Claim Settlement
-
తెలుగు రాష్ట్రాల్లో క్లెయిమ్స్ సరళతరం: ఐసీఐసీఐ ప్రు లైఫ్
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితులకు సంబంధించి క్లెయిమ్స్ ప్రక్రియను సరళతరం చేసినట్లు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ వెల్లడించింది. క్లెయిమ్ సెటిల్మెంట్ కోసం మూడు ప్రాథమిక డాక్యుమెంట్లను సమరి్పస్తే సరిపోతుందని వివరించింది. ఐఎఫ్ఎస్సీ కోడ్ ఉన్న బ్యాంకు అకౌంటు నంబరు లేదా క్యాన్సిల్ చేసిన చెక్ కాపీ, డెత్ సరి్టఫికెట్ లేదా ఆస్పత్రులు, పోలీసులు, ప్రభుత్వాధికారులు జారీ చేసిన మృతుల జాబితా, ఆధార్ వంటి ధృవీకరణ పత్రాలను ఇవ్వొచ్చని పేర్కొంది. మొబైల్ యాప్ ద్వారా లేదా ఎస్ఎంఎస్ ద్వారా క్లెయిమ్‌ను రైజ్ చేయొచ్చని వివరించింది. ఇరవై నాలుగ్గంటలూ పనిచేసే టోల్ ఫ్రీ క్లెయిమ్కేర్ హెల్ప్‌లైన్ 1800–2660ని ప్రారంభించినట్లు సంస్థ పేర్కొంది. -
ఆన్లైన్లో క్లెయిమ్ స్టేటస్
డిపాజిట్‌దార్లు ఆన్లైన్లో తమ క్లెయిమ్ స్టేటస్‌ను తెలుసుకునేలా డీఐసీజీసీ ఏర్పాట్లు చేసింది. అందులో భాగంగా డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) ఆన్లైన్ టూల్ ‘దావా సూచక్’ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా ఖాతాదారులు తమ డిపాజిట్ల క్లెయిమ్ పరిస్థితిని తెలుసుకోవచ్చు. వినియోగదారులకు మెరుగైన సేవలందించేందుకే ఈ ‘దావా సూచక్’ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు డీఐసీజీసీ తెలిపింది.బ్యాంక్‌లో నమోదైన మొబైల్ నంబరు ద్వారా ఖాతాదారులు దావా సూచక్లోని సమాచారాన్ని తెలుసుకోవచ్చు. అయితే 2024 ఏప్రిల్ 1 తర్వాత చేసిన క్లెయిమ్‌ల వివరాలు మాత్రమే ఈ టూల్ ద్వారా తెలుసుకునేందుకు వీలుందని డీఐసీజీసీ పేర్కొంది. సంస్థలు(ఇన్స్టిట్యూషన్స్) చేసే డిపాజిట్లు మినహా ఇతర అన్నిరకాల క్లెయిమ్‌లను ఈ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. ప్రస్తుతం డిపాజిట్లపై రూ.5 లక్షల వరకు బీమా సదుపాయం ఉంది. అంటే ఉదాహరణకు ఏదైనా బ్యాంకులోగానీ, ఎన్బీఎఫ్సీలోగానీ రూ.5 లక్షల వరకు డిపాజిట్ చేస్తే ఆ డబ్బుకు బీమా ఉంటుంది. ఒకవేళ ఏదైనా కారణాల వల్ల బ్యాంక్ డీఫాల్ట్ అయితే రూ.5 లక్షలకంటే ఎక్కువ డిపాజిట్ చేసినా రూ.5 లక్షలు మాత్రం కచ్చితంగా చెల్లిస్తారు.ఇదీ చదవండి: పెరిగిన ట్రక్ అద్దెలుదేశంలోని మొత్తం డిపాజిట్లలో 97.8 శాతం ఖాతాలు పూర్తిగా బీమా పరిధిలో ఉన్నాయని డీఐసీజీసీ తెలిపింది. అంటే ఈ మొత్తాలు రూ.5 లక్షల వరకే ఉన్నవి. మరో 2.2 శాతం రూ.5 లక్షలకు మించిన డిపాజిట్లు. వీటిల్లో ఎంత మొత్తం ఉన్నా రూ.5 లక్షల వరకు బీమా ఉంటుంది. 1962లో ఈ బీమా రూ.1,500గా ఉండేది. దాన్ని ఫిబ్రవరి 04, 2020 వరకు ఆరుసార్లు సవరించి రూ.5 లక్షలకు పెంచారు. 2023లో డీఐసీజీసీ రూ.1,432 కోట్ల క్లెయిమ్‌లను పరిష్కరించింది. -
ఆరోగ్య బీమా తిరస్కరించకూడదంటే..
జీవనశైలిలో మార్పు, విభిన్న ఆహార అలవాట్లతో అనారోగ్యబారిన పడుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. ఆరోగ్య బీమా ఉందనే ధీమాతో ఆసుపత్రిలో చేరిన కొందరి క్లెయిమ్‌లను కంపెనీలు తిరస్కరిస్తున్నాయి. అయితే బీమా తీసుకునే సమయంలోనే పాలసీదారులు చేస్తున్న కొన్ని పొరపాట్ల వల్ల ఇలా క్లెయిమ్ అందడం లేదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అసలు ఆరోగ్య బీమా క్లెయిమ్ ఎలాంటి పరిస్థితుల్లో తిరస్కరిస్తారు.. అలా కంపెనీలు క్లెయిమ్‌లు తిరస్కరించకూడదంటే ఏం చేయాలనే వివరాలు తెలుసుకుందాం.బీమా పాలసీ డాక్యుమెంట్లు గతంలో సామాన్యులకు అర్థంకాని కఠిన పదాలతో ఉండేవి. కానీ భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) పాలసీ పత్రాలు సరళమైన భాషలో ఉండాలని ఆదేశించింది. దాంతో ప్రస్తుతం అన్ని కంపెనీలు అందరికీ అర్థమయ్యే విధంగా పాలసీ పత్రాలను వెల్లడిస్తున్నాయి. అన్ని కంపెనీలు ఐఆర్డీఏఐ మార్గదర్శకాలకు అనుగుణంగా పాలసీ జారీ చేస్తుంటాయి. అయితే వాటిని సరిగా అర్థం చేసుకుని బీమా తీసుకోవాల్సి ఉంటుంది. అందులో ప్రధానంగా కింది అంశాలపై అవగాహన ఉండాలి.ఆరోగ్య సమాచారం సరిగా తెలపడంపాలసీ తీసుకునేప్పుడు ఆరోగ్య విషయాలు స్పష్టంగా తెలియజేయాలి. ఒకవేళ గతంలో ఏదైనా సర్జరీలు, అనారోగ్య సమస్యలుంటే తప్పకుండా కంపెనీలకు ముందుగానే చెప్పాలి. దానివల్ల స్వల్పంగా ప్రీమియం పెరుగుతుంది. కానీ భవిష్యత్తులో పాలసీ క్లెయిమ్ కాకపోతే ఇబ్బంది పడాల్సి ఉంటుంది. కాబట్టి ఎలాంటి సమస్యలున్నా ముందుగానే తెలియజేయడం ఉత్తమం.వెయిటింగ్ పీరియడ్పాలసీ తీసుకున్న వెంటనే కొన్ని రకాల జబ్బులకు కంపెనీలు వైద్య ఖర్చులు అందించవు. అలాంటి వ్యాధులకు బీమా వర్తించాలంటే కొన్ని రోజులు వేచి ఉండాలి. అయితే కంపెనీలకు బట్టి ఈ వ్యాధులు మారుతుంటాయి. మీకు ఇప్పటికే కొన్ని జబ్బులుండి వాటికి వైద్యం చేయించుకోవాలనుకుంటే మాత్రం అన్ని వివరాలు తెలుసుకోవాలి.సరైన ధ్రువపత్రాలతో రీయింబర్స్మెంట్బీమా కంపెనీలకు చెందిన నెట్వర్క్ ఆసుపత్రులు అందుబాటులో లేనివారు ఇతర హాస్పటల్లో వైద్యం చేయించుకుంటారు. తర్వాత బీమా కంపెనీకి బిల్లులు సమర్పించి తిరిగి డబ్బు పొందుతారు. అయితే అందుకు సరైన ధ్రువపత్రాలు అవసరం. వైద్యం పూర్తయ్యాక ఆసుపత్రి నుంచి అవసరమైన పత్రాలు, బిల్లులు, ఆరోగ్య నివేదికలు తీసుకొని నిబంధనల ప్రకారం రీయింబర్స్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకోవాలి.ఇదీ చదవండి: అడ్మిషన్ తిరస్కరించిన కాలేజీకే ముఖ్య అతిథిగా..క్లెయిమ్‌ను తిరస్కరించకుండా ఏ జాగ్రత్తలు పాటించాలంటే..బీమా పాలసీ తీసుకునేముందే అన్ని నిబంధనలు అర్థం చేసుకోవాలి. భవిష్యత్తులో క్లెయిమ్ తిరస్కరణకు దారితీసే సందర్భాల గురించి అవగాహన కలిగి ఉండాలి. పాలసీ కొనుగోలు సమయంలోనే అన్ని అంశాలను పరిశీలించాలి.బీమా సంస్థ నియమాలను తప్పకుండా అనుసరించాలి. పైన తెలిపిన విధంగా ఆరోగ్య విషయాల వెల్లడిలో పొరపాటు చేయకూడదు. ప్రతిపాలసీకు కొన్ని షరతులు, మినహాయింపులు, పరిమితులుంటాయి. వాటిపై పూర్తిగా అవగాహన ఉండాలి.ఏదైనా ప్రమాదం జరిగితే పాలసీ నెట్వర్క్ ఆసుపత్రుల్లోనే చేరాలి. అత్యవసరం అయితే తప్పా ఇతర హాస్పటల్స్లోకి వెళ్లకూడదు. నెట్వర్క్ ఆసుపత్రుల్లో చేరితే డబ్బు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ కోపే(కొంత బీమా కంపెనీ, ఇంకొంత పాలసీదారులు చెల్లించాలి) ఎంచుకుంటే మాత్రం నిబంధనల ప్రకారం కొంత పాలసీదారులు చెల్లించాలి.కొన్నిసార్లు చికిత్స కోసం వెళ్లిన ఆసుపత్రిని బీమా సంస్థ నిషేధిత జాబితాలో పెట్టొచ్చు. ఆ సందర్భంలో పరిహారం చెల్లించదు. కాబట్టి, ముందుగానే ఈ వివరాలను తెలుసుకోవాలి. కంపెనీ వెబ్సైట్లో వాటిని అప్డేట్ చేస్తుంటారు.బీమా క్లెయిమ్ చేసుకునే విధానంలో ఎదైనా సందేహాలుంటే కంపెనీలను సంప్రదించాలి. బీమా సంస్థలు పాలసీదారులకు ఆసుపత్రులను ఎంపిక చేసుకోవడంతోపాటు, ఇతర అంశాలపైనా సహాయం చేస్తాయి. -
నామినీ నమోదు చేశారా?
ప్రతి ఒక్కరి జీవితంలో పెట్టుబడులకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. తమ సంపదను వృద్ధి చేసుకునేందుకు ఎన్నో రూపాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. సొంతిల్లు సమకూర్చుకోవాలని, వారసులకు బంగారు భవిష్యత్తును ఇవ్వాలని.. ఇలాంటి ముఖ్యమైన ఎన్నో జీవిత లక్ష్యాల కోసం పలు రకాల సాధనాల్లో పెట్టుబడులు పెడుతుంటారు. స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, డిపాజిట్లు, బాండ్లు, జీవిత బీమా ప్లాన్లు, పీపీఎఫ్ ఇలా ఎన్నో ఆర్థిక సాధనాలు వ్యక్తుల ఆర్థిక ప్రణాళికల్లో భాగంగా ఉంటాయి. అయితే, జీవితం ఎప్పుడు ఎలాంటి మలుపు తీసుకుంటుందో చెప్పలేం. దురదృష్టం కొద్దీ ఈ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసిన వారికి ఏదైనా ప్రమాదం జరిగితే ఏంటి పరిస్థితి? ఆ పెట్టుబడులనేవి జీవిత భాగస్వామి లేదా వారసులకు సాఫీగా, సులభంగా, వేగంగా బదిలీ అవ్వాలి. అందుకు ఓ చిన్న పని చేయాల్సి ఉంటుంది. అదే నామినేషన్ నమోదు చేయడం. తమకు అత్యంత ఆప్తులైన వారిలో ఒకరి పేరును నామినీగా ప్రతి పెట్టుబడి సాధనంలోనూ నమోదు చేయాలి. నామినేషన్ లేని సందర్భాల్లో క్లెయిమ్ కోసం పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. కనుక నామినేషన్ ప్రాధాన్యాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. నామినీ అంటే ఎవరు..? పెట్టుబడిదారు మరణించిన సందర్భాల్లో వారి పేరిట ఉన్న పెట్టుబడులను క్లెయిమ్ చేసుకుని, వాటిని పొందే హక్కును కలిగిన వ్యక్తి నామినీ అవుతారు. ఎక్కువ మంది నామినీగా కుటుంబ సభ్యులనే ముందుగా నియమించుకుంటారు. జీవిత భాగస్వామి లేదా పిల్లలు లేదా తల్లిదండ్రులు నామినేషన్ విషయంలో ప్రథమ ఎంపికగా ఉంటారు. అవివాహితులై, తల్లిదండ్రులు, తోడబుట్టిన వారు కూడా లేని సందర్భాల్లో అత్యంత సన్నిహితులు, నమ్మకస్తులైన వారిని, స్నేహితులను నామినీగా నియమించుకోవచ్చు. నామినీకి ఎవరు అయినా అర్హులే. కాకపోతే అంతిమంగా దీని ప్రయోజనం నెరవేరేలా నామినేషన్ ఉండాలన్న అంశాన్ని మర్చిపోవద్దు. ఒకవేళ నామినీగా మైనర్‌ను పేర్కొంటే, సంబంధిత నామినీ సంరక్షకుడి పేరు, చిరునామా, కాంటాక్ట్ వివరాలు ఇవ్వాలి. ఎంతో ప్రాధాన్యం.. 3నామినేషన్ నమోదు చేసిన వ్యక్తి మరణించిన సందర్భంలో.. అతని పేరిట ఉన్న పెట్టుబడులు నామినీకి చాలా సులభంగా బదిలీ అవుతాయి. నామినీని నమోదు చేయకపోతే.. అప్పుడు ఆ పెట్టుబడులను వారసులే క్లెయిమ్ చేయగలరు. చట్ట ప్రకారం తామే వారసులమని ధ్రువీకరణ పత్రం ఇవ్వాలి. వీటిని స్థానిక తహసీల్దార్ లేదా కోర్టు నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సమయంతోపాటు, శ్రమ కూడా పడాలి. ముఖ్యంగా కోర్టు నుంచి లీగల్ హేర్ సర్టిఫికెట్ తీసుకుని సమర్పించాల్సి ఉంటుంది. నామినేషన్ రిజిస్టర్ చేస్తే ఇలాంటి ఇబ్బందులేమీ ఉండవు. పెట్టుబడిదారు డెత్ సర్టిఫికెట్ ఒక్కటి సరిపోతుంది. ఒక అప్లికేషన్, దానికితోడు కేవైసీ వివరాలు సమర్పిస్తే చాలు. ప్రక్రియ సులభంగా ముగుస్తుంది. వేటికి?..: బీమా పాలసీ తీసుకోవడం వెనుక ఉద్దేశం తమకు ఏదైనా జరిగితే కుటుంబ సభ్యులు ఆర్థికంగా ఇబ్బంది పడకూడదనే. అంత ముఖ్యమైన బీమా ప్లాన్ దరఖాస్తులో నామినేషన్ నమోదు చేయకపోతే? అర్థమే ఉండదు. అలాంటప్పుడు పరిహారం దక్కించుకునేందుకు కుటుంబ సభ్యులు శ్రమ పడాల్సి వస్తుంది. అలాగే బ్యాంకు ఖాతాకు సైతం నామినేషన్ ఉండాలి. అప్పుడు ఖాతాలో బ్యాలన్స్ మొత్తాన్ని నామినీ సులభంగా పొందడానికి వీలవుతుంది. అకౌంట్ హోల్డర్ మరణ ధ్రువీకరణ పత్రంతోపాటు, నామినీ కేవైసీ వివరాలను బ్యాంకు శాఖలో సమర్పించడం ద్వారా వాటిని సొంతం చేసుకోవచ్చు. అలాగే, బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లలోనూ నామినేషన్ ఉండాలి. ఇంకా పీపీఎఫ్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ ట్రేడింగ్, డీమ్యాట్ అకౌంట్, అన్ని పోస్టాఫీసు పథకాలకు నామినేషన్ నమోదు చేసుకోవచ్చు. ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఏమిటంటే నామినేషన్ నమోదు చేయడం తప్పనిసరి కాదు. అయినా కానీ, నమోదు చేయడం బాధ్యతగా భావించాలి. ప్రతి పెట్టుబడి దరఖాస్తులో నామినేషన్ కాలమ్‌ను తప్పకుండా పూరించాలి. ఎంత మంది? నామినీలు ఎంత మంది అనే విషయం ఆయా పెట్టుబడి సాధనాల్లో వేర్వేరుగా ఉంటుంది. ఉదాహరణకు జీవిత బీమా పాలసీ అయితే ఎంత మందిని అయినా నామినీలుగా నమోదు చేసుకోవచ్చు. ఒకరికి మించి నామినీగా పేర్లు ఇచ్చినప్పుడు, విడిగా ఒక్కొక్కరికీ ఎంత శాతం చొప్పున క్లెయిమ్‌కు అర్హత అనేది కూడా పేర్కొనాలి. ఉదాహరణకు ముగ్గురిని నామినీలుగా నమోదు చేశారనుకుందాం. అప్పుడు ఏకి 50 శాతం, బీకి 30 శాతం, సీకి 20 శాతం లేదా తమకు నచ్చిన విధంగా ఈ శాతాన్ని నిర్ణయించుకోవచ్చు. బ్యాంకు ఖాతాలకు అయితే సాధారణంగా ఒక్కటే నామినేషన్ ఉంటుంది. పీపీఎఫ్ ఖాతాకు కూడా ఒకటికి మించి నామినేషన్లు ఇవ్వొచ్చు. మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులకు నామినేషన్ కింద ముగ్గురి పేర్లను నమోదు చేసుకోవచ్చు. కొందరు తమపై ఆధారపడిన ఒంటరి తల్లి లేదా తండ్రికీ కొంత పెట్టుబడుల మొత్తం వెళ్లాలని కోరుకుంటారు. అలాంటప్పుడు విల్లు రాసి అందులో ఎవరికి ఏమి చెందాలో పేర్కొనాలి. లేదంటే నామినేషన్లో తల్లిదండ్రులకూ ఇంత శాతం చొప్పున వాటా ఇవ్వాలి. సవరణ..: నామినేషన్ ఇవ్వడంతో పని ముగిసిపోయిందని అనుకోవద్దు. ఏడాదికోసారి సంబంధిత నామినేషన్‌ను సమీక్షించుకోవాలి. అప్పటికే నామినీగా పేర్కొన్న వ్యక్తులతో తమకున్న అనుబంధాన్ని విశ్లేషించుకోవాలి. తమకు ఏదైనా జరిగితే వారు ఆస్తులను క్లెయిమ్ చేసుకునేందుకు సరైన వారేనా అని ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే కొందరు వైవాహిక బంధం నుంచి వేరు పడుతుంటారు. మరొకరిని వివాహం చేసుకుంటారు. అవివాహితులు వైవాహిక జీవితంలోకి ప్రవేశించొచ్చు. లేదా నామినీగా పేర్కొన్న వ్యక్తి మరణించి ఉండొచ్చు. మరేదైనా కారణం ఉండొచ్చు. నామినీగా నమోదు చేసిన వ్యక్తి ఆచూకీ లేకుండా పోతే, అప్పుడు అసలు ఉద్దేశమే నెరవేరదు. అందుకే నామినేషన్‌ను ఏడాదికోసారి సమీక్షించి, సవరించుకోవాలి. ఊహించని అనుభవం 2021లో మద్రాస్ హైకోర్టు ఓ సంచలనాత్మక తీర్పునిచ్చింది. తన భర్త మరణంతో జీవిత బీమా పాలసీ ప్రయోజనాలను క్లెయిమ్ చేసుకునే విషయమై ఒక మహిళకు తన మామతో విభేదాలు ఏర్పడ్డాయి. కోర్టును ఆశ్రయించగా, ఆమెకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. కారణం ఆమె భర్త తీసుకున్న జీవిత బీమా పాలసీ ప్రీమియంలను తండ్రి (బాధితురాలి మామ) చెల్లించడమే. పైగా మరణించిన వ్యక్తి తన జీవిత బీమా పాలసీలో నామినీని నమోదు చేయలేదు. విల్లు కూడా రాయలేదు. ప్రీమియంలను పాలసీదారు సొంతంగా చెల్లించనప్పుడు, ఆ పాలసీ ప్రయోజనాలకు జీవిత భాగస్వామి వారసురాలని తేల్చడం కుదరదని కోర్టు స్పష్టం చేసింది. నామినీని నమోదు చేయకపోవడంతో, ప్రీమియం చెల్లించిన తండ్రికి ఆ పాలసీ ప్రయోజనాలపై అధికారాలు ఉంటాయని ఈ ఘటన స్పష్టం చేసింది. సరైన నిర్ణయం మనలో కొందరు తమ పిల్లల పేరిట జీవిత బీమా పాలసీలను తీసుకుని తొలుత వారే ప్రీమియం చెల్లిస్తుంటారు. కనుక పెళ్లయిన వ్యక్తులు వెంటనే జీవిత బీమా పాలసీల్లో తమ జీవిత భాగస్వామిని నామినీగా నమోదు చేయాలి. లేదంటే ఆశించిన ప్రయోజనం నెరవేరదు. అందుకే సరైన వ్యక్తిని నామినీగా నమోదు చేసుకోవాలి. లేదంటే విల్లు రాసి రిజిస్టర్ చేసుకోవాలి. ముఖ్యంగా జీవిత బీమా పాలసీల ఉద్దేశం నెరవేరాలంటే అందుకు నామినేషన్ మెరుగైన మార్గం. చాలా కేసుల్లో వ్యక్తి మరణంతో జీవిత భాగస్వామిపైనే ఆర్థిక బాధ్యతల భారం పడుతుంది. కనుక జీవిత భాగస్వామినే నామినీగా నమోదు చేసుకోవాలి. కుటుంబం కోసం ఒక పాలసీ, ఒంటరి తల్లి లేదా తండ్రి లేదా తనపై ఆధారపడిన తల్లిదండ్రుల కోసం విడిగా మరో పాలసీ తీసుకునే వారు.. ఆయా పాలసీల్లో తప్పనిసరిగా నామినీని పేర్కొనాలి. నామినేషన్ గడువు మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు కలిగిన వారు, ట్రేడింగ్, డీమ్యాట్ ఖాతా కలిగిన వారు తప్పనిసరిగా నామినీ విషయంలో ఆప్షన్ ఇవ్వాలని సెబీ ఆదేశాలు తీసుకొచ్చింది. 2023 మార్చి 31 వరకే ఉన్న గడువును, సెస్టెంబర్ 30 వరకు పొడిగించింది. కనుక ఇన్వెస్టర్లు వచ్చే సెప్టెంబర్ 30 నాటికి నామినేషన్ ఇవ్వాలి. నామినేషన్ ఇవ్వడం ఇష్టం లేకపోతే ‘ఆప్ట్ అవుట్ ఆఫ్ నామినేషన్’ను ఎంపిక చేసుకోవాలన్నది నిబంధన. అంటే నామినేషన్ నుంచి వైదొలగడం. కానీ, సెబీ ఆదేశాల ఉద్దేశం అది కాదు. నామినేషన్ విలువ తెలియజేసి, ప్రతి ఒక్కరూ నమోదు చేసుకునేలా చేయడమే. ఇక జీవిత బీమా ప్లాన్లు, బ్యాంకు ఖాతాలకు సంబంధించి నామినేషన్ నమోదు తప్పనిసరి కాదు. అయినా కానీ, నామినేషన్ ఇవ్వడం తన బాధ్యతగా ఇన్వెస్టర్ గుర్తించాలి. -
జీవిత బీమా ‘క్లెయిమ్’ చేయాల్సి వస్తే..?
మనం ఎంతగానో ప్రేమించే వారు దూరమైతే కోలుకోవడానికి సమయం పడుతుంది. అదే సమయంలో దూరమైన వ్యక్తికి సంబంధించి కుటుంబం ఆర్థికంగానూ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. జీవిత బీమా ఉంటే ఈ సవాళ్లను కొంత వరకైనా అధిగమించే శక్తిని సమకూర్చుకోవచ్చు. దురదృష్టవశాత్తూ పాలసీదారు మరణానికి గురైతే నామినీగా నమోదై ఉన్న వారు క్లెయిమ్ (జీవిత బీమా పరిహారం కోసం) ప్రక్రియను ప్రారంభించాల్సి ఉంటుంది. ఇవన్నీ సరిగ్గా, వేగంగా నిర్వహిస్తే.. అంతే వేగంగా పరిహారం చేతికి అందుతుంది. ఇందుకు సంబంధించి అనుసరించాల్సిన విధానాన్ని తెలియజేసే ‘ప్రాఫిట్ ప్లస్’ కథనమే ఇది. క్లెయిమ్ ప్రక్రియను ప్రారంభించడానికి ముందు నామినీగా ఉన్నవారు పాలసీదారు మరణానికి సంబంధించి సమాచారాన్ని జీవిత బీమా సంస్థకు తెలియజేయడం మంచిది. ఈ మెయిల్ లేదా ఫోన్ రూపంలో సమాచారం ఇవ్వొచ్చు. ఆ తర్వాత కావాల్సిన పత్రాలతో క్లెయిమ్ దాఖలు చేసుకోవాలి. కరోనా నేపథ్యంలో పాలసీదారుల సౌలభ్యం కోసం బీమా సంస్థలు ఆన్లైన్లోనే చాలా వరకు ప్రక్రియలను అనుమతిస్తున్నాయి. ఎస్బీఐ లైఫ్, టాటా ఏఐఏ లైఫ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్, ఎక్సైడ్ లైఫ్ క్లెయిమ్ ప్రక్రియను పూర్తిగా ఆన్లైన్లో చేపడుతున్నాయి. ఆన్లైన్లో అనుమతిస్తున్నాయంటే.. భౌతికంగా శాఖల రూపంలో అనుమతించడం లేదని పొరపడకండి. వీలుంటే ఆయా బీమా సంస్థ కార్యాలయానికి వెళ్లి అయినా క్లెయిమ్‌ను దాఖలు చేసుకునేందుకు అవకాశం ఉంది. ఈ మెయిల్ లేదా వాట్సాప్ లేదా కంపెనీ వినియోగదారుల సేవా కేంద్రాన్ని సంప్రదించొచ్చు. ఏజెంట్ సాయాన్ని అయినా తీసుకోవచ్చు. కరోనా మరణ కేసుల్లో క్లెయిమ్‌లను వేగంగా పరిష్కరించేందుకు గాను ఎస్బీఐ లైఫ్, పీఎన్బీ మెట్‌లైఫ్ సంస్థలు ప్రత్యేకంగా హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేశాయి. కొన్ని సాధారణ డాక్యుమెంట్లను కూడా క్లెయిమ్ దరఖాస్తుతోపాటు సమర్పించాల్సి వస్తుంది. క్లెయిమ్ ఫారమ్‌ను బీమా సంస్థల పోర్టళ్ల నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. డెత్ సర్టిఫికెట్, వైద్యులు ఇచ్చిన సర్టిఫికెట్, మెడికల్ రికార్డులు లేదా పరీక్షల ఫలితాల కాపీలను క్లెయిమ్ ఫారమ్‌తోపాటు జత చేయాల్సి ఉంటుంది. అలాగే, ఒరిజినల్ పాలసీ డాక్యుమెంట్, నామినీ బ్యాంకు ఖాతా వివరాలు, నామినీ కేవైసీ (చిరునామా, గుర్తింపు ధ్రువీకరణలతో), క్యాన్సిల్డ్ చేసిన చెక్‌ను ఇవ్వాల్సి ఉంటుంది. ప్రమాద మరణం అయినా, కరోనా మరణం అయినా, సాధారణ మరణం అయినా క్లెయిమ్ ఒకే విధంగా ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఎస్బీఐ లైఫ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ సంస్థలు ఈ ప్రక్రియను డిజిటలైజ్ చేశాయి. ఆన్లైన్లోనే క్లెయిమ్‌ను దాఖలు చేసి, డాక్యుమెంట్లను ఆప్‌లోడ్ చేస్తే సరిపోతుంది. వాట్సాప్, మొబైల్ యాప్, చాట్‌బాట్స్, వెబ్ పోర్టల్ ఏ రూపంలో అయినా బీమా కంపెనీని సంప్రదించొచ్చు. 30 రోజుల ప్రక్రియ బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) నిబంధనల ప్రకారం జీవిత బీమా సంస్థలు మరణ పరిహారం కోరుతూ వచ్చే క్లెయిమ్‌లను 30 రోజుల్లోగా పరిష్కరించాల్సి ఉంటుంది. క్లెయిమ్ దాఖలు చేసిన రోజు నుంచి ఈ గడువు అమలవుతుంది. ఒకవేళ పాలసీదారు మరణానికి సంబంధించి మరిన్ని వివరాలు, సందేహాలుంటే వాటిని నివృత్తి చేసుకునేందుకు బీమా సంస్థలు దర్యాప్తు అవసరమని భావించొచ్చు. కనుక దర్యాప్తు అవసరమైన కేసుల్లో 90 రోజుల సమయాన్ని బీమా సంస్థలు తీసుకోవచ్చు. అంటే 90 రోజుల్లో దర్యాప్తును పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత 30 రోజుల్లోపు క్లెయిమ్‌ను పరిష్కరించాల్సి ఉంటుంది. అయితే ఎటువంటి సందేహాల్లేకుండా, అన్ని పత్రాలు దాఖలు చేసిన కేసుల్లో ఏడు రోజుల వ్యవధిలోనే బీమా సంస్థలు పరిహారాన్ని విడుదల చేస్తున్నాయి. గతంతో పోలిస్తే క్లెయిమ్ ప్రక్రియ డిజిటలైజ్ కారణంగా వేగాన్ని సంతరించుకుందని చెప్పుకోవాలి. టాటా ఏఐఏ లైఫ్, ఎక్సైడ్ లైఫ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్, పీఎన్బీ మెట్‌లైఫ్ సంస్థలు క్లెయిమ్‌ను చాలా ప్రాధాన్యత అంశంగా పరిగణిస్తున్నాయి. టాటా ఏఐఏ లైఫ్, ఎక్సైడ్ లైఫ్ 48 గంటల్లోనే క్లెయిమ్‌ను పరిష్కరించేస్తున్నాయి. కాకపోతే కంపెనీ కోరిన డాక్యుమెంట్లను సమర్పించిన తర్వాత 48 గంటలను పరిగణనలోకి తీసుకోవాలి. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ 24 గంటల్లోనే ఈ ప్రక్రియను ముగించేస్తోంది. ఇక పీఎన్బీ మెట్‌లైఫ్ సంస్థ దీన్ని మరింత ప్రతిష్టాత్మకంగా పరిగణిస్తూ కేవలం మూడు గంటల్లోనే పరిష్కరిస్తుండడం గమనించాలి. గతంతో పోలిస్తే క్లెయిమ్‌ల విషయంలో బీమా సంస్థలు మరింత వేగాన్ని, నాణ్యతను సంతరించుకున్నాయి. డాక్యుమెంట్ల పరంగా.. కొన్ని బీమా సంస్థలు డాక్యుమెంట్ల విషయంలో కాస్త వెసులుబాటు కల్పించాయి. కరోనా వైరస్ నియంత్రణ వల్ల అమలవుతున్న ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని కంపెనీలు ఈ చర్యలు తీసుకున్నాయి. ఆస్పత్రిలో మరణం నమోదైతే సాధారణంగా క్లెయిమ్ కోసం డెత్ సర్టిఫికేట్ (మరణ ధ్రువీకరణ పత్రం) సమర్పించాల్సి ఉంటుంది. సంబంధిత ప్రభుత్వ విభాగాల నుంచి డెత్ సర్టిఫికెట్ అందుకునేందుకు సాధారణంగా 10–15 రోజులు వేచి ఉండాల్సి రావచ్చు. అంతకన్నా ఎక్కువ సమయం కూడా పట్టే పరిస్థితి ఉండచ్చు. అందుకనే ఎల్ఐసీ డెత్ సర్టిఫికెట్ బదులు.. మరణించిన తేదీ, సమయం, కారణం తదితర వివరాలతో ఆస్పత్రులు జారీ చేసే డెత్ సమ్మరీని కూడా అనుమతిస్తోంది. డెత్ సమ్మరీ సర్టిఫికెట్‌పై ఎల్ఐసీ క్లాస్–1 అధికారి లేదా డెవలప్మెంట్ ఆఫీసర్ సంతకంతోపాటు.. క్రిమేషన్ సర్టిఫికెట్‌ను సమర్పించడం ద్వారా పరిహారాన్ని క్లెయిమ్ చేసుకునేందుకు ఎల్ఐసీ అనుమతిస్తోంది. అలాగే, ఎస్బీఐ లైఫ్, టాటా ఏఐఏ లైఫ్ డెత్ సర్టిఫికెట్ దాఖలు నుంచి మినహాయింపునిచ్చాయి. ఆస్పత్రుల్లో చనిపోయిన వారికే ఈ మినహాయింపు పరిమితం. ఎందుకంటే ఆస్పత్రి యాజమాన్యాలు మరణానికి కారణం, ఇతర వివరాలతో డెత్ సమ్మరీని జారీ చేస్తాయి. కనుక దీన్ని ఆధారంగా పరిగణిస్తున్నాయి. ఇతర క్లెయిమ్‌లు జీవిత బీమా కంపెనీల నుంచి తీసుకునే ఇతర పాలసీల విషయంలోనూ క్లెయిమ్‌లకు సంబంధించి నిబంధనల పరంగా సడలింపు అమలవుతోంది. గడువు తీరిన పెన్షన్ పాలసీల (యాన్యుటీ ప్లాన్లు) విషయంలో పాలసీదారు లైఫ్ సర్టిఫికెట్‌ను ఇవ్వాల్సి ఉంటుంది. దీనికోసం సాధారణంగా వ్యక్తిగతంగా హాజరుకావాలి. కరోనా మహమ్మారి తీవ్ర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లను కంపెనీలు అనుమతిస్తున్నాయి. ఎల్ఐసీ కూడా యాన్యుటీ ప్లాన్ల విషయంలో లైఫ్ సర్టిఫికెట్ నుంచి మినహాయింపును కల్పించింది. వీడియోకాల్ రూపంలో ఈ ప్రక్రియను చేపడుతోంది. ఎస్బీఐ లైఫ్, బజాజ్ అలియాంజ్ లైఫ్ సంస్థలు సైతం యాన్యుటీ ప్లాన్ల విషయంలో డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్‌ను అనుమతిస్తున్నాయి. -
నో క్లెయిమ్ బోనస్.. విలువైన బహుమానం
హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు ఎన్నో రకాల ప్రయోజనాలతో వస్తుంటాయి. పాలసీదారులు పాలసీ తీసుకున్న తర్వాత కూడా తమ ఆరోగ్యంపై శ్రద్ధ చూపించినట్టయితే.. ప్రత్యేక రాయితీలతో ప్రోత్సహించేందుకు కంపెనీలు ముందుకు వస్తున్నాయి. ప్రీమియంలో తగ్గింపులు, ఔట్ పెషెంట్‌గా తీసుకునే చికిత్సల సమయంలో వినియోగానికి వీలైన రివార్డు పాయింట్లు ఇందులో భాగమే. బీమా కంపెనీలు అందించే ఆఫర్లలో.. ముఖ్యంగా నో క్లెయిమ్ బోనస్‌ను అమూల్యమైనదనే చెప్పుకోవాలి. నో క్లెయిమ్ అంటే.. ఒక పాలసీ ఏడాదిలో ఎటువంటి క్లెయిమ్‌లు చేయకపోవడం. దీనివల్ల బీమా కంపెనీలకు కొంత ఆదా అవుతుంది. దాంతో నో క్లెయిమ్ బోనస్ రూపంలో కొంత ప్రయోజనాన్ని తిరిగి పాలసీదారులకు అందిస్తుంటాయి. ఎక్కువ సంస్థలు బీమా మొత్తాన్ని నిర్ణీత శాతం మేర పెంచుతుంటే.. కొన్ని మాత్రం ప్రీమియంలో రాయితీ ఇస్తున్నాయి. బీమా కవరేజీని బోనస్ గా ఇచ్చినా ఇందుకు అదనపు ప్రీమియం వసూలు చేయవు. కనుక ఆరోగ్య బీమా తీసుకున్నప్పటికీ.. ఆరోగ్యాన్ని చక్కగా చూసుకోవడం వల్ల ఆస్పత్రిలో చేరాల్సిన అవస్థ తప్పుతుంది. బీమా రక్షణ మొత్తం పెరుగుతుంది. ఈ నో క్లెయిమ్ బోనస్ (ఎన్సీబీ)ను దాదాపు అన్ని బీమా సంస్థలు అందిస్తున్నాయి. వివిధ బీమా సంస్థలు ఆఫర్ చేస్తున్న ఈ ప్రయోజనం విషయంలో వైరుధ్యాలను తెలియజేసే కథనమే ఇది. ఎలా పనిచేస్తుంది..? అన్ని రకాల ఇండెమ్నిటీ హెల్త్ పాలసీలు (ఆస్పత్రిలో చేరడం వల్ల అయిన వైద్య ఖర్చులు చెల్లించేవి) నో క్లెయిమ్ బోనస్ (ఎన్సీబీ) ఫీచర్‌తో వస్తున్నాయి. ఉదాహరణకు బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ హెల్త్‌గార్డ్ (గోల్డ్ ప్లాన్)లో క్లెయిమ్‌లు లేని ప్రతీ సంవత్సరం తర్వాత బీమా మొత్తం 10 శాతం పెరుగుతుంది. అంటే రూ.5 లక్షల కవరేజీకి పాలసీ తీసుకుని క్లెయిమ్ చేసుకోకపోతే రెన్యువల్ అనంతరం 10 శాతం పెరిగి కవరేజీ రూ.5.50 లక్షలకు చేరుతుంది. ఇలా బేస్ సమ్ ఇన్సూర్డ్ (ఎస్ఐ)కు గరిష్టంగా నూరు శాతం వరకు కవరేజీని ఎన్సీబీ కింద అందుకోవచ్చు. రూ.5 లక్షలను బేసిక్ సమ్ ఇన్సూర్డ్‌గా ఎంచుకున్నారనుకుంటే.. వరుసగా పదేళ్లపాటు ఎటువంటి క్లెయిమ్ చేసుకోని సందర్భాల్లో కవరేజీ రూ.5 లక్షల మేర పెరిగి రూ.10లక్షలు అవుతుంది. అయితే, ఇలా ఎన్సీబీ రూపంలో బీమా కవరేజీ పెరగడం అన్నది అన్ని బీమా సంస్థల్లోనూ ఒకే మాదిరిగా ఉండదు. ఉదాహరణకు ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్‌కు చెందిన ‘యాక్టివ్ అష్యూర్డ్ పాలసీ’లో ఎన్సీబీ కింద గరిష్టంగా 50 శాతం వరకే బీమా పెరుగుతుంది. అదే మణిపాల్ సిగ్నా ప్రో హెల్త్ పాలసీలో బేసిక్ ఎస్ఐకు గరిష్టంగా 200 శాతం వరకు అదనపు బీమా కవరేజీని నో క్లెయిమ్ బోనస్ కింద అందుకోవచ్చు. ఎటువంటి క్లెయిమ్ చేసుకోకుండా, సకాలంలో ప్రీమియం చెల్లించి రెన్యువల్ చేసుకున్న వారికి ఎన్సీబీ కింద సమ్ ఇన్సూర్డ్ పెంపును బీమా సంస్థలు హామీ పూర్వకంగా అందిస్తున్నాయి. క్లెయిమ్ చేసుకుంటే.. ఒకవేళ పాలసీ సంవత్సరంలో క్లెయిమ్ చేసుకుంటే బోనస్‌గా పెరిగిన సమ్ ఇన్సూర్డ్ నిర్ణీ త శాతం మేర తగ్గిపోతుందని గుర్తించాలి. క్లెయిమ్ చేసుకున్నా కానీ, అప్పటి వరకు బోనస్‌గా పొందిన బీమా కవరేజీని తగ్గించని పాలసీలు కూడా మార్కెట్లో ఉన్నాయి. ఉదాహరణకు ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ యాక్టివ్ అష్యూర్ పాలసీలో క్లెయిమ్ చేసుకుంటే.. తదుపరి పాలసీ సంవత్సరంలో ఎన్సీబీ 10% మేర తగ్గిపోతుంది. అంటే బేస్ సమ్ ఇన్సూర్డ్ రూ.10 లక్షలు తీసుకున్నారనుకుంటే.. అప్పటి వరకు ఎన్సీబీ రూపంలో ఏటా 10% చొప్పున రూ.3లక్షల కవరేజీ అదనంగా లభించి ఉంటే.. తర్వాతి సంవత్సరంలో క్లెయిమ్ చేసుకుంటే బేసిక్ కవరేజీ రూ.10లక్షలు అలాగే ఉంటుంది. ఎన్సీబీ మాత్రం రూ.లక్ష తగ్గి రూ.2లక్షలకు చేరుతుంది. ఎన్సీబీని బేసిక్ ఎస్ఐ ఆధారంగానే పెంచుతారు కనుక.. తగ్గించేటప్పుడూ అదే సూత్రం అమలవుతుంది. క్లెయిమ్‌లు చేసుకున్నా కానీ.. ఎన్సీబీని తగ్గించని పాలసీల్లో మణిపాల్ సిగ్నా ప్రోహెల్త్ ఇన్సూరెన్స్ ఒకటి. ప్రస్తుతం కోవిడ్–19 వల్ల ఆర్థిక ఇబ్బందులు, హెల్త్రిస్క్ను దృష్టిలో ఉంచుకుని కొన్ని బీమా సంస్థలు పాలసీదారులు క్లెయిమ్ చేసుకున్నా కానీ.. ఎన్సీబీని తగ్గించడం లేదు. ఇందుకు ఉదాహరణ హెచ్డీఎఫ్సీ ఎర్గో. ఈ ఏడాది జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 మధ్య కోవిడ్–19 చికిత్స కోసం క్లెయిమ్ చేసుకున్నా కానీ పాలసీదారుల క్యుములేటివ్ బోనస్ కవరేజీని తగ్గించకూడదని హెచ్డీఎఫ్సీ ఎర్గో నిర్ణయం తీసుకుంది. ఇదే విధమైన నిర్ణయాన్ని ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్కూడా తీసుకుంది. అదనపు ఎన్సీబీ నో క్లెయిమ్ బోనస్ రూపంలో బీమా కవరేజీ పెంపు ప్రయోజనం ఉచితంగానే లభిస్తుంది. ఇందుకు ఎటువంటి ప్రీమియంను అదనంగా చెల్లించాల్సిన అవసరం ఉండదు. అయితే, అదనంగా ప్రీమియం చెల్లించడం ద్వారా క్యుములేటివ్ బోనస్ కవరేజీని మరింత పెంచుకునేందుకు కొన్ని బీమా సంస్థలు అవకాశం కల్పిస్తున్నాయి. నో క్లెయిమ్ బోనస్‌కు అదనంగా కొంత ప్రీమియం చెల్లించి ఎన్సీబీని ఏటా అదనంగా 5–10 శాతం మేర పెంచుకోవచ్చు. ఉదాహరణకు మణిపాల్ సిగ్నా ప్రోహెల్త్ ప్లాన్‌లో క్యుములేటివ్ బోనస్ బూస్టర్‌ను కొనుగోలు చేసుకోవచ్చు. సమ్ ఇన్సూర్డ్‌పై కచ్చితంగా 25 శాతం పెంపును, గరిష్టంగా 200 శాతం వరకు పెంపును ఆఫర్ చేస్తోంది. హెచ్డీఎఫ్సీ ఎర్గో సైతం అదనపు ప్రీమియంతో క్యుములేటివ్ బోనస్‌ను పెంచుకునేందుకు అనుమతిస్తోంది. పోర్టింగ్ పెట్టుకుంటే ఏంటి పరిస్థితి? మొబైల్ నంబర్ పోర్టబులిటీ మాదిరిగానే హెల్త్ ఇన్సూరెన్స్‌ను కూడా ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మార్చుకోవచ్చు. బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ మార్గదర్శకాల మేరకు.. ఒక సంస్థ నుంచి మరో సంస్థకు హెల్త్ ప్లాన్‌ను పోర్ట్ చేసుకుంటే.. గత సంస్థలో పోగు చేసుకున్న క్యుములేటివ్ బోనస్‌ను కొత్త సంస్థ కూడా ఎటువంటి అదనపు ప్రీమియం లేకుండానే అందించాల్సి ఉంటుంది. దీని గురించి బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ హెల్త్ క్లెయిమ్స్ విభాగం హెడ్ భాస్కర్ నేరుర్కర్ వివరిస్తూ.. ‘‘పోర్టింగ్ సమయంలో బేస్ సమ్ ఇన్సూర్డ్‌తోపాటు క్యుములేటివ్ బోనస్ కూడా నూతన పాలసీకి బదిలీ అవుతుంది. ప్రీమియం మాత్రం బేసిక్ సమ్ ఇన్సూర్డ్కే వసూలు చేస్తారు. అయితే, ఆ తర్వాత నుంచి నూతన సంస్థ నియమ, నిబంధనల మేరకే క్యుములేటివ్ బోనస్ ప్రయోజనం లభిస్తుంది’’ అని తెలిపారు. అంటే ఒక వ్యక్తి ఏ అనే బీమా కంపెనీ నుంచి రూ.5 లక్షల సమ్ ఇన్సూర్డ్‌కు హెల్త్ ప్లాన్ తీసుకుని, రూ.లక్ష సమ్ ఇన్సూర్డ్‌ను ఎన్సీబీ కింద పొంది ఉన్నారనుకుంటే.. మరో సంస్థకు పోర్టింగ్ చేసుకునేట్టయితే నూతన సంస్థ సైతం మొత్తం రూ.6లక్షలకు కవరేజీని (రూ.5 లక్షలు బేసిక్, రూ.లక్ష బోనస్) ఆఫర్ చేస్తుందని అర్థం చేసుకోవాలి. దీనికి అదనంగా సమ్ ఇన్సూర్డ్‌ను పెంచుకోవాలంటే ప్రత్యేకంగా అండర్రిటన్ చేయాల్సి ఉంటుందని మణిపాల్ సిగ్నా హెల్త్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో ప్రసూన్ సిక్దర్ తెలిపారు. అంటే నూతన సంస్థలో బేస్ సమ్ ఇన్సూర్డ్‌ను పెంచుకోవాలంటే అదనపు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. -
వర్క్ ఫ్రమ్ హోమ్‌కు సైబర్ బీమా!
కరోనా వైరస్ పరిశ్రమల రూపురేఖలను మార్చేసింది. వైరస్ విస్తరించకుండా చూసే లక్ష్యంతో సేవల రంగ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ (ఇంటి నుంచే పని) విధానాన్ని ఆచరణలో పెట్టాయి. ఐటీ, మీడియా తదితర చాలా రంగాలు ఈ విధానాన్ని అనుసరిస్తున్నాయి. వైరస్ ఇప్పట్లో కనుమరుగు కాకపోవచ్చని, వ్యాక్సిన్ వచ్చే వరకు సామాజిక దూరం పాటించక తప్పదంటున్నారు నిపుణులు. దీంతో వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం భవిష్యత్తులోనూ కొనసాగొచ్చని భావిస్తున్నారు. ఈ విధానంలో ఉద్యోగులు తమ వ్యక్తిగత కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్ సాయంతో ఇంటర్నెట్ ద్వారా కార్యాలయ సర్వర్లతో అనుసంధానమై పనిచేయాల్సి ఉంటుంది. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే సైబర్ దాడుల రిస్క్ ఎక్కువగా పొంచి ఉంటుంది. ఏ కొంచెం అవకాశం ఇచ్చినా సైబర్ నేరగాళ్లు కంప్యూటర్లు, సర్వర్లలోకి చొచ్చుకుపోయి నష్టానికి కారణం కావచ్చు. కరోనా వైరస్ పేరుతో నిత్యం 2,600 సంస్థలపై సైబర్ దాడులు జరుగుతున్నాయని ఇటీవలే చెక్ పాయింట్ సర్వే వెల్లడించింది. కనుక ఇటువంటి ప్రమాదకర పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని విలువైన డేటాతోపాటు, బ్యాంకు ఖాతాల్లోని డబ్బును జాగ్రత్తగా కాపాడుకునే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందుకు సైబర్ ఇన్సూరెన్స్ తీసుకోవడం ఒక చక్కని పరిష్కారం. సైబర్ దాడి జరిగితే ఎదురయ్యే నష్టాన్ని సైబర్ ఇన్సూరెన్స్ పాలసీ భరిస్తుంది. కనుక ఆన్లైన్ వేదికగా ఆర్థిక లావాదేవీలు నిర్వహించే వారు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న వారు, తమ కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లలో కీలక సమాచారాన్ని ఉంచుకునే వారు తప్పకుండా ఈ సైబర్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడాన్ని పరిశీలించొచ్చు. కవరేజీ వీటికి... దాదాపు అన్ని ప్రముఖ బీమా సంస్థలు.. బజాజ్ అలియాంజ్ జనరల్, హెచ్డీఎఫ్సీ ఎర్గో, ఐసీఐసీఐ లాంబార్డ్ బీమా సంస్థలు ఈ తరహా సైబర్ కవరేజీలను అందిస్తున్నాయి. 18 ఏళ్లు పైబడిన వారు ఈ పాలసీ తీసుకునేందుకు అర్హులు. హెచ్డీఎఫ్సీ ఎర్గో అయితే ఫ్యామిలీ ఫ్లోటర్ సైబర్ పాలసీని అందిస్తోంది. ఆన్లైన్లో పాలసీ తీసుకుంటే ప్రీమియంపై 5 శాతం డిస్కౌంట్‌ను కూడా ఆఫర్ చేస్తోంది. ప్రతీ ఏటా దీన్ని రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. బీమా సంస్థలను బట్టి కవరేజీ ఫీచర్లలో స్వల్ప మార్పులు ఉండొచ్చు. ప్రధానంగా గుర్తింపు చోరీ, అనధికారిక ఆన్లైన్ లావాదేవీలు (మీ ప్రమేయం లేకుండా వేరే వారు చేసేవి) ఈ–ఎక్ట్సార్షన్ (డబ్బు కోసం డిమాండ్ చేస్తూ దాడి చేయం), సైబర్ బుల్లీయింగ్ (బెదిరింపులు), మాల్వేర్ దాడులు (సాఫ్ట్వేర్ సాయంతో కంప్యూటర్లను అధీనంలోకి తీసుకోవడం), కీలకమైన సమాచార వివరాలను (పాస్వర్డ్, యూజర్ నేమ్ వంటివి) చోరీ చేసే ఫిషింగ్ దాడులు, ఈమెయిల్ స్పూఫింగ్ (తప్పుదోవ పట్టించే, మోసపూరిత మెయిల్స్) తదితర దాడుల నుంచి సైబర్ పాలసీల్లో రక్షణ ఉంటుంది. వీటి వల్ల జరిగిన నష్టానికి పరిహారం కోసం క్లెయిమ్ చేసుకోవచ్చు. పరిహారం అన్నది గరిష్టంగా మీరు తీసుకునే సమ్ ఇన్సూర్డ్ వరకేనని గమనించాలి. సైబర్ దాడుల కారణంగా ఎదురయ్యే న్యాయపరమైన చర్యల ఖర్చును కూడా బీమా సంస్థ నుంచి పొందే అవకాశం ఉంటుంది. హెచ్డీఎఫ్సీ ఎర్గో, బజాజ్ అలియాంజ్ సంస్థలు ఈ కవరేజీలు అన్నింటినీ ఆఫర్ చేస్తున్నాయి. బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ అదనంగా సోషల్ మీడియా కవర్‌ను కూడా అందిస్తోంది. దీని కింద సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ప్రొఫైల్‌పై దాడుల వల్ల గుర్తింపు వివరాల నష్టం జరిగితే పరిహారం తీసుకోవచ్చు. ఈ దాడుల వల్ల వేతన నష్టం జరిగితే హెచ్డీఎఫ్సీ ఎర్గో పరిహారం (గరిష్టంగా ఏడు రోజులకు మించకుండా) ఇస్తోంది. మొబిక్విక్ ప్లాట్‌ఫామ్‌పై లభించే ఐసీఐసీఐ లాంబార్డ్ సైబర్ ఇన్సూరెన్స్ పాలసీ అయితే అనధికారిక లావాదేవీల వల్ల కలిగే ఆర్థిక నష్టం, వేతన నష్టాలకు పరిహారం అందిస్తోంది. క్లెయిమ్ విధానం.. సైబర్ దాడి ఏదైనా కానీయండి.. ఏడు రోజుల్లోపు బీమా సంస్థకు తెలియజేయాల్సి ఉంటుంది. ఈ మెయిల్ లేదా ఫోన్ లేదా ఏజెంట్ల ద్వారా సమాచారాన్ని అందించొచ్చు. క్లెయిమ్ కోసం దరఖాస్తు చేస్తూ, ఆధారంగా అన్ని రకాల డాక్యుమెంట్లను సమర్పించాలి. ఇవి అందిన రోజు నుంచి 30 రోజుల్లోగా బీమా సంస్థ క్లెయిమ్‌ను పరిష్కరిస్తుంది. క్లెయిమ్ ఫామ్, ఎఫ్ఐఆర్ కాపీ, సైబర్ దాడి జరిగినట్టు ఆధారాలు, లీగర్ నోటీసులు ఏవైనా అందుకుంటే ఆయా కాపీలను కూడా బీమా సంస్థకు అందించాల్సి ఉంటుంది. గమనించాల్సినవి.. సైబర్ ఇన్సూరెన్స్ పాలసీలు ఎన్నో పరిమితులు, మినహాయింపులతో ఉంటాయి. ముఖ్యంగా పాలసీదారుడు ఒక ఏడాదిలో ఒకటే క్లెయిమ్ చేయగలరు. ఒకటికి మించి దాడులు ఏకకాలంలో జరిగితే ఇందులో ఎక్కువ నష్టం జరిగిన దాడికి సంబంధించి హెచ్డీఎఫ్సీ ఎర్గో పరిహారం చెల్లిస్తుంది. బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ ఆఫర్ చేస్తున్న సైబర్‌సేఫ్ ఇన్సూరెన్స్ పాలసీలో పరిహారానికి సంబంధించి ఉప పరిమితులు ఉన్నాయి. అంటే ప్రతీ కవరేజీకి విడిగా గరిష్ట పరిహారాన్ని కంపెనీ పరిమితం చేసింది. ఉదాహరణకు ఫిషింగ్, ఐటీ చోరీలో పరిహారం అన్నది బీమా మొత్తం (సమ్ ఇన్సూర్డ్)లో 25 శాతానికే పరిమితం అవుతుంది. ఉదాహరణకు రూ.1 లక్షకు పాలసీ తీసుకున్నట్టయితే ఫిషింగ్ ఘటనలో లభించే గరిష్ట పరిహారం రూ.25 వేలుగానే ఉంటుంది. అదే విధంగా ఈమెయిల్ స్పూఫింగ్‌లో గరిష్ట బీమా 15 శాతానికే పరిమితం అవుతుంది. మిగిలిన అన్ని దాడుల్లోనూ పరిహారం బీమా కవరేజీలో 10 శాతంగానే ఉంటుందని గమనించాలి. అదే విధంగా హెచ్డీఎఫ్సీ ఎర్గో ఈ సెక్యూర్ సైబర్ ఇన్సూరెన్స్ పాలసీలో సైబర్ బుల్లీయింగ్, ఈ ఎక్ట్సార్షన్, ఈ రిప్యుటేషన్ (పేరు ప్రతిష్ట) నష్టానికి క్లెయిమ్ చేసుకోవాలంటే 45 రోజులు వేచి ఉండే నిబంధన అమల్లో ఉంది. అంటే పాలసీ తీసుకున్న 45 రోజుల తర్వాతే వీటి విషయంలో క్లెయిమ్ హక్కు లభిస్తుంది. అలాగే, ఈ రిప్యుటేషన్ నష్టం, గుర్తింపు వివ రాల చోరీ, ఈమెయిల్ స్పూఫింగ్ ఘటనల్లో లభించే పరిహారం గరిష్టంగా బీమా కవరేజీలో 25 శాతంగానే ఉంటుంది. ఫిషింగ్‌లో ఇది 15 శాతంగాను, సైకలాజికల్ కౌన్సిలింగ్, ఈ ఎక్ట్సార్షన్, సైబర్ బుల్లీయింగ్, మాల్వేర్ దాడుల్లో గరిష్ట పరిహారం 10%. అదే విధంగా క్లెయిమ్ మొత్తం రూ.50,000 మించి ఉంటే కనీసం రూ. 3,500ను తగ్గించి ఇస్తుంది. ఐసీఐసీఐ లాం బార్డ్ సైబర్ పాలసీలో 10% లోపే ఆప్షన్ ఉంది. అంటే పాలసీదారు క్లెయిమ్ మొత్తంలో తన వంతుగా 10 శాతాన్ని భరించాల్సి ఉంటుంది. -
వైద్య బీమా పాలసీ... ప్చ్!
వైద్య బీమా ప్రాధాన్యాన్ని నేడు ఎంతో మంది అర్థం చేసుకుంటున్నారు. వైద్య సేవల వ్యయాలు బడ్జెట్‌ను చిన్నాభిన్నం చేస్తున్న రోజులు కావడంతో ఆర్జించే వారిలో ఎక్కువ మంది వైద్య బీమా వైపు మొగ్గు చూపుతున్నారు. దీని పట్ల ఇటీవలి కాలంలో అవగాహన కూడా విస్తృతం అవుతోంది. ఇది నాణేనికి ఒక వైపు. కానీ, వైద్య బీమా పాలసీలు తీసుకున్న వారిలో అందరూ సంతోషంగానే ఉంటున్నారా...? దాదాపు సగానికి సగం అసంతృప్తే వ్యక్తం చేస్తున్నారు. ఇది నాణేనికి మరో వైపు కోణం. తాము తీసుకున్న పాలసీల్లోని ఫీచర్ల పట్ల సంతోషంగా లేమని 48 శాతం మంది తెలిపారు. పెద్ద వయసు వారిలో ఇది మరీ ఎక్కువగానే ప్రస్ఫుటమైంది. 65 ఏళ్లు, అంతకంటే పెద్ద వయసు వారిలో 67 శాతం మంది (ప్రతీ ముగ్గురిలో ఇద్దరు) తాము తీసుకున్న వైద్య బీమా పాలసీల పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓ ప్రముఖ సంస్థ నిర్వహించిన సర్వేలో ఇటువంటి ఎన్నో విషయాలు వెలుగు చూశాయి. అసంతృప్తి ఎక్కువే 48% అంటే సగం మంది హెల్త్ పాలసీల పట్ల అసంతృప్తితో ఉన్నారంటే దీన్ని బీమా సంస్థలు కచ్చితంగా విస్మరించకూడని అంశమే. మరీ ముఖ్యంగా పెద్ద వయసు వారిలో మూడింట రెండొంతుల సంతృప్తిగా లేరంటే వారు ఆశించిన ప్రయోజనాలు బీమా సంస్థలు అందించడం లేదని తెలుస్తోంది. ముఖ్యంగా పెద్ద వయసులోనే వైద్య బీమా అవసరం ఎక్కువగా ఉంటుంది. వారు తరచుగా పాలసీ కవరేజీని వినియోగించుకోవాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటుంటారు. అందుకే వైద్య బీమా పాలసీ తీసుకునే ముందే పూర్తి జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా అవసరం. ఏజెంట్లకో, మధ్యవర్తులకో దరఖాస్తు పత్రాన్ని నింపే బాధ్యతను వదిలేయకుండా, డాక్యుమెంట్‌ను పూర్తిగా చదివి, అందులోని ఫీచర్లను అర్థం చేసుకున్న తర్వాతే నిర్ణయానికి రావడం అవసరమని ఈ సర్వే ఫలితాలు గుర్తు చేస్తున్నాయి. ఇలా చేయడం వల్ల పాలసీ తీసుకున్న తర్వాత ఎక్కువ శాతం విధానపరమైన సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. ‘‘పాలసీ షెడ్యూల్, నియమ, నిబంధనలు, కస్టమర్ సమాచార షీట్ వంటివన్నీ పాలసీ కిట్‌లో ఉంటాయి. పాలసీలో కీలకమైన సెక్షన్లు అన్నీ ఉంటాయి. అలాగే, కొత్త పాలసీదారులను ఆహ్వానిస్తూ వారిలో కొందరికి కాల్ చేసి, ముఖ్యమైన ఫీచర్లు, షరతులు, నియమాలు వివరించడం జరుగుతుంది’’ అని సిగ్నా టీటీకే హెల్త్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో ప్రసూన్ సిక్దార్ తెలిపారు. రెన్యువల్ ప్రీమియం భారం పాలసీదారుల ఫిర్యాదులు, అభ్యంతరాలు ఎక్కువగా కంపెనీలు రెన్యువల్ ప్రీమియంను భారీగా పెంచేయడంపైనే ఉన్నాయి. ‘‘రెన్యువల్ ప్రీమియం పెరగడం అన్నది వాస్తవికం. ఇతర ఉత్పత్తులకు భిన్నంగా ఇది ద్రవ్యోల్బణంతో ముడిపడి ఉంటుంది’’ అని మ్యాక్స్‌బూపా హెల్త్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో ఆశిష్ మెహ్రోత్రా తెలిపారు. బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏ) 2013లో క్లెయిమ్ ఆధారిత ప్రీమియం పెంపు విధానాన్ని నిషేధించింది. పాలసీదారులు క్రితం సంవత్సరంలో క్లెయిమ్ చేసుకుని ఉంటే, మరుసటి ఏడాది రెన్యువల్‌కు ప్రీమియం పెంచే విధానాన్ని కంపెనీలు అనుసరించేవి. అలాగే, వయసు పెరుగుతున్న కొద్దీ రెన్యువల్ ప్రీమియం పెంపు సైతం బీమా సంస్థలు అనుసరిస్తున్న మరో విధానం. ఉదాహరణకు 30–35 ఏళ్ల గ్రూపు నుంచి 36వ సంవత్సరంలోకి ప్రవేశించిన పాలసీదారునికి ప్రీమియం రెన్యువల్ భారం కొంచెం ఎక్కువే. వీరు 36–40 వయసు గ్రూపులోకి ప్రవేశించినట్టు. ఇలా బీమా సంస్థలు ఐదేళ్లకొక వయసును గ్రూపుగా పరిగణించి రిస్క్ పారామీటర్ల ఆధారంగా ప్రీమియం పెంచేస్తున్నాయి. వైద్య బీమా పాలసీని జీవిత కాలం పాటు రెన్యువల్ చేసుకునే అవకాశం ఉన్నా.. అది ఏడాది కాల కాంట్రాక్టేనని గుర్తించాలి. కనుక పాలసీ తీసుకున్నప్పుడే ప్రీమియం రేట్లను పోల్చి చూడడం కూడా అవసరం. క్లెయిమ్ సెటిల్మెంట్ 60% పాలసీదారులు క్లెయిమ్స్ విషయంలోనూ అసంతృప్తిగానే ఉన్నారు. ఎన్నో మినహాయింపులు చూపించి పాక్షికంగానే కంపెనీలు పరిహారం చెల్లించాయన్నది 65 శాతం మంది చెప్పిన మాట. ఎక్కువ మంది తమ బీమా సంస్థల క్లెయిమ్ పరిష్కార రికార్డు పట్ల సంతోషంగా లేకపోవడం ఆందోళనకరమేనని, దీన్ని సత్వరమే మార్చాల్సిన అవసరం ఉందన్నారు ఐసీఐసీఐ లాంబార్డ్ అండర్‌రైటింగ్, క్లెయిమ్స్ విభాగం చీఫ్ సంజయ్ దత్తా. పాలసీదారులు సైతం బాధ్యతగా పాలసీ తీసుకునే సమయంలోనే తమ వైద్య చరిత్ర గురించి ఏ మాత్రం దాచిపెట్టకుండా పూర్తి వివరాలను తెలియజేయడం కూడా అవసరమేనని నిపుణులు గుర్తు చేస్తున్నారు. దాదాపు అన్ని బీమా కంపెనీలు పాలసీదారులకు ముందు నుంచి ఉన్న వ్యాధులకు... ఏడాది నుంచి నాలుగేళ్ల తర్వాత కవరేజీ కల్పిస్తున్నాయి. ఆయా వ్యాధుల ఆధారంగా వెయిటేజీ పీరియడ్ ఆధారపడి ఉంటుంది. ‘‘పాలసీ ప్రయోజనాల విషయంలో కంపెనీలు పారదర్శక పాటించడం అవసరం. అలాగే, కస్టమర్లు పాలసీ తీసుకునే ముందు అన్ని వివరాలు వెల్లడించడం, సేవల సమయాన్ని నిర్దేశించడం వంటివి కస్టమర్ల సంతృప్త స్థాయిలను మెరుగుపరిచేందుకు ఉపకరిస్తాయి’’ అని సంజయ్ దత్తా పేర్కొన్నారు. ముఖ్యంగా పాలసీదారులు పాలసీలో ఉన్న మినహాయింపుల విషయమై అవగాహన కలిగి ఉండడం కూడా వివాదాలకు దారితీయకుండా ఉంటుంది. బీమా సంస్థలు అనుసరించాల్సిన మినహయింపుల ప్రామాణిక జాబితాను ఐఆర్డీఏ లోగడే గుర్తించింది. బీమా సంస్థలు తప్పనిసరిగా దీనికి బద్ధులై ఉండాలి. దీన్ని ఉల్లంఘిస్తే వివాదాల పరిష్కార వేదికలను ఆశ్రయించొచ్చు. అయితే, పాలసీదారులు గమనించాల్సిన అంశం ఒకటుంది. రెన్యువల్ సమయంలోనూ బీమా సంస్థలు కొత్తగా మినహాయింపులను చేరుస్తున్నాయి. ‘‘రెన్యువల్ చేసుకుంటున్నందున పాలసీ ఒప్పందం అంతకుముందు మాదిరే ఉంటుందని పాలసీదారులు అనుకుంటుంటారు. కానీ, రెన్యువల్ సమయంలోనూ ఏకపక్షంగా బీమా సంస్థలు మినహాయింపులు చేర్చడాన్ని పాలసీదారులు ఎదుర్కొంటున్నారు’’ అని ప్రసూన్ సిక్దార్ తెలిపారు. అందుకే వైద్య బీమాకు సంబంధించి, ఇండివిడ్యువల్ విభాగంలో ఇన్కర్డ్ క్లెయిమ్ రేషియో (ఐసీఆర్) చూడాలంటున్నారు నిపుణులు. ఓ కంపెనీ వసూలు చేసిన ప్రీమియం, పరిహారం రూపంలో చెల్లించిన మొత్తాలను ఈ ఐసీఆర్ రేషియో తెలియజేస్తుంది. 75–85 శాతం మధ్య ఐసీఆర్ ఉంటే ఆరోగ్యకరమైనదిగా నిపుణులు పేర్కొంటున్నారు. పరిష్కారాలకు మార్గాలు పాలసీ తీసుకున్నాక కొంచెం అసంతృప్తి ఉంటే ఫర్వాలేదు కానీ, ఎక్కువ అసంతృప్తి ఉంటే అందులోనే కొనసాగాల్సిన అగత్యమేమీ లేదు. హెల్త్ పాలసీ పోర్టబులిటీ సదుపాయం ఉంది. మంచి ఫీచర్లతో, తక్కువ మినహాయింపులతో ఆఫర్ చేసే, చక్కని క్లెయిమ్ పరిష్కార రేషియో ఉన్న కంపెనీకి పాలసీని మార్చుకోవచ్చు. పోర్ట్ పెట్టుకున్నప్పటికీ, అంతకుముందు వరకు ఉన్న నో క్లెయిమ్ బోనస్ వంటి సదుపాయాలను కోల్పోవాల్సిన అవసరం కూడా రాదు. ఆశ్చర్యకరం ఏమిటంటే బీమా పోర్టబులిటీ సదుపాయాన్ని 2011లోనే ఐఆర్డీఏ కల్పించినప్పటికీ... తమకు ఆ విషయం ఇప్పటికీ తెలియదని ఈ సర్వేలో 27.12% చెప్పడం గమనార్హం. ఇక పాలసీదారులు క్లెయిమ్ విషయంలో వివాదాలు, అభ్యంతరాలు ఉంటే అంబుడ్స్‌మన్ ను ఆశ్రయించొచ్చు. తమ బీమా పాలసీ విషయంలో అసంతృప్తితో ఉన్నామని చెప్పిన వారిలో 70%కి పైగా అంబుడ్స్‌మన్ ను ఆశ్రయించలేదు. ఎందుకని అంటే... అంబుడ్స్‌మన్ కు వెళ్లి వివాదాన్ని పరిష్కరించుకోవడం అన్నది ఎంతో సమయం తీసుకునే, క్లిష్టమైన ప్రక్రియగా 77% మంది భావిస్తున్నారు. ఇక 42% మంది అంబుడ్స్‌మన్ గురించి తెలియదని చెప్పారు. ఒకవేళ అంబుడ్స్‌మన్ వద్ద జరిగిన నిర్ణయం పట్ల సంతోషంగా లేకపోతే దానిపై వినియోగదారుల వివాదాల పరిష్కార ఫోరమ్‌లను ఆశ్రయించే అవకాశం కూడా ఉంటుంది. -
క్లెయిమ్ చెల్లింపు ఆలస్యమైతే జరిమానా
న్యూఢిల్లీ: కేంద్రం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టబోతున్న ‘ఆయుష్మాన్ భారత్’ పథకంలో భాగంగా ఆసుపత్రులకు క్లెయిమ్‌ల చెల్లింపులో ఆలస్యం చేసే బీమా కంపెనీలపై జరిమానా విధించాలని ప్రభుత్వం యోచిస్తోంది. క్లెయిమ్‌ల సెటిల్మెంట్కు 15 రోజుల కన్నా ఎక్కువ జాప్యం జరిగితే, చెల్లించాల్సిన మొత్తంపై సదరు బీమా కంపెనీ వారానికి ఒక శాతం చొప్పున వడ్డీ కట్టేలా ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఆ జరిమానాను బీమా కంపెనీయే నేరుగా ఆసుపత్రికి చెల్లించాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆగస్టు 15 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చే ఈ పథకంలో చేరడానికి ఇప్పటికే 20 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కేంద్రంతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఢిల్లీ, పంజాబ్, బెంగాల్, ఒడిశా రాష్ట్రాలు ఇంకా తమ స్పందన తెలపలేదు. -
ఆస్పత్రుల డిస్కౌంట్లు పాలసీదారులకు ఇవ్వండి
ఆరోగ్య బీమా సంస్థలకు ఐఆర్డీఏ సూచన న్యూఢిల్లీ : క్లెయిమ్ సెటిల్మెంట్ సమయంలో ఆస్పత్రుల నుంచి తమకు డిస్కౌంట్ లభించిన పక్షంలో ఆ ప్రయోజనాలను పాలసీదారులు/క్లెయిమెంట్లకు బదలాయించాలని ఆరోగ్య బీమా సంస్థలు, థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్లకు (టీపీఏ) బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ ఐఆర్డీఏ సూచించింది. అలాగే, ఆస్పత్రులు ఇచ్చిన డిస్కౌంట్లు, వాస్తవంగా వేసిన బిల్లు తదితర వివరాలు పాలసీదారులకు కూడా తెలిసేలా తగిన ప్రక్రియ రూపొందించాలని ఆదేశించింది.