ఆరోగ్యం, సంపద... ఏ మనిషి జీవితంలోనైనా ప్రధాన పాత్ర పోషించే అంశాలివి. ఎంత సంపద ఉన్నా ఆరోగ్యం సరిగా లేకపోతే... ఏమీ ప్రయోజనం ఉండదు. అదే... సంపద లేకపోయినా ఆరోగ్యం బాగుంటే చాలు... ఎలాగైనా సంపాదించుకోవచ్చు. కాబట్టి ఆరోగ్యం అత్యంత ప్రధానం అన్న విషయం దీన్నిబట్టి మనకు స్పష్టంగా తెలుస్తోంది.
ఇవాళ్టి రోజుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అంత తేలిక్కాదు. కోవిడ్ మన జీవితాల్ని ఎంత ప్రభావితం చేసిందో ఎరుకే.. అదీగాక... మారిన కాలమాన పరిస్థితుల్లో... ఎప్పుడు ఎలాంటి రోగాలు పుట్టుకొస్తాయి ఎవ్వరం చెప్పలేం. అప్పటిదాకా ఎంతో హాయిగా.. ఎలాంటి చీకూ చింతా లేకుండా సాగిపోతున్న జీవితాల్లో ఒక్క అనారోగ్యం వాళ్ళ ఆర్ధిక పరిస్థితుల్ని తల్లకిందులు చేసేస్తోంది. అప్పటికప్పుడు హాస్పిటల్లో జాయిన్ చేయాల్సి వస్తే... లక్షలు సిద్ధం చేసుకోవాల్సిందే.. చూస్తూ చూస్తూ ప్రాణాలతో చెలగాటం ఆడలేం కదా... అంచేత అప్పో సొప్పో చేసి అయినా వైద్యం చేయిస్తాం.
పల్లెలు పట్టణాలుగా, పట్నాలు నగరాలుగా మారిపోతూ ట్రాఫిక్ విచ్చలవిడిగా పెరిగిపోయి.. ఎప్పుడు ఏ ఆక్సిడెంట్ అవుతుందో... బయటకు వెళ్లిన మనిషి సురక్షితంగా వస్తాడో రాడో అంతుచిక్కని రోజులివి. ఇలా ఆకస్మికంగా తలెత్తే అనివార్య ఖర్చుల్ని తలెత్తుకోవడం అందరికీ సాధ్యం కాదు. ఇలాంటప్పుడే... మన చేతిలో ఆరోగ్య బీమా కార్డు ఉంటే... కొండంత ధైర్యాన్ని చేతిలో పెట్టుకున్నట్లే. పైగా నేటి రోజుల్లో కుటుంబానికంతటికీ జీవిత బీమా తో పాటు, ఆరోగ్య బీమా ఉండటం అత్యవసరంగా మారిపోయింది. ఈనేపథ్యంలో ఆరోగ్య బీమా స్థితిగతులను ఓసారి పరిశీలిద్దాం.
మనదేశంలో ఆరోగ్య బీమాను అందించే ప్రముఖ కంపెనీలు ఇవి.
స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్
కేర్ హెల్త్ ఇన్సూరెన్స్
హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో జనరల్
నివా భూపా హెల్త్ ఇన్సూరెన్స్
ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్
మణిపాల్ సిగ్న హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ
అకో జనరల్ ఇన్సూరెన్స్
టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్
వైద్యం ఖరీదైన అంశంగా మారిపోయిన ఈరోజుల్లో మీరు తీసుకునే ఆరోగ్య బీమా పాలసీ మిమ్మల్ని వైద్య ఖర్చులనుంచి గట్టెక్కిస్తుంది.
కనీసం రూ. 2 లక్షల నుంచి రూ. 2 కోట్ల వరకు పాలసీ తీసుకోవచ్చు.
వయోపరిమితిని బట్టి ప్రీమియం రేట్లు ఉంటాయి. చిన్న వయసులో తక్కువ ప్రీమియం కే పెద్ద పాలసీ తీసుకోవచ్చు.
ఏదైనా ఒక రోగంతో హాస్పిటల్ పాలైనప్పుడు ఆ వైద్యానికయ్యే ఖర్చుల్ని మనం ఎలాంటి నగదు చెల్లించనక్కర్లేకుండా పొందవచ్చు. మనం పాలసీ తీసుకునే ముందు కొన్ని అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి.
వీటిలో అత్యంత ప్రధానమైంది మనం బీమా తీసుకునే సంస్థ ఏయే హాస్పిటల్స్ తో అనుసంధానం అయివుందో తెలుసుకోవడం.అంటే దేశవ్యాప్తంగా ప్రముఖ హాస్పిటల్స్ తో పాటు, స్థానిక హాస్పిటల్స్ లో కూడా వైద్యం చేయించుకోవడానికి వీలుగా కవరేజ్ కలిగి ఉండాలి.
ఒక రోగానికి సంబంధించి హాస్పిటల్ లో జాయిన్ కావడానికి ముందు 30 రోజులు, డిశ్చార్జ్ అయ్యాక 30 రోజుల పాటు వైద్య ఖర్చులు పొందే సౌలభ్యాన్ని వివిధ బీమా సంస్థలు కల్పిస్తున్నాయి. పాలసీ తీసుకునే ముందు వాటి వివరాలు తెలుసుకోవాలి.
మనం తీసుకునే పాలసీ కి చెల్లించే ప్రీమియానికి కొంచెం అదనంగా చెల్లించడం ద్వారా పర్సనల్ ఆక్సిడెంట్ కవర్, క్రిటికల్ ఇల్నెస్ కవర్ వంటి వాటిని కూడా ఎంచుకోవాలి.
యాక్సిడెంట్ అయ్యి... ప్రాణాపాయం తప్పి శాశ్వత అంగ వైకల్యానికి లోనైతే... అడిషనల్ రైడర్స్ తీసుకోవడం వల్ల పెన్షన్ మాదిరి నెలనెలా (మన సమ్ అష్యురెడ్ ని బట్టి) సొమ్ములు పొందవచ్చు. సాధారణంగా వృద్ధాప్యానికి మరోపేరే అనారోగ్యం. కాబట్టి కచ్చితంగా ఆరోగ్య బీమా ఉండి తీరాల్సిందే. ఇప్పుడు వయోపరిమితితో సంబంధం లేకుండా.. ఎంత వయసువారైనా బీమా పాలసీ లు తీసుకోవడానికి ఐఆర్డీఏ వెసులుబాటు కల్పించింది. ఇది సీనియర్ సిటిజెన్లకు వరమనే చెప్పాలి.
అలాగే ఒకే ప్రీమియం తో మొత్తం కుటుంబానికి ఆరోగ్య బీమా రక్షణ కల్పించే విధంగా పాలసీలు అందుబాటులో ఉన్నాయి.
పాలసీ తీసుకునే టైం కే రోగాలు ఉన్నా కూడా వాటిని కవర్ చేస్తూ బీమా సదుపాయాన్ని పొందే అవకాశం కూడా ఉంది. అయితే వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. పాలసీ తీసుకునే సమయంలో ఏయే బీమా సంస్థలు ఎంతెంత వెయిటింగ్ పీరియడ్ ను పేర్కొంటున్నాయో తెలుసుకోవాలి.
ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 డ్ కింద మనం కట్టే ప్రీమియానికి (షరతులకు లోబడి) రూ. 25,000 నుంచి రూ.75,000 వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు.
సాధారణంగా 24 గంటలు హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటేనే పాలసీ వర్తిస్తుంది. ఇప్పుడు కొన్ని సంస్థలు అవుట్ పేషెంట్ గా చేయించుకునే వైద్యానికయ్యే ఖర్చులను కూడా బీమా కవరేజ్ లోకి తీసుకుంటున్నాయి. అంతేకాదు... ప్రత్యేకించి ఓపీ చికిత్సల కోసమే ఉపయోగపడే విధంగా పాలసీలు అందుబాటులోకి వచ్చాయి.
ఎలాంటి ఆరోగ్య సేవలు పొందవచ్చు, ప్రీమియంలు ఎలా ఉంటాయి ఇత్యాది అంశాలను మరోసారి చర్చించుకుందాం.
-బెహరా శ్రీనివాస రావు,
పర్సనల్ ఫైనాన్స్ విశ్లేషకులు
Comments
Please login to add a commentAdd a comment