GDP Growth
-
నాలుగేళ్ల కనిష్టానికి జీడీపీ వృద్ధి
న్యూఢిల్లీ: బలహీనమైన డిమాండ్ వంటి పలు కారణాల నేపథ్యంలో మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2024–25) స్థూల దేశీయోత్పత్తి (GDP) వృద్ధి వృద్ధి రేటు 6.3 శాతంగా ఉంటుందని బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) పరిశోధనా నివేదిక పేర్కొంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (6.6 శాతం), జాతీయ గణాంకాల కార్యాలయం మొదటి ముందస్తు అంచనాలు(6.4 శాతం), ఆర్థిక శాఖ తొలి అంచనా (7 శాతం) కన్నా ఎస్బీఐ రీసెర్చ్ అంచనా తక్కువగా ఉండడం గమనార్హం.వ్యవస్థలో డిమాండ్ ధోరణులు బలహీనంగా ఉన్నాయని నివేదిక పేర్కొంది. 2020–21లో కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో ఎకానమీలో అసలు వృద్ధిలేకపోగా 5.8 శాతం క్షీణతను నమోదుచేసిన సంగతి తెలిసిందే. అటు తర్వాత 6.3 శాతం వృద్ధి రేటు నమోదయితే అది నాలుగేళ్ల కనిష్ట స్థాయి అవుతుంది. బేస్ ఎఫెక్ట్‌తో 2021–22లో ఎకానమీ వృద్ధి రేటు 9.7 శాతంగా నమోదయ్యింది. 2022–23లో 7 శాతం, 2023–24లో 8.2 శాతంగా ఈ రేట్లు ఉన్నాయి.ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 6.7 శాతం వృద్ధి నమోదవగా, రెండవ క్వార్టర్లో 7 క్వార్టర్ల కనిష్ట స్థాయిలో 5.4 శాతంగా నమోదయిన సంగతి తెలిసిందే. గ్రూప్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ సౌమ్య కాంతి ఘోష్ రూపొందించిన ఈ నివేదికలోని మరిన్ని ముఖ్యాంశాలు...జీడీపీ వృద్ధిలో మందగమనం ఉన్నప్పటికీ తలసరి ఆదాయం 2023–24తో పోల్చితే, 2024–25లో రూ. 35,000 పెరిగే అవకాశం ఉంది. భారీ పెట్టుబడులుకు సంబంధించిన విభాగ ం– క్యాపిటల్ ఫార్మేషన్లో వృద్ధి రేటు 270 బేసిస్ పాయింట్లు (2.7%) 7.2 శాతానికి దిగిరానుంది. ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు 2024–25 జీడీపీలో 4.9 శాతంగా (బడ్జెట్ లక్ష్యం ప్రకారం) ఉంటుంది. -
జీడీపీ మందగమనం
దేశ ఆర్థిక వ్యవస్థ ఇటీవలి కాలంలో అంచనాలను మించలేకపోతుంది. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో దేశార్థికం భారతీయ రిజర్వు బ్యాంకు ఆశించిన ఆశించినంత వృద్ధి రేటు సాధించలేకపోయింది. 7 శాతం వృద్ధి నమోదవుతుందని అంచనా వేస్తే ఈసారి కనిష్ఠంగా 5.4 శాతం వృద్ధి కనబరిచింది. గడిచిన త్రైమాసికంలో అదే తంతు కొనసాగింది. ఏప్రిల్-జూన్ కాలంలో అంచనా వేసిన 7.1 శాతం వృద్ధిని చేరుకోలేక 6.7 శాతంతో సరిపెట్టుకుంది.సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) ఆశించినంత పెరగదని రిజర్వు బ్యాంకు ముందుగానే అంచనా వేసింది. అందుకు విభిన్న అంశాలు కారణమని ఆర్బీఐ విశ్లేషించింది. ఎన్నికల వల్ల వివిధ పథకాలు, ప్రాజెక్టులపై ప్రభుత్వ వ్యయం తగ్గడం, వ్యవసాయ, సేవా రంగాల్లో క్షీణత జీడీపీ వృద్ధికి నిరోధంగా నిలిచాయి. రెండో త్రైమాసికంలోనూ ఆర్థిక వృద్ధిని వెనక్కు లాగిన కొన్ని అంశాలను ఆర్బీఐ వెల్లడించింది.వేతనాల్లో మార్పు లేకపోవడం: కొన్ని రాష్ట్రాల్లో వాస్తవ వేతన వృద్ధిలో ఎలాంటి మార్పులు లేవు. దాంతో వృద్ధికి ప్రతికూలంగా మారింది. ఇది వినియోగదారుల కొనుగోలు శక్తిని తగ్గిస్తుంది.అధిక ఆహార ద్రవ్యోల్బణం: రిటైల్ ఆహార ధరలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఇది పట్టణ వినియోగాన్ని ప్రభావితం చేస్తోంది.బలహీనమైన తయారీ రంగం: తయారీ రంగం 2024-25 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో కేవలం 2.2 శాతం మాత్రమే వృద్ధి చెందింది.తగ్గిన ప్రభుత్వ వ్యయం: ప్రభుత్వ మూలధన వ్యయం తగ్గుతోంది. దానివల్ల ఉపాధి సృష్టి జరగక వినియోగం మందగిస్తోంది. ఫలితంగా ఆర్థిక వృద్ధి సన్నగిల్లుతోంది.ప్రతికూల వాతావరణ పరిస్థితులు: మైనింగ్, విద్యుత్ ఉత్పత్తి వంటి రంగాలపై వర్షాల ప్రభావం తీవ్రంగా పడింది. ఆయా విభాగాల్లో ఉత్పత్తి తగ్గిపోయింది.కార్పొరేట్ ఆదాయాలు: చాలా కంపెనీలు రెండో త్రైమాసికంలో ఆశించినమేర ఆదాయాలు పోస్ట్ చేయలేదు. ఇది వస్తు వినియోగం తగ్గుదలను సూచిస్తుంది.ఇదీ చదవండి: ఈపీఎఫ్ఓ క్లెయిమ్ తిరస్కరించారా? ఇవి తెలుసుకోండి!ఈ ఆర్థిక సంవత్సర మొదటి త్రైమాసికంలో భారతదేశ వాస్తవ జీడీపీ రూ.43.64 లక్షల కోట్లకు చేరుకుంది. అది రెండో త్రైమాసికంలో రూ.44.1 లక్షల కోట్లకు పెరిగింది. ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుని అంచనా వేసిన స్థూల దేశీయోత్పత్తిని ‘వాస్తవ జీడీపీ’ అంటారు. ఒక ప్రాతిపదిక సంవత్సర ధరలను తీసుకుని ద్రవ్యోల్బణం వల్ల వాటిలో వచ్చిన మార్పులను సరిచేస్తే వాస్తవ జీడీపీ వస్తుంది. -
ప్రకృతి బీభత్సం.. ఆర్థిక నష్టం..!
దేశవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు ఆయా ప్రాంతాలను ముంచెత్తుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల వర్షం బీభత్సానికి వంతెనలు కూలిపోయాయి. రోడ్లు చిధ్రం అయ్యాయి. వీధుల్లో బోట్లు ప్రత్యక్షమయ్యాయి. పంటలు కొట్టుకుపోయాయి. రవాణా నిలిచిపోయింది. ఇళ్లల్లో నీరు చేరింది. ఏటా కురిసే ఇలాంటి అకాల వర్షాలకు దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ప్రభావం చెందుతోంది. కేవలం వర్షం వల్ల ఏర్పడే వరదలే కాకుండా, తుఫానులు, కరవులు, భూకంపాలు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, హిమానీనదాలు ముంచెత్తడం వంటి ఎన్నో విపత్తులు ఆర్థిక వ్యవస్థను వెనక్కి లాగుతున్నాయి.ప్రకృతి విపత్తులు ఏర్పడినపుడు స్థానిక ప్రభుత్వ యంత్రాంగం, స్వచ్ఛంద సంస్థలు, యువత సహకారం అందుతున్నప్పటికీ తిరిగి స్థానికంగా ఆర్థిక వ్యవస్థ కొలుకోవాలంటే చాలా సమయం పడుతుంది. చిరు వ్యాపారులు తీవ్ర అప్పుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. దేశ జీడీపీ వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు అకాల వర్షాలకు తీవ్రంగా ప్రభావితం చెందుతాయి. ఏటా పత్తి, మిరప, పనుపు..వంటి పంట ఉత్పత్తులను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ప్రకృతి విపత్తులతో పంట నష్టం జరిగి ఎగుమతులు తగ్గిపోయే ప్రమాదం ఉంది.గతంలో సంభవించిన ప్రకృతి విపత్తుల వల్ల దేశంలో ఏ మేరకు నష్టం వాటిల్లిందో భారతీయ స్టేట్ బ్యాంక్ గతంలో పరిశోధన పత్రాన్ని విడుదల చేసింది. అందులోని వివరాల ప్రకారం.. 2021 వరకు దేశంలో 756 అతి తీవ్ర ప్రకృతి విపత్తులు ఏర్పడ్డాయి. దాంతో రూ.12.08 లక్షల కోట్ల నష్టం వాటిల్లింది. వరదల వల్ల రూ.7.2 లక్షల కోట్లు, తుఫానుల వల్ల రూ.3.7 లక్షల కోట్లు, కరవుల వల్ల రూ.54 వేలకోట్లు, భూకంపాలు రూ.44 వేలకోట్లు, తీవ్ర ఉష్ణోగ్రతల వల్ల రూ.4,197 కోట్లు, హిమానీనదాలు ముంచెత్తడం వల్ల రూ.1,678 కోట్ల నష్టం ఏర్పడింది.ఇదీ చదవండి: తగ్గిన దేశ జీడీపీ వృద్ధి రేటు.. కారణాలు..ప్రకృతి విపత్తుల సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఇలాంటి ప్రకృతి వైపరీత్యాల నేపథ్యంలో దేశ ఆదాయం తిరిగి వెంటనే పుంజుకునేలా ఇరు ప్రభుత్వాలు ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేయాలని చెబుతున్నారు. -
RBI: ఊహించిందే జరిగింది
భారత స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) 2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో తగ్గినట్లు రిజర్వ్ బ్యాంకు తెలిపింది. ఈ తగ్గుదలను ముందుగానే ఊహించినట్లు ఆర్బీఐ పేర్కొంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ పథకాలు, ఇతర ప్రాజెక్ట్‌లపై పెట్టే వ్యయం తగ్గడం వల్లనే ఇలా జీడీపీ ముందగమనంలో ఉందని స్పష్టం చేసింది.2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో దేశ వాస్తవ జీడీపీ(ద్రవ్యోల్బణాన్ని పరిగణించిన తర్వాత) వృద్ధి రేటు 6.7 శాతంగా నమోదైంది. గతేడాది సరాసరి అన్ని త్రైమాసికాల్లో కలిపి ఇది 8 శాతంగా ఉంది. ఈసారి జీడీపీ తగ్గడానికి వ్యవసాయం, సేవల రంగం ప్రధాన కారణాలుగా నిలిచాయి. అయితే పారిశ్రామిక వస్తువుల ఉత్పత్తి మెరుగవడం కొంత జీడీపీకి ఊతమిచ్చిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. దేశ జనాభాలో అత్యధికంగా ప్రాథమిక రంగాలపైనే ఆధారపడి జీవిస్తున్నారు. అంటే వ్యవసాయం, వ్యవసాయ సంబంధిత పాడి పరిశ్రమ, చేపలు, గొర్రెల పెంపంకం, అటవీ ఉత్పత్తులపై ఆధారపడి ఉపాధి పొందుతున్నారు. ఈ రంగం జీడీపీ వృద్ధిని వెనక్కులాగడం ఆందోళన కలిగించే అంశంగా మారింది. ప్రాథమిక రంగంతోపాటు సేవల రంగం కూడా జీడీపీ వృద్ధిని వెనక్కి లాగినట్లు ఆర్బీఐ తెలిపింది. సేవల రంగంలో వాణిజ్యం, రవాణా, బ్యాంకులు, హోటళ్లు, స్థిరాస్తి.. వంటి విభాగాలు వస్తాయి. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో సేవల రంగం 7.2 శాతం వృద్ధి నమోదు చేసింది. ఇది గతేడాది పది శాతంగా ఉంది. ఇదిలాఉండగా, ఇప్పటికే అమలవుతున్న ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు, ఇతర పథకాలు, పెరుగుతున్న వ్యయ సామర్థ్యం వల్ల ప్రారిశ్రామిక రంగం వృద్ధి పథంలో దూసుకుపోతోంది. గతేడాది ఐదు శాతంగా ఉన్న ఈ రంగం వృద్ధి ఈసారి ఏడు శాతానికి చేరింది.ఇదీ చదవండి: సంపద వృద్ధిలో టాప్ 10 దేశాలుదేశ వృద్ధిలో సింహభాగం ప్రాథమిక, సేవల రంగాలదే. కాబట్టి వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో విశేష వృద్ధితోపాటు సేవల రంగంలో మెరుగైన ఫలితాలు నమోదైతేనే జీడీపీ గాడిలో పడుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రభుత్వం ఆయా రంగాల్లో ప్రోత్సాహకాలు పెంచాలని చెబుతున్నారు. దేశంలోని యువతకు ఆ రంగాల్లో పనిచేసేలా నైపుణ్యాలు అందించి మరింత ఉత్పాదకతను పెంచాలని సూచిస్తున్నారు. -
సంబరాలు... సవాళ్ళు...
దేశవ్యాప్తంగా ఎన్నికలు ముగిశాయి. ఇక, కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. వరుసగా మూడోసారి కూడా మోదీ సారథ్యంలోని బీజేపీయే పగ్గాలు చేపడుతుందని అంచనాలు వినిపిస్తున్న వేళ ఓట్ల లెక్కింపుతో అసలైన ఫలితాలు ఇవాళ రానున్నాయి. అయితే, ఎన్నికలు ముగింపు దశలో ఉండగానే జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) గత శుక్రవారం వెలువరించిన దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) గణాంకాలు ఆసక్తికరమైన చర్చ రేపుతున్నాయి. జీడీపీ వృద్ధి దాదాపు 7.8 శాతం ఉండవచ్చని తొలుత అందరూ భావించినా, వాస్తవంలో అది 8.2 శాతానికి చేరింది. అంతకు ముందు ఏడాది (2022–23) సాధించిన 7 శాతంతో పోలిస్తే ఇది గణనీయమైన మెరుగుదల. పైగా, వరుసగా మూడు ఆర్థిక సంవత్సరాలుగా మన ఆర్థిక వ్యవస్థ 7 శాతం, అంతకు మించి పెరిగిందన్న మాట. దీంతో ప్రపంచంలో అత్యంత వేగంగా పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలుస్తోందని నిపుణుల మాట. ఇది విశేషమే... కాదనలేం. కానీ, ఈ ఏడాది కూడా ఇదే పురోగతిని నిలబెట్టుకోవడానికి ఏం చేయాలి? అలాగే, దేశాన్ని వేధిస్తున్న నిరుద్యోగం తదితర సమస్యల మాటేమిటి?నిజానికి, దేశ వాస్తవిక జీడీపీ ఇటు అధికారిక, అటు ప్రైవేట్ అంచనాలన్నిటినీ అధిగమించి ఆశ్చర్యపరిచింది. కోవిడ్ దెబ్బ కొట్టిన తర్వాత, అందులోనూ ప్రపంచమంతా నత్తనడక నడుస్తున్నప్పుడు వృద్ధిలో ఈ రకమైన గణాంకాలు వచ్చాయంటే, అనేక ఆటుపోట్లను భారతీయ గృహవ్యవస్థ, వ్యాపారాలు తట్టుకొని దృఢంగా నిలబడడమే కారణం. అలాగే, ప్రధానంగా నిర్మాణ, వస్తూత్పత్తి రంగాల పుణ్యమా అని కూడా గడచిన 2023–24 ఆర్థిక సంవత్సరంలో మన ఆర్థికవ్యవస్థ అనుకున్న దాని కన్నా మెరుగైన వృద్ధిని సాధించినట్టు విశ్లేషణ. ప్రైవేట్ పెట్టుబడులు వేగం పుంజుకోకున్నా, ప్రాథమిక వసతి సౌకర్యాల కల్పనలో ప్రభుత్వ పెట్టుబడులు ఆర్థిక వృద్ధిలో సింహభాగానికి కారణమని చెబుతున్నారు. కేంద్రంలో కొత్త ప్రభుత్వం వచ్చాక ప్రైవేట్ పెట్టుబడులు పెరుగుతాయని భావిస్తున్నారు. మొత్తం మీద వచ్చే సర్కారుకు ఈ అంకెలు, ఇటీవల భారతీయ రిజర్వ్ బ్యాంక్ బదలాయించిన మిగులు నిధుల లాంటివి కొంత సౌకర్యాన్నిచ్చే అంశాలు. అక్కడ నుంచి సమతూకం నిండిన ఆర్థికాభివృద్ధి వైపు ఎలా నడిపించాలన్నది కీలకమైన అంశం. గమనిస్తే... ఆర్థిక వృద్ధిలో మెరుగుదల ఏడేళ్ళ పాటు నిదానంగా సాగింది. దానికి కొత్త ఊపునిచ్చేందుకు మోదీ సర్కార్ ఏటా రైల్వే, రోడ్లు, పట్టణ రవాణా, వాటర్‌వర్క్స్, రక్షణ ఉత్పత్తులపై ఏటా రూ. 11 లక్షల కోట్లు ఖర్చు పెడుతోంది. దీనివల్ల లక్షలాది ఉద్యోగాలు రావాలి. కానీ, వాస్తవ పరిస్థితులు మాత్రం కొంత భిన్నంగా ఉన్నాయి. దేశంలో నిరుద్యోగ సమస్య ఇప్పటికీ ప్రబలంగా కనిపిస్తోంది. దానికి తోడు ఆర్థిక వ్యత్యాసం, ద్రవ్యోల్బణం సామాన్యుల్ని వేధిస్తున్నాయి. ఉదాహరణకు భవన నిర్మాణ రంగంలో నూటికి 80 మంది ఉండే నైపుణ్య రహిత కార్మికుల సగటు రోజు వారీ కూలీ సైతం అనేక రాష్ట్రాల్లో జాతీయ సగటు కూలీ కన్నా తక్కువే ఉందని విశ్లేషణలు తేల్చాయి. మహిళా శ్రామికుల కూలీలైతే మరీ కనాకష్టం. ప్రభుత్వ లెక్కల ప్రకారమే... మన దేశ తలసరి ఆదాయం, మరో మాటలో నికర జాతీయ ఆదాయం 2014–15లో రూ.72,805 ఉండేది. అది కేవలం 3.83 శాతం వార్షిక చక్రవృద్ధి రేటుతో 2022–23లో రూ.98,374కు చేరింది. వాస్తవిక ద్రవ్యోల్బణ ప్రభావాన్ని గనక పరిగణనలోకి తీసుకుంటే, ఈ వృద్ధి రేటు అసలైతే ఇంకా తక్కువే ఉంటుంది. అది అటుంచితే – విద్య, ఆరోగ్యం, ప్రజారవాణా, కాలుష్యం వగైరా అంశాల్లో సగటు జనాభా జీవన ప్రమాణాలు మెరుగుపడలేదు. సరికదా ఇంకా దిగజారాయి. అదే విషాదం. ఇంకా చెప్పాలంటే, ప్రపంచంలోని అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరణ అనే నినాదంలో గర్వించడానికి తగిన అంశాలు కొన్నే కనిపిస్తున్నాయి. ప్రపంచ దేశాల తలసరి ఆదాయం జాబితాలో 2018లో మనం 153వ స్థానంలో ఉండేవాళ్ళం. అప్పటితో పోలిస్తే, మనం మెరుగుపడి 144వ స్థానానికి చేరాం. కానీ, ఇప్పటికీ మనం అడుగునే ఉన్నామని మర్చిపోలేం. సాధించిన కొద్దిపాటి మెరుగుదల దేశ ప్రజల్ని దారిద్య్రం నుంచి బయటపడేయడానికి చాలదు. నాణ్యమైన జీవన ప్రమాణాలకూ సరిపోదు. 2029 నాటికి గానీ మన దేశం తలసరి ఆదాయంలో ఉజ్బెకిస్తాన్, పాపువా న్యూ గినియా, అంగోలా లాంటి దేశాలను అధిగమించలేదని గుర్తించాలి. కాబట్టి, కొత్త ప్రభుత్వానికి తన ముందున్న సవాలేమిటో స్పష్టంగా తెలుస్తూనే ఉంది. భారత జనాభాలో ఇప్పటికీ అధిక శాతం గ్రామీణ, బస్తీ ప్రాంతాల్లోనే నివసిస్తోంది. వారి కష్టనష్టాలు, జీవన పరిస్థితులు స్టాక్ మార్కెట్ల విజృంభణను చూసి చప్పట్లు కొట్టే వర్గాలకు పెద్దగా తెలియవు. తాజా ఎన్నికల దయతో నిరుద్యోగం, ఆర్థిక అసమతౌల్యం, ద్రవ్యోల్బణం లాంటివి మళ్ళీ కనీసం చర్చకైనా వచ్చాయి. ‘గ్రామీణ ప్రాంతాల్లోని దురవస్థల’ ప్రస్తావన జరిగింది. అందుకే, గడచిన నాలుగు త్రైమాసికాలను కలిపి తీసిన ఆఖరి లెక్కలు పైకి సంతోషం రేపుతున్నా, క్షేత్రస్థాయిలోని ఇలాంటి అనేక సమస్యల పరిష్కారానికి కృషి చేయకపోతే కష్టమే. ఇప్పటి లెక్కలతో తృప్తిపడి, ఉదాసీనంగా వ్యవహరించకుండా సవాళ్ళను ఎదుర్కొంటూ ముందడుగు వేయాలి. అందుకోసం ఆర్థిక విధానాలను నిర్ణయించే ప్రభుత్వ యంత్రాంగం దీర్ఘకాలిక దృష్టితో వ్యవహరించాలి. ప్రజల నైపుణ్యాలను పెంచి, వారిని మరింత ఉద్యోగార్హులుగా తీర్చిదిద్దడంపై దృష్టిపెట్టాలి. అందుకు తగ్గ సంస్కరణలు చేపట్టాలి. అప్పుడే ఏటికేడు ఈ వృద్ధి అంకెలు స్థిరపడతాయి. సామాన్యుల జీవితాలు నిలబడతాయి. లేదంటే ‘వికసిత భారత్’ మాటల్లో, లెక్కల్లోనే మిగిలిపోతుంది. -
6.7 శాతం వరకూ వృద్ధి
న్యూఢిల్లీ: భారతదేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) మార్చితో ముగిసిన 2023–24 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో 6.1–6.7 శాతం పరిధిలో వృద్ధి చెందుతుందని పలువురు ఆర్థికవేత్తలు అంచనావేస్తున్నారు. నాల్గవ త్రైమాసికానికి (జనవరి–మార్చి 2024) అలాగే మొత్తం ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన జీడీపీ తొలి అధికారిక గణాంకాలు మే 31న ప్రభుత్వం విడుదల చేయనున్న నేపథ్యంలో తాజా అంచనాలు వెలువడుతున్నాయి. ఆర్థికవేత్తల అంచనాల ప్రకారం 2023–24 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 7.6–7.8 శాతం శ్రేణిలో ఉంటుంది. భారత ఆర్థిక వ్యవస్థ 2023–24 జూన్ త్రైమాసికంలో 8.2 శాతం, సెపె్టంబర్ త్రైమాసికంలో 8.1 శాతం, డిసెంబర్ త్రైమాసికంలో 8.4 శాతం పురోగతి సాధించింది. కీలక రంగాల పటిష్ట వృద్ధికోటక్ మహీంద్రా బ్యాంక్ చీఫ్ ఎకనామిస్ట్ ఉపాస్న భరద్వాజ్ ఎకానమీ పరిస్థితులపై మాట్లాడుతూ, కీలక రంగాలకు సంబంధించి హై ఫ్రీక్వెన్సీ డేటా విస్తృత ప్రాతిపదికన బలమైన వృద్ధిని సూచిస్తోందని తెలిపారు. అలాగే నాల్గవ త్రైమాసికంలో వాణిజ్యం, హోటళ్ల రంగం నిలకడగా ఉన్నట్లు తెలిపారు. ‘‘తయారీ రంగం కార్యకలాపాలు కూడా బాగున్నాయి. నిర్మాణ ఆధారిత, పెట్టుబడి విభాగాల నుంచి మెరుగైన ఫలితాలు రావాలి. అయితే వ్యవసాయ రంగం వృద్ధి వెనుకబడి ఉండవచ్చు. నాల్గవ త్రైమాసికంలో 6.1 శాతం జీడీపీ వృద్ధిని మేము ఆశిస్తున్నాము. పూర్తి సంవత్సరం సంఖ్య 7.6 శాతానికి దగ్గరగా ఉంటుందని అనుకుంటున్నాం’’ అని భరద్వాజ్ చెప్పారు. కాగా, క్యూ4లో 6.5 శాతం, ఆర్థిక సంవత్సరంలో 7.8 శాతం వృద్ధిని అంచనావేస్తున్నట్లు ఈవై ఇండియా చీఫ్ పాలసీ అడ్వైజర్ డీకే శ్రీవాస్తవ పేర్కొన్నారు. ఇక ఇండియా రేటింగ్స్ క్యూ4 అంచనా 6.2 శాతంగా ఉంది. దేశీయ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా క్యూ4లో 6.7 శాతం, ఆర్థిక సంవత్సరం 7.8 శాతం వృద్ధి అంచనాలను వెలువరిస్తోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అంచనా ఆర్థిక సంవత్సరానికి 7 శాతంగా ఉంది. -
20 ఏళ్లలో ఏ దేశం ఎంత వృద్ధి చెందిందో తెలుసా.. (ఫొటోలు)
-
పెరుగుతున్న రిటైల్ ద్రవ్యోల్బణం.. స్థిరమైన వృద్ధికి అవకాశం
దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వ్యాఖ్యలు చేసింది. దీన్ని 4 శాతం దిగువకు తీసుకురావాడానికి ప్రయత్నిస్తున్నట్లు, అయితే ఇందుకు ఆహార ధరలే అడ్డంకిగా మారుతున్నట్లు మార్చి బులెటిన్ ‘స్టేట్ ఆఫ్ ఎకానమీ’లో ఆర్బీఐ ఇటీవల తెలిపింది. వినియోగదారు ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం గత డిసెంబరు నుంచి తగ్గుతూ వస్తూ, గత నెలలో 5.09 శాతంగా నమోదైంది. ప్రధాన ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టినా, రిటైల్ ద్రవ్యోల్బణం 4 శాతం దిగువకు చేరేందుకు ఆహార ధరల ఒత్తిళ్లే అడ్డంకిగా మారుతున్నాయని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ మైఖేల్ దేబబత్ర పాత్రా నేతృత్వంలోని బృందం తెలిపింది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ నెమ్మదిస్తోందని, అభివృద్ధి చెందిన దేశాల్లోనూ వృద్ధి మందగించడం, రాబోయే కాలంలో పరిస్థితుల్ని సూచిస్తున్నాయని వివరించింది. మన దేశంలో 2023-24 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో వాస్తవిక జీడీపీ వృద్ధి 6 త్రైమాసికాల గరిష్ఠ స్థాయికి చేరుకుందని బులెటిన్ వివరించింది. పరోక్ష పన్నులు పటిష్ఠంగా వసూలు కావడం, తక్కువ సబ్సిడీలు వృద్ధి ఊపందుకునేందుకు దోహదం చేశాయని బృందం వెల్లడించింది. నిర్మాణాత్మక గిరాకీ, ఆరోగ్యకర కార్పొరేట్ గణాంకాలు, బ్యాంక్ బ్యాలెన్స్ షీట్లు వృద్ధి ముందుకు సాగడానికి సాయపడతాయని వ్యాసం పేర్కొంది. ఇదీ చదవండి: 1 శాతం కుబేరుల దగ్గరే 40 శాతం సంపద దేశం ఏటా 8%, అంతకంటే ఎక్కువ వృద్ధిని స్థిరంగా కొనసాగించే అవకాశం ఉందని ఆర్బీఐ బులెటిన్ వెల్లడించింది. 2021-24 మధ్య దేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి సగటున 8% పైనే నమోదైందని పేర్కొంది. కరెంట్ ఖాతా లోటు (సీఏడీ) అదుపులోనే ఉందని, విదేశీ మారకపు నిల్వలు బాగున్నాయని, వరుసగా మూడో ఏడాది కూడా ఆర్థిక ఏకీకరణ కొనసాగుతోందని తెలిపింది. వచ్చే కొన్ని దశాబ్దాలకు ఈ అనుకూల అంశాలను అవకాశాలు, బలాలుగా మార్చుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది. -
కొనసాగిన బుల్ రికార్డులు
ముంబై: పరిమిత శ్రేణి ట్రేడింగ్‌లో తీవ్ర ఒడిదుడుకులకు లోనైనప్పటికీ.., స్టాక్ సూచీల రికార్డుల ర్యాలీ సోమవారమూ కొనసాగింది. ఆకర్షణీయ స్థూల ఆర్థిక డేటా నమోదు కారణంగా అంతర్జాతీ య రేటింగ్ సంస్థ మూడీస్ 2024 ఏడాదికి గానూ భారత జీడీపీ వృద్ధి రేటును 6.1% నుంచి 6.8 శాతానికి పెంచింది. మూడీస్ అప్‌గ్రేడ్ రేటింగ్‌తో బ్యాంకింగ్, ఇంధన, ఫార్మా షేర్లకు కొనుగోళ్ల మద్ద తు లభించింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 243 పాయింట్ల పరిధిలో కదలాడిన సెన్సెక్స్ చివరికి 66 పాయింట్ల లాభంతో 73,872 వద్ద ముగిసింది. ఒక దశలో 184 పాయింట్లు బలపడి 73,990 వద్ద ఆల్‌టైం హైని అందుకుంది. నిఫ్టీ 63 పాయింట్లు పెరిగి 22,441 వద్ద జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. ఆఖరికి 27 పాయింట్లు లాభంతో 22,406 వద్ద స్థిరపడింది. ఇరు సూచీలకు ముగింపు స్థాయిలు సరికొత్త రికార్డుతో పాటు వరుసగా నాలుగో రోజూ లాభాల ముగింపు. ఐటీ, ఎఫ్ఎంసీజీ, ఆటో షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.564 కోట్ల షేర్లను విక్రయించగా, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.3,543 కోట్ల షేర్లు కొన్నారు. ► డిజిట్ ఐపీవోకు గ్రీన్ సిగ్నల్ ► డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ ప్రతిపాదిత పబ్లిక్ ఇష్యూ (ఐపీవో)కి మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్ సిగ్నల్ ఇచి్చంది. ఈ ఇష్యూ కింద రూ. 1,250 కోట్ల విలువ చేసే షేర్లను కొత్తగా జారీ చేయనుండగా, ప్రమోటర్లు.. ప్రస్తుత షేర్హోల్డర్లు 10.94 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) మార్గంలో విక్రయించనున్నారు. పబ్లిక్ ఇష్యూకి బ్లాక్‌బక్ లాజిస్టిక్స్ అంకుర సంస్థ బ్లాక్‌బక్ వచ్చే ఆర్థిక సంవత్సరంలో పబ్లిక్ ఇష్యూకి వచ్చే యోచనలో ఉంది. ఐపీవో ద్వారా కంపెనీ సుమారు 300 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 2,500 కోట్లు) సమీకరించే యోచనలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇందులో భాగంగా ప్రస్తుత ఇన్వెస్టర్లు కొన్ని షేర్లు విక్రయించనుండగా, కొత్తగా మరికొన్ని షేర్లను కూడా సంస్థ జారీ చేయనున్నట్లు వివరించాయి. ఇష్యూ ద్వారా సమీకరించే నిధులను సరీ్వసుల వ్యాపార విభాగాన్ని విస్తరించేందుకు బ్లాక్‌బక్ వినియోగించుకోనుంది. బ్లాక్‌బక్‌ను నిర్వహించే జింకా లాజిస్టిక్ సొల్యూషన్స్‌లో ఫ్లిప్‌కార్ట్ పెట్టుబడులు ఉన్నాయి. -
జీడీపీలో తగ్గుతున్న వ్యవసాయం వాటా.. కారణం చెప్పిన మంత్రి
కరోనా సమయంలో అన్ని రంగాలు కుదేలైనా వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు మాత్రం వృద్ధి నమోదు చేశాయి. అలాంటి వ్యవసాయ రంగానికి సంబంధించి దేశ జీడీపీలో వాటా తగ్గుతుందని గణాంకాలు చెబుతున్నాయి. జీడీపీలో వ్యవసాయ రంగం వాటా 1990-91లో 35 శాతంగా ఉండేదని, 2022–23లో 15 శాతానికి తగ్గిందని లోక్‌సభలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి అర్జున్ ముంద్రా వెల్లడించారు. ఇండస్ట్రియల్, సర్వీస్ సెక్టార్ వేగంగా వృద్ధి చెందడంతోనే వ్యవసాయ రంగం వాటా తగ్గిందని మంత్రి పార్లమెంట్లో పేర్కొన్నారు. ‘ప్రొడక్షన్ పడిపోవడం వల్ల వ్యవసాయ రంగం వాటా తగ్గిపోలేదు. పరిశ్రమలు, సర్వీస్ సెక్టార్లో ఉత్పత్తులు వేగంగా పెరగడమే ఇందుకు కారణం’ అని ఆయన వివరించారు. వ్యవసాయం, అనుబంధ రంగాలు గత ఐదేళ్లలో ఏడాదికి 4 శాతం చొప్పున వృద్ధి సాధించాయని మంత్రి అన్నారు. వ్యవసాయానికి సంబంధించి కేవలం మన దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయన్నారు. గ్లోబల్ జీడీపీలో వ్యవసాయ రంగం వాటా 4 శాతంగా ఉందని చెప్పారు. వ్యవసాయ రంగంలో ప్రొడక్షన్ పెంచడానికి, సుస్థిరాభివృద్ధికి, మౌలిక సదుపాయాలు కల్పించేందుకు, వనరులను సమర్థంగా వినియోగించేందకు ప్రభుత్వం వివిధ పథకాలు, సంస్కరణలు, పాలసీలు తీసుకొచ్చిందని వివరించారు. కేంద్రం ప్రభుత్వం రైతులకు ఏడాదికి మూడు విడతల్లో రూ.6 వేలు ఇస్తున్నట్లు మంత్రి చెప్పారు. ఈ ఏడాది నవంబర్ 30 నాటికి 11 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.2.81 లక్షల కోట్లు విడుదల చేశామన్నారు. ఇదీ చదవండి: మళ్లీ ఉద్యోగుల సమరం.. మార్పు ఖాయం? -
ఈ ఏడాది 6.5 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది(2023–24) 6.5 శాతం వృద్ధిని సాధించగలదని ప్రధాన ఆర్థిక సలహాదారు(సీఈఏ) వి.అనంత నాగేశ్వరన్ తాజాగా అంచనా వేశారు. ఈ దశాబ్దం అనిశ్చితికి నిదర్శనంగా నిలవనున్నదని వ్యాఖ్యానించారు. ఒకవేళ కార్పొరేట్ రంగం పెట్టుబడులను ఆలస్యంచేస్తే ఉపాధి కల్పన, ఆర్థిక వృద్ధి సాకారంకావని అభిప్రాయపడ్డారు. ఆర్థిక శాఖ విషయానికివస్తే జీడీపీ వృద్ధి, ఆదాయ పురోగతి తదితరాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలియజేశారు. సగటున 6.5 శాతం ఆర్థికాభివృద్ధిని ఆశిస్తున్న నేపథ్యంలో మరింత పురోగతి అందుకోవడం ద్వారా ఆశ్చర్యాలకు తెరతీసే అవకాశమున్నట్లు పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించిన ఒక సదస్సులో వివరించారు. కాగా.. గతేడాది(2022–23)లో దేశ ఆర్థిక వ్యవస్థ 7.2 శాతం పుంజుకోగా.. మార్చితో ముగియనున్న ఈ ఆర్థిక సంవత్సరం(2023–24) 6.5 శాతం జీడీపీ వృద్ధిని రిజర్వ్ బ్యాంక్ అంచనా వేసింది. ఈ బాటలో అంతర్జాతీయ ద్రవ్యనిధి, ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ సైతం 6.3 శాతం వృద్ధిని మదింపు చేశాయి. అయితే ఈ ఏడాది క్యూ2లో జీడీపీ 7.6 శాతం బలపడిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో నాగేశ్వరన్ అంచనాలకు ప్రాధాన్యత ఏర్పడినట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. -
జీడీపీ వృద్ధిలో ఎంఎస్ఎంఈలది కీలకపాత్ర
సాక్షి, విశాఖపట్నం: జీడీపీలో ఎంఎస్ఎంఈలు కీలకపాత్ర పోషిస్తున్నాయని కేంద్ర ఎంఎస్ఎంఈ జాయింట్ సెక్రటరీ మెర్సీ ఇపావో తెలిపారు. విశాఖలో ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఫ్యాప్సీ)షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్‌పై శుక్రవారం నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో ఆమె మాట్లాడారు. ఎంఎస్ఎంఈలు దేశ ఆర్థిక రంగ వృద్ధికి దోహదపడటమే కాక.. ఉపాధికి ముఖ్య వనరులుగా ఉన్నాయని, గ్రామీణ, వెనకబడిన ప్రాంతాల్లో ఆర్థిక, ప్రాంతీయ అసమానతలను కూడా తగ్గిస్తున్నాయని చెప్పారు. ప్రధానమంత్రి గతి శక్తి పథకంతో ఇవి మరింత బలోపేతమవుతున్నాయని వెల్లడించారు. ఎంఎస్ఎంఈ రంగాన్ని మరింత విస్తరించడానికి తమ మంత్రిత్వ శాఖ పలు కార్యక్రమాలు చేపడుతోందని, ఇందులో భాగంగా రుణ పరిధి పెంపు, ఆధునికీకరణకు ప్రోత్సాహం, సాంకేతిక సాయం, మౌలిక సదుపాయాల వృద్ధి, నైపుణ్యాల పెంపుదల, శిక్షణ అవకాశాల మెరుగుదల, మార్కెట్ల విస్తరణ, ఎగుమతుల ధ్రువీకరణ ప్రక్రియను మరింత సరళతరం చేయడం వంటి కార్యక్రమాలు చేపడుతున్నట్టు చెప్పారు. ఏపీ మారిటైం బోర్డు డెప్యూటీ సీఈవో లెఫ్టినెంట్ కమాండర్ బీఎం రవీంద్రరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం నుంచి ఎగుమతుల ప్రోత్సాహానికి, మౌలిక సదుపాయాల విస్తృతానికి చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో ఎగుమతులు, దిగుమతులు పెరగడంలో మారిటైం బోర్డు తోడ్పడుతోందన్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటవుతున్న నాలుగు పోర్టుల ద్వారా కొత్తగా పలు పరిశ్రమలు వస్తాయని, ఫలితంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. శ్రావణ్ షిప్పింగ్ సరీ్వసెస్ లిమిటెడ్ ఎండీ జి.సాంబశివరావు, ఫ్యాప్సీ అధ్యక్షుడు కరుణేంద్ర ఎస్ జాస్తి తదితరులు ప్రసంగించారు. ఫ్యాప్సీ ఉపాధ్యక్షుడు కంకటాల మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. -
ఆఖర్లో లాభాల స్వీకరణ
ముంబై: ఆఖర్లో అమ్మకాలు తలెత్తడంతో బుధవారం స్టాక్ సూచీలు ఆరంభ లాభాలు కోల్పోయి స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. ఆగస్టు నెలవారీ ఎఫ్అండ్ఓ డెరివేటివ్స్ ముగింపు, దేశీయ క్యూ1 జీడీపీ వృద్ధి డేటాతో సహా కీలక స్థూల ఆర్థిక గణాంకాల విడుదల(నేడు)కు ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. బ్యాంకింగ్, ఫైనాన్స్, ఆయిల్‌అండ్‌గ్యాస్ షేర్లలో లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. ఫలితంగా ట్రేడింగ్‌లో 406 పాయింట్లు బలపడిన సెన్సెక్స్ చివరికి 11 పాయింట్ల లాభంతో 65,087 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో 110 పాయింట్లు పెరిగిన నిఫ్టీ అయిదు పాయింట్ల లాభంతో 19,347 వద్ద స్థిరపడింది. మెటల్, ఐటీ, రియలీ్ట, ఆటో, కన్జూమర్ డ్యూరబుల్స్ షేర్లు రాణించాయి. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. మార్కెట్లో మరిన్ని సంగతులు ► జియో ఫైనాన్షియల్ సరీ్వసెస్(జేఎఫ్ఎస్) షేరు వరుసగా మూడో రోజూ అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. ఇటీవల ఆర్ఐఎల్ ఏజీఎం సమావేశంలో జేఎఫ్ఎస్ బీమా, మ్యూచువల్ ఫండ్స్ వ్యాపారాల్లోకి విస్తరిస్తుందని కంపెనీ అధినేత ముకేశ్ అంబానీ చేసిన ప్రకటన ఈ షేరు ర్యాలీకి దోహదపడుతున్నాయి. తాజాగా బుధవారం బీఎస్ఈలో 5% ఎగసి రూ.233 వద్ద అప్పర్ సర్క్యూట్ వద్ద లాౖకైంది. ► గోకుల్ దాస్ ఎక్స్‌పోర్ట్స్ షేరు ర్యాలీ రెండో రోజూ కొనసాగింది. బీఎస్ఈలో 19% ఎగసి రూ.874 వద్ద స్థిరపడింది. యూఈఏకి చెందిన దుస్తుల తయారీ కంపెనీ అట్రాకోను 55 మిలియన్ డాలర్ల(దాదాపు రూ.455 కోట్లు)కు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకోవడం ఈ షేరు ర్యాలీకి కారణమవుతోంది. -
స్థూల ఆర్థిక నిర్వహణ భేష్: కేంద్ర ఆర్థిక శాఖ నివేదిక
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా అసాధారణ సవాళ్ల మధ్య భారత్ బలమైన రికవరీ బాటలో నడవడానికి దేశ స్థూల ఆర్థిక నిర్వహణ అద్భుతంగా ఉండడమేనని కేంద్ర ఆర్థిక శాఖ నివేదిక తెలిపింది. ఇతర దేశాలకు ఇదొక ఉదాహరణగా పేర్కొంది. మౌలిక సదుపాయాల సరఫరా వైపు చేసిన పెట్టుబడులతో భారత్ దీర్ఘకాలం పాటు స్థిరమైన వృద్ధిని నమోదు చేయగలదని అంచనా వేసింది. ‘‘గడిచిన కొన్నేళ్లలో అంతర్జాతీయంగా ఊహించని సవాళ్లు నెలకొన్నాయి. దీనికితోడు భారత బ్యాంకింగ్, నాన్ ఫైనాన్షియల్ కార్పొరేట్ రంగంలో బ్యాలన్స్ షీటు సమస్యలు వెలుగు చూశాయి. అయినా కానీ, భారత్ స్థూల ఆర్థిక నిర్వహణ ఎంతో మెరుగ్గా ఉండడం వీటిని అధిగమించేలా చేసింది’’అని కేంద్ర ఆర్థిక శాఖ నివేదిక వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు అంతక్రితం ఆర్థిక సంవత్సంతో పోలిస్తే తగ్గడాన్ని ప్రస్తావించింది. ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు తగ్గించేందుకు ప్రభుత్వం సుంకాలు తగ్గించి, సంక్షేమంపై వ్యయాలను పెంచొచ్చని పేర్కొంది. అలాగే, గరిష్ట స్థాయిలో మూలధన వ్యయాలను కొనసాగించొచ్చని అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరంలో సానుకూల పనితీరు ప్రభావం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ కొనసాగుతుందని, ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందన్న సంకేతాలు కనిపిస్తున్నాయని వివరించింది. గత ఆర్థిక సంవత్సరంలో ముందుగా వేసిన అంచనా 7 శాతం మించి, 7.2 శాతం జీడీపీ వృద్ధి నమోదు కావడానికి, చివరి త్రైమాసికంలో బలమైన పనితీరును కారణంగా పేర్కొంది. -
భారత్ ఆర్థిక వ్యవస్థ పటిష్టం
ముంబై: భారత్ ఎకానమీ పటిష్టంగా, నిలకడగా పురోగమిస్తోందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఫైనాన్షియల్ స్టెబిలిటీ నివేదిక (ఎఫ్ఎస్ఆర్) ఉద్ఘాటించింది. తగిన మూలధనం, అలాగే మొండిబకాయిలు (ఎన్పీఏ) బహుళ సంవత్సర కనిష్ట స్థాయికి తగ్గుతూ కొనసాగుతున్న పటిష్ట బ్యాంకింగ్ వ్యవస్థ, ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు వంటి ఆర్థిక మూలస్తంభాల పటిష్టత వంటి అంశాలు ఎకానమీకి వెన్నుదన్నుగా నిలుస్తున్నట్లు నివేదిక వివరించింది. ఈ మేరకు ఆర్థిక స్థిరత్వం, అభివృద్ధి మండలి (ఎఫ్ఎస్డీసీ) సబ్–కమిటీ ఇచి్చన నివేదికలో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ముందుమాట రాస్తూ, అంతర్జాతీయంగా తీవ్ర అనిశ్చితి నెలకొన్నప్పటికీ, భారత్ ఎకానమీ పటిష్ట రికవరీ బాటన పయనిస్తోందన్నారు. ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న ఎకానమీల్లో ఒకటి నిలుస్తోందని పేర్కొన్నారు. ఆర్థిక స్థిరత్వం అనే అంశంపై రాజీపడే ప్రశ్నేలేదని, ఈ వ్యవస్థలోని అన్ని స్థాయిల్లోని వారు ఇందుకు తగిన కృషి చేయాలని అన్నారు. సవాళ్లను ఎదుర్కొనడానికి ఇది అవసరమనీ ఉద్ఘాటించారు. నివేదికలోని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ► 2018 మార్చిలో బ్యాంకింగ్ వ్యవస్థలో స్థూల మొండి బకాయిలు, నికర మొండిబకాయిలు వరుసగా 11.5 శాతం, 6.1 శాతాలుగా ఉన్నాయి. 2023 మార్చిలో ఇవి వరుసగా 3.9 శాతం, 1 శాతానికి తగ్గాయి. ► రిటర్న్ ఆన్ అసెట్స్ (ఆర్‌ఓఏ) 2018లో కనిష్ట స్థాయి – 0.2 శాతం నుండి 2023లో 1.1 శాతానికి పెరగడంతో బ్యాంకింగ్ వ్యవస్థ లాభదాయకత మెరుగుపడింది. ► బ్యాంకింగ్ బ్యాలెన్స్ షీట్మెరుగుపడ్డం విస్తృత స్థాయిలో అన్ని రంగాలకూ బ్యాంకింగ్ రుణ వృద్ధినీ పెంచుతోంది. ► 2022–23లో బ్యాంకింగ్ డిపాజిట్ల వృద్ధి 10 శాతం. 2023 జూన్ తొలి నాళ్లలో ఈ రేటు 11.8 శాతానికి పెరిగింది. రూ.2000 నోట్ల ఉపసంహరణా దీనికి ఒక కారణం. ► రిటైల్ రుణాలు మార్చి 2021 నుండి మార్చి 2023 వరకు 24.8 శాతం వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్)ను నమోదుచేసుకున్నాయి. స్థూలంగా చూస్తే ఈ వృద్ధి రేటు 13.8 శాతంగా ఉంది. ► సైబర్ దాడులు, వాతావరణ మార్పు వంటి ఇతర సవాళ్లను పరిష్కరించడానికి అంతర్జాతీయ పరస్పర సహకారం అవసరం. ► జీ 20కి భారత్ నేతృత్వం వహిస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రపంచ దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి తగిన కృషి చేస్తుంది. ‘ఒక భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు’ థీమ్‌తో సవాళ్లపై పోరాటానికి దేశాల మధ్య పరస్పర సహకారానికి, సమన్వయ చర్యలకు భారత్ ప్రయతి్నస్తుంది. -
మూడో త్రైమాసికంలో భారత్ వృద్ధి 4.6 శాతం: ఎస్బీఐ అంచనా
ముంబై: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) డిసెంబర్ త్రైమాసికంలో 4.6 శాతమన్న అంచనాలను బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) గ్రూప్ ప్రధాన ఆర్థిక సలహాదారు సౌమ్య కాంత్ ఘోష్ వెలువరించారు. రెండవ త్రైమాసికంలో ఉన్న ఆశావహ పరిస్థితుల్లో తమ 30 హై ఫ్రీక్వెన్సీ ఇండికేటర్లు లేవని పేర్కొంది. మూడవ త్రైమాసికంలో వృద్ధి 4.4 శాతమన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా( ఆర్బీఐ) అంచనాలకన్నా ఎస్బీఐ గ్రూప్ ఎకనమిక్ అడ్వైజర్ లెక్కలు అధికంగా ఉండడం గమనార్హం. కాగా, ఆర్థిక సంవత్సరంలో (2022-23) 6.8 శాతం అంచనాలను 7 శాతానికి పెంచుతున్నట్లు ఘోష్ పేర్కొన్నా రు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం (ఏప్రిల్–జూన్‌లో ఎకానమీ వృద్ధి రేటు 13.5 శాతంగా నమోదయ్యింది. రెండవ త్రైమాసికానికి ఇది 6.3 శాతానికి పడిపోయింది. 2023-24లో వృద్ధి 5.9శాతం : ఇండియా రేటింగ్స్ కాగా, 2023- 24 ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి 5.9 శాతమని ఇండియా రేటింగ్స్ ఒక నివేదికలో పేర్కొంది. -
ఇప్పుడు ‘పప్పు’ ఎవరు?
న్యూఢిల్లీ: పార్లమెంట్ వేదికగా కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా. దేశ ఆర్థిక వ్యవస్థ, పారిశ్రామికోత్పత్తి క్షీణతలను సూచిస్తూ ఇప్పుడు పప్పు ఎవరు? అని నిలదీశారు. దేశ ఆర్థిక వ్యవస్థపై అసత్యాలు ప్రచారం చేశారంటూ కేంద్రంపై విమర్శలు గుప్పించారు. 2022-23 ఆర్థిక ఏడాదిలో అడిషనల్ గ్రాంట్స్ విడుదలపై లోక్‌సభలో జరిగిన చర్చా కార్యక్రమంలో ఈ మేరకు నేల చూపులు చూస్తున్న ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దాలంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు సూచించారు టీఎంసీ ఎంపీ. ‘ఈ ప్రభుత్వం, అధికార పార్టీ పప్పు అనే పదాన్ని సృష్టించాయి. తీవ్ర అసమర్థతను సూచించేందుకు, ఎదుటివారిని కించపరచేందుకు దానిని ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం కనిపిస్తున్న గణాంకాలు ఎవరు నిజమైన పప్పు అనేది వెల్లడిస్తున్నాయి.’ అని కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా. దేశ పారిశ్రామికోత్పత్తి అక్టోబర్‌లో 26 నెలల కనిష్ఠానికి చేరుకున్న గణాంకాలను సూచిస్తూ ఈ మేరకు మండిపడ్డారు. దేశంలో అత్యధికంగా ఉపాధి కల్పించే తయారీ రంగం అక్టోబర్‌లో 5.6 శాతం మేర క్షీణించింది. మరోవైపు.. ఇటీవల జరిగిన హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ ఓటమిని సూచిస్తూ విమర్శలు గుప్పించారు మహువా మొయిత్రా. ‘అధికార పార్టీ అధ్యక్షుడు తన సొంత రాష్ట్రంలో పార్టీని గెలిపించుకోలేకపోయారు, ఇప్పుడు పప్పు ఎవరు?’ అని ప్రశ్నించారు. అలాగే.. భారతీయ పౌరసత్వాన్ని వదులుకుంటున్న వారి సంఖ్య పెరుగుతున్న డేటాను ఉటంకిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. 1/x In the spirit of the inalienable right to question the government, #Trinamool MP @MahuaMoitra makes a point on #ModiSarkar worth paying attention: “..the greatest liars has the believers” isn’t emotive but a fact based construct as #MahuaMoitra states facts on our economy. pic.twitter.com/1ukOSUv0aT — DOINBENGAL (@doinbengal) December 13, 2022 ఇదీ చదవండి: పేరెంట్స్ మీటింగ్‌కి బాయ్‌ఫ్రెండ్.. బిత్తరపోయిన ఉపాధ్యాయులు -
అధిక ధరల సెగ: జీడీపీ వృద్ధి తగ్గింది, కానీ...
న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో (2022-23, జూలై-సెప్టెంబర్) నెమ్మదించింది. 2021-22 ఇదే కాలంతో పోల్చితే జీడీపీ విలువ 6.3 శాతం పెరిగింది. తయారీ, మైనింగ్ రంగాల పేలవ పనితీరు ఇందుకు ఒక కారణం. కాగా, ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో (క్యూ1) జీడీపీ వృద్ధి రేటు 13.5 శాతం, గత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో వృద్ధి రేటు 8.4 శాతం కన్నా వృద్ధి వేగం (2.1 శాతం మేర) మందగించడం గమనార్హం. అయితే, ప్రపంచంలోనే వేగవంతమైన ఆర్థిక వ్యవస్థ హోదాను మాత్రం భారత్ కొనసాగిస్తోంది. జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో చైనా వృద్ధి రేటు 3.9 శాతం. భారత్ సాధించిన వృద్ధి రేటుకు మరే దేశమూ చేరుకోకపోవడం గమనార్హం. ఇక మొదటి, రెండు త్రైమాసికాలు కలిపి ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో జీడీపీ వృద్ధి రేటు 9.7శాతం, రెండవ త్రైమాసికంలో 6.1-6.3 శాతం వృద్ధి నమోదవుతుందన్న ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ అంచనాలకు అనుగుణంగానే బుధవారం విడుదల చేసిన గణాంకాలు ఉండడం గమనార్హం. 6.3 శాతం ఎలా అంటే.. 2011-12 స్థిర ధరల ప్రాతిపదిక, వాస్తవిక జీడీపీ విలువ 2021-22 క్యూ2లో రూ.35.89 లక్షల కోట్లు. తాజా సమీక్షా త్రైమాసికంలో ఈ విలువ రూ.38.17 లక్షల కోట్లుగా నమోదయ్యింది. అంటే వృద్ధి 6.3 శాతమన్నమాట. వివిధ రంగాల తీరిది స్థూల విలువ జోడింపు (గ్రాస్ వ్యాల్యూ యాడెడ్- జీవీఏ) ప్రాతిపదికన క్యూ2 వృద్ధి రేటు మాత్రం 5.6శాతం పెరిగి రూ.35.05 లక్షల కోట్లుగా నమోదయ్యింది. వ్యవసాయం: ఆర్థిక వ్యవస్థలో 15శాతం వాటా కలిగిన వ్యవసాయ రంగం వృద్ధి రేటు 4.6 శాతంగా ఉంది. గత ఏడాది ఇదే కాలంలో ఇది 3.2శాతం . తయారీ: ఈ రంగం జీవీఏ మాత్రం 5.6 శాతం (2021 ఇదే కాలంలో) వృద్ధి నుంచి 4.3 శాతం పడిపోయింది. మైనింగ్: ఈ విభాగం కూడా 2.8 శాతం క్షీణతను నమోదుచేసుకుంది. 2021 ఇదే కాలంలో ఈ రంగం వృద్ధి రేటు భారీగా 14.5 శాతంగా ఉంది. నిర్మాణం: వృద్ధి 8.1శాతం నుంచి 6.6శాతానికి తగ్గింది. యుటిలిటీ సేవలు: విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా ఇతర యుటిలిటీ సేవల వృద్ధి రేటు 5.6 శాతానికి తగ్గింది. గత ఏడాది ఇదే కాలంలో ఈ రేటు 8.5 శాతంగా నమోదైంది. సేవలు: మొత్తం జీడీపీలో మెజారిటీ వాటా కలిగిన ఈ విభాగం చూస్తే (ట్రేడ్, హోటెల్, రవాణా, కమ్యూనికేషన్, బ్రాడ్‌కాస్టింగ్) వృద్ధి రేటు 9.6 శాతం నుంచి 14.7 శాతానికి చేరింది.జీడీపీ వృద్ధి తగ్గింది, కానీ...ఎకానమీ పరుగుకు ఢోకా లేదు! అక్టోబర్‌లో 20 నెలల కనిష్టానికి మౌలికం అక్టోబర్‌లో ఎనిమిది పరిశ్రమలతో కూడిన మౌలిక రంగం వృద్ధి రేటు 20 నెలల కనిష్టానికి పడిపోయింది. గత ఏడాది ఇదే నెలతో పోల్చితే వృద్ధి కేవలం 0.1శాతం గా నమోదయ్యింది. క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్, రిఫైనరీ ప్రొడక్టులు, సిమెంట్ రంగాలు క్షీణతను నమోదు చేసుకున్నాయి. ఎరువుల రంగం మాత్రం 5.4శాతం పురోగతి సాధించింది. బొగ్గు విభాగంలో 3.6 శాతం, స్టీల్ రంగంలో 4శాతం వృద్ధి నమోదైతే, విద్యుత్ ఉత్పత్తి వృద్ధి కేవలం 0.4శాతంగా నమోదైంది. 7 శాతం వరకూ వృద్ధి 2022-23 ఆర్థిక సంవత్సరంలో భారత్ 6.8 శాతం 7 శాతం శ్రేణి బాటలో ఉంది. పలు రంగాల్లో రికవరీ బాటన నడుస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. పండుగల సీజన్లో అమ్మకాలు, పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్, బ్యాంక్ రుణ వృద్ధి, ఆటో అమ్మకాల గణాంకాలు ఆశావహంగా ఉన్నాయి. -వీ అనంత నాగేశ్వరన్, చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ -
క్యూ2లో ఎకానమీ వృద్ధి 5.8 శాతం
ముంబై: భారత్ ఎకానమీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో (2022-23 జూలై,ఆగస్టు, సెప్టెంబర్) 5.8 శాతం వృద్ధి నమెదు చేసుకుంటుందని ఎస్బీఐ రిసెర్చ్ తన అధ్యయనంలో తెలిపింది. తయారీ, వినియోగ విభాగాల బలహీనత గణాంకాలపై ప్రతికూల ప్రభావం చూపనుందని పేర్కొంది. నవంబర్ 30వ తేదీన క్యూ2 స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) అధికారిక లెక్కలు వెలువడనున్న నేపథ్యంలో ఎస్బీఐ తాజా అంచనాలను వెలువరించింది. క్యూ2లో మార్కెట్ అంచనాలకన్నా (6.1 శాతం) ఇది 30 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) తక్కువగా ఉండడం గమనార్హం. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం అంచనాలను 6.8 శాతంగా ఎస్బీఐ అంచనా వేసింది. మార్కెట్ అంచనాల కన్నా 20 బేసిస్ పాయింట్లు తక్కువ. 41 ఇండికేటర్ల విశ్లేషణల ప్రాతిపదికన ఎస్బీఐ అంచనాలు వెలువడతాయి. 2022-23 మొదటి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 13.5 శాతం. 2022-23లో ఆర్థిక వృద్ధి అంచనా 7 శాతంగా ఆర్బీఐ అంచనా వేస్తోంది. సెప్టెంబర్ త్రైమాసికంలో 6.3 శాతం వృద్ధి నమోదవుతుందని అంచనావేసింది. డిసెంబర్, మార్చి త్రైమాసికాల్లో ఈ రేటు 4.6 శాతం చొప్పున ఉంటుందని అంచనావేసింది. తదుపరి ఆర్బీఐ పాలసీ సమీక్ష డిసెంబర్ 5 నుంచి 7 వరకూ జరగనున్న నేపథ్యంలో క్యూ2 జీడీపీ గణాంకాలు వెలువడనున్నాయి. -
భారత్ ఆర్థిక స్థిరత్వానికి ఢోకా లేదు, రూపాయిపై ఆందోళన అక్కర్లేదు
న్యూఢిల్లీ: భారత్ ఎకానమీలో ద్రవ్య స్థిరత్వానికి ఢోకా లేదని అంతర్జాతీయ రేటింగ్ సంస్థ– మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ స్పష్టం చేసింది. ఆదాయాలు పటిష్టంగా ఉన్నాయని, రుణ పరిస్థితులు స్థిరంగా కొనసాగుతున్నాయని వివరించింది. ఆయా అంశాలు ఊహించినదానికన్నా వేగంగా సానుకూలతను సంతరించుకుంటున్నట్లు వివరించింది. ఆయా అంశాలు దేశంపై రేటింగ్‌కు సంబంధించి ఒత్తిడులను తగ్గిస్తాయి. ’సావరిన్ డీప్ డైవ్’ పేరుతో మూడీస్ నిర్వహించిన ఒక వెర్చువల్ కార్యక్రమంలో మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ క్రిస్టియన్ డి గుజ్మాన్ మాట్లాడుతూ, ♦ భారతదేశానికి మూడీస్ ‘బీఏఏ3’ సార్వభౌమ రేటింగ్ ఇస్తోంది. అధిక రుణ భారం ఉన్న అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటైన భారత్ ఎకానమీ బలహీనతలను అధిక ఆర్థిక వృద్ధి పటిష్టత సమతౌల్యం చేస్తుంది. భారత్ కార్పొరేట్ వ్యవస్థ కూడా ఆర్థిక వ్యవస్థ పటిష్టతను ప్రతిబింబిస్తోంది. ♦ 2022 చివరి నాటికి భారత్ రుణ నిష్పత్తి (దేశ స్థూలదేశీయోత్పత్తి– జీడీపీలో) 84 శాతంగా ఉంటుందన్నది అంచనా. పలు వర్థమాన దేశాలకన్నా ఇది ఎక్కువ. ♦ వచ్చే ఏడాది భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న జీ–20 ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని మేము భావిస్తున్నాము. అయితే కుటుంబాలు, వ్యాపార సంస్థలు తక్కువ కొనుగోలు శక్తి సవాళ్లను ఎదుర్కోవడం ప్రస్తుతం కీలక సవాలుగా ఉంది. అధిక ద్రవ్యోల్బణం భారతదేశ వృద్ధికి ప్రతికూల ప్రమాదాలను సృష్టిస్తోంది. ♦ భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి అంచనాలను వరుసగా రెండవసారి రేటింగ్ దిగ్గజం మూడీస్ ఇటీవలే తగ్గించింది. 2022 భారత్ వృద్ధి రేటును 7.7 శాతం నుంచి 7 శాతానికి తగ్గించడం జరిగింది. ద్రవ్యోల్బణం, అధిక వడ్డీరేట్లు, అంతర్జాతీయ మందగమనం వంటి అంశాలు తాజా నిర్ణయానికి కారణం. తొలుత ఈ ఏడాది మే నెల్లో 2022 వృద్ధి అంచనాలను మూడీస్ 8.8 శాతంగా అంచనావేసింది. అయితే సెప్టెంబర్‌లో 7.7 శాతానికి తగ్గించింది. రెండు నెలలు గడవకముందే మరోసారి ‘కోత’ నిర్ణయం తీసుకుంది. ♦ 2023లో మరింతగా 4.8 శాతానికి వృద్ధి రేటు తగ్గి, 2024లో 6.4 శాతానికి మెరుగుపడుతుందన్నది మూడీస్ అంచనా. 2021 క్యాలెండర్ ఇయర్లో భారత్ వృద్ధి 8.5 శాతమని మూడీస్ పేర్కొంది. ♦ బలహీన రూపాయి, అధిక చమురు ధరలు ఎకానమీపై ప్రతికూల ప్రభావాన్ని కొనసాగిస్తాయి. ♦ 2023, 2024లో అంతర్జాతీయ వృద్ధి స్పీడ్ మందగిస్తుంది. 2023లో జీ-20 దేశాల జీడీపీ 1.3 శాతం క్షీణించే అవకాశం ఉంది. ♦ మెరుగైన పన్ను వసూళ్ల వల్ల 2022-23 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు (ప్రభుత్వ ఆదాయాలు-వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం) అంచనాలకు అనుగుణంగా 6.4 శాతానికి (జీడీపీ విలువలో) పరిమితం అవుతుందన్న అంచనాలు ఉన్నాయి. 2022-23లో ద్రవ్యలోటు రూ.16.61 లక్షల కోట్లుగా 2022 ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ నిర్దేశించింది. ఇదే ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) అంచనాల్లో ఇది 6.4 శాతం. 2025–26 నాటికి ద్రవ్యలోటును 4.5 శాతానికి తగ్గించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ♦ మూడీస్ గత ఏడాది అక్టోబర్‌లో భారత్ సావరిన్ రేటింగ్ అవుట్‌లుక్‌ను ‘నెగటివ్’ నుంచి ‘స్థిరత్వానికి’ అప్‌గ్రేడ్ చేసింది. ‘బీఏఏ3’ రేటింగ్‌ను పునరుద్ఘాటించింది. అయితే ఇది చెత్త గ్రేడ్‌కు ఒక అంచె అధికం కావడం గమనార్హం. రూపాయిపై ఆందోళన అక్కర్లేదు.. భారతదేశం రుణంలో ఎక్కువ భాగం స్థానిక కరెన్సీలో ఉంది. విదేశీ కరెన్సీ రుణం బహుపాక్షిక లేదా ద్వైపాక్షిక అభివృద్ధి భాగస్వాముల నుండి దాదాపు రాయితీల ప్రాతిపదికన ఉంటుంది. ఈ నేపథ్యంలో రూపాయి బలహీనత వల్ల ఎకానమీకి ఇబ్బంది ఏదీ ఉండబోదని భావిస్తున్నాం. రూపాయి విలువ క్షీణించడం వల్ల విదేశీ కరెన్సీ రుణాలను తీర్చగల ప్రభుత్వ సామర్థ్యంలో ప్రతికూలతలు ఏర్పడతాయని మేము భావించడం లేదు. అక్టోబర్ 19న అమెరికా కరెన్సీలో రూపాయి విలువ 60 పైసలు పతనమై, చరిత్రాత్మక కనిష్టం 83 వద్ద ముగిసింది. అదే రోజు ఇంట్రాడేలో 83.05నీ చూసింది. అప్పట్లో గడచిన కేవలం 14 రోజుల్లో 100 పైసలు నష్టపోయి, 83 స్థాయిని చూసింది. కాగా, మరుసటి రోజు అక్టోబర్ 20న బలహీనంగా 83.05 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. అయితే చివరకు చరిత్రాత్మక పతనం నుంచి 21 పైసలు కోలుకుని 82.79 వద్ద ముగిసింది. అటు తర్వాత కొంత బలపడినా, రూపాయి ఇంకా బలహీన దోరణిలోనే ఉందన్నది విశ్లేషణ. -
మైనింగ్‌కు ప్రభుత్వ మద్దతు కావాలి
కోల్‌కతా: దేశాభివృద్ధికి మైనింగ్ కీలకమని, ఈ రంగానికి కేంద్ర ప్రభుత్వ మద్దతు అవసరమని పరిశ్రమకు చెందిన ప్రముఖులు పేర్కొన్నారు. జీడీపీని ఎన్నో రెట్లు వృద్ధి చేయాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని ప్రస్తావించారు. ప్రోత్సాహకాలు ఇవ్వడంతోపాటు, నియంత్రణపరమైన వెసులుబాటు కల్పించాలని, కీలకమైన ఖనిజాల మైనింగ్‌పై నియంత్రణలు తొలగించాలని మైనింగ్‌కు సంబంధించి సీఐఐ జాతీయ కమిటీ చైర్మన్, వేదాంత గ్రూపు సీఈవో సునీల్ దుగ్గల్ కోరారు. కోల్‌కతాలో జరిగిన అంతర్జాతీయ మైనింగ్ సదస్సు, 2022లో భాగంగా ఆయన మాట్లాడారు. వెలికితీతకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహాలు కావాలని, అప్పుడే ఈ రంగంలో నూతన తరం కంపెనీలను ఆకర్షించొచ్చని సూచించారు. అలాగే, మైనింగ్‌కు సంబంధించి పర్యావరణ, అటవీ అనుమతులకు ఓ కాల పరి మితి ఉండాలన్నారు. భూ సమీకరణ సమస్యలను పరిష్కరించాలని కోరారు. లోహాలు, ఖనిజాల వెలికితీత తక్కువగా ఉండడంతో, 2021లో వీటి దిగుమతుల కోసం 86 బిలియన్ డాలర్లను వెచ్చించాల్సి వచ్చిందని చెబుతూ.. ఇది 2030 నాటికి 280 బిలియిన్ డాలర్లకు పెరుగుతుందని హెచ్చరించారు. భారత్ వృద్ధి చెందాల్సి ఉందంటూ, వృద్ధికి మైనింగ్ కీలకమని ఇదే కార్యక్రమలో పాల్గొన్న కోల్ ఇండియా చైర్మన్ ప్రమోద్ అగర్వాల్ పేర్కొన్నారు. జీడీపీలో మైనింగ్ వాటా ప్రస్తుతం 2–2.5 శాతంగా ఉంటే, 2030 నాటికి 5 శాతానికి చేర్చాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని గుర్తు చేశారు. స్థిరమైన ఉత్పాదకత, యాంత్రీకరణ, డిజిటైజేషన్ అవసరాన్ని ప్రస్తావించారు. మొబైల్, బ్యాటరీ, సోలార్ కోసం అవసరమైన కీలక ఖనిజాల మైనింగ్ సమయంలో కాలుష్యం విడుదలను తగ్గించడం కీలకమని బీఈఎంఎల్ చైర్మన్, ఎండీ అమిత్ బెనర్జీ అభిప్రాయపడ్డారు. దేశాభివృద్ధికి ఖనిజాలు కీలకమని ఎన్ఎండీసీ చైర్మన్ సుమిత్‌దేబ్ పేర్కొన్నారు. -
7.2 శాతం వృద్ధికే ఇక్రా ఓటు
ముంబై: ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) జీడీపీ వృద్ధి అంచనాను 7.2 శాతంగానే కొనసాగిస్తున్నట్టు ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేటు మూలధన వ్యయాలు, కాంటాక్ట్ సేవలు పుంజుకోవడం సానుకూలతలుగా పేర్కొంది. నిలిచిన డిమాండ్ కూడా తోడు కావడంతో వృద్ధి కరోనా ముందు నాటికి స్థాయికి పుంజుకుంటుందని అంచనా వేసింది. ఏప్రిల్–జూన్ (క్యూ1) త్రైమాసికంలో దేశ జీడీపీ 13.5 శాతం వృద్ధిని చూడగా, సెప్టెంబర్ త్రైమాసికంలో దీనికంటే తగ్గుతుందని, తదుపరి రెండు త్రైమాసికాల్లోనూ ఇంకాస్త తక్కువ వృద్ధిని చూస్తుందని తెలిపింది. ఎక్కువ రేటింగ్ ఏజెన్సీలు జీడీపీ వృద్ధి అంచనాలను 7 శాతం, అంతకంటే దిగువకు ప్రకటించడం గమనార్హం. ఈ రకంగా చూస్తే ఇక్రా వృద్ధి అంచనాలు కొంచెం మెరుగ్గానే ఉన్నాయని చెప్పుకోవాలి. ఆగస్ట్ నెలలో రోజువారీ రికార్డు స్థాయి జీఎస్టీ ఈవే బిల్లుల జారీ, పండుగలకు ముందస్తు భారీగా ఉత్పత్తుల నిల్వలను పెంచుకోవడం, కమోడిటీ ధరలు క్షీణించడం రానున్న పండుగల సీజన్‌కు ఎంతో సానుకూలమని.. అయితే, ఖరీఫ్‌లో కీలకమైన వరి దిగుబడి తగ్గనుండడం, వెలుపలి డిమాండ్ బలహీనపడడం వృద్ధికి ఉన్న సవాళ్లు అని, వీటిని పరిశీలించాల్సి ఉంటుందని ఇక్రా అభిప్రాయాలు వ్యక్తం చేసింది. త్రైమాసికం వారీగా.. ‘‘సెప్టెంబర్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 6.5–7 శాతానికి పరిమితం కావచ్చు. డిసెంబర్ త్రైమాసికం (క్యూ3), 2023 జనవరి–మార్చి త్రైమాసికంలో (క్యూ4)లో 5–5.5 శాతంగా ఉండొచ్చు. బేస్ ప్రభావం వల్లే ఇలా ఉంటుంది’’అని ఇక్రా ముఖ్య ఆర్థికవేత్త అదితి నాయర్ పేర్కొన్నారు. 2022 చివరికి ప్రైవేటు రంగంలో పూర్తి స్థాయిలో మూలధన వ్యయాలు పుంజుకుంటాయని, కంపెనీల తయారీ సామర్థ్య వినియోగం పెరుగుతుందని ఇక్రా అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీవీఏ 7 శాతంగా, రిటైల్ ద్రవ్యోల్బణం 6.5 శాతంగా, టోకు ద్రవ్యోల్బణం 10.1 శాతంగా, కరెంటు ఖాతా లోటు జీడీపీలో 3.5 శాతం (మూడు రెట్లు పెరిగి 120 బిలియన్ డాలర్లు) ఉంటుందని పేర్కొంది. దేశీయంగా డిమాండ్ బలంగా ఉండడంతో, దిగుమతులు పెరిగి కరెంటు ఖాతా లోటు విస్తరిస్తుందని అభిప్రాయపడింది. రూపాయి మరీ దారుణ పరిస్థితుల్లో డిసెంబర్ నాటికి డాలర్‌తో 83కు పడిపోవచ్చని, పదేళ్ల ప్రభుత్వ సెక్యూరిటీల ఈల్డ్స్ 7.3–7.8 శాతం స్థాయిలో ఉంటాయని అంచనా వేసింది. స్థూల ద్రవ్యలోటు 15.87 లక్షల కోట్లు (జీడీపీలో 6.7 శాతం) ఉంటుందని పేర్కొంది. -
భారత వృద్ధిపై ఎస్ అండ్ పీ విశ్వాసం
న్యూఢిల్లీ: భారత వృద్ధి ప్రగతి పట్ల అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఎస్అండ్పీ ధీమాగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వృద్ధి అంచాలను పలు రేటింగ్ ఏజెన్సీలు తగ్గించినప్పటికీ.. ఎస్అండ్పీ మాత్రం 7.3 శాతంగానే కొనసాగించింది. ఈ ఏడాది చివరి వరకు ద్రవ్యోల్బణం ఆర్బీఐ గరిష్ట పరిమితి అయిన 6 శాతానికి ఎగువనే చలించొచ్చని అభిప్రాయపడింది. ఆసియా పసిఫిక్ ప్రాంతానికి సంబంధించి ఆర్థిక అంచనాలను తాజాగా ఎస్అండ్పీ ఓ నివేదిక రూపంలో తెలియజేసింది. ఈ ప్రాంతంలో ఆర్థిక వ్యవస్థలకు వెలుపలి వాతావరణం ప్రతికూలంగా ఉందని, అధిక అంతర్జాతీయ రేట్ల వల్ల కరెన్సీ విలువల క్షీణత, పెట్టుబడులు బయటకు వెళ్లిపోవడం వంటి ఒత్తిళ్లు ఈ దేశాల సెంట్రల్ బ్యాంకులు ఎదుర్కొంటున్నట్టు తెలిపింది. చైనాలో మందగమనం ప్రభావం.. భారత్‌లో వినియోగం, పెట్టుబడుల వాతావరణం పుంజుకోవడం సర్దుబాటు చేస్తుందని పేర్కొంది. ‘‘సవాళ్లు ఉన్నప్పటికీ.. 2022–23 ఆర్థిక సంవత్సరానికి భారత్ వృద్ధి రేటు అంచనాలను 7.3 శాతంగాను, తదుపరి ఆర్థిక సంవత్సరం 2023–24కు 6.5 శాతంగా కొనసాగిస్తున్నాం’’అని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ ఆసియా పసిఫిక్ చీఫ్ ఎకనమిస్ట్ లూయిస్ కూజ్స్ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి మన దేశ జీడీపీ 7.2 శాతం వృద్ధి సాధించొచ్చని ఆర్బీఐ అంచనాగా ఉంది. ఏడీబీ, ఫిచ్ రేటింగ్స్, సిటీ గ్రూపు భారత వృద్ధి రేటును 2022–23కు 7 శాతం, అంతకంటే దిగువకు ఇప్పటికే తగ్గించేశాయి. గత ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు 8.7 శాతంగా ఉండడం గమనార్హం. పస్త్రుత ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికానికి జీడీపీ 13.5 శాతం వృద్ధిని చూడడం తెలిసిందే. రూపాయిలో అస్థిరతలు.. రానున్న రోజుల్లో రూపాయి ఒత్తిళ్లను చూస్తుందని ఎస్అండ్పీ ఆర్థికవేత్త విశృత్ రాణా అంచనా వేశారు. అయితే, భారత్ వద్ద విదేశీ మారకం నిల్వలు గణనీయంగా ఉన్నట్టు తెలిపారు. రూపాయి డాలర్‌తో 81.52కు పడిపోవడం గమనార్హం. ‘‘గత నెల రోజుల్లో అంతర్జాతీయ కరెన్సీల బాస్కెట్‌తో పోలిస్తే రూపాయి క్షీణించింది తక్కువే. అంతర్జాతీయంగా ద్రవ్య విధానాలు కఠినతరం అవుతున్న కొద్దీ రూపాయి మరిన్ని అస్థిరతలు చూడనుంది. బారత విదేశీ మారకం నిల్వల నిష్పత్తి అన్నది స్వల్పకాల విదేశీ రుణాలతో పోలిస్తే 2 కంటే ఎక్కువే ఉంది. ఇది గణనీయమైన మిగులు నిల్వలను సూచిస్తోంది’’అని విశృత్ రాణా వివరించారు. ద్రవ్యోల్బణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 6.8 శాతంగాను, తదుపరి ఆర్థిక సంవత్సరానికి 5 శాతంగాను ఉంటుందని ఎస్అండ్పీ అంచనా వేసింది. వాతావరణంలో మార్పుల వల్ల గోధుమలు, బియ్యం ధరలు పెరగడాన్ని ప్రస్తావించింది. ద్రవ్యోల్బణం పెరుగుదల రేట్ల పెరుగుదలకు దారితీస్తుందంటూ, 2022–23 చివరికి 5.9 శాతం స్థాయిలో రెపో రేటు ఉంటుందని అంచనా వేసింది. -
మోర్గాన్ స్టాన్లీ కోత..భారత్ జీడీపీ వృద్ధి అంచనా కుదింపు!
ముంబై: భారత్ 2022–23 ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటుకు అమెరికన్ బ్రోకరేజ్ సంస్థ– మోర్గాన్ స్టాన్లీ 40 బేసిస్ పాయింట్ల మేర (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) కోత పెట్టింది. దీనితో ఈ రేటు 7.6 శాతం నుంచి 7.2 శాతానికి తగ్గింది. 2023–24 వృద్ధి అంచనాలను సైతం 0.30 శాతం తగ్గించింది. దీనితో ఈ రేటు 6.7 శాతం నుంచి 6.4 శాతానికి దిగివచ్చింది. ప్రపంచ వృద్ధి మందగమన ధోరణి భారత్ ఎకానమీపై ప్రతికూల ప్రభావం చూపనుందని మోర్గాన్ స్టాన్లీ తన తాజా నివేదికలో విశ్లేషించింది. ఇక 2022 డిసెంబర్‌తో ముగిసే సంవత్సరంలో ప్రపంచ వృద్ధి 1.5 శాతానికి పరిమితమవుతుందని తెలిపింది. 2021లో ఈ రేటు 4.7 శాతం. కాగా ఆర్బీఐ రెపోరేటు ప్రస్తుత 4.9% నుంచి 2023 ఆగస్టు నాటికి 6.5%కి చేరుతుందని మోర్గాన్ స్టాన్లీ విశ్లేషించింది. -
ఎకానమీ.. రివర్స్‌గేర్..!
న్యూఢిల్లీ: భారత్ ఎకానమీ వృద్ధి రేటు 2021–22 చివరి త్రైమాసికంలో మరింత కిందకు జారింది. జనవరి–ఫిబ్రవరి–మార్చి త్రైమాసికంలో 4.1 శాతం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు నమోదయ్యింది. అంతక్రితం మూడు త్రైమాసికాలను పరిశీలిస్తే, వృద్ధి రేట్లు తగ్గుతూ రావడం గమనార్హం. ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో 20.3 శాతం వృద్ధి నమోదయితే, రెండవ త్రైమాసికంలో ఈ రేటు 8.5 శాతానికి తగ్గింది. అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో 5.4 శాతంగా వృద్ధి స్పీడ్ నమోదయితే తాజా సమీక్షా త్రైమాసికంలో మరింతగా జారుడుబల్లపై నిలిచింది. కొన్ని రంగాల హైబేస్ ఎఫెక్ట్‌సహా కోవిడ్–19 కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయాలతో స్థానిక ఆంక్షలు, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంతో సరఫరాల సమస్యలు, కమోడిటీ ధరల తీవ్రత వంటి అంశాలు సమీక్షా నెల్లో వృద్ధి రేటును కిందకు జార్చాయి. ‘పోల్చుతున్న నెలలో’ అతి తక్కువ లేదా ఎక్కువ గణాంకాలు నమోదుకావడం, అప్పటితో పోల్చి, తాజా సమీక్షా నెలలో ఏ కొంచెం ఎక్కువగా లేక తక్కువగా అంకెలు నమోదయినా అది ‘శాతాల్లో’ గణనీయ మార్పును ప్రతిబింబించడమే బేస్ ఎఫెక్ట్. ఇక్కడ 2020–21 మార్చి త్రైమాసికంలో పలు రంగాలు మంచి పురోగతిని నమోదుచేసుకున్నాయి. అయితే వృద్ధి రేటు మాత్రం అప్పట్లో 2.5 శాతంగా నమోదయ్యింది. ‘క్షీణత’ నుంచి ‘వృద్ధి’లోకి... కాగా 2021 ఏప్రిల్‌తో ప్రారంభమై, 2022 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఎకానమీ వృద్ధి రేటు 8.7 శాతంగా నమోదయ్యింది. 2020–12 ఇదే కాలంలో ఎకానమీ ఏకంగా 6.6 శాతం క్షీణతను నమోదుచేసింది. అత్యంత లో బేస్ కూడా తాజా వార్షిక వృద్ధి రేటుకు కారణమయ్యిందని నిపుణులు భావిస్తున్నారు. కాగా, 2021–22లో ఎకానమీ 8.9 శాతం వృద్ధి నమోదుచేసుకుంటుందని జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) రెండవ అడ్వాన్స్ అంచనాలు వెలువడ్డాయి. అయితే అంతకంటే 20 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) తక్కువ వృద్ధి రేటు నమోదయ్యింది. ఇక ఆర్బీఐ అంచనాలు (9.5%) కన్నా 80 బేసిస్ పాయింట్ల తక్కువగా వృద్ధి నమోదయ్యింది. నాల్గవ త్రైమాసికంలో బల హీన గణాంకాలే దీనికి కారణం. కాగా, 2022–23 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 8 నుంచి 8.5% శ్రేణిలో ఉంటుందని ఈ ఏడాది ఫిబ్రవరిలో పార్లమెంటులో సమరి్పంచిన ఎకనమిక్ సర్వే అంచనా వేసింది. ‘మూలధనం’ సానుకూలతలు మూలధన పెట్టుబడులకు సంబం ధించిన గ్రాస్ ఫిక్డ్స్ క్యాపిటల్ ఫార్మేషన్ 2020–21లో రూ.41.31 లక్షల కోట్లుగా ఉంటే, 2021–22లో రూ.47.84 లక్షల కోట్లకు పెరగడం హర్షణీయ పరిణామం. 8.7 శాతం వృద్ధి రేటు ఎలా అంటే... జాతీయ గణాంకాల కార్యాలయం లెక్కల ప్రకారం, 2020–21 ఆర్థిక సంవత్సరంలో ఎకానమీ విలువ రూ.135.58 లక్షల కోట్లు. 2021–22లో ఈ రేటు రూ.147.36 లక్షల కోట్లకు పెరిగింది. అంటే వృద్ధి రేటు 8.7 శాతమన్నమాట. కరెంట్ ఇయర్ ప్రాతిపదికన ద్రవ్యోల్బణం లెక్కలను సర్దుబాటు చేయకుండా చూస్తే నామినల్ జీడీపీ 2020–21లో రూ.198.01 లక్షల కోట్లు ఉంటే, 2021–22లో రూ.236.65 లక్షల కోట్లకు పెరిగింది. అంటే వృద్ధి రేటు 19.51%. చైనా వృద్ధి రేటుకన్నా తక్కువే 2022 మొదటి త్రైమాసికంలో (జనవరి–మార్చి) చైనా వృద్ధి రేటు 4.8 శాతంగా నమోదయ్యింది. అయితే ఇంతకన్నా తక్కువగా భారత్ ఎకానమీ పనితీరు నమోదుకావడం గమనార్హం. దీనితో త్రైమాసికం పరంగా ప్రపంచంలో వేగవంతమైన ఎకానమీగా చైనా నమోదయ్యింది. కట్టడిలోనే ద్రవ్యలోటు ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు 2021–22 ఆర్థిక సంవత్సరంలో కట్టడిలోనే ఉన్నట్లు గణాంకాలు వెల్లడించాయి. బడ్జెట్ అంచనా ప్రకారం జీడీపీ విలువలో ద్రవ్యలోటు 6.9% (రూ.15,91,089 కోట్లు). అయితే 6.71%గా నమోదయినట్లు (మొదటి అంచనాల ప్రకారం రూ.15,86,537 కోట్లు) కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) వివరించింది. భారీ పన్ను వసూళ్లు ద్రవ్యలోటు కట్టుతప్పకుండా ఉండడానికి ప్రధాన కారణమని నిపుణులు భావిస్తున్నారు. ఆర్థిక సంవత్సరంలో పన్ను వసూళ్ల అంచనా రూ.17.65 లక్షల కోట్లుకాగా, వసూలయ్యింది రూ.18.2 లక్షల కోట్లు. అన్ని రంగాలూ బలహీనమే... ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటూ స్థిర ధరల బేస్ ప్రకారం వేసిన గణాంకాల ప్రకారం, 2021–22లో ఎకానమీ అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోలి్చతే –6.6% క్షీణత నుంచి 8.7% వృద్ధికి మళ్లింది. జనవరి–మార్చి త్రైమాసిక కాలంలో వృద్ధి రేటు 4.1 శాతంగా ఉంది. ఇక ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకోకుండా కరెంట్ ఇయర్ ప్రాతిపదికన తాజా సమీక్షా ఆర్థిక సంవత్సరం, నాల్గవ త్రైమాసికాల్లో వృద్ధి రేట్లు వరుసగా 19.5 శాతం, 14.4 శాతంగా ఉన్నాయి. 2020–21లో ఇదే కాలంలో ఈ రేటు క్షీణతలో మైనస్ 1.4 శాతంగా ఉంది. ఇక జీవీఏ (గ్రాస్ వ్యాల్యూ యాడెడ్ అంటే జీడీపీ ‘ప్లస్’ ఉత్పత్తులపై సబ్సిడీలు ‘మైనస్’ ఉత్పత్తులపై పన్నులు) విషయానికి వస్తే, వృద్ధి రేటు వార్షికంగా 8.1 శాతం ఉంటే, 4వ త్రైమాసికంలో 3.9 శాతంగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం ఇందుకు సంబంధించి 4.8 శాతం క్షీణత నమోదయ్యింది. ఇక తాజా మార్చి త్రైమాసికంలో అన్ని విభాగాలూ బలహీనంగా ఉండడం గమనార్హం. తలసరి ఆదాయం వృద్ధి అంతంతే... తలసరి ఆదాయం కోవిడ్–19 కన్నా ఇంకా దిగువ స్థాయిలోనే ఉంది. నికర జాతీయ ఆదాయం ప్రకారం, ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకోకుండా తలసరి ఆదాయాన్ని పరిశీలిస్తే, 2020–21లో ఇది రూ.1,26,855 ఉంటే, తాజా సమీక్షా ఆర్థిక సంవత్సరంలో ఈ మొత్తం 18.3 శాతం పెరిగి రూ.1.5 లక్షలకు చేరింది. అయితే స్థిర ధరల వద్ద పరిశీలిస్తే, తలసరి ఆదాయం 7.5 శాతం మాత్రమే పెరిగి రూ.85,110 నుంచి రూ.91,481కి చేరింది. కోవిడ్ 19కు ముందు ఆర్థిక సంవత్సరం 2019–20లో తలసరి ఆదాయం (స్థిర ధరల వద్ద) రూ.94,270. కోవిడ్ కఠిన ఆంక్షల నేపథ్యంలో 2020–21లో ఇది రూ.85,110కి పడిపోయింది. ప్రైవేటు వినియోగం బలహీనత నాల్గవ త్రైమాసికంలో వ్యవసాయం నుంచి జీడీపీకి తగిన మద్దతుగా లభించగా, తయారీ కార్యకలాపాలు బలహీనంగా ఉన్నాయి. ముఖ్యంగా నాల్గవ త్రైమాసికం జీడీపీలో ప్రైవేట్ వాటా తగ్గుదల ఆందోళన కలిగించే అంశం. ద్రవ్యోల్బణం తీవ్రత, వినియోగ రికవరీలో అస్పష్టత వంటి అంశాల నేపథ్యంలో 2022–23లో వృద్ధి రేటు 7.2 శాతానికే పరిమితం అవుతుందని విశ్వసిస్తున్నాం. ద్రవ్యోల్బణం నేపథ్యంలో జూన్ మొదటి వారం పాలసీ సమీక్ష సందర్భంగా ఆర్బీఐ రెపో రేటును పావుశాతం పెంచుతుందని మా అంచనా. – సాక్షి గుప్తా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎకనమిస్ట్ స్టాగ్ఫ్లేషన్ ఇబ్బంది తక్కువే... ఇతర దేశాలతో పోల్చితే భారత్‌కు స్టాగ్ఫ్లేషన్ (స్థూల దేశీయోత్పత్తి వృద్ధి అంతంతమాత్రంగా ఉండి, ధరలు తీవ్రంగా పెరగడం) ఇబ్బంది తక్కువే. ఇతర దేశాలకన్నా... భారత్ ఎకానమీ పరిస్థితి మెరుగ్గా ఉంది. ముఖ్యంగా భారత్ ఫైనాన్షియల్ రంగం వృద్ధికి చక్కటి మద్దతును అందిస్తోంది. – వీ అనంత నాగేశ్వరన్, చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ వృద్ధి అంచనాలు తగ్గిస్తున్నాం... 2022కు సంబంధించి భారత్ క్రితం (ఏప్రిల్‌నాటి) 8.2 శాతం వృద్ధి అంచనాలను తగ్గించే పనిలో ఉన్నాం. గ్లోబల్ స్టాగ్ఫ్లేషన్ సవాళ్లు భారత్‌పై పడే అవకాశాలు కనిపిస్తుండడమే దీనికి కారణం. భారత్ ఇప్పటికే తక్కువ ఉపాధి కల్పన, అధిక ద్రవ్యోల్బణం సవాళ్లను ఎదుర్కొంటోంది.అయితే సవాళ్లు ఉన్నప్పటికీ దేశం రికవరీ బాటనే నడుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు వడ్డీరేట్ల మరింత పెంపు బాటనే నడిచే అవకాశాలు సుస్పష్టం. మహమ్మారి సవాళ్ల నుంచి తప్పుకున్నట్లు అప్పడే భావించడం తగదు. చైనాలో ఈ ఆంక్షలు ఇంకా కొనసాగుతుండడం గమనార్హం. చైనా జీడీపీ 1% తగ్గితే, భారత్ వృద్ధి 0.6% తగ్గుతుంది. – లూయిస్ బ్రూయర్, భారత్‌లో ఐఎంఎఫ్ సీనియర్ రెసిడెంట్ ప్రతినిధి