న్యూఢిల్లీ: సరిగ్గా ఆరేళ్ల క్రితం.. అంటే 2016 నవంబర్ 8న దేశంలో రూ.500, రూ.1,000 కరెన్సీ నోట్లు ఉన్నపళంగా రద్దయిపోయాయి. అనూహ్యంగా పెద్ద నోట్లను రద్దు (డిమానిటైజేషన్) చేస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రధానంగా నల్ల ధనాన్ని అరికట్టడానికి, ఉగ్రవాదులకు నిధులు అందకుండా చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. అయితే, నోట్ల రద్దు దుష్ఫలితాలు బయటపడడానికి ఎక్కువ రోజులు పట్టలేదు. డిమానిటైజేషన్ తర్వాత ఈ ఆరేళ్లలో ఏం జరిగిందో తెలుసుకుంటే నిరాశే మిగులుతుంది.
115 మంది బలి!
అప్పటిదాకా చెలామణిలో ఉన్న నోట్లు రద్దు కావడంలో వాటిని మార్చుకోవడానికి జనం బ్యాంకుల ముందు క్యూకట్టారు. బ్యాంకులు జనసందోహంతో కిటకిటలాడాయి. క్యూలో నిల్చొని 115 మంది చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. నోట్ల రద్దు వల్ల కరెన్సీ చెలామణి చాలావరకు తగ్గిపోతుందని, డిజిటల్ లావాదేవీలు పెరుగుతాయని అప్పట్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వాస్తవం మాత్రం మరోలా ఉంది. 2016 నవంబర్ 4న దేశంలో చెలామణిలో ఉన్న నగదు రూ.17.97 లక్షల కోట్లు కాగా, 2022 అక్టోబర్ 21 నాటికి రూ.30.88 లక్షల కోట్లకు చేరుకుంది. కేంద్రం ఇచ్చిన ‘మాస్టర్‌స్ట్రోక్’తర్వాత 2016తో పోలిస్తే 2022లో నగదు చెలామణి 72 శాతం పెరగడం గమనార్హం.
పడిపోయిన జీడీపీ వృద్ధిరేటు
నగదు రహిత లావాదేవీలను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. డిజిటల్ చెల్లింపు పద్ధతులు ఇబ్బడిముబ్బడిగా అందుబాటులోకి వచ్చాయి. అయితే, దేశంలో ఇప్పటికీ 15 కోట్ల మందికి బ్యాంకు ఖాతాలు లేవు. అనివార్యంగా నగదు లావాదేవీలపైనే ఆధారపడాల్సి వస్తోంది. నోట్ల రద్దు వల్ల వ్యాపారాలు దారుణంగా దెబ్బతిన్నాయి. బడా బాబులపై పెద్దగా ప్రభావం కనిపించలేదు. సామాన్య జనం మాత్రం ఇక్కట్ల పాలయ్యారు. ఆర్థిక వ్యవస్థ పురోగతి మందగించింది. జీడీపీ వృద్ధి రేటు 1.5 శాతం పడిపోయింది. రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేసిన ప్రభుత్వం వెంటనే కొత్తగా రూ.2,000, రూ.500 నోట్లను తీసుకొచ్చింది. డిమానిటైజేషన్ వల్ల ఎంతమేరకు నల్లధనం అంతమైపోయిందో కేంద్రం ఇప్పటికీ లెక్కలు చెప్పలేదు.
ప్రభుత్వ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం
నోట్ల రద్దు రాజ్యాంగబద్ధతను ప్రశ్నిస్తూ అడ్వొకేట్ వివేక్ నారాయణ్ శర్మ 2016 నవంబర్ 9న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అలాగే దేశవ్యాప్తంగా పలు హైకోర్టుల్లోనూ పిటిషన్లు దాఖలయ్యాయి. ప్రభుత్వ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని, అది చెల్లదని పిటిషన్లు పేర్కొన్నారు. వివేక్ నారాయణ్ శర్మ పిటిషన్‌పై అప్పటి సుప్రీంకోర్టు సీజే జస్టిస్ ఠాకూర్ నేతృత్వంలోని బెంచ్ స్పందించింది. హైకోర్టుల్లోనిపిటిషన్ల విచారణపై 2016లోస్టే విధించింది. వాటన్నింటినీ సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని ఆదేశించింది. నోట్ల రద్దుకు వ్యతిరేకంగా దాఖలైన అన్ని పిటిషన్లను రాజ్యాంగ ధర్మాసనానికి అప్పగిస్తూ నాటి సీజే నిర్ణయం తీసుకున్నారు.
నేడు సుప్రీంకోర్టు విచారణ
పెద్ద నోట్ల రద్దు వ్యవహారాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టనుంది. డిమానిటైజేషన్‌పై అఫిడవిట్లు దాఖలు చేయాలని సుప్రీంకోర్టు గత నెలలో కేంద్ర ప్రభుత్వం,ఆర్‌బీఐకి ఆదేశాలు జారీ చేసింది. రూ.500, రూ.1,000 నోట్ల రద్దు నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై అక్టోబర్‌లో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ.నజీర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టింది. అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ కేంద్రం, ఆర్‌బీఐకి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నవంబర్ 9కి వాయిదా వేసింది.
చదవండి: ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 'ఆమే' కీలకం
Comments
Please login to add a commentAdd a comment