
న్యూఢిల్లీ: అక్రమ లావాదేవీలకు వీలు కల్పిస్తున్న మ్యూల్ ఖాతాలను వెంటనే స్తంభింపజేసేందుకు (ఫ్రీజ్) బ్యాంక్ సిబ్బందికి అధికారాలు ఇవ్వాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన వర్కింగ్ గ్రూప్ ఆర్‌బీఐకి ఈ మేరకు ప్రతిపాదన చేయనున్నట్టు తెలిపింది. సైబర్ నేరస్థులు ఈ మ్యూల్ ఖాతాల ద్వారానే నిధులు తరలిస్తుంటారన్నది గమనార్హం.
కొంత కమీషన్ ముట్టచెప్పి వేరే వారి ఖాతాలను లావాదేవీలకు వినియోగించుకుంటూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఖాతాదారుల ప్రమేయం లేకుండా కూడా వారి ఖాతాలను వినియోగిస్తుంటారు. అంతర్గత వ్యవస్థలు ఈ తరహా లావాదేవీల గురించి హెచ్చరించిన వెంటనే ఖాతాలను నిలిపివేసే అధికారం ఇవ్వాలని కోరనున్నట్టు వర్కింగ్ గ్రూప్ తెలిపింది. ప్రస్తుతం ఏదైనా ఖాతాను ఫ్రీజ్ చేయాలంటే కోర్టు లేదా దర్యాప్తు సంస్థల ఆదేశాలతోనే బ్యాంక్ సిబ్బంది చేయగలరు.
మరోవైపు అక్రమ లావాదేవీలకు అవకాశం ఉన్న ఖాతాలను గుర్తించేందుకు బ్యాంక్‌లు సైతం తనిఖీ చేయాలన్నది మరో ప్రతిపాదన. ఓటరు గుర్తింపు కార్డుతో ఖాతాలు తెరిచిన వారి గుర్తింపు ధ్రువీకరించుకునేందుకు వీలుగా ఎన్నికల సంఘం డేటాబేస్‌ను తనిఖీ చేసే అవకాశం బ్యాంక్ సిబ్బందికి కల్పించాలని కోరనున్నట్టు వర్కింగ్ గ్రూప్ తెలిపింది.