ముంబై: భారత్ ఎకానమీ పటిష్టంగా, నిలకడగా పురోగమిస్తోందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఫైనాన్షియల్ స్టెబిలిటీ నివేదిక (ఎఫ్‌ఎస్‌ఆర్) ఉద్ఘాటించింది. తగిన మూలధనం, అలాగే మొండిబకాయిలు (ఎన్‌పీఏ) బహుళ సంవత్సర కనిష్ట స్థాయికి తగ్గుతూ కొనసాగుతున్న పటిష్ట బ్యాంకింగ్ వ్యవస్థ, ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు వంటి ఆర్థిక మూలస్తంభాల పటిష్టత వంటి అంశాలు ఎకానమీకి వెన్నుదన్నుగా నిలుస్తున్నట్లు నివేదిక వివరించింది.
ఈ మేరకు ఆర్థిక స్థిరత్వం, అభివృద్ధి మండలి (ఎఫ్‌ఎస్‌డీసీ) సబ్–కమిటీ ఇచి్చన నివేదికలో ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ముందుమాట రాస్తూ, అంతర్జాతీయంగా తీవ్ర అనిశ్చితి నెలకొన్నప్పటికీ, భారత్ ఎకానమీ పటిష్ట రికవరీ బాటన పయనిస్తోందన్నారు. ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న ఎకానమీల్లో ఒకటి నిలుస్తోందని పేర్కొన్నారు. ఆర్థిక స్థిరత్వం అనే అంశంపై రాజీపడే ప్రశ్నేలేదని, ఈ వ్యవస్థలోని అన్ని స్థాయిల్లోని వారు ఇందుకు తగిన కృషి చేయాలని అన్నారు. సవాళ్లను ఎదుర్కొనడానికి ఇది అవసరమనీ ఉద్ఘాటించారు. నివేదికలోని ముఖ్యాంశాలను పరిశీలిస్తే..
► 2018 మార్చిలో బ్యాంకింగ్ వ్యవస్థలో స్థూల మొండి బకాయిలు, నికర మొండిబకాయిలు వరుసగా 11.5 శాతం, 6.1 శాతాలుగా ఉన్నాయి. 2023 మార్చిలో ఇవి వరుసగా 3.9 శాతం, 1 శాతానికి తగ్గాయి.
► రిటర్న్ ఆన్ అసెట్స్ (ఆర్‌ఓఏ) 2018లో కనిష్ట స్థాయి – 0.2 శాతం నుండి 2023లో 1.1 శాతానికి పెరగడంతో బ్యాంకింగ్ వ్యవస్థ లాభదాయకత మెరుగుపడింది.
► బ్యాంకింగ్ బ్యాలెన్స్ షీట్‌మెరుగుపడ్డం విస్తృత స్థాయిలో అన్ని రంగాలకూ బ్యాంకింగ్ రుణ వృద్ధినీ పెంచుతోంది.
► 2022–23లో బ్యాంకింగ్ డిపాజిట్ల వృద్ధి 10 శాతం. 2023 జూన్ తొలి నాళ్లలో ఈ రేటు 11.8 శాతానికి పెరిగింది. రూ.2000 నోట్ల ఉపసంహరణా దీనికి ఒక కారణం.
► రిటైల్ రుణాలు మార్చి 2021 నుండి మార్చి 2023 వరకు 24.8 శాతం వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్)ను నమోదుచేసుకున్నాయి. స్థూలంగా చూస్తే ఈ వృద్ధి రేటు 13.8 శాతంగా ఉంది. ► సైబర్ దాడులు, వాతావరణ మార్పు వంటి ఇతర సవాళ్లను పరిష్కరించడానికి అంతర్జాతీయ పరస్పర సహకారం అవసరం.
► జీ 20కి భారత్ నేతృత్వం వహిస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రపంచ దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి తగిన కృషి చేస్తుంది. ‘ఒక భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు’ థీమ్‌తో సవాళ్లపై పోరాటానికి దేశాల మధ్య పరస్పర సహకారానికి, సమన్వయ చర్యలకు భారత్ ప్రయతి్నస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment