Variation Standard Insurance Policies | Know More about Different Policies - Sakshi
Sakshi News home page

Insurance Policy: ఈ పాలసీలు.. ఎంతో సులభం

Published Mon, Sep 6 2021 12:54 AM | Last Updated on Mon, Sep 6 2021 11:23 AM

variation of standard insurance policies - Sakshi

బీమా పాలసీల్లోని సదుపాయాలను సులభంగా అర్థం చేసుకోవడం అందరికీ సాధ్యపడేది కాదు. ఒక్కో కంపెనీ ప్లాన్‌ భిన్నమైన ప్రయోజనాలు, మినహాయింపులు, షరతులతో ఉంటుంది. కనుక పాలసీదారులు వీటిని అర్థం చేసుకోవడం కష్టమని తెలుసుకున్న బీమా రంగ నియంత్రణ , అభివృద్ధి సంస్థ (ఐఆర్‌డీఏఐ) ఒకే విధమైన ఫీచర్లతో అన్ని బీమా కంపెనీలు.. ఒకే పేరుతో ఒక ప్రామాణిక పాలసీని ప్రవేశపెట్టాలంటూ ఆదేశాలు తీసుకొచి్చంది. వీటినే స్టాండర్డ్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్లుగా పిలుస్తారు. ఆరోగ్య సంజీవని, సరళ్‌ జీవన్‌ బీమా, సరళ్‌ పెన్షన్, సరళ్‌ సురక్షా ఇలాంటివన్నీ కూడా ప్రామాణిక పాలసీలే. వీటి ప్రీమియంలు అందుబాటు ధరల్లోనే ఉంటాయి. కాకపోతే వీటిల్లో పరిమితులు కూడా ఉంటాయి కనుక అందరికీ కాకుండా.. కొందరికే అనుకూలం.

బీమా పాలసీల విషయంలో ‘కరోనా’ఓ కనువిప్పుగానే చూడాలి. ఈ వైరస్‌ కారణంగా ఆస్పత్రుల పాలై ఆరి్థకంగా చితికిపోయిన వారు ఎందరో ఉన్నారు. అంతేకాదు బీమా రక్షణ లేని కారణంగా మరణించిన వారి కుటుంబాలూ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఫలితంగా చాలా మంది జీవిత బీమా, ఆరోగ్య బీమా, ప్రమాద మరణం/వైకల్య పరిహార బీమాల ప్రాధాన్యాన్ని అర్థం చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు లేని వారు పాలసీలను తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. స్టాండర్డ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీల్లో కవరేజీ, సదుపాయాలు, రైడర్లు బీమా సంస్థలు అన్నింటిలోనూ ఒకే మాదిరిగా ఉంటాయి.

ఆరోగ్య సంజీవని పేరుతో హెల్త్‌ ప్లాన్, సరళ్‌ జీవన్‌ బీమా పేరుతో టర్మ్‌ ప్లాన్‌.. సరళ్‌ పెన్షన్‌ (యాన్యుటీ/పెన్షన్‌) ప్లాన్, సరళ్‌ సురక్షా బీమా (వ్యక్తిగత ప్రమాద కవరేజీ) ప్లాన్, కరోనా కవచ్, కరోనా రక్షక్‌ (కరోనా చికిత్సల ప్లాన్‌లు), భారత్‌ గృహ రక్ష (హోమ్‌ ఇన్సూరెన్స్‌) ఇవన్నీ స్టాండర్డ్‌ బీమా పథకాలే. వీటిని ఎంపిక చేసుకోవడానికి ముం దు.. నియమ, నిబంధనలు ఒక్కసారి తెలుసుకోవాలి. ఈ పాలసీలు  ఏం ఆఫర్‌ చేస్తున్నాయి.. ప్రీమియం ఎంతన్నదీ చూడాలి. తమ వ్యక్తిగత, కుటుంబ అవసరాలను తీర్చేవేనా? అన్న పరిశీలన కూడా చేసుకోవాలి. అప్పుడే వీటిపై ఒక అవగాహనకు రావడానికి వీలవుతుంది.

సరళ్‌ జీవన్‌ బీమా
అచ్చమైన టర్మ్‌ పాలసీ ఇది. పాలసీ కాల వ్యవధి పూర్తయ్యే వరకు జీవించి ఉంటే ఎటువంటి రాబడులను రానటువంటి పాలసీ. పాలసీదారు మరణించిన సందర్భాల్లోనే నామినీకి పరిహారం లభిస్తుంది. వార్షిక ప్రీమియానికి 10 రెట్లు లేదా మరణించే నాటికి చెల్లించిన ప్రీమియంతో కలిపి 105 శాతం, లేదా సమ్‌ అష్యూరెన్స్‌ (బీమా కవరేజీ) వీటిలో ఏది ఎక్కువగా ఉంటే ఆ మొత్తం నామినీకి కంపెనీ చెల్లిస్తుంది. ఒకవేళ సింగిల్‌ ప్రీమియం పాలసీలు అయితే చెల్లించిన ప్రీమియానికి 125 శాతం లేదా బీమా కవరేజీ ఈ రెండింటిలో గరిష్ట మొత్తాన్ని చెల్లిస్తుంది. ఐఆర్‌డీఏఐ మార్గదర్శకాల మేరకు సరళ్‌ జీవన్‌ బీమా ప్లాన్‌తోపాటు రెండు రైడర్లను కూడా తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. యాక్సిడెంట్‌ డెత్‌ బెనిఫిట్‌ రైడర్, పర్మనెంట్‌ డిజేబిలిటీ రైడర్‌ను ఎంపిక చేసుకోవచ్చు.

ఇతర టర్మ్‌ పాలసీలతో పోలిస్తే సరళ్‌ జీవన్‌ బీమా ప్లాన్‌లో 45 రోజుల వేచి ఉండే కాల వ్యవధి (పాలసీ జారీ చేసిన తేదీ నుంచి) అమలవుతుంది. కాకపోతే ఈ 45 రోజుల వ్యవధిలో ప్రమాదం కారణంగా మరణిస్తే పరిహారం లభిస్తుంది. ప్రమాదం కాకుండా ఇతర ఏ రూపంలో మరణం సంభవించినా బీమా పరిహారానికి అర్హత లభించదు. కేవలం చెల్లించిన ప్రీమియం వరకే నామినీకి లభిస్తుంది. టర్మ్‌ పాలసీలు ముక్కుసూటి పథకాలు. ఎటువంటి గందరగోళం లేకుండా జీవితానికి పూర్తి రక్షణ కల్పించేవి.

వార్షిక ఆదాయానికి 10–15 రెట్ల వరకు అయినా బీమా పరిహారం కచ్చితంగా ఉండాలన్నది సాధారణంగా అనుసరించే విధానం. కానీ, సరళ్‌ జీవన్‌ బీమా ప్లాన్‌ను చాలా కంపెనీలు గరిష్టంగా రూ.25 లక్షలకే ఇస్తున్నాయి. కనుక తక్కువ ఆదాయం ఉన్న వారికి ఇది అనుకూలంగా ఉంటుంది. మెరుగైన ఆదాయం ఉన్న వారు సాధారణ టర్మ్‌ ప్లాన్‌ను తీసుకోవడాన్ని పరిశీలించొచ్చు. సాధారణ టర్మ్‌ ప్లాన్‌ వ్యక్తి ఆదాయానికి తగినట్టు గరిష్ట కవరేజీతో వస్తుంది.  
  ∙
ఉదాహరణకు.. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ సరళ్‌ జీవన్‌ బీమా ప్లాన్‌ను 40 ఏళ్ల కాలానికి రూ.25లక్షల కవరేజీతో తీసుకోవాలంటే.. 30 ఏళ్ల వ్యక్తి వార్షికంగా చెల్లించాల్సిన ప్రీమియం సుమారు రూ.12,312 (జీఎస్‌టీ కాకుండా). అదే ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ సంస్థ ఆఫర్‌ చేసే ఐప్రొటెక్ట్‌ స్మార్ట్‌ టర్మ్‌ ప్లాన్‌లో రూ.50 లక్షల కవరేజీకి జీఎస్‌టీ కాకుండా వార్షికంగా చెల్లించాల్సిన ప్రీమియం రూ.9,987. ఈ విధంగా చూసుకుంటే సరళ్‌తో పోలిస్తే సాధారణ టర్మ్‌ ప్లాన్‌లో తక్కువ ప్రీమియానికి అధిక కవరేజీ లభిస్తున్నట్టు అర్థం అవుతోంది.

ప్రమాదం కారణంగా పాలసీదారు శాశ్వత వైకల్యానికి గురైతే ఆ తర్వాత నుంచి ప్రీమియం చెల్లించకుండా ఉండే ప్రీమియం వైవర్‌ ఐప్రొటెక్ట్‌ సస్మార్ట్‌ ప్లాన్‌లో ఉంది. టర్మ్‌ ప్లాన్‌ తీసుకోవాలంటే ఆదాయానికి సంబంధించి రుజువులు కచి్చతంగా ఉండాల్సిందే. కొన్ని రకాల ఉద్యోగాల్లోని వారికి టర్మ్‌ ప్లాన్‌ను కంపెనీలు ఆఫర్‌ చేయడం లేదు. కనుక ఇటువంటి వారు సరళ్‌ జీవన్‌ బీమాను పరిగణనలోకి తీసుకోవచ్చు. గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే పెరుగుతున్న ఆదాయానికి అనుగుణంగా బీమా కవరేజీని కూడా ఎప్పటికప్పుడు పెంచుకోవడం అవసరం. అవసరమైతే ఈ రంగంలో నిపుణుల సలహా తీసుకోవాలి.

ఆరోగ్య సంజీవని
అన్ని సాధారణ, హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలు ఈ ప్లాన్‌ను బేసిక్‌ పాలసీ కింద ఆఫర్‌ చేస్తున్నాయి. ఆస్పత్రిలో చేరడం వల్ల ఎదురయ్యే ఖర్చులను ఈ పాలసీ చెల్లిస్తుంది. డేకేర్‌ ట్రీట్‌మెంట్లకు (ఆస్పత్రిలో ఉండాల్సిన అవసరం లేని చికిత్సలు) ఈ పాలసీలో కవరేజీ ఉంటుంది. పాలసీ తీసుకున్న 30 రోజుల వరకు వేచి ఉండే కాలం అమలవుతుంది. అలాగే, కొన్ని వ్యాధులకు పాలసీ అమల్లోకి వచి్చన రెండేళ్ల తర్వాతే కవరేజీ లభిస్తుంది. ఒక పాలసీ సంవత్సరంలో క్లెయిమ్‌లు లేనట్టయితే బోనస్‌ కూడా ఇందులో అందుకోవచ్చు. అయితే, ఆరోగ్య సంజీవని హెల్త్‌ ప్లాన్‌లో కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. సబ్‌ లిమిట్స్‌ ముఖ్యమైనది.

ఆస్పత్రిలో గది అద్దె, ఐసీయూ చార్జీలకు ఇందులో పరిమితులు అమలవుతాయి. బీమా సంస్థ నిర్దేశించిన పరిమితులకు మించి గది అద్దె, ఐసీయూ చార్జీలు ఉంటే కనుక అప్పుడు పాలసీదారు మొత్తం బిల్లులో కొంత మొత్తాన్ని తన చేతి నుంచి చెల్లించుకోవాల్సి వస్తుంది. రూ.10 లక్షల కవరేజీతో ఆరోగ్య సంజీవని ప్లాన్‌ తీసుకున్నా సరే సబ్‌ లిమిట్స్‌ కారణంగా పాలసీదారు తనవంతుగా ఎంతో కొంత చెల్లించుకోక తప్పదు. మరో ముఖ్యమైన ప్రతికూల అంశం.. 5 శాతం కోపే నిబంధన ఇందులో ఉంటుంది. అంటే ప్రతీ క్లెయిమ్‌కు 5 శాతాన్ని పాలసీదారు స్వయంగా భరించాల్సి ఉంటుంది. ముందు చెప్పుకున్న సబ్‌ లిమిట్స్‌ కారణంగా పాలసీదారు కొంత మొత్తాన్ని సొంతంగా చెల్లించుకోవాల్సిన దానికి ఇది అదనం.  

సాధారణ హెల్త్‌ప్లాన్‌లు నేడు చాలా వరకు సబ్‌ లిమిట్స్, కోపే లేకుండానే వస్తున్నాయి. ముఖ్యంగా రూమ్‌రెంట్, ఐసీయూ చార్జీల విషయంలో పరిమితుల్లేకుండా ప్లాన్లను బీమా సంస్థలు ఆఫర్‌ చేస్తున్నాయి. ముఖ్యంగా ఆరోగ్య సంజీవని ప్లాన్‌లో రీస్టోరేషన్‌ సదుపాయం లేదు. ఆస్పత్రిలో చేరడం వల్ల బీమా కవరేజీ మొత్తం ఒకే విడత ఖర్చయిపోయిందనుకోండి.. అప్పుడు బీమా సంస్థలు అంతే మొత్తం కవరేజీని అదే సంవత్సరానికి రీస్టోరేషన్‌ కింద పునరుద్ధరిస్తాయి. దీంతో అదే వ్యక్తి మళ్లీ అదే పాలసీ సంవత్సరంలో ఆస్పత్రిలో చేరాల్సి వస్తే (మరో సమస్య వల్ల), లేదా కుటుంబ సభ్యుల్లో వేరొకరు ఆస్పత్రిలో చేరాల్సిన పరిస్థితి ఎదురైతే రీస్టోరేషన్‌ అక్కరకు వస్తుంది.

వార్షిక ప్రీమియం, సబ్‌ లిమిట్స్, నో క్లెయిమ్‌ బోనస్, కోపే, ఏటా ఉచితంగా హెల్త్‌ చెకప్‌లు, ఓపీడీ చికిత్సలకు కవరేజీ సదుపాయాలను సాధారణ హెల్త్‌ ప్లాన్లలో చూడొచ్చు. మీ అవసరాలు, ప్రీమియం చెల్లింపుల సామర్థ్యం ఆధారంగా ఆరోగ్య సంజీవని లేదా సాధారణ హెల్త్‌ ప్లాన్లలో ఏదన్నది నిర్ణయించుకోవాలి. చాలా కంపెనీలు ఆరోగ్య సంజీవని ప్లాన్‌ ప్రీమియం స్థాయిల్లోనే మరింత మెరుగైన ఫీచర్లతో సాధారణ హెల్త్‌ ప్లాన్లను (నామమాత్రపు పరిమితులు లేదా పరిమితుల్లేకుండా) ఆఫర్‌ చేస్తున్నాయి.

సరళ్‌ సురక్షా బీమా
ఇది వ్యక్తిగత ప్రమాద బీమా ప్లాన్‌. అన్ని సాధారణ, హెల్త్, లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలు ఈ ప్లాన్‌ను ఆఫర్‌ చేస్తున్నాయి. ప్రమాదంలో మరణించినా లేక పూర్తి, పాక్షిక అంగవైకల్యం (శాశ్వతంగా) పాలైన సందర్భంలో ఈ ప్లాన్‌ కింద నామినీకి పరిహారం లభిస్తుంది. ప్రమాదానికి గురైన తర్వాత 12 నెలల్లోపు మరణించినా కానీ పరిహారానికి అర్హత లభిస్తుంది. ప్రమాదం వల్ల వైకల్యానికి లోనయితే పాలసీ నియమ, నిబంధనలకు అనుగుణంగా పరిహారం చెల్లింపు ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు శాశ్వత అంగవైకల్యం పాలైతే 100 శాతం బీమా పరిహారంగా అందుకోవచ్చు. ప్రమాదం నమోదైన తేదీ నుంచి 12 నెలల్లోపు అంగవైకల్యానికి గురైనా పరిహారం    లభిస్తుంది.  ఈ ప్లాన్‌ కింద మూడు రైడర్లను బీమా సంస్థలు ఆఫర్‌ చేస్తున్నాయి.

1. పాక్షిక అంగవైకల్యం కలిగినట్టయితే బీమా కవరేజీ మొత్తంలో 0.2 శాతాన్ని ప్రతీ వారం చొప్పున కంపెనీ చెల్లిస్తుంది. పాలసీదారు తిరిగి పని చేసుకునే స్థితిలోకి వచ్చే వరకు ఈ చెల్లింపులు కొనసాగుతాయి. 2. ప్రమాదం వల్ల ఆస్పత్రిలో చేరి తీసుకునే చికిత్సల కోసం బీమాలో 10 శాతాన్ని కంపెనీ చెల్లిస్తుంది. 3. పాలసీదారు పిల్లలకు విద్యాసాయం కింద బీమాలో 10 శాతాన్ని (ఒక్కొక్కరికి) ఒకే విడతగా కంపెనీ చెల్లిస్తుంది. కాకపోతే పిల్లల వయసు 25 ఏళ్లు దాటి ఉండకూడదు. రూ.2.5 లక్షల నుంచి రూ.కోటి వరకు బీమాను తీసుకోవచ్చు. సాధారణంగా టర్మ్‌ ప్లాన్, హెల్త్‌ ప్లాన్లకు రైడర్లుగా వ్యక్తిగత ప్రమాద బీమా రైడర్లు లభిస్తున్నాయి.

కనుక ఎవరైనా కానీ తమ టర్మ్‌ ప్లాన్‌ లేదా హెల్త్‌ ప్లాన్‌తో పాటు వ్యక్తిగత ప్రమాద బీమా కవరేజీని ఎంపిక చేసుకుని ఉంటే.. అటువంటి వారు విడిగా సరళ్‌ సురక్షా బీమాను తీసుకోవాల్సిన అవసరం లేదు. విడిగా ప్రమాద బీమా ప్లాన్ల ప్రీమియం, సదుపాయాలను.. సరళ్‌ సురక్షా బీమా ప్రీమియం, సదుపాయాలతో పోల్చి చూసిన తర్వాత నిర్ణయం తీసుకోవచ్చు. వాస్తవానికి సరళ్‌ సురక్షా బీమా ప్లాన్, స్టాండలోన్‌ వ్యక్తిగత ప్రమాద బీమా ప్లాన్‌ ప్రీమియంలు ఇంచుమించు ఒకే స్థాయిలో ఉంటున్నాయి. కనుక సదుపాయాలపై దృష్టి సారించడం అవసరం. ఇప్పటికే సరైన టర్మ్‌ ప్లాన్‌ను ఒకవేళ మీరు తీసుకుని ఉండి, ఆ ప్లాన్‌కు యాక్సిడెంటల్‌ డెత్‌/డిస్‌మెంబర్‌మెంట్‌ రైడర్‌ లేనట్టయితే.. అప్పుడు సరళ్‌ సురక్షా బీమా తీసుకోవడాన్ని పరిశీలించొచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement