నామినీ నమోదు చేశారా? | Nomination In All Investments Is Necessary | Sakshi
Sakshi News home page

నామినీ నమోదు చేశారా?

Published Mon, May 29 2023 4:17 AM | Last Updated on Mon, May 29 2023 7:20 AM

Nomination In All Investments Is Necessary - Sakshi

ప్రతి ఒక్కరి జీవితంలో పెట్టుబడులకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. తమ సంపదను వృద్ధి చేసుకునేందుకు ఎన్నో రూపాల్లో ఇన్వెస్ట్‌ చేస్తుంటారు. సొంతిల్లు సమకూర్చుకోవాలని, వారసులకు బంగారు భవిష్యత్తును ఇవ్వాలని.. ఇలాంటి ముఖ్యమైన ఎన్నో జీవిత లక్ష్యాల కోసం పలు రకాల సాధనాల్లో పెట్టుబడులు పెడుతుంటారు. స్టాక్స్, మ్యూచువల్‌ ఫండ్స్, డిపాజిట్లు, బాండ్లు, జీవిత బీమా ప్లాన్లు, పీపీఎఫ్‌ ఇలా ఎన్నో ఆర్థిక సాధనాలు వ్యక్తుల ఆర్థిక ప్రణాళికల్లో భాగంగా ఉంటాయి.

అయితే, జీవితం ఎప్పుడు ఎలాంటి మలుపు తీసుకుంటుందో చెప్పలేం. దురదృష్టం కొద్దీ ఈ సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేసిన వారికి ఏదైనా ప్రమాదం జరిగితే ఏంటి పరిస్థితి? ఆ పెట్టుబడులనేవి జీవిత భాగస్వామి లేదా వారసులకు సాఫీగా, సులభంగా, వేగంగా బదిలీ అవ్వాలి. అందుకు ఓ చిన్న పని చేయాల్సి ఉంటుంది. అదే నామినేషన్‌ నమోదు చేయడం. తమకు అత్యంత ఆప్తులైన వారిలో ఒకరి పేరును నామినీగా ప్రతి పెట్టుబడి సాధనంలోనూ నమోదు చేయాలి. నామినేషన్‌ లేని సందర్భాల్లో క్లెయిమ్‌ కోసం పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. కనుక నామినేషన్‌ ప్రాధాన్యాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి.

నామినీ అంటే ఎవరు..?
పెట్టుబడిదారు మరణించిన సందర్భాల్లో వారి పేరిట ఉన్న పెట్టుబడులను క్లెయిమ్‌ చేసుకుని, వాటిని పొందే హక్కును కలిగిన వ్యక్తి నామినీ అవుతారు. ఎక్కువ మంది నామినీగా కుటుంబ సభ్యులనే ముందుగా నియమించుకుంటారు. జీవిత భాగస్వామి లేదా పిల్లలు లేదా తల్లిదండ్రులు నామినేషన్‌ విషయంలో ప్రథమ ఎంపికగా ఉంటారు. అవివాహితులై, తల్లిదండ్రులు, తోడబుట్టిన వారు కూడా లేని సందర్భాల్లో అత్యంత సన్నిహితులు, నమ్మకస్తులైన వారిని, స్నేహితులను నామినీగా నియమించుకోవచ్చు. నామినీకి ఎవరు అయినా అర్హులే. కాకపోతే అంతిమంగా దీని ప్రయోజనం నెరవేరేలా నామినేషన్‌ ఉండాలన్న అంశాన్ని మర్చిపోవద్దు. ఒకవేళ నామినీగా మైనర్‌ను పేర్కొంటే,  సంబంధిత నామినీ సంరక్షకుడి పేరు, చిరునామా, కాంటాక్ట్‌ వివరాలు ఇవ్వాలి.

ఎంతో ప్రాధాన్యం..
3నామినేషన్‌ నమోదు చేసిన వ్యక్తి మరణించిన సందర్భంలో.. అతని పేరిట ఉన్న పెట్టుబడులు నామినీకి చాలా సులభంగా బదిలీ అవుతాయి. నామినీని నమోదు చేయకపోతే.. అప్పుడు ఆ పెట్టుబడులను వారసులే క్లెయిమ్‌ చేయగలరు. చట్ట ప్రకారం తామే వారసులమని ధ్రువీకరణ పత్రం ఇవ్వాలి. వీటిని స్థానిక తహసీల్దార్‌ లేదా కోర్టు నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సమయంతోపాటు, శ్రమ కూడా పడాలి. ముఖ్యంగా కోర్టు నుంచి లీగల్‌ హేర్‌ సర్టిఫికెట్‌ తీసుకుని సమర్పించాల్సి ఉంటుంది. నామినేషన్‌ రిజిస్టర్‌ చేస్తే ఇలాంటి ఇబ్బందులేమీ ఉండవు. పెట్టుబడిదారు డెత్‌ సర్టిఫికెట్‌ ఒక్కటి సరిపోతుంది. ఒక అప్లికేషన్, దానికితోడు కేవైసీ వివరాలు సమర్పిస్తే చాలు. ప్రక్రియ సులభంగా ముగుస్తుంది.   

వేటికి?..: బీమా పాలసీ తీసుకోవడం వెనుక ఉద్దేశం తమకు ఏదైనా జరిగితే కుటుంబ సభ్యులు ఆర్థికంగా ఇబ్బంది పడకూడదనే. అంత ముఖ్యమైన బీమా ప్లాన్‌ దరఖాస్తులో నామినేషన్‌ నమోదు చేయకపోతే? అర్థమే ఉండదు. అలాంటప్పుడు పరిహారం దక్కించుకునేందుకు కుటుంబ సభ్యులు శ్రమ పడాల్సి వస్తుంది. అలాగే బ్యాంకు ఖాతాకు సైతం నామినేషన్‌ ఉండాలి. అప్పుడు ఖాతాలో బ్యాలన్స్‌ మొత్తాన్ని నామినీ సులభంగా పొందడానికి వీలవుతుంది.

అకౌంట్‌ హోల్డర్‌ మరణ ధ్రువీకరణ పత్రంతోపాటు, నామినీ కేవైసీ వివరాలను బ్యాంకు శాఖలో సమర్పించడం ద్వారా వాటిని సొంతం చేసుకోవచ్చు. అలాగే, బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలోనూ నామినేషన్‌ ఉండాలి. ఇంకా పీపీఎఫ్, మ్యూచువల్‌ ఫండ్స్, స్టాక్‌ ట్రేడింగ్, డీమ్యాట్‌ అకౌంట్, అన్ని పోస్టాఫీసు పథకాలకు నామినేషన్‌ నమోదు చేసుకోవచ్చు. ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఏమిటంటే నామినేషన్‌ నమోదు చేయడం తప్పనిసరి కాదు. అయినా కానీ, నమోదు చేయడం బాధ్యతగా భావించాలి. ప్రతి పెట్టుబడి దరఖాస్తులో నామినేషన్‌ కాలమ్‌ను తప్పకుండా పూరించాలి.

ఎంత మంది?
నామినీలు ఎంత మంది అనే విషయం ఆయా పెట్టుబడి సాధనాల్లో వేర్వేరుగా ఉంటుంది. ఉదాహరణకు జీవిత బీమా పాలసీ అయితే ఎంత మందిని అయినా నామినీలుగా నమోదు చేసుకోవచ్చు. ఒకరికి మించి నామినీగా పేర్లు ఇచ్చినప్పుడు, విడిగా ఒక్కొక్కరికీ ఎంత శాతం చొప్పున క్లెయిమ్‌కు అర్హత అనేది కూడా పేర్కొనాలి. ఉదాహరణకు ముగ్గురిని నామినీలుగా నమోదు చేశారనుకుందాం. అప్పుడు ఏకి 50 శాతం, బీకి 30 శాతం, సీకి 20 శాతం లేదా తమకు నచ్చిన విధంగా ఈ శాతాన్ని నిర్ణయించుకోవచ్చు.

బ్యాంకు ఖాతాలకు అయితే సాధారణంగా ఒక్కటే నామినేషన్‌ ఉంటుంది. పీపీఎఫ్‌ ఖాతాకు కూడా ఒకటికి మించి నామినేషన్లు ఇవ్వొచ్చు. మ్యూచువల్‌ ఫండ్స్‌ పెట్టుబడులకు నామినేషన్‌ కింద ముగ్గురి పేర్లను నమోదు చేసుకోవచ్చు. కొందరు తమపై ఆధారపడిన ఒంటరి తల్లి లేదా తండ్రికీ కొంత పెట్టుబడుల మొత్తం వెళ్లాలని కోరుకుంటారు. అలాంటప్పుడు విల్లు రాసి అందులో ఎవరికి ఏమి చెందాలో పేర్కొనాలి. లేదంటే నామినేషన్‌లో తల్లిదండ్రులకూ ఇంత శాతం చొప్పున వాటా ఇవ్వాలి.  

సవరణ..: నామినేషన్‌ ఇవ్వడంతో పని ముగిసిపోయిందని అనుకోవద్దు. ఏడాదికోసారి సంబంధిత నామినేషన్‌ను సమీక్షించుకోవాలి. అప్పటికే నామినీగా పేర్కొన్న వ్యక్తులతో తమకున్న అనుబంధాన్ని విశ్లేషించుకోవాలి. తమకు ఏదైనా జరిగితే వారు ఆస్తులను క్లెయిమ్‌ చేసుకునేందుకు సరైన వారేనా అని ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే కొందరు వైవాహిక బంధం నుంచి వేరు పడుతుంటారు. మరొకరిని వివాహం చేసుకుంటారు. అవివాహితులు వైవాహిక జీవితంలోకి ప్రవేశించొచ్చు. లేదా నామినీగా పేర్కొన్న వ్యక్తి మరణించి ఉండొచ్చు. మరేదైనా కారణం ఉండొచ్చు. నామినీగా నమోదు చేసిన వ్యక్తి ఆచూకీ లేకుండా పోతే, అప్పుడు అసలు ఉద్దేశమే నెరవేరదు. అందుకే నామినేషన్‌ను ఏడాదికోసారి సమీక్షించి, సవరించుకోవాలి.

ఊహించని అనుభవం
2021లో మద్రాస్‌ హైకోర్టు ఓ సంచలనాత్మక తీర్పునిచ్చింది. తన భర్త మరణంతో జీవిత బీమా పాలసీ ప్రయోజనాలను క్లెయిమ్‌ చేసుకునే విషయమై ఒక మహిళకు తన మామతో విభేదాలు ఏర్పడ్డాయి. కోర్టును ఆశ్రయించగా, ఆమెకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. కారణం ఆమె భర్త తీసుకున్న జీవిత బీమా పాలసీ ప్రీమియంలను తండ్రి (బాధితురాలి మామ) చెల్లించడమే. పైగా మరణించిన వ్యక్తి తన జీవిత బీమా పాలసీలో నామినీని నమోదు చేయలేదు. విల్లు కూడా రాయలేదు. ప్రీమియంలను పాలసీదారు సొంతంగా చెల్లించనప్పుడు, ఆ పాలసీ ప్రయోజనాలకు జీవిత భాగస్వామి వారసురాలని తేల్చడం కుదరదని కోర్టు స్పష్టం చేసింది. నామినీని నమోదు చేయకపోవడంతో, ప్రీమియం చెల్లించిన తండ్రికి ఆ పాలసీ ప్రయోజనాలపై అధికారాలు ఉంటాయని ఈ ఘటన స్పష్టం చేసింది.

సరైన నిర్ణయం
మనలో కొందరు తమ పిల్లల పేరిట జీవిత బీమా పాలసీలను తీసుకుని తొలుత వారే ప్రీమియం చెల్లిస్తుంటారు. కనుక పెళ్లయిన వ్యక్తులు వెంటనే జీవిత బీమా పాలసీల్లో తమ జీవిత భాగస్వామిని నామినీగా నమోదు చేయాలి. లేదంటే ఆశించిన ప్రయోజనం నెరవేరదు. అందుకే సరైన వ్యక్తిని నామినీగా నమోదు చేసుకోవాలి. లేదంటే విల్లు రాసి రిజిస్టర్‌ చేసుకోవాలి. ముఖ్యంగా జీవిత బీమా పాలసీల ఉద్దేశం నెరవేరాలంటే అందుకు నామినేషన్‌ మెరుగైన మార్గం. చాలా కేసుల్లో వ్యక్తి మరణంతో జీవిత భాగస్వామిపైనే ఆర్థిక బాధ్యతల భారం పడుతుంది. కనుక జీవిత భాగస్వామినే నామినీగా నమోదు చేసుకోవాలి. కుటుంబం కోసం ఒక పాలసీ, ఒంటరి తల్లి లేదా తండ్రి లేదా తనపై ఆధారపడిన తల్లిదండ్రుల కోసం విడిగా మరో పాలసీ తీసుకునే వారు.. ఆయా పాలసీల్లో తప్పనిసరిగా నామినీని పేర్కొనాలి.

నామినేషన్‌ గడువు
మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులు కలిగిన వారు, ట్రేడింగ్, డీమ్యాట్‌ ఖాతా కలిగిన వారు తప్పనిసరిగా నామినీ విషయంలో ఆప్షన్‌ ఇవ్వాలని సెబీ ఆదేశాలు తీసుకొచ్చింది. 2023 మార్చి 31 వరకే ఉన్న గడువును, సెస్టెంబర్‌ 30 వరకు పొడిగించింది. కనుక ఇన్వెస్టర్లు వచ్చే సెప్టెంబర్‌ 30 నాటికి నామినేషన్‌ ఇవ్వాలి. నామినేషన్‌ ఇవ్వడం ఇష్టం లేకపోతే ‘ఆప్ట్‌ అవుట్‌ ఆఫ్‌ నామినేషన్‌’ను ఎంపిక చేసుకోవాలన్నది నిబంధన. అంటే నామినేషన్‌ నుంచి వైదొలగడం. కానీ, సెబీ ఆదేశాల ఉద్దేశం అది కాదు. నామినేషన్‌ విలువ తెలియజేసి, ప్రతి ఒక్కరూ నమోదు చేసుకునేలా చేయడమే. ఇక జీవిత బీమా ప్లాన్లు, బ్యాంకు ఖాతాలకు సంబంధించి నామినేషన్‌ నమోదు తప్పనిసరి కాదు. అయినా కానీ, నామినేషన్‌ ఇవ్వడం తన బాధ్యతగా ఇన్వెస్టర్‌ గుర్తించాలి.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement