జీవనశైలిలో మార్పు, విభిన్న ఆహార అలవాట్లతో అనారోగ్యబారిన పడుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. ఆరోగ్య బీమా ఉందనే ధీమాతో ఆసుపత్రిలో చేరిన కొందరి క్లెయిమ్‌లను కంపెనీలు తిరస్కరిస్తున్నాయి. అయితే బీమా తీసుకునే సమయంలోనే పాలసీదారులు చేస్తున్న కొన్ని పొరపాట్ల వల్ల ఇలా క్లెయిమ్ అందడం లేదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అసలు ఆరోగ్య బీమా క్లెయిమ్ ఎలాంటి పరిస్థితుల్లో తిరస్కరిస్తారు.. అలా కంపెనీలు క్లెయిమ్‌లు తిరస్కరించకూడదంటే ఏం చేయాలనే వివరాలు తెలుసుకుందాం.
బీమా పాలసీ డాక్యుమెంట్లు గతంలో సామాన్యులకు అర్థంకాని కఠిన పదాలతో ఉండేవి. కానీ భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) పాలసీ పత్రాలు సరళమైన భాషలో ఉండాలని ఆదేశించింది. దాంతో ప్రస్తుతం అన్ని కంపెనీలు అందరికీ అర్థమయ్యే విధంగా పాలసీ పత్రాలను వెల్లడిస్తున్నాయి. అన్ని కంపెనీలు ఐఆర్‌డీఏఐ మార్గదర్శకాలకు అనుగుణంగా పాలసీ జారీ చేస్తుంటాయి. అయితే వాటిని సరిగా అర్థం చేసుకుని బీమా తీసుకోవాల్సి ఉంటుంది. అందులో ప్రధానంగా కింది అంశాలపై అవగాహన ఉండాలి.
ఆరోగ్య సమాచారం సరిగా తెలపడం
పాలసీ తీసుకునేప్పుడు ఆరోగ్య విషయాలు స్పష్టంగా తెలియజేయాలి. ఒకవేళ గతంలో ఏదైనా సర్జరీలు, అనారోగ్య సమస్యలుంటే తప్పకుండా కంపెనీలకు ముందుగానే చెప్పాలి. దానివల్ల స్వల్పంగా ప్రీమియం పెరుగుతుంది. కానీ భవిష్యత్తులో పాలసీ క్లెయిమ్ కాకపోతే ఇబ్బంది పడాల్సి ఉంటుంది. కాబట్టి ఎలాంటి సమస్యలున్నా ముందుగానే తెలియజేయడం ఉత్తమం.
వెయిటింగ్ పీరియడ్
పాలసీ తీసుకున్న వెంటనే కొన్ని రకాల జబ్బులకు కంపెనీలు వైద్య ఖర్చులు అందించవు. అలాంటి వ్యాధులకు బీమా వర్తించాలంటే కొన్ని రోజులు వేచి ఉండాలి. అయితే కంపెనీలకు బట్టి ఈ వ్యాధులు మారుతుంటాయి. మీకు ఇప్పటికే కొన్ని జబ్బులుండి వాటికి వైద్యం చేయించుకోవాలనుకుంటే మాత్రం అన్ని వివరాలు తెలుసుకోవాలి.
సరైన ధ్రువపత్రాలతో రీయింబర్స్‌మెంట్
బీమా కంపెనీలకు చెందిన నెట్‌వర్క్ ఆసుపత్రులు అందుబాటులో లేనివారు ఇతర హాస్పటల్‌లో వైద్యం చేయించుకుంటారు. తర్వాత బీమా కంపెనీకి బిల్లులు సమర్పించి తిరిగి డబ్బు పొందుతారు. అయితే అందుకు సరైన ధ్రువపత్రాలు అవసరం. వైద్యం పూర్తయ్యాక ఆసుపత్రి నుంచి అవసరమైన పత్రాలు, బిల్లులు, ఆరోగ్య నివేదికలు తీసుకొని నిబంధనల ప్రకారం రీయింబర్స్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకోవాలి.
ఇదీ చదవండి: అడ్మిషన్ తిరస్కరించిన కాలేజీకే ముఖ్య అతిథిగా..
క్లెయిమ్‌ను తిరస్కరించకుండా ఏ జాగ్రత్తలు పాటించాలంటే..
బీమా పాలసీ తీసుకునేముందే అన్ని నిబంధనలు అర్థం చేసుకోవాలి. భవిష్యత్తులో క్లెయిమ్ తిరస్కరణకు దారితీసే సందర్భాల గురించి అవగాహన కలిగి ఉండాలి. పాలసీ కొనుగోలు సమయంలోనే అన్ని అంశాలను పరిశీలించాలి.
బీమా సంస్థ నియమాలను తప్పకుండా అనుసరించాలి. పైన తెలిపిన విధంగా ఆరోగ్య విషయాల వెల్లడిలో పొరపాటు చేయకూడదు. ప్రతిపాలసీకు కొన్ని షరతులు, మినహాయింపులు, పరిమితులుంటాయి. వాటిపై పూర్తిగా అవగాహన ఉండాలి.
ఏదైనా ప్రమాదం జరిగితే పాలసీ నెట్‌వర్క్ ఆసుపత్రుల్లోనే చేరాలి. అత్యవసరం అయితే తప్పా ఇతర హాస్పటల్స్‌లోకి వెళ్లకూడదు. నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో చేరితే డబ్బు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ కోపే(కొంత బీమా కంపెనీ, ఇంకొంత పాలసీదారులు చెల్లించాలి) ఎంచుకుంటే మాత్రం నిబంధనల ప్రకారం కొంత పాలసీదారులు చెల్లించాలి.
కొన్నిసార్లు చికిత్స కోసం వెళ్లిన ఆసుపత్రిని బీమా సంస్థ నిషేధిత జాబితాలో పెట్టొచ్చు. ఆ సందర్భంలో పరిహారం చెల్లించదు. కాబట్టి, ముందుగానే ఈ వివరాలను తెలుసుకోవాలి. కంపెనీ వెబ్‌సైట్‌లో వాటిని అప్‌డేట్ చేస్తుంటారు.
బీమా క్లెయిమ్ చేసుకునే విధానంలో ఎదైనా సందేహాలుంటే కంపెనీలను సంప్రదించాలి. బీమా సంస్థలు పాలసీదారులకు ఆసుపత్రులను ఎంపిక చేసుకోవడంతోపాటు, ఇతర అంశాలపైనా సహాయం చేస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment