
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (US president Donald Trump) విధించిన సుంకాలు (US tariffs) భిన్నమైన గోల్డ్ రష్‌కు దారితీశాయి. న్యూయార్క్, లండన్ నగరాల మధ్య వాణిజ్య విమానాల్లో బిలియన్ల డాలర్ల విలువైన బంగారం తరలుతోందని ఒక నివేదిక తెలిపింది. పెరుగుతున్న ధరలు, మారుతున్న మార్కెట్ల కారణంగా జేపీ మోర్గాన్ సహా బ్యాంకులు బంగారాన్ని తరలించడానికి ఇబ్బంది పడుతున్నందున వింత పరిస్థితి ఏర్పడుతోందని క్వార్ట్జ్ నివేదించింది.
పెరుగుతున్న బంగారం ధరలు
బంగారం ధర నిరంతరం పెరుగుతోంది. ఈ సంవత్సరం ఫ్యూచర్స్ కాంట్రాక్టులు 11% పెరిగాయని నివేదిక పేర్కొంది. గత బుధవారం న్యూయార్క్‌లోని కామెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ ట్రాయ్ ఔన్సుకు 2,909 డాలర్ల వద్ద ముగిశాయి. ఇది త్వరలో 3,000 డాలర్లకు చేరుకోవచ్చని విశ్లేషకులు సూచిస్తున్నారని ది వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. ట్రంప్ ఎన్నిక, యూరప్‌పై సుంకాలు విధిస్తానని ఆయన బెదిరింపు తర్వాత, డిసెంబర్ ప్రారంభం నుండి లండన్‌లో భౌతిక బంగారం ధర దాదాపు 20 డాలర్లు తక్కువగా ట్రేడవుతోందని నివేదిక పేర్కొంది.
న్యూయార్క్‌కు బంగారం తరలింపు
సాధారణంగా లండన్, న్యూయార్క్ నగరాల్లో బంగారం ధరలు ఒకే రకంగా కదులుతాయి. ధరల అంతరం ఉన్నప్పుడల్లా వ్యాపారులు ఈ రెండు నగరాల మధ్య బంగారాన్ని తరలిస్తూ ఉంటారు. లండన్‌లో గోల్డ్ బార్‌లను కలిగి ఉన్న బ్యాంకులు వాటిని రుణంగా ఇవ్వడం ద్వారా ఈ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తూ ఉంటాయి. ఇక ధరల తగ్గుదల నుండి రక్షించుకోవడం కోసం న్యూయార్క్‌లో ఫ్యూచర్స్ కాంట్రాక్టులను విక్రయిస్తుంటాయి. జేపీ మోర్గాన్, హెచ్‌ఎస్‌బీసీ వంటి పెద్ద బ్యాంకులు ఈ బంగారు లావాదేవీలను నిర్వహిస్తుంటాయి.
కానీ ఇటీవల పరిస్థితులు మారిపోయాయి. అమెరికాలో బంగారం ధరలు లండన్ కంటే ఎక్కువగా పెరగడంతో గోల్డ్ ఫ్యూచర్లను విక్రయించిన బ్యాంకులు ఇప్పుడు నష్టాలను ఎదుర్కొంటున్నాయి. ఈ ఫ్యూచర్స్ కాంట్రాక్టులను నష్టానికి తిరిగి కొనుగోలు చేయడానికి బదులుగా, బ్యాంకులు తమ లండన్ వాల్ట్‌ల నుండి భౌతిక బంగారాన్ని న్యూయార్క్‌కు తరలించే తెలివైన పరిష్కారాన్ని కనుగొన్నాయి. ఇలా చేయడం ద్వారా బ్యాంకులు నష్టపోకుండా తమ ఒప్పందాలను నెరవేర్చుకోవచ్చు. అలాగే బంగారాన్ని అధిక యూఎస్ ధరకు అమ్మడం ద్వారా లాభం కూడా పొందవచ్చు. వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రకారం.. ఒక్క జేపీ మోర్గాన్ సంస్థే ఈ నెలలో న్యూయార్క్‌కు 4 బిలియన్ డాలర్ల విలువైన బంగారాన్ని తరలించాలని ప్రణాళిక వేసింది.
బంగారం తరలింపునకు వాణిజ్య విమానాలు
బంగారం తరలింపు బ్యాంకులకు నష్టాలను తగ్గించి, లాభాలను కూడా పొందేందుకు వీలు కల్పించినప్పటికీ, తరలింపులో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొంతమంది క్లయింట్లు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ఖజానాల నుండి తమ బంగారాన్ని తిరిగి పొందడానికి ఒక వారం వరకు వేచి ఉన్నారని నివేదిక పేర్కొంది. ధర వ్యత్యాసాలు ఓవైపు ఉంటే మరోవైపు కామెక్స్ కాంట్రాక్టులు గోల్డ్ బార్‌ల పరిమాణానికి సంబంధించి కూడా కఠినమైన నిబంధనలు ఉన్నాయి. అంటే వ్యాపారులు బంగారాన్ని యథాతథంగా రవాణా చేయలేరు. యూఎస్‌కు రవాణా చేయడానికి ముందు సరైన పరిమాణంలోకి మార్చడానికి వాటిని ముందుగా శుద్ధి కర్మాగారాలకు పంపాల్సి ఉంటుందని వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది.
ఇలా బంగారం సిద్ధమైన తర్వాత కూడా దానిని రవాణా చేయడం అత్యంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అందుకే వాణిజ్య విమానాల ద్వారా తరలింపు సురక్షితమైన మార్గమని బ్యాంకులు భావిస్తున్నాయని నివేదిక పేర్కొంది. బ్యాంకులు భద్రతా సంస్థలతో కలిసి సాయుధ వ్యాన్లలో బంగారాన్ని లండన్‌లోని విమానాశ్రయాలకు తరలిస్తున్నాయని, తరువాత వాటిని న్యూయార్క్‌కు తరలిస్తారని వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది.
Comments
Please login to add a commentAdd a comment