భారతీయ బ్యాంకింగ్(Banking) వ్యవస్థలో లిక్విడిటీ లోటు గరిష్ఠ స్థాయికి చేరింది. తాజాగా ఈ లోటు ఏకంగా రూ.3 లక్షల కోట్లకు పైగా పెరిగింది. అమెరికా డాలర్(US Dollar)తో పోలిస్తే రూపాయి విలువ గణనీయంగా పడిపోతుండడం, అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు అధికమవడం, యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాలు లిక్విడిటీ తగ్గడానికి కారణమవుతున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.
లిక్విడిటీ లోటుకు కొన్ని కారణాలను మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. డాలర్‌తో పోలిస్తే భారీగా పడుతున్న రూపాయి విలువను కాపాడేందుకు ఆర్‌బీఐ తన వద్ద ఉన్న డాలర్లను విక్రయిస్తోంది. పన్ను చెల్లింపులకు సంబంధించిన అవుట్ ఫ్లోలు కూడా లిక్విడిటీ లోటు పెరిగేందుకు కారణమవుతున్నాయి. ఆర్‌బీఐ వద్ద ప్రభుత్వ నగదు నిల్వలు పెరగడం పరిస్థితిని మరింత తీవ్రతరం చేసింది.
ఆర్‌బీఐ స్పందన..
లిక్విడిటీ సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఆర్‌బీఐ విభిన్న చర్యలు తీసుకుటోంది. ఆర్‌బీఐ వేరియబుల్ రెపో రేటు (వీఆర్ఆర్-షార్ట్‌టర్మ్‌లో బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీ పెంచేందుకు ఆర్‌బీఐ అప్పులు ఇవ్వడం) ఆక్షన్లను పెంచింది. బ్యాంకింగ్ వ్యవస్థలోకి లిక్విడిటీని చొప్పించడానికి రోజువారీ వేలం నిర్వహిస్తుంది. జనవరి 23న ఆర్బీఐ రూ.3.15 లక్షల కోట్లను వ్యవస్థలోకి చొప్పించింది. బ్యాంకు నిల్వల నిర్వహణలో అంతరాన్ని సర్దుబాటు చేసిన తర్వాత కూడా లోటు రూ.3.3 లక్షల కోట్లకు పైగానే ఉంది.
ఇదీ చదవండి: ఫుడ్ కేటరింగ్ పునరుద్ధరణకు భాగస్వామ్యం
నగదు నిల్వల నిష్పత్తిని (CRR) నికర డిపాజిట్లలో 4 శాతానికి తగ్గించిన ఆర్బీఐ బ్యాంకింగ్ వ్యవస్థలోకి దాదాపు రూ.1.16 లక్షల కోట్ల లిక్విడిటీని ఇటీవల విడుదల చేసింది. ఇది కూడా లిక్విడిటీ లోటు సమస్యకు కారణమని కొందరు అంచనా వేస్తున్నారు. ఈ తరుణంలో వచ్చే నెలలో జరగనున్న ఆర్‌బీఐ మానిటరీ పాలసీ సమావేశం కీలకంగా మారనుంది.
Comments
Please login to add a commentAdd a comment