విదేశాల్లో 16 వేల కోట్ల నల్లధనం | 16 thousand crore of black money in abroad | Sakshi
Sakshi News home page

విదేశాల్లో 16 వేల కోట్ల నల్లధనం

Published Wed, Feb 8 2017 2:32 AM | Last Updated on Wed, Apr 3 2019 5:16 PM

విదేశాల్లో 16 వేల కోట్ల నల్లధనం - Sakshi

విదేశాల్లో 16 వేల కోట్ల నల్లధనం

రాజ్యసభకు తెలిపిన ఆర్థిక మంత్రి

న్యూఢిల్లీ: హెచ్‌ఎస్‌బీసీ (హాంకాంగ్‌ షాంఘై బ్యాకింగ్‌ కార్పొరేషన్‌), ఐసీఐజేలు ఇచ్చిన జాబితాలపై విచారణ జరిపి భారతీయులు విదేశాల్లో దాచిన రూ.16,200 కోట్ల నల్లడబ్బును గుర్తించామని ప్రభుత్వం తెలిపింది. హెచ్‌ఎస్‌బీసీ బ్యాంకు విదేశీ శాఖల్లో భారతీయులు దాచిన రూ.8,200 కోట్ల నల్లడబ్బును గత రెండేళ్లలో పన్ను పరిధిలోకి తెచ్చామని జైట్లీ రాజ్యసభలో తెలిపారు. మరో రూ.8,000 కోట్లను రుణంగా తీసుకున్నట్లు గుర్తించామన్నారు. భారతీయులు దాచిన నల్లడబ్బుపై కచ్చితమైన సమాచారం ప్రభుత్వం వద్ద లేదన్నారు.

పెద్దనోట్ల రద్దు తరువాత ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) చేపట్టిన దాడుల్లో ఇప్పటి వరకు రూ.7.3 కోట్ల నగదు, 5.5 కిలోల బంగారాన్ని జప్తుచేశామని కేంద్రం ప్రకటించింది. 18 మంది అరెస్టయ్యారనీ, మనీలాండరింగ్‌ కార్యకలాపాలకు పాల్పడుతున్న మరో 17 మందిని గుర్తించినట్లు అరుణ్‌ జైట్లీ చెప్పారు. అక్రమ పద్ధతులను గుర్తించడం, నిఘా సమాచారం ఆధారంగా ఆదాయపు పన్ను శాఖ 2016 నవంబర్‌ 9 నుంచి 2017 జనవరి 19 మధ్య కాలంలో 1100 కేసుల్లో దాడులు జరిపిందని వివరించారు. అదే కాలంలో బ్యాంకుల్లోకి వచ్చిన అనుమానాస్పద డిపాజిట్లపై వివరణ కోరుతూ 5,100 నోటీసులు జారీచేసినట్లు తెలిపారు.

కొత్త నోట్లు రూ. 6.78 లక్షల కోట్లు  
న్యూఢిల్లీ: రద్దయిన పెద్ద నోట్ల స్థానంలో 2016 నవంబర్‌ 10 నుంచి జనవరి 13 మధ్య రూ. 6.78 లక్షల కోట్ల విలువైన కొత్త నోట్లను బ్యాంకింగ్‌ వ్యవస్థలో ప్రవేశపెట్టామని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘవాల్‌ రాజ్యసభకు తెలిపారు. ప్రస్తుతం దేశంలో 9.1 లక్షల కోట్ల నోట్లు చలామణిలో ఉన్నాయన్నారు. 2016 డిసెంబర్‌ 10 నాటికి రద్దయిన రూ. 500, రూ.1,000 నోట్లు రూ. 12.44 లక్షల కోట్ల మేర ఆర్బీఐకి చేరాయి.

నగదు బదిలీతో 21వేల కోట్లు మిగులు
ప్రత్యక్ష నగదు బదిలీ పథకాన్ని అమలు చేయడం వల్ల 3.3 కోట్ల నకిలీ గ్యాస్‌ కనెక్షన్లను అరికట్టామని, తద్వారా ప్రభుత్వానికి రెండేళ్లలో రూ.21 వేల కోట్ల సబ్సిడీ మిగిలిందని కేంద్ర చమురు  శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తెలిపారు. తాము అధికారంలోకి వచ్చేనాటికి ఎల్పీజీ సబ్సిడీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందన్నారు. 2014లో ప్రత్యక్ష నగదు బదిలీ పథకాన్ని ప్రారంభించడం ద్వారా ఎల్పీజీ సబ్సిడీ నేరుగా బ్యాంకు ఖాతాలకే వెళ్లేలా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. దీనివల్ల మొత్తం ప్రక్రియ పారదర్శకమైందని, తద్వారా నకిలీ కనెక్షన్ల ద్వారా జరుగుతున్న సబ్సిడీ వృథాను నియంత్రించగలిగినట్లు చెప్పారు. ఈ పథకం ద్వారా రెండేళ్లలో 17.6కోట్ల మంది వినియోగదారులకు సబ్సిడీ కింద రూ.40 వేల కోట్లు బదిలీ చేసినట్లు వెల్లడించారు. కాగా, 1.2కోట్ల మంది స్వచ్ఛందంగా సబ్సిడీని వదులు కున్నట్లు తెలిపారు. 2015 – 16లో దాదాపు 60లక్షల బీపీఎల్‌ కుటుంబాలకు కొత్తగా గ్యాస్‌ కనెక్షన్లు ఇచ్చినట్లు చెప్పారు. వచ్చే మూడేళ్లలో 5 కోట్ల ఎల్పీజీ కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ చెప్పారు.

డెబిట్‌ కార్డు చార్జీలు తగ్గే అవకాశం: జైట్లీ
డిజిటల్‌ లావాదేవీల్ని ప్రోత్సహించే ఉద్దేశంతో డెబిట్‌ కార్డు చార్జీల్ని తగ్గించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని జైట్లీ తెలిపారు. రూ. 2 వేలకు మించి జరిపే డెబిట్‌ కార్డు లావాదేవీలపై మార్జినల్‌ డిస్కౌంట్‌ చార్జీల్ని తగ్గించే దిశగా ఆర్‌బీఐ కృషిచేస్తుందన్నారు. డిజిటల్‌ లావాదేవీలు పెరిగితే చార్జీలు తగ్గుతాయన్నారు. పేమెంట్స్‌ అండ్‌ సెటిల్‌మెంట్స్‌ యాక్ట్‌ మేరకు రూ. వెయ్యి వరకూ ఎండీఆర్‌ చార్జీల్ని 0.25 శాతంగా ఆర్‌బీఐ నిర్ణయించిందని, రూ. 2 వేల వరకూ 0.5 శాతం వసూలు చేస్తున్నారని జైట్లీ తెలిపారు. ఈ చార్జీలు జనవరి 1, 2017 నుంచి అమల్లోకి వచ్చాయని, మార్చి 31, 2017 వరకూ అమల్లో ఉంటాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement