Health Policies
-
ఒకరికి రెండు పాలసీలు.. క్లెయిమ్ ఎలా?
హెల్త్ ఇన్సూరెన్స్ ప్రాధాన్యం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇటీవలి కాలంలో వేతన జీవుల్లో చాలా మంది రెండు హెల్త్ పాలసీలు తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీనివల్ల అదనపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో చికిత్స వ్యయం బీమా కవరేజీని మించిపోయే ప్రమాదం ఉంటుంది. అలాంటి సందర్భాలను ఒకటికి మించిన పాలసీలతో సులభంగా గట్టెక్కొచ్చు. కానీ, ఒకటి కంటే ఎక్కువ పాలసీలు ఉంటే క్లెయిమ్ ఎలా చేయాలనే విషయంలో చాలా మంది అయోమయాన్ని ఎదుర్కొంటూ ఉంటారు. ఈ విషయంలో నిపుణుల సూచనలు అందించే కథనమిది.గతంలో వేరు.. ఒక వ్యక్తికి ఒకటికి మించిన బీమా సంస్థల నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు ఉంటే, క్లెయిమ్ మొత్తాన్ని ఆయా సంస్థలు సమానంగా భరించాలనే నిబంధన లోగడ ఉండేది. 2013లో దీన్ని బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) తొలగించింది. దీంతో ఇప్పుడు ఒకటికి మించిన హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు కలిగి ఉన్నా కానీ, పాలసీదారు తనకు నచ్చిన చోట లేదంటే రెండు సంస్థల వద్దా క్లెయిమ్ దాఖలు చేసుకోవచ్చు. క్లెయిమ్ ఎలా? రెండు ప్లాన్లు కలిగిన వారు ఆస్పత్రిలో చేరిన తర్వాత రెండు బీమా సంస్థలకు తప్పనిసరిగా సమాచారం అందించాలి. ఒకటికి మించిన సంస్థల నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లు కలిగి ఉంటే, అప్పుడు ముందుగా ఒక బీమా సంస్థకు ప్రతిపాదనలు పంపిస్తే సరిపోతుంది. నగదు రహిత, రీయింబర్స్మెంట్ మార్గాల్లో దేనినైనా వినియోగించుకోవచ్చు. క్లెయిమ్ మొత్తం ఒక హెల్త్ ప్లాన్ కవరేజీ దాటనప్పుడు ఒక బీమా సంస్థ వద్దే దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. కానీ, ఒక పాలసీ కవరేజీకి మించి ఆస్పత్రి బిల్లు వచి్చనప్పుడు, రెండో బీమా సంస్థ వద్ద మిగిలిన మొత్తాన్ని క్లెయిమ్ చేసుకోవాలి. అంతే కానీ, ఒకేసారి ఒకే క్లెయిమ్‌ను రెండు సంస్థల వద్ద దాఖలు చేసేందుకు అవకాశం లేదు. ఉదాహరణకు రూ.5 లక్షల చొప్పున రెండు ప్లాన్లు ఉన్నాయని అనుకుందాం. ఆస్పత్రి బిల్లు రూ.7 లక్షలు వచి్చంది. అప్పుడు తొలుత ఒక సంస్థ వద్ద క్లెయిమ్ దాఖలు చేయాలి. అక్కడి నుంచి వచి్చన చెల్లింపులు మినహాయించి, అప్పుడు మిగిలిన మొత్తానికి రెండో బీమా సంస్థ నుంచి పరిహారం కోరాలి. ఒక పాలసీలో రూమ్‌రెంట్ పరంగా పరిమితులు ఉండి, దానివల్ల క్లెయిమ్ పూర్తిగా రాని సందర్భాల్లోనూ.. మిగిలిన మొత్తాన్ని రూమ్‌రెంట్ పరిమితులు లేని మరో పాలసీ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు. కొన్ని పాలసీల్లో రూమ్ రెంట్, కొన్ని చికిత్సలకు పరిమితులు ఉంటాయి. ముఖ్యంగా గ్రూప్ హెల్త్ ప్లాన్లలో ఇవి చూడొచ్చు. అలాంటప్పుడు రూ.5 లక్షల కవరేజీ ఉన్నప్పటికీ పూర్తి మొత్తం రాకపోవచ్చు. ఉదాహరణకు రూ.7లక్షల ఆస్పత్రి బిల్లుకు సంబంధించి రూ. 5 లక్షల గ్రూప్ పాలసీలో రూ.4 లక్షలే క్లెయిమ్ కింద వచి్చందని అనుకుంటే.. అప్పుడు మిగిలిన రూ. 3 లక్షలను రెండో పాలసీ కింద రీయింబర్స్మెంట్ కోరవచ్చు. ఒక బీమా సంస్థ క్లెయిమ్ దరఖాస్తును తిరస్కరించినా, రెండో బీమా సంస్థను సంప్రదించవచ్చు. వేతన జీవులు పనిచేసే సంస్థ నుంచి గ్రూప్ హెల్త్ ప్లాన్, వ్యక్తిగతంగా ఫ్యామిలీ ఫ్లోటర్ లేదా ఇండివిడ్యు వల్ ప్లాన్ కలిగి ఉన్నప్పుడు.. మొదట గ్రూప్ హెల్త్ ప్లాన్ నుంచి క్లెయిమ్‌కు వెళ్లడం మంచి ఆప్షన్. గ్రూప్ హెల్త్ ప్లాన్‌లో క్లెయిమ్ సెటిల్మెంట్ సులభంగా ఉంటుంది. క్లెయిమ్ మొత్తం ఒక బీమా పాలసీ కవరేజీ పరిధిలోనే ఉంటే ఒక్క సంస్థ వద్దే క్లెయిమ్‌కు పరిమితం కావాలి. దీనివల్ల రెండో ప్లాన్‌లో నో క్లెయిమ్ బోనస్ నష్టపోకుండా చూసుకోవచ్చు.నగదు రహిత చికిత్సబీమా సంస్థ నెట్వర్క్ పరిధిలోని అన్ని ఆస్పత్రుల నుంచి నగదు రహిత చికిత్స తీసుకోవచ్చు. ఏ ఆస్పత్రిలో అయినా నగదు రహిత చికిత్సకు బీమా సంస్థలు నేడు అవకాశం కలి్పస్తున్నాయి. కాకపోతే ఆస్పత్రి నిషేధిత జాబితాలో లేని వాటికే ఈ సదుపాయం పరిమితమని గుర్తుంచుకోవాలి. రెండు ప్లాన్లలోనూ నగదు రహిత చికిత్సకు వెళ్లొచ్చు. కానీ, ఒక సంస్థ నుంచే నగదు రహిత క్లెయిమ్‌కు ఆస్పత్రులు ప్రాధాన్యం ఇస్తుంటాయి. మిగిలిన మొత్తం కోసం రీయింబర్స్మెంట్ విధానానికి వెళ్లాలని సూచిస్తుంటాయి. అలాంటప్పుడు నగదు రహిత విధానంలో గరిష్ట పరిమితి మేరకే ఒక బీమా సంస్థ నుంచి చెల్లింపులు లభిస్తాయి. అప్పుడు మిగిలిన మొత్తాన్ని సొంతంగా చెల్లించి, దాన్ని రాబట్టుకునేందుకు రెండో బీమా సంస్థను సంప్రదించాలి. దీనికోసం మొదట క్లెయిమ్ చేసిన బీమా సంస్థ నుంచి ‘క్లెయిమ్ సెటిల్మెంట్ సమ్మరీ’ తీసుకోవాలి. అలాగే, హాస్పిటల్ బిల్లులు, చికిత్సకు సంబంధించి అన్ని పత్రాల ఫొటో కాపీలను సరి్టఫై (అటెస్టేషన్) చేసి ఇవ్వాలని మొదటి బీమా సంస్థను కోరాలి. వీటితో రెండో బీమా సంస్థ వద్ద రీయింబర్స్మెంట్ క్లెయిమ్ దరఖాస్తు దాఖలు చేసుకోవాలి. రెండు బీమా సంస్థల వద్ద రీయింబర్స్మెంట్ విధానంలో క్లెయిమ్ చేసుకోవాలన్నా సరే.. మొదట ఒక సంస్థ వద్ద క్లెయిమ్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఆస్పత్రి నుంచి అన్ని బిల్లుల కాపీలు, డిశ్చార్జ్ సమ్మరీ, ల్యాబ్ రిపోర్ట్లు తీసుకుని బీమా సంస్థకు సమర్పించాలి. క్లెయిమ్ ఆమోదం అనంతరం, క్లెయిమ్ సెటిల్మెంట్ సమ్మరీతోపాటు, అన్ని డాక్యుమెంట్ల ఫొటో కాపీలతో రెండో సంస్థ వద్ద రీయింబర్స్మెంట్ క్లెయిమ్ దాఖలు చేసుకోవాల్సి ఉంటుంది. రీయింబర్స్మెంట్ క్లెయిమ్ దాఖలుకు కాలపరిమితి ఉంటుంది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత 15–30 రోజులు దాటకుండా క్లెయిమ్ దాఖలు చేసుకోవాలి. ఒకరికి ఎన్ని ప్లాన్లు? అసలు ఒకటికి మించి హెల్త్ పాలసీలు ఎందుకు? అనే సందేహం రావచ్చు. ఒక్కొక్కరి అవసరాలే దీన్ని నిర్ణయిస్తాయి. ప్రైవేటు రంగంలో పనిచేసే వారికి పనిచేస్తున్న సంస్థ నుంచి గ్రూప్ హెల్త్ కవరేజీ సాధారణంగా ఉంటుంది. ఉన్నట్టుండి ఉద్యోగం నుంచి తప్పుకోవాల్సి వచి్చనా లేదంటే ఉద్యోగం కోల్పోయిన సందర్భాల్లో.. తిరిగి ఉపాధి లభించేందుకు కొంత సమయం పట్టొచ్చు. కంపెనీలు కలి్పంచే గ్రూప్ హెల్త్ కవరేజీ.. ఉద్యోగానికి రాజీనామా చేయడంతోనే ముగిసిపోతుంది. అందుకే వ్యక్తిగతంగా మరో ప్లాన్ కలిగి ఉంటే, ఉద్యోగం లేని సమయంలోనూ ఉపయోగపడుతుంది. వైద్య చికిత్సల వ్యయాలు గణనీయంగా పెరిగిపోతున్న తరుణంలో రెండు ప్లాన్లను కలిగి ఉండడం మంచి నిర్ణయమే అవుతుంది. లేదంటే బేస్ ప్లాన్ ఒకటి తీసుకుని, దానిపై మరింత మెరుగైన కవరేజీతో సూపర్ టాపప్ ప్లాన్ జోడించుకోవడం మరొక మార్గం.రీయింబర్స్‌మెంట్‌కు కావాల్సిన డాక్యుమెంట్లు డిశ్చార్జ్ సమ్మరీ, నగదు/కార్డు ద్వారా చెల్లింపులకు సంబంధించి రసీదులు, ల్యాబ్ రిపోర్ట్లు, వైద్యులు రాసిచి్చన ప్రిస్కిప్షన్లు, ఎక్స్‌రే ఫిల్మ్‌లు, క్లెయిమ్ సెటిల్మెంట్ సమ్మరీ.ఏడాదిలో ఎన్ని క్లెయిమ్‌లు? ఏడాదిలో ఎన్ని క్లెయిమ్‌లు అన్న దానితో సంబంధం లేకుండా, గరిష్ట బీమా కవరేజీ పరిధిలో ఎన్ని విడతలైనా పరిహారం పొందొచ్చు. కొన్ని బీమా సంస్థలు క్లెయిమ్‌ల సంఖ్య పరంగా పరిమితులు విధించొచ్చు. కనుక పాలసీ వర్డింగ్స్ డాక్యుమెంట్‌ను తప్పకుండా చదివి ఈ సందేహాన్ని నివృత్తి చేసుకోవాలి. రెండు రకాల పాలసీలు హెల్త్ ఇన్సూరెన్స్ సాధారణంగా రెండు రకాలు. ఇండెమ్నిటీ ఒక రకం అయితే, ఫిక్స్డ్ బెనిఫిట్‌తో కూడినవి రెండో రకం. ఇండెమ్నిటీ పాలసీలు ఆస్పత్రిలో చేరి తీసుకునే చికిత్సలతోపాటు.. ఎంపిక చేసిన డేకేర్ ప్రొసీజర్స్ (చికిత్స తర్వాత అదే రోజు విడుదలయ్యేవి)కు మాత్రమే కవరేజీ ఇస్తాయి. ఇక క్రిటికల్ ఇల్నెస్ పాలసీలను ఫిక్స్డ్ బెనిఫిట్ పాలసీలుగా చెబుతారు. ఇందులో కేన్సర్, గుండె జబ్బులు, మూత్ర పిండాల వైఫల్యం, కాలేయ వైఫల్యం తదితర తీవ్ర వ్యాధుల్లో ఏదైనా నిర్ధారణ అయిన వెంటనే నిర్ణీత పరిహారాన్ని బీమా సంస్థలు ఒకే విడత చెల్లించేస్తాయి. కనుక క్లెయిమ్ విషయంలో ఈ రెండింటి పరంగా గందరగోళం అక్కర్లేదు. ఇండెమ్నిటీ ప్లాన్, క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్ రెండూ కలిగిన వారు.. ఏదైనా తీవ్ర వ్యాధి (క్రిటికల్ ఇల్నెస్) బారిన పడినప్పుడు ఇండెమ్నిటీ ప్లాన్ కింద కవరేజీ పొందొచ్చు. అలాగే, వ్యాధి నిర్ధారణ పత్రాలతో క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్ కింద క్లెయిమ్ దాఖలు చేసి పూర్తి ప్రయోజనాన్ని అందుకోవచ్చు. దీనివల్ల ఆయా వ్యాధులకు సంబంధించి ఎదురయ్యే భారీ వ్యయాలను తట్టుకోవడం సాధ్యపడుతుంది. టాపప్, సూపర్ టాపప్ ప్లాన్లు ఇక హెల్త్ ఇన్సూరెన్స్‌లో టాపప్, సూపర్ టాపప్ ప్లాన్లు కూడా ఉంటాయి. ఇందులో సూపర్ టాపప్ ఎక్కువ అనుకూలం. ఇవి డిడక్షన్ క్లాజుతో వస్తాయి. ఉదాహరణకు రూ.5 లక్షల కవరేజీతో హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకున్న వారు, రూ.50 లక్షల సూపర్ టాపప్ ప్లాన్ కూడా జోడించుకున్నారని అనుకుందాం. ఆస్పత్రి బిల్లు మొదటి రూ.5 లక్షలు దాటిన తర్వాతే సూపర్ టాపప్ ప్లాన్ కింద కవరేజీ పొందగలరు. రూ.50 లక్షల వరకు బిల్లు ఎంత వచ్చినా సరే.. మొదటి రూ.5 లక్షలకు సూపర్ టాపప్‌లో పరిహారం రాదు. దాన్ని సొంతంగా భరించడం లేదంటే బేస్ ప్లాన్ నుంచి కవరేజీ తీసుకోవాల్సి ఉంటుంది. నేరుగా రూ.50 లక్షల బేస్ ఇండెమ్నిటీ ప్లాన్‌తో పోలి్చతే.. రూ.5–10 లక్షల మేర బేస్ ప్లాన్ తీసుకుని, 50 లక్షలకు సూపర్ టాపప్ తీసుకోవడం వల్ల ప్రీమియం భారం కొంత తగ్గుతుంది. -
వ్యక్తిగతమా.. గ్రూప్ పాలసీనా...
కోవిడ్–19 రాకతో ఆరోగ్య సంరక్షణ ప్రాధాన్యత గురించి అవగాహన పెరిగింది. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల అవసరాన్ని గుర్తించి, కొనుగోలు చేసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ప్రస్తుతం రకరకాల హెల్త్ పాలసీలు ఉన్నాయి. వీటిలో వ్యక్తిగత ఆరోగ్య బీమా పాలసీ, గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అనేవి ఎక్కువగా ప్రాచుర్యంలో కనిపిస్తుంటాయి. వీటి గురించి వివరించేదే ఈ కథనం. గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్.. సాధారణంగా ఒక గ్రూప్‌గా ఉండే వ్యక్తుల కోసం ఈ తరహా పాలసీలను కంపెనీలు రూపొందిస్తుంటాయి. ఉదాహరణకు ఒకే కంపెనీలో పనిచేసే వ్యక్తుల కోసం ఇలాంటి పాలసీలు ఉంటాయి. పాలసీదారు కుటుంబ సభ్యులకు కూడా చాలా సందర్భాల్లో పాలసీ ప్రయోజనాలను వర్తింపచేసినా .. ఒక్కో సభ్యుడికి ఒక్కో రకమైన కవరేజ్ అంటూ ఉండదు. ప్రాథమికంగా గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది.. పాలసీదారులు ప్రమాదం కారణంగానైనా లేదా కోవిడ్–19 సహా ఇతరత్రా ఏదైనా అనారోగ్యంతోనైనా ఆస్పత్రిలో చేరితే కవరేజ్ ఇస్తుంది. ఇలాంటి పాలసీల కోసం బీమా కంపెనీలు మెడికల్ చెకప్ గురించి అడగవు. వ్యక్తిగత పాలసీలతో పోలిస్తే వీటి ప్రీమియంలు తక్కువగానే ఉంటాయి. గ్రూప్ అంగీకరించే కొటేషన్‌ను బట్టి ప్రతీ ఏడాది కవరేజీ మారవచ్చు. ఈ పాలసీల ప్రీమియాన్ని కంపెనీయే భరించవచ్చు లేదా సభ్యుడి నుంచి వసూలు చేయవచ్చు. గ్రూప్‌లో అందరికీ ఒకే రకమైన ప్రయోజనాలు ఉంటాయి. వ్యక్తిగత ఆరోగ్య బీమా.. ఈ పాలసీలను వ్యక్తులు నేరుగా కొనుగోలు చేస్తారు. వివిధ రకాల అస్వస్థతలు, ఆస్పత్రిలో చేరితే అయ్యే ఖర్చులు, ఇతరత్రా చికిత్సాపరమైన ఖర్చుల నుంచి రక్షణ పొందేందుకు .. పాలసీదారు తన అవసరాలకు అనుగుణంగా ఈ పాలసీల కవరేజీని ఎంచుకోవడానికి వీలు ఉంటుంది. జీవిత భాగస్వామి, పిల్లలు, తల్లిదండ్రులు, అత్త మామలు వంటి మీ మీద ఆధారపడిన వారికి కూడా కవరేజీ లభించేలా దీన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. పాలసీ తీసుకున్న వ్యక్తి నేరుగా ప్రీమియంను కట్టాల్సి ఉంటుంది. సకాలంలో పునరుద్ధరించుకోకపోతే పాలసీ గడువు ముగిసిపోతుంది. పాలసీ తీసుకునే వ్యక్తికి సంబంధించిన ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకుంటారు. అవసరమైతే వైద్య పరీక్షలు చేయించుకోవాలని కూడా బీమా కంపెనీ అడగవచ్చు. ఎవరికి ఏవి అనువైనవంటే.. ప్రీమియంలు చౌకగా ఉండటంతో పాటు యజమానే కడతారు కాబట్టి యుక్తవయస్కులకు గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ అర్థవంతంగానే ఉంటుంది. కానీ కుటుంబ బాధ్యతలు ఉన్నవారు.. తగినంత కవరేజీతో కూడిన వ్యక్తిగత ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవడం శ్రేయస్కరం. ఒకవేళ సంస్థ నుంచి గ్రూప్ ఇన్సూరెన్స్ కవరేజీ భారీగానే ఉన్నట్లయితే.. గ్రూప్ ఇన్సూరెన్స్ సమ్ ఇన్సూర్డ్‌తో సరిపోయే టాప్–అప్ కవర్ని తీసుకోవచ్చు. ఇది చౌకగానే రావడంతో పాటు మీకు తగినంత స్థాయిలో కవరేజీనీ అందిస్తుంది. కొన్ని కంపెనీలు భవిష్యత్తులో అవసరమైతే టాప్–అప్ను బేస్ కవర్‌గా మార్చుకునేందుకు కూడా అవకాశమిస్తున్నాయి. కాబట్టి హెల్త్ పాలసీని తీసుకునేటప్పుడు ఇవన్నీ పరిగణనలోకి తీసుకోవడం మంచిది. సుధా రెడ్డి, హెడ్ (హెల్త్ విభాగం) డిజిట్ ఇన్సూరెన్స్ -
Insurance Policy: ఈ పాలసీలు.. ఎంతో సులభం
బీమా పాలసీల్లోని సదుపాయాలను సులభంగా అర్థం చేసుకోవడం అందరికీ సాధ్యపడేది కాదు. ఒక్కో కంపెనీ ప్లాన్ భిన్నమైన ప్రయోజనాలు, మినహాయింపులు, షరతులతో ఉంటుంది. కనుక పాలసీదారులు వీటిని అర్థం చేసుకోవడం కష్టమని తెలుసుకున్న బీమా రంగ నియంత్రణ , అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) ఒకే విధమైన ఫీచర్లతో అన్ని బీమా కంపెనీలు.. ఒకే పేరుతో ఒక ప్రామాణిక పాలసీని ప్రవేశపెట్టాలంటూ ఆదేశాలు తీసుకొచి్చంది. వీటినే స్టాండర్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్లుగా పిలుస్తారు. ఆరోగ్య సంజీవని, సరళ్ జీవన్ బీమా, సరళ్ పెన్షన్, సరళ్ సురక్షా ఇలాంటివన్నీ కూడా ప్రామాణిక పాలసీలే. వీటి ప్రీమియంలు అందుబాటు ధరల్లోనే ఉంటాయి. కాకపోతే వీటిల్లో పరిమితులు కూడా ఉంటాయి కనుక అందరికీ కాకుండా.. కొందరికే అనుకూలం. బీమా పాలసీల విషయంలో ‘కరోనా’ఓ కనువిప్పుగానే చూడాలి. ఈ వైరస్ కారణంగా ఆస్పత్రుల పాలై ఆరి్థకంగా చితికిపోయిన వారు ఎందరో ఉన్నారు. అంతేకాదు బీమా రక్షణ లేని కారణంగా మరణించిన వారి కుటుంబాలూ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఫలితంగా చాలా మంది జీవిత బీమా, ఆరోగ్య బీమా, ప్రమాద మరణం/వైకల్య పరిహార బీమాల ప్రాధాన్యాన్ని అర్థం చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు లేని వారు పాలసీలను తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. స్టాండర్డ్ ఇన్సూరెన్స్ పాలసీల్లో కవరేజీ, సదుపాయాలు, రైడర్లు బీమా సంస్థలు అన్నింటిలోనూ ఒకే మాదిరిగా ఉంటాయి. ఆరోగ్య సంజీవని పేరుతో హెల్త్ ప్లాన్, సరళ్ జీవన్ బీమా పేరుతో టర్మ్ ప్లాన్.. సరళ్ పెన్షన్ (యాన్యుటీ/పెన్షన్) ప్లాన్, సరళ్ సురక్షా బీమా (వ్యక్తిగత ప్రమాద కవరేజీ) ప్లాన్, కరోనా కవచ్, కరోనా రక్షక్ (కరోనా చికిత్సల ప్లాన్లు), భారత్ గృహ రక్ష (హోమ్ ఇన్సూరెన్స్) ఇవన్నీ స్టాండర్డ్ బీమా పథకాలే. వీటిని ఎంపిక చేసుకోవడానికి ముం దు.. నియమ, నిబంధనలు ఒక్కసారి తెలుసుకోవాలి. ఈ పాలసీలు ఏం ఆఫర్ చేస్తున్నాయి.. ప్రీమియం ఎంతన్నదీ చూడాలి. తమ వ్యక్తిగత, కుటుంబ అవసరాలను తీర్చేవేనా? అన్న పరిశీలన కూడా చేసుకోవాలి. అప్పుడే వీటిపై ఒక అవగాహనకు రావడానికి వీలవుతుంది. సరళ్ జీవన్ బీమా అచ్చమైన టర్మ్ పాలసీ ఇది. పాలసీ కాల వ్యవధి పూర్తయ్యే వరకు జీవించి ఉంటే ఎటువంటి రాబడులను రానటువంటి పాలసీ. పాలసీదారు మరణించిన సందర్భాల్లోనే నామినీకి పరిహారం లభిస్తుంది. వార్షిక ప్రీమియానికి 10 రెట్లు లేదా మరణించే నాటికి చెల్లించిన ప్రీమియంతో కలిపి 105 శాతం, లేదా సమ్ అష్యూరెన్స్ (బీమా కవరేజీ) వీటిలో ఏది ఎక్కువగా ఉంటే ఆ మొత్తం నామినీకి కంపెనీ చెల్లిస్తుంది. ఒకవేళ సింగిల్ ప్రీమియం పాలసీలు అయితే చెల్లించిన ప్రీమియానికి 125 శాతం లేదా బీమా కవరేజీ ఈ రెండింటిలో గరిష్ట మొత్తాన్ని చెల్లిస్తుంది. ఐఆర్డీఏఐ మార్గదర్శకాల మేరకు సరళ్ జీవన్ బీమా ప్లాన్‌తోపాటు రెండు రైడర్లను కూడా తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. యాక్సిడెంట్ డెత్ బెనిఫిట్ రైడర్, పర్మనెంట్ డిజేబిలిటీ రైడర్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఇతర టర్మ్ పాలసీలతో పోలిస్తే సరళ్ జీవన్ బీమా ప్లాన్‌లో 45 రోజుల వేచి ఉండే కాల వ్యవధి (పాలసీ జారీ చేసిన తేదీ నుంచి) అమలవుతుంది. కాకపోతే ఈ 45 రోజుల వ్యవధిలో ప్రమాదం కారణంగా మరణిస్తే పరిహారం లభిస్తుంది. ప్రమాదం కాకుండా ఇతర ఏ రూపంలో మరణం సంభవించినా బీమా పరిహారానికి అర్హత లభించదు. కేవలం చెల్లించిన ప్రీమియం వరకే నామినీకి లభిస్తుంది. టర్మ్ పాలసీలు ముక్కుసూటి పథకాలు. ఎటువంటి గందరగోళం లేకుండా జీవితానికి పూర్తి రక్షణ కల్పించేవి. వార్షిక ఆదాయానికి 10–15 రెట్ల వరకు అయినా బీమా పరిహారం కచ్చితంగా ఉండాలన్నది సాధారణంగా అనుసరించే విధానం. కానీ, సరళ్ జీవన్ బీమా ప్లాన్‌ను చాలా కంపెనీలు గరిష్టంగా రూ.25 లక్షలకే ఇస్తున్నాయి. కనుక తక్కువ ఆదాయం ఉన్న వారికి ఇది అనుకూలంగా ఉంటుంది. మెరుగైన ఆదాయం ఉన్న వారు సాధారణ టర్మ్ ప్లాన్‌ను తీసుకోవడాన్ని పరిశీలించొచ్చు. సాధారణ టర్మ్ ప్లాన్ వ్యక్తి ఆదాయానికి తగినట్టు గరిష్ట కవరేజీతో వస్తుంది. ∙ ఉదాహరణకు.. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ సరళ్ జీవన్ బీమా ప్లాన్‌ను 40 ఏళ్ల కాలానికి రూ.25లక్షల కవరేజీతో తీసుకోవాలంటే.. 30 ఏళ్ల వ్యక్తి వార్షికంగా చెల్లించాల్సిన ప్రీమియం సుమారు రూ.12,312 (జీఎస్టీ కాకుండా). అదే ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ ఆఫర్ చేసే ఐప్రొటెక్ట్ స్మార్ట్ టర్మ్ ప్లాన్‌లో రూ.50 లక్షల కవరేజీకి జీఎస్టీ కాకుండా వార్షికంగా చెల్లించాల్సిన ప్రీమియం రూ.9,987. ఈ విధంగా చూసుకుంటే సరళ్తో పోలిస్తే సాధారణ టర్మ్ ప్లాన్‌లో తక్కువ ప్రీమియానికి అధిక కవరేజీ లభిస్తున్నట్టు అర్థం అవుతోంది. ప్రమాదం కారణంగా పాలసీదారు శాశ్వత వైకల్యానికి గురైతే ఆ తర్వాత నుంచి ప్రీమియం చెల్లించకుండా ఉండే ప్రీమియం వైవర్ ఐప్రొటెక్ట్ సస్మార్ట్ ప్లాన్‌లో ఉంది. టర్మ్ ప్లాన్ తీసుకోవాలంటే ఆదాయానికి సంబంధించి రుజువులు కచి్చతంగా ఉండాల్సిందే. కొన్ని రకాల ఉద్యోగాల్లోని వారికి టర్మ్ ప్లాన్‌ను కంపెనీలు ఆఫర్ చేయడం లేదు. కనుక ఇటువంటి వారు సరళ్ జీవన్ బీమాను పరిగణనలోకి తీసుకోవచ్చు. గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే పెరుగుతున్న ఆదాయానికి అనుగుణంగా బీమా కవరేజీని కూడా ఎప్పటికప్పుడు పెంచుకోవడం అవసరం. అవసరమైతే ఈ రంగంలో నిపుణుల సలహా తీసుకోవాలి. ఆరోగ్య సంజీవని అన్ని సాధారణ, హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఈ ప్లాన్‌ను బేసిక్ పాలసీ కింద ఆఫర్ చేస్తున్నాయి. ఆస్పత్రిలో చేరడం వల్ల ఎదురయ్యే ఖర్చులను ఈ పాలసీ చెల్లిస్తుంది. డేకేర్ ట్రీట్మెంట్లకు (ఆస్పత్రిలో ఉండాల్సిన అవసరం లేని చికిత్సలు) ఈ పాలసీలో కవరేజీ ఉంటుంది. పాలసీ తీసుకున్న 30 రోజుల వరకు వేచి ఉండే కాలం అమలవుతుంది. అలాగే, కొన్ని వ్యాధులకు పాలసీ అమల్లోకి వచి్చన రెండేళ్ల తర్వాతే కవరేజీ లభిస్తుంది. ఒక పాలసీ సంవత్సరంలో క్లెయిమ్‌లు లేనట్టయితే బోనస్ కూడా ఇందులో అందుకోవచ్చు. అయితే, ఆరోగ్య సంజీవని హెల్త్ ప్లాన్‌లో కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. సబ్ లిమిట్స్ ముఖ్యమైనది. ఆస్పత్రిలో గది అద్దె, ఐసీయూ చార్జీలకు ఇందులో పరిమితులు అమలవుతాయి. బీమా సంస్థ నిర్దేశించిన పరిమితులకు మించి గది అద్దె, ఐసీయూ చార్జీలు ఉంటే కనుక అప్పుడు పాలసీదారు మొత్తం బిల్లులో కొంత మొత్తాన్ని తన చేతి నుంచి చెల్లించుకోవాల్సి వస్తుంది. రూ.10 లక్షల కవరేజీతో ఆరోగ్య సంజీవని ప్లాన్ తీసుకున్నా సరే సబ్ లిమిట్స్ కారణంగా పాలసీదారు తనవంతుగా ఎంతో కొంత చెల్లించుకోక తప్పదు. మరో ముఖ్యమైన ప్రతికూల అంశం.. 5 శాతం కోపే నిబంధన ఇందులో ఉంటుంది. అంటే ప్రతీ క్లెయిమ్‌కు 5 శాతాన్ని పాలసీదారు స్వయంగా భరించాల్సి ఉంటుంది. ముందు చెప్పుకున్న సబ్ లిమిట్స్ కారణంగా పాలసీదారు కొంత మొత్తాన్ని సొంతంగా చెల్లించుకోవాల్సిన దానికి ఇది అదనం. సాధారణ హెల్త్ప్లాన్లు నేడు చాలా వరకు సబ్ లిమిట్స్, కోపే లేకుండానే వస్తున్నాయి. ముఖ్యంగా రూమ్‌రెంట్, ఐసీయూ చార్జీల విషయంలో పరిమితుల్లేకుండా ప్లాన్లను బీమా సంస్థలు ఆఫర్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఆరోగ్య సంజీవని ప్లాన్‌లో రీస్టోరేషన్ సదుపాయం లేదు. ఆస్పత్రిలో చేరడం వల్ల బీమా కవరేజీ మొత్తం ఒకే విడత ఖర్చయిపోయిందనుకోండి.. అప్పుడు బీమా సంస్థలు అంతే మొత్తం కవరేజీని అదే సంవత్సరానికి రీస్టోరేషన్ కింద పునరుద్ధరిస్తాయి. దీంతో అదే వ్యక్తి మళ్లీ అదే పాలసీ సంవత్సరంలో ఆస్పత్రిలో చేరాల్సి వస్తే (మరో సమస్య వల్ల), లేదా కుటుంబ సభ్యుల్లో వేరొకరు ఆస్పత్రిలో చేరాల్సిన పరిస్థితి ఎదురైతే రీస్టోరేషన్ అక్కరకు వస్తుంది. వార్షిక ప్రీమియం, సబ్ లిమిట్స్, నో క్లెయిమ్ బోనస్, కోపే, ఏటా ఉచితంగా హెల్త్ చెకప్‌లు, ఓపీడీ చికిత్సలకు కవరేజీ సదుపాయాలను సాధారణ హెల్త్ ప్లాన్లలో చూడొచ్చు. మీ అవసరాలు, ప్రీమియం చెల్లింపుల సామర్థ్యం ఆధారంగా ఆరోగ్య సంజీవని లేదా సాధారణ హెల్త్ ప్లాన్లలో ఏదన్నది నిర్ణయించుకోవాలి. చాలా కంపెనీలు ఆరోగ్య సంజీవని ప్లాన్ ప్రీమియం స్థాయిల్లోనే మరింత మెరుగైన ఫీచర్లతో సాధారణ హెల్త్ ప్లాన్లను (నామమాత్రపు పరిమితులు లేదా పరిమితుల్లేకుండా) ఆఫర్ చేస్తున్నాయి. సరళ్ సురక్షా బీమా ఇది వ్యక్తిగత ప్రమాద బీమా ప్లాన్. అన్ని సాధారణ, హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఈ ప్లాన్‌ను ఆఫర్ చేస్తున్నాయి. ప్రమాదంలో మరణించినా లేక పూర్తి, పాక్షిక అంగవైకల్యం (శాశ్వతంగా) పాలైన సందర్భంలో ఈ ప్లాన్ కింద నామినీకి పరిహారం లభిస్తుంది. ప్రమాదానికి గురైన తర్వాత 12 నెలల్లోపు మరణించినా కానీ పరిహారానికి అర్హత లభిస్తుంది. ప్రమాదం వల్ల వైకల్యానికి లోనయితే పాలసీ నియమ, నిబంధనలకు అనుగుణంగా పరిహారం చెల్లింపు ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు శాశ్వత అంగవైకల్యం పాలైతే 100 శాతం బీమా పరిహారంగా అందుకోవచ్చు. ప్రమాదం నమోదైన తేదీ నుంచి 12 నెలల్లోపు అంగవైకల్యానికి గురైనా పరిహారం లభిస్తుంది. ఈ ప్లాన్ కింద మూడు రైడర్లను బీమా సంస్థలు ఆఫర్ చేస్తున్నాయి. 1. పాక్షిక అంగవైకల్యం కలిగినట్టయితే బీమా కవరేజీ మొత్తంలో 0.2 శాతాన్ని ప్రతీ వారం చొప్పున కంపెనీ చెల్లిస్తుంది. పాలసీదారు తిరిగి పని చేసుకునే స్థితిలోకి వచ్చే వరకు ఈ చెల్లింపులు కొనసాగుతాయి. 2. ప్రమాదం వల్ల ఆస్పత్రిలో చేరి తీసుకునే చికిత్సల కోసం బీమాలో 10 శాతాన్ని కంపెనీ చెల్లిస్తుంది. 3. పాలసీదారు పిల్లలకు విద్యాసాయం కింద బీమాలో 10 శాతాన్ని (ఒక్కొక్కరికి) ఒకే విడతగా కంపెనీ చెల్లిస్తుంది. కాకపోతే పిల్లల వయసు 25 ఏళ్లు దాటి ఉండకూడదు. రూ.2.5 లక్షల నుంచి రూ.కోటి వరకు బీమాను తీసుకోవచ్చు. సాధారణంగా టర్మ్ ప్లాన్, హెల్త్ ప్లాన్లకు రైడర్లుగా వ్యక్తిగత ప్రమాద బీమా రైడర్లు లభిస్తున్నాయి. కనుక ఎవరైనా కానీ తమ టర్మ్ ప్లాన్ లేదా హెల్త్ ప్లాన్‌తో పాటు వ్యక్తిగత ప్రమాద బీమా కవరేజీని ఎంపిక చేసుకుని ఉంటే.. అటువంటి వారు విడిగా సరళ్ సురక్షా బీమాను తీసుకోవాల్సిన అవసరం లేదు. విడిగా ప్రమాద బీమా ప్లాన్ల ప్రీమియం, సదుపాయాలను.. సరళ్ సురక్షా బీమా ప్రీమియం, సదుపాయాలతో పోల్చి చూసిన తర్వాత నిర్ణయం తీసుకోవచ్చు. వాస్తవానికి సరళ్ సురక్షా బీమా ప్లాన్, స్టాండలోన్ వ్యక్తిగత ప్రమాద బీమా ప్లాన్ ప్రీమియంలు ఇంచుమించు ఒకే స్థాయిలో ఉంటున్నాయి. కనుక సదుపాయాలపై దృష్టి సారించడం అవసరం. ఇప్పటికే సరైన టర్మ్ ప్లాన్‌ను ఒకవేళ మీరు తీసుకుని ఉండి, ఆ ప్లాన్‌కు యాక్సిడెంటల్ డెత్/డిస్‌మెంబర్‌మెంట్ రైడర్ లేనట్టయితే.. అప్పుడు సరళ్ సురక్షా బీమా తీసుకోవడాన్ని పరిశీలించొచ్చు. -
నో క్లెయిమ్ బోనస్.. విలువైన బహుమానం
హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు ఎన్నో రకాల ప్రయోజనాలతో వస్తుంటాయి. పాలసీదారులు పాలసీ తీసుకున్న తర్వాత కూడా తమ ఆరోగ్యంపై శ్రద్ధ చూపించినట్టయితే.. ప్రత్యేక రాయితీలతో ప్రోత్సహించేందుకు కంపెనీలు ముందుకు వస్తున్నాయి. ప్రీమియంలో తగ్గింపులు, ఔట్ పెషెంట్‌గా తీసుకునే చికిత్సల సమయంలో వినియోగానికి వీలైన రివార్డు పాయింట్లు ఇందులో భాగమే. బీమా కంపెనీలు అందించే ఆఫర్లలో.. ముఖ్యంగా నో క్లెయిమ్ బోనస్‌ను అమూల్యమైనదనే చెప్పుకోవాలి. నో క్లెయిమ్ అంటే.. ఒక పాలసీ ఏడాదిలో ఎటువంటి క్లెయిమ్‌లు చేయకపోవడం. దీనివల్ల బీమా కంపెనీలకు కొంత ఆదా అవుతుంది. దాంతో నో క్లెయిమ్ బోనస్ రూపంలో కొంత ప్రయోజనాన్ని తిరిగి పాలసీదారులకు అందిస్తుంటాయి. ఎక్కువ సంస్థలు బీమా మొత్తాన్ని నిర్ణీత శాతం మేర పెంచుతుంటే.. కొన్ని మాత్రం ప్రీమియంలో రాయితీ ఇస్తున్నాయి. బీమా కవరేజీని బోనస్ గా ఇచ్చినా ఇందుకు అదనపు ప్రీమియం వసూలు చేయవు. కనుక ఆరోగ్య బీమా తీసుకున్నప్పటికీ.. ఆరోగ్యాన్ని చక్కగా చూసుకోవడం వల్ల ఆస్పత్రిలో చేరాల్సిన అవస్థ తప్పుతుంది. బీమా రక్షణ మొత్తం పెరుగుతుంది. ఈ నో క్లెయిమ్ బోనస్ (ఎన్సీబీ)ను దాదాపు అన్ని బీమా సంస్థలు అందిస్తున్నాయి. వివిధ బీమా సంస్థలు ఆఫర్ చేస్తున్న ఈ ప్రయోజనం విషయంలో వైరుధ్యాలను తెలియజేసే కథనమే ఇది. ఎలా పనిచేస్తుంది..? అన్ని రకాల ఇండెమ్నిటీ హెల్త్ పాలసీలు (ఆస్పత్రిలో చేరడం వల్ల అయిన వైద్య ఖర్చులు చెల్లించేవి) నో క్లెయిమ్ బోనస్ (ఎన్సీబీ) ఫీచర్‌తో వస్తున్నాయి. ఉదాహరణకు బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ హెల్త్‌గార్డ్ (గోల్డ్ ప్లాన్)లో క్లెయిమ్‌లు లేని ప్రతీ సంవత్సరం తర్వాత బీమా మొత్తం 10 శాతం పెరుగుతుంది. అంటే రూ.5 లక్షల కవరేజీకి పాలసీ తీసుకుని క్లెయిమ్ చేసుకోకపోతే రెన్యువల్ అనంతరం 10 శాతం పెరిగి కవరేజీ రూ.5.50 లక్షలకు చేరుతుంది. ఇలా బేస్ సమ్ ఇన్సూర్డ్ (ఎస్ఐ)కు గరిష్టంగా నూరు శాతం వరకు కవరేజీని ఎన్సీబీ కింద అందుకోవచ్చు. రూ.5 లక్షలను బేసిక్ సమ్ ఇన్సూర్డ్‌గా ఎంచుకున్నారనుకుంటే.. వరుసగా పదేళ్లపాటు ఎటువంటి క్లెయిమ్ చేసుకోని సందర్భాల్లో కవరేజీ రూ.5 లక్షల మేర పెరిగి రూ.10లక్షలు అవుతుంది. అయితే, ఇలా ఎన్సీబీ రూపంలో బీమా కవరేజీ పెరగడం అన్నది అన్ని బీమా సంస్థల్లోనూ ఒకే మాదిరిగా ఉండదు. ఉదాహరణకు ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్‌కు చెందిన ‘యాక్టివ్ అష్యూర్డ్ పాలసీ’లో ఎన్సీబీ కింద గరిష్టంగా 50 శాతం వరకే బీమా పెరుగుతుంది. అదే మణిపాల్ సిగ్నా ప్రో హెల్త్ పాలసీలో బేసిక్ ఎస్ఐకు గరిష్టంగా 200 శాతం వరకు అదనపు బీమా కవరేజీని నో క్లెయిమ్ బోనస్ కింద అందుకోవచ్చు. ఎటువంటి క్లెయిమ్ చేసుకోకుండా, సకాలంలో ప్రీమియం చెల్లించి రెన్యువల్ చేసుకున్న వారికి ఎన్సీబీ కింద సమ్ ఇన్సూర్డ్ పెంపును బీమా సంస్థలు హామీ పూర్వకంగా అందిస్తున్నాయి. క్లెయిమ్ చేసుకుంటే.. ఒకవేళ పాలసీ సంవత్సరంలో క్లెయిమ్ చేసుకుంటే బోనస్‌గా పెరిగిన సమ్ ఇన్సూర్డ్ నిర్ణీ త శాతం మేర తగ్గిపోతుందని గుర్తించాలి. క్లెయిమ్ చేసుకున్నా కానీ, అప్పటి వరకు బోనస్‌గా పొందిన బీమా కవరేజీని తగ్గించని పాలసీలు కూడా మార్కెట్లో ఉన్నాయి. ఉదాహరణకు ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ యాక్టివ్ అష్యూర్ పాలసీలో క్లెయిమ్ చేసుకుంటే.. తదుపరి పాలసీ సంవత్సరంలో ఎన్సీబీ 10% మేర తగ్గిపోతుంది. అంటే బేస్ సమ్ ఇన్సూర్డ్ రూ.10 లక్షలు తీసుకున్నారనుకుంటే.. అప్పటి వరకు ఎన్సీబీ రూపంలో ఏటా 10% చొప్పున రూ.3లక్షల కవరేజీ అదనంగా లభించి ఉంటే.. తర్వాతి సంవత్సరంలో క్లెయిమ్ చేసుకుంటే బేసిక్ కవరేజీ రూ.10లక్షలు అలాగే ఉంటుంది. ఎన్సీబీ మాత్రం రూ.లక్ష తగ్గి రూ.2లక్షలకు చేరుతుంది. ఎన్సీబీని బేసిక్ ఎస్ఐ ఆధారంగానే పెంచుతారు కనుక.. తగ్గించేటప్పుడూ అదే సూత్రం అమలవుతుంది. క్లెయిమ్‌లు చేసుకున్నా కానీ.. ఎన్సీబీని తగ్గించని పాలసీల్లో మణిపాల్ సిగ్నా ప్రోహెల్త్ ఇన్సూరెన్స్ ఒకటి. ప్రస్తుతం కోవిడ్–19 వల్ల ఆర్థిక ఇబ్బందులు, హెల్త్రిస్క్ను దృష్టిలో ఉంచుకుని కొన్ని బీమా సంస్థలు పాలసీదారులు క్లెయిమ్ చేసుకున్నా కానీ.. ఎన్సీబీని తగ్గించడం లేదు. ఇందుకు ఉదాహరణ హెచ్డీఎఫ్సీ ఎర్గో. ఈ ఏడాది జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 మధ్య కోవిడ్–19 చికిత్స కోసం క్లెయిమ్ చేసుకున్నా కానీ పాలసీదారుల క్యుములేటివ్ బోనస్ కవరేజీని తగ్గించకూడదని హెచ్డీఎఫ్సీ ఎర్గో నిర్ణయం తీసుకుంది. ఇదే విధమైన నిర్ణయాన్ని ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్కూడా తీసుకుంది. అదనపు ఎన్సీబీ నో క్లెయిమ్ బోనస్ రూపంలో బీమా కవరేజీ పెంపు ప్రయోజనం ఉచితంగానే లభిస్తుంది. ఇందుకు ఎటువంటి ప్రీమియంను అదనంగా చెల్లించాల్సిన అవసరం ఉండదు. అయితే, అదనంగా ప్రీమియం చెల్లించడం ద్వారా క్యుములేటివ్ బోనస్ కవరేజీని మరింత పెంచుకునేందుకు కొన్ని బీమా సంస్థలు అవకాశం కల్పిస్తున్నాయి. నో క్లెయిమ్ బోనస్‌కు అదనంగా కొంత ప్రీమియం చెల్లించి ఎన్సీబీని ఏటా అదనంగా 5–10 శాతం మేర పెంచుకోవచ్చు. ఉదాహరణకు మణిపాల్ సిగ్నా ప్రోహెల్త్ ప్లాన్‌లో క్యుములేటివ్ బోనస్ బూస్టర్‌ను కొనుగోలు చేసుకోవచ్చు. సమ్ ఇన్సూర్డ్‌పై కచ్చితంగా 25 శాతం పెంపును, గరిష్టంగా 200 శాతం వరకు పెంపును ఆఫర్ చేస్తోంది. హెచ్డీఎఫ్సీ ఎర్గో సైతం అదనపు ప్రీమియంతో క్యుములేటివ్ బోనస్‌ను పెంచుకునేందుకు అనుమతిస్తోంది. పోర్టింగ్ పెట్టుకుంటే ఏంటి పరిస్థితి? మొబైల్ నంబర్ పోర్టబులిటీ మాదిరిగానే హెల్త్ ఇన్సూరెన్స్‌ను కూడా ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మార్చుకోవచ్చు. బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ మార్గదర్శకాల మేరకు.. ఒక సంస్థ నుంచి మరో సంస్థకు హెల్త్ ప్లాన్‌ను పోర్ట్ చేసుకుంటే.. గత సంస్థలో పోగు చేసుకున్న క్యుములేటివ్ బోనస్‌ను కొత్త సంస్థ కూడా ఎటువంటి అదనపు ప్రీమియం లేకుండానే అందించాల్సి ఉంటుంది. దీని గురించి బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ హెల్త్ క్లెయిమ్స్ విభాగం హెడ్ భాస్కర్ నేరుర్కర్ వివరిస్తూ.. ‘‘పోర్టింగ్ సమయంలో బేస్ సమ్ ఇన్సూర్డ్‌తోపాటు క్యుములేటివ్ బోనస్ కూడా నూతన పాలసీకి బదిలీ అవుతుంది. ప్రీమియం మాత్రం బేసిక్ సమ్ ఇన్సూర్డ్కే వసూలు చేస్తారు. అయితే, ఆ తర్వాత నుంచి నూతన సంస్థ నియమ, నిబంధనల మేరకే క్యుములేటివ్ బోనస్ ప్రయోజనం లభిస్తుంది’’ అని తెలిపారు. అంటే ఒక వ్యక్తి ఏ అనే బీమా కంపెనీ నుంచి రూ.5 లక్షల సమ్ ఇన్సూర్డ్‌కు హెల్త్ ప్లాన్ తీసుకుని, రూ.లక్ష సమ్ ఇన్సూర్డ్‌ను ఎన్సీబీ కింద పొంది ఉన్నారనుకుంటే.. మరో సంస్థకు పోర్టింగ్ చేసుకునేట్టయితే నూతన సంస్థ సైతం మొత్తం రూ.6లక్షలకు కవరేజీని (రూ.5 లక్షలు బేసిక్, రూ.లక్ష బోనస్) ఆఫర్ చేస్తుందని అర్థం చేసుకోవాలి. దీనికి అదనంగా సమ్ ఇన్సూర్డ్‌ను పెంచుకోవాలంటే ప్రత్యేకంగా అండర్రిటన్ చేయాల్సి ఉంటుందని మణిపాల్ సిగ్నా హెల్త్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో ప్రసూన్ సిక్దర్ తెలిపారు. అంటే నూతన సంస్థలో బేస్ సమ్ ఇన్సూర్డ్‌ను పెంచుకోవాలంటే అదనపు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. -
కార్డియాలజీ కౌన్సెలింగ్
మంచి జీవనశైలితో గుండెపోటును నివారించలేమా? క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయడం, మంచి ఆహారం మాత్రమే తీసుకోవడం, వంటి మంచి జీవనశైలి పాటించడం వల్ల ఆరోగ్యానికి ఒనగూరేదేమీ లేదనీ, కేవలం శాకాహారం మాత్రమే తీసుకుంటూ, చాలా ఆరోగ్య నియమాలు పాటించేవారికి కూడా హార్ట్ఎటాక్స్ వస్తుంటాయనీ, కాబట్టి నిశ్చింతగా మనసుకు తోచింది తిని, తాగి, ఆనందించడం వల్లనే ఆరోగ్యం బాగుంటుందని ఇటీవలే తాను చదివానని వాదిస్తున్నాడు. అలా ఆనందంగా ఉండటం వల్ల వ్యాధినిరోధక శక్తి పెరుగుతుందనే అతడి వాదన. ఒక డాక్టర్‌గా మీ అనుభవంతో అతడి వాదన గురించి మీరేమంటారు? - సుధాకర్‌రావు, కరీంనగర్ క్రమబద్ధమైన జీవితాన్ని పాటించలేనివారు, స్వీక క్రమశిక్షణతో ఉండలేనివారు తమ సౌలభ్యం కోసం కొన్ని వాదనలు చేసినంత మాత్రాన మంచి జీవనశైలీ మార్గాల గొప్పదనం తగ్గదు. కానీ అతడు చెప్పినట్లుగా సంతోషంగా ఉండటం, ఆనందంగా జీవించడం, ఎలాంటి ఒత్తిడినీ మనసు మీదికి తీసుకోకపోవడం అనే మాట మాత్రం వాస్తవం. దీనికి మంచి ఆరోగ్యనియమాలు తోడైతే మరింత ఉపయోగమే గానీ, నష్టం ఉండదు. మంచి ఆరోగ్యనియమాలు పాటించడం, అత్యుత్తమమైన జీవనశైలి మార్గాలను అనుసరించడం, క్రమం తప్పక వ్యాయామం చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయనే విషయంపై 11 ఏళ్ల పాటు ఓ అధ్యయనం చేశారు. మంచి జీవనశైలి (అంటే మంచి ఆహార నియమాలు, క్రమం తప్పని వ్యాయామం) వల్ల ఎలాంటి లాభాలు చేకూరుతాయన్న విషయాన్ని శాస్త్రీయంగా పరిశోధించి, మనకు అందించిన వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి. {Mమం తప్పకుండా (వారానికి కనీసం 5 రోజులపాటైనా రోజుకు 45 నిమిషాల చొప్పున) వ్యాయామం చేయడం వల్ల 30 శాతం గుండె జబ్బులు నివారితమౌతాయి. జంక్‌ఫుడ్, రిఫైన్డ్ ఫుడ్ లాంటివి మానేసి కేవలం మంచి పోషకాలు ఉండే ఆహారాలు స్వీకరించడం, వేళకు తినడం వంటి నియమాలు పాటించడం వల్ల 18 శాతం గుండెజబ్బులను నివారించవచ్చు. స్థూలకాయం లేకుండా చూసుకోవడం, నడుము చుట్టుకొలత 37 అంగుళాల లోపే ఉంచుకోగలిగితే 12% గుండెజబ్బులను నివారించవచ్చు. ప్రకృతికి దగ్గరగా ఉండేలా చూసుకుంటూ, పై నియమాలు పాటిస్తే 80 శాతం గుండెజబ్బులను సమర్థంగా నివారించవచ్చు. అయితే ఈ నియమాలను కేవలం ఒక శాతం మంది వ్యక్తులు మాత్రమే పాటిస్తున్నారని అదే అధ్యయనంలో తేలింది. మీరు స్వీయనియంత్రణతో, క్రమశిక్షణతో ఉంటూ, ఆనందంగా కూడా ఉండగలిగితే అది గుండెజబ్బుల విషయంలోనే కాకుండా, అనేక వ్యాధుల నివారణకు తోడ్పడుతుంది. డాక్టర్ ఎ. శ్రీనివాస్‌కుమార్ చీఫ్ కార్డియాలజిస్ట్, సిటిజన్స్ హాస్పిటల్స్, నల్లగండ్ల, హైదరాబాద్