
1 షేరుకి 4 షేర్లు ఉచితం
2:1 నిష్పత్తిలో షేర్ల విభజన
షేరుకి రూ. 44 డివిడెండ్
క్యూ4 లాభం రూ. 4,546 కోట్లు
న్యూఢిల్లీ: ఎన్‌బీఎఫ్‌సీ దిగ్గజం బజాజ్ ఫైనాన్స్ గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం 16 శాతం ఎగసి రూ. 3,940 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2023–24) ఇదే కాలంలో రూ. 3,402 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 12,764 కోట్ల నుంచి రూ. 15,808 కోట్లకు జంప్ చేసింది.
స్టాండెలోన్ ఫలితాలివి. వడ్డీ ఆదాయం రూ. 11,201 కోట్ల నుంచి రూ. 13,824 కోట్లకు బలపడింది. కాగా.. కన్సాలిడేటెడ్ నికర లాభం సైతం 19 శాతం వృద్ధితో రూ. 4,546 కోట్లకు చేరింది. నిర్వహణలోని మొత్తం ఆస్తులు(ఏయూఎం) 26 శాతం ఎగసి రూ. 4,16,661 కోట్లయ్యాయి. 2025 మార్చి31కల్లా స్థూల మొండి బకాయిలు(ఎన్‌పీఏలు) 0.96 శాతం, నికర ఎన్‌పీఏలు 0.44 శాతంగా నమోదయ్యాయి.
అందుబాటులోకి షేరు
బజాజ్ ఫైనాన్స్ వాటాదారులకు రూ. 2 ముఖ విలువగల ఒక్కో షేరుకి రూ. 44 డివిడెండ్ చెల్లించనుంది. రూ. 2 ముఖ విలువగల ప్రతీ షేరుని రూ. 1 ముఖ విలువగల 2 షేర్లుగా విభజించనుంది. అంతేకాకుండా 4:1 నిష్పత్తిలో బోనస్ ప్రకటించింది. అంటే వాటాదారుల వద్దగల ప్రతీ 1 షేరుకి 4 షేర్లు ఉచితంగా జారీ చేయనుంది. ఈ ప్రతిపాదనలను తాజాగా బోర్డు అనుమతించినట్లు కంపెనీ వెల్లడించింది. కాగా.. గతంలో నమోదు చేసిన రూ. 249 కోట్ల పన్ను వ్యయాలను రివర్స్ చేసింది. దీంతో పూర్తి ఏడాదిలో పన్ను ప్రొవిజన్ రూ. 99 కోట్లకు పరిమితమైనట్లు పేర్కొంది. వెరసి క్యూ4లో రూ. 348 కోట్ల పన్ను తగ్గినట్లు తెలిపింది. ఫలితాల నేపథ్యంలో బజాజ్ ఫైనాన్స్ షేరు బీఎస్‌ఈలో నామమాత్ర నష్టంతో రూ. 9,089 వద్ద ముగిసింది.