
వృద్ధి అంచనాలు కట్..
► ఈ ఏడాది జీడీపీ వృద్ధి రేటు
► 7-7.5 శాతమే ఉండొచ్చు: కేంద్రం
► పన్నులతో బడ్జెట్ లోటు పూడగలదని ధీమా
► రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతం లోపే ఉండొచ్చు
► అర్ధసంవత్సర ఆర్థిక విశ్లేషణలో వెల్లడి
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి అంచనాలను కేంద్రం కుదించింది. ముందుగా 8.1-8.5 శాతంగా ఉండొచ్చని లెక్కలు వేసినప్పటికీ.. తాజాగా ఇది 7-7.5 శాతం స్థాయికి మాత్రమే పరిమితం కాగలదని పేర్కొంది. అయితే, ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా వస్తాయనుకున్న నిధుల పరిమాణం తగ్గినా.. పన్నుల వసూళ్లు అధికంగా ఉండటం ద్వారా బడ్జెట్ లోటు కట్టడి లక్ష్యాన్ని సాధించగలమని తెలిపింది. శుక్రవారం పార్ల మెంటులో ప్రవేశపెట్టిన అర్ధ సంవత్సర ఆర్థిక విశ్లేషణ నివేదికలో కేంద్ర ఆర్థిక శాఖ ఈ విషయాలు వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్య లోటును 3.9 శాతానికి కట్టడి చేయాలన్న లక్ష్యాన్ని సాధించగలమని పేర్కొంది.
అయితే, 7వ పే కమిషన్ సిఫార్సుల ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాల భారం గణనీయంగా పెరగనుండటం వల్ల వచ్చే ఏడాది దీన్ని 3.5 శాతానికి తీసుకురావాలన్న లక్ష్యం కొంత ఒత్తిడికి గురికాగలదని ఆర్థిక శాఖ వివరించింది. ‘సవాళ్లున్న నేపథ్యంలో మొత్తం సంవత్సరానికి గాను వాస్తవ జీడీపీ 7-7.5 శాతం శ్రేణిలో ఉండొచ్చని అంచనా. రిజర్వ్ బ్యాంక్ లక్ష్యానికి అనుగుణంగానే రిటైల్ ద్రవ్యోల్బణం 6% దిగువనే ఉండొచ్చు’అని తెలిపింది.
ప్రభుత్వం పాటిస్తున్న ద్రవ్య, ఆర్థిక విధానాలపరంగా ప్రభుత్వ పనితీరు అద్భుతంగా ఉందని విశ్లేషణ సూచిస్తోందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా తెలిపారు. ప్రభుత్వ పెట్టుబడులు, ప్రైవేట్ వినియోగం.. ఆర్థిక వృద్ధికి చోదకాలుగా ఉంటున్నాయని, ఎకానమీలో కొన్ని అంశాలు మెరుగుపడాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ.. స్థూలంగా చూస్తే భారత్ మెరుగ్గానే రాణిస్తోందని ఆయన వివరించారు.
పరోక్ష పన్నుల వసూళ్లు బాగున్నాయ్...
ప్రత్యక్ష పన్నుల వసూళ్ల కన్నా.. పరోక్ష పన్నుల వసూళ్లు మెరుగ్గా ఉన్నాయని విశ్లేషణ నివేదిక పేర్కొంది. కార్పొరేట్ల లాభాలు ఆశించినంత స్థాయిలో లేకపోవడమే ప్రత్యక్ష పన్నుల వసూళ్లు కొంత తక్కువగా ఉండటానికి కారణం కావొచ్చని వివరించింది. 2016-17లో చమురు ధరలు మరిం త తగ్గకుండా బ్యారెల్ రేటు 50 డాలర్ల స్థాయి సమీపంలో తిరుగాడిన పక్షంలో ఈ ఏడాది ఎకానమీకి అదనంగా 1-1.5% మేర దోహదపడిన వినియోగ తోడ్పాటు తగ్గవచ్చని నివేదిక వివరించింది. ఒకవేళ వచ్చే ఏడాది రుతుపవనాలు మెరుగ్గా ఉంటే.. గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం పెరగడం ద్వారా ఎకానమీకి అదనంగా తోడ్పాటు లభించగలదని తెలిపింది. కార్పొరేట్ల రికవరీ మందకొడిగానే ఉండొచ్చన్న అంచనాల నేపథ్యంలో ప్రైవేట్ పెట్టుబడులు చెప్పుకోదగ్గ స్థాయిలో ఉండకపోవచ్చని నివేదిక వివరించింది.
మిశ్రమ సంకేతాలతో గందరగోళం..
ఎకానమీ కోలుకుంటోందని, అయితే దీని పటిష్టత, విస్తృతి అనేది ఎలా ఉందనేది నిర్దిష్టంగా లెక్కించడం.. రెండు కారణాల వల్ల కష్టంగా ఉందని అర్ధ సంవత్సర ఆర్థిక విశ్లేషణ నివేదికను రూపొందించిన ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యన్ ... విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. ఎకానమీ నుంచి మిశ్రమ సంకేతాలు వస్తుండటం ఒక కారణం కాగా, జీడీపీ డేటాను ఏ విధంగా అన్వయించుకోవాలన్న దానిపై అనిశ్చితి నెలకొనడం మరో కారణమని ఆయన తెలిపారు.
వివిధ రంగాల్లో చోటు చేసుకుంటున్న అనేకానేక పరిణామాలను అన్వయించుకోవడం కొంత కష్టంగా ఉంటోందన్నారు. ఎకానమీ నుంచి గందరగోళపర్చేవిగా, మిశ్రమంగా వస్తున్న సంకేతాల్లో డేటా అనిశ్చితి అన్నది ప్రతిబింబిస్తోందని అరవింద్ సుబ్రమణ్యన్ తెలిపారు. పర్సనల్ కన్జూ మర్ రుణాలు 15 శాతం మేర వృద్ధి చెందుతుండగా, పరిశ్రమ రుణాల వృద్ధి మందకొడిగా ఉండటం, అలాగే పరోక్ష పన్నుల వసూళ్ల భారీగా ఉండగా.. ప్రత్యక్ష పన్నుల వసూళ్లు చెప్పుకోదగినట్లు లేకపోవడం దీనికి ఉదాహరణలుగా ఆయన చెప్పారు.
మెరుగ్గా విదేశీ మారక నిల్వలు..
కరెంట్ అకౌంట్ లోటు, విదేశీ మారకద్రవ్యం వంటి అంశాలకు సంబంధించి అంతర్జాతీయ కోణంలో భారత్ ఆర్థిక పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయని నివేదిక వివరించింది. కరెంటు అకౌంటు లోటు తగ్గుముఖం పట్టిందని, ప్రస్తుతం కొంత సానుకూలంగా జీడీపీలో 1.2 శాతం స్థాయికి దిగివచ్చిందని తెలిపింది. అలాగే విదేశీ మారక నిల్వలు డిసెంబర్ 4 నాటికి గణనీయంగా 352.1 బిలియన్ డాలర్ల స్థాయికి పెరిగాయని పేర్కొంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ తీసుకునే చర్యల వల్ల తలెత్తే ఎటువంటి ఒడిదుడుకులనైనా తట్టుకోగలిగే స్థితిలోనే భారత్ ఉన్నట్లు కనిపిస్తోందని నివేదిక తెలిపింది.
ఎకానమీ స్థిరపడుతోంది: జైట్లీ
ప్రపంచ ఎకానమీ అనిశ్చితిలో ఉన్నప్పటికీ.. దేశీయంగా స్థూల ఆర్థిక పరిస్థితుల్లో స్థిరత్వం గణనీయంగా మెరుగుపడిందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. ద్రవ్యోల్బణం, ద్రవ్య లోటు, కరెంటు అకౌంటు లోటు మొదలైనవి అదుపులోకి వచ్చాయని ఆర్థిక పరిస్థితుల అంశంపై జరిగిన పార్లమెంటరీ సంప్రదింపుల కమిటీ సమావేశంలో ఆయన పేర్కొన్నారు. గడిచిన 19 నెలలుగా విధానాలపరంగా, వ్యవస్థీకృతంగా ప్రభుత్వం తీసుకుంటున్న పలు చర్యలు ఇందుకు దోహదపడ్డాయని జైట్లీ చెప్పారని ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటనలో వెల్లడించింది.