
బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీల్లో అప్రమత్తత
గతేడాది పండుగ సీజన్‌లో తగ్గుముఖం
క్రిఫ్ హైమార్క్ విశ్లేషణలో వెల్లడి
ముంబై: గతేడాది పండుగల కాలంలో (సీజన్) రుణ వితరణ పట్ల బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీలు అప్రమత్త ధోరణితో వ్యవహరించాయి. వ్యక్తిగత, క్రెడిట్ కార్డు సహా అన్‌సెక్యూర్డ్ విషయంలో దూకుడు వద్దంటూ ఆర్‌బీఐ చేసిన హెచ్చరికలతో ఈ పరిస్థితి నెలకొంది. 2024–25 మూడో త్రైమాసికంలో(2024 అక్టోబర్–డిసెంబర్) వినియోగ రుణాల తీరును పరిశీలించినట్టయితే రిస్క్ పట్ల స్పృహతో, బాధ్యతాయుతంగా రుణదాతలు వ్యవహరించినట్టు తెలుస్తోందని క్రిఫ్ హైమార్క్ చైర్మన్ సచిన్ సేత్ తెలిపారు.
గత కొన్ని త్రైమాసికాలుగా వినియోగం విషయమై ఆందోళనలు నెలకొన్న విషయాన్ని గుర్తు చేశారు. గతేడాది పండుగ సీజన్‌లో గృహ రుణాలు (రుణాల్లో అతిపెద్ద విభాగం) విలువ పరంగా 0.1 శాతం పెరిగినట్టు కనిపించినప్పటికీ.. సంఖ్యా పరంగా 7 శాతం క్షీణించడాన్ని క్రిఫ్ హైమార్క్ నివేదిక ప్రస్తావించింది. అలాగే, వ్యక్తిగత రుణాలు 6.7 శాతం, కన్జ్యూమర్ డ్యురబుల్ రుణాలు 1.9 శాతం చొప్పున (సంఖ్యా పరంగా) తగ్గాయి. ఆటో రుణాలు, ద్విచక్ర వాహన రుణాల్లో ఎలాంటి వృద్ధి నమోదు కాలేదు. వ్యవస్థలో నగదు లభ్యత కఠినంగా మారడం, గృహాల రుణ భారం అధికం కావడం, ఆర్‌బీఐ కఠిన నిబంధనలు ఈ పరిస్థితికి దారితీసినట్టు ఈ నివేదిక వివరించింది.
వినియోగదారుల్లోనూ ఉత్సాహం కరువు..
పండుగల సీజన్‌లో మొదటిసారి కస్టమర్లకు రుణాల జారీలోనూ క్షీణత కనిపించినట్టు క్రిఫ్‌హై మార్క్ నివేదిక తెలిపింది. ఇది కూడా బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీల్లో అప్రమత్త ధోరణికి నిదర్శనమని పేర్కొంది. వడ్డీ రేట్లు భారంగా మారడం, అన్ సెక్యూర్డ్ రుణాల్లో రిస్క్ వెయిటేజీ పెంపు నిబంధనల నేపథ్యంలో రుణ గ్రహీతల్లోనూ ఉత్సాహం లోపించినట్టు వెల్లడించింది. ప్రీమియం రుణ గ్రహీతలు రుణాలతో ఆస్తులు సమకూర్చుకుంటుంటే.. ఇతర రుణ గ్రహీతలు వినియోగం కోసం రుణాలపై ఆదారపడుతున్నారన్న ఆర్‌బీఐ స్థిరత్వ నివేదికను సైతం ప్రస్తావించింది.