న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) సభ్యులు తమ పీఎఫ్ క్లెయిమ్‌లను త్వరలో ఏటీఎంల నుంచి ఉపసంహరించుకోవచ్చని కార్మిక శాఖ ఇటీవలే ప్రకటించగా.. ఈ–వ్యాలెట్ల నుంచి సైతం ఈ సదుపాయం కల్పించే దిశగా పనిచేస్తున్నట్టు తెలిపింది. కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ కార్యదర్శి సుమితా దావ్రా దీనిపై స్పందించారు.
‘తమ సొమ్మును ఎంత సులభంగా ఉపసంహరించుకోవచ్చన్న దానిపై సభ్యుల్లో ఆసక్తి నెలకొంది. ఆటో సెటిల్‌మెంట్‌లో క్లెయిమ్ మొత్తం సభ్యుల బ్యాంక్ ఖాతాల్లోకి వెళుతుంది. దాంతో బ్యాంక్ ఏటీఎం నుంచి ఉపసహరించుకోవచ్చు. క్లెయిమ్ మొత్తం వ్యాలెట్‌లోకి నేరుగా ఎలా పంపాలన్న విషయమై కొన్ని మార్గదర్శకాలను రూపొందించాల్సి ఉంది. దీనిపై బ్యాంకర్లతో చర్చలు మొదలు పెట్టాం. దీని అమలు విషయమై ప్రణాళిక అవసరం’ అని పర్యాటక సదస్సుకు హాజరైన సందర్భంగా మీడియాకు సుమితా దావ్రా వివరించారు. ఆర్‌బీఐని సంప్రదించి త్వరలోనే తగిన ప్రణాళిక సిద్ధం చేస్తామని చెప్పారు.
ఇదీ చదవండి: బీమా పాలసీతో ఆరోగ్యం కొనుక్కోవచ్చు!
ఈపీఎఫ్‌వో సభ్యులు అతి త్వరలోనే తమ భవిష్యనిధి (పీఎఫ్) క్లెయిమ్‌ల మొత్తాన్ని ఏటీఎం నుంచి ఉపసంహరించుకునే అవకాశం అందుబాటులోకి రానున్నట్లు ఇప్పటికే ఆ శాఖ ప్రకటించింది. ప్రస్తుతం ఈపీఎఫ్‌వో సభ్యుల ఆన్‌లైన్ క్లెయిమ్ ఆమోదానికి 7–10 రోజుల సమయం తీసుకుంటోంది. క్లెయిమ్ పరిష్కారం తర్వాత ఆ మొత్తాన్ని సభ్యుల బ్యాంక్ ఖాతాకు బదిలీ చేస్తున్నారు. ప్రతిపాదిత కొత్త విధానంలో సభ్యులకు ప్రత్యేకమైన కార్డులు అందించనున్నారు. వీటి ద్వారా ఏటీఎం నుంచి క్లెయిమ్ మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చని ఇటీవల ఓ సీనియర్ అధికారి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment