దేశంలో ద్రవ్యోల్బణం పెరుగనుందని రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) అంచనా వేసింది. సెప్టెంబర్‌లో నమోదైన 5.5 శాతం ద్రవ్యోల్బణం కంటే అక్టోబర్‌లో ఇది మరింత పెరిగే అవకాశం ఉందని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ హెచ్చరించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
‘అంతర్జాతీయంగా ఆర్థిక పరిస్థితుల్లో అస్థిరత నెలకొంది. కానీ భారత ఎకానమీని స్థిరంగా ఉంచేందుకు ఆర్‌బీఐ సమర్థంగా వ్యవహరిస్తోంది. ప్రస్తుత కాలంలో ప్రధానంగా రెండు అంశాలు ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తున్నాయి. ఒకటి యూఎస్ ఎన్నికల ఫలితాలు. మరొకటి ఆర్థిక విధాన మద్దతుకు సంబంధించి చైనా నుంచి ప్రకటనలు వెలువడడం. ఆర్థిక వృద్ధికి ప్రతికూల అంశాల కంటే సానుకూల అంశాలు ఎక్కువగా ఉన్నాయి. భారత ఆర్థిక వృద్ధిని మెరుగుపరిచేందుకు ఆర్‌బీఐ 70కి పైగా హైస్పీడ్ ఇండికేటర్‌లను ట్రాక్ చేస్తోంది’ అన్నారు.
ఇదీ చదవండి: రుణాల పంపిణీపై బ్యాంకర్లతో సమీక్ష
రిటైల్ ద్రవ్యోల్బణం కట్టడే లక్ష్యంగా గడచిన పది ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షా సమావేశాల నుంచి ఆర్‌బీఐ బ్యాంకులకు ఇచ్చే రుణాలపై వసూలుచేసే రుణ రేటు–రెపో రేటును (ప్రస్తుతం 6.5 శాతం) యథాతథంగా కొనసాగిస్తోంది. ద్రవ్యోల్బణం కట్టడికి ప్రధానంగా ఆహార ద్రవ్యోల్బణమే అడ్డంకని గవర్నర్ పలు సందర్భాల్లో పేర్కొన్నారు. సరళతర వడ్డీరేట్ల విధానం కోరుతున్న ప్రభుత్వం రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాల్లో ఆహార ధరలను మినహాయించాలని కూడా సూచిస్తోంది. అవసరమైతే పేదలకు ఫుడ్ కూపన్లను జారీ చేసే ప్రతిపాదనను ఆర్థిక సర్వే ప్రస్తావిస్తోంది. తాజా పరిణామాల నేపథ్యంలో రానున్న ఆర్‌బీఐ పాలసీ విధానంపై ఆసక్తి నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment