దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వ్యాఖ్యలు చేసింది. దీన్ని 4 శాతం దిగువకు తీసుకురావాడానికి ప్రయత్నిస్తున్నట్లు, అయితే ఇందుకు ఆహార ధరలే అడ్డంకిగా మారుతున్నట్లు మార్చి బులెటిన్ ‘స్టేట్ ఆఫ్ ఎకానమీ’లో ఆర్‌బీఐ ఇటీవల తెలిపింది. వినియోగదారు ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం గత డిసెంబరు నుంచి తగ్గుతూ వస్తూ, గత నెలలో 5.09 శాతంగా నమోదైంది.
ప్రధాన ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టినా, రిటైల్ ద్రవ్యోల్బణం 4 శాతం దిగువకు చేరేందుకు ఆహార ధరల ఒత్తిళ్లే అడ్డంకిగా మారుతున్నాయని ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ మైఖేల్ దేబబత్ర పాత్రా నేతృత్వంలోని బృందం తెలిపింది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ నెమ్మదిస్తోందని, అభివృద్ధి చెందిన దేశాల్లోనూ వృద్ధి మందగించడం, రాబోయే కాలంలో పరిస్థితుల్ని సూచిస్తున్నాయని వివరించింది. మన దేశంలో 2023-24 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో వాస్తవిక జీడీపీ వృద్ధి 6 త్రైమాసికాల గరిష్ఠ స్థాయికి చేరుకుందని బులెటిన్ వివరించింది.
పరోక్ష పన్నులు పటిష్ఠంగా వసూలు కావడం, తక్కువ సబ్సిడీలు వృద్ధి ఊపందుకునేందుకు దోహదం చేశాయని బృందం వెల్లడించింది. నిర్మాణాత్మక గిరాకీ, ఆరోగ్యకర కార్పొరేట్ గణాంకాలు, బ్యాంక్ బ్యాలెన్స్ షీట్లు వృద్ధి ముందుకు సాగడానికి సాయపడతాయని వ్యాసం పేర్కొంది.
ఇదీ చదవండి: 1 శాతం కుబేరుల దగ్గరే 40 శాతం సంపద
దేశం ఏటా 8%, అంతకంటే ఎక్కువ వృద్ధిని స్థిరంగా కొనసాగించే అవకాశం ఉందని ఆర్‌బీఐ బులెటిన్ వెల్లడించింది. 2021-24 మధ్య దేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి సగటున 8% పైనే నమోదైందని పేర్కొంది. కరెంట్ ఖాతా లోటు (సీఏడీ) అదుపులోనే ఉందని, విదేశీ మారకపు నిల్వలు బాగున్నాయని, వరుసగా మూడో ఏడాది కూడా ఆర్థిక ఏకీకరణ కొనసాగుతోందని తెలిపింది. వచ్చే కొన్ని దశాబ్దాలకు ఈ అనుకూల అంశాలను అవకాశాలు, బలాలుగా మార్చుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment