోటక్ లైఫ్ ప్రకారం ప్రతీ జీవిత బీమా పాలసీపై రుణాన్ని పొందలేరు. ఈనేపథ్యంలో ప్లాన్‌ను కొనుగోలుకు ముందే బీమా కంపెనీని సంప్రదించాలి. అలాగే యూలిప్లపై కూడా రుణం తీసుకోవచ్చు. ఇది ఆయా సంస్థలపై ఆధారపడి ఉంటుంది. ఇదీ చదవండి: వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్‌గా అజయ్ బంగా: ఆయన వేతనం, నెట్‌వర్త్ ఎంతో తెలుసా? సాధారణంగా బీమా పాలసీ సరెండర్ విలువలో 90శాతం వరకు లోన్ తీసుకోవచ్చు. క్రెడిట్ కార్డు, వ్యక్తిగత రుణాలతో పోలిస్తే జీవిత బీమా పాలసీపై రుణాలపై వడ్డీ తక్కువ. కస్టమర్లు పాలసీ లోన్‌ను ఎప్పుడు కావాలంటే అప్పుడు తిరిగి చెల్లించ వచ్చు. అయితే వడ్డీ, లోన్ కలిపి పాలసీ సరెండ్ వ్యాల్యూని మించితే పాలసీ రద్దవుతుంది. కాగా గత ఏడాది ఆగస్టులో పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ( పీఎఫ్ఆర్డీఏ) కూడా దాదాపు ఇలాంటి నిర్ణయమే తీసుకుంది. నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) టైర్-2 అకౌంట్ సబ్స్క్రిప్షన్ చేసుకునేందుకు, నగదు జమ చేసేందుకు క్రెడిట్ కార్డు పేమెంట్లను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. -
ఇన్సూరెన్స్ కంపెనీలకు ఐఆర్డీఏఐ కీలక ఆదేశాలు..
సోషల్ మీడియా వినియోగానికి సంబంధించి ఇన్సూరెన్స్ కంపెనీలు తమ ఉద్యోగులకు మార్గదర్శకాలను రూపొందించాలని భారత బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) కోరింది. ఒక సంస్థ ప్రతిష్ట దాని ఉద్యోగుల ప్రవర్తనపై ఆధారపడి ఉంటుందని, సంస్థ ప్రతిష్టను పెంచేలా, విలువను జోడించే విధంగా ఉద్యోగులు సోషల్ మీడియాను ఉపయోగించాలని పేర్కొంది. ఇదీ చదవండి: ATM Fraud Alert: ఏటీఎం కార్డ్ మెషిన్లో ఇరుక్కుపోయిందా.. జాగ్రత్త! ఐఆర్డీఏఐ సైబర్ సెక్యూరిటీ మార్గదర్శకాలు ఇన్సూరెన్స్ కంపెనీలకు ఐఆర్డీఏఐ జారీ చేసిన సైబర్ సెక్యూరిటీ మార్గదర్శకాల్లో సోషల్ మీడియా వినియోగానికి సంబంధించి ప్రత్యేకంగా ప్రస్తావించింది. దాని ప్రకారం.. ఇన్సూరెన్స్ సంస్థలకు సంబంధించి ధ్రువీకరించని, గోప్యమైన సమాచారాన్ని ఉద్యోగులు తమ బ్లాగ్లు, చాట్ ఫోరమ్‌లు, డిస్కషన్ ఫోరమ్‌లు, మెసెంజర్ సైట్లు, సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో పోస్ట్ చేయకూడదు. ఏ ఉద్యోగికైనా సంస్థకు సంబంధించిన సమాచారం మెయిల్, మీడియా ఫోరమ్‌లలో లేదా ఇతర మార్గాల ద్వారా వస్తే దాన్ని ఏదైనా మీడియా ఫోరమ్‌లో పోస్ట్ చేయాలనుకున్నప్పుడు సంస్థ సమ్మతి కచ్చితంగా తీసుకోవాలి. సంస్థ సేవా లోపాన్ని నివేదించడానికి లేదా ఫిర్యాదు చేయడానికి మీడియా ఫోరమ్‌లను ఉపయోగించకూడదు. ఏదైనా సమాచారం వ్యక్తిగతంగా పోస్ట్ చేస్తున్నప్పుడు అది పూర్తిగా తన వ్యక్తిగతమైనదని, సంస్థకు ఎలాంటి సంబంధం లేదనే సూచనను తప్పకుండా ఉంచాలి. వ్యక్తిగత వెబ్సైట్లు లేదా సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో ఒక సంస్థ లేదా దాని వ్యాపారంపై ఎలాంటి విమర్శలు లేదా వ్యాఖ్యానాలు చేయకూడదు. విదేశీ రీ-ఇన్సూరెన్స్ బ్రాంచ్‌లు (FRB)తో సహా ఐఆర్డీఏఐ పరిధిలోని అన్ని బీమా సంస్థలకు ఈ మార్గదర్శకాలు వర్తిస్తాయి. బీమా సంస్థల కోసం 2017లో ఈ ఇన్ఫర్మేషన్, సైబర్ సెక్యూరిటీ మార్గదర్శకాలను ఐఆర్డీఏఐ జారీ చేసింది. తర్వాత 2022లో తమ పరిధిలోని అన్ని సంస్థలకూ విస్తరించింది. విస్తృతంగా పెరిగిన డిజిటల్ సాంకేతికత, సైబర్ భద్రతా సంఘటనలను పరిగణనలోకి తీసుకుంటూ సైబర్ దాడుల నుంచి బీమా పరిశ్రమ రక్షణ, సంబంధిత పాలనా యంత్రాంగాన్ని బలోపేతం చేయడానికి ఐఆర్డీఏఐ మార్గదర్శకాలను సవరించింది. ఇదీ చదవండి: ఏటీఎం చార్జీలు.. జీఎస్టీ కొత్తరూల్! మే 1 నుంచి అమలయ్యే కీలక మార్పులు ఇవే.. -
పరిశీలనలో మరో 20 బీమా కంపెనీల దరఖాస్తులు
ముంబై: ఇటీవలే కొన్ని బీమా సంస్థలకు లైసెన్సులు ఇచ్చిన బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్డీఏఐ మరో 20 దరఖాస్తులను పరిశీలిస్తోంది. పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ నిర్వహించిన సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఐఆర్డీఏఐ చైర్మన్ దేబాశీష్ పాండా ఈ విషయాలు చెప్పారు. కొన్నాళ్ల క్రితం జీవిత బీమా విభాగంలో క్రెడిట్ యాక్సెస్ లైఫ్, ఎకో లైఫ్‌కు లైసెన్సులు ఇవ్వగా కొత్తగా సాధారణ బీమాలో క్షేమా జనరల్ ఇన్సూరెన్స్‌కు అనుమతులు మంజూరు చేసినట్లు ఆయన వివరించారు. 2017 తర్వాత జనరల్ ఇన్సూరెన్స్ విభాగంలో ఒక సంస్థకు అనుమతులు ఇవ్వడం ఇదే ప్రథమం. 2047 నాటికి అందరికీ బీమా కల్పించాలన్న లక్ష్యాన్ని కేవలం నినాదంగా చూడొద్దని, దాన్ని సాకారం చేసే దిశగా తగు చర్యలు తీసుకుంటే డెడ్‌లైన్ కన్నా ముందే సాధించగలమని పాండా తెలిపారు. ఇందుకోసం పరిశ్రమ టెక్నాలజీని మరింతగా అందిపుచ్చుకోవాలని, వినూత్నంగా ఆలోచించాలని ఆయన చెప్పారు. టెక్నాలజీ ఆధారిత నవకల్పనలతో ఉత్పత్తుల వ్యయాలు తగ్గుతాయని పాండా తెలిపారు. ఈ విషయంలో అందరికీ ఆర్థిక సేవలను అందించే దిశగా బ్యాంకులు చేస్తున్న ప్రయత్నాలను పరిశీలించవచ్చని సూచించారు. ఆఖరు వ్యక్తి వరకూ చేరేందుకు ఆశా, అంగన్వాడీ వర్కర్లు, స్వయం సహాయక బృందాల తోడ్పాటు తీసుకోవచ్చని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశీయంగా 23 జీవిత బీమా సంస్థలు, 33 సాధారణ బీమా సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఫిబ్రవరి నాటికి వాటి నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ రూ. 59 లక్షల కోట్లుగా నమోదైంది. -
కమీషన్లపై బీమా కంపెనీలకు స్వేచ్ఛ
న్యూఢిల్లీ: కమీషన్ల పరంగా పరిమితులను బీమా రంగ అభివృద్ధి, నియంత్రణ సంస్థ (ఐఆర్డీఏఐ) తొలగించింది. బీమా కంపెనీలు తమ పాలసీలను విక్రయించే మధ్యవర్తులకు కమీషన్లు చెల్లిస్తుంటాయి. ఈ భారం పరోక్షంగా పాలసీదారులపైనే పడుతుంది. అందుకే లోగడ ఈ విషయంలో ఐఆర్డీఏఐ పరిమితులు పెట్టింది. తాజాగా వీటిని ఎత్తివేస్తున్నట్టు తెలిపింది. మధ్యవర్తులకు ఎంత కమీషన్ చెల్లించాలన్నది బీమా కంపెనీలే నిర్ణయించుకోవచ్చని పేర్కొంది. కాకపోతే పాలసీదారుల ప్రయోజనాలకు భంగం కలగకుండా ఇది ఉండాలని స్పష్టం చేసింది. పాలసీదారులు, ఏజెంట్ల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కమీషన్ పాలసీని ఇన్సూరెన్స్ కంపెనీ బోర్డ్ రూపొందించుకోవాలంటూ తాజాగా విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొంది. కమీషన్లలో సౌలభ్యం ఉంటే అది దేశంలో బీమా కవరేజీ వ్యాప్తికి దోహదపడుతుందని, వ్యయాల పరంగా సామర్థ్యాలను పెంచుతుందని పేర్కొంది. బోర్డు స్థాయిలో నిర్ణయించే కమీషన్ అనేది తాజా నోటిఫికేషన్లో పేర్కొన్న నిర్వహణ వ్యయ పరిమితుల పరిధిలోనే ఉండాలని స్పష్టంగా నిర్ధేశించింది. నూతన నిబంధనలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. నోటిఫికేషన్ తేదీ నుంచి ప్రతి మూడేళ్లకోసారి నిబంధనలను సమీక్షిస్తామని ఐఆర్డీఏఐ ప్రకటించింది. ఇప్పటి వరకు బీమా కంపెనీలు చెల్లించే కమీషన్లను ఉత్పత్తుల వారీగా ఐఆర్డీఏఐ నిర్ణయిస్తోంది. తాజా సవరణలు ఆవిష్కరణలను ప్రోత్సహిస్తాయనే అభిప్రాయాన్ని ఐఆర్డీఏఐ వ్యక్తం చేసింది. నూతన వ్యాపార నమూనాలు, ఉత్పత్తులు, వ్యూహాల అభివృద్ధికి వీలు కల్పిస్తాయని పేర్కొంది. సవరించిన నిర్వహణ వ్యయ పరిమితులు, కమీషన్ పరిమితులు అనేవి సరైన మార్గంలో ఉన్నాయని బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ ఎండీ తపన్ సింఘాల్ తెలిపారు. -
మానసిక, శారీరక వైకల్యం ఉన్న వారికి బీమా
న్యూఢిల్లీ: సాధారణ, స్టాండలోన్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు వైకల్యం ఉన్న వారు, హెచ్ఐవీ బాధితులు, మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న వారి కోసం ప్రత్యేకంగా బీమా ఉత్పత్తులను తీసుకు రావాలని బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) ఆదేశించింది. ఐఆర్డీఏఐ హెల్త్ ఇన్సూరెన్స్ మార్గదర్శకాలకు (2016) అనుగుణంగా ఈ ఉత్పత్తుల ప్రీమియం ధరలను నిర్ణయించాలని తన తాజా సర్క్యులర్‌లో పేర్కొంది. ఈ తరహా వ్యక్తులకు సంబంధించి పాలసీల క్లెయిమ్‌లు తిరస్కరించకుండా బోర్డు స్థాయిలో ఆమోదం పొందిన అండర్‌రైటింగ్ పాలసీని అందుబాటులోకి తీసుకురావాలని కూడా ఆదేశించింది. ఏడాది కాల వ్యవధితో బీమా ఉత్పత్తి ఉండాలని, దాన్ని ఏటా పునరుద్ధరించుకునే అవకాశం కల్పించాలని కోరింది. -
బీమా సంస్థలు పెరగాలి..అప్పుడే అందరికీ బీమా సాకారం!
ముంబై: దేశంలో 2047 నాటికి అందరికీ బీమాను చేరువ చేయాలన్న లక్ష్యం సాకారానికి మరిన్ని బీమా సంస్థలు రావాల్సిన అవసరం ఉందని బీమా రంగ అభివృద్ధి, నియంత్రణ సంస్థ (ఐఆర్డీఏఐ) చైర్మన్ దేవాశిష్ పాండా అభిప్రాయపడ్డారు. విస్తృతమైన, వైవిధ్యమైన బీమా ఉత్పత్తులు, మరిన్ని పంపిణీ భాగస్వాములు కూడా కావాలన్నారు. ప్రైవేటు ఈక్విటీ అండ్ వెంచర్ క్యాపిటల్ పరిశ్రమ అసోసియేషన్ వార్షిక సదస్సును ఉద్దేశించి పాండా మాట్లాడారు. ‘‘బీమా పరిశ్రమలో ప్రైవేటు సంస్థలకు ద్వారాలు తెరిచి రెండు దశాబ్దాలకు పైనే గడిచింది. బీమా మార్కెట్ ఎంతో వృద్ధి చెందింది. గడిచిన ఐదేళ్లలో బీమా రంగం ఏటా 10 శాతం వృద్ధిని చూసింది. అయినప్పటికీ 2021నాటికి బీమా విస్తరణ 4.2 శాతంగానే ఉంది. మరింత మందికి చేరువ కావాల్సి ఉంది. 140 కోట్ల జనాభా ఉన్న వైవిధ్యభరిత దేశం. అందరికీ ఒక్కటే విధానం సరిపోదు. అధిక ధనవంతులు, పేద ప్రజల కోసం విభిన్నమైన బీమా పరిష్కారాలు అవసరం. అలాంటి వినూత్నమైన ఉత్పత్తులను నేడు ఉన్న 70 కంపెనీల నుంచి సాధ్యం కాదు. కనుక మరిన్ని కంపెనీలు రావాలి. విస్తృతమైన బీమా ఉత్పత్తులు, పంపిణీదారులు కూడా అవసరం. అప్పుడే 2047 నాటికి అందరికీ బీమా లక్ష్యాన్ని సాధించగలం’’అని దేవాశిష్ పాండా వివరించారు. -
బీమా వ్యాప్తికి భారీ పెట్టుబడులు అవసరం
ముంబై: దేశంలో బీమా రక్షణ మరింత మంది ప్రజలను చేరుకునేందుకు వీలుగా ఏటా రూ.50,000 కోట్ల పెట్టుబడులు అవసరమని బీమా రంగ అభివృద్ధి, నియంత్రణ సంస్థ (ఐఆర్డీఏఐ) చైర్మన్ దేవాశిష్‌పాండా అన్నారు. అప్పుడే వచ్చే ఐదేళ్లలో రెట్టింపు జనాభాను చేరుకోవచ్చని చెప్పారు. బీమా రంగంలోకి పెట్టబడులు తీసుకురావాలని వ్యాపార దిగ్గజాలను ఆయన కోరారు. జీవిత బీమా కంపెనీల రిటర్న్ ఆన్ ఈక్విటీ (ఈక్విటీపై రాబడి) 14 శాతంగా ఉంటే, నాన్ లైఫ్ కంపెనీలకు 16 శాతంగా ఉన్నట్టు చెప్పారు. మొదటి ఐదు కంపెనీలకు ఇది 20 శాతం వరకు ఉంటుందని పేర్కొన్నారు. బీమా రంగంలో రెండు డజనుల జీవిత బీమా కంపెనీలు, 30కి పైగా జీవితేతర బీమా కంపెనీలు పనిచేస్తున్నాయి. అయినప్పటికీ 2020–21 చివరికి దేశంలో బీమా విస్తరణ 4.2 శాతంగానే ఉండడం గమనార్హం. ముంబైలో సీఐఐ నిర్వహించి బీమా, పెన్షన్ వార్షిక సదస్సును ఉద్దేశించి పాండా మాట్లాడారు. జీడీపీ వృద్ధి, ద్రవ్యోల్బణం, ప్రస్తుతం విస్తరణ తదితర అంశాల ఆధారంగా ఏటా 50వేల కోట్ల పెట్టుబడులు కావాలన్న విశ్లేషణకు వచ్చినట్టు చెప్పారు. దీనికి సంబంధించి కార్యాచరణ కోసం మార్చి తర్వాత బీమా సంస్థల అధినేతలతో సమావేశం కానున్నట్టు తెలిపారు. వచ్చే ఐదేళ్లలో బీమాను రెట్టింపు సంఖ్యలో ప్రజలకు చేరువ చేయాలన్న లక్ష్యంతో పని చేస్తున్నామంటూ.. 2047 నాటి కి (స్వాతంత్య్రం వచ్చి 100 ఏళ్లు) అందరికీ బీమా లక్ష్యం సాధ్యమేనన్నారు. ప్రస్తుతం బీమా రంగంలో భారత్ పదో అతిపెద్ద మార్కెట్‌గా ఉంటే, 2032 నాటికి ఆరో స్థానానికి చేరుకుంటుందని తెలిపారు. ప్రాపర్టీ ఇన్సూరెన్స్ తప్పనిసరి.. బీమా రంగం సంప్రదాయ లేదా పాత తరహా ఉత్పత్తులనే అందిస్తోందని, నూతన అవసరాలను విశ్లేషించి, పాలసీదారుల అవసరాలకు అనుగుణంగా కొత్త ఉత్పత్తులు తీసుకురావాలని దేవాశిష్ పాండా కోరారు. గృహ రంగ నియంత్రణ సంస్థను కలసి ప్రాపర్టీ ఇన్సూరెన్స్ (హౌస్ ఇన్సూరెన్స్) తప్పనిసరిగా తీసుకోవడం అమల్లోకి తేవాలని సూచించారు. లేదంటే కేంద్ర గృహ నిర్మాణ శాఖతో కలసి ప్రాపర్టీ ఇన్సూరెన్స్ అవసరాన్ని తెలియజేయాలని కోరారు. వాణిజ్య బ్యాంకులతో ఒప్పందాలు చేసుకుని బీమా ఉత్పత్తులను విక్రయించడానికే పరిమితం కావద్దని.. నాన్ బ్యాంక్ రుణదాతలు, ఎన్బీఎఫ్సీలు, కోపరేటివ్ బ్యాంకులు, పేమెంట్ అగ్రిగేటర్లతోనూ చేతులు కలపాలని పాండా సూచించారు. మెరుగైన యాన్యూటీలను తేవాలి ఇదే కార్యక్రమంలో పాల్గొన్న పీఎఫ్ఆర్డీఏ శాశ్వత సభ్యుడు మనోజ్ ఆనంద్ మాట్లాడుతూ.. ద్రవ్యోల్బణ ప్రభావం నుంచి వ్యక్తులను రక్షించే (మెరుగైన రాబడులతో కూడిన) యాన్యూటీ ప్లాన్లను తీసుకురావాలని బీమా సంస్థలకు సూచించారు. వచ్చే ఐదేళ్లలో బీమా సంస్థలు నిర్వహించే యాన్యూటీ ప్లాన్లలోకి రూ.11,000 కోట్ల పెట్టుబడులు వస్తాయనే అంచనాను వ్యక్తం చేశారు. నూతన పెన్షన్ విధానమే ఉద్యోగులకు మరింత ప్రయోజనం కలిగిస్తుందన్నారు. -
3 కోవిడ్ టీకాలు తీసుకున్నవారికి బంపరాఫర్!
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా పలు దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) చర్యలకు నడుం బిగించింది. మూడు డోసులు టీకా తీసుకున్న వారికి సాధారణ, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల పునరుద్ధరణపై డిస్కౌంట్ ఇవ్వాలని అన్ని బీమా సంస్థలను కోరింది. కరోనా క్లెయిమ్‌లను వీలైనంత త్వరితంగా పరిష్కరించాలని, డాక్యుమెంట్ల అవసరాన్ని తగ్గించాలని కోరింది. బీమా సంస్థలు తమ వెల్‌నెట్ నెట్వర్క్ ద్వారా ఆర్టీపీసీఆర్ టెస్ట్‌లు నిర్వహించుకునే విధంగా పాలసీదారులను ప్రోత్సహించాలని, ఇందుకు వారికి రాయితీలు కల్పించాలని సూచించింది. కోవిడ్ నిబంధనలను పాలసీదారులు అనుసరించేలా సామాజిక మాధ్యమాల ద్వారా వారిని ప్రోత్సహించాలని బీమా సంస్థలతో నిర్వహించిన సమావేశంలో భాగంగా కోరినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. విదేశీ ప్రయాణ బీమా పాలసీలు తీసుకునే వారికి, పలు దేశాల్లో కరోనా పరీక్షల నిర్వహణ అవసరాల గురించి తెలియజేయాలని ఐఆర్డీఏఐ సూచించింది. కరోనాతో చికిత్స కోసం వచ్చే పాలసీదారుల నుంచి నెట్వర్క్ హాస్పిటళ్లు డిపాజిట్ తీసుకోకుండా చూడాలని కోరింది. నగదు రహిత సదుపాయం ఉన్న ఆస్పత్రుల్లో చేరినప్పటికీ, కరోనా మొదటి, రెండో విడతలో చాలా ఆస్పత్రులు రోగుల నుంచి డిపాజిట్లు తీసుకున్నాయి. దీంతో ఐఆర్డీఏఐ ఈ సూచన చేసింది. కరోనా కేసులు ఒకవేళ అధికంగా వస్తే సాయం అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాలని కోరింది. 2022 మార్చి నాటికి బీమా సంస్థలు కరోనాకు సంబంధించి 2.25 లక్షల క్లెయిమ్‌లను పరిష్కరించడం గమనార్హం. -
వాహనదారులకు ముఖ్య గమనిక!
న్యూఢిల్లీ: కార్లకు మూడేళ్లు, ద్విచక్ర వాహనాలకు ఐదేళ్ల మోటారు బీమా ప్రతిపాదనను బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) తీసుకొచ్చింది. థర్డ్ పార్టీ (ఇతరులకు వాటిల్లే నష్టానికి), ఓన్ డ్యామేజ్ (సొంత వాహనం నష్టానికి)కు సంబంధించి దీర్ఘకాల మోటార్ బీమా ఉత్పత్తుల ప్రతిపాదనతో ముసాయిదాను విడుదల చేసింది. దీని ప్రకారం అన్ని జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు మూడేళ్లు, ఐదేళ్ల కాల వ్యవధితో కార్లకు, ద్విచక్ర వాహనాలకు బీమా ఉత్పత్తులను ఆఫర్ చేయవచ్చు. ప్రీమియం మొత్తం వాహనం విక్రయం సమయంలోనే వసూలు చేస్తారు. ప్రస్తుతం ఏడాది కాల ఓన్ డ్యామేజ్ ప్లాన్లపై అందిస్తున్న నో క్లెయిమ్ బోనస్ (ఎన్సీబీ) ప్రయోజనాన్ని దీర్ఘకాల ఉత్పత్తులకూ అందించొచ్చని ఐఆర్డీఏఐ పేర్కొంది. రెన్యువల్ సమయంలో ఈ ఎన్సీబీ అమల్లోకి వస్తుంది. ఇక అగ్ని ప్రమాదాలకు సంబంధించి కూడా దీర్ఘకాలిక బీమా ఉత్పత్తులపై ఒక ముసాయిదాను విడుదల చేసింది. ఇళ్లకు 30 ఏళ్ల బీమా కవరేజీ అందించడం ఇందులో ఒక ప్రతిపాదనగా ఉంది. -
మ్యాక్స్ ఫిన్‌కు సుమితోమో వాటా
న్యూఢిల్లీ: మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్‌లో మిగిలిన వాటాను కొనుగోలు చేసేందుకు బీమా నియంత్రణ సంస్థ ఐఆర్డీఏఐ తాజాగా మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌ను అనుమతించింది. దీంతో మిత్సుయి సుమితోమో కంపెనీకి గల 5.17 శాతం వాటాను రానున్న రెండు వారాల్లోగా సొంతం చేసుకునే వీలున్నట్లు మ్యాక్స్ ఫైనాన్షియల్ పేర్కొంది. షేరుకి రూ. 85 ధరలో 9.91 కోట్ల మ్యాక్స్ లైఫ్ షేర్లను కొనుగోలు చేయనున్నట్లు మాతృ సంస్థ వెల్లడించింది. ఈ కొనుగోలు తదుపరి మ్యాక్స్ లైఫ్‌లో మాతృ సంస్థ వాటా 87 శాతానికి బలపడనుంది. గతంలో మ్యాక్స్ లైఫ్‌లో మిత్సుయి సుమితోమో 25.48 శాతం, మ్యాక్స్ ఫైనాన్షియల్ 72.52 శాతం చొప్పున వాటాలను కలిగి ఉండేది. -
బీమా కంపెనీలకు ఐఆర్డీఏఐ కీలక ఆదేశాలు
న్యూఢిల్లీ: ఔట్ పేషెంట్ (ఓపీడీ), ఇతర సేవలను అందించేందుకు డాక్టర్ల నెట్వర్క్ లేదా ఇతర ఆరోగ్య రంగ నిపుణులతో రిజిస్ట్రీ ఏర్పాటు చేసుకోవాలని.. బీమా కంపెనీలను బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) కోరింది. ‘‘ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కింద నేషనల్ హెల్త్ అథారిటీ ‘ఆరోగ్య సంరక్షణ నిపుణుల రిజిస్ట్రీ’ (హెచ్‌పీఆర్)ని ఏర్పాటు చేసింది. ఇందులో నమోదిత డాక్టర్లు, ఇతర ఆరోగ్య రంగ నిపుణుల వివరాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఆధునిక, సంప్రదాయ ఆరోగ్య సేవలను అందించేందుకు ఇది సాయపడుతుంది. సాధారణ, ఆరోగ్య బీమా కంపెనీలు సైతం పాలసీదారులకు ఓపీడీ, ఇతర సేవలు అందించేందుకు వీలుగా.. ఈ హెచ్‌పీఆర్ సాయంతో డాక్టర్లు/ఫిజీషియన్లు లేదా ఆరోగ్య రంగ నిపుణులతో నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకోవాలి’’అని ఐఆర్డీఏఐ తన ఆదేశాల్లో పేర్కొంది. మెడికల్ ప్రాక్టీషనర్ల గుర్తింపు, ధ్రువీకరణకు హెచ్‌పీఆర్ ఐడీని ఉపయోగించుకోవాలని సూచించింది. -
ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమా
న్యూఢిల్లీ: దేశంలో ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమాను (సార్వత్రిక ఆరోగ్య బీమా) చేరువ చేసే లక్ష్యంతో.. బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) 15 మంది సభ్యులతో ‘హెల్త్ ఇన్సూరెన్స్ కన్సల్టేటివ్ కమిటీ’ని (ఆరోగ్య బీమా సంప్రదింపుల కమిటీ) ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. రెండేళ్ల కాలానికి ఈ కమిటీని నియమించింది. ఈ కమిటీకి ఐఆర్డీఏఐ సభ్యుడైన రాకేశ్ జోషి నేతృత్వం వహిస్తారు. హెల్త్ ఇన్సూరెన్స్ సజావుగా నిర్వహించుకునేందుకు, వ్యాపార సులభతర నిర్వహణకు సూచనలు ఇవ్వాలని ఐఆర్డీఏఐ కోరింది. దేశంలో ప్రతి కుటుంబం ఆరోగ్య బీమా కలిగి ఉండడం అవసరమని పేర్కొంది. ‘‘దేశంలో హెల్త్ ఇన్సూరెన్స్ విస్తరణను పెంచాలి. ఇందుకు అడ్డుగా ఉన్న సవాళ్లు, సమస్యలను గుర్తించి, వాటిని అధిగమించేందుకు అవసరమైన సిఫారసులు చేయాలి’’అని కమిటీని కోరింది. డేటా విశ్లేషణ సహా పలు విధానాల అమలులో ప్రామాణిక విధానాలను కూడా కమిటీ సూచించనుంది. మారుతున్న ఆరోగ్య సంరక్షణ అవసరాలకు తగ్గట్టు హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందాలని ఐఆర్డీఏఐ పేర్కొంది. ఆరోగ్య సంరక్షణ వ్యయాలను తట్టుకునేందుకు రక్షణగా బీమాను కొనుగోలు చేస్తున్న వారి.. అన్ని రకాల అవసరాలను తీర్చేలా ఉండాలని అభిప్రాయపడింది.