న్యూఢిల్లీ: కాంగ్రెస్ సారథ్యంలోని గత యూపీఏ ప్రభుత్వం అధికార వ్యామోహంతో జాతి ప్రయోజనాలను పక్కనబెట్టిందని, బ్యాంకింగ్ వ్యవస్థను నాశనం చేసిందని ప్రధాని మోదీ ఆరోపించారు. తమ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థలను తిరిగి గాడినపెట్టిందని చెప్పారు. శనివారం ప్రధాని మోదీ రోజ్‌గార్ మేళాను వర్చువల్‌గా ప్రారంభించి, మాట్లాడారు. కార్యక్రమంలో భాగంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో 70వేల మందికి నియామక పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా ప్రధాని ప్రసంగించారు. ‘ఆ ఒక్క కుటుంబానికి సన్నిహితులైన కొందరు రాజకీయ నేతలు బ్యాంకుల నుంచి తమ వారికి వేల కోట్ల రూపాయలను ఇప్పించి, ఎప్పటికీ తిరిగి చెల్లించేవారు కాదు. అప్పట్లో జరిగిన ఫోన్ బ్యాంకింగ్ స్కాం అతిపెద్ద కుంభకోణం. అది దేశ బ్యాంకింగ్ వ్యవస్థ వెన్ను విరిచేసింది’అని ప్రధాని తెలిపారు. ఇప్పుడు అందరూ ఫోన్ బ్యాంకింగ్‌ను వాడుకుంటున్నారు. కానీ, అప్పట్లో జరిగింది వేరని వ్యాఖ్యానించారు. ప్రపంచంలోనే పటిష్టమైన బ్యాంకింగ్ వ్యవస్థ ఉన్న దేశాల్లో భారత్ కూడా ఉందన్నారు.
తమ ప్రభుత్వం తీసుకున్న బ్యాంకుల నిర్వహణను బలోపేతం చేయడం, బ్యాంకులను విలీనం చేయడం, ఈ రంగంలో వృత్తినైపుణ్యంను పెంచడం వంటి అనేక చర్యలతో ఇది సాధ్యమైందని వివరించారు. గతంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు వేలాది కోట్ల నిరర్ధక ఆస్తులతో కునారిల్లుతూ ఉండేవి. కానీ, నేడవి రికార్డు స్థాయిలో లాభాలను ఆర్జిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రజలకు సేవలందించడంలో, ముద్ర వంటి వివిధ ప్రభుత్వ పథకాలను అమలు చేయడంలో బ్యాంకింగ్ రంగ ఉద్యోగులు శ్రమిస్తున్న తీరు, నిబద్ధతలను ఆయన కొనియాడారు.
వాతావరణ కార్యాచరణలో భారత్ ముందుంది
పణజి: వాతావరణ కార్యాచరణలో భారతదేశం ముందుండి నడిపిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. హరితాభివృద్ధి, ఇంధన పరివర్తన వంటి వాతావరణ పరిరక్షణ హామీలను ఒక్కటొక్కటిగా నెరవేరుస్తోందని అన్నారు. శనివారం ప్రధాని గోవాలో జరుగుతున్న జీ20 కూటమి దేశాల ఇంధన మంత్రుల సమావేశాన్ని ఉద్దేశించి వర్చువల్‌గా మాట్లాడారు.
స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యంలో 50 శాతం మృత్తికేతర ఇంధన వనరుల నుంచి 2030నాటికి సాధించాలన్న లక్ష్యం కోసం భారత్ ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు. పవన, సౌర విద్యుదుత్పాదనలో సైతం అగ్రగామి దేశాల సరసన భారత్ నిలిచిందని తెలిపారు. వీటితోపాటు తక్కువ వడ్డీకే రుణాలివ్వడం ద్వారా అభివృద్ధి చెందుతున్న దేశాలకు చేయూతనివ్వాల్సిన బాధ్యత ఉందని చెప్పారు. ‘సాంకేతికతలో అంతరాలను పూడ్చటం, ఇంధన భద్రత పెంపు, సరఫరా గొలుసుల్లో వైవిధ్యత వంటివాటి కోసం నూతన మార్గాలను అన్వేషించాల్సి ఉంది.
భవిష్యత్తు ఇంధనాల కోసం సహకారాన్ని బలోపేతం చేసుకోవాల్సి ఉంది. ఇంధన భద్రతను పెంచుకునేందుకు దేశాల మధ్య గ్రిడ్లు, అనుసంధానతలపై దృష్టి సారించాలి. పరస్పరం అనుసంధానించిన గ్రీన్‌గ్రిడ్లు గొప్ప మార్పును తీసుకువస్తాయి’అని ప్రధాని మోదీ అన్నారు. వీటివల్ల వాతావరణ లక్ష్యాలు, హరిత పెట్టుబడుల సాధన, కోట్లాదిమందికి హరిత ఉద్యోగావకాశాల కల్పనకు వీలవుతుందని తెలిపారు. ‘ఇంధనం లేనిదే అభివృద్ధి, భవిష్యత్తు స్థిరత్వంపై చర్చ పూర్తికాదు. వ్యక్తుల నుంచి దేశాల వరకు అభివృద్ధిలో అన్ని స్థాయిల్లోనూ ఇంధన కీలకంగా మారిందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment