
అర్థక్రాంతి భాజపా భ్రాంతేనా!
బ్యాంకింగ్ వ్యవస్థ పరిపూర్ణంగా పల్లె పల్లెకు, మనిషి మనిషికి విస్తరించని భారతావనిలో బ్యాంకింగ్ లావాదేవీల మీద పన్ను విధింపు, అమలు ఎంత సొగసుగా ఉండగలదో ఊహించవచ్చు. గూడ్స్, సర్వీసెస్ పన్నును తిరస్కరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలు పన్ను విధించే తమ అధికారాలను కేంద్రానికి ధారాదత్తం చేస్తాయా?
ప్రభుత్వం విధించే విభిన్న పన్నుల మిశ్రమం గురించీ, వాటి సాపేక్ష ప్రాధాన్యం గురించీ తెలియచేసేదే పన్నుల వ్యవస్థ. కాలక్ర మంలో ఈ వ్యవస్థకి సహజమైన, మానవ ప్రేరితమైన మార్పులు రెండూ అనివార్యమే. పుష్పం నుంచి తేనెటీగ మకరందాన్ని సేకరిం చుకున్నంత సున్నితంగా ప్రభుత్వాలు పన్నులు వసూలు చేయా లన్నది దేశంలో పురాతన కాలం నుంచీ వస్తున్న సూత్రం. సమాజ శ్రేయస్సు, ప్రభుత్వ ఆయుష్షు ఈ వ్యవస్థ మీదే ఆధారపడి ఉన్నాయి. అందుకే ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే, పన్నుల వ్యవస్థలో భారీ మార్పులు జరుగుతాయని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ అప్పుడే సూచించారు.
2025 విజన్ డాక్యుమెంట్‌లో మరిన్ని వివరాలు పొందుపరచాలనేది బీజేపీ ఆలోచన. పెట్రో విధానం ద్వారా, బ్యాంకు లావాదేవీల ద్వారా రూ. 40 వేల కోట్లు సేకరించాలని ఆ పార్టీ ఉద్దేశం. బీజేపీ విజన్ ప్రకారం సూత్రబద్ధమైన మూలధన నిర్మాణం ఉండాలి. సమర్థ పాలనకు అవసరమైన రెవెన్యూ రాబడి కూడా అందులో ఉంది. ఈ అంశాలు ఉన్న అర్థక్రాంతి ఆశయం 2005లోనే వెలుగు చూసింది. ప్రజలకు భారంగా మారిపోయిన ఈ పన్నుల విధానంలో సంస్కరణలు ఉద్దేశం కావచ్చు. ఈ ఆలోచన స్వాగతించదగినదే అయినా, దాని మార్గం గురించి చర్చించక తప్పదు.
పన్నుల సేకరణ ఎలా?
పన్నుల వ్యవస్థ-వ్యయ విధానాలు - కోశ విధాన సాఫల్యానికి పన్నుల విధింపు ప్రధాన సాధనం. ఇతర సాధనాలు ప్రభుత్వ పరంగా, వ్యయం చేయడం, అప్పులు తీసుకోవడం, తిరిగి చెల్లించడం, వస్తు సేవల అమ్మకాలు, కొనుగోళ్లు ఈ నేపథ్యంలో భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం, చిన్న, పెద్ద రాష్ట్రాలు పన్నుల ద్వారా ఎంత మొత్తం సేకరిస్తున్నాయో గమనిద్దాం.
2010-11 సం.లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రూ. కోట్లలో
పన్నుల ద్వారా సేకరించిన రాబడి : 12,71,666
2011-12 సంవత్సరానికి సవరించిన అంచనా : 14,75,032
2012-13 బడ్జెట్ అంచనా : 17,51,123
ఇందులో 2012-13 బడ్జెట్ ప్రకారం
ప్రత్యక్ష పన్నుల రాబడి : 5,78,364
పరోక్ష పన్నుల రాబడి : 11,72,759
మొత్తం 17,51,123
2012-13లో బడ్జెట్ అంచనాల ప్రకారం.
కేంద్రం పన్నుల రాబడి నికరంగా (44 శాతం) : 7,71,071
రాష్ట్రాల మొత్తం పన్నుల రాబడి (56 శాతం) : 9,80,052
మొత్తం : 17,51,123
రాష్ట్రాలు సొంతంగా విధించే పన్నులు : 6,73,511 (69 శాతం)
కేంద్రం పన్నుల రాబడి మొత్తం : 3,06,541 (31 శాతం)
రాష్ట్రాల మొత్తం పన్ను రాబడి : 9,80,052
రాష్ట్రాలు తమ స్థూల రాష్ట్రీయోత్పత్తిలో పన్నుల ద్వారా 2010-11 సంవత్స రంలో సుమారు 9.00 శాతం సేకరించగా కేంద్ర ప్రభుత్వం దేశీయ స్థూల ఉత్ప త్తిలో సేకరించిన పన్నుల శాతం 7.31. అంటే మొత్తం (దేశీయ స్థూల ఉత్పత్తి జీడీపీ) 16.31 శాతం. (జీడీపీ 2012-13లో సుమారు 1,02,59,894 కోట్లు).
2011-12 సవరించిన అంచనాల ప్రకారం : 16.44
2012-13 బడ్జెట్ అంచనాల ప్రకారం : 17.24
2011లో భారతదేశ జనాభా 121 కోట్లు : (121,01,93,422)
2013లో భారతదేశ జనాభా 122 కోట్లు : (122,04,00,000)
2014లో భారతదేశ జనాభా 126 కోట్లు : (126,34,37,611)
2012-13లో పన్నుల రాబడి అంచనా రూ.17,51,123 కోట్లు. జనాభా 126.34 కోట్లు అని భావిస్తే, ఒక సగటు పౌరుడు ఒక సంవత్సరంలో చెల్లించే పన్ను మొత్తం సుమారు రూ. 38. పన్నుల వ్యవస్థకు ఇంత ప్రాముఖ్యం ఉంది.
అర్థక్రాంతి ప్రతిపాదనలు
అర్థక్రాంతి ప్రతిపాదనలను వివరంగా పరిశీలించేముందు ప్రస్తుత పన్నుల వ్యవస్థలోని విభిన్న పన్నుల సాపేక్ష ప్రాముఖ్యాన్ని పరిశీలిద్దాం. 2013-14 బడ్జెట్ అంచనాల ప్రకారం యూనియన్ ప్రభుత్వానికి అందవలసిన రాబడి / వసూళ్ల అంచనా, రూ. 16 లక్షల 65 వేల కోట్లు కాగా, పన్నుల ద్వారా, నికరంగా లభించేది 8 లక్షల 84 వేలు. అంటే సుమారు 53 శాతం. అప్పుల ద్వారా సేకరించేది 5 లక్షల 42 వేలు. 33 శాతం పన్నేతర రాబడి / ఆదాయం (నాన్ ట్యాక్స్ ఆదాయం) 1 లక్షా, 72 వేలు (10 శాతం). పన్నుల రాబడిలో ప్రము ఖమైనవి. కార్పొరేషన్ పన్ను, ఆదాయపు పన్ను, కస్టమ్స్ పన్ను, ఎగుమతి, దిగుమతి సుంకాలు. యూనియన్ ఎక్సైజ్ సుంకాలు, సేవా పన్ను. భారత దేశంలో, ఆదాయంపై పన్ను చెల్లించే వారి శాతం (మొత్తం జనాభాలో) 3 మాత్రమే. అంటే పన్నుల రాబడి అధిక భాగం సామాన్య ప్రజానీకం నుంచి పరోక్ష పన్నులైన ఎక్సైజ్, అమ్మకం, వ్యాట్‌ల ద్వారా చేకూరుతున్నది.
అర్థక్రాంతి ప్రతిపాదనలలో పంచసూత్రాలు ఉన్నాయి. 1. ప్రస్తుత పన్నుల వ్యవస్థలోని కస్టమ్స్ (ఎగుమతి, దిగుమతి సుంకాలు) తప్ప అన్ని పన్నులు తొల గించాలి. 2. బ్యాంకుల లావాదేవీలపై ఒక నిర్దిష్ట శాతంలో, ఒకే స్థాయిలో సింగిల్ పాయింట్ పన్ను విధించాలి. బ్యాంకుల ద్వారా జరిగే ప్రతి లావాదేవీపై ఈ పన్ను శాతం 2 అనుకుందాం. రూ.2,000 మించిన నగదు లావాదేవీలను ప్రభు త్వం నిషేధిస్తుంది. ఈ 2 శాతం పన్నును కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు 0.7, 0.6 0.35 నిష్పత్తిలో పంచుకుంటాయి. ప్రత్యక్ష పరోక్ష పన్నులుండవు. 3. నగదు లావాదేవీలపై పన్నులు ఉండవు. 4. అంటే రూ.2 వేలకు మించిన నగదు లావా దేవీలకు ప్రభుత్వ రక్షణ ఉండదు. 5. ముఖ విలువ రూ.50లకు మించిన కరెన్సీ నోట్లను ఉపసంహరిస్తారు. అవి చలామణిలో ఉండవు. అసమానతలతో కూడిన పన్నుల వ్యవస్థ స్థానంలో న్యాయమైన పన్నుల వ్యవస్థ మరో లక్ష్యం.
నల్లధనం మాటేమిటి?
మరి నల్లధనం సంగతేమిటన్న ప్రశ్న సహజం. 1983-84 ఎన్‌ఐపీఎఫ్‌పీ అంచ నాల ప్రకారం నల్ల ఆదాయపు ఆవిర్భావం జీడీపీలో కనీసం 18 శాతమని, నల్ల ధనం అంచనాలపై భారత ప్రభుత్వం 2011లో నియమించిన 3 సంస్థల నుంచి ఎన్‌ఐపీఎఫ్‌పీ, ఎన్‌జీఏఈఆర్, ఎన్‌ఐఎఫ్‌ఎంల వివరాలు 2013 డిసెంబర్ చివ రన లభిస్తాయని ఆశించారు. అయితే లభ్యమైన కొన్ని అంచనాల ప్రకారం నల్ల ధనం జీడీపీలో 3వ వంతు 33 శాతం. అంటే సుమారు రూ. 30 లక్షల కోట్లు. దీనిపై 33 శాతం విధించినా రూ.10 లక్షల కోట్లు ప్రభుత్వానికి లభించాలి. మరి కొన్ని అంచనాల ప్రకారం ఇది రూ.45 లక్షల కోట్లు. యూనియన్ ప్రభుత్వ వార్షిక బడ్జెట్‌కు 3 రెట్లు. యూనియన్ ప్రభుత్వం 2012లో నల్లధనంపై విడుదల చేసిన శ్వేత పత్రం ప్రకారం నల్లధన నియంత్రణకు నాలుగు స్తంభాల వ్యూహం ఉంది.
అర్థక్రాంతి పరిష్కారమా?
ఈ నేపథ్యంలో అర్థక్రాంతి ప్రతిపాదనలు ఎంత వరకు పన్నుల వ్యవస్థను మెరు గుపరచగలవనే విషయాన్ని పరిశీలించాలి. అభిలషణీయమైన పన్నుల వ్యవస్థలో విధించే పన్నుల సంఖ్య కూడా మరీ తక్కువ లేదా హెచ్చుగా ఉండరాదు. ఒకే పన్ను విధిస్తే పన్ను చెల్లింపు నుంచి తప్పించుకోవడానికి లేదా ఎగవేతకు మరింత అవకాశం ఉంటుంది. పన్నుల పరిధిని పెంచే ఉద్దేశంతో 1950 దశకంలో నికోలస్ కాల్డర్ ఆదాయంపై పన్నును వ్యతిరేకిస్తూ వ్యయంపై పన్నుతో పాటుగా సంపద పైన, బహుమానాలపైనా, ఆస్తులపైనా పన్నును సూచించారు. కానీ ఈ ప్రత్యా మ్నాయాలేవీ ఆదరణ పొందలేకపోయాయి. 14 ఏళ్లుగా అర్థక్రాంతి ప్రతిపాద నలు ఉన్నప్పటికీ, భారతదేశంలో కూడా దీనిని పెద్దగా పట్టించుకున్న దాఖలా కనిపించదు. ఆర్థిక మంత్రి చిదంబరం కూడా 2005లో బ్యాంకింగ్ లావాదేవీల పన్ను విధించి 2008-09 బడ్జెట్‌లో ఉపసంహరించుకున్నారు.
అర్థక్రాంతి విషయంలో ఏకాభిప్రాయ సాధన అవసరమని బీజేపీ కూడా భావిస్తున్నట్లుంది. బ్యాంకింగ్ వ్యవస్థ పరిపూర్ణంగా పల్లె పల్లెకు, మనిషి మనిషికి విస్తరించని భారతావనిలో బ్యాంకింగ్ లావాదేవీల మీద పన్ను విధింపు, అమలు ఎంత సొగసుగా ఉండగలదో ఊహించవచ్చు. గూడ్స్, సర్వీసెస్ పన్నును తిరస్క రిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలు తమ పన్ను విధించే అధికారాలను కేంద్రానికి ధారా దత్తం చేస్తాయా? నేటి ఫెడరల్ వ్యవస్థలో ఇది సాధ్యమా? ఆచరణలో సాధ్యం కాని సంస్కరణలు ప్రతిపాదనలు హర్షణీయమా?
- ప్రొఫెసర్ ఎం.ఎల్. కాంతారావు