మూలాలు నరికితేనే మేలైన ఫలాలు | dileep reddy article on demonetisation and black money issues | Sakshi
Sakshi News home page

మూలాలు నరికితేనే మేలైన ఫలాలు

Published Fri, Jan 6 2017 12:52 AM | Last Updated on Wed, Apr 3 2019 5:16 PM

మూలాలు నరికితేనే మేలైన ఫలాలు - Sakshi

మూలాలు నరికితేనే మేలైన ఫలాలు

సమకాలీనం
నల్లసంపద ఏ దేశానికైనా ప్రమాదకారే. అయితే, శస్త్ర చికిత్స అవసరమైన చోట లేపనాలతో ఫలితాలుండవు. నల్ల సంపద మూలాలను అరికట్టే పాలన, రాజకీయ సంస్కరణలు, నియంత్రించే ఆర్థిక సంస్కరణలు కావాలి. బినామీ ఆస్తులు, బం గారపు నిల్వలు, ఎగుమ తులు, దిగుమతులు, రియల్‌ ఎస్టేట్‌ వ్యవహారాలు, షేర్లు, విదేశీ మారక ద్రవ్యం, విదేశీ బ్యాంకు ఖాతాల రూపేణా సాగే ఏ అక్రమ లావాదేవీలనూ వదలరాదు. నోట్ల రద్దు ప్రయోజనాల ఫలాలు సామాన్యులకు అం దకపోతే వారి త్యాగాలకు అర్థముండదు.

ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోని నల్ల సంపదకు వ్యతిరేకంగా ప్రకటించిన యుద్ధంలోని యాౖభై రోజుల తొలి అంకం విఫలమైందా? సఫలమైందా? ఈ ప్రశ్న ఇప్పుడు దేశమంతా సంచారం చేస్తోంది. రెండు వర్గాలుగా నిలువునా  చీలిన ఆర్థికవేత్తలతో సహా... చాలా మందికి చాలా అభిప్రాయాలున్నాయి. తదనుగుణంగానే వారంతా విభిన్నంగా స్పందిస్తున్నారు. గొప్ప ఆరంభమని కొందరంటున్నారు. కాగా అంచనా గల్లంతయిందనీ, కొత్త ఏటి వేకువ ముందరి సాయం సంధ్యలో  జాతినుద్దేశించి ప్రధాని చేసిన ప్రసంగం తుçస్సు మనడమే ఇందుకు నిదర్శనమని ఇంకొందరంటున్నారు. రూ.3 లక్షల కోట్ల నుంచి 5 లక్షల కోట్ల వరకు బ్యాంకులకు రాకుండా మిగిలి మురిగిపోతుం దనుకున్న  నల్లధనం నలభై, యాభై వేల కోట్లకు మించేలా లేదు. ఇక రద్ద   యిన రూ.15.4 లక్షల కోట్లకు గాను బ్యాంకులకు చేరిన 97 శాతం పెద్ద నోట్లలో నలుపెంత? తెలుపెంత? తేలాల్సి ఉంది. ఇంతలో ఐదు రాష్ట్రాల ఎ న్నికలకు నగారా మోగింది. నోట్ల రద్దు అంశాన్నే ఎజెండా చేస్తామని వైరి వర్గాలు కత్తులు నూరుతున్నాయి. ఇది, ఈ ఎన్నికల్లో సానుకూల ఫలితాలనా శించి పాలకులు వేసిన స్వల్ప కాలిక ఎత్తుగడా? సుదీర్ఘంగా ఈ దేశాన్ని ఏలాలని ప న్నిన దీర్ఘకాలిక వ్యూహమా? తదుపరి చర్యల్ని బట్టే అది తేల నుంది.

అనుబంధ చర్యలు ఎప్పుడు, ఎలా కొనసాగుతాయనేదాన్ని బట్టి నల్ల సంపదపై యుద్ధ విజయం ఆధారపడనుంది. చిత్తశుద్ధితో రాజకీయ, పాలనా సంస్కరణల్ని చేపట్టి అమలు పరచకుంటే ఈ  యుద్ధం, ఆశించిన ఫలితమి వ్వకపోగా బెడిసికొట్టే ప్రమాదముందని ప్రపంచ ఆర్థిక నిపుణులు హెచ్చరి స్తున్నారు. ఆదాయ పన్ను విధింపు పరిధిని విస్తరించి, పన్ను రేటు తగ్గించా లని ఆర్థిక మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. రాజకీయాల్నీ శుద్ధిచేస్తున్నట్టు కనిపించాలని...  ఎన్నికల్లో అభ్యర్థుల ప్రచార వ్యయాన్ని ప్రజాధనం నుంచి వెచ్చించాలనే ఆలోచనలు సాగుతున్నాయి. అంతకు ముందే, రాజకీయ పార్టీల విరాళాలు, నిధుల నిర్వహణలో పారదర్శకతను తీసుకురావాలి. అక్ర మార్జనను అరికట్టకుండా,  చిత్తశుద్ధితో సంస్కరణలు అమలు చేయకుండా పై చర్యలు ఏవి చేపట్టినా నష్టదాయకమే! ప్రజల పరిస్థితి పెనం మీంచి పొయ్యిలో పడ్డట్టవుతుంది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం మంచిదే అయినా ముందస్తు ప్రణాళిక లోపించినా, అమలు గతి తప్పినా  పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. అదే జరిగింది. దీనివల్ల ఆర్థిక సత్ప్రవర్తనతో దేశం మంచి కోసం కష్టనష్టాలన్నీ భరిస్తున్న సగటు పౌరులు భంగపోతారు. వారి ఓపికను ఇంకా పరీక్షిస్తే పాలకులు తగిన మూల్యం చెల్లించక తప్పదు.

జమిలి సంస్కరణలే శరణ్యం
ఈ వారంలో జరిగిన రెండు ముఖ్య పరిణామాలు రాజకీయ సంస్కరణలకు వాకిళ్లు తెరిచే చర్చకు తెర లేపాయి. మతం, వర్గం, కులం, ప్రాంతం, భాష వంటి వాటిని ఎన్నికల్లో లబ్ధి కోసం వాడుకోవడమూ అవినీతే అని సుప్రీం  కోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పు ఈ దిశలో ముందడుగు. ఏడుగురు న్యాయ మూర్తుల ధర్మాసనంలో వ్యక్తమైన (4:3) భిన్నాభిప్రాయాల సారం ఓ కొత్త కోణాన్ని అవిష్కరించింది. మతం, కులం ప్రాతిపదికన ఓట్లు కోరే అభ్య ర్థులతో, వారి ప్రతి నిధులతో, ఓట్లు వేసే వారిని సరిచూడలేమనే మైనారిటీ అభిప్రాయానికి మద్దతు లభిస్తోంది. రకరకాల చారిత్రక కారణాల వల్ల అణచి వేతకు గురైన వారికి రాజ్యాంగం కల్పించిన భద్రతల వల్ల సమాజంలోని కొన్ని వర్గాలు ఆయా అస్థిత్వాలతో ఉం టూ, గుర్తింపును కోరుకుకుంటాయనే వాస్తవిక అంశాన్ని విస్మరింపజాలమని వారి అభిప్రాయం. ఎన్నికల ప్రచార వ్యయంలో రూ. 20 వేలకు మించిన ప్రతి ఖర్చునూ అభ్యర్థులు చెక్కులు, ఇతర బ్యాంకు సాధనాల ద్వారా మాత్రమే  జరపాలని, అలాగే లెక్క చూపా లని కేంద్ర ఎన్నికల సంఘం కొత్త షరతు విధించింది. ఈ తాజా నిబంధన సవ్యంగా అమలయితే వ్యయ పరిమితి ఖాయమే! పాలనా సంస్కరణలకు తోడు రాజకీయ సంస్కరణలు సత్వరం అమల్లోకి వస్తే తప్ప నల్ల సం పదపై పోరు ఓSహేతుబద్ధమైన దారికి, ముగింపునకు రాదు.

నల్ల ధనం గుర్తింపు, సంపద వృద్ధి నిరోధక చర్యలు సరే... సమాంతర ఆర్థిక వ్యవస్థగా రూపొంది సమాజాన్ని అస్థిరపరుస్తున్న నల్ల సంపద సృష్టి మూలాల్లోకి వెళ్లే  చర్యలు కావాలి. మొత్తం నల్ల సంపదలో 8 శాతం కూడా లేని నల్ల డబ్బును పట్టు  కోవడానికి చేసిన ప్రయత్నమే కోట్లాది భారతీయుల్ని దాదాపు రెండు నెల లుగా ముప్పతిప్పలు పెట్టింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, ఉత్పత్తిరంగం, చిన్న వర్తక, వ్యా పారాలు ఇంకా కోలుకోలేదు. ఇది ఆర్థిక వృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపిందని నివేదకలొస్తున్నాయి. ‘ఇప్పుడున్న వ్యాపార పద్ధతులు, ప్రభుత్వ విధానాల వల్ల తలెత్తే సవాళ్లను అధిగమించకుండా డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థవైపు మళ్లడం వల్ల సత్ఫలితాలుండవు’ అని  నోబెల్‌ గ్రహీత ప్రొఫెసర్‌ జీన్‌ టిరోల్‌ అంటున్నారు. డిజిటల్‌ డాటా సురక్షితం కాదనే హెచ్చరికలూ ఉన్నాయి. ‘నోట్ల రద్దుతో భారత ఆర్థిక రంగం కుదేలయింది. ఇది అధికారి కంగా దిగువకు నడపడమే తప్ప  మరోటి కాదు’ అని అమెరికా ఆర్థికవేత్త స్టీవ్‌ హెచ్‌ హాంకే హెచ్చరించారు. తగు జాగ్రత్తలతో తదుపరి చర్యలకు సమా యత్తం కావాలి.

నల్లధనం సృష్టికి కారణమవుతున్న రాజకీయ, అధికార వ్యవస్థ పనితీరులో మార్పులు రావాలి.  రాజకీయ పార్టీలకందే విరాళాల వివ రాలు, నిర్వహణ, వ్యయం వ్యవహారాల్లో కచ్చితమైన పారదర్శకత ఉండాలి. రానున్న బడ్జెట్‌ సమావేశాల్లోనే దానిపై ఒక బిల్లు తేవాలని కేంద్రం యోచి స్తోంది. బడ్జెట్‌ సమావేశాల ముందు జరిగే అఖిలపక్ష  భేటీలోనే ఏకాభిప్రాయ సాధనకు కృషి చేయవచ్చంటున్నారు. పార్టీలకందే రూ. 2 వేల రూపాయల పైబడ్డ విరాళాలన్నీ చెక్కు, డీడీ రూపంలోనే ఉండాలని, వివరాలు వెల్లడిం చాలని నిబంధన తేవాలనుకుంటున్నారు. ఇప్పుడది రూ. 20వేల ుగా ఉంది. ఎంత భారీ విరాళాన్నయినా రూ. 20 వేలు కంటే తక్కువ భాగాలుగా విడగొట్టి లెక్క చూçపడం దాదాపు ప్రధాన పార్టీలన్నీ చేస్తున్నదే. కేంద్ర సమాచార కమి షన్, చివరకు సుప్రీం కోర్టు చెప్పినాగానీ.. తాము సమాచార హక్కు చట్టం పరిధిలోకి రామని రాజకీయ పార్టీలన్నీ మొరాయిస్తున్న తీరే వారి గోప్యతా తత్వానికి నిదర్శనం. ఈ పరిస్థితి మారాలి.

పాత సైన్యంతో కొత్త యుద్ధమా?
నల్లసంపదపై యుద్ధం ప్రకటించిన ప్రధాని మోదీ నవంబర్‌ 8న రాత్రికి రాత్రి పెద్దనోట్లను రద్దు చేసినా.. దేశం కోసం ఓపికగా సహించిన కోట్లాది మందికి ఆ తర్వాతి పరిణామాలు రుచించలేదు. చిన్ననోట్లను అందుబా టులోకి తెచ్చి, తగిన  ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడం, పెద్ద పెద్ద ఆసాములెవరూ బ్యాంకులకు రాకుండానే తమ అవసరాలను తేలిగ్గా తీర్చు కోవడం, ముఖ్యంగా ఆర్బీఐ, బ్యాంకుల ద్వారానే భారీగా కొత్త నోట్లు దొడ్డిదారిన అక్రమార్కులకు  చేరడం వంటివి వారికి మింగుడుపడలేదు. పాత నోట్లతో కొత్త నోట్లు మార్చుకునే ఓ చక్కటి సదుపాయం కూడా బ్యాంకుల అధికారులు, సిబ్బంది తప్పిదాల వల్లే అర్ధాంతరంగా రద్దయిందన్న కోపం వారికుంది.

యాభై రోజుల పైనే  బ్యాంకు సిబ్బంది పని వేళలకు మించి పనిచేస్తూ ఎంతో శ్రమించినా... డబ్బు కోసం ఇబ్బందులు పడ్డ పౌరులకు వారిపై సానుభూతి కలుగలేదు. బ్యాంకుల్లో, ఏటీఎంలలో ‘నగదు లేద’నే బోర్డులు రోజుల తరబడి వారిని వెక్కిరించేవి.  ఉత్పత్తులు నిలుపుకొని, వ్యాపారాలు ఆపి, పెళ్లిళ్లు రద్దు చేసుకొని, ఉద్యోగ, ఉపాధులు కోల్పోయి... జరుగుబాటుకు చేతిలో డబ్బుల్లేక తాము నానా యాతన పడుతుంటే, పెద్ద వారు నిక్షేపంగా ఉండటం చూస్తే వారికి పుండు మీద కారం చల్లినట్టయింది. అన్నీ భరిస్తూ, దేశానికి ఏదో మేలు జరిగిపోతుందని నిరీక్షిస్తుంటే.. రద్దయిన నోట్లన్నీ బ్యాంకులకు చేరాయని తెలిసి అత్యధికులు నీరుగారి పోయారు.

నవంబర్‌ 8న ఉత్సాహం పెల్లుబికిన ప్రధాని ప్రసంగం, 31 డిసెంబర్‌ నాటికి చిన్న  చిన్న రాయితీల ప్రకటనలతో చప్పగా సాగిన తీరు ప్రజానీకాన్ని నిస్స త్తువకు గురిచేసింది. ఆశించిన ఫలితం దక్కనందునే ఆయన యాభై రోజుల ప్రగతి సమీక్షను, యుద్ధం తదుపరి గణాంకాలనుగానీ వెల్లడి చేయలేదేమోన నని అధికులకు అనిపించింది. బ్యాంకుల్లోకి వచ్చిన సొమ్మంతా తెల్లధనం కాదని, ఆదాయపు పన్ను అధికారులు తగిన నోటీసు లిచ్చి, నలుపు, తెలు పుల లెక్క తేలుస్తారని ఆర్థిక మంత్రి జైట్లీ ప్రకటించారు. దేశంలోని మొత్తం బ్యాంకు  ఖాతాలు సుమారు 55 కోట్లు కాగా, 60 లక్షల ఖాతాల్లోకే రూ. 7 ఏడు లక్షల కోట్లు (సగం డబ్బు) వచ్చి చేరడం విస్మయ కరం. అందులోనూ సగం డబ్బు, అంటే రూ. 3 నుంచి 4 లక్షల కోట్లు వ్యక్తిగత ఖాతాల్లోకే చేరింది.  ఆదాయపు పన్ను శాఖ వీటి రంగు తేల్చాల్సి ఉంది. సిబ్బంది కొరత పెద్ద అవరోధంగా ఉంది. పైగా మన దేశంలో నిబంధనలను పాటించడం కన్నా నియంత్రణ వ్యవస్థల్ని లంచాలతో మేపడం చౌక అనే అభిప్రాయముంది. ఐటీ చట్టంలోని సందేహాస్పద అం శాలను, సంశయ లాభాలను సానుకూ లంగా మలచుకొని ఇబ్బడిముబ్బడిగా సొమ్ముచేసుకునే ఐటీ అధికారుల కథలు విన్నాం. ఇప్పుడూ అదే జరిగితే!? అందుకే, రాజకీయ సంస్కరణలతో పాటు పాలనా సంస్కరణలూ రావాలనే వాదన బలపడుతోంది.

వ్రతం చెడ్డా ఫలితం దక్కాలి
నల్లసంపద ఏ దేశానికైనా ప్రమాదకారే. సమాజంలో అశాంతిని రేపుతున్న ఆర్థిక అంతరాల వృద్ధికి అది ప్రధాన కారణం. అయితే, శస్త్ర చికిత్స అవస రమైన చోట లేపనాలతో ఫలితాలుండవు. నల్ల సంపద సృష్టి జరిగే మూలా లను వదిలి కేవlలం చలామణిలోని ద్రవ్యాన్ని తగ్గిస్తే ఫలితం ఉండదని ఆర్థిక నిపుణులు అభిజిత్‌ సేన్‌ అన్నారు. నల్ల సంపదకు హేతువవుతున్న మూలా లను అరికట్టే పాలన, రాజకీయ సంస్కరణలతో పాటు ఎప్పటికప్పుడు నియంత్రించే ఆర్థిక సంస్కరణల అమలూ  పకడ్బందీగా జరగాలి. ప్రధాని ఇదివరకే ప్రకటించినట్టు బినామీ ఆస్తుల నిర్వహణపైన, బంగారపు నిల్వల పైన నిఘా వేయాలి. ఎగుమతులు, దిగుమతులు, రియల్‌ ఎస్టేట్‌ వ్యవహా రాలు, షేర్లు, ఈక్విటీ పార్టిసిపేషన్స్, విదేశీ మారక ద్రవl్యం, విదేశీ బ్యాంకు ఖాతాల్లో మన వారి గుప్త నిల్వలపై శాస్త్రీయ పరిశీలన అవసరం. చట్ట నిబం ధనలకు వ్యతిరేకంగా ఏదీ జరక్కుండా చూసే వ్యవస్థల్ని బలో పేతం చేయాలి. రాజకీయాలకు అతీతంగా ఈ చర్యలన్నింటినీ వ్యవస్థాగతం చేయాలి.  

ప్రత్యక్షంగా, పరోక్షంగా దేశ ప్రజలందరినీ నొప్పించిన నోట్ల రద్దు ప్రక్రియతో జరిగిన ప్రయోజనాల ఫలాల్ని సామాన్యులకందించాలి. ‘ఈ దెబ్బతో మిగులు రాబడిగా కనీసం రూ. 50 వేల కోట్లయినా ప్రభుత్వానికి రాకుంటే ఈ ప్రయాసంతా వృ«థా’ అన్న ఆర్‌బీఐ  మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు వ్యాఖ్యలు అక్షర సత్యాలు. ఈ క్రతువుతో నల్ల ధన లావాదేవీలు తగ్గుతాయి. పన్ను పరిధి విస్తరిస్తుంది. ఆర్థిక పారదర్శకత మెరుగయినట్టే! దానికి తోడు, పెద్ద మొత్తంలో డబ్బు బ్యాంకులకు వచ్చి  చేరింది. ముంచే కార్పొరేట్లకు ఊడిగం మానాలి. ప్రధాని అన్నట్టు సామాన్యులు, మధ్య తర గతి జీవులు, ముఖ్యంగా వ్యవసాయదారులపట్ల బ్యాంకులు మరింత ఉదా రంగా ఉండి రుణ సదుపాయం కల్పించి ఆర్థిక వృద్ధికి దోహదపడాలి. ఇవన్నీ  జరిగితే గాని సగటు మనిషి త్యాగాలకు అర్థముండదు.


దిలీప్‌ రెడ్డి
ఈ మెయిల్‌ : dileepreddy@sakshi.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement