నరేంద్ర మోదీకి ఏ శిక్ష విధించాలి?
న్యూఢిల్లీ: ‘ఒక్క 50 రోజులు ఉపేక్షించండి. ఆ తర్వాత పెద్ద నోట్లను రద్దు చేయడం తప్పని తేలితే, ఈ దేశం ఏ శిక్ష విధించినా అనుభవించేందుకు నేను నగర కూడలిలో నిలబడతా. నేను పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన రోజునే నేను చెప్పా. డిసెంబర్ 30వ తేదీ వరకు ప్రజలకు సమస్యలు తప్పవని, చెప్పాలేదా? నల్ల కుబేరులను, అవినీతి పరులను శిక్షించేందుకు 50 రోజులు ఇబ్బందులు పడాల్సి వస్తే, పడలేమా?’ నవంబర్ 13వ తేదీన గోవాలో జరిగిన బహిరంగ సభలో పెద్ద నోట్ల రద్దుపై ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ భావోద్వేగంతో అన్న మాటలివి.
‘పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు 50 రోజుల వరకు తప్పవు. ఒకప్పటికంటే ఇప్పుడు పరిస్థితి మెరుగ్గా ఉంది. నేను లెక్కలు వేశా. 50 రోజులకు పరిస్థితిలో ఎంత మార్పు వస్తుందో మీరే చూస్తారు’ డిసెంబర్ పదవ తేదీన గుజరాత్‌లో జరిగిన బహిరంగ సభలో మోదీ చేసిన వ్యాఖ్యలివి. గోవాలో చేసిన వ్యాఖ్యలకు, గుజరాత్‌లో చేసిన వ్యాఖ్యలకు జాగ్రత్తగా గమనిస్తే ఎంత తేడా ఉందో గ్రహించవచ్చు. 50 రోజుల్లో కష్టాలు తీరిపోతాయని గోవా సభలో అన్నారు. గుజరాత్ సభలో మరో 50 రోజులపాటు ఉంటాయని చెప్పారు. అలా చెప్పడం ద్వారా వివిధ వర్గాల ప్రజలకు నోట్ల కష్టాలు ఎప్పటికి తీరుతాయో తనకే తెలియదన్నట్లు చెప్పకనే చెప్పారు.
భారతీయ జనతాపార్టీ నాయకులు కూడా మోదీ 50 రోజుల గడువు మాటలకు కొత్త భాష్యం చెబుతున్నారు. ‘ప్రజల కష్టాలు 50 రోజుల వరకు తీవ్రంగా ఉంటాయి. ఆ తర్వాత క్రమంగా తగ్గుతాయి’ అన్నది మోదీ ఉద్దేశమని పార్టీ అధికార ప్రతినిధి శాంబిట్ పాత్ర డిసెంబర్ 30న ఓ టీవీ చర్చా కార్యక్రమంలో మాట్లాడారు. మోదీ గోవాలో చేసిన ప్రసంగ పాఠం ఆయనకు వినిపించగా, హిందీలో అలాగే మాట్లాడుతారని, పలు ఆంగ్ల ఛానళ్లకు హిందీ సరిగ్గా రాకపోవడం వల్ల మోదీ మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని కూడా ఆయన చర్చాగోష్ఠిలో దబాయించారు.
ఏదీ ఏమైనా మోదీ ముందు చెప్పిన గడువు శుక్రవారంతోనే ముగిసింది. నిన్న రాత్రి కూడా దేశంలో మూడింట రెండొంతుల ఏటీఎంలను పనిచేయలేదు. పనిచేస్తున్న ఏటీఎంల వద్ద ‘నో క్యాష్’ బోర్డులే దర్శనమిచ్చాయి. బ్యాంకుల్లో కూడా అదే పరిస్థితి కొనసాగింది. సామాన్యులు, చిల్లర వ్యాపారులు, రైతుల కష్టాలు ఇప్పట్లో తీరుతాయన్న గ్యారెంటీ లేదు.
మోదీ తీసుకున్న నిర్ణయం వల్ల ఎంత నల్ల డబ్బు వెలుగులోకి వచ్చింది ? ఎంత మంది నల్లకుబేరుల జాబితాలు బయటపడ్డాయి? ఎంత మందిని అరెస్ట్ చేశారు? ఎంత మంది రేపు జైలు కెళతారు? ప్రాణ త్యాగాలతో పాటు ఇంతకాలం ఇన్ని కష్టాలు అనుభవించిన ప్రజలకు రేపు ఏం ఒనగూరనుంది? కచ్చితంగా తేల్చి చెప్పాల్సిందే. లేకపోతే అంతకుఅంత శిక్ష అనుభవించేందుకు మోదీ తానే స్వయంగా చెప్పినట్లు నిజంగా నగరం నడి బజారులో నిలబడతారా? –––––ఓ సెక్యులరిస్ట్ కామెంట్