అది 1978, జనవరి 14వ తేదీ ఉదయం. ముంబై (అప్పుడు బొంబాయి)లో ఉన్న రిజర్వ్ బ్యాంకు చీఫ్ అకౌంట్స్ కార్యాలయంలో సీనియర్ అధికారి ఆర్. జానకి రామన్ ఇంట్లో ఫోను మోగింది. వెంటనే ఢిల్లీ రావలసిందని ఒక ప్రభుత్వ అధికారి ఆదేశం. ఆయన ఢిల్లీ వెళ్ళీ వెళ్ళగానే అక్కడి ఉన్నతాధికారులు, ఒక ఆర్డినెన్స్ ముసాయిదాను ఒకే ఒక్క రోజులో తయారు చేయాలని ఆయన్ని కోరారు. పెద్ద విలువ కలిగిన కరెన్సీ నోట్లని చలా మణి నుంచి తప్పించాలని ప్రభుత్వం సంకల్పిం చిందనీ, అందుకు తగిన ఆర్డినెన్స్ సిద్ధం చేయాలనీ, ఇదంతా చాలా గోప్యంగా జరగాలనీ రామన్‌ను ఆదేశించారు.
అనుకున్న పద్ధతిలోనే ఆర్డినెన్స్ ముసాయిదా తయారయింది. జనవరి 16 తెల్లవారు జాము కల్లా రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి సంతకం కోసం పంపారు. అదే రోజు ఉదయం తొమ్మిది గంటలకు ఆకాశవాణి ద్వారా పెద్ద కరెన్సీ నోట్లను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దేశ ప్రజలకు తెలిసిపోయింది. అప్పటి ఆర్బీఐ గవర్నర్ ఐ.జీ. పటేల్‌కు ఈ రద్దు వ్యవహారం నచ్చలేదు. సంకీర్ణ జనతా ప్రభుత్వంలోని కొందరు నాయకులు పెద్ద నోట్ల రద్దుకు పట్టుబట్టడం వల్ల ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నది ఆయన అభి ప్రాయం. అంతకు పూర్వం దేశాన్ని పాలించిన నాయకుల అవినీతి పనులను లక్ష్యంగా పెట్టుకుని ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం తీసుకుందని పటేల్ చెప్పారు. భారతీయ ఆర్థిక విధానాలపై పటేల్ రాసిన పుస్తకంలో ఇంకా ఇలా పేర్కొన్నారు.
‘పెద్ద విలువ కలిగిన కరెన్సీ నోట్లను రద్దు చేయాలనే నిర్ణయం గురించి ఆర్థిక మంత్రి హెచ్.ఎం. పటేల్ నాతో ప్రస్తావించారు. అటువంటి సంచలన నిర్ణయాలతో అద్భుత ఫలితాలు రాబ ట్టడం చాలా అరుదుగా జరుగుతుందని నేను మంత్రితో స్పష్టంగా చెప్పాను.’ ‘సాధారణంగా అవినీతి, అక్రమ పద్ధతుల్లో భారీఎత్తున డబ్బు పోగేసుకునేవాళ్ళలో అత్యధికులు ఆ సంపదను కరెన్సీ రూపంలో ఎక్కువ కాలం దాచిపెట్టుకోరు’ అన్నది నాటి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ అభిప్రాయం.
1978లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ శకం ముగిసిన తరువాత ప్రజల తీర్పుతో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి కాంగ్రెసేతర జనతా ప్రభుత్వం వెయ్యి, అయిదు వేలు, పదివేల రూపాయల నోట్లను రద్దు చేయాలని సంకల్పించి, ఆ నిర్ణయాన్ని వెంటనే అమలు చేసింది. అప్పుడు జనతా ప్రభుత్వానికి నేతృత్వం వహించింది గుజరాత్‌కు చెందిన మొరార్జీ దేశాయ్. మళ్ళీ ఇన్నేళ్ళ తరు వాత, 2016 నవంబర్ ఎనిమిదో తేదీన అయిదు వందలు, వెయ్యి రూపాయల కరెన్సీ నోట్లని రద్దు చేయాలని నిర్ణయించింది కూడా అదే రాష్ట్రానికి చెందిన నేటి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఇది కాకతాళీయం కావచ్చు. అలాగే ఈ రెండు నిర్ణయాలు కాంగ్రెసేతర ప్రభుత్వాలవి కావడం మరో పోలిక.
నవంబర్ ఎనిమిది సాయంత్రం ఢిల్లీలో కేంద్ర మంత్రిమండలి సమావేశం జరిగింది. సమావేశం ముగిసే సమ యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పెద్ద నోట్ల చలామణి రద్దు నిర్ణయాన్ని క్లుప్తంగా తెలియచేసి మంత్రులనందరినీ సమావేశ మందిరంలోనే కూర్చో బెట్టి ప్రభుత్వ సంకల్పాన్ని రాష్ట్రపతికి తెలియ చేయడానికి వెళ్ళారు. ఆ తరువాత నేరుగా దేశ ప్రజలనుద్దేశించి రేడియో, దూరదర్శన్‌లలో ప్రసం గించారు. నోట్ల రద్దు నిర్ణయం గురించి మొత్తం దేశంలో తెలిసిన వాళ్ళు పది మంది మాత్రమే అనీ, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ పదవి నుంచి తప్పుకున్న రఘురాం రాజన్ అందులో ఒకరనీ తెలుసుకుని ఆశ్చర్యపోవడం మీడియా వంతయింది.
నోట్ల రద్దుకు ఆరు నెలల ముందు నుంచే ఏర్పాట్లు జరిగాయి. ఆ ఏర్పాట్లలో భాగమే కొత్త రెండువేల రూపాయల నోటు నమూనా తయారు చేయడం, ఆమోదించడం, ఆ నోట్లను పెద్ద మొత్తంలో ముద్రించడం. ప్రధాని ప్రసంగం ముగించిన వెంటనే, దాన్ని విన్న ప్రజలందరికీ, దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్న నల్ల ధనం పిశాచి భరతం పట్టడానికి మోదీ ఎంతో సాహసోపేత నిర్ణయం తీసుకున్నారన్న ఒకే అభి ప్రాయం కలిగింది. ‘కొద్ది రోజులు కటకట పడితే పడదాము, కష్టాలు శాశ్వతంగా తీరిపోతున్నప్పుడు తాత్కాలిక ఇబ్బందులను పట్టించుకోవద్దు’ అనే భావన సర్వత్రా కనబడింది.
అయితే రోజులు గడుస్తున్న కొద్దీ సామాన్య జనం ఆలోచనల్లో మార్పు రావడం మొదలయింది. అనుకున్నది ఒకటయితే, జరుగుతున్నది మరొ కటన్న అభిప్రాయం బలపడసాగింది. బడా బాబులు ఎవ్వరూ ప్రభుత్వ నిర్ణయంతో కలవర పడక పోవడం వారిని ఆశ్చర్య పరిచింది. ఏమీ జరగనట్టు నల్ల కుబేరులు నిబ్బరంగా వుంటుంటే, తాము మాత్రం రాత్రీ పగలూ తేడా లేకుండా బ్యాంకుల ముందూ, ఏటీఎంల వద్దా పడిగాపులు పడడం ఏమిటన్న సందేహం పొట మరించింది. తమ డబ్బు తాము తీసుకోవడానికి ఇంతగా హైరానా పడాలా అనే ప్రశ్నలు వారిని వేధించడం మొదలు పెట్టాయి. అయితే ప్రజలకు ఉన్న ఓరిమి చాలా గొప్పది. సర్దుకుపోయే తత్వం ఇంకా గొప్పది. అంచేతే మంచి రోజుల కోసం ఎదురు చూడడానికే సిద్ధపడ్డారు.
తరువాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు మోదీకి బ్రహ్మరథం పట్టారు. దానితో పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి దేశ ప్రజల మద్దతు పూర్తిగా లభించినట్టు అయింది. దేశానికి సంబంధించి తీసుకున్న ఒక కీలక, ప్రధాన నిర్ణయానికి ప్రజల మద్దతు పొందడం మామూలు విషయం కాదు. ఆ మేరకు ప్రధాని మోదీ చాలా అదృష్టవంతుడనే చెప్పాలి. కానీ నల్లధనం రద్దుకు తీసుకున్న ఈ నిర్ణయం వికటించిందా, ఫలించిందా అంటే ఔనని చెప్పలేని పరిస్థితి.
అయితే సామాన్య ప్రజలకు అంతకు ముందు లేని ఒక మంచి అలవాటు అలవడింది. చిన్న చిన్న లావాదేవీలకు కూడా నగదు రహిత చెల్లింపులకు అలవాటు పడ్డారు. పెద్ద నోట్లు రద్దు చేసిన సమయంలో దేశంలో ద్రవ్య చలామణి 17.97 లక్షల కోట్లు వుండగా ఇప్పుడది 72 శాతం పెరిగి 30.88 లక్షల కోట్లకు చేరుకుందని గణాంకాలు చెబు తున్నాయి. గత ఆరేళ్ల కాలంలో దేశ వ్యాప్తంగా అనేక ఎన్నికలు జరిగాయి. ప్రతి చిన్నా, పెద్దా ఎన్నికల్లో అన్ని పార్టీల వాళ్ళు విచ్చల విడిగా డబ్బు వెదజల్లారు. ఇదంతా ప్రజలు కళ్ళారా చూశారు. చెవులారా విన్నారు.
పెద్దనోట్లు రద్దు చేసిన తర్వాత కూడా బడా బాబుల దగ్గర ఇంతంత డబ్బు ఎలా పోగుపడింది? పెద్ద నోట్ల రద్దు పెద్దగా ఫలించలేదు అనడానికి ఇది తార్కాణం. కారణం తెలుసుకునే హక్కు ప్రజలకు వుంది.
భండారు శ్రీనివాసరావు
వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్
Comments
Please login to add a commentAdd a comment