Banking system
-
రూ.7,409 కోట్ల విలువైన 2,000 నోట్లు ఇంకా ప్రజల్లోనే..
ముంబై: ఉపసంహరించిన రూ. 2000 డినామినేషన్ బ్యాంకు నోట్లలో 97.92 శాతం బ్యాంకింగ్ వ్యవస్థకు తిరిగి వచ్చాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గురువారం తెలిపింది. ప్రజల వద్ద ఇప్పటికీ రూ.7,409 కోట్ల విలువైన నోట్లు ఉన్నాయని పేర్కొంది. రూ. 2000 డినామినేషన్ నోట్లను చెలామణి నుండి ఉపసంహరించుకుంటున్నట్లు 2023 మే 19న ఆర్బీఐ ప్రకటించింది. ఉపసంహరణ ప్రకటించిన గత ఏడాది మే 19న బిజినెస్ వ్యవహార సమయం ముగిసే సమయానికి చెలామణిలో ఉన్న రూ. 2000 నోట్ల మొత్తం విలువ రూ. 3.56 లక్షల కోట్లు. ఈ ఏడాది జూలై 31న ఇదే సమయానికి ఈ విలువ రూ.7,409 కోట్లకు తగ్గింది. రూ. 2000 నోట్లను డిపాజిట్ చేయడం, లేదా మార్చుకునే సౌకర్యం దేశంలోని అన్ని బ్యాంక్ బ్రాంచ్‌లలో 2023 అక్టోబర్ 7 వరకు అందుబాటులో ఉంది. అటుపై 2023 అక్టోబర్ 9వ తేదీ నుండి ఆర్బీఐ ఇష్యూ కార్యాలయాలు వ్యక్తులు, సంస్థల నుండి రూ. 2000 నోట్లను స్వీకరిస్తున్నాయి. ప్రజలు రూ. 2000 నోట్లను ఇండియా పోస్ట్ ద్వారా దేశంలోని ఏదైనా పోస్టాఫీసు నుండి తమ బ్యాంకు ఖాతాలకు జమ చేయడానికి ఆర్బీఐ ఇష్యూ కార్యాలయాలకు పంపడానికి తగిన సౌలభ్యతను కూడా కలి్పంచడం జరిగింది. 2016 నవంబర్‌లో అప్పుడు అమలులో ఉన్న రూ.1000, రూ.500 నోట్ల రద్దు తర్వాత రూ. 2000 నోట్లను ప్రవేశపెట్టడం జరిగింది. -
97.5% రూ.2,000 నోట్లు వచ్చేశాయ్..!
ముంబై: బ్యాంకింగ్ వ్యవస్థలోకి 97.5 శాతం రూ.2,000 బ్యాంక్ నోట్లు తిరిగి వచ్చేసినట్లు బ్యాంకింగ్ రెగ్యులేటర్– రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పేర్కొంది. ఇంకా ప్రజాబాహుళ్యంలో రూ.8,897 కోట్ల విలువైన రూ.2,000 నోట్లు ఉన్నట్లు పేర్కొంది. ‘‘రూ. 2,000 బ్యాంకు నోట్ల ఉపసంహరణ ప్రకటించిన 2024 మే 19న వ్యాపారం ముగిసే సమయానికి చెలామణిలో ఉన్న రూ. 2,000 బ్యాంకు నోట్ల మొత్తం విలువ రూ. 3.56 లక్షల కోట్లు. 2024 జనవరి 31వ తేదీన వ్యాపారం ముగిసే సమయానికి ఈ విలువ రూ. రూ.8,897 కోట్లకు తగ్గింది’’ అని ఆర్బీఐ తాజా ప్రకటన వివరించింది. -
డిపాజిటర్ల డబ్బు పరిరక్షణే పవిత్ర విధి
ముంబై: డిపాజిటర్లు కష్టపడి సంపాదించిన డబ్బును రక్షించడం బ్యాంకర్‌కు పవిత్రమైన విధి అని, ఇది మతపరమైన స్థలాన్ని సందర్శించడం కంటే చాలా ముఖ్యమైనదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. చిన్న పొదుపుదారులు, మధ్యతరగతి, పదవీ విరమణ చేసిన వారి నుండి సమీకరించిన డిపాజిట్లపై మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థ ఆధారపడి ఉన్న నేపథ్యంలో ఈ డబ్బు పరిరక్షణే ప్రధాన పవిత్ర విధిగా భావించాలని ఆయన అన్నారు. ‘‘డిపాజిటర్ల డబ్బును రక్షించడం బ్యాంకు అతి ముఖ్యమైన బాధ్యత. ఇది పవిత్రమైన విధి. గుడి లేదా మసీదు లేదా గురుద్వారాకు నమస్కరించడం కంటే.. డిపాజిటర్ల సొమ్మును పరిరక్షించడం ఎంతో పవిత్రమైన విధి’’ దాస్ అన్నారు. బ్యాంకింగ్ రంగంలోని ప్రతి ఒక్కరిపై ఉన్న ‘‘అతిపెద్ద బాధ్యత ఇది’’ అని ఇక్కడ నిర్వహించిన అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకు (యుసీబీ) డైరెక్టర్ల సమావేశాన్ని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో పేర్కొన్నారు. దాస్ ఆగస్టు 30వ తేదీన ఈ మేరకు చేసిన ఒక ప్రసంగాన్ని ఆర్బీఐ సోమవారం యూట్యూబ్‌లో అప్డేట్ చేసింది. ఆయన ప్రసంగంలోని మరికొన్ని ముఖ్యాంశాలు... ► డిపాజిటర్ల డబ్బు సురక్షితంగా ఉందని నిర్ధారించడానికి అన్ని బ్యాంకులతో కలిసి పనిచేయడం రిజర్వ్ బ్యాంక్ బాధ్యత. అందువల్ల ఈ దిశలో సెంట్రల్ బ్యాంక్ ప్రయత్నాలు ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటాయి. నిబంధనలు, పర్యవేక్షణ చర్యలు కొనసాగుతూనే ఉంటాయి. ► ఇక్కడ ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అంశం ఏమిటంటే... సహకార బ్యాంకింగ్ రంగంలో సంస్థలు ఎదుర్కొంటున్న సవాళ్ల కారణంగా డిపాజిటర్ సొమ్ము నిలిచిపోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇలాంటి కేసుల్లో చాలా వరకూ నిర్వహణలో అక్రమాలే ప్రధాన కారణం. ఇక్కడ మనం యూసీబీ.. పంజాబ్ అండ్ మహారాష్ట్ర బ్యాంక్‌ను ప్రస్తావించుకోవచ్చు. ► 1,500 పైగా సంస్థలపై మెరుగైన నియంత్రణ, పర్యవేక్షణ చేయాలన్న ప్రధాన దృక్పథంతో యూసీబీల కోసం ఆర్బీఐ నాలుగు అంచెల పర్యవేక్షణా యంత్రాంగాన్ని రూపొందించింది. ► ఆర్థిక వ్యవస్థ సజావుగా సాగేందుకు మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థ స్థిరంగా ఉండాలి. ఆర్థిక వ్యవస్థలో యూసీబీలు ముఖ్యమైన భాగం. ► యూసీబీలపై ఆర్బీఐ పర్యవేక్షణను పటిష్టం చేయడాన్ని... ఆయా సంస్థలు తమ వృద్ధికి ఆటంకాలు కలిగించే ప్రయత్నంగా చూడవద్దు. యూసీబీల మొండిబకాయిలపై హెచ్చరిక అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులలో స్థూల నిరర్థక ఆస్తుల నిష్పత్తి (జీఎన్‌పీఏ) 8.7 శాతంగా ఉన్న విషయాన్ని గవర్నర్ ప్రస్తావిస్తూ, దీనిపట్ల సెంట్రల్ బ్యాంక్ ‘‘సౌఖ్యంగా లేదు’’ అని స్పష్టం చేశారు. షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకుల జీపీఎన్ఏలు 2023 మార్చిలో దశాబ్దపు అత్యుత్తమ స్థాయి 3.9 శాతానికి చేరుకున్నాయని, మరింత మెరుగుపడతాయన్న అంచనాలూ ఉన్నాయని ఈ సందర్భంగా అన్నారు. ఎన్పీఏల సమస్యను మెరుగుపరచడానికి యూసీబీలూ తగిన కృషి చేయాలని కోరారు. అలాగే యూసీబీలు పాలనా ప్రమాణాలను మెరుగుపరచాలని, డైరెక్టర్లు, అధికారుల వంటి బ్యాంకు నిర్వహణా సంబంధ పార్టీ లావాదేవీలను నివారించాలని, రుణ సమస్యలు తలెత్తకుండా చూడాలని ఆయన కోరారు. యూసీబీలు ఇటీవలి కాలంలో బహుళ సవాళ్లను ఎదుర్కొంటున్నాయని దాస్ పేర్కొన్నారు. మున్ముందు యూసీబీ సెగ్మెంట్.. డిజిటల్, ఫిన్‌టెక్, నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు, సూక్ష్మ రుణదాతలు వంటి టెక్–అవగాహన సంస్థల నుండి తీవ్ర పోటీని ఎదుర్కొననుందని, అందువల్ల సాంకేతికతపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని దాస్ చెప్పారు. అయితే ఈ రంగంలో కొన్ని బ్యాంకులు తగిన విధంగా పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. -
బ్యాంకుల్లో నగదు కొరత: నాలుగేళ్ల గరిష్టానికి!
India banking liquidity deficit: దేశీయ బ్యాంకింగ్ సిస్టమ్ లిక్విడిటీ కొరతపై రిపోర్ట్ ఒకటి ఆందోళన రేపుతోంది. ఈ ఏడాదిలో ఈ నెల (సెప్టెంబరు) 20నాటికి బ్యాంకింగ్ లిక్విడిటీ లోటు రూ. 1.46 లక్షల కోట్ల వద్ద నాలుగేళ్ల గరిష్ట స్థాయికి చేరుకుందని రాయిటర్స్ నివేదించింది. ఈ ఆర్థిక సంవత్సరం ఆగస్టులో తొలిసారిగా దేశీయ బ్యాంకుల్లో లిక్విడిటీ లోటులోకి జారుకుంది. నివేదిక ప్రకారం, ఏప్రిల్ 23, 2019 తర్వాత ఇదే అత్యధిక సింగిల్ డే కొరత. మే 19 , జూలై 28 మధ్య స్వీకరించిన ఇంక్రిమెంటల్ డిపాజిట్లలో 10శాతం ఇన్క్రిమెంటల్ క్యాష్ రిజర్వ్ రేషియో (ICRR)గా పక్కన పెట్టాలని ఆర్బీఐ ఆదేశించిన తరువాత ఈ పరిణామం వెలుగులోకి వచ్చింది. ఫలితంగా బ్యాంకులవద్ద మిగులు నగదు నిల్వ తగ్గింది. అయితే ముందుస్తు పన్ను చెల్లింపలు, జీఎస్టీ చెల్లింపులతో నగదు కొరతకు దారితీశాయనిపేర్కొంది. (భారత్-కెనడా ఉద్రిక్తతలు: ఆనంద్ మహీంద్ర సంచలన నిర్ణయం) ఈ క్రమంలోనే బ్యాంకులు ఎంఎస్ఫ్ (మార్జినల్ స్టాండింగ్ సదుపాయం) కింద రికార్డు స్థాయిలో రూ. 1.97 లక్షల కోట్ల రుణాలు, అలాగే ప్రత్యేక డిపాజిట్ సౌకర్యం కింద దాదాపు రూ. 46,724 కోట్లను నిలిపివేసినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది.రూ. 2.50 లక్షల కోట్ల వరకు మొత్తం బయటికి వచ్చే అవకాశం ఉందని అంచనా వేసినట్టు తెలిపింది. ఎందుకంటే అదే రిపోర్టింగ్ పక్షం రోజులలో జంట అవుట్‌ఫ్లోలు (ముందస్తు పన్ను చెల్లింపుల , జీఎస్టీ ) సంభవించాయని బ్యాంకర్లను ఉటంకిస్తూ రాయిటర్స్ పేర్కొంది. రూపాయిపై ఒత్తిడి డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ ఒడిదుడుకులతో వచ్చే ఇబ్బందులను, విజృంభిస్తున్న ద్రవ్యోల్బణం ముప్పును తప్పించుకోవడానికి బ్యాంకులకు ఆర్బీఐ విధించిన ఇంక్రిమెంటల్ క్యాష్ రిజర్వ్ రేషియో (ఐసీఆర్ఆర్) సైతం నగదు లోటుకు దారితీసిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయిప్పుడు. ఈ ఏడాది ఆగస్టు ద్రవ్యసమీక్షలో ఆర్బీఐ ఐసీసీఆర్ను పరిచయం చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే బ్యాంకులు తమ ఇంక్రిమెంటల్ డిపాజిట్లలో 10 శాతాన్ని పక్కనబెట్టాలని ఆదేశించింది.. కాగా, ఇంచుమించుగా వచ్చే నెల మొదటి వారం వరకు బ్యాంకులు ఇదే రకమైన ఒత్తిడిని ఎదుర్కోవచ్చన్న అంచనాను కొటక్ మహీంద్రా బ్యాంక్ ప్రధాన ఆర్థికవేత్త ఉపాసన భరద్వాజ్ వెలిబుచ్చారు. అంతేకాకుండా, డాలరు మారకంలో రూపాయిపై ఈ ఒత్తిడి కొనసాగితే, RBI ద్వారా FX జోక్యంతో మరింత ముప్పు ఉండే అవకాశం ఉందని ఫస్ట్ బ్యాంక్ ఆర్థికవేత్త గౌరా సేన్ గుప్తా రాయిటర్స్‌తో వ్యాఖ్యానించారు. ఐసీఆర్ఆర్తోపాటు, ఆగస్టు నాటి ద్రవ్యసమీక్షలో ఆర్బీఐ ఐసీసీఆర్ను విధింపుతో లిక్విడిటీ బిగుతు పెరుగుతోందంటున్నారు రూపాయిపై ఒత్తిడి ,అంతర్లీన ద్రవ్యోల్బణ నష్టాలను కూడా నిరోధించవచ్చని, స్వల్పకాలిక రేట్లను పెంచడానికి బదులుగా ఆర్బీఐ RBI సమీప కాలంలో ద్రవ్యతను కఠినంగా ఉంచుతుందని భావిస్తున్నారు కోటక్ మహీంద్రా బ్యాంక్ చీఫ్ ఎకనామిస్ట్ ఉపాస్నా భరద్వాజ్. ఈ నెలాఖరు నాటికి ద్రవ్యలోటు తగ్గుతుందని ఆమె తెలిపారు. లిక్విడిటీ లోటు అంటే సరళంగా చెప్పాలంటే, లిక్విడిటీ అంటే ఎంత నగదు తక్షణమే అందుబాటులో ఉంది లేదా ఎంత త్వరగా నగదును పొందగలరు అనేది. ఉదాహరణకు, సేవింగ్స్ ఖాతా కంటే ఐదేళ్ల ఫిక్స్డ్ డిపాజిట్ లిక్విడిటీ తక్కువగా ఉంటుంది. అదే సేవింగ్స్ ఖాతా నుంచి అయితే మనకు అవసరమైనప్పుడు నగదు తీసుకోవచ్చు.బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీ అంటే బ్యాంకుల స్వల్పకాలిక వ్యాపారం, ఆర్థిక అవసరాలను తీర్చడానికి ఎంత నగదు తక్షణమే అందుబాటులో ఉంది అనేది. -
కస్టమర్‌కు ప్రాధాన్యం ఇవ్వండి
ముంబై: వినియోగదారు ఆధారిత ప్రాధాన్య విధానాన్ని అనుసరించాలని బ్యాంకులు, ఆర్థిక సేవల సంస్థలకు ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ జే స్వామినాథన్ సూచించారు. తద్వారా బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకాన్ని బలోపేతం చేయవచ్చన్నారు. బ్యాంకుల కస్టమర్ సరీ్వస్ ఇన్‌చార్జ్‌లు, ఎండీ, ఈడీ తదితర ఉన్నతాధికారులతో గురువారం సమావేశం నిర్వహించారు. కస్టమర్ల ఫిర్యాదులను కచి్చతంగా పరిష్కరించడం, ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని క్రమబదీ్ధకరించడం, కస్టమర్లకు మెరుగైన అనుభవాన్ని అందించేందుకు, మోసాల నివారణ, నష్టాలను తగ్గించుకునేందుకు టెక్నాలజీని వినియోగించుకోవడంపై సమావేశంలో చర్చ జరిగినట్టు ఆర్బీఐ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆర్థిక వ్యవస్థ పట్ల నమ్మకం, విశ్వాసాన్ని పెంచడంతో కస్టమర్ సేవలు కీలక పాత్ర పోషిస్తాయని ఈ సందర్భంగా స్వామినాథన్ పేర్కొన్నారు. కస్టమర్ సేవలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఫిర్యాదులకు అసలు మూల కారణాలు, స్వీకరించిన అధికారే నేరుగా పరిష్కరించడం తదితర ఐదు అంశాలపై దృష్టి పెట్టాలని కోరారు. -
జాతి క్షేమాన్ని మించిన పదవీ కాంక్ష..
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సారథ్యంలోని గత యూపీఏ ప్రభుత్వం అధికార వ్యామోహంతో జాతి ప్రయోజనాలను పక్కనబెట్టిందని, బ్యాంకింగ్ వ్యవస్థను నాశనం చేసిందని ప్రధాని మోదీ ఆరోపించారు. తమ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థలను తిరిగి గాడినపెట్టిందని చెప్పారు. శనివారం ప్రధాని మోదీ రోజ్‌గార్ మేళాను వర్చువల్‌గా ప్రారంభించి, మాట్లాడారు. కార్యక్రమంలో భాగంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో 70వేల మందికి నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ప్రధాని ప్రసంగించారు. ‘ఆ ఒక్క కుటుంబానికి సన్నిహితులైన కొందరు రాజకీయ నేతలు బ్యాంకుల నుంచి తమ వారికి వేల కోట్ల రూపాయలను ఇప్పించి, ఎప్పటికీ తిరిగి చెల్లించేవారు కాదు. అప్పట్లో జరిగిన ఫోన్ బ్యాంకింగ్ స్కాం అతిపెద్ద కుంభకోణం. అది దేశ బ్యాంకింగ్ వ్యవస్థ వెన్ను విరిచేసింది’అని ప్రధాని తెలిపారు. ఇప్పుడు అందరూ ఫోన్ బ్యాంకింగ్‌ను వాడుకుంటున్నారు. కానీ, అప్పట్లో జరిగింది వేరని వ్యాఖ్యానించారు. ప్రపంచంలోనే పటిష్టమైన బ్యాంకింగ్ వ్యవస్థ ఉన్న దేశాల్లో భారత్ కూడా ఉందన్నారు. తమ ప్రభుత్వం తీసుకున్న బ్యాంకుల నిర్వహణను బలోపేతం చేయడం, బ్యాంకులను విలీనం చేయడం, ఈ రంగంలో వృత్తినైపుణ్యంను పెంచడం వంటి అనేక చర్యలతో ఇది సాధ్యమైందని వివరించారు. గతంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు వేలాది కోట్ల నిరర్ధక ఆస్తులతో కునారిల్లుతూ ఉండేవి. కానీ, నేడవి రికార్డు స్థాయిలో లాభాలను ఆర్జిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రజలకు సేవలందించడంలో, ముద్ర వంటి వివిధ ప్రభుత్వ పథకాలను అమలు చేయడంలో బ్యాంకింగ్ రంగ ఉద్యోగులు శ్రమిస్తున్న తీరు, నిబద్ధతలను ఆయన కొనియాడారు. వాతావరణ కార్యాచరణలో భారత్ ముందుంది పణజి: వాతావరణ కార్యాచరణలో భారతదేశం ముందుండి నడిపిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. హరితాభివృద్ధి, ఇంధన పరివర్తన వంటి వాతావరణ పరిరక్షణ హామీలను ఒక్కటొక్కటిగా నెరవేరుస్తోందని అన్నారు. శనివారం ప్రధాని గోవాలో జరుగుతున్న జీ20 కూటమి దేశాల ఇంధన మంత్రుల సమావేశాన్ని ఉద్దేశించి వర్చువల్‌గా మాట్లాడారు. స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యంలో 50 శాతం మృత్తికేతర ఇంధన వనరుల నుంచి 2030నాటికి సాధించాలన్న లక్ష్యం కోసం భారత్ ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు. పవన, సౌర విద్యుదుత్పాదనలో సైతం అగ్రగామి దేశాల సరసన భారత్ నిలిచిందని తెలిపారు. వీటితోపాటు తక్కువ వడ్డీకే రుణాలివ్వడం ద్వారా అభివృద్ధి చెందుతున్న దేశాలకు చేయూతనివ్వాల్సిన బాధ్యత ఉందని చెప్పారు. ‘సాంకేతికతలో అంతరాలను పూడ్చటం, ఇంధన భద్రత పెంపు, సరఫరా గొలుసుల్లో వైవిధ్యత వంటివాటి కోసం నూతన మార్గాలను అన్వేషించాల్సి ఉంది. భవిష్యత్తు ఇంధనాల కోసం సహకారాన్ని బలోపేతం చేసుకోవాల్సి ఉంది. ఇంధన భద్రతను పెంచుకునేందుకు దేశాల మధ్య గ్రిడ్లు, అనుసంధానతలపై దృష్టి సారించాలి. పరస్పరం అనుసంధానించిన గ్రీన్‌గ్రిడ్లు గొప్ప మార్పును తీసుకువస్తాయి’అని ప్రధాని మోదీ అన్నారు. వీటివల్ల వాతావరణ లక్ష్యాలు, హరిత పెట్టుబడుల సాధన, కోట్లాదిమందికి హరిత ఉద్యోగావకాశాల కల్పనకు వీలవుతుందని తెలిపారు. ‘ఇంధనం లేనిదే అభివృద్ధి, భవిష్యత్తు స్థిరత్వంపై చర్చ పూర్తికాదు. వ్యక్తుల నుంచి దేశాల వరకు అభివృద్ధిలో అన్ని స్థాయిల్లోనూ ఇంధన కీలకంగా మారిందని పేర్కొన్నారు. -
భారత్ ఆర్థిక వ్యవస్థ పటిష్టం
ముంబై: భారత్ ఎకానమీ పటిష్టంగా, నిలకడగా పురోగమిస్తోందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఫైనాన్షియల్ స్టెబిలిటీ నివేదిక (ఎఫ్ఎస్ఆర్) ఉద్ఘాటించింది. తగిన మూలధనం, అలాగే మొండిబకాయిలు (ఎన్పీఏ) బహుళ సంవత్సర కనిష్ట స్థాయికి తగ్గుతూ కొనసాగుతున్న పటిష్ట బ్యాంకింగ్ వ్యవస్థ, ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు వంటి ఆర్థిక మూలస్తంభాల పటిష్టత వంటి అంశాలు ఎకానమీకి వెన్నుదన్నుగా నిలుస్తున్నట్లు నివేదిక వివరించింది. ఈ మేరకు ఆర్థిక స్థిరత్వం, అభివృద్ధి మండలి (ఎఫ్ఎస్డీసీ) సబ్–కమిటీ ఇచి్చన నివేదికలో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ముందుమాట రాస్తూ, అంతర్జాతీయంగా తీవ్ర అనిశ్చితి నెలకొన్నప్పటికీ, భారత్ ఎకానమీ పటిష్ట రికవరీ బాటన పయనిస్తోందన్నారు. ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న ఎకానమీల్లో ఒకటి నిలుస్తోందని పేర్కొన్నారు. ఆర్థిక స్థిరత్వం అనే అంశంపై రాజీపడే ప్రశ్నేలేదని, ఈ వ్యవస్థలోని అన్ని స్థాయిల్లోని వారు ఇందుకు తగిన కృషి చేయాలని అన్నారు. సవాళ్లను ఎదుర్కొనడానికి ఇది అవసరమనీ ఉద్ఘాటించారు. నివేదికలోని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ► 2018 మార్చిలో బ్యాంకింగ్ వ్యవస్థలో స్థూల మొండి బకాయిలు, నికర మొండిబకాయిలు వరుసగా 11.5 శాతం, 6.1 శాతాలుగా ఉన్నాయి. 2023 మార్చిలో ఇవి వరుసగా 3.9 శాతం, 1 శాతానికి తగ్గాయి. ► రిటర్న్ ఆన్ అసెట్స్ (ఆర్‌ఓఏ) 2018లో కనిష్ట స్థాయి – 0.2 శాతం నుండి 2023లో 1.1 శాతానికి పెరగడంతో బ్యాంకింగ్ వ్యవస్థ లాభదాయకత మెరుగుపడింది. ► బ్యాంకింగ్ బ్యాలెన్స్ షీట్మెరుగుపడ్డం విస్తృత స్థాయిలో అన్ని రంగాలకూ బ్యాంకింగ్ రుణ వృద్ధినీ పెంచుతోంది. ► 2022–23లో బ్యాంకింగ్ డిపాజిట్ల వృద్ధి 10 శాతం. 2023 జూన్ తొలి నాళ్లలో ఈ రేటు 11.8 శాతానికి పెరిగింది. రూ.2000 నోట్ల ఉపసంహరణా దీనికి ఒక కారణం. ► రిటైల్ రుణాలు మార్చి 2021 నుండి మార్చి 2023 వరకు 24.8 శాతం వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్)ను నమోదుచేసుకున్నాయి. స్థూలంగా చూస్తే ఈ వృద్ధి రేటు 13.8 శాతంగా ఉంది. ► సైబర్ దాడులు, వాతావరణ మార్పు వంటి ఇతర సవాళ్లను పరిష్కరించడానికి అంతర్జాతీయ పరస్పర సహకారం అవసరం. ► జీ 20కి భారత్ నేతృత్వం వహిస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రపంచ దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి తగిన కృషి చేస్తుంది. ‘ఒక భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు’ థీమ్‌తో సవాళ్లపై పోరాటానికి దేశాల మధ్య పరస్పర సహకారానికి, సమన్వయ చర్యలకు భారత్ ప్రయతి్నస్తుంది. -
బలహీన విధానాలతోనే బ్యాంకింగ్ సంక్షోభం
ముంబై: బలహీన వ్యాపార విధానాలే అమెరికాలో బ్యాంకింగ్ సంక్షోభానికి కారణమై ఉండొచ్చని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ అన్నారు. ఈ నేపథ్యంలో దేశీయ బ్యాంకుల వ్యాపార విధానాలను తాము సునిశితంగా పరిశీలిస్తున్నట్టు చెప్పారు. అదే సమయంలో భారత బ్యాంకులు బలంగానే ఉన్నట్టు స్పష్టం చేశారు. అమెరికాలో ఇటీవలే సిలికాన్ వ్యాలీ బ్యాంకులో నిధుల సమస్య తలెత్తడం తెలిసిందే. డిపాజిటర్లలో అభద్రతకు దారితీసి, ఆ ప్రభావం ఇతర బ్యాంకులకూ విస్తరించడం తెలిసిందే. ఈ క్రమంలో శక్తికాంతదాస్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. ‘‘అమెరికాలో ఇటీవలి పరిణామాలు చూస్తే అక్కడ విడిగా ఒక్కో బ్యాంకుల వారీ వ్యాపార విధానాలు సరిగ్గానే ఉన్నాయా? లేవా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. భారత బ్యాంకుల వ్యాపార విధానాలను ఆర్బీఐ మరింత పరిశీలనగా చూడడం మొదలు పెట్టింది. ఒకవేళ లోపాలు ఉంటే అది సంక్షోభానికి దారితీయవచ్చు’’అని శక్తికాంతదాస్ చెప్పారు. ముంబైలో ఓ అంతర్జాతీయ సదస్సును ప్రారంభించిన సందర్భంగా దాస్ ఈ అంశంపై మాట్లాడారు. ‘‘బ్యాంకులు అనుసరించే వ్యాపార విధానాల వల్ల కొన్ని సందర్భాల్లో వాటి బ్యాలెన్స్ షీట్లలోని కొన్ని భాగాల్లో సమస్యలు ఏర్పడొచ్చు. అవి ఆ తర్వాత పెద్ద సంక్షోభానికి కారణం కావచ్చు. అమెరికా, యూరప్ బ్యాంకింగ్‌లో ఇటీవలి పరిణామాలు గమనిస్తే వాటి బ్యాలెన్స్ షీట్లలో సురక్షిత ఆస్తులు అనుకున్న వాటి నుంచే సమస్యలు ఎదురవుతున్నాయని తెలుస్తోంది’’అని దాస్ పేర్కొన్నారు. అమెరికాలో సిలికాన్ వ్యాలీ బ్యాంకు సంక్షోభానికి ఆస్తుల, అప్పుల మధ్య అసమతుల్యత వల్లేనన్న అభిప్రాయం వ్యక్తం అవుతుండడం తెలిసిందే. -
బ్యాంకింగ్ మ్యూచువల్ ఫండ్స్‌కు నష్టాలు
న్యూఢిల్లీ: అమెరికా బ్యాంకుల సంక్షోభం మన దేశంలో బ్యాంకింగ్ స్టాక్స్‌పై ప్రభావం చూపిస్తోంది. ఫలితంగా బ్యాంకింగ్ స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టే పథకాల విలువ గత వారంలో సుమారు 6 శాతం క్షీణించింది. అమెరికాలో సిలికాన్ వ్యాలీ బ్యాంక్ కుప్పకూలిపోవడం, ఆ తర్వాత సిగ్నేచర్ బ్యాంక్ కూడా సంక్షోభంలో పడిపోవడం.. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సేవల రంగంపై ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసేలా చేసింది. స్విట్జర్లాండ్‌కు చెందిన క్రెడిట్ సూసె సైతం నిధుల కటకటను ఎదుర్కోగా.. ఏకంగా ఆ దేశ కేంద్రబ్యాంక్ జోక్యం చేసుకుని నిధులు సమకూరుస్తామని హామీ ఇవ్వా ల్సి వచ్చింది. ఈ పరిణామాలతో మన దేశ బ్యాంక్ స్టాక్స్ 3–13 శాతం మధ్యలో నష్టపోయాయి. ప్రభావం పెద్దగా ఉండదు.. కానీ విదేశాల్లో బ్యాంకుల సంక్షోభాల ప్రభావం నేరుగా మన బ్యాంకులపై ఏమీ ఉండదని నిపుణులు చెబుతున్నారు. బ్యాంకింగ్ రంగ మ్యూచువల్ ఫండ్స్‌లో 16 పథకాలు ఉంటే, ఇవన్నీ కూడా మార్చి 17తో ముగిసిన వారంలో 1.6–6 శాతం మధ్య నష్టాలను చూశాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు చూస్తే వీటిల్లో నికర నష్టం 8–10% మధ్య ఉంది. ఇలా నష్టపోయిన వాటిల్లో ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫండ్, టాటా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫండ్, హెచ్డీఎఫ్సీ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫండ్, ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫండ్, నిప్పన్ ఇండియా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫండ్ ఉన్నాయి. అయితే, ఏడాది కాలంలో ఈ పథకా లు నికరంగా 12 శాతం రాబడిని ఇవ్వడం గమనించొచ్చు. ‘‘స్టాక్ మార్కెట్లలో అస్థిరతలు, వడ్డీ రేట్ల పెరుగుదల ఈ థీమ్యాటిక్ ఫండ్స్ నష్టపోవడానికి కారణాలుగా ఫయర్స్ రీసెర్చ్ హెడ్ గోపాల్ కావలిరెడ్డి తెలిపారు. వడ్డీ రేట్ల పెరుగుదల తర్వాత తక్కు వ వడ్డీ మార్జిన్లు, నిధుల వ్యయాలు పెరగడం, రుణాల వృద్ధిపై ప్రభావం పడినట్టు చెప్పారు. -
డాయిష్ బ్యాంక్ 14% డౌన్
ఫ్రాంక్ఫర్ట్: అంతర్జాతీయంగా బ్యాంకింగ్ వ్యవస్థ సంక్షోభంపై ఆందోళన నెలకొన్న నేపథ్యంలో జర్మనీకి చెందిన డాయిష్ బ్యాంక్ షేర్లపైనా ప్రభావం పడింది. బ్యాంకు షేర్లు శుక్రవారం ఒక దశలో 14 శాతం క్షీణించాయి. ఆ తర్వాత కొంత కోలుకుని సుమారు 9 శాతం క్షీణతతో 8.52 యూరోల వద్ద ట్రేడయ్యాయి. బాండ్లను బీమా చేసేందుకయ్యే వ్యయాలు పెరిగిపోవడం డాయిష్ బ్యాంక్ పరిస్థితిపై ఆందోళనకు కారణమైనట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఇటీవల స్విస్ బ్యాంక్ క్రెడిట్ సూసీ పతనానికి ముందు కూడా ఇలాంటి పరిణామమే చోటు చేసుకోవడం గమనార్హం. అయితే డాయిష్ బ్యాంక్ మరో క్రెడిట్ సూసీ కావచ్చన్న ఆందోళనలను జర్మనీ చాన్స్‌లర్ ఒలాఫ్ షోల్జ్ తోసిపుచ్చారు. బ్యాంక్ పటిష్టంగానే ఉందని స్పష్టం చేశారు. -
అదానీ-హిండెన్‌బర్గ్ వివాదం: ఆర్బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు
సాక్షి,ముంబై: అదానీ గ్రూపు- హిండెన్‌బర్గ్ రిపోర్ట్ వివాదం నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ పరోక్షంగా స్పందించారు. అదానీ గ్రూప్ పేరును నేరుగా ప్రస్తావించకుండానే అదానీ గ్రూప్‌పై ఆరోపణలు, బ్యాంకింగ్ రంగంపై ప్రభావంపై గవర్నర్ శక్తికాంత దాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగత సంఘటన లేదా కేసు ద్వారా బ్యాంకులు ప్రభావితం అయ్యే అవకాశం లేదని అన్నారు. భారత బ్యాంకింగ్ వ్యవస్థ బలంగా ఉందని, మరింత బలోపేతం చేసుకునేందుకే చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆర్బీఐ పాలసీ ప్రకటనల అనంతరం విలేకరుల సమావేశంలో శక్తికాంత దాస్‌మాట్లాడుతూ, నిర్దిష్ట కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగా బ్యాంకులు రుణాలు ఇవ్వవని పేర్కొన్నారు. వాటి బలం, ఫండమెంటల్స్, నగదు ప్రవాహం, ఇతర అంశాల ఆధారంగా రుణాలు ఇస్తారని చెప్పారు. కార్పొరేట్ల కంపెనీల రుణాలపై మాట్లాడుతూ అన్ని బ్యాంకులు పెద్ద ఎక్స్పోజర్ మార్గదర్శకాలను పాటించాయని కూడా ఆయన స్పష్టం చేశారు. అలాగే సంక్షోభం అంచున ఉన్న అదానీ గ్రూప్‌కు ఇచ్చిన రుణాల గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన పని లేదని శక్తికాంత దాస్ పేర్కొన్నారు. దేశంలోని బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు నిలకడగా కొనసాగుతున్నాయని ప్రకటించరాఉ. -
ఎడ్యుకేషన్‌లోన్ కావాలా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..
విదేశాల్లో చదువుకుని, కెరీర్‌ను గ్రాండ్‌గా మొదలు పెట్టాలన్నది చైతన్య (24) డ్రీమ్. బీటెక్ చేసిన తర్వాత రెండేళ్లపాటు సాఫ్ట్వేర్ డెవలపర్‌గా పనిచేశాడు. ఫ్రాన్స్‌లోని మాంట్పెల్లియర్ బిజినెస్ స్కూల్లో ఎంఎస్సీ డిగ్రీ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్నాడు. డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ కోర్సుకు పాక్షికంగా స్కాలర్ షిప్ రావడంతో అతడు ఎంతో సంతోషించాడు. కానీ, అప్పుడే అసలు సవాలు ఎదురైంది. వచ్చిన స్కాలర్షిప్ కొద్ది మొత్తమే, మిగిలిన మొత్తాన్ని రుణం ద్వారా సమకూర్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. విద్యా రుణం సులభంగా లభిస్తుందని అనుకోవచ్చు. కానీ, ఆచరణలో ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. నెల రోజుల పాటు ప్రశాంతత కోల్పోయి అతడు చేసిన ప్రయత్నం ఫలించింది. ప్రతిష్టాత్మక విద్యా సంస్థలో సీటు కావడంతో బ్యాంకు విద్యా రుణానికి ఓకే చెప్పింది. అందుకే, విద్యా రుణం పొందడం అనుకున్నంత సులభం కాదు. రుణం ఇచ్చే సంస్థ అన్ని విషయాలను స్పృశిస్తుంది. ఎలా వ్యవహరిస్తే సులభంగా రుణం లభిస్తుంది? ఈ విషయంలో ఉన్న సవాళ్లు, వాటిని అధిగమించడంపై అవగాహన కల్పించే కథనమే ఇది. ఏటా వేలాది మంది భారత విద్యార్థులు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళుతున్నారు. విదేశాంగ శాఖ వద్దనున్న తాజా సమాచారం మేరకు.. కరోనా తర్వాత కూడా విదేశాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్యలో వృద్ధి కనిపిస్తోంది. 2021లో 11 లక్షల మంది భారత విద్యార్థులు విదేశీ చదువుల కోసం వెళ్లారు. 2024లో భారత్ నుంచి సుమారు 18 లక్షల మంది విదేశాల్లో ఉన్నత విద్యను ఎంపిక చేసుకోవచ్చని కన్సల్టెన్సీ సంస్థ రెడ్‌సీర్ అంచనా. వారు చేసే ఖర్చు వార్షికంగా 80 బిలియన్ డాలర్లు (రూ.6.16 లక్షల కోట్లు) ఉంటుందని ఈ సంస్థ పేర్కొంది. విద్యా రుణాన్ని నమ్ముకుని విదేశీ విద్యకు ప్లాన్ చేసుకునే వారు ముందుగానే ఇందుకు సంబంధించి వాస్తవ అంశాలను, పూర్తి సమాచారాన్ని తెలుసుకోవాలి. క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా విచారించుకోవాలి. ‘‘ముఖ్యంగా బ్యాంకింగ్ రంగం విద్యా రుణాలను పరిమితంగానే మంజూరు చేస్తోంది. వచ్చిన ప్రతి దరఖాస్తుకు ఆమోదం చెప్పడం లేదు. గుర్తింపు పొందిన యూనివర్సిటీలు, విద్యా సంస్థల పూర్తి జాబితానే చాలా బ్యాంకుల వద్ద లేదంటే విద్యా రుణాల విషయంలో వాటికి ఎంత ఆసక్తి ఉందో అర్థం చేసుకోవచ్చు’’అని లాంచ్మైకెరీర్ అనే కెరీర్ కౌన్సెలింగ్ ప్లాట్‌ఫామ్ గ్లోబల్ లీడర్ సుష్మాశర్మ తెలిపారు. బ్యాంకును గుర్తించడం.. విద్యా సంస్థలు, దేశాలకు సంబంధించి పరిమితులు ఉన్నాయి. తమ ముందుకు వచ్చే ప్రతి విదేశీ విద్యా రుణ దరఖాస్తును బ్యాంకులు ఆమోదించవు. పైగా ఒక బ్యాంకుకు సంబంధించి కూడా అన్ని శాఖలు ఈ వ్యాపారం చూడడం లేదు. చైతన్య ముందుగా ఎన్బీఎఫ్సీ నుంచి రుణం తీసుకుందామని అనుకున్నాడు. సులభంగా, వేగంగా వస్తుందని అనుకుని కొన్ని ఎన్బీఎఫ్సీలను సంప్రదించాడు. కానీ, ఒక్కటంటే ఒక్కటీ చైతన్య సీటు సంపాదించిన యూనివర్సిటీ కోర్సులకు రుణాలను ఆఫర్ చేయడం లేదని తెలిసి ఆశ్చర్యపోయాడు. చివరికి ఎస్బీఐని సంప్రదించగా అతడి ప్రయత్నం ఫలించింది. అదీ మెయిన్ బ్రాంచ్‌కు వెళ్లాల్సి వచ్చింది. కావాల్సినంత రుణం.. విదేశీ విద్యా కోర్సు అంటే ఫీజులకే బోలెడు ఖర్చు అవుతుంది. ఇదే పెద్ద సవాలు. విదేశీ విద్యా సంస్థల్లో సీటు కోసం దరఖాస్తు చేసుకునే ముందే ట్యూషన్ పీజులతోపాటు అక్కడ నివసించేందుకు అయ్యే వ్యయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సుష్మాశర్మ సూచించారు. ఇక కావాల్సినంత రుణం లభించక, తాము సొం తంగా సమకూర్చుకోలేని సందర్భాల్లో విద్యార్థులు రాజీమార్గాలను అనుసరించడాన్ని గమనించొచ్చు. కావాల్సి నంత రుణం/నిధులు సమకూరని సందర్భంలో అవసరమైతే కోర్సును లేదంటే విద్యా సంస్థను మార్చే వారు కూడా ఉన్నట్టు ఫ్లై మాస్టర్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ ఎండీ రాజేష్ వర్మ తెలిపారు. ఉద్యోగ అవకాశాలు.. రుణం ఇచ్చే ముందు ఏ బ్యాంకు అయినా, మరో సంస్థ అయినా ఏం చూస్తుంది..? రుణం తీసుకున్న వ్యక్తికి తిరిగి చెల్లించే సామర్థ్యం ఉందా..? అనే కదా.. అలాగే, విద్యా రుణం విషయంలో బ్యాంకులు అభ్యర్థి చేస్తున్న కోర్సు, ఉద్యోగ మార్కెట్లో ఆ కోర్సుకు ఉన్న డిమాండ్‌ను పరిశీలిస్తాయి. ఇందులో భాగంగా విద్యార్థి చదవబోయే విద్యాసంస్థకు ఉన్న పేరు, గుర్తింపు, అందులో చదివిన వారికి ఉపాధి అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి? ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుంటాయి. ‘‘విద్యార్థి కేంబ్రిడ్జ్ లేదా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ వంటి విద్యా సంస్థలకు వెళ్లొచ్చు. కానీ, ఈ తరహా ప్రతిష్టాత్మక, పేరొందిన ఇనిస్టిట్యూషన్స్‌కు నేరుగా దరఖాస్తు చేసుకోవడానికి బదులు విద్యార్థులు ఏజెన్సీలను ఆశ్రయిస్తుంటారు. దాంతో చివరికి పెద్దగా తెలియని యూనివర్సిటీలో అడ్మిషన్‌తో వారు సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. అటువంటప్పుడు విద్యా రుణం కష్టంగా మారుతుంది’’ అని విద్యా రుణాల మార్కెట్‌ప్లేస్ అయిన విమేక్స్కాలర్స్ సహ వ్యవస్థాపకుడు అర్జున్ ఆర్ కృష్ణ తెలిపారు. పేపర్ వర్క్ కావాల్సిన డాక్యుమెంట్లను సిద్ధం చేసుకోవడం ముఖ్యమైన కార్యక్రమం. డాక్యుమెంట్ ప్రక్రియ ఎంత క్లిష్టమో ఇప్పటికే రుణం తీసుకుని విదేశీ విద్యా కోర్సు చేస్తున్న వారిని అడిగితేనే తెలుస్తుంది. విభా షణ్ముఖ్ (33) యూఎస్‌లోని రైస్ యూనివర్సిటీలో పీహెచ్డీ చదువుతున్నారు. డాక్యుమెంటేషన్ ప్రక్రియ ఎంత క్లిష్టతరమో తన అనుభవాన్ని వెల్లడించారు. డల్లాస్‌లోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్‌లో ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదివేందుకు 2013లో ఆయన ఓ ప్రభుత్వ రంగ బ్యాం కులో రుణానికి దరఖాస్తు చేసుకున్నారు. ‘‘బ్యాంకు అడిగిన అన్ని పత్రాలను తీసుకెళ్లి ఇచ్చాను. అయినా కానీ, కోర్సుకు అయ్యే ఖర్చు, ఇతర వ్యయాలకు సంబంధించి యూనివర్సిటీ నుంచి ధ్రువీకరణ పత్రం కావాలని బ్యాంకు అడిగింది. కానీ యూనివర్సిటీల నుంచి ఈ తరహా పత్రాలు పొందడం అదిపెద్ద సవాలు’’అని షణ్ముఖ్ తెలిపారు. తాకట్టు.. దేశీ యూనివర్సిటీల్లో కోర్సుల కోసం రుణాలు తీసుకునేట్టు అయితే బ్యాంకులు తనఖా కోరవు. కానీ, విదేశీ వర్సిటీల్లో విద్య కోసం తీసుకునే రుణాలకు సంబంధించి తనఖా పెట్టాలని బ్యాంకులు అడుగుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వరంగ బ్యాంకులు తనఖా కోరుతున్నాయి. తనఖా కింద స్తిరాస్థి, ప్రావిడెంట్ ఫండ్ లేదా సెక్యూరిటీ డిపాజిట్ ఇస్తే సరిపోతుంది. చాలా ఎన్బీఎఫ్సీలు, ప్రైవేటు బ్యాంకులు తనఖా అడగడం లేదు. మాస్టర్స్ కోర్సులకు తనఖా లేకుండానే ఇవి రుణాలు ఇస్తున్నాయి. వివరాలు సమగ్రంగా తెలుసుకుని ముందడుగు వేయాలి. అధిక వ్యయాలు ప్రభుత్వరంగ బ్యాంకుల్లో విద్యా రుణానికి డాక్యుమెంట్లు సమర్పణ, ఆమోదం ప్రక్రియ కొద్దిగా కష్టం అనిపిస్తుంది. అదే ఎన్బీఎఫ్సీలు, ప్రైవేటు బ్యాంకుల నుంచి విద్యా రుణం సులభంగానే లభిస్తుంది. కాకపోతే ప్రభుత్వరంగ బ్యాంకులతో పోలిస్తే వీటిల్లో వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ చార్జీలు ఎక్కువగా ఉంటుంటాయి. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో విద్యా రుణాలపై రేట్లు 6.9 శాతం నుంచి 12.5 శాతం మధ్య ఉన్నాయి. ప్రైవేటు బ్యాంకుల్లో 10.5 శాతం నుంచి 13 శాతం మధ్య ఉన్నాయి. ఎన్బీఎఫ్సీలు, ప్రైవేటు బ్యాంకులు (ఎక్కువ శాతం) ఇచ్చే విద్యా రుణాలకు మారటోరియం ఉండడం లేదు. దీంతో రుణం మంజూరు చేసిన మరుసటి నెల నుంచే చెల్లింపులు మొదలు పెట్టాల్సి ఉంటుంది. మారటోరియం అంటే.. కోర్సు కాల వ్యవధికి ముగిసిన తర్వాత ఆరు నెలల వరకు రుణానికి చెల్లింపులు చేయక్కర్లేదు. కోర్సు అనంతరం ఉద్యోగం పొందేందుకు వీలుగా ఆరు నెలల వ్యవధి ఉంటుంది. దీనివల్ల విద్యార్థి కుటుంబానికి ఎంతో ఉపశమనం ఉంటుంది. అందుకుని రుణానికి వెంటనే చెల్లింపులు చేయలేని వారు ప్రభుత్వరంగ బ్యాంకుల్లో మారటోరియంతో కూడిన విద్యా రుణానికే ప్రయత్నించాలి. రుణానికి ముందే ప్రణాళిక ఉండాలి.. సాధారణంగా విద్యార్థులు తమ బడ్జెట్ కోణం నుంచి విదేశాల్లో ప్రవేశాలకు ప్రయత్నిస్తుంటారు. అంటే తక్కువ వ్యయాలు అయ్యే ప్రాంతాలను ఎంపిక చేసుకుంటుంటారు. దీనివల్ల అంతగా ప్రాచుర్యం లేని దేశం లేదా విద్యా సంస్థలో చేరాల్సి వస్తుంది. అందుబాటు ధరలు ఏ దేశంలో ఉన్నాయో విచారించుకుని అక్కడ విద్యాసంస్థను ఎంపిక చేసుకుంటున్నారు. ‘‘ఉదాహరణకు ఒక విద్యార్థి రూ.20లక్షలు ఖర్చు చేయగలనని అనుకుంటే ఆమె లేదా అతడు జర్మనీలో ప్రవేశం కోసం ప్రయత్నిస్తున్నారు. అంతకంటే ఎక్కువ బడ్జెట్ పెట్టుకోగలిగితే యూఎస్ లేదా యూకేలో ప్రవేశం కోసం ప్రయత్నం చేస్తున్నారు. విద్యా రుణం పొందే విషయంలో పేరున్న యూనివర్సిటీయే కాకుండా, దేశానికీ ప్రాధాన్యం ఉంటుంది’’అని కృష్ణ వివరించారు. విద్యా సంస్థలు పేరున్నవి, ప్రతిష్టాత్మకమైనవి అయితే బ్యాంకులు తనఖా కోరడం లేదు. ప్రభుత్వరంగ బ్యాంకులు అయితే యూనివర్సిటీలు, కోర్సులతో జాబితాను నిర్వహిస్తున్నాయి. ఏఏ వర్సిటీలు, ఏ కోర్సులకు తక్కువ వడ్డీ రేటు రుణాలు, తక్కువ తనఖాతో మంజూరు చేయాలో ఈ జాబితానే వాటికి ప్రామాణికంగా ఉంటోంది. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలతోపాటు ప్రొడిగీ ఫైనాన్స్, ఎంపవర్ ఫైనాన్సింగ్ తదితర అంతర్జాతీయ సంస్థలు సైతం విద్యా రుణాలు ఇస్తున్నాయి. కొన్ని యూనివర్సిటీలు విదేశీ విద్యార్థులకు విద్యారుణాల పరంగా సాయాన్ని అందిస్తున్నాయి. ‘‘గ్రామీణ ప్రాంతాల్లో ఆస్తులు ఉన్నవారు, సరైన పత్రాలను అందించలేని వారికి విద్యా రుణం పరంగా ప్రైవేటు బ్యాంకులు సౌకర్యం’’అని కృష్ణ తెలిపారు. స్కాలర్షిప్ ‘‘విదేశీ విద్య కోసం వెళ్లే వారిలో కోర్సుకు అయ్యే వ్యయం మేర పూర్తి స్కాలర్షిప్ పొందే అవకాశం 2–3 శాతం మందికే ఉంటుంది. కానీ, పాక్షిక స్కాలర్షిప్ను అందించే విద్యా మండళ్లు, ఇనిస్టిట్యూషన్స్ కూడా ఉన్నాయి’’అని కృష్ణ తెలిపారు. దరఖాస్తు సమయంలోనే స్కాలర్షిప్ కోసం ప్రయత్నించాలని ఆయన సూచించారు. ఇందుకోసం ఎన్నో పథకాలు అవకాశాలున్నట్టు చెప్పారు. సున్నా వడ్డీ రుణాలు, విరాళాలు కూడా అందుబాటులో ఉన్నట్టు తెలిపారు. టాటా ఫౌండేషన్, అగాఖాన్ ఫౌండేషన్ తదితర సంస్థలు సాయం అందిస్తున్నాయి. స్కాలర్షిప్ పొందడంలో సాయపడే జ్ఞాన్‌ధన్, విమేక్ సొల్యూషన్స్ తదితర సంస్థలు కూడా ఉన్నాయి. క్రెడిట్ స్కోరు విద్యా రుణం విషయంలోనూ మంచి క్రెడిట్ స్కోరు సాయపడుతుంది. దరఖాస్తు ఆమోదానికే ఎక్కువ అవకాశం ఉంటుంది. కనుక పిల్లలను ఉన్నత విద్య కోసం విదేశాలకు పంపించాలనుకునే వారు మంచి క్రెడిట్ స్కోరు ఉండేలా చర్యలు తీసుకోవాలి. కాలేజీకి వచ్చిన పిల్లలు ‘బై నౌ పే లేటర్’ సదుపాయాలను విచ్చలవిడిగా ఉపయోగించుకుని చెల్లించకుండా వదిలేస్తున్నారు. ఈ తరహా చర్యలు రుణాలకు అడ్డంకిగా మారతాయి. విదేశ విద్య ప్రణాళిక ఉన్న వారు ఎట్టి పరిస్థితుల్లోనూ క్రెడిట్ హిస్టరీలో మచ్చ పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. తల్లిదండ్రులూ ఈ విషయంలో పిల్లల వ్యయాల పట్ల శ్రద్ధ చూపాలి. డాక్యుమెంట్లు విద్యా రుణానికి కేవైసీ డాక్యుమెంట్లు అన్నీ సిద్ధం చేసుకోవాలి. కేవైసీ అంటే గుర్తింపు, వయసు, చిరునామాను ధ్రువీకరించేవి. వీటితోపాటు గ్రాడ్యుయేషన్ మార్కుల మెమో షీటు, సెకండరీ స్కూల్, హైస్కూల్ ఇలా విద్యకు సంబంధించి అన్ని మెమో పత్రాలను దగ్గర ఉంచుకోవాలి. తల్లిదండ్రులు లేదంటే సంరక్షకుల ఆదాయ రుజువు సర్టిఫికెట్ అవసరం. తనఖా కోసం ఉంచతగిన ఇల్లు, పొలం, ప్లాట్, ఫిక్స్డ్ డిపాజిట్ లేదంటే పీపీఎఫ్ ఖాతా పాస్ బుక్, యూనివర్సిటీలో ప్రవేశాన్ని ధ్రువీకరిస్తూ మంజూరు చేసే లేఖ, కోర్సు ఫీజుల చెల్లింపుల షెడ్యూల్, స్కాలర్షిప్ లెటర్, రుణ గ్రహీత బ్యాంకు స్టేట్మెంట్ (చివరి ఆరు నెలలు), తల్లిదండ్రి లేదా సంరక్షకుడి బ్యాంకు ఖాతా స్టేట్మెంట్, ఆదాయపన్ను రిటర్నుల పత్రాలు, తల్లిదండ్రుల ఆదాయపన్ను రిటర్నుల పత్రాలు సిద్ధం చేసుకోవాలి. కొన్ని బ్యాంకులు రుణ దరఖాస్తుదారుడి వాటా కింద చెల్లించే మొత్తానికి మూలాన్ని అడుగుతాయి. అవి కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఉద్యోగ అవకాశాలు చూడాలి రుణం సాయంతో విదేశీ విద్య కోసం ప్రయత్నించే వారు చూడాల్సిన ముఖ్యమైన వాటిల్లో.. కోర్సు అనంతరం ఉపాధి అవకాశాలు ఒకటి. దీనివల్ల తీసుకునే రుణాన్ని తిరిగి తీర్చివేసే సామర్థ్యాలపై స్పష్టత తెచ్చుకోవచ్చు. విద్యా రుణాల్లో పెరుగుతున్న ఎగవేతలు ఈ విషయంలో ముందు జాగ్రత్త అవసరమని తెలియజేస్తన్నాయి. ప్రభుత్వరంగ బ్యాంకులు ఇచ్చిన విద్యా రుణాల్లో 9.55 శాతం నిరర్థక ఆస్తులుగా (ఎన్పీఏలు) 2020లో వర్గీకరించినట్టు 2021 పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం స్వయంగా తెలిపింది. కోర్సు అనంతరం అక్కడే కొంతకాలంపాటు ఉండి ఉపాధి అవకాశాన్ని సొంతం చేసుకోవాలన్నది నిపుణుల సూచన. ‘‘గతంలో అయితే కొన్ని దేశాలు కోర్సు అనంతరం కేవలం కొన్ని నెలల పాటే ఉపాధి అవకాశాల అన్వేషణకు వీలుగా ఉండనిచ్చేవి. కానీ, ఇప్పుడు బ్రిటన్ సహా చాలా దేశాలు గ్రాడ్యుయేట్ రూట్ ప్రోగ్రామ్‌లను ప్రవేశపెట్టాయి. వీటి కింద ఉన్నతవిద్య అనంతరం అక్కడే కొన్నేళ్లపాటు ఉండి ఉద్యోగం చేసుకోవచ్చు’’అని ఓ కన్సల్టెన్సీ అధినేత తెలిపారు. -
రూ.500 దొంగనోట్లు పెరుగుతున్నాయ్: తస్మాత్ జాగ్రత్త!
ముంబై: బ్యాంకింగ్ వ్యవస్థ మార్చితో ముగిసిన 2021–22 ఆర్థిక సంవత్సరంలో 79,669 రూ. 500 డినామినేషన్ నకిలీ కరెన్సీ నోట్లను గుర్తించింది. 2020–21 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఈ సంఖ్య రెట్టింపని ఆర్బీఐ వార్షిక నివేదిక తెలిపింది. ఇక రెండువేల నోట్ల విషయంలో గుర్తించిన నకిలీ సంఖ్య 13,604గా ఉంది. 2020–21తో పోల్చితే ఈ సంఖ్య 54.6 శాతం అధికం. 2016లో అమలులో ఉన్న రూ. 500, రూ. 1,000 నోట్ల రద్దు ప్రధాన లక్ష్యాలలో ఒకటి నకిలీ కరెన్సీ నోట్ల చెలామణిని అరికట్టడం కావడం గమనార్హం. కాగా, ఇందుకు సంబంధించి తాజా పరిస్థితి ఏమిటన్నది గణాంకాల్లో పరిశీలిస్తే... ► 2020–2021 ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా 2,08,625 నకిలీ నోట్లను గుర్తిస్తే, 2021–22లో ఈ సంఖ్య 2,30,971కి చేరింది. ► 2020–21తో పోల్చితే 2021–22లో రూ.10, రూ.20, రూ.200, రూ.500 (కొత్త డిజైన్), రూ. 2,000ల విలువ కలిగిన నకిలీ నోట్లలో వరుసగా 16.4 శాతం, 16.5 శాతం, 11.7 శాతం, 101.9 శాతం, 54.6 శాతం పెరుగుదల నమోదైంది. ► అయితే ఇదే కాలంలో రూ.50, రూ.100 దొంగ నోట్లు వరుసగా 28.7%, 16.7% తగ్గడం గమనార్హం. ► 2021–22లో గుర్తించిన మొత్తం నకిలీ నోట్లలో 6.9 శాతం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గుర్తించగా, 93.1 శాతం నోట్లను ఇతర బ్యాంకులు పసిగట్టాయి. ► 2021 ఏప్రిల్ నుండి 2022 మార్చి 31 వరకు కరెన్సీ ప్రింటింగ్‌పై చేసిన మొత్తం వ్యయం రూ. 4,984.8 కోట్లు. అంతకుముందు సంవత్సరం (2020 జూలై 1 నుండి 2021 మార్చి 31 వరకు) ఈ మొత్తం రూ. 4,012.1 కోట్లు. 2021 మార్చికి ముందు ఆర్బీఐ జూలై–జూన్ మధ్య కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పరిగణించేది. అయితే 2021 ఏప్రిల్ నుంచి ‘ఏప్రిల్–మార్చి’ని ఆర్థిక సంవత్సరంగా మార్చారు. ► 2021–22 ఆర్థిక సంవత్సరంలో పాడైపోయిన నోట్లను వెనక్కు తీసుకోడానికి సంబంధించిన సంఖ్య 88.4 శాతం పెరిగి 1,878.01 కోట్లకు చేరింది. 2020–21లో ఈ సంఖ్య 997.02 కోట్లు. -
బ్యాంకింగ్ వ్యవస్థలో చేరిపోనున్న పోస్టాఫీసులు
సాక్షి, హైదరాబాద్: బ్యాంకు లావాదేవీలకు దూరంగా ఉంటూ... పోస్టాఫీసునే బ్యాంకుగా భావించే కోట్ల మందికి ఇది నిజ్జంగా శుభవార్తే. ఎందుకంటే కొన్నేళ్లుగా ‘పోస్టల్ బ్యాంక్’ మాట వినిపిస్తున్నా బ్యాంకుకు ఉండాల్సిన చాలా లక్షణాలు పోస్టాఫీసులకింకా రాలేదు. ఇదిగో... వీటన్నిటినీ కోర్ బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకొస్తామని నిర్మల హామీనిచ్చారు. అంటే పోస్టాఫీసు ఖాతాదారులంతా ఇకపై ఎక్కడి నుంచైనా ఆన్లైన్లో డిపాజిట్లు చేయొచ్చు. వేరే ఖాతాలకు నగదు బదిలీ చేయొచ్చు. ఆర్డీ, ఎఫ్డీ సహా బ్యాంకుల నుంచి పొందే ఆన్లైన్ సేవలన్నీ పొందొచ్చు. కాలం చెల్లిన సేవలకు క్రమంగా స్వస్తి చెబుతూ...ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్నీ అందిపుచ్చుకొని వినూత్న ఆలోచనలు, సరికొత్త సేవలతో ముందడుగు వేస్తున్న పోస్టాఫీసులకు మహర్దశ పట్టనుంది. ఇప్పటికే వాణిజ్య బ్యాంకులకు దీటుగా ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబి) ఏర్పాటు చేసి దాని ద్వారా పోస్టాఫీసుల్లో ప్రాథమిక బ్యాంకింగ్ కార్యకలాపాలకు శ్రీకారం చుట్టింది. పోస్టాఫీసులతో పాటు ఇంటి వద్దకు కూడా బ్యాంకింగ్ సేవలు అందిస్తోంది. తాజాగా కేంద్ర బడ్జెట్– 2022లో పోస్టాఫీసుల్లో పూర్తి స్థాయిలో బ్యాంకింగ్ సేవలు ప్రవేశ పెడుతున్నట్లు ప్రకటించడం మరింత కలిసి వచ్చే అంశం. ఇక పోస్టాఫీసుల ద్వారా ఆన్లైన్ బ్యాంకింగ్,నెట్ బ్యాంకింగ్, ఏటీఎం సేవలు అందుబాటులో రానున్నాయి. ఇప్పటికే ఐపీపీ బ్యాంక్ పోస్టాఫీసుల ద్వారా మూడు రకాల జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ ఖాతాల సేవలు అందిస్తోంది. చదవండి: బ్యాంకులు, ఏటీఎంలకు వెళ్లకుండానే పీఎం కిసాన్, రైతుబంధు డబ్బులు -
డిపాజిట్ బీమాతో బ్యాంకులపై ధీమా
న్యూఢిల్లీ: ప్రభుత్వం ప్రవేశపెట్టిన డిపాజిట్ బీమా సంస్కరణలు .. బ్యాంకింగ్ వ్యవస్థపై ఖాతాదారుల్లో విశ్వాసాన్ని మరింతగా పెంచగలవని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భవిష్యత్తులో బ్యాంకు విఫలమైనా, డిపాజిటర్ల సొమ్ము భద్రంగా ఉంటుందనే భరోసా ఈ సంస్కరణలతో లభించిందని ’డిపాజిటర్స్ ఫస్ట్’ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. బ్యాంకు డిపాజిట్లకు సంబంధించి బీమా పరిమితిని ప్రభుత్వం ఇటీవల రూ. 5 లక్షలకు పెంచిన సంగతి తెలిసిందే. సంక్షోభంలో ఉన్న బ్యాంకుపై ఆర్బీఐ మారటోరియం విధించిన పక్షంలో ఈ స్థాయి వరకూ డిపాజిట్లు ఉన్న వారు.. 90 రోజుల్లోగా తమ డబ్బు పొందేందుకు ఇది ఉపయోగపడుతుంది. సంబంధిత చట్టాన్ని అమల్లోకి తెచ్చాక గత కొద్ది రోజుల్లో సుమారు 1 లక్ష మంది పైగా ఖాతాదారులకు రూ. 1,300 కోట్ల పైచిలుకు అందిందని ప్రధాని చెప్పారు. ఆర్బీఐ మారటోరియం ఆంక్షలు ఎదుర్కొంటున్న మిగతా బ్యాంకుల్లోని మరో 3 లక్షల మంది ఖాతాదారులకు కూడా త్వరలో వారి డిపాజిట్ మొత్తం లభించగలదని ఆయన తెలిపారు. 16 పట్టణ సహకార బ్యాంకుల డిపాజిట్‌దారుల నుంచి వచ్చిన క్లెయిమ్స్‌కు సంబంధించి తొలి విడత చెల్లింపులను డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ఇటీవలే విడుదల చేసిందని మోదీ చెప్పారు. రెండో విడత డిసెంబర్ 31న విడుదల కానున్నట్లు పేర్కొన్నారు. డిపాజిటర్ల ప్రయోజనాలపై ప్రత్యేక దృష్టి..: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఖాతాదారుల ప్రయోజనాలను పరిరక్షించడంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెడుతోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. దేశ పురోగతిలో బ్యాంకులు కీలక పాత్ర పోషిస్తాయని, బ్యాంకులు బాగుండాలంటే డిపాజిటర్ల సొమ్ము సురక్షితంగా ఉండటం కూడా చాలా ముఖ్యమని ఆమె పేర్కొన్నారు. అటు మధ్యతరగతి గృహ కొనుగోలుదారుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని .. ఆర్థిక సమస్యలతో నిల్చిపోయిన పలు హౌసింగ్ ప్రాజెక్టులకు నిధులు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పారు. అధిక వడ్డీలకు ఆశపడితే రిస్కు: ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ అధిక వడ్డీ రాబడుల కోసం ఆశపడితే అసలుకే ఎసరు వచ్చే ముప్పు ఉంటుందని డిపాజిట్‌దారులను రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ హెచ్చరించారు. అధిక రాబడులు లేదా అధిక వడ్డీ రేట్లతో రిస్కులు కూడా ఎక్కువగానే ఉంటాయన్న సంగతి గుర్తుంచుకోవాలని ’డిపాజిటర్స్ ఫస్ట్’ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా సూచించారు. -
బ్యాంకింగ్ లిక్విడిటీలో తీవ్ర ఒడిదుడుకులు!
ముంబై: బ్యాంకింగ్ లిక్విడిటీ (ద్రవ్య లభ్యత)లో గత నెల నవంబర్‌లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. బ్యాంక్ డిపాజిట్లు 2021 నవంబర్ 5తో ముగిసిన 15 రోజుల్లో భారీగా రూ.3.3 లక్షల కోట్లు పెరిగాయి. పక్షం రోజుల్లో ఇంత స్థాయిలో డిపాజిట్ల పెరుగుదల 24 సంవత్సరాల్లో (1997 తరువాత) ఇది ఐదవసారి. అయితే నవంబర్ 5 నుంచి మరో పక్షం రోజులు గడిచేసరికి అంటే 2021 నవంబర్ 19వ తేదీ నాటికి బ్యాంక్ డిపాజిట్లు భారీగా రూ.2.7 లక్షల కోట్లు క్షీణించాయి. ఒక్కసారిగా ఇలా బ్యాంక్ డిపాజిట్ల పెరుగుదల– క్షీణతలకు కారణమేమిటన్న అంశంపై ఎస్బీఐ రిసెర్చ్ దృష్టి సారించింది. నిజానికి దీపావళి వారంలో కరెన్సీ డిపాజిట్ల ఒడిదుడుకులకు కారణం ఏమిటన్నది నివేదిక దృష్టి సారించిన అంశం. స్టాక్ మార్కెట్ ర్యాలీ అంచనాలుసహా పలు అంశాలను నివేదిక ప్రస్తావించింది. స్టేట్ బ్యాంక్ గ్రూప్ ముఖ్య ఆర్థిక సలహాదారు సౌమ్య కాంతి ఘోష్ ఈ నివేదికాంశాలను వెల్లడించారు. ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ►భారీ డిపాజిట్లు కేవలం కొన్ని సందర్భాల్లోనే చోటుచేసుకున్నాయి. 1997లో ఈ తరహా భారీ డిపాజిట్ల పరిణామం చోటుచేసుకుంది. అటు తర్వాత 2016 నవంబర్ 25 వరకు అంటే పెద్ద నోట్ బ్యాన్ తర్వాత పక్షం రోజులలో రూ. 4.16 లక్షల కోట్ల డిపాజిట్లు జరిగాయి. అంతక్రితం 26 సెప్టెంబర్ 2016 వరకు జరిగిన పక్షం రోజుల్లో రూ. 3.55 లక్షల కోట్ల డిపాజిట్లు వచ్చాయి. 29 మార్చి 2019 నాటికి పక్షం రోజుల్లో రూ. 3.46 లక్షల కోట్లు డిపాజిట్లు జరిగాయి.అంతక్రితం ఏప్రిల్ 1, 2016తో ముగిసిన పక్షం రోజుల్లో రూ. 3.41 లక్షల కోట్ల డిపాజిట్లు వచ్చాయి. మళ్లీ అంత స్థాయిలో 2021 నవంబర్ 5తో ముగిసిన 15 రోజుల్లో భారీగా రూ.3.3 లక్షల కోట్ల డిపాజిట్లు జరిగాయి. ►2016 నవంబర్ 25తో ముగిసిన పక్షం రోజుల్లో జరిగిన భారీ డిపాజిట్లు (రూ.4.16 లక్షల కోట్లు) పెద్ద నోట్ల రద్దు ప్రభావమన్నది సుస్పష్టం. అదే ఏడాది ఏప్రిల్ 1తో ముగిసిన పక్షం రోజుల్లో జరిగిన డిపాజిట్లు (రూ.3.41 లక్షల కోట్లు) సీజనల్ సంవత్సరాంత అధిక డిపాజిట్లుగా భావించవచ్చు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి మూడు నెలల ముందు (26 సెప్టెంబర్ 2016 వరకు జరిగిన పక్షం రోజుల్లో రూ. 3.55 లక్షల కోట్ల డిపాజిట్లు) భారీ డిపాజిట్లు జరగడం గమనార్హం. ►డిపాజిట్లు, ఉపసంహరణల్లో భారీ ఒడిదుడుకుల పరిస్థితులు లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) నిర్వహణ, ఆర్థిక స్థిరత్వం లేదా డిజిటలైజేషన్ ద్వారా కస్టమర్ చెల్లింపు అలవాట్లలో ప్రవర్తనా ధోరణిలో మార్పు వంటి అంశాలను నిశితంగా గమనించాల్సిన అవసరాన్ని ప్రతిబింబిస్తోంది. ►కంపెనీల ఐపీఓలు, స్టాక్ మార్కెట్లు భారీగా పెరగవచ్చన్న అంచనాలు నవంబర్ 5తో ముగి సన పక్షం రోజుల్లో డిపాజిట్లు భారీగా పెరగడానికి కారణం కావచ్చు. అటువంటి ర్యాలీ కార్యరూపం దాల్చకపోవడంతో డిపాజిట్లు భారీగా వెనక్కు మళ్లి ఉండచచ్చు. ►ఎన్ఎస్ఈ డేటా ప్రకారం, 2021 సెప్టెంబర్‌లో నెలవారీ ఇన్వెస్టర్ రిజిస్ట్రేషన్ల సంఖ్య రికార్డు స్థాయిలో 15.6 లక్షలకు చేరింది. 2021 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య దాదాపు 50 లక్షల మం ది అదనపు కొత్త ఇన్వెస్టర్లు రిజిస్టర్ అయ్యారు. ►బ్యాంకుల్లో భారీ డిపాజిట్ల నేపథ్యంలో స్థిర రివర్స్ రెపో విండో (బ్యాంకులు తమ అదనపు నిధులను ఆర్బీఐ వద్ద డిపాజిట్ చేయడానికి ఉద్దేశించింది. దీనిపై వడ్డీరేటు ప్రస్తుతం 3.35 శాతం) మొత్తాలు భారీగా పెరిగాయి. అక్టోబర్ 19న రివర్స్ రెపో పరిమాణం 0.45 లక్షల కోట్లయితే, నవంబర్ 19 నాటికి ఈ పరిమాణం రూ.2.4 లక్షల కోట్లకు ఎగసింది. 2021 డిసెంబర్ 1 వరకూ ఈ పరిమాణం దాదాపు ఇదే స్థాయిలో కొనసాగుతోంది. ►2021 నవంబర్ 19 నుంచి 2022 మార్చి 25 వరకూ బ్యాంకుల్లో డిపాజిట్లు, రుణ వృద్ధి రూ. 5 లక్షల కోట్లమేర నమోదయితే, 2021–22 ఆర్థిక సంవత్సరంలో డిపాజిట్ల వృద్ధి దాదాపు 12 శాతంగా, రుణ వృద్ధి 8.5 శాతంగా ఉంటుంది. -
బ్యాంకుల ప్రైవేటీకరణకు త్వరలో చట్ట సవరణ!
న్యూఢిల్లీ: బ్యాంకింగ్‌లో మెజారిటీ వాటాల విక్రయానికి అనుగుణంగా బ్యాంకింగ్ చట్ట సవరణ బిల్లు, 2021ను 29వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ప్రవేశపెట్టడానికి కేంద్రం సిద్ధమవుతోంది. తాజా చట్ట సవరణ బిల్లులో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కనీస ప్రభుత్వ వాటాను 51 శాతం నుండి 26 శాతానికి తగ్గించే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి. అయితే దీనిపై ఇంకా కేంద్ర మంత్రివర్గం ఒక తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలుస్తోంది. రూ.1.75 లక్షల కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియలో భాగంగా రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రైవేటీకరించాలని 2021–22 బడ్జెట్ నిర్దేశించిన సంగతి తెలిసిందే. -
మరో సంక్షోభం దిశగా అఫ్గన్! ఐరాస హెచ్చరిక
తాలిబన్ల ఆక్రమణ, అల్లకల్లోల పరిస్థితులు, బయటి దేశాలతో వర్తక వాణిజ్యాలు నిలిచిపోవడం.. తదితర కారణాలతో అఫ్గనిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కుదేలుకు లోనైంది. ఈ తరుణంలో అఫ్గనిస్తాన్ పై మరో పిడుగు పడనుంది. ఊహించని స్థాయిలో ఆర్థిక సంక్షోభం అఫ్గన్‌ను ముంచెత్తే అవకాశాలున్నాయంటూ హెచ్చరించింది ఐక్యరాజ్య సమితి. యూఎన్ డెవలప్మెంట్ ప్రొగ్రాం(UNDP) సోమవారం మూడు పేజీలతో కూడిన ఒక నివేదికను రిలీజ్ చేసింది. బ్యాంకింగ్ వ్యవస్థ కుప్పకూలే పరిస్థితులు నెలకొన్నాయని, తద్వారా ఆర్థిక తలెత్తే అవకాశం ఉందని, ఆ ప్రతికూల ప్రభావం సొసైటీపై ఊహించని స్థాయిలో చూపించ్చొచ్చని అభిప్రాయపడింది ఐరాస. కిందటి ఏడాది 7 బిలియన్ డాలర్ల విలువైన గూడ్స్, ఉత్పత్తులను, సేవలను అందించింది అఫ్గనిస్తాన్. ఎలాంటి అవాంతరాలు లేకుండా లావాదేవీలు జరగడానికి కారణం.. అక్కడి బ్యాంకింగ్ వ్యవస్థే. అయితే చాలామంది లోన్లు తిరిగి చెల్లించకపోవడం, తాలిబన్ల ఆక్రమణ తర్వాత నగదు విత్‌డ్రా, అదే సమయంలో డిపాజిట్లు తక్కువగా వస్తుండడం, అవసరాలకు సరిపడా కరెన్సీ నిల్వలు లేకపోవడంతో.. కొద్దినెలల్లోపే ఈ సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని ఐరాస యూఎన్డీపీ నివేదికలో పేర్కొంది. ఇప్పటికైనా తేరుకుని బ్యాంకింగ్ వ్యవస్థను బలపర్చాలని తాలిబన్ ప్రభుత్వానికి సూచించింది ఐక్యరాజ్య సమితి. ఇందుకోసం అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలు సైతం సహకరించాలని యూఎన్డీపీ అభిప్రాయపడింది. మరోవైపు కఠిన ఆంక్షల విధింపు, విదేశీ నిధులు నిలిచిపోవడం, తాలిబన్ల ఆక్రమణ టైంలో వర్తకవాణిజ్యాలు ఆగిపోవడంతో పాటు అఫ్గన్‌కు రావాల్సిన బకాయిలు నిలిచిపోవడంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ చాలావరకు దెబ్బతింది. ఈ తరుణంలో బ్యాంకింగ్, డిపాజిట్ ఇన్సూరెన్స్ స్కీమ్ వ్యవస్థలు సైతం దెబ్బతింటే గనుక.. ఆదుకోవడానికి ప్రపంచ దేశాలు ముందుకొచ్చినా ఆ సంక్షోభం నుంచి కోలుకోవడానికి దశాబ్దాల సమయం పట్టే అవకాశం ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. -
రిస్కలను సరిగ్గా అంచనావేయకపోతే ఇబ్బందులు
కోల్‌కతా: వ్యవస్థలో నగదు లభ్యత సమృద్ధిగా ఉన్నందున సమస్యలను (రిస్కలను) సరిగ్గా అంచనా వేయకపోతే ఆందోళనకు దారితీస్తుందన్నారు ఎస్బీఐ చైర్మన్ దినేష్ ఖారా. ‘‘బ్యాంకింగ్ వ్యవస్థలోకి డిపాజిట్లు వచి్చపడుతున్నాయి. కానీ, రుణాల వృద్ధి పుంజుకోవాల్సి ఉంది. దీంతో బ్యాంకులు ప్రత్యామ్నాయ పెట్టుబడి వేదికలైన టీ బిల్లులవైపు చూడాల్సి వస్తుంది. కానీ, ఈ ప్రత్యామ్నాయ మార్కెట్ పరిధి తక్కువ. దీంతో రిస్‌్కలను సరిగ్గా అంచనా వేయలేకపోవడానికి అవకాశం ఉంటుంది. కానీ, బ్యాంకింగ్ వ్యవస్థ నిరర్థక ఆస్తుల (ఎన్పీఏలు) రూపంలో తగినంత అనుభవాలు నేర్చుకున్నందున.. అండర్‌రైటింగ్ ప్రమాణాల విషయంలో రాజీ ఉంటుందని నేను అనుకోవడం లేదు’’ అని ఖారా బెంగాల్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇం డస్ట్రీ నిర్వహించిన వెబినార్‌లో భాగంగా చెప్పారు, -
రిటైల్ రుణాలు.. రయ్రయ్!
గతంలో ఎన్నడూ ఎరుగని విధంగా కొద్ది నెలలనుంచీ దేశీ బ్యాంకింగ్ వ్యవస్థలో సరికొత్త ట్రెండ్ కనిపిస్తోంది. ఇటీవల పలు బ్యాంకింగ్ దిగ్గజాలు కార్పొరేట్ విభాగానికి బదులుగా రిటైల్ రుణాలకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నాయి. దీంతో బ్యాంకింగ్ వ్యవస్థలో రిటైల్ రుణ విభాగం పైచేయి సాధించనున్నట్లు అంచనాలు నెలకొన్నాయి. వెరసి కార్పొరేట్ రుణాలను మించి అగ్రస్థానానికి చేరే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ముంబై: దేశీ బ్యాంకింగ్ వ్యవస్థలో మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరం(2020–21).. కీలక మార్పులకు వేదిక కానుంది. కొన్ని నెలలుగా గృహ రుణాలు, వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డులు తదితరాలపట్ల బ్యాంకులు అత్యంత ఆసక్తి చూపుతున్నాయి. దీంతో కార్పొరేట్ రంగ డెట్‌ను వ్యక్తిగత రుణ విభాగం అధిగమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఏడాది తొలి 9 నెలల్లో(ఏప్రిల్ 1 నుంచి డిసెంబర్ 18వరకూ) బ్యాంకింగ్ వ్యవస్థలో మొత్తం(అవుట్‌స్టాండింగ్) పారిశ్రామిక, కార్పొరేట్ రుణాలు 1.2 శాతం తగ్గి రూ. 27.6 లక్షల కోట్లకు చేరాయి. ఇదే సమయంలో వ్యక్తిగత రుణాలు 9.5 శాతం జంప్‌చేసి రూ. 26.6 లక్షల కోట్లను తాకాయి. ఇక సర్వీసుల రంగ రుణాలు 25.8 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. వెరసి దేశ బ్యాంకింగ్ వ్యవస్థలో వ్యక్తిగత రుణ విభాగం సర్వీసుల రంగ రుణాలను మించి రెండో ర్యాంకుకు చేరింది. వెనకడుగులో..: పారిశ్రామిక, కార్పొరేట్ రుణ విభాగాలలో 2014–15 మొదలు రికవరీ కనిపించడంలేదని బ్యాంకింగ్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో బ్యాంకులు వ్యక్తిగత రుణ విభాగంపై ప్రత్యేక దృష్టిని సారించినట్లు తెలియజేశాయి. ఫలితంగా గృహ, ఆటో రుణాలు, క్రెడిట్ కార్డులు వృద్ధి బాటలో సాగుతున్నట్లు నార్నోలియా సెక్యూరిటీస్ సీఐవో శైలేంద్ర కుమార్ పేర్కొన్నారు. ఆర్బీఐ నివేదిక ప్రకారం పారిశ్రామిక, కార్పొరేట్ లోన్‌బుక్ నీరసిస్తూ వస్తోంది. తాజా రుణ మంజూరీకంటే చెల్లింపులు పెరుగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. గత 9 నెలల్లో పారిశ్రామిక రుణాలు 5 శాతం క్షీణించగా.. సర్వీసుల రంగ రుణాలు 0.6 శాతం మందగించాయి. అయితే వ్యక్తిగత రుణాలు 4.3 శాతం పుంజుకున్నాయి. వ్యవసాయ రుణాలైతే 7.6 శాతం ఎగశాయి. దీంతో సమీప కాలంలో రిటైల్ లోన్ పోర్ట్‌ఫోలియో దేశ బ్యాంకింగ్ వ్యవస్థలో అతిపెద్ద విభాగంగా ఆవిర్భవించే వీలున్నట్లు పలువురు నిపుణులు అభిప్రాయపడ్డారు. ఐఐపీ వీక్... కొంతకాలంగా తయారీ, పారిశ్రామిక రంగాలలో క్షీణత కొనసాగుతుండటంతో ఇండస్ట్రియల్ క్రెడిట్ వెనకడుగు వేస్తున్నట్లు బ్యాంకింగ్ రంగ విశ్లేషకులు పేర్కొన్నారు. కొన్నేళ్లుగా తయారీ రంగం నీరసిస్తుండటంతో కొత్త పెట్టుబడి ప్రణాళికలు కరువైనట్లు తెలియజేశారు. దీంతో కార్పొరేట్ క్రెడిట్‌కు డిమాండ్ తగ్గినట్లు ఈక్వినామిక్స్ రీసెర్చ్ వ్యవస్థాపక ఎండీ జి.చొక్కలింగం వివరించారు. సాధారణంగా సామర్థ్య విస్తరణ, కొత్త ప్రాజెక్టులు, ప్లాంట్ల ఏర్పాటు తదితరాల కారణంగా కార్పొరేట్ రుణాలకు డిమాండ్ పుట్టుకొస్తుందని తెలియజేశారు. కారణాలివీ... ఇటీవల వడ్డీ రేట్లు తగ్గడం, టెక్నాలజీ ఆధారిత (ఆన్లైన్) రుణ మంజూరీ పెరగడం వంటి అంశాలు రిటైల్ విభాగంలో రుణ వృద్ధికి దోహదపడుతున్నాయి. ఈ విభాగంలో క్రెడిట్ కార్డులు, ఇతర వ్యక్తిగత అన్సెక్యూర్డ్ రుణాలు అత్యంత వేగంగా విస్తరిస్తున్నాయి. అయితే మొత్తం వ్యక్తిగత పోర్ట్‌ఫోలియోలో చూస్తే సెక్యూర్డ్ విభాగంలోని గృహ రుణాలు, ఆటో రంగ రుణాలు నెమ్మదిస్తున్నాయి. వ్యక్తిగత పోర్ట్‌ఫోలియోలో ఆర్బీఐ గణాంకాల ప్రకారం గృహ, వాహన రుణాలు, క్రెడిట్ కార్డులు మూడు పెద్ద విభాగాలుగా ఆవిర్భవించాయి. హౌసింగ్ వాటా 52.3 శాతంకాగా.. గత ఐదేళ్లలో క్రెడిట్ కార్డులు తదితర రుణాలు వేగంగా వృద్ధి చెందుతున్నాయి. ఫలితంగా క్రెడిట్ కార్డుల రుణాల వాటా 4.1 శాతానికి చేరడం గమనార్హం! -
జనవరి 1నుంచి చెక్కు చెల్లింపులకు కొత్త రూల్స్
ముంబై, సాక్షి: వచ్చే(2021) జనవరి 1నుంచి చెక్కుల చెల్లింపులకు కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. సానుకూల చెల్లింపుల(పాజిటివ్ పే) విధానం పేరుతో రిజర్వ్ బ్యాంక్ ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేసింది. తాజా నిబంధనలలో భాగంగా ఇకపై రూ. 50,000కు మించిన చెక్కుల చెల్లింపుల విషయంలో బ్యాంకులు కొన్ని కీలక అంశాలను మరోసారి ధృవ పరచుకోవలసి ఉంటుంది. ఇతర వివరాలు ఇలా.. (బ్యాంకింగ్: డిజిటల్ సేవల్లో సవాళ్లేంటి?) అవకతవకలకు చెక్ పాజిటివ్ పేలో భాగంగా క్లియరింగ్ కోసం వచ్చిన చెక్కుకు సంబంధించి ప్రధాన సమాచారాన్ని బ్యాంకులు తిరిగి ధృవ పరచుకోవలసి ఉంటుంది. ఉదాహరణకు చెక్కు సంఖ్య, తేదీ, చెల్లింపుదారుడి పేరు, ఖాతా నంబర్, చెల్లించవలసిన మొత్తం వంటి అంశాలను పునఃసమీక్షించవలసి ఉంటుంది. తద్వారా మోసపూరిత లావాదేవీలకు చెక్ పెట్టేందుకు ఆర్బీఐ పాజిటివ్ పే వ్యవస్థను రూపొందించినట్లు విశ్లేషకులు తెలియజేశారు. ఈ విధానం రూ. 50,000.. అంతకుమించిన పెద్ద మొత్తాల చెక్కులకు మాత్రమే వర్తింపచేయనున్నట్లు తెలుస్తోంది. (హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌కు ఆర్బీఐ షాక్) పలు విధాలుగా చెక్కును జారీ చేసిన వ్యక్తి లేదా సంస్థ లబ్దిదారుడి పేరు, సొమ్ము మొత్తం తదితర వివరాలను వివిధ మార్గాల ద్వారా చెల్లించే(డ్రాయీ) బ్యాంకుకు తెలియజేయవలసి ఉంటుంది. ఈ వివరాలను ఎస్ఎంఎస్, మొబైల్ యాప్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎం తదితరాల ద్వారా అందించవచ్చు. ఈ సమాచారాన్ని జమ చేసిన చెక్కు వివరాలతో చెక్ క్లియరింగ్ సిస్టమ్స్(సీటీఎస్) పోల్చి చూసుకునేందుకు వీలుంటుంది. ఎప్పుడైనా సమాచారం సరిపోలకుంటే డ్రాయీ బ్యాంకు, ప్రెజంటింగ్ బ్యాంకులకు సీటీఎస్ తెలియపరుస్తుంది. తద్వారా చెక్కుల పరిష్కారానికి బ్యాంకులు తగిన చర్యలు తీసుకునేందుకు వీలుంటుంది. ఎన్పీఎస్ ద్వారా సీటీఎస్‌లలో పాజిటివ్ పే వ్యవస్థను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ అభివృద్ధి చేయడంతోపాటు.. పార్టిసిపేటింగ్ బ్యాంకులకు సైతం అందించవలసి ఉంటుంది. వెరసి ఈ వ్యవస్థను బ్యాంకులు ఖాతాదారులందరికీ అమలు చేయవలసి ఉన్నట్లు బ్యాంకింగ్ నిపుణులు పేర్కొన్నారు. రూ. 50,000, అంతకుమించి విలువగల చెక్కులకు ఈ వ్యవస్థ అమలుకానుంది. అయితే ఈ వ్యవస్థను రూ. 5 లక్షల లోపు సొమ్ము విషయంలో ఖాతాదారుని అభీష్టంమేరకే అమలు చేయవలసి ఉంటుందని తెలుస్తోంది. రూ. 5 లక్షల మొత్తానికి మించిన చెక్కులకు బ్యాంకులు ఈ విధానాన్ని తప్పనిసరి చేయనున్నట్లు సంబంధితవర్గాలు తెలియజేశాయి. -
డిపాజిట్ దారులకు గుడ్ న్యూస్
సాక్షి, న్యూఢిల్లీ : బ్యాంకు డిపాజిట్ దారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్తను అందించింది. డిపాజిట్ దారులకు ఇచ్చే బీమాను రూ.లక్ష నుంచి రూ.5లక్షలకు పెంచారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల బలోపేతానికి బడ్జెట్లో రూ.3,50లక్షల కోట్లు కేటాయించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. కేంద్ర ఆర్థికమంత్రిగా రెండోసారి ఆమె శనివారం లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా నిర్మాలా సీతారామన్ ప్రసంగిస్తూ...బ్యాంకింగ్ రంగంలో రావాల్సిన అవసరం ఉందన్నారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమల రుణ పునరుద్ధరణ గడువును 2021వరకు పొడగించినట్లు ప్రకటించారు. దీని ద్వారా 5లక్షల చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు లబ్ది చేకూరుతుందని మంత్రి పేర్కొన్నారు. వేధింపులను కేంద్రం ఉపేక్షించదు స్వచ్ఛమైన, అవినీతరహిత పాలనను అందించడమే తమ ప్రభుత్వ లక్షమని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. పన్నుల పేరుతో వేధింపులను కేంద్రం ఉపేక్షించదన్నారు. ‘అవినీతి రహిత భారత్’ తమ ప్రభుత్వ నినాదమని మంత్రి తెలిపారు. పారిస్ పర్యావరణ ఒడంబికకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. నగరాల్లో పరిశుభ్రతమైన గాలి కోసం రూ.4400 కోట్లతో మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతామన్నారు. 2020లో జీ20 సదస్సుకు రూ.100 కోట్లను ప్రకటించారు. లఢక్ అభివృద్ధికి రూ.5958 కోట్లు, జమ్మూకశ్మీర్ కోసం రూ.38,757 కోట్లు కేటాయించారు. చదవండి : విద్యారంగానికి భారీ కేటాయింపు డీబీఐ, ఎల్ఐసీలో వాటా అమ్మకం కొత్తగా 5 స్మార్ట్ నగరాలు.. -
బ్యాంకింగ్‌లో కార్పొరేట్ గవర్నెన్స్ కీలకం
అహ్మదాబాద్: దేశంలోని బ్యాంకింగ్ రంగం మెరుగైన సేవలు అందివ్వాలంటే కార్పొరేట్ గవర్నెన్స్ ముఖ్య పాత్ర పోషించాలని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ తెలిపారు. అహ్మదాబాద్‌లో మాట్లాడుతూ బ్యాంకింగ్ వ్యవస్థపై ఆర్బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బ్యాంకింగ్ వ్యవస్థ పుంజుకోవాలంటే కార్పొరేట్ గవర్నెన్స్ సమర్థవంతమైన పాత్ర పోషించాలని లేకుంటే గదిలోని ఏనుగులా ఏమి ఉపయోగముండదని వ్యాఖ్యానించారు. మరోవైపు నిరర్ధక ఆస్తులు (ఎన్పీఏ) మూలధన కొరత, నిర్వహణ నైపుణ్యం కొరవడటం లాంటి సమస్యలు తలెత్తుతాయని అన్నారు. స్వతంత్ర బోర్డులను ఏర్పాటు చేసి వ్యాపార వృద్ధిని పెంచుకోవాలని అన్నారు. బ్యాంకింగ్ రంగంలో సరైన నియంత్రణ వ్యవస్థలు, సమర్థవంతమైన ఆడిట్ నిర్వహించాలని పేర్కొన్నారు. గత సంవత్సర కాలంగా ఎన్పీఏలు 60.5శాతం నుంచి 48.3శాతం తగ్గాయని దాస్ తెలిపారు. అయితే బ్యాంకింగ్ వ్యవస్థలో మూలధన నిష్పత్తి బాసిల్ అవసరాల కంటే ఎక్కువగానే నమోదయిందన్నారు. -
అమెరికాలో 400 మందికి కుచ్చుటోపీ
వాషింగ్టన్: అమెరికా బ్యాంకింగ్ వ్యవస్థలో చిన్న లోపాన్ని గుర్తించిన ఓ భారతీయ యువకుడు భారీ మోసానికి తెరలేపాడు. దాదాపు 400 మంది భారత సంతతి వ్యక్తులకు రూ.5.59 కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టాడు. దీంతో నిందితుడిని జనవరి 25 అరెస్ట్ చేసిన పోలీసులు కనక్టికట్లోని ఓ కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించారు. 2013లో కిశోర్‌బాబు అమ్మిశెట్టి(30) అనే వ్యక్తి అమెరికాకు స్టూడెంట్ వీసాపై వచ్చాడు. ఇక్కడి బ్యాంకులు పాటించే ప్రొవిజినల్ క్రెడిట్ విధానం కిశోర్‌ను ఆకర్షించింది. దీని కింద నగదు చెల్లింపులు జరిగినా రిజిస్టర్ కాకపోతే బ్యాంకులు ఆ మొత్తాన్ని కస్టమర్ల ఖాతాకు జమచేస్తాయి. ఈ నేపథ్యంలో వస్తువుల అమ్మకం, అద్దె ఇళ్లు ప్రకటనలు ఇచ్చే భారత సంతతి వారిని కిశోర్ టార్గెట్ చేసుకున్నాడు. వారి బ్యాంక్ అకౌంట్ వివరాలను తెలుసుకుని.. ఆ బ్యాంకుకు ఫోన్ చేసి కస్టమర్‌గా నటించేవాడు. తన ఖాతాకు డబ్బులు పంపినా ఇంకా రిజిస్టర్ కాలేదని బుకాయించేవాడు. దీంతో బ్యాంకులు ప్రొవిజినల్ క్రెడిట్ కింద ఆ మొత్తాన్ని ఖాతాల్లో డిపాజిట్ చేసేవి. అనంతరం ఆ డిపాజిట్ దారులకు ఫోన్ చేసి పొరపాటున వారి అకౌంట్లలో నగదు జమ చేశానని చెప్పేవాడు. బాధితులు నిజమని నమ్మి భారీగా నగదును సమర్పించుకున్నారు. ఈ ఖాతాలను సమీక్షించిన బ్యాంకులు, ఎలాంటి బదిలీలు జరగకపోవడంతో డిపాజిట్లను వెనక్కు తీసుకున్నాయి. దీంతో మోసం వెలుగులోకి వచ్చింది. -
కేంద్రంతో ఆర్బీఐకి భిన్నాభిప్రాయాలు సహజమే..
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్‌కి మధ్య భిన్నాభిప్రాయాలు ఉండటం సహజమేనని, ఇది ఆరోగ్యకరమైన ధోరణేనని ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ ఆర్ గాంధీ వ్యాఖ్యానించారు. అయితే, రెండు పక్షాలు తరచూ చర్చించుకుంటే ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, ఆర్బీఐ తమ డిమాండ్లకు తలొగ్గేలా చేసేందుకు కేంద్రం సెక్షన్ 7ని ప్రయోగించడమనేది తీవ్ర చర్చనీయాంశంగా మారడం దురదృష్టకరమని గాంధీ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వాలు స్వల్పకాలిక దృక్పథంతో ఆలోచిస్తే.. రిజర్వ్ బ్యాంక్ మాత్రం ఎకానమీ శ్రేయస్సు కోసం దీర్ఘకాలిక దృష్టికోణం నుంచి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. ‘ఏదైనా అంశంపై భిన్నాభిప్రాయాల కారణంగా ఒక్కోసారి అంగీకారం కుదరకపోవచ్చు. ఇవి కొత్తేమీ కాదు. అయితే, ప్రభుత్వం, ఆర్బీఐ మధ్యమధ్యలో చర్చించుకున్న పక్షంలో ప్రస్తుతం నెలకొన్న వివాదంలాంటివి తలెత్తవు’ అని గాంధీ పేర్కొన్నారు. ఆర్బీఐ స్వయంప్రతిపత్తిపై కేంద్రం దాడి చేస్తోందన్న వివాదం నెలకొన్న నేపథ్యంలో గాంధీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. డిమాండ్లన్నీ అంగీకరించాలనేమీ లేదు.. బ్యాంకింగ్ వ్యవస్థకు సంబంధించి నిబంధనలు సడలించాలంటూ ఆర్బీఐని కేంద్రం కోరుతున్న అంశంపై స్పందిస్తూ.. ప్రభుత్వ డిమాండ్లన్నింటినీ రిజర్వ్ బ్యాంక్ అంగీకరించాలని లేదన్నారు. సంబంధిత వర్గాలన్నింటి అభిప్రాయాలు సేకరించి, ఎకానమీకి మేలు చేసే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుం దని చెప్పారు. నవంబర్ 19న జరిగే రిజర్వ్ బ్యాంక్ బోర్డు సమావేశంలోనే వివాదాస్పద అంశాలన్నీ పరి ష్కారం కావాలనేమీ లేదని, కొన్నింటిని ఆ తర్వాత రోజుల్లోనైనా చర్చించుకునే అవకాశం ఉందని గాంధీ చెప్పారు. మరోవైపు, వార్షిక ఆడిట్ తర్వాత ఆర్బీఐ తన దగ్గరున్న మిగులు నిధుల నుంచి ప్రభుత్వానికి తగు వాటాలను బదలాయిస్తుందని ఆయన తెలిపారు. దీనిపై నిర్దిష్ట ఫార్ములా ఉండాలంటూ ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ గతంలోనే సూచించారని తెలిపారు. కానీ అప్పట్లో దీనికి అంగీకరించని ప్రభుత్వం ఇప్పుడు అలాంటి ఫార్ములానే కావాలని కోరుతోందని పేర్కొన్నారు. దీనిపై చర్చ జరిగి, తగు విధివిధానాలు రూపొందించుకుంటే ఆర్బీఐ వాటికి కట్టుబడి ఉంటుందని చెప్పారు.