నో క్లెయిమ్‌ బోనస్‌.. విలువైన బహుమానం | Special stort about Claim Bonus In Insurance Policies | Sakshi
Sakshi News home page

నో క్లెయిమ్‌ బోనస్‌.. విలువైన బహుమానం

Published Mon, Sep 14 2020 5:08 AM | Last Updated on Mon, Sep 14 2020 5:47 AM

Special stort about  Claim Bonus In Insurance Policies - Sakshi

హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలు ఎన్నో రకాల ప్రయోజనాలతో వస్తుంటాయి. పాలసీదారులు పాలసీ తీసుకున్న తర్వాత కూడా తమ ఆరోగ్యంపై శ్రద్ధ చూపించినట్టయితే.. ప్రత్యేక రాయితీలతో ప్రోత్సహించేందుకు కంపెనీలు ముందుకు వస్తున్నాయి. ప్రీమియంలో తగ్గింపులు, ఔట్‌ పెషెంట్‌గా తీసుకునే చికిత్సల సమయంలో వినియోగానికి వీలైన రివార్డు పాయింట్లు ఇందులో భాగమే. బీమా కంపెనీలు అందించే ఆఫర్లలో.. ముఖ్యంగా నో క్లెయిమ్‌ బోనస్‌ను అమూల్యమైనదనే చెప్పుకోవాలి. నో క్లెయిమ్‌ అంటే.. ఒక పాలసీ ఏడాదిలో ఎటువంటి క్లెయిమ్‌లు చేయకపోవడం. దీనివల్ల బీమా కంపెనీలకు కొంత ఆదా అవుతుంది.

దాంతో నో క్లెయిమ్‌ బోనస్‌ రూపంలో కొంత ప్రయోజనాన్ని తిరిగి పాలసీదారులకు అందిస్తుంటాయి. ఎక్కువ సంస్థలు బీమా మొత్తాన్ని నిర్ణీత శాతం మేర పెంచుతుంటే.. కొన్ని మాత్రం ప్రీమియంలో రాయితీ ఇస్తున్నాయి. బీమా కవరేజీని బోనస్‌ గా ఇచ్చినా ఇందుకు అదనపు ప్రీమియం వసూలు చేయవు. కనుక ఆరోగ్య బీమా తీసుకున్నప్పటికీ.. ఆరోగ్యాన్ని చక్కగా చూసుకోవడం వల్ల ఆస్పత్రిలో చేరాల్సిన అవస్థ తప్పుతుంది. బీమా రక్షణ మొత్తం పెరుగుతుంది. ఈ నో క్లెయిమ్‌ బోనస్‌ (ఎన్‌సీబీ)ను దాదాపు అన్ని బీమా సంస్థలు అందిస్తున్నాయి. వివిధ బీమా సంస్థలు ఆఫర్‌ చేస్తున్న ఈ ప్రయోజనం విషయంలో వైరుధ్యాలను తెలియజేసే కథనమే ఇది.

ఎలా పనిచేస్తుంది..?
అన్ని రకాల ఇండెమ్నిటీ హెల్త్‌ పాలసీలు (ఆస్పత్రిలో చేరడం వల్ల అయిన వైద్య ఖర్చులు చెల్లించేవి) నో క్లెయిమ్‌ బోనస్‌ (ఎన్‌సీబీ) ఫీచర్‌తో వస్తున్నాయి. ఉదాహరణకు బజాజ్‌ అలియాంజ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ హెల్త్‌గార్డ్‌ (గోల్డ్‌ ప్లాన్‌)లో క్లెయిమ్‌లు లేని ప్రతీ సంవత్సరం తర్వాత బీమా మొత్తం 10 శాతం పెరుగుతుంది. అంటే రూ.5 లక్షల కవరేజీకి పాలసీ తీసుకుని క్లెయిమ్‌ చేసుకోకపోతే రెన్యువల్‌ అనంతరం 10 శాతం పెరిగి కవరేజీ రూ.5.50 లక్షలకు చేరుతుంది. ఇలా బేస్‌ సమ్‌ ఇన్సూర్డ్‌ (ఎస్‌ఐ)కు గరిష్టంగా నూరు శాతం వరకు కవరేజీని ఎన్‌సీబీ కింద అందుకోవచ్చు.

రూ.5 లక్షలను బేసిక్‌ సమ్‌ ఇన్సూర్డ్‌గా ఎంచుకున్నారనుకుంటే.. వరుసగా పదేళ్లపాటు ఎటువంటి క్లెయిమ్‌ చేసుకోని సందర్భాల్లో కవరేజీ రూ.5 లక్షల మేర పెరిగి రూ.10లక్షలు అవుతుంది. అయితే, ఇలా ఎన్‌సీబీ రూపంలో బీమా కవరేజీ పెరగడం అన్నది అన్ని బీమా సంస్థల్లోనూ ఒకే మాదిరిగా ఉండదు. ఉదాహరణకు ఆదిత్య బిర్లా హెల్త్‌ ఇన్సూరెన్స్‌కు చెందిన ‘యాక్టివ్‌ అష్యూర్డ్‌ పాలసీ’లో ఎన్‌సీబీ కింద గరిష్టంగా 50 శాతం వరకే బీమా పెరుగుతుంది. అదే మణిపాల్‌ సిగ్నా ప్రో హెల్త్‌ పాలసీలో బేసిక్‌ ఎస్‌ఐకు గరిష్టంగా 200 శాతం వరకు అదనపు బీమా కవరేజీని నో క్లెయిమ్‌ బోనస్‌ కింద అందుకోవచ్చు. ఎటువంటి క్లెయిమ్‌ చేసుకోకుండా, సకాలంలో ప్రీమియం చెల్లించి రెన్యువల్‌ చేసుకున్న వారికి ఎన్‌సీబీ కింద సమ్‌ ఇన్సూర్డ్‌ పెంపును బీమా సంస్థలు హామీ పూర్వకంగా అందిస్తున్నాయి.  

క్లెయిమ్‌ చేసుకుంటే..
ఒకవేళ పాలసీ సంవత్సరంలో క్లెయిమ్‌ చేసుకుంటే బోనస్‌గా పెరిగిన సమ్‌ ఇన్సూర్డ్‌ నిర్ణీ త శాతం మేర తగ్గిపోతుందని గుర్తించాలి. క్లెయిమ్‌ చేసుకున్నా కానీ, అప్పటి వరకు బోనస్‌గా పొందిన బీమా కవరేజీని తగ్గించని పాలసీలు కూడా మార్కెట్లో ఉన్నాయి. ఉదాహరణకు ఆదిత్య బిర్లా హెల్త్‌ ఇన్సూరెన్స్‌ యాక్టివ్‌ అష్యూర్‌ పాలసీలో క్లెయిమ్‌ చేసుకుంటే.. తదుపరి పాలసీ సంవత్సరంలో ఎన్‌సీబీ 10% మేర తగ్గిపోతుంది. అంటే బేస్‌ సమ్‌ ఇన్సూర్డ్‌ రూ.10 లక్షలు తీసుకున్నారనుకుంటే.. అప్పటి వరకు ఎన్‌సీబీ రూపంలో ఏటా 10% చొప్పున రూ.3లక్షల కవరేజీ అదనంగా లభించి ఉంటే.. తర్వాతి సంవత్సరంలో క్లెయిమ్‌ చేసుకుంటే బేసిక్‌ కవరేజీ రూ.10లక్షలు అలాగే ఉంటుంది. ఎన్‌సీబీ మాత్రం రూ.లక్ష తగ్గి రూ.2లక్షలకు చేరుతుంది. ఎన్‌సీబీని బేసిక్‌ ఎస్‌ఐ ఆధారంగానే పెంచుతారు కనుక.. తగ్గించేటప్పుడూ అదే సూత్రం అమలవుతుంది. క్లెయిమ్‌లు చేసుకున్నా కానీ.. ఎన్‌సీబీని తగ్గించని పాలసీల్లో మణిపాల్‌ సిగ్నా ప్రోహెల్త్‌ ఇన్సూరెన్స్‌ ఒకటి. ప్రస్తుతం కోవిడ్‌–19  వల్ల ఆర్థిక ఇబ్బందులు, హెల్త్‌రిస్క్‌ను దృష్టిలో ఉంచుకుని కొన్ని బీమా సంస్థలు పాలసీదారులు క్లెయిమ్‌ చేసుకున్నా కానీ.. ఎన్‌సీబీని తగ్గించడం లేదు. ఇందుకు ఉదాహరణ హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో. ఈ ఏడాది జూలై 1 నుంచి సెప్టెంబర్‌ 30 మధ్య కోవిడ్‌–19 చికిత్స కోసం క్లెయిమ్‌ చేసుకున్నా కానీ పాలసీదారుల క్యుములేటివ్‌ బోనస్‌ కవరేజీని తగ్గించకూడదని హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో నిర్ణయం తీసుకుంది. ఇదే విధమైన నిర్ణయాన్ని ఐసీఐసీఐ లాంబార్డ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌కూడా తీసుకుంది.

అదనపు ఎన్‌సీబీ  
నో క్లెయిమ్‌ బోనస్‌ రూపంలో బీమా కవరేజీ పెంపు ప్రయోజనం ఉచితంగానే లభిస్తుంది. ఇందుకు ఎటువంటి ప్రీమియంను అదనంగా చెల్లించాల్సిన అవసరం ఉండదు. అయితే, అదనంగా ప్రీమియం చెల్లించడం ద్వారా క్యుములేటివ్‌ బోనస్‌ కవరేజీని మరింత పెంచుకునేందుకు కొన్ని బీమా సంస్థలు అవకాశం కల్పిస్తున్నాయి. నో క్లెయిమ్‌ బోనస్‌కు అదనంగా కొంత ప్రీమియం చెల్లించి ఎన్‌సీబీని ఏటా అదనంగా 5–10 శాతం మేర పెంచుకోవచ్చు. ఉదాహరణకు మణిపాల్‌ సిగ్నా ప్రోహెల్త్‌ ప్లాన్‌లో క్యుములేటివ్‌ బోనస్‌ బూస్టర్‌ను కొనుగోలు చేసుకోవచ్చు. సమ్‌ ఇన్సూర్డ్‌పై కచ్చితంగా 25 శాతం పెంపును, గరిష్టంగా 200 శాతం వరకు పెంపును ఆఫర్‌ చేస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో సైతం అదనపు ప్రీమియంతో క్యుములేటివ్‌ బోనస్‌ను పెంచుకునేందుకు అనుమతిస్తోంది.  

పోర్టింగ్‌ పెట్టుకుంటే ఏంటి పరిస్థితి?
మొబైల్‌ నంబర్‌ పోర్టబులిటీ మాదిరిగానే హెల్త్‌ ఇన్సూరెన్స్‌ను కూడా ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మార్చుకోవచ్చు. బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ  మార్గదర్శకాల మేరకు.. ఒక సంస్థ నుంచి మరో సంస్థకు హెల్త్‌ ప్లాన్‌ను పోర్ట్‌ చేసుకుంటే.. గత సంస్థలో పోగు చేసుకున్న క్యుములేటివ్‌ బోనస్‌ను కొత్త సంస్థ కూడా ఎటువంటి అదనపు ప్రీమియం లేకుండానే అందించాల్సి ఉంటుంది. దీని గురించి బజాజ్‌ అలియాంజ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ సంస్థ హెల్త్‌ క్లెయిమ్స్‌ విభాగం హెడ్‌ భాస్కర్‌ నేరుర్కర్‌ వివరిస్తూ.. ‘‘పోర్టింగ్‌ సమయంలో బేస్‌ సమ్‌ ఇన్సూర్డ్‌తోపాటు క్యుములేటివ్‌ బోనస్‌ కూడా నూతన పాలసీకి బదిలీ అవుతుంది. ప్రీమియం మాత్రం బేసిక్‌ సమ్‌ ఇన్సూర్డ్‌కే వసూలు చేస్తారు.

అయితే, ఆ తర్వాత నుంచి నూతన సంస్థ నియమ, నిబంధనల మేరకే క్యుములేటివ్‌ బోనస్‌ ప్రయోజనం లభిస్తుంది’’ అని తెలిపారు. అంటే ఒక వ్యక్తి ఏ అనే బీమా కంపెనీ నుంచి రూ.5 లక్షల సమ్‌ ఇన్సూర్డ్‌కు హెల్త్‌ ప్లాన్‌ తీసుకుని, రూ.లక్ష సమ్‌ ఇన్సూర్డ్‌ను ఎన్‌సీబీ కింద పొంది ఉన్నారనుకుంటే.. మరో సంస్థకు పోర్టింగ్‌ చేసుకునేట్టయితే నూతన సంస్థ సైతం మొత్తం రూ.6లక్షలకు కవరేజీని (రూ.5 లక్షలు బేసిక్, రూ.లక్ష బోనస్‌) ఆఫర్‌ చేస్తుందని అర్థం చేసుకోవాలి. దీనికి అదనంగా సమ్‌ ఇన్సూర్డ్‌ను పెంచుకోవాలంటే ప్రత్యేకంగా అండర్‌రిటన్‌ చేయాల్సి ఉంటుందని మణిపాల్‌ సిగ్నా హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ఎండీ, సీఈవో ప్రసూన్‌ సిక్దర్‌ తెలిపారు. అంటే నూతన సంస్థలో బేస్‌ సమ్‌ ఇన్సూర్డ్‌ను పెంచుకోవాలంటే అదనపు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.   
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement