Shaktikant Das
-
ద్రవ్యోల్బణంపై ఆర్బీఐ అంచనా
దేశంలో ద్రవ్యోల్బణం పెరుగనుందని రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) అంచనా వేసింది. సెప్టెంబర్‌లో నమోదైన 5.5 శాతం ద్రవ్యోల్బణం కంటే అక్టోబర్‌లో ఇది మరింత పెరిగే అవకాశం ఉందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ హెచ్చరించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.‘అంతర్జాతీయంగా ఆర్థిక పరిస్థితుల్లో అస్థిరత నెలకొంది. కానీ భారత ఎకానమీని స్థిరంగా ఉంచేందుకు ఆర్బీఐ సమర్థంగా వ్యవహరిస్తోంది. ప్రస్తుత కాలంలో ప్రధానంగా రెండు అంశాలు ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తున్నాయి. ఒకటి యూఎస్ ఎన్నికల ఫలితాలు. మరొకటి ఆర్థిక విధాన మద్దతుకు సంబంధించి చైనా నుంచి ప్రకటనలు వెలువడడం. ఆర్థిక వృద్ధికి ప్రతికూల అంశాల కంటే సానుకూల అంశాలు ఎక్కువగా ఉన్నాయి. భారత ఆర్థిక వృద్ధిని మెరుగుపరిచేందుకు ఆర్బీఐ 70కి పైగా హైస్పీడ్ ఇండికేటర్లను ట్రాక్ చేస్తోంది’ అన్నారు.ఇదీ చదవండి: రుణాల పంపిణీపై బ్యాంకర్లతో సమీక్షరిటైల్ ద్రవ్యోల్బణం కట్టడే లక్ష్యంగా గడచిన పది ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షా సమావేశాల నుంచి ఆర్బీఐ బ్యాంకులకు ఇచ్చే రుణాలపై వసూలుచేసే రుణ రేటు–రెపో రేటును (ప్రస్తుతం 6.5 శాతం) యథాతథంగా కొనసాగిస్తోంది. ద్రవ్యోల్బణం కట్టడికి ప్రధానంగా ఆహార ద్రవ్యోల్బణమే అడ్డంకని గవర్నర్ పలు సందర్భాల్లో పేర్కొన్నారు. సరళతర వడ్డీరేట్ల విధానం కోరుతున్న ప్రభుత్వం రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాల్లో ఆహార ధరలను మినహాయించాలని కూడా సూచిస్తోంది. అవసరమైతే పేదలకు ఫుడ్ కూపన్లను జారీ చేసే ప్రతిపాదనను ఆర్థిక సర్వే ప్రస్తావిస్తోంది. తాజా పరిణామాల నేపథ్యంలో రానున్న ఆర్బీఐ పాలసీ విధానంపై ఆసక్తి నెలకొంది. -
భలే మంచి డిపాజిట్ బేరం!
గత కొన్నాళ్లుగా బ్యాంకుల రుణ వృద్ధి భారీగా ఎగబాకుతోంది. డిపాజిట్లు మాత్రం ఆ మేరకు పెరగడం లేదు. రెండింటి మధ్య కొంత అంతరం ఉండటం సహజమే కానీ, ఇంత భారీ వ్యత్యాసం ఉండకూడదు. దీనివల్ల బ్యాంకింగ్ రంగంలో వ్యవస్థాగత ద్రవ్య సరఫరా (లిక్విడిటీ) సమస్యలకు దారితీస్తుంది. ప్రజల పొదుపు ధోరణుల్లో తీవ్ర మార్పులు చోటు చేసుకుంటాయి. దీన్ని అధిగమించేందుకు బ్యాంకులు వెంటనే తగిన వ్యూహాలను అమలు చేయాలి. – తాజాగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ వ్యక్తం చేసిన ఆందోళన ఇది.ఈ దెబ్బతో బ్యాంకులు డిపాజిట్ల వేటను ముమ్మరం చేశాయి. ప్రత్యేక స్కీమ్‌ల ద్వారా మరిన్ని రిటైల్ డిపాజిట్ల సమీకరణకు తెరతీస్తున్నాయి. ఇప్పటికే ఉన్న డిపాజిట్ పథకాలతో పోలిస్తే 25–30 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు అంటే 1 శాతం) అధిక వడ్డీని కూడా ఆఫర్ చేస్తూ డిపాజిటర్లకు గాలం వేస్తున్నాయి. తాజా పరిణామాలతో, రుణా లపై అధిక వడ్డీరేట్ల భారం మరికొన్నాళ్లు కొనసాగుందని స్పష్టమవుతోంది. డిపాజిట్ల పెంపునకు తక్షణం చర్యలు చేపట్టాలంటూ బ్యాంకులను ఆర్బీఐ ఆదేశించిన తర్వాత ప్రభుత్వ రంగ బ్యాంకులు పొలోమంటూ కొత్త పథకాలను ప్రకటించాయి. ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ), ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐఓబీ), యూనియన్ బ్యాంక్, అలాగే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఈ రేసులో ముందున్నాయి. 7.25 శాతం నుంచి 7.3 శాతం మేర వడ్డీరేట్లతో డిపాజిట్ స్కీమ్‌లను ప్రకటించాయి. వీటి కాలవ్యవధి 399 రోజుల నుంచి 444 రోజుల వరకు ఉంటోంది. ఐఓబీ అత్యధికంగా 444 రోజుల డిపాజిట్ స్కీమ్‌పై 7.3 శాతం వడ్డీ ఇస్తోంది. అంతేకాకుండా బ్యాంకులన్నీ సీనియర్ సిటిజన్లకు అదనంగా మరో అర శాతం వడ్డీని కూడా అందిస్తుండటంతో డిపాజిటర్లకు మేలు చేకూరుతోంది. ‘4% స్థాయికి ద్రవ్యోల్బణం శాంతిస్తే, ఆర్బీఐ రేట్ల కోత మొదలవుతుంది. అప్పుడు డిపాజిట్లపై అధిక రేట్ల వల్ల బ్యాంకుల వ్యయాలు పెరిగిపోతాయి. అందుకే బ్యాంకులు స్వల్ప కాలిక డిపాజిట్లకే అధిక వడ్డీని పరిమితం చేస్తున్నాయి’ అని ఇక్రా రేటింగ్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అనిల్ గుప్తా అభిప్రాయపడ్డారు. 20 ఏళ్లలో తొలిసారి... ఈ ఏడాది జూలై 12 నాటికి బ్యాంకుల డిపాజిట్ల వృద్ధి 11 శాతానికి పరిమితమైంది. అయితే, రుణ వృద్ధి మాత్రం 14 పైగా శాతంగా నమోదైంది. దేశ బ్యాంకింగ్ వ్యవస్థలో రుణ, డిపాజిట్ వృద్ధిలో ఇంత తేడా రావడం గడిచిన 20 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. దీంతో ఈ అంతరాన్ని తగ్గించాల్సిందేనని బ్యాంకు సీఈఓలకు ఆర్బీఐ స్పష్టం చేస్తోంది. ప్రపంచ ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో భారత్ కూడా అందుకు మినహాయింపు కాదని, పాలసీ వడ్డీ రేట్ల కోత గురించి ఆలోచించడం తొందరపాటేనంటూ గవర్నర్ శక్తికాంత్ దాస్ తాజాగా పేర్కొనడం విశేషం. కాగా, ప్రస్తుత వడ్డీ రేట్లతో రిటైల్ డిపాజిట్ల సమీకరణ బ్యాంకులకు కష్టతరంగా మారిందని, అందుకే పరిమిత కాల స్కీమ్‌లను ప్రారంభించాల్సి వస్తోందని ఓ వాణిజ్య బ్యాంకు ట్రెజరీ హెడ్ పేర్కొన్నారు.ప్రత్యేక డిపాజిట్ ఆఫర్స్...ఎస్బీఐ– అమృత్ వృష్టి: వడ్డీ రేటు 7.25% (కాల వ్యవధి 444 రోజులు) బ్యాంక్ ఆఫ్ బరోడా – మాన్సూన్ ధమాకా: 7.25% (399 రోజులు) బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర: 7.15% (666 రోజులు) యూనియన్ బ్యాంక్: 7.25% (399 రోజులు) ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్: 7.3% (444 రోజులు) -
ఆగని రూపాయి ‘రికార్డు’ పతనం: ఆర్బీఐ ఏమందంటే
అమెరికా డాలర్ మారకంలో రూపాయి విలువ తీవ్ర ఒడిదుడుకులను నివారించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) దృష్టి సారిస్తుందని డిప్యూటీ గవర్నర్ మైఖేల్ డీ పాత్ర పేర్కొన్నారు. అయితే రూపాయి విలువ ఏ స్థాయిలో స్థిరపరచాలన్న అంశంపై ఎటువంటి లక్ష్యాన్ని ఆర్బీఐ నిర్ధేశించుకోలేదని ద్రవ్య విధాన విభాగం బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన స్పష్ట చేశారు. ద్రవ్యోల్బణం కట్టడి లక్ష్యంగా గడచిన రెండు నెలల్లో బ్యాంకులకు తానిచ్చే (ఆర్బీఐ) రుణాలపై వసూలు చేసే వడ్దీరేటు రెపోను 90 బేసిస్ పాయింట్ల పెంచిన (0.40 శాతం, 0.90 శాతం) సెంట్రల్ బ్యాంక్ ద్రవ్య పరపతి విధాన కమిటీలో పాత్ర కూడా సభ్యులు. ఈ నేపథ్యంలో ‘‘భారత్ ఎకానమీపై అంతర్జాతీయ రాజకీయ భౌగోళిక ప్రభావం’’ అన్న అంశంపై ఇండస్ట్రీ చాంబర్ పీహెచ్‌డీసీసీఐ నిర్వహించిన ఒక కార్యక్రమంలో అడిగిన ప్రశ్నలకు పాత్ర వ్యక్తం చేసిన అభిప్రాయాలను పరిశీలిస్తే... ►రూపాయి ఎక్కడ ఉంటుందో మాకు తెలియదు. డాలర్ ఎక్కడ ఉంటుందో అమెరికా ఫెడ్‌కి కూడా తెలియదు. కానీ ఒక్క విషయం మాత్రం ఖచి్చతంగా చెప్పాలి. మేము రూపాయి స్థిరత్వం కోసం నిరంతరం గట్టి ప్రయత్నం చేస్తాము. ఈ విషయంలో పురోగతి ఉంటుందని ఆర్బీఐ విశ్వసిస్తోంది. రూపాయి విలువ స్థిరీకరణపై లక్ష్యం ఏదీ లేదుకానీ, తీవ్ర ఒడిదుడుకులను నివారించడనికి మాత్రం సెంట్రల్ బ్యాంక్ అధిక ప్రాధాన్యత ఇస్తుంది. ► రూపాయి విలువ క్షీణతను పరిశీలిస్తే, ప్రపంచంలోని పలు దేశాల కరెన్సీలకన్నా తక్కువ స్థాయిలోనే మన కరెన్సీ క్షీణత ఉంది. 600 బిలియన్ డాలర్ల విదేశీ మారకపు నిల్వల శక్తి నుంచి పొందిన ప్రయోజనం ఇది. ►రూపాయి–రూబుల్ చెల్లింపు విధానం విషయానికి వస్తే, ప్రభుత్వం ఏది నిర్ణయించినా రిజర్వ్ బ్యాంక్ దానిని నిర్వహిస్తుంది. ఇది ప్రభుత్వం నిర్ణయించాల్సిన అంశం. ►2021-22 మూడవ త్రైమాసికంలో (2021 అక్టోబర్-డిసెంబర్ మధ్య) 2.6 శాతంలో భారత్ కరెంట్ అకౌంట్‌లోటు (దేశంలోకి వచ్చి-పోయే విదేశీ మారకద్రవ్య నిల్వల మధ్య నికర వ్యత్యాసం) సంబంధిత కాలం స్థూల దేశీయోత్పత్తిలో 2.6 శాతంగా ఉంది. నాల్గవ త్రైమాసికంలో ఇది 1.5 శాతానికి తగ్గింది. అంతర్జాతీయ ఒడిదుడుకులను ఎదుర్కొనే విషయంలో భారత్ పటిష్ట స్థాయిని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. ► 2021-22లో కరెంట్ అకౌంట్‌లోటు నామమాత్రంగా 1.2 శాతంగానే ఉంది. భౌగోళిక సవాళ్లు, వాణిజ్య సంబంధ అండకులు, దిగుమతుల డిమాండ్ పెరుగుదల వంటి పలు సవాళ్లు ఉన్నప్పటికీ భారత్ విదేశీ నిల్వలు పటిష్ట స్థాయిలో కొనసాగుతున్న విషయాన్ని క్యాడ్ తెలియస్తోంది. ►ఇతర దేశాలతో పోలి్చతే భారత్ ద్రవ్య పరపతి విధానం ఇంకా సరళతరంగానే ఉంది. ఏప్రిల్‌తో ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2022-23) వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న 6 శాతం దిగువకు దిగివస్తుందని భావిస్తున్నాం. తదుపరి నెలల్లో మరింత దిగివస్తుందన్నది అంచనా. ప్రస్తుత పరిస్థితులు, కేంద్రం, ఆర్బీఐ తీసుకుంటున్న చర్యల ఆధారంగా (బేస్‌లైన్) ఈ అంచనాలను వెలువరిస్తున్నాం. ► ప్రపంచం ద్రవ్యోల్బణం సవాళ్లలో ఉన్న నేపథ్యంలో...ప్రస్తుతం దాని కదలికలను జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంది. స్థూలంగా స్థాయిలను నిర్ధేశించుకునే పరిస్థితి ఇప్పుడు లేదు. ► ద్రవ్యోల్బణం తగ్గుదల చాలా ‘కఠినంగా‘ ఉంటుంది. అయితే భవిష్యత్ ద్రవ్యోల్బణం పథాన్ని నిర్దేశించు కోవడంలో భారతదేశం విజయం సాధిస్తుందని మేము విశ్వసిస్తున్నాము. తద్వారా ద్రవ్యోల్బణంపై యుద్ధంలో విజయం సాధిస్తుందని భావిస్తున్నాము. ద్రవ్యోల్బణంపై అందోళన అంతర్జాతీయంగా భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో ద్రవ్యోల్బణం అంచనాలుసైతం అనిశ్చితిలో ఉంటున్నట్లు ఆర్బీఐ ఈ నెల ప్రారంభ పాలసీ సమీక్ష సందర్భంగా పేర్కొంది. కేంద్రం నిర్దేశాల ప్రకారం వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 2-6 శాతం శ్రేణిలో ఉండాలి. అయితే జనవరి (6.01 శాతం), ఫిబ్రవరి (6.07 శాతం), మార్చి (17 నెలల గరిష్ట స్థాయిలో ఏకంగా 6.95 శాతం) నెలల్లో హద్దుమీరి పెరగడం ఆందోళన కలిగిస్తోంది. పాలసీ నిర్ణయానికి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో ఏకంగా ఎనిమిదేళ్ల గరిష్ట స్థాయి 7.79 శాతానికి ఎగసింది. దీనితో 2022–23 ఆర్థిక సంవత్సరం మొత్తంలో 5.7 శాతం రిటైల్ ద్రవ్యోల్బణం ఉంటుందన్న కిత్రం అంచనాలను ఆర్బీఐ తాజాగా ఒకశాతం పెంచి 6.7 శాతానికి చేర్చింది. ధరల స్పీడ్ కట్టడికి సంబంధించి ఆర్బీఐకి కేంద్రం ఇస్తున్న నిర్దేశాల కన్నా ఇది 70 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) అధికం. 2022–23 ఆర్థిక సంవత్సరంలో ముడి చమురు ధర బ్యారల్‌కు (ఇండియన్ బాస్కెట్) 105 ఉంటుందని అంచనా వేస్తోంది. దీంతోపాటు 2022లో తగిన వర్షపాతం నమోదవుతుందన్న అంచనాలతో ఉంది. ఇది ఖరీఫ్ పంట దిగుబడికి దోహదపడే అంశం. ఆయా అంశాల నేపథ్యంలో 2022-23 ఆర్థిక సంవత్సరంలో సగటురిటైల్ ద్రవ్యోల్బణం 6.7 శాతం ఉంటుందని భావిస్తోంది. మొదటి త్రైమాసికంలో 7.5 శాతం, రెండవ త్రైమాసికంలో 7.4 శాతం, మూడవ త్రైమాసికంలో 6.2 నమోదయ్యే రిటైల్ ద్రవ్యోల్బణం నాల్గవ త్రైమాసికంలో కేంద్రం నిర్దేశిత స్థాయి లోపునకు దిగివస్తుందని, 5.8 శాతంగా నమోదవుతుందని ఆర్బీఐ పాలసీ సమీక్ష అంచనావేసింది. ఆగస్టు 2 నుంచి 4వ తేదీ మధ్య జరిగే పాలసీ సమీక్షలో కూడా రెపో రేటు పెంపు ఉంటుందన్న అంచనాలు వెలువడు తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ రేటు మరో ఒక శాతం పెరుగుతుందన్న విశ్లేషణలు ఉన్నాయి. రూపాయి పతనం ఇదిలావుండగా, డాలర్ మారకంలో రూపాయి చరిత్రాత్మక పతనం రికార్డులు కొనసాగుతున్నాయి. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ క్రితం ముగింపుతో పోలిస్తే ఒకపైసా క్షీణించి 78.33 వద్ద ముగిసింది. రూపాయి గురువారం ముగింపు 78.32. శుక్రవారం ట్రేడింగ్‌లో 78.20 వద్ద ప్రారంభమైంది. 78.19ని చూసినా ఆ స్థాయికి మించి బలపడలేదు. ఇంట్రాడేలో 78.35ను కూడా చూసింది. చివరకు పైనా నష్టంతో 78.33 వద్ద ముగిసింది. తద్వారా ఇంట్రాడే, ముగింపుల్లో రూపాయి శుక్రవారం చరిత్రాత్మక కొత్త కనిష్టాలను చూసింది. రూపాయి వరుస పతనం ఇది ఎనిమిదవ వారం. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ముగింపు కనబడని పరిస్థితి, అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం సవాళ్లు, సెంట్రల్ బ్యాంకుల వడ్డీరేట్ల పెంపు ధోరణి, దేశీయంగా ఈక్విటీ మార్కెట్ల బలహీన ధోరణి, విదేశీ ఇన్వెస్టర్లు నికర అమ్మకం దారులుగా కొనసాగడం వంటి అంశాలు రూపాయి రెండు నెలల పతన ధోరణికి కారణం. విదేశీ మారకద్రవ్య నిల్వలు @ 591 బిలియన్ డాలర్లు వారం వారీగా 6 బిలియన్ డాలర్ల డౌన్ కాగా, భారత్ విదేశీ మారకద్రవ్య నిల్వలు జూన్ 17వ తేదీతో ముగిసిన వారంలో అంతక్రితం వారంతో (జూన్ 10) ముగిసిన వారంతో పోలి్చచూస్తే 6 బిలియన్ డాలర్లు తగ్గి 591 బిలియన్ డాలర్లకు చేరింది. జూన్ 10తో ముగిసిన వారంలోకూడా అంతక్రితం వారంతో పోల్చితే ఫారెక్స్ దాదాపు 4 బిలియన్ డాలర్లకుపైగా తగ్గడ గమనార్హం. ఆర్బీఐ తాజాగా శుక్రవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం జూన్ 10వ తేదీతో ముగిసిన వారంలో డాలర్లు అధికంగా ఉండే ఫారెన్ కరెంట్ అసెట్స్ (ఎఫ్సీఏ) 5.362 బిలియన్ డాలర్లు తగ్గి, 526.882 బిలియన్ డాలర్లకు చేరాయి. పసిడి నిల్వలు 258 మిలియన్లు తగ్గి 40.584 బిలియన్ డాలర్లకు దిగివచ్చాయి. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్డీఆర్) నిధులు మొత్తం 233 మిలియన్ డాలర్ల తగ్గి 18.155 బిలియన్లకు తగ్గాయి. ఐఎంఎఫ్ వద్ద నిల్వలు కూడా 17 మిలియన్ డాలర్లు తగ్గి 4.968 బిలియన్ డాలర్లకు చేరాయి. -
షాకింగ్ న్యూస్...వడ్డీరేట్లు పెరిగే అవకాశం...ప్రభావమెంతంటే..?
ముంబై: అంతర్జాతీయ పరిస్థితులు, పరిణామాలకు అనుగుణంగా ఎప్పుటికప్పుడు సకాలంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విధాన చర్యలు ఉండాలని గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ద్రవ్య, పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) నిర్ణయించింది. ఆర్బీఐ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్షకు సంబంధించి ఈ నెల 6 నుంచి 8 వరకూ జరిగిన సమావేశాల మినిట్స్ ఈ విషయాన్ని తెలిపింది. అనిశ్చితి ఆర్థిక పరిస్థితుల్లో నిర్ణయాలు అంతర్జాతీయ పరిణామాలకు అనుగుణంగా సకాలంలో తీసుకోవాలన్న గవర్నర్ అభిప్రాయానికి ఐదుగురు సభ్యులు మద్దతు పలికినట్లు మినిట్స్ వెల్లడించింది. ద్రవ్యోల్బణమే ప్రధాన సవాలు: పాత్ర కాగా, డి–గ్లోబలైజేషన్ ఆసన్నమైనట్లు కనిపిస్తున్న ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల్లో ద్రవ్యోల్బణమే ప్రధాన సవాలు ఉండే అవకాశం ఉందని, ఈ సవాలును జాగ్రత్తగా ఎదుర్కొనాలని ఎంపీసీ సభ్యుడు, ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ మైఖేల్ దేబబ్రత పాత్ర ఈ సమావేశంలో అభిప్రాయపడ్డారు. ‘‘1980 నుంచి ఎప్పుడూ లేని విధంగా ప్రస్తుతం 60 శాతం అభివృద్ధి చెందిన దేశాలు 5 శాతం కంటే ఎక్కువ ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలలో సగానికి పైగా ద్రవ్యోల్బణం 7 శాతం కంటే ఎక్కువగా ఉంది. ధరల పెరుగుదల సామాజిక సహన స్థాయిలను పరీక్షిస్తోంది’’ అని సమావేశంలో ఆయన పేర్కొన్నట్లు మినిట్స్ తెలిపాయి. మినిట్స్ ప్రకారం సమావేశంలో ముఖ్య అంశాలు, నిర్ణయాలు భారత్ ఎకానమీపై ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, ఈ నేపథ్యంలో తలెత్తిన భౌగోళిక ఉద్రిక్తతల ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఏప్రిల్‌తో ప్రారంభమైన 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎకానమీ వృద్ధి రేటు అంచనాలను ఏకంగా 60 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) తగ్గింపు. దీనితో ఈ అంచనా 7.8 శాతం నుంచి 7.2 శాతానికి డౌన్. పాలసీ విధానానికి ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాలనూ పరపతి సమీక్ష భారీగా 1.2 శాతం మేర పెంఉ. దీనితో 2022–23లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.5 శాతం ఉంటుందన్న క్రితం అంచనాలు 5.7 శాతానికి అప్. వరుసగా నాలుగు త్రైమాసికాల్లో ద్రవ్యోల్బణం 6.3 శాతం, 5.8 శాతం, 5.4 శాతం, 5.1 శాతంగా ఉంటుందని అంచనా. ద్రవ్యోల్బణం కట్టడి దిశలో వ్యవస్థలో ఒకపక్క అదనంగా ఉన్న లిక్విడిటీ వెనక్కు తీసుకుంటూనే మరో వైపు వృద్ధే లక్ష్యంగా రెపో రేటును (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు) యథాతథంగా 4 శాతం వద్దే కొనసాగించాలని నిర్ణయం. దీనితో ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా వరుసగా 11 ద్వైమాసిక సమావేశాలోనూ ఆర్బీఐ రెపో రేటును యథాతథంగా కొనసాగించినట్లయ్యింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో క్రూడ్ ఆయిల్ (ఇండియన్ బాస్కెట్) బ్యారల్ ధర 100 డాలర్లుగా అంచనా. అన్ని బ్యాంకుల కస్టమర్లకూ కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రాయెల్స్‌కు వెసులుబాటు అదనపు లిక్విడిటీని వెనక్కు తీసుకోడానికి కొత్తగా ‘ఎస్డీఎఫ్’ ఇన్స్ట్రమెంట్. వడ్డీ రేట్ల పెంపు ఖాయం: కేకీ మిస్త్రీ వడ్డీ రేట్ల పెంపు విషయంలో ఇతర సెంట్రల్ బ్యాంకులతో పోలిస్తే రిజర్వ్ బ్యాంకు వెనుకబడి లేదని హెచ్డీఎఫ్సీ వైస్ చైర్మన్, సీఈవో కేకీ మిస్త్రీ అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది క్రమంగా రెండు లేదా మూడు దఫాలుగా పెం చేందుకు అవకాశం ఉందని .. కానీ ఎకానమీపై దాని ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. ఈ నెల తొలినాళ్లలో పరపతి విధానం ప్రకటించిన ఆర్బీఐ.. రెపో రేటును యధాతథంగా 4 శాతం స్థాయిలోనే కొనసాగించిన సంగ తి తెలిసిందే. ఇటు ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేస్తూ అటు వృద్ధికి కూడా ఊతమిచ్చేలా రేట్ల పెంపుపై ఉదారవాద ధోరణిని కొనసాగించాలని రిజర్వ్ బ్యాంక్ భావించింది. ఈ నేపథ్యంలోనే మిస్త్రీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అమెరికాలో ద్రవ్యోల్బణంతో భారత్‌లో ధరల పెరుగుదలను పోల్చి చూడరాదని ఆయన చెప్పారు. చరిత్ర చూస్తే అమెరికాలో ఎంతో కాలంగా ద్రవ్యోల్బణం అత్యంత కనిష్ట స్థాయుల్లో నమోదు అవుతుండగా .. భారత్‌లో భారీగా ఉంటోందని, రెండింటికి మధ్య 400 బేసిస్ పాయింట్ల మేర వ్యత్యాసం ఉంటోందని మిస్త్రీ తెలిపారు. అలాంటిది.. ప్రస్తుతం అమెరికాలో ఏకంగా 8.5 శాతం స్థాయిలో ద్రవ్యోల్బణం ఎగియగా.. భారత్‌లో 5.7 శాతం ద్రవ్యోల్బణం కావచ్చన్న అంచనాలు నెలకొన్నట్లు ఆయన చెప్పారు. ‘ఆ రకంగా చూస్తే అమెరికాతో పోల్చినప్పుడు మన దగ్గర ద్రవ్యోల్బణం 2.8 శాతం తక్కువగా ఉంది. ఇంత భారీ ద్రవ్యోల్బణం ఎన్నడూ చూడలేని అమెరికా .. వడ్డీ రేట్ల పెంపు వంటి తీవ్రమైన కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది‘ అని మిస్త్రీ పేర్కొన్నారు. అమెరికాను చూసి భారత్ కూడా అదే ధోరణిలో వెళ్లాల్సిన అవసరం కనిపించడం లేదన్నారు. చదవండి: అప్పుడు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం.. ఇప్పుడు ఇండోనేషియా నిషేధం...సామాన్యులపై మరో పిడుగు....! -
క్రిప్టోకరెన్సీలపై పూర్తి నిషేధమే మేలు: ఆర్బీఐ
పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం క్రిప్టోకరెన్సీలపై నియంత్రణ బిల్లును ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. డిజిటల్ కరెన్సీ, ప్రైవేటు క్రిప్టోకరెన్సీలపై సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరక్టర్ల 592వ సమావేశంలో ఆర్బీఐ పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. పూర్తి నిషేధమే మేలు..! క్రిప్టో కరెన్సీలపై పూర్తిస్థాయి నిషేధం విధించాల్సిందేనని ఆర్బీఐ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. క్రిప్టోకరెన్సీలపై పాక్షిక ఆంక్షలు ఫలితాలు ఇవ్వబోవని ఆర్బీఐ బ్యాంకు బోర్డు సమావేశంలో పేర్కొన్నట్లు సమాచారం. క్రిప్టోలపై ఆర్బీఐ వైఖరిని సెంట్రల్ బోర్డు కూడా సమర్థించినట్లు తెలుస్తోంది. క్రిప్టో కరెన్సీలను తీవ్రమైందిగా భావించాలని ఆర్బీఐ గవర్నర్ ఈ సమావేశంలో వెల్లడించారు. క్రిప్టో ఆస్తులను నియంత్రించడం కష్టంతో కూడుకున్న పని అని అభిప్రాయపడింది. ఈ సమావేశంలో కొందరు సభ్యులు బ్యాలెన్స్డ్ విధానాలను అనుసరించాలని కోరారు. క్రిప్టో వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు ఎటువంటి వైఖరిని వెల్లడించలేదని తెలుస్తోంది. క్రిప్టో కరెన్సీ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ అఫిషియల్ డిజిటల్ కరెన్సీ-2021 బిల్లుపైనా కూడా ఆర్బీఐ బోర్డు చర్చించింది. చదవండి: యూపీఐ లావాదేవీలు చేస్తున్నారా..! అయితే వీటిని కచ్చితంగా గుర్తుంచుకోండి..! -
కేంద్ర ప్రభుత్వం ఆధ్వరంలో రియాలిటీ షో.. ఎందుకోసమంటే ?
న్యూఢిల్లీ: వినూత్నమైన ఐడియాలున్న స్టార్టప్‌ల నిధుల సమీకరణకు ఊతమిచ్చే విధంగా ప్రత్యేక రియాలిటీ షోను నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ సోమవారం ఆవిష్కరించారు. ‘హార్సెస్ స్టేబుల్ – జో జీతా వహీ సికందర్‘ పేరిట ఈ షోను రూపొందించారు. స్టార్టప్‌లు, చిన్న.. మధ్య తరహా సంస్థలు తమ ఐడియాలను వివరించి, పెట్టుబడులను అందిపుచ్చుకునేందుకు ఇది తోడ్పడగలదని కాంత్ పేర్కొన్నారు. స్టార్టప్‌లకు తోడ్పాటునిచ్చేందుకు పరిశ్రమ దిగ్గజాలు ముందుకు రావడం హర్షణీయమని ఆయన తెలిపారు. హెచ్పీపీఎల్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ అగర్వాల్, బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కలిసి ఈ షోను రూపొందించారు. అటల్ ఇన్నోవేషన్ మిషన్ (మిషన్ డైరెక్టర్) చింతన్ వైష్ణవ్, సునీల్ శెట్టి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సరైన ఇన్వెస్టరు నుంచే నిధులు సమకూర్చుకోవడం, తగిన భాగస్వాములే.. వ్యాపార వృద్ధికి దోహదపడగలవని చింతన్ వైష్ణవ్ పేర్కొన్నారు. చదవండి: ఐఐటీ హైదరాబాద్..స్టార్టప్‌ల కోసం స్పెషల్ ఫండ్ -
దేశంలో క్రిప్టో చట్టబద్ధత ఖాయం!
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత్‌దాస్ నుంచి తీవ్ర ఆందోళనలు వ్యక్తం అవుతున్నప్పటికీ, క్రిప్టో కరెన్సీకి చట్ట బద్ధత కల్పించడానికే కేంద్రం మొగ్గుచూపుతున్నట్లు మరోసారి స్పష్టం అయ్యింది. క్రిప్టో కరెన్సీని పన్ను పరిధిలోకి తీసుకువచ్చి, లాభాలపై పన్నులు విధించడంపై కేంద్రం దృష్టి సారించినట్లు స్వయంగా రెవెన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్ వెల్లడించారు. ఇందుకు సంబంధించి ఆదాయపు పన్ను చట్టాల్లో మార్పులు తీసుకురావడానికి సిద్ధమవుతోందని ఆయన తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెడతారని భావిస్తున్న 2022–23 బడ్జెట్లోనే ఈ మేరకు ప్రతిపాదనలు ఉంటాయని ఆయన సూచించారు. క్రిప్టో కరెన్సీని కొందరు అసెట్‌గా భావిస్తున్నారని అన్నారు. తద్వారా వచ్చే ఆదాయంపై ఇప్పటికే కొంత మంది క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ చెల్లిస్తున్నారని తరుణ్ బజాజ్ తెలిపారు. ఇతర కొన్ని సేవల తరహాలోనే వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) కూడా క్రిప్టోకి వర్తిస్తుందని చట్టం ‘చాలా స్పష్టంగా‘ చెబుతోందని వివరించారు. ‘‘క్రిప్టోపై పన్ను అంశాలపై మేము దృష్టి సారిస్తాము. ఇప్పటికే ప్రజలు దానిపై పన్నులు చెల్లిస్తున్నారని నేను అర్థం చేసుకున్నాను. ఇప్పుడు క్రిప్టో కరెన్సీ కొనుగోళ్ల పరిమాణం నిజంగానే చాలా పెరిగింది. ఈ అంశంపై పన్నులకు సంబంధించి కొన్ని చట్టపరమైన మార్పులు తీసుకురాగలమా లేదా అని చూద్దాం. అయితే ఇది బడ్జెట్ నాటికి సిద్ధం అవుతుంది. మనం ఇప్పటికే బడ్జెట్‌కు దగ్గరగా ఉన్నాము. బడ్జెట్లో ప్రతిపాదనలను ప్రవేశపెట్టే విషయాన్ని పరిశీలించాలి’’ అని బజాజ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. క్రిప్టో ట్రేడింగ్ విషయంలో టీసీఎస్ (మూలం వద్ద పన్ను వసూలు) విధానాన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉందా? అన్న ప్రశ్నకు ఏమి జరుగుతుందో చూడాల్సి ఉందని ఆయన అన్నారు. వేగంగా పరిణామాలు... క్రిప్టో కరెన్సీపై దేశంలో నియంత్రణకానీ, నిషేధంకానీ లేవు. ఈ వర్చువల్ కరెన్సీల వల్ల ఫైనాన్షియల్, ఆర్థిక వ్యవస్థలకు తీవ్ర విఘాతమని ఆర్బీఐ గవర్నర్ నుంచి ప్రకటనల నేపథ్యంలో మీడియాలో దీనికి అనుకూలంగా పెద్ద ఎత్తున ప్రకటనలు వెలువడుతున్నాయి. సినీ స్టార్ నుంచి క్రీడాకారుల వరకూ క్రిప్టోకు సానుకూలంగా ప్రచారం చేస్తున్నారు. క్రిప్టోకరెన్సీ పెట్టుబడిపై భారీ రాబడులు వస్తాయంటూ తప్పుదారి పట్టించే ప్రకటనలు వస్తున్నాయన్న ఆందోళనల మధ్య స్వయంగా ప్రధానమంత్రి మోదీ ఈ అంశంపై సమావేశం నిర్వహించడం గమనార్హం. మరోవైపు క్రిప్టోపై నిషేధం తగదని, దీనిపై నియంత్రణ మాత్రమే ఉండాలని బీజేపీ నాయకుడు జయంత్ సిన్హా నేతృత్వంలోని జరిగిన తాజా పార్లమెంటరీ స్థాయీ సంఘం సమావేశంలో కూడా అభిప్రాయాలు వ్యక్తమవడం గమనార్హం. ఆయా అంశాల నేపథ్యంలో క్రిప్టో కరెన్సీని నిబంధనలతో అనుమతించాలని కేంద్రం భావిస్తోందని వార్తలు వస్తున్నాయి. ఇందుకు సంబంధించి ఈ నెల 29వ తేదీ నుంచీ ప్రారంభం కానున్న శీతాకాల సమావేశాల్లోనే కేంద్రం బిల్లు పెట్టడానికి కసరత్తు జరుగుతోందని వార్తలు వినిపిస్తున్నాయి. వర్చువల్ కరెన్సీలకు సంబంధించి సేవలను అందించకుండా బ్యాంకులుసహా తన నియంత్రిత సంస్థలను అన్నింటిపైనా నిషేధం విధిస్తూ, 2018 ఏప్రిల్ 6వ తేదీన ఆర్బీఐ జారీ చేసిన ఒక సర్క్యులర్‌ను 2021 మార్చి 4వ తేదీన అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కొట్టివేసిన సంగతి ఇక్కడ గమనించాల్సిన మరో అంశం. -
ఆర్థిక పురోగతిలో ‘ఆడిట్’కు కీలకపాత్ర
న్యూఢిల్లీ: దేశ ఫైనాన్షియల్ స్థిరత్వం, ఆర్థిక పురోగతిలో ఖచ్చితత్వం కలిగిన, విశ్లేషణాత్మక ఆడిట్ నివేదికల పాత్ర ఎంతో ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంతదాస్ పేర్కొన్నారు. ఆయా అంశాలు వ్యవస్థల పట్ల ప్రజలలో విశ్వాసాన్ని నింపుతాయని అన్నారు. నేషనల్ అకాడమీ ఆఫ్ ఆడిట్ అండ్ అకౌంట్స్ (ఎన్‌ఏఏఏ) అధికారులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ రంగంలో సుపరిపాలనకు ఆడిటింగ్ ఒక మూలస్తంభమని అన్నారు. ‘‘ఉద్దేశించిన ఫలితాలను సాధించడంలో భాగంగా ప్రజా వనరులు బాధ్యతాయుతంగా, సమర్ధవంతంగా నిర్వహించబడుతున్నాయా లేదా అనే అంశంపై నిష్పాక్షిక అంచనాలకు రావడం అవసరం. ఈ దిశలో న్యాయమైన, నిష్పాక్షికమైన ఆడిట్ పాత్ర ఎంతో ఉంటుంది. ఇది ఆయా వర్గాల్లో విశ్వాసాన్ని నింపుతుంది’’ అని దాస్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆయన ప్రసంగంలో మరికొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే... ► అంతర్జాతీయంగా చూస్తే, సమీకృత ఆర్థిక వ్యవస్థలో న్యాయమైన,నిష్పక్షపాతమైన ఆడిట్ అనేది కేవలం దేశీయంగా కీలక పాత్ర పోషించే అంశమే కాదు.ప్రపంచ వేదికపై దేశ ఖ్యాతిని,విశ్వసనీయతను పెంపొందించడానికి ఇది ఒక సాధనం. ► ఫైనాన్షియల్ మార్కెట్ల సంక్లిష్టత, సమర్థవంతమైన వనరుల కేటాయింపు, ప్రజల నుంచి సుపరిపాలనపై ఏర్పడుతున్న అధిక అంచనాలు ఇక్కడ ప్రస్తావించుకోదగిన అంశాలు. ఈ నేపథ్యంలో ఆడిట్ పాత్ర ఎంతో కీలకంగా మారింది. ► భారతదేశం వేగంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నాం.ఈ విషయంలో భాగస్వాములందరికీ ఆర్థిక పనితీరుపై భరోసాను కల్పించడానికి ఆడిటర్ల నైపుణ్యం, ఈ వ్యవస్థలో పటిష్టత అవసరం. ► కేవలం అందుబాటులో ఉన్న సాక్ష్యాలు, సమాచారం ఆధారంగా ఆర్థిక నిర్ణయాలు ఎక్కువగా జరుగుతున్నాయి. సరికాని డేటా వల్ల తగిన నిర్ణయాలను తీసుకోలేం. ► ఇక్కడ బ్యాంకింగ్ రంగాన్నే ఒక ఉదాహరణగా తీసుకుందాం. సరికాని, తప్పుదోవ పట్టించే ఆర్థిక నివేదికల ఆధారంగా బ్యాంక్ రుణ మంజూరీలు చేసినట్లయితే, రుణగ్రహీత కంపెనీ చివరకు దానిని తిరిగి చెల్లించలేకపోతుంది. రుణదాతకు తీవ్ర ఇబ్బందికర పరిస్థితి మిగులుతుంది. దీనికితోడు అర్హత కలిగిన కంపెనీలకు రుణం ఇవ్వడానికీ బ్యాంకింగ్ తదుపరి వెనుకడుగు వేస్తుంది. తనకు వచ్చిన నష్టాన్ని భర్తీ చేసుకోడానికి ఇతరులపై బ్యాంకులు వడ్డీభారాన్ని వేయకా తప్పనిసరి పరిస్థితి ఉంటుంది. వెరసి ఇదంతా ఆర్థిక వ్యవస్థ తిరోగమనానికి దారితీస్తుంది. ► ఆడిట్ నాణ్యత, పటిష్టత మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. బ్యాంకులు, ఆర్థిక సంస్థల ఆడిట్‌ను మెరుగుపరచడానికి ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ)తో ఆర్బీఐ సంప్రదింపులు జరిపి అనేక చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా ఈ ఏడాది జనవరిలో వాణిజ్య బ్యాంకుల కోసం రిస్క్ ఆధారిత అంతర్గత ఆడిట్ వ్యవస్థను బలోపేతం చేశాం. ఏప్రిల్‌లో బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల్లో (ఎన్బీఎఫ్సీ) చట్టబద్ధమైన ఆడిటర్ల నియామకానికి సంబంధించిన మార్గదర్శకాలను ఆధునికీకరణ జరిగింది. రదర్శకత, వివేకవంతమైన వ్యాపార వ్యూహం, సమర్థవంతమైన రిస్క్ మేనేజ్మెంట్ లక్ష్యాలుగా ఈ చర్యలను తీసుకున్నాం. ► ఆడిట్లో అంతర్జాతీయ ప్రమాణాలు మరింత పటిష్టం చేయడానికి ఈ రంగంలో ప్రముఖులు, నిపుణులతో పాటు ఫైనాన్షియల్ రంగంలోని నియంత్రణ సంస్థలు, పర్యవేక్షకులు కలిసి పనిచేయాలి. బలమైన,అందరికీ చేరువచేసే ఆర్థిక రంగాన్ని నిర్మించడానికి,సుపరిపాలనకు,నైతిక విధానాల పరిపుష్టికి చురుకైన చర్యలు తీసుకోవాలి. -
ఎనిమిదోసారీ యథాతథమే!
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరపతి విధాన కమిటీ (ఆర్బీఐ–ఎంపీసీ) అంచనాలకు అనుగుణంగా రెపో రేటును యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటే– రెపో. ప్రస్తుతం 4 శాతంగా ఇది కొనసాగుతోంది. వృద్ధే లక్ష్యంగా వరుసగా ఎనిమిది ద్వైమాసికాల నుంచి ఆర్బీఐ సరళతర వడ్డీరేట్ల విధానాన్ని అనుసరిస్తోంది. 2019లో రెపో రేటును ఆర్బీఐ 135 బేసిస్ పాయింట్లు తగ్గించింది (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం). 2020 మార్చి తర్వాత 115 బేసిస్ పా యింట్లు తగ్గించింది. గవర్నర్ శక్తికాంత్ దాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ఎంపీసీ మూడు రోజు ల సమావేశం అనంతరం శుక్రవారం ఎకానమీకి సంబంధించి నిర్ణయాల ప్రకటన వెలువడింది. కట్టడిలోకి ద్రవ్యోల్బణం రిటైల్ ద్రవ్యోల్బణం పూర్తి అదుపులోనికి వస్తుందన్న ఆర్బీఐ అంచనాలతో రెపో యథాతథం కొనసాగింపునకు ఆర్బీఐ పాలసీ కమిటీ ఆమోదముద్ర వేసింది. రిటైల్ ద్రవ్యోల్బణం 2021–22 ఆర్థిక సంవత్సరంలో సగలు 5.7 శాతం ఉంటుందన్న క్రితం అంచనాలను తాజాగా 5.3 శాతానికి కుదించింది. దీనివల్ల సామాన్యునిపై ధరల భారం తీవ్రత తగ్గుతుంది. దీనికితోడు తక్కువ స్థాయిలో వడ్డీరేట్లు కొనసాగడం వల్ల వ్యవస్థలో వినియోగం పెరుగుదలకు, డిమాండ్ పునరుద్ధరణకు దోహదపడుతుంది.ఇక రిటైల్ ద్రవ్యోల్బణం రెండు, మూడు, నాలుగు త్రైమాసికాల్లో వరుసగా 5.1 శాతం, 4.5 శాతం, 5.8 శాతంగా నమోదవుతుందన్నది ఆర్బీఐ అంచనా. 2022–23 క్యూ1లో 5.2 శాతం నమోదవుతుందని భావిస్తోంది. వృద్ధి రేటుపై ధీమా... ఆర్థిక సంవత్సరంలో 9.5 శాతం వృద్ధికి ఢోకా ఉండబోదన్నది ఆర్బీఐ అంచనావేసింది. తొలి 10.5 శాతం అంచనాలను జూన్ పాలసీ సమీక్షలో ఆర్బీఐ 9.5 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే. 2021–22 మొదటి త్రైమాసికంలో 20.1 శాతం వృద్ధి నమోదుకాగా, రెండు, మూడు, నాలుగు త్రైమాసికాల్లో వరుసగా 7.9 శాతం, 6.8 శాతం, 6.1 శాతం వృద్ధి నమోదవుతుందని ఆర్బీఐ అంచనావేసింది. 2022–23 మొదటి త్రైమాసికంలో ఈ అంచనా 17.2 శాతంగా ఉంది. ఎకానమీ సంపూర్ణ ప్రయోజనాలు కీలకం తాజా పాలసీ సమీక్ష నేపథ్యంలో పొదుపు పథకాలు, బ్యాంకుల డిపాజిట్లపై ఆధారపడి జీవించే వారికి కొత్తగా వచ్చే ఆర్థిక ప్రయోజనం ఏదీ ఉండదు. వారికి యథాతథంగా సాధారణ వడ్డీరేట్లు మాత్రమే అందుతాయి. ద్రవ్యోల్బణం అదుపులో లేకపోతే మాత్రం వారు ప్రతికూల రిటర్న్స్ అందుకునే పరిస్థితి ఉంటుంది. ‘‘కుప్పకూలిపోతున్న లేదా క్షీణిస్తున్న మొత్తం ఆర్థిక వ్యవస్థకు మీరు మద్దతు ఇవ్వలేకపోతే, సీనియర్ సిటిజన్లతో సహా అందరికీ ఇతర ప్రధాన సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది’’ అని ఇదే విషయంపై ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ టీ రబి శంకర్ వ్యాఖ్యానించడం గమనార్హం. అయితే పొదుపు పథకాలు ఇంకా నెగటివ్ రిటర్న్స్ ఏమీ ఇవ్వడం లేదని కూడా ఆయన విశ్లేíÙంచారు. ఈ సందర్భంగా ఆయన స్మాల్ సేవింగ్స్ స్కీమ్‌లో ఏడాది డిపాజిట్ పథకాన్ని ప్రస్తావిస్తూ, ఇక్కడ డిపాజిట్ రేటు మార్గదర్శకాల ద్వారా వచి్చన వాస్తవ రేటు కంటే కనీసం 170–180 బేసిస్ పాయింట్లు ఎక్కువగా ఉందన్నారు. పెట్రో పన్నులపై ఆందోళన పెట్రో ఉత్పత్తులపై పన్నుల తీవ్రత పట్ల ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేసింది. అయితే ఈ విషయంపై నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రమేనని పేర్కొన్నారు. బహిరంగంగా రెండవసారి ఈ అంశంపై మాట్లాడిన గవర్నర్, పప్పులు, వంటనూనెల వంటి నిత్యావసరాల సరఫరాల విషయంలో ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకుండా కేంద్రం తగిన చర్యలు తీసుకుంటోందన్నారు. రాష్ట్రాలకు చేయూత మహమ్మారి తీవ్ర ప్రతికూల ప్రభావాలకు గురయిన రాష్ట్రాలకు ద్రవ్య లభ్యత విషయంలో ఎటువంటి సమస్యలూ లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆర్బీఐ నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) ‘వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ (డబ్ల్యూఎంఏ), ఓవర్‌డ్రాఫ్ట్ సౌలభ్యం ద్వారా పెంచిన రుణ పరిమితులను అన్ని విధాలా కొనసాగించాలని ఆర్బీఐ నిర్ణయించింది. మహమ్మారి ప్రారంభమైనప్పటి ఈ సమస్యతో పాటు అధిక రుణాల ఫలితంగా, రాష్ట్రాలు తమ బాండ్ హోల్డర్లకు అధిక వడ్డీని చెల్లిస్తున్నాయి – ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ఈ రేటు దాదాపు 7 శాతానికి చేరువైంది. ఈ సమయంలో పలు రాష్ట్రాలు డబ్ల్యూఎంఏ విండోను వినియోగించుకున్నాయి. జూలై నాటికి ఈ సౌలభ్యం ద్వారా నిధుల రుణ పరిమాణం 35 శాతం పెరిగి రూ .92,000 కోట్లకు చేరింది. ఉద్దీపనలను వెనక్కు... సంకేతాలు కోవిడ్–19 నేపథ్యంలో ఆర్బీఐ ప్రకటించిన ఉద్దీపనలకు క్రమంగా వెనక్కు తీసుకునే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు పాలసీ సమీక్ష సూచించింది. ప్రస్తుతం వ్యవస్థలో రూ .9 లక్షల కోట్లకు పైగా ఉన్న అదనపు ద్రవ్యతను ‘క్రమంగా‘ సర్దుబాట్లు చేయడానికి సెంట్రల్ బ్యాంక్ సుముఖంగా ఉందని గవర్నర్ సూచించారు. మార్కెట్ నుంచి ప్రభుత్వ సెక్యూరిటీలను (బాండ్లు) కొనుగోలుకు సంబంధించిన జీఎస్ఏపీ (గవర్నమెంట్ సెక్యూరిటీస్ అక్విజేషన్ ప్రొగ్రామ్)ను నిలుపుచేయడం జరిగిందని ఆయన తెలిపారు. వ్యవస్థలో అదనపు ద్రవ్య లభ్యత లేకుండా చూడ్డామే దీని ఉద్దేశ్యమని సూచించారు. గడచిన రెండు త్రైమాసికాల్లో జీఎస్ఏపీ కింద ఆర్బీఐ రూ.2.2 లక్షల కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేసింది. కాగా, ఇదే సమయంలో ఎకానమీ రికవరీకి తగిన ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) వ్యవస్థలో ఎప్పడూ కొనసాగేలా ఆర్బీఐ తగిన చర్యలు తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. బడా టెక్ ‘ఫైనాన్షియల్స్’పై కన్ను గూగుల్, అమెజాన్ ద్వారా డిపాజిట్ల ఆమోదం నిర్దేశిత చట్టాలు, నిబంధనల ప్రకారం ఉందో లేదో ఆర్బీఐ జాగ్రత్తగా పరిశీలిస్తోంది. ఆర్థిక రంగంలో బడా టెక్ సంస్థల కార్యకలాపాలపై ఆందోళనలు తీవ్ర స్థాయిలో ఉన్న నేపథ్యంలో ఈ కీలక నిర్ణయం తీసుకుంది. గూగుల్ పే (ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్) , అమెజాన్ రెండూ తమ మొబైల్ ఫోన్ యాప్‌ల ద్వారా దేశంలో డిపాజిట్లను స్వీకరించడానికి రుణదాతలతో భాగస్వామ్యాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. రూ. 5 లక్షలకు ఐఎంపీఎస్.. ఐఎంపీఎస్ (ఇమీడియట్ పేమెంట్ సర్వీస్) ద్వారా ప్రస్తుత లావాదేవీ పరిమితి రూ.2 లక్షలు కాగా, దీనిని రూ.5 లక్షలకు పెంచుతూ నిర్ణయం జరిగింది. డిజిటల్ లావాదేవీల పెంపు ఈ నిర్ణయ ప్రధాన లక్ష్యం. ఐఎంపీఎస్‌ను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) నిర్వహిస్తోంది. పాలసీలో కొన్ని ముఖ్యాంశాలు... ► బ్యాంకులు తమ మిగులు నిల్వలను ఆర్బీఐ వద్ద డిపాజిట్ చేసినప్పుడు లభించే రివర్స్ రెపో రేటు 3.35 శాతంగా కొనసాగనుంది. ► మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్, బ్యాంక్ రేట్ కూడా 4.25 శాతం వద్ద స్థిరంగా ఉండనుంది. ► ద్రవ్య లభ్యత, సర్దుబాటు లక్ష్యాలుగా అక్టోబర్ 8వ తేదీ నుంచి డిసెంబర్ 3 మధ్య పక్షం రోజుల ప్రాతిపదికన ఐదు 14 రోజుల వేరియబుల్ రేట్ రివర్స్ రెపో (వీఆర్ఆర్ఆర్) వేలాలను చేపట్టాలని ప్రతిపాదించింది. ► ఏటీఎంల్లో డబ్బు అందుబాటులో లేని సంద ర్భంల్లో ఆయా బ్యాంకులపై జరిమానా విధింపునకు ఉద్దేశించిన పథకాన్ని ఆర్బీఐ సమీక్షిస్తోంది. బ్యాంకర్ల నుంచి అందిన సలహాల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఆగస్టులో ఈ జరిమానా విధానాన్ని ప్రకటిస్తే, అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. ► ఫైనాన్షియల్ మోసాల నివారణే లక్ష్యంగా కొత్త విధాన రూపకల్పన జరగనుంది. ► బ్యాంకుల తరహాలోనే బడా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల (ఎన్బీఎప్సీ) కస్టమర్ల సమస్యల పరిష్కారానికి అంతర్గత అంబుడ్స్‌మన్ యంత్రాంగం ఏర్పాటు కానుంది. ► దేశంలోకి భారీగా విదేశీ పెట్టుబడులను ఆకర్షించే క్రమంలో గ్లోబల్‌బాండ్ ఇండిసీస్‌లో చేరే విషయంలో భారత్ ముందడులు వేస్తోంది. ఆర్బీఐ, కేంద్రం ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఇండెక్స్ ప్రొవైడర్లతో చర్చిస్తున్నాయి. ► తదుపరి పాలసీ సమీక్ష డిసెంబర్ 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకూ జరగనుంది. ఆఫ్‌లైన్‌లో రిటైల్ డిజిటల్ చెల్లింపులు దేశ వ్యాప్తంగా ఆఫ్‌లైన్ విధానంలో రిటైల్ డిజిటల్ చెల్లింపుల కోసం ఒక ఫ్రేమ్‌వర్క్‌ను ఆర్బీఐ ప్రవేశపెట్టనుంది. ఇంటర్నెట్ సదుపాయాలు లేని మారుమూల ప్రాంతాల ప్రజలకు సైతం రిటైల్ డిజిటల్ పేమెంట్లు జరిగేలా చర్యలు తీసుకోవడం ఈ ఫ్రేమ్‌వర్క్ ప్రధాన లక్ష్యం. చెల్లింపులకు సంబంధించి దేశ వ్యాప్తంగా అంగీకృత మౌలిక వ్యవస్థ బలోపేతానికి జియో ట్యాగింగ్ ఫ్రేమ్‌వర్క్ విడుదల కానుంది. వృద్ధి సంకేతాలు పటిష్టమవుతున్నాయ్ వృద్ధి కిరణాలు విస్తరిస్తుండడం, ఇందుకు సంకేతాలు పటిష్టమవుతుండడాన్ని ఆర్బీఐ గమనిస్తోంది. రైల్వే రవాణా, పోర్ట్ కార్యకలాపాలు, సిమెంట్ ఉత్పత్తి, విద్యుత్ డిమాండ్, ఈ– వే బిల్లుల మెరుగుదల, జీఎస్టీ, టోల్ భారీ వసూళ్ల వంటి అంశాలను ఇక్కడ ప్రస్తావించుకోవచ్చు. దీర్ఘకాలం వృద్ధి పటిష్ట ధోరణి కొనసాగడానికి సరళతర ఆర్థిక విధానాన్నే కొనసాగించాలని ఆర్బీఐ పాలసీ కమిటీ నిర్ణయించింది. – శక్తికాంతదాస్, ఆర్బీఐ గవర్నర్ -
పాలసీ ముందు లాభాలు
ముంబై: ఆర్బీఐ ద్రవ్య పాలసీ ప్రకటనకు ముందురోజు స్టాక్ మార్కెట్ లాభాలతో ముగిసింది. గవర్నర్ శక్తికాంత్‌దాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కమిటీ కీలక వడ్డీరేట్లపై నిర్ణయాలను, ఆర్థిక వ్యవస్థ అవుట్‌లుక్‌పై అభిప్రాయాన్ని నేడు వెలువరించనుంది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ప్రాధాన్యత ఇచ్చారు. క్రూడాయిల్ ధరలు ఎనిమిదేళ్ల గరిష్టం నుంచి దిగివచ్చాయి. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి మూడురోజుల వరుస నష్టాలకు ముగింపు పలికింది. మూడీస్‌తో సహా పలు అంతర్జాతీయ రేటింగ్‌లు భారత ఆర్థిక వ్యవస్థ అవుట్‌లుక్‌ను పెంచాయి. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో అస్థిరతలు తగ్గుముఖం పట్టాయి. ఈ అంశాలన్నీ దేశీయ మార్కెట్లో సానుకూల వాతావారణాన్ని నెలకొల్పాయి. ఫలితంగా సెన్సెక్స్ 488 పాయింట్లు పెరిగి 59,678 వద్ద, నిఫ్టీ 144 పాయింట్ల లాభంతో 17,790 వద్ద ముగిశాయి. దీంతో క్రితం రోజు నష్టాలన్నీ రికవరీ అయినట్లైంది. ఇంధన గ్యాస్ షేర్లు మినహా అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్ల మద్దతు లభించింది. సెమి కండక్టర్ల కొరత ఉన్నప్పటికీ.., పండుగ సీజన్లో అమ్మకాలు ఊపందుకోవచ్చనే ఆశలతో ఆటో షేర్లు దూసుకెళ్లాయి. రియల్ ఎస్టేట్ కంపెనీల క్యూ2 విక్రయాలు అంచనాలకు మించి నమోదుకావడంతో ఈ రంగ షేర్ల లాభపడ్డాయి. ఎన్ఎస్ఈలోని నిఫ్టీ రియల్ ఎస్టేట్ ఇండెక్స్ ఏకంగా 12 ఏళ్ల గరిష్టాన్ని అందుకుంది. ఆర్బీఐ ద్రవ్య పాలసీ విధాన వెల్లడి(నేడు)కి ముందు బ్యాంకింగ్, కన్జూమర్ కౌంటర్లలో సందడి నెలకొంది. దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ నేడు క్యూ2 ఆర్థిక ఫలితాల వెల్లడించనున్న నేపథ్యంలో ఐటీ రంగాల షేర్లు రాణించాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ రెండు శాతం చొప్పున ఎగిశాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1764 కోట్ల షేర్లను అమ్మగా, దేశీయ ఇన్వెస్టర్లు రూ.2529 కోట్ల షేర్లను అమ్మారు. క్రూడాయిల్ ధరలు దిగిరావడంతో పాటు అగ్రరాజ్యం అమెరికాలో డెట్–సీలింగ్(రుణాలకు చట్టబద్ధమైన ఆమోదం) చర్చలు ఓ కొలిక్కిరావడంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు నష్టాల బాట వీడాయి. ఆసియాలో ఒక్క ఇండోనేషియా మార్కెట్ తప్ప మిగితా అన్ని దేశాల స్టాక్ సూచీలు లాభాలతో ముగిశాయి. సెలవుల కారణంగా చైనా ఎక్సే్ఛంజీలు పనిచేయడం లేదు. యూరప్ మార్కెట్లు ఒకటిన్నర శాతం లాభపడ్డాయి. అమెరికా ఫ్యూచర్లు సైతం అరశాతం నుంచి ఒకటిన్నర లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. టైటాన్ విలువ @ రూ.2 లక్షల కోట్లు: వజ్రాభరణాల తయారీ, విక్రయ సంస్థ టైటాన్ షేర్లు ట్రేడింగ్‌లో మెరిశాయి. రెండో క్వార్టర్లో బలమైన డిమాండ్ నెలకొనడంతో వ్యాపారంలో వేగవంతమైన రికవరీని సాధించిమని కంపెనీ ప్రకటించింది. ఇంట్రాడేలో ఈ షేర్లు 11 శాతం లాభపడి రూ.2,383 వద్ద ఏడాది గరిష్టాన్ని అందుకున్నాయి. చివరికి రూ. 2,376 వద్ద స్థిరపడ్డాయి. మార్కెట్ ముగిసే సరికి కంపెనీ మార్కెట్ విలువ రూ.2.10 లక్షల కోట్ల వద్ద స్థిరపడింది. టీసీఎస్ తర్వాత టాటా గ్రూప్ నుంచి రూ.2 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌ను అందుకున్న రెండో కంపెనీ టైటాన్ నిలిచింది. -
ఆర్బీఐ పాలసీ సమావేశం ప్రారంభం
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) కీలక మూడు రోజుల పాలసీ సమావేశం బుధవారం ప్రారంభమైంది. గవర్నర్ శక్తికాంత్‌దాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ఈ కమిటీ దేశ ఆర్థిక వ్యవస్థ, వడ్డీరేట్లపై ప్రధాన నిర్ణయాలను శుక్రవారం వెలువరించనుంది. అంతర్జాతీయంగా ఏడేళ్ల గరిష్టానికి పెరిగిన కమోడిటీ ధరలు, దేశీయంగా ధరల తీవ్రత కట్టడి ఆవశ్యకత, రూపాయి బలహీనత, ఈక్విటీ మార్కెట్ల అనిశ్చితి వంటి అంశాలు ఈ సమావేశంలో ప్రధాన అజెండాగా ఉండనున్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ధరల కట్టడికి చర్యలు తీసుకుంటూనే, వృద్ధి లక్ష్యంగా యథాతథ రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 4 శాతం)ను కొనసాగించే అవకాశాలే అధికమని మెజారిటీ ఆర్థిక వేత్తలు భావిస్తున్నారు. ఇదే జరిగితే వరుసగా ఎనిమిది ద్వైమాసిక సమావేశంలోనూ ఆర్బీఐ యథాతథ రేటును కొనసాగించినట్లవుతుంది. 2020 మే 22 తర్వాత ఇప్పటి వరకూ రెపో విషయంలో ఆర్బీఐ యథాతథ పరిస్థితినే అను సరిస్తోంది. -
మౌలిక, విద్య, ఆరోగ్య రంగాలపై దృష్టి అవశ్యం
న్యూఢిల్లీ: భారత్ సమగ్ర, సుస్థిర అభివృద్ధికి, చిన్న పట్టణాల్లో ఉపాధి కల్పనకు మౌలిక, విద్య, ఆరోగ్య సంరక్షణా రంగాలతోపాటు డిజిటల్ ఎకానమీకి ఊపును ఇవ్వడానికి మరింత కృషి జరగాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంతదాస్ సూచించారు. ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) 48వ నేషనల్ మేనేజ్మెంట్ సదస్సును ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆర్బీఐ గవర్నర్ మాట్లాడారు. ప్రసంగంలో ముఖ్యాంశాలు చూస్తే... గతం భవిష్యత్తుకు బాట కావాలి మహమ్మారి నుంచి కోలుకుంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో సంక్షోభానికి దారితీసిన పరిస్థితులను సమీక్షించుకోవాలి. పటిష్టమైన, సమగ్రమైన, స్థిరమైన వృద్ధికి పరిస్థితులను సృష్టించుకోవాలి. సంక్షోభం కలిగించిన నష్టాన్ని పరిమితం చేయడం మొదటి అడుగు మాత్రమే. భవిష్యత్తులో ఇటువంటి సవాళ్లను ఎదుర్కొని, సుస్థిర వృద్ధిని సాధించడానికి చేసే ప్రయత్నం పక్కా ప్రణాళికకు అనుగుణంగా ఉండాలి. మధ్యకాలిక పెట్టుబడులు, పటిష్ట ఫైనాన్షియల్ వ్యవస్థలు, వ్యవస్థాగత సంస్కరణల ప్రాతిపదికన స్థిర వృద్ధి ప్రణాళికలను రూపొందించాలి. ఈ దిశలో విద్యా, ఆరోగ్యం, నూతన ఆవిష్కరణలు, భౌతిక, డిజిటల్ ఇన్‌ఫ్రాలపై మరిన్ని పెట్టుబడులు అవసరం. పోటీని, ఇందుకు సంబంధించి చైతన్యాన్ని పెంపొందించడానికి ప్రోత్సహించడానికి అలాగే మహమ్మారి ప్రేరిత అవకాశాల నుండి ప్రయోజనం పొందడానికి కార్మిక, ఉత్పత్తి మార్కెట్లలో మరింత సంస్కరణలను తీసుకుని రావాలి. గిడ్డంగి, వ్యవ‘సాయం’ కీలకం గిడ్డంగి, సరఫరా చైన్ల పటిష్టత, వ్యవసాయం ప్రత్యేకించి ఉద్యానవన రంగం విలువల పెంపునకు కృషి తత్సంబంధ మౌలిక సదుపాయాల కల్పన చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పనకు, సమగ్రాభివృద్ధికి ఎంతో అవసరం. కొన్ని రంగాల కోసం ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ఉత్పత్తి ఆధారిత పథకం (పీఐఎల్) తయారీ రంగాన్ని ప్రోత్సహించడంలో ఒక ముఖ్యమైన చొరవ. దీనివల్ల ప్రయోజనాలు దీర్ఘకాలం కొనసాగుతాయి. ప్రైవేటు వినయోగం పెరగాలి కరోనా మహమ్మారి అటు అభివృద్ధి చెందుతున్న, చెందిన దేశాలలో పేదలపై తీవ్ర ప్రభావం చూపింది. మహమ్మారి సవాళ్లు తొలగిపోయిన తర్వాత సుస్థిర పురోభివృద్ధిని సాగించేలా మన ప్రయత్నం ఉండాలి. మహమ్మారి సవాళ్ల నేపథ్యంలో పడిపోయిన ప్రైవేటు వినియోగం పునరుద్ధరణ జరగాల్సి ఉంది. వృద్ధిలో ఈ విభాగం ప్రాధాన్యత ఎంతో ఉంది. ప్రస్తుతం ప్రపంచాభివృద్ధికి దేశాల మధ్య సమన్వయ సహకారం అవసరం అన్న అంశాన్ని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. వ్యాక్సినేషన్ పురోగతిపై అన్ని దేశాలు పరస్పరం సహకరించుకోవాల్సిన అవసరం ఉంది. మహమ్మారి తర్వాత ప్రపంచాన్ని కలుపుకుని పోవడం ఒక పెద్ద సవాలే. ఆటోమేషన్ వల్ల ఉత్పాదకత లాభం జరుగుతుంది. అయితే ఇది కార్మిక మార్కెట్లో మందగమనానికి దారితీసే అవకాశం ఉంది. ఈ సందర్భంలో శ్రామిక శక్తికి కీలక నైపుణ్యం, శిక్షణ అవసరం. బిలియన్ డాలర్(రూ. 7,300 కోట్లు) విలువను అందుకున్న స్టార్టప్‌లు (యూనికార్న్) 60కు చేరడం ఈ విషయంలో భారత్ పోటీ తత్వాన్ని తెలియజేస్తున్నాయి. డిజిటల్, ఈ–కామర్స్, ఫార్మా వెలుగులు భారత్ డిజిటల్ రంగంలో దూసుకుపోతోంది. ఇదే ధోరణి కొనసాగే వీలుంది. క్లౌడ్ కంప్యూటింగ్, కస్టమర్ ట్రబుల్షూటింగ్, డేటా అనలటిక్స్, వర్క్‌ప్లేస్ ట్రాన్స్ఫార్మేషన్, సప్లైచైన్ ఆటోమేషన్, 5జీ మోడరనైజేషన్, సైబర్ సెక్యూరిటీలో సామర్థ్యాల పెంపు వంటి విభాగాల్లో డిమాండ్ భారీగా పెరిగే అవకాశం ఉంది. దేశంలో భారీగా విస్తరిస్తున్న రంగాల్లో ఈ–కామర్స్ ఒకటి. వృద్ధి చెందుతున్న మార్కెట్, ఇంటర్నెట్ సదుపాయాల విస్తరణ, స్మార్ట్‌ఫోన్ వినియోగం పెరగడం, కోవిడ్ సవాళ్ల నేపథ్యంలో వినియోగదారు ప్రాధాన్యతల్లో మార్పు వంటి అంశాలు ఈ–కామర్స్ పురోగతికి దోహదపడుతున్నాయి. డిజిటల్ రంగం పురోగగతికి కేంద్రం డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్టార్–అప్ ఇండియా, స్కిల్ ఇండియా, ఇన్నోవేషన్ ఫండ్ ఏర్పాటు వంటి ఎన్నో చర్యలను తీసుకుని వచి్చంది. దేశంలో పురోగమిస్తున్న రంగాల్లో ఔషధ విభాగం ఒకటి. కోవిడ్ సమయంలో వ్యాక్సిన్ అభివృద్ధి ద్వారా భారత్ ఈ విషయంలో తన సత్తా చాటింది. ఇంకా గవర్నర్ ఏమన్నారంటే... è గ్లోబల్ వ్యాల్యూ చైన్‌లో భారత్ వాటా గణనీయంగా పెరుగుతోంది. ఇది దేశీయ లఘు, మధ్య చిన్న తరహా పరిశ్రమలకు లాభించే అంశం. è ఎగుమతుల రంగం పురోగమిస్తోంది. 2030 నాటికి బారత్ ఇంజనీరింగ్ ఎగుమతుల లక్ష్యం 200 బిలియన్ డాలర్లు. దీని లక్ష్య సాధనకు కృషి జరగాలి. è దేశంలో ఎకానమీ పురోగతిలో బ్యాంకింగ్ పాత్ర కీలకం. ఇటీవల కాలంలో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలూ ఈ విషయంలో పురోగమిస్తున్నట్లు గణాంకాలు పేర్కొంటున్నాయి. -
ఎకానమీపై ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్ సమీక్ష
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ బోర్డ్ శుక్రవారం దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితిపై సమీక్ష జరిపింది. గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలో సెంట్రల్ బోర్డ్ డైరెక్టర్ల 590వ సమావేశం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగినట్లు ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. కోవిడ్–19 ప్రభావాన్ని తగ్గించడానికి ఆర్బీఐ తీసుకున్న చర్యల ఫలితాల అంశం కూడా సమీక్షలో చోటుచేసుకుందని ప్రకటన వివరించింది. డిప్యూటీ గవర్నర్లు మహేష్ కుమార్ జైన్, మైఖేల్ దేబబ్రత పాత్ర, ఎం రాజేశ్వర్ రావు మరియు టీ రబీ శంకర్లతోపాటు సెంట్రల్ బోర్డ్ ఇతర డైరెక్టర్లు సమావేశంలో పాల్గొన్నారు. సతీష్ కే మరాఠే, ఎస్ గురుమూర్తి, రేవతి అయ్యర్, సచిన్ చతుర్వేది సమవేశంలో పాల్గొన్న డైరెక్టర్లలో ఉన్నారు. ఆర్థిక సేవల కార్యదర్శి దేబాశిష్ పాండా, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్సేథ్ కూడా ప్రభుత్వం తరఫున సమావేశానికి హాజరయ్యారు. -
ధరల భయం.. వడ్డీ రేట్లు యథాతథం!
న్యూఢిల్లీ: అంచనాలకు తగ్గట్టే ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) మరోసారి వృద్ధికి మద్దతు పలికింది. ద్రవ్యోల్బణం సమీప కాలంలో ఎగువ స్థాయిల్లోనే ఉండొచ్చని అంచనా వేస్తూ.. అదే సమయంలో కీలకమైన రెపో రేటు (4 శాతం), రివర్స్ రెపో రేటు (3.35 శాతం)ను యథాతథంగా కొనసాగించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ 9.5 శాతం వృద్ధిని నమోదు చేస్తుందన్న అంచనాల్లోనూ మార్పులు చేయలేదు. వృద్ధికి మద్దతుగా సర్దుబాటు ధోరణినే కొనసాగించడం శుక్రవారం ముగిసిన మూడో ద్వైమాసిక (2021–22లో) ఆర్బీఐ ఎంపీసీ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలుగా చెప్పుకోవాలి. ఆర్థిక వ్యవస్థ కోలుకునేందుకు, వృద్ధి స్థిరపడే వరకు సర్దుబాటు విధానం కొనసాగింపునకు ఆరుగురు సభ్యుల ఎంపీసీలో ఐదుగురు ఆమోదం తెలిపినట్టు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ తెలిపారు. గతంలో ఏకగ్రీవ ఆమోదం రాగా.. ఈ విడత ఒక్కరు దీంతో విభేదించడం గమనార్హం. సమీప కాలంలో రేట్లను పెంచే అవకాశం లేదని దీంతో తెలుస్తోంది. ఆర్బీఐ కీలక రేట్లను యథావిధిగా కొనసాగించడం వరుసగా ఇది ఏడో విడత. చివరిగా 2020 మే నెలలో రేట్లను సవరించింది. కరోనాను దృష్టిలో ఉంచుకుని అప్పుడు కీలక రేట్లను అత్యంత కనిష్టాలకు తీసుకొచ్చింది. 2019 ఫిబ్రవరి నుంచి 2020 మే నాటికి మొత్తం మీద 2.5 శాతం మేర రేట్లను తగ్గించింది. సదా సన్నద్ధంగానే ఉంటాం.. కరోనా మరో విడత విరుచుకుపడే ప్రమాదంపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ అప్రమత్తత ప్రకటించారు. ‘‘ఆయుధాలను విడిచి పెట్టకుండా కొనసాగించాల్సిన అవసరం ఉంది. దేశంలోని పలు ప్రాంతాల్లో కరోనా ఇన్ఫెక్షన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మూడో విడత పట్ల అప్రమత్తంగా ఉంటాం’’ అని దాస్ చెప్పారు. ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం ప్రారంభమైందంటూ.. ఈ కీలక సమయంలో ద్రవ్యపరమైన, విధానపరమైన, రంగాల వారీ మద్దతు కొనసాగాల్సిన అవసరాన్ని దాస్ ప్రస్తావించారు. కరోనా రెండో దశ నుంచి ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం మొదలైందంటూ.. పెట్టుబడులు, డిమాండ్ కోలుకోవడాన్ని కీలక గణాంకాలు తెలియజేస్తున్నట్టు చెప్పారు. ఇలా ఎన్నో అంశాలను పరిగణనలోకి తీసుకున్న ఆర్బీఐ ఎంపీసీ 2021–22 సంవత్సరానికి జీడీపీ వృద్ధి అంచనాలను 9.5 శాతంగానే కొనసాగించింది. ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో 21.4 శాతం, జూలై–సెప్టెంబర్ క్వార్టర్లో 7.3 శాతం, ఆ తర్వాతి త్రైమాసికంలో 6.3 శాతం, చివరి త్రైమాసికంలో (2022 జనవరి–మార్చి) 6.1 శాతం చొప్పున జీడీపీ వృద్ధి నమోదు కావచ్చన్న అంచనాలను వ్యక్తం చేసింది. 2022–23 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 17.2 శాతం వృద్ధి నమోదవుతుందన్న అభిప్రాయాన్ని తెలియజేసింది. వడ్డీ రేట్లను గణనీయంగా తగ్గించడం ఇటు రియల్ ఎస్టేట్ రంగానికి, అటు గృహ కొనుగోలు దారులకు మేలు చేసినట్టు దాస్ పేర్కొన్నారు. ఎంపీసీ ఇతర నిర్ణయాలు ► కరోనా కారణంగా ఒత్తిళ్లు ఎదుర్కొంటున్న కార్పొరేట్ రంగానికి ఊరట లభించింది. రుణ పునరుద్ధరణ పథకానికి సంబంధించి కేవీ కామత్ కమిటీ నిర్దేశించిన పలు నిబంధనల అమలుకు గడువును మరో ఆరు నెలలు అంటే 2022 అక్టోబర్ 1 వరకు పొడిగిస్తూ ఆర్బీఐ ఎంపీసీ నిర్ణయం తీసుకుంది. ► సెకండరీ మార్కెట్లో రూ.50,000 కోట్లతో ప్ర భుత్వ సెక్యూరిటీల కొనుగోలు కార్యక్రమాన్ని (జీ–ఎస్ఏపీ 2.0) ఆగస్ట్ నెలలో రెండు విడతలుగా చేపట్టనున్నట్టు శక్తికాంతదాస్ తెలిపారు. అన్ని విభాగాల్లోనూ లిక్విడిటీ ఉండేలా చూడడమే దీని ఉద్దేశంగా పేర్కొన్నారు. ► ఆర్థిక వ్యవస్థ ఇంకా కోలుకునే దశలోనే ఉన్నందున.. ఆన్ ట్యాప్ టార్గెటెడ్ లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్ (టీఎల్టీఆర్వో) పథకాన్ని మూడు నెలల పాటు 2021 డిసెంబర్ 31 వరకు పొడిగిస్తూ ఆర్బీఐ ఎంపీసీ నిర్ణయించింది. ► వేరియబుల్ రేట్ రివర్స్ రెపో (వీఆర్ఆర్ఆర్) ఆక్షన్లను రూ.2.5 లక్షల కోట్లతో ఆగస్ట్ 13న, రూ.3 లక్షల కోట్లతో ఆగస్ట్ 27న, రూ.3.5 లక్ష ల కోట్లతో సెప్టెంబర్ 9న, రూ.4 లక్షల కోట్లతో సెప్టెంబర్ 24న చేపట్టనుంది. తద్వారా వ్యవస్థలో లిక్విడిటీని సర్దుబాటు చేయనుంది. గరిష్టాల్లోనే ద్రవ్యోల్బణం సరఫరా వైపు ఉన్న సమస్యలు, చమురు ధరలు అధిక స్థాయిలో ఉండడం, ముడి సరుకుల వ్యయాలను పరిగణనలోకి తీసుకున్న ఆర్బీఐ ఎంపీసీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణం 5.7 శాతంగా ఉంటుందని పేర్కొంది. జూన్ ఎంపీసీ సమావేశంలో ద్రవ్యోల్బణం 5.1 శాతంగా ఉంటుందని అంచనా వేయడం గమనార్హం. డిజిటల్ రూపీ డిజిటల్ రూపాయిని త్వరలో చూసే అవకాశా లున్నాయి. డిజిటల్ కరెన్సీల నిర్వహణ నమూనాను ఈ ఏడాది చివరి నాటికి ప్రకటించే అవకాశాలున్నట్టు ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ టి.రబిశంకర్ తెలిపారు. పరిధి, టెక్నాలజీ, పంపిణీ విధానం తదితర అంశాలను దృష్టిలో ఉంచుకు ని ఫియట్ డిజిటల్ కరెన్సీని ప్రవేశపెట్టే సాధ్యా సాధ్యాలను ఆర్బీఐ అంతర్గతంగా మదింపు వేస్తున్నట్టు చెప్పారు. -
కరోనా సెకండ్ వేవ్ : ఆర్బీఐ కీలక నిర్ణయం
సాక్షి, ముంబై: కరోనా సెకండ్ వేవ్ విలయం నేపథ్యంలో రిజర్వ్ బ్యాంకు కీలక వడ్డీ రేట్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. విస్తృత అంచనాకు అనుగుణంగానే ఆర్బీఐ కీలక వడ్డీరేట్లు యథాతథంగానే ఉంచింది. దీని ప్రకారం రెపో రేటు 4 శాతం వద్ద, రివర్స్ రెపో రేటు 3.35 శాతంగా ఉండనుంది. గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలో పాలసీ కమిటీ మూడు రోజుల సమావేశంలో ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకుంది. 2022 ఆర్థిక సంవత్సరానికి గాను సీపీఐ ద్రవ్యోల్బణం 5.1 శాతంగా ఉండనుందని ఆర్బీఐ అంచనా వేసింది. ఈ సందర్భంగా జీ-సాప్ 2.0 ను శక్తికాంత దాస్ ప్రకటించారు. జూన్ 17న రూ.40వేల కోట్ల మేర సెక్యూరిటీలు కొనుగోలు చేస్తామన్నారు. ఫారిన్ కరెన్సీ రిజర్వ్‌లు 600 బిలియన్ డాలర్లకు చేరిందని, ఫలితంగా కరెన్సీ ఒడిదుడుకులు, ఇతర పరిణామాలను సమర్ధవంతంగా ఎదుర్కోగలమని ఆయన చెప్పారు. అలానే దేశ జీడీపీని 9.5శాతంగా అంచనా వేశారు. దేశంలో గ్రామీణ ప్రాంతంలో వినియోగ సంబంధింత డిమాండ్ మెరుగ్గా ఉండనుందనే ఆశాభావాన్ని గవర్నర్ వ్యక్తం చేశారు. ఇందుకుసకాలంలో వచ్చిన మాన్సూన్ నిదర్శనమన్నారు. ఆర్థిక వృద్ధికి అవసరమైన సంకేతాలు తగ్గినట్లు కన్పిస్తున్నా, గత ఏడాది కంటే ఎక్కువగానే ఉన్నట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ వేగవంతం కావడంతో పాటు ఇప్పటికే ప్రకటించిన అనేక ఉద్దీపన ప్యాకేజీలు ఆర్థిక పురోగమనానికి దోహదపడతాయని చెప్పారు. అలాగే కరోనా నేపథ్యంలో హాస్పిటల్ రంగానికి రూ.15,000 కోట్లను ప్రకటించారు. ఎంఎస్ఎంఈలకు గతంలో ఇచ్చినట్లుగా రూ.16 వేల కోట్ల రుణాలు మంజూరు చేసేందుకు, ఆర్ధికంగా లిక్విడిటీ అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడించారు. చదవండి : Petrol, Diesel Price: మళ్లీ పెట్రో షాక్! దీర్ఘాయుష్షు: మనిషి 120 సంవత్సరాలు జీవించవచ్చు! -
ఆర్బీఐ రుణ చికిత్స!
ముంబై: కరోనా కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వర్గాలను ఆదుకునేందుకు ఆర్బీఐ రంగంలోకి దిగింది. వ్యక్తులు, చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థలు (ఎస్ఎంఈలు) తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించేందుకు మరింత సమయం ఇచ్చింది. రుణాలను రెండేళ్ల కాలానికి పునరుద్ధరించుకునే అవకాశం కల్పించింది. టీకాల తయారీ సంస్థలు, ఆస్పత్రులు, ల్యాబొరేటరీలు, కరోనా సంబంధిత ఆరోగ్య సదుపాయాల కల్పనకు ప్రాధాన్య రంగం కింద రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులను అనుమతించింది. ఇందు కోసం బ్యాంకులకు ప్రత్యేకంగా రూ.50,000 కోట్ల లిక్విడిటీని(నిధుల లభ్యత) అందించనుంది. ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం కింద రాష్ట్ర ప్రభుత్వాలు నిధు లు పొందేందుకు ఉద్దేశించిన నిబంధనలను వచ్చే సెప్టెంబర్ 30వరకు సడలించింది. ప్రభుత్వ సెక్యూరిటీల కొనుగోలు కార్యక్రమం(జీ–సాప్) కింద 2 వారాల్లో రూ.35,000 కోట్లకు ప్రభుత్వ సెక్యూరిటీలను కొనుగోలు చేయనున్నట్టు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ తెలిపారు. ఆర్బీఐ మధ్యంతర నిర్ణయాలను ఆయన బుధవారం ప్రకటించారు. మారటోరియం కాదు.. రుణ పునరుద్ధరణే వాస్తవానికి బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు, సూక్ష్మ రుణ సంస్థలు ఒక్క విడత రుణ మారటోరియంను మూడు నెలలకు కల్పించాలని ఆర్బీఐని ఇటీవలే కోరాయి. కానీ, ఒక్క విడత రుణ పునరుద్ధరణకు.. అది కూడా రూ.25 కోట్ల వరకు రుణాలకే అవకాశం కల్పిస్తూ ఆర్బీఐ నిర్ణయించింది. గతేడాది రుణ మారటోరియం ముగిసిన తర్వాత రుణాల పునరుద్ధరణ అవకాశాన్ని వినియోగించుకోని వాటికే ప్రస్తుతం ఈ సదుపాయం రెండేళ్ల కాలానికి లభిస్తుంది. 2021 మార్చి వరకు స్టాండర్డ్ ఖాతాలుగా (సక్రమంగా చెల్లింపులు చేస్తున్న) ఉన్న వాటికి ఈ వెసులుబాటు పరిమితం. 90 శాతం రుణ గ్రహీతలు ఇందుకు అర్హత సాధిస్తారని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ అంచనా. రూ.50,000 కోట్ల సాయం.. ఆరోగ్య సేవలు, సదుపాయాల రంగంలో ఉన్న కంపెనీలకు రూ.50,000 కోట్లతో ఆన్‌ట్యాప్ లిక్విడిటీ విండోను ఆర్బీఐ ప్రకటించింది. కంపెనీలు దరఖాస్తు చేసుకుంటే బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం దీనికింద లభిస్తుంది. రెపో రేటుపై, మూడేళ్ల కాల వ్యవధికి రుణాలు అందిస్తామని.. ఈ విండో 2022 మార్చి 31 వరకు అందుబాటులో ఉంటుందని శక్తికాంతదాస్ చెప్పారు. బ్యాంకులు ఈ పథకం కింద టీకాల తయారీ కంపెనీలు, టీకాల దిగుమతి దారులు, సరఫరాదారులు, వైద్య పరికరాలు, ఆస్పత్రులు, డిస్పెన్సరీలు, పాథాలజీ ల్యాబ్‌లు, ఆక్సిజన్, వెంటిలేటర్ల తయారీదారులు, సరఫరాదారులు, కరోనా సంబంధిత ఔషధ దిగుమతిదారులు, లాజిస్టిక్స్ సంస్థలకు తాజా రుణాలను మంజూరు చేయవచ్చు. వీటిని ప్రాధాన్య రంగ రుణాలుగా ఆర్బీఐ పరిగణిస్తుంది. ఈ పథకం కింద మంజూరు చేసే రుణాలతో ప్రత్యేక పుస్తకాన్ని బ్యాంకులు నిర్వహించొచ్చు. బ్యాంకులు తమ దగ్గర మిగులుగా ఉన్న నిధులను కరోనా రుణ పుస్తక పరిమాణం స్థాయిలో ఆర్బీఐ వద్ద ఉంచడం ద్వారా.. రెపో రేటు కంటే 0.25% తక్కువగా వడ్డీని పొందొచ్చు. రూ.35,000 కోట్లతో జీ–సెక్యూరిటీలు ఈ నెలలోనే రూ.35,000 కోట్లతో ప్రభుత్వ సెక్యూరిటీలను (జీ–సెక్‌లు) ఆర్బీఐ కొనుగోలు చేయనుంది. ఆర్బీఐ గత నెలలోనూ రూ.25,000 కోట్లకు జీ–సెక్లను కొనుగోలు చేయడం గమనార్హం. పదేళ్ల ప్రభుత్వ బాండ్ల ఈల్డ్‌ను 6 శాతంలోపునకు తీసుకొచ్చే లక్ష్యంతో, ప్రభుత్వ వృద్ధి కార్యక్రమాలకు మద్దతునిచ్చే ఉద్దేశంతో ఈ పథకాన్ని ఆర్బీఐ తీసుకొచ్చింది. జీ–సెక్ ఈల్డ్స్ తగ్గితే ప్రభుత్వానికి ఉపశమనం లభించినట్టే. కేవైసీ విషయంలో ఇబ్బంది పెట్టొద్దు బ్యాంకులు, నియంత్రిత ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లు 2020 డిసెంబర్ చివరికి కేవైసీ (కస్టమర్ గురించి తెలుసుకోవడం) వివరాలను అప్డేట్ చేయని కస్టమర్ల విషయంలో కఠిన చర్యలకు దిగొద్దని ఆర్బీఐ కోరింది. ఈ ఏడాది డిసెంబర్ చివరి వరకు ఈ అవకాశం కల్పించింది. అలాగే, వీడియో కేవైసీకి అనుమతించింది. 250 మందితో క్వారంటైన్ కేంద్రం కరోనా సంక్షోభంలో కీలక కార్యకలాపాలకు విఘాతం కలగకుండా ఆర్బీఐ ప్రత్యేక క్వారంటైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. 250 మంది సిబ్బంది ఈ కేంద్రంలోనే ఉంటూ కీలక కార్యకలాపాలను నిర్వహిస్తున్నట్టు శక్తికాంతదాస్ తెలిపారు. ఎస్‌ఎఫ్‌బీలకు 10వేల కోట్లు స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులకు (ఎస్ఎఫ్బీలు) ప్రత్యేక దీర్ఘకాలిక రెపో ఆపరేషన్స్ విండో (ఎస్‌ఎల్‌టీఆర్‌వో)ను సైతం దాస్ ప్రకటించారు. ‘‘ప్రస్తుత కరోనా తీవ్రతతో ఎక్కువగా ప్రభావితమైన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలకు మరింత మద్దతు అందించేందుకు ప్రత్యేకంగా మూడేళ్ల కాల వ్యవధిపై రూ.10,000 కోట్లకు ఎస్‌ఎల్‌టీఆర్‌వో నిర్వహించాలని నిర్ణయించాం. రెపో రేటుకే ఎస్‌ఎఫ్‌బీలకు ఈ నిధులు అందిస్తాం’’ అని దాస్ తెలిపారు. ఈ ఏడాది అక్టోబర్ 31 వరకు ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందన్నారు. అలాగే, రూ.500 కోట్ల వరకు ఆస్తులు కలిగిన సూక్ష్మ రుణ సంస్థలకు ఎస్ఎఫ్బీలు అందించే రుణాలను ప్రాధాన్యరంగ రుణాలుగా పరిగణిస్తామని ఆర్బీఐ గవర్నర్ చెప్పారు. భవిష్యత్తుపై ఎంతో అనిశ్చితి భవిష్యత్తు ఆర్థిక వృద్ధిపై ఎంతో అనిశ్చితి నెలకొందన్నారు దాస్. తాజా సంక్షోభాన్ని ఎదుర్కోగల బలమైన మూలాలపై భారత్ ఉందని అభిప్రాయపడ్డారు. వృద్ధి తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నట్టు అంగీకరించారు. ‘‘భారత్ బలంగా కోలుకునే క్రమంలో సానుకూల వృద్ధిలోకి అడుగుపెట్టింది. ముఖ్యంగా ఇన్ఫెక్షన్ కర్వ్ వంగిన కొన్ని వారాల్లోనే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కరోనా కారణంగా ఏర్పడే పరిస్థితులను ఆర్బీఐ అనుక్షణం పరిశీలిస్తూ అవసరం ఏర్పడితే అన్ని రకాల వనరులను, అసాధారణ సాధనాలను ఆచరణలోకి తీసుకొస్తుంది’’ అని శక్తికాంతదాస్ చెప్పారు. సాధారణ నైరుతి రుతుపవనాలతో ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు ఉపశమిస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. డిమాండ్ తగ్గుదల కొంతే... డిమాండ్‌పై లాక్డౌన్ల ప్రభావం గతేడాదితో పోలిస్తే మోస్తరుగానే ఉంటుందని శక్తికాంతదాస్ అన్నారు. ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ తాత్కాలికంగా తగ్గిపోవచ్చని, ముఖ్యంగా రిటైల్, ఆతిథ్య రంగాల్లో ఈ పరిస్థితులు ఉంటాయని చెప్పారు. మొత్తం మీద కీలక గణాంకాలు మిశ్రమ సంకేతాలను ఇస్తున్నట్టు పేర్కొన్నారు. సకాలంలో సరైన నిర్ణయాలు ఆర్బీఐ ప్రకటించిన నిర్ణయాలను నిపుణులు, పరిశ్రమ వర్గాలు ఆహ్వానించాయి. కరోనా మహమ్మారి ఆర్థిక వ్యవస్థకు కొత్త సవాళ్లను విసురుతున్న క్రమంలో సకాలంలో సరైన నిర్ణయాలను ప్రకటించినట్టు పేర్కొన్నాయి. ఆరోగ్యసంరక్షణ, అనుబంధ రంగాలు పెరిగిన డిమాండ్‌తో, సరఫరా పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో రూ.50వేల కోట్లతో ఆన్‌టాప్ లిక్విడిటీని ప్రకటించడం ఎంతో ఉత్సాహాన్నిచ్చేదిగా సీఐఐ పేర్కొంది. ‘చిన్న వ్యాపార సంస్థలు, ఫైనాన్షియల్ సంస్థలు క్షేత్ర స్థాయిలో ఎదుర్కొంటున్న భారాన్ని ఆర్బీఐ చాలా వరకు గుర్తించింది. వారికి మద్దతుగా చర్యలను ప్రకటించింది. లకి‡్ష్యత వర్గాలను ఉద్దేశించిన చర్యలు ప్రస్తుత తరుణంలో ఎంతో అనుకూలమైనవి’ అని అసోచామ్ వ్యాఖ్యానించింది. పలు రంగాలు ఎదుర్కొంటున్న సమస్యల తీవ్రతను తగ్గించే లక్ష్యంతో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ అనూహ్యమైన నిర్ణయాలు ప్రకటించారు. ప్రకటించిన చర్యలు వినూత్నంగా ఉన్నాయి. కరోనా సంబంధిత ఆరోగ్య సదుపాయాల కల్పనకు రూ.50,000 కోట్ల ప్రత్యేక నిధి ప్రకటించడం అన్నది ఆర్థిక ఆరోగ్యమే కాదు, ప్రజారోగ్యం ఎదుర్కొంటున్న సమస్యలపైనా దృష్టి పెట్టినట్టుంది. – దినేష్ ఖారా, ఎస్బీఐ చైర్మన్ సరైన సమయంలో ప్రకటించిన లిక్విడిటీ చర్యలు ఎంతో ఒత్తిడిని ఎదుర్కొంటున్న వర్గాలకు ఉపశమనం కల్పిస్తాయి. వ్యక్తులు, చిన్న పరిశ్రమలకు నిధులు లభించేలా చేస్తాయి. – శక్తి ఏకాంబరం, కోటక్ మహీంద్రా బ్యాంకు గ్రూపు ప్రెసిడెంట్ దిగజారుతున్న పరిస్థితులకు స్పందనగా ఆర్బీఐ.. వ్యక్తులు, చిన్న వ్యాపార సంస్థలు తీసుకున్న రూ.25 కోట్ల వరకు రుణాలను ఒక్కసారి పునరుద్ధరించుకునే అవకాశాన్నిచ్చింది. గతేడాది ఇచ్చిన మారటోరియంతో పోలిస్తే ఈ చర్య చిన్నదే. పునరుద్ధరించుకునే రుణాల పరిమాణం తక్కువగానే ఉంటుంది. బ్యాంకుల ఆస్తుల నాణ్యత దిగజారే అవకాశం ఉందని ఈ చర్యలు తెలియజేస్తున్నాయి. – మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ -
కేవైసీ అప్డేట్ పై ఆర్బీఐ కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: దేశీయ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆప్ ఇండియా(ఆర్బీఐ) కేవైసీ అప్డేట్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో కరోనా మహమ్మరి విజృంభిస్తున్న కారణంగా 2021 డిసెంబర్ 31 వరకు కేవైసీ అప్డేట్ చేయడంలో విఫలమైన వినియోగదారులపై ఎటువంటి ఆంక్షలు విధించవద్దని బ్యాంకులు ,ఇతర ఆర్థిక సంస్థలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కోరారు. నేడు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి చాలా తీవ్రంగా ఉందని, గత నెలలో పరిస్థితి తీవ్రంగా మారిందని ఆర్బీఐ గవర్నర్ చెప్పారు. వినియోగదారుల ఖాతాలకు సంబంధించిన కార్యకలాపాల కోసం కేవైసీ అప్డేట్ తప్పనిసరిగా చేయాలని గతంలో సూచించిన సంగతి తెలిసిందే. దీంతో బ్యాంకులు కేవైసీ అప్డేట్ చేసుకోవాలని కస్టమర్లను ఇటీవల కోరాయి. ఇందుకోసం మే 31 వరకు గడువును విధించాయి. అయితే ఆర్బీఐ మాత్రం తాజాగా కేవైసీ అప్ డేట్ గడువును డిసెంబర్ చివరి వరకు పొడగిస్తున్నట్లుగా ప్రకటించింది. అంటే డిసెంబర్ 31 వరకు కేవైసీ అప్ డేట్ చేసుకోకపోయిన కస్టమర్లకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. నిరంతరంగా వారు లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. చదవండి: అలర్ట్: ముంచుకొస్తున్న ‘ఫ్లూబోట్’ ముప్పు -
పెట్రోధరలపై స్పందించిన నిర్మలా సీతారామన్
పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి 'ధర్మసంకట్'(పెద్ద సందిగ్ధత)గా మారాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ అని అన్నారు. పెరుగుతున్న ఇంధన ధరల కారణం గా పౌరులపై భారం పడుతున్నట్లు ఆమె అంగీకరించారు. ప్రజలపై పడే భారాన్ని తగ్గించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సమీక్షించాల్సిన అవసరం ఉందన్నారు. పెట్రోల్‌పై కేంద్రానికి వచ్చే ఆదాయంలో 41 శాతం రాష్ట్రాలకే వెళ్తుందని తెలిపారు. ఇప్పుడదే రాష్ట్రాలకు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్నట్లు నిర్మల సీతారామన్ పేర్కొంది. ఈ సమస్యకు పరిష్కారం కనుగొనే ఏకైక మార్గం కేంద్రం, రాష్ట్రాలు చర్చలు జరపడమేనని ఆమె అన్నారు. అంతకు ముందు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బిఐ) గవర్నర్ శక్తికాంత దాస్ కూడా ఇంధన ధరలను తగ్గించడానికి కేంద్రం, రాష్ట్రాల మధ్య చర్చలు జరగాలని అని అన్నారు. "కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య సమన్వయ చర్చలు అవసరం. వీలైనంత త్వరగా పన్నులు తగ్గించడం చాలా ముఖ్యం" అని శక్తికాంత దాస్ అన్నారు. గత వారాంతాన పెట్రో ధరలు పెరిగిన తర్వాత వరుసగా ఆరు రోజులుగా నిలకడగా కొనసాగుతున్నాయి. అయితే ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 91 రూపాయల మార్క్ వద్దకు చేరగా ఆర్థిక రాజధాని ముంబైలో 97 రూపాయల ఎగువకు చేరి పరుగులు పెడుతోంది. ఢిల్లీ, ముంబై సహా దేశంలోని పలు మెట్రో నగరాల్లో పెట్రోల్ రేట్లు రికార్డు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. చదవండి: వాహనదారులకు కేంద్రం శుభవార్త! జియో ల్యాప్‌టాప్‌లు రాబోతున్నాయి! -
పెట్రో సెగతో ధరల మంట!
ముంబై: పెట్రోల్, డీజిల్ ధరల విషయంలో పన్ను తగ్గింపునకు కేంద్ర, రాష్ట్రాల సమన్వయ చర్య అవసరమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంతదాస్ గురువారం పేర్కొన్నారు. తగ్గింపు విషయంలో ఆచితూచి నిర్ణయాలు అవసరమని అన్నారు. కేంద్ర, రాష్ట ప్రభుత్వాలకు ఆదాయ పరమైన ఒత్తిడులు ఉన్న విషయాన్నీ ఇక్కడ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. కోవిడ్–19 ప్రేరిత సవాళ్లను ఎదుర్కొనడంసహా, పలు అభివృద్ధి కార్యకలాపాలకు ప్రభుత్వాలు భారీ వ్యయాలు చేయాల్సిన తక్షణ అవసరాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. బొంబాయి చాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ‘‘ప్రభుత్వాల రెవెన్యూ ఇబ్బందులు ఒత్తిడులను పూర్తిగా అర్థం చేసుకోవాల్సిందే. అయితే పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల ద్రవ్యోల్బణం పెరుగుదలకు కూడా దారితీస్తుంది. ప్రత్యేకించి ఉత్పత్తి రంగంపై ప్రతికూలత చూపుతుంది’’ అని అన్నారు. ఏఆర్‌సీలపై ప్రత్యేక దృష్టి మొండిబకాయిల (ఎన్పీఏ) సమస్యల గురించి ఆర్బీఐ గవర్నర్ ప్రస్తావిస్తూ, అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీల (ఏఆర్‌సీలు) విషయంలో నియంత్రణా యంత్రాంగాన్ని మరింత పటిష్టవంతం చేయడంపై సెంట్రల్ బ్యాంక్ దృష్టి సారిస్తున్నట్లు వివరించారు. ఎన్పీఏల సమస్య పరిష్కారం విషయంలో ఏఆర్‌సీలే కీలకమన్న సంగతిని ఈ సందర్భంగా ప్రస్తావించారు. బ్యాంకింగ్ రంగానికి దన్నుగా మొండి బకాయిల నిర్వహణకు 2021–22 బడ్జెట్లో ఆర్థిక మంత్రి సీతారామన్ ప్రతిపాదించిన ఆస్తుల (రుణాల) పునర్ నిర్మాణ కంపెనీ(ఏఆర్సీ) ఏర్పాటును ప్రస్తావిస్తూ, ప్రస్తుత అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీల క్రియాశీలతకు ఎటువంటి అంతరాయం కలగని రీతిలోనే ప్రతిపాదిత ఏఆర్సీ ఏర్పాటు ఉంటుందని తెలిపారు. మొండి బకాయిల సమస్యను ఎలా ఎదుర్కొనాలన్న అంశంపై బ్యాంకింగ్‌లో అవగాహన, చైతన్యం పెరుగుతున్నట్లు గవర్నర్ తెలిపారు. బ్యాంకులు ఎన్పీఏలకు సంబంధించి తగిన కేటాయింపులు జరుపుతున్నాయని పేర్కొన్నారు. అలాగే పర్యవేక్షణ విధానాలకు ఆర్బీఐ మరింత పదును పెట్టినట్లు పేర్కొన్నారు. ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా ఎన్పీఏల విషయంలో బ్యాంకింగ్ అంతర్గత అంశాలనూ ఆర్బీఐ పర్యవేక్షిస్తున్నట్లు వివరించారు. లిక్విడిటీ చర్యల వల్ల ఇబ్బంది లేదు అసెట్ పర్చేజింగ్సహా వ్యవస్థలో లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) పెంపునకు తీసుకుంటున్న చర్యలు ఆర్బీఐ బ్యాలెన్స్ షీట్‌పై ప్రతికూల ప్రభావం చూపు తుందన్న అంచనాలు సరికాదన్నారు. ఇటువంటి ఇబ్బంది ఏదీ తలెత్తబోదని ఆయన స్పష్టంచేస్తూ, సెంట్రల్ బ్యాంకింగ్ మౌలిక సూత్రాల విషయంలో రాజీ ఉండబోదని అన్నారు. ఎటువంటి రిస్క్ సమస్యలు లేని సావరిన్ (ప్రభుత్వ) బాండ్ల కొనుగోలుకు మాత్రమే సెంట్రల్ బ్యాంక్ ‘అసెట్ పర్చేజ్’ కార్యక్రమం పరిమితమవుతుందని స్పష్టం చేశారు. డిజిటల్ కరెన్సీపై త్వరలో మార్గదర్శకాలు డిజిటల్ (క్రిప్టో) కరెన్సీకి సంబంధించి పలు అంశాల్లో ఆర్బీఐలో అంతర్గతంగా పటిష్ట మదింపు జరుగుతోందని అన్నారు. త్వరలో ఇందుకు సంబంధించి మార్గదర్శకాలను, ప్రతిపాదిత పత్రాలను సెంట్రల్ బ్యాంక్ విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. క్రిప్టో కరెన్సీ గురించి శక్తికాంతదాస్ మాట్లాడుతూ, ఆర్బీఐకి ఈ అంశంపై పలు ఆందోళనలు ఉన్నాయన్నారు. ఆయా అంశాలను కేంద్రంతో చర్చించినట్లు వెల్లడించారు. ఎగుమతులు పెంచాలి... దేశ ఎగుమతుల పెంపుపై ప్రత్యేక దృష్టి అవసరమని ఆర్బీఐ గవర్నర్ పేర్కొన్నారు. అలాగే వివిధ దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను (ఎఫ్‌టీఏ) వ్యూహాత్మక ప్రాముఖ్యతనూ ప్రస్తావించారు. దేశీయంగా పటిష్టతేకాకుండా, అంతర్జాతీయంగా అవకాశాలను అందిపుచ్చుకోడానికి కూడా ఎఫ్‌టీఏలు దోహదపడతాయని అన్నారు. బ్రెగ్జిట్ అనంతర పరిస్థితుల నేపథ్యలో బ్రిటన్, యూరోపియన్ యూనియన్ (ఈయూ)లతో వేర్వేరు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల వల్ల బహుళవిధ ప్రయోజనాలు ఉంటాయని అభిప్రాయపడ్డారు. -
క్రిప్టోకరెన్సీపై ఆర్బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు!
ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీ విలువ రాకెట్ కంటే వేగంగా దూసుకెళ్తున్న సమయంలో ఆర్బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆసియాలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ(భారత్)లో ఆర్థిక స్థిరత్వాన్ని క్రిప్టో కరెన్సీలు ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయని ఆర్బిఐ ఆందోళన చెందుతోంది అని అన్నారు. ఈ విషయాన్నీ ఇప్పటికే ప్రభుత్వానికి తెలియజేసినట్లు ఆర్బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. దేశంలోని అన్ని ప్రైవేట్ క్రిప్టోకరెన్సీలను నిషేధించి, ప్రభుత్వమే అధికారికంగా డిజిటల్ కరెన్సీని తీసుకువచ్చేందుకు ఆర్బీఐ సిద్ధంగా ఉందని గవర్నర్ శక్తికాంత దాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. డిజిటల్ కరెన్సీల ద్వారా మోసానికి పాల్పడుతున్నారని తెలిసిన తర్వాత 2018లో ప్రైవేటు క్రిప్టో కరెన్సీ వినియోగం శ్రేయస్కరం కాదని భావించిన ఆర్బీఐ వాటిని నిషేధించింది. కానీ, క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజీల పిటిషన్‌కు ప్రతిస్పందనగా ఆర్బీఐ ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు 2020లో కొట్టివేసింది. ప్రైవేటు క్రిప్టో కరెన్సీకి ముకుతాడు వేసి, దేశంలో సొంతంగా డిజిటల్ కరెన్సీని తెచ్చేందుకు ప్రయత్నిస్తోన్న కేంద్ర ప్రభుత్వం వాటికి సంబంధించిన బిల్లును రూపొందించే పనిలో నిమగ్నమయ్యింది. ఇప్పటికే చైనాలో ఉన్న ఎలక్ట్రానిక్ యువాన్‌తో పాటు డిజిటల్ కరెన్సీ ఉన్న ఇతర దేశాల జాబితాలో భారత్ చేరనున్నట్లు తెలిపారు. దీనికి కావాల్సిన సాంకేతికపై పనిచేతున్నట్లు శక్తికాంత దాస్ పేర్కొన్నారు. టెస్లా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎలోన్ మస్క్ ఇటీవలి ట్వీట్లలో బిట్ కాయిన్ ధరలు "అధికంగా కనిపిస్తున్నాయి" అని చెప్పారు. దీనితో ఒక్కసారిగా టెస్లా షేర్ ధరలు విపరీతంగా పడిపోయాయి. ఒక్కరోజులో ఎలోన్ మస్క్ 15.2 బిలియన్ డాలర్ల సంపదను కోల్పోయారు. త్వరలో బిట్ కాయిన్ పేమెంట్ సేవలను ప్రారంభించాలని భావిస్తున్న ఎలాన్ 1.5 బిలియన్ డాలర్ల విలువైన కాయిన్లను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. చదవండి: ఒక్క ట్వీట్‌తో లక్ష కోట్ల నష్టం..! ఫ్లిప్‌కార్ట్ లో స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్ -
ఆర్బీఐ పాలసీ రివ్యూ : కీలక నిర్ణయం
సాక్షి, ముంబై: రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. వరుసగా నాలుగోసారి వడ్డీరేట్లను యథాతథంగా ఉంచింది. రివ్యూలో కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచాలని నిర్ణయించినట్టు ఆర్బీఐ గవర్నరు శక్తి కాంతదాస్ శుక్రవారం వెల్లడించారు. ఆర్థిక వృద్ధి రేటు అంచనాలను మించిందని ఆయన ప్రకటించారు. (పెట్రో ధరల మోత : రికార్డు హై) వచ్చే ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 10.5 శాతంగా ఉంటుందని అంచనా వేశారు. అలాగే ద్రవ్యోల్బణం అంచనాను 5.8శాతం నుంచి 5.2శాతానికి తగ్గించారు. తాజా నిర్ణయంతో రెపోరేటు 4 శాతంగా, రివర్స్ రెపో 3.35 శాతంగా కొనసాగనుంది. దీంతో బ్యాంకు నిఫ్టీ వెయ్యి పాయింట్లకు పైగా లాభంతో ట్రేడవుతుండటం విశేషం. (అదే జోష్, అదే హుషారు : పరుగే పరుగు) -
సరళతర విధానాలను వెనక్కుతీసుకోలేం!
ముంబై: కరోనా మహమ్మారి సంక్షోభాన్ని ఎదుర్కొనడానికి గడచిన తొమ్మిది నెలలుగా తీసుకున్న లిక్విడిటీ (వ్యవస్థలో ద్రవ్య లభ్యత) తదితర సరళతర ద్రవ్య విధానాలను ఇప్పుడే వెనక్కు తీసుకోలేమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత్‌దాస్ స్పష్టం చేశారు. ఇటువంటి నిర్ణయాల వల్ల ఎటువంటి ఫలితం లభించకపోగా, ఇప్పుడిప్పుడే మెరుగుపడుతున్న రికవరీ, వృద్ధి ధోరణులకు విఘాతం కలుగుతుందని ఆయన అన్నారు. డిసెంబర్ 2వ తేదీ నుంచి 4వ తేదీవరకూ మూడు రోజుల పాటు జరిగిన ఆర్బీఐ పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) కీలక సమావేశాల మినిట్స్ శుక్రవారం విడుదలయ్యాయి. దీనిప్రకారం, ద్రవ్యోల్బణం తీవ్రత నేపథ్యంలో బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపో (ప్రస్తుతం 4 శాతం) తగ్గించనప్పటికీ, వృద్ధికి దోహపడే అన్ని చర్యలనూ తీసుకోవాలని సమావేశం అభిప్రాయపడింది. క్యూ3, క్యూ4 కాలాల్లో ద్రవ్యోల్బణం వరుసగా 6.8 శాతం, 5.8 శాతానికి దిగివస్తుందని అంచనావేసింది. ఈ అంచనాల నేపథ్యంలో సరళతర వడ్డీరేట్ల విధానమే కొనసాగించడం జరుగుతుందని స్పష్టం చేసింది. రెపో రేటు తగ్గించడం కష్టమే: నోమురా కాగా, కీలక రెపో రేటు 2021లోనూ తగ్గించడం కష్టమని జపాన్ బ్రోకరేజ్ దిగ్గజం– నోమురా శుక్రవారంనాటి తన తాజా నివేదికలో అభిప్రాయపడింది. ద్రవ్యోల్బణం ఇప్పటికీ తీవ్రంగా ఉందని పేర్కొన్న నోమురా, ఇదే తీవ్రత కొనసాగే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. పైగా ద్రవ్యోల్బణం సమీప కాలంలో పెరిగే అవకాశాలూ లేకపోలేదని విశ్లేషించింది. ఇదే జరిగితే, 2022లో వడ్డీరేట్ల పెంపునకే ఆర్బీఐ పాలసీ కమిటీ మొగ్గుచూపే అవకాశం ఉందని అభిప్రాయపడింది. అక్టోబర్‌లో 7.6 శాతం ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం నవంబర్‌లో 6.93 శాతానికి తగ్గింది. అయితే ఇది కూడా ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న స్థాయి కన్నా అధికం కావడం గమనార్హం. దీనిప్రకారం ద్రవ్యోల్బణం 2–6 శాతం మధ్య ఉండాలి. పీఎమ్‌సీ బ్యాంకులో పెట్టుబడులకు నాలుగు ఆఫర్లు పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోపరేటివ్ బ్యాంకు (పీఎమ్‌సీ బ్యాంకు)లో పెట్టుబడులు పెట్టేందుకు నాలుగు సంస్థల నుంచి ప్రతిపాదనలు వచ్చినట్టు ఆర్బీఐ శుక్రవారం ప్రకటించింది. బ్యాంకుపై విధించిన ఆంక్షలను మార్చి 31 వరకు పొడిగించింది. బహుళ రాష్ట్రాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న పీఎమ్‌సీ బ్యాంకులో 2019 సెప్టెంబర్‌లో స్కామ్ వెలుగులోకి రావడంతో ఆర్బీఐ పలు ఆంక్షలను అమల్లోకి తీసుకొచ్చింది. బ్యాంకు పునర్నిర్మాణానికి అవసరమైన పెట్టుబడులను అందించేందుకు ఆసక్తి వ్యక్తీకరణలను గత నెలలో ఆహ్వానించగా.. నాలుగు ప్రతిపాదనలు వచ్చాయని, వాటిని పరిశీలిస్తున్నట్టు ఆర్బీఐకి పీఎమ్‌సీ బ్యాంకు సమాచారం ఇచ్చినట్లు ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ఆర్థిక పరిస్థితిని సమీక్షించిన ఆర్బీఐ బోర్డ్ ఆర్బీఐ 586వ సెంట్రల్ బోర్డ్ సమావేశం శుక్రవారం నాడు ముంబైలో జరిగింది. మహమ్మారి ప్రేరిత సవాళ్ల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న సవాళ్లు, భారత్‌పై దీని ప్రభావం, ఆర్థిక వ్యవస్థపై ఉద్దీపన, ద్రవ్య పరపతి విధాన చర్యల ఫలితాలపై గవర్నర్ నేతృత్వంలోని జరిగిన ఈ సమావేశం దృష్టి సారించింది. 2019–20లో భారత్ బ్యాంకింగ్ ధోరణి, పురోగతిపై ఒక ముసాయిదా నివేదికను కూడా చర్చించినట్లు ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి తరుణ్ బజాజ్, ఆర్థిక సేవల కార్యదర్శి దేబాషిస్ పాండా, డిప్యూటీ గవర్నర్లతోపాటు బోర్డ్ డైరెక్టర్లు, సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
కరోనా బారిన శక్తికాంత దాస్
-
వడ్డీరేట్లు యథాతథంగానే..!
న్యూఢిల్లీ: పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) తదుపరి భేటీలో వడ్డీ రేట్లను సవరించకపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆర్బీఐ ఎంపీసీ ఈ నెల 29 నుంచి మూడు రోజుల పాటు భేటీ కానుంది. అక్టోబర్ 1న ఎంపీసీ తన నిర్ణయాలను ప్రకటించనుంది. మరింత రేట్ల కోతకు అవకాశాలు ఉన్నప్పటికీ అవసరమైనప్పుడే వాటిని వినియోగిస్తామని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ఇటీవలే ఓ సందర్భంలో చెప్పారు. దీంతో తదుపరి రేట్ల కోతపై అంచనాలు ఏర్పడ్డాయి. చివరి ఎంపీసీ భేటీ ఆగస్ట్‌లో జరగ్గా.. అప్పుడు కూడా పెరుగుతున్న ద్రవ్యోల్బణం రిస్క్‌లను దృష్టిలో ఉంచుకుని యథాతథ స్థితికే మొగ్గు చూపించింది. కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ బలహీన స్థితిలో ఉందని ఆసందర్భంలో పేర్కొంది. జూలైలో రిటైల్ ద్రవ్యోల్బణం 6.73 శాతంగా ఉంటే, ఆగస్ట్‌లో అతి స్వల్పంగా తగ్గి 6.69 శాతం స్థాయిలోనే ఉంది. కానీ, ద్రవ్యోల్బణాన్ని 4 శాతం స్థాయిల్లో.. గరిష్టంగా, కనిష్టంగా 2 శాతానికి మించకుండా చూడాలన్నది ఆర్బీఐ లక్ష్యం. అంటే ప్రస్తుతద్రవ్యోల్బణం ఆర్బీఐ గరిష్ట లక్ష్యమైన 6 శాతానికి పైనే ఉండడం గమనార్హం. నిపుణుల అంచనాలు.. ‘‘యథాతథ స్థితికే ఆర్బీఐ మొగ్గు చూపించొచ్చు. అధిక ద్రవ్యోల్బణం కారణంగా ఈ విడత రేట్ల కోత ఉంటుందని నేను అయితే భావించడం లేదు’’ అని యూనియన్ బ్యాంకు ఎండీ, సీఈవో రాజ్‌కిరణ్ రాయ్ తెలిపారు. రేట్ల కోతకు అవకాశం ఉందని, అయితే, వచ్చే ఫిబ్రవరిలో అది సాధ్యపడొచ్చన్నారు. డిసెంబర్ నాటికి ఆహార ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతుందని, మంచి పంటల ఉత్పాదకత కారణంగా రేట్ల కోతకు అవకాశం ఫిబ్రవరిలో కలగొచ్చని చెప్పారు. రెపో, రివర్స్ రెపో రేట్లతో ఎటువంటి మార్పులు ఉండకపోవచ్చని.. స్థూల ఆర్థిక గణాంకాలను ఆర్బీఐ నిశితంగా పరిశీలించొచ్చని కోటక్ మహీంద్రా బ్యాంకు కన్జ్యూమర్ బ్యాంకింగ్ ప్రెసిడెంట్ శక్తిఏకాంబరం అన్నారు. ఇక్రా ప్రధాన ఆర్థికవేత్త అదితి నాయర్ కూడా ఇదే విధమైన అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘‘ద్రవ్యోల్బణం సెప్టెంబర్ నెలకు మరింత పెరగొచ్చు. తర్వాతి నెలల్లో క్రమంగా తగ్గుముఖం పడుతుంది. టోకు ద్రవ్యోల్బణం మాత్రం ప్రస్తుత స్థాయిల్లోనే కొనసాగే అవకాశం ఉంది. దీంతో ఎంపీసీ నుంచి ఎటువంటి రేట్ల నిర్ణయాలు ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నాము’’ అని అదితినాయర్ పేర్కొన్నారు. ఆర్బీఐ యథాతథ స్థితినే కొనసాగించొచ్చని, విధానంలోనూ, రెపో, సీఆర్ఆర్లోనూ ఏ విధమైన మార్పులు ఉండకపోవచ్చని కేర్ రేటింగ్స్ ముఖ్య ఆర్థికవేత్త మదన్ సబ్నవిస్ సైతం పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం అధిక స్థాయిల్లోనే ఉన్నందున వేచి చూసే ధోరణి అనుసరించొచ్చని పేర్కొన్నారు. తక్కువ స్థాయిల్లోనే కొనసాగించాలి.. ‘‘రిటైల్ ద్రవ్యోల్బణం అధిక స్థాయిల్లోనే ఉన్నందున రేట్ల కోతకు బదులు ఆర్బీఐ తన సర్దుబాటు ధోరణిని కొనసాగించాలి. వృద్ధికి మద్దతునివ్వడం కీలకం. ద్రవ్యోల్బణం మోస్తరు స్థాయికి దిగొచ్చే వరకు ఆర్బీఐ వేచి చూడాలి’’ అని సీఐఐ కోరింది. అసోచామ్ సైతం ఇదే కోరింది. కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ నెమ్మదించి, ఎన్నో సవాళ్లు నెలకొన్నందున ఆర్బీఐ వడ్డీ రేట్ల విషయంలో తన సర్దుబాటు ధోరణిని కొనసాగించాలని అసోచామ్ సెక్రటరీ జనరల్ దీపక్ సూద్ అన్నారు. మహారాష్ట్రలో స్టాంప్ డ్యూటీ చార్జీలను తగ్గించడం, డెవలపర్లు ఇస్తున్న ఉచిత తాయిలాలతో రియల్ ఎస్టేట్‌లో డిమాండ్ క్రమంగా ఏర్పడుతోందని.. ఈ క్రమంలో రానున్న పండుగల సీజన్లో కొనుగోళ్లను ప్రోత్సహించేందుకు వీలుగా రెపో రేట్లను దిగువ స్థాయిల్లోనే ఉంచాల్సిన అవసరం ఉందని అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ చైర్మన్ అనుజ్ పురి పేర్కొన్నారు. -
మరిన్ని చర్యలకు సిద్ధం
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థ రికవరీ అంత ఆశాజనకంగా ఏమీ లేదన్నారు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్. కనుక వృద్ధికి మద్దతుగా అవసరమైన అన్ని చర్యలు తీసుకునేందుకు ఆర్బీఐ సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. ఫిక్కీ నిర్వహించిన వర్చువల్ సమావేశాన్ని ఉద్దేశించి దాస్ మాట్లాడారు. కరోనా ప్రభావం ఏ స్థాయిలో ఉందో ప్రభుత్వం విడుదల చేసిన జీడీపీ గణాంకాల ఆధారంగా తెలుస్తోందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూన్ కాలంలో దేశ జీడీపీ మైనస్ 23.9%కి పడిపోయిన విషయం తెలిసిందే. ‘‘వ్యవసాయానికి సంబంధించిన సంకేతాలు ఎంతో ఆశాజనకంగానే ఉన్నప్పటికీ.. తయారీ రంగ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ), ఉపాధిలేమి పరిస్థితులు రెండో త్రైమాసికంలో (జూలై–సెప్టెంబర్) స్థిరపడతాయని కొన్ని అంచనాల ఆధారంగా తెలుస్తోంది. అదే సమయంలో కొన్ని ఇతర రంగాల్లోనూ పరిస్థితులు తేలికపడతాయి’’ అని దాస్ చెప్పారు. ఆర్థిక రికవరీ ఇంకా పూర్తి స్థాయిలో గాడిన పడలేదని.. ఇది క్రమంగా సాధ్యపడుతుందని పేర్కొన్నారు. లిక్విడిటీ, వృద్ధి, ధరల నియంత్రణకు అన్ని చర్యలను ఆర్బీఐ తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. ‘ఎన్బీఎఫ్సీ’లు బలహీనంగా.. ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టడంతోపాటు.. మధ్య కాలానికి మన్నికైన, స్థిరమైన వృద్ధిని సాధించడమే విధానపరమైన చర్యల ఉదేశమని శక్తికాంతదాస్ వివరించారు. ‘‘మార్కెట్లను చాలా జాగ్రత్తగా పర్యవేక్షిస్తూనే ఉంటాము. ఆర్బీఐ పోరాటానికి సిద్ధంగా ఉందని నేను గతంలోనే చెప్పారు. అంటే ఎప్పుడు అవసరమైతే అప్పుడు తదుపరి చర్యలు ఉంటాయి’’ అని దాస్ తెలిపారు. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ రంగం (ఎన్బీఎఫ్సీ) బలహీనంగా ఉండడం ఆందోళనకరమన్నారు. అగ్రస్థాయి 100 ఎన్బీఎఫ్సీలను ఆర్బీఐ క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తోందని.. ఏ ఒక్క పెద్ద సంస్థ కూడా వైఫల్యం చెందకూడదన్నదే తమ ఉద్దేశ్యమని తెలిపారు. డిపాజిటర్ల ప్రయోజనాలు ముఖ్యం.. డిపాజిటర్ల ప్రయోజనాలు, ఆర్థిక స్థిరత్వాన్ని దృష్టిలో ఉంచుకుని రుణ పునర్వ్యవస్థీకరణ పథకాన్ని రూపొందించామని దాస్ చెప్పారు. ఏ బ్యాంకింగ్ వ్యవస్థకు అయినా డిపాజిటర్ల ప్రయోజనాలను కాపాడడమే పరమావధిగా స్పష్టం చేశారు.