
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ద్రవ్యలోటు జనవరి చివరికి రూ.11,69,542 కోట్లకు చేరుకుంది. పూర్తి ఆర్థిక సంవత్సరం (2024–25) ద్రవ్యలోటు అంచనాల్లో (రూ.15.69 లక్షల కోట్లు) ఇది 74.5 శాతం కావడం గమనార్హం. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) ఈ మేరకు గణాంకాలు విడుదల చేసింది. ప్రభుత్వ వ్యయాలు–ఆదాయాల మధ్యలో అంతరమే ద్రవ్యలోటు. క్రితం ఆర్థిక సంవత్సరం తొలి పది నెలల్లో ద్రవ్యలోటు 63.6 శాతంగానే ఉంది.
మొత్తం ఆదాయం 2024 ఏప్రిల్ నుంచి 2025 జనవరి వరకు రూ.24 లక్షల కోట్లుగా (పన్నుల ఆదాయం రూ.19.03 లక్షల కోట్లు) ఉంది. 2024–25 సవరించిన అంచనాల ప్రకారం మొత్తం అంచనాల్లో ఇది 76.3 శాతానికి సమానం. మొత్తం వ్యయాలు రూ.35.7 లక్షల కోట్లుగా ఉన్నాయి. పూర్తి ఆర్థిక సంవత్సరం అంచనాల్లో ఇది 75.7 శాతానికి సమానం. ఇటీవలి బడ్జెట్‌లో 2024–25 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు 4.8 శాతంగా, 2025–26 సంవత్సరంలో 4.4 శాతంగా ఉంటుందని ఆర్థిక మంత్రి సీతారామన్ ప్రకటించడం తెలిసిందే. జనవరి చివరికి రూ.10,74,179 కోట్లను రాష్ట్రాలకు పన్నుల వాటా కింద కేంద్రం బదిలీ చేసింది. క్రితం ఆర్థిక సంవత్సరం తొలి 10 నెలల కాలంతో పోల్చి చూస్తే రూ.2,53,929 కోట్లు అధిక ఆదాయం రాష్ట్రాలకు సమకూరింది.
మెరుగుపడిన మౌలికం
జనవరిలో 4.6 శాతానికి పెరిగిన ఉత్పత్తి
న్యూఢిల్లీ: మౌలిక రంగం ఈ ఏడాది జనవరి నెలలో బలమైన పనితీరు చూపించింది. ఎనిమిది మౌలిక రంగాల ఉత్పత్తి జనవరిలో 4.6 శాతంగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే నెలలో ఇది 4.2 శాతంగా ఉంది. కాకపోతే 2024 డిసెంబర్ నెలలో నమోదైన 4.8 శాతంతో పోలిస్తే పనితీరు కాస్త నిదానించినట్టు కనిపిస్తోంది.
ఇదీ చదవండి: ఒక్కరోజే రూ.99,835 కోట్లు
ముడి చమురు, సహజ వాయువు ఉత్పత్తి క్రితం ఏడాది జనవరి నెల గణాంకాలతో పోల్చి చూస్తే తగ్గింది. బొగ్గు ఉత్తత్తి 4.6 శాతానికి పడిపోయింది. 2024 జనవరిలో ఇది 3.7 శాతంగా ఉంది. స్టీల్ ఉత్పత్తి వార్షికంగా చూస్తే 9.2 శాతం నుంచి 3.7 శాతానికి క్షీణించింది. విద్యుదుత్పత్తి 1.3 శాతంగా నమోదైంది. 2024 జనవరి నెలకు ఇది 5.7 శాతంగా ఉంది. రిఫైనరీ ఉత్పత్తి 8.3 శాతం, ఎరువుల ఉత్పత్తి 3 శాతం, సిమెంట్ ఉత్పత్తి 14.5 శాతానికి పుంజుకున్నది.
ఈ ఏడాది 10 నెలల కాలంలో (2024 ఏప్రిల్–2025 జనవరి) 8మౌలిక రంగాల ఉత్పత్తి క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న 7.8% నుంచి 4.4 శాతానికి క్షీణించింది.