వడ్డీ భారం ఎందుకు తగ్గించట్లేదు?  | Will banks respond to RBI call for lower rates | Sakshi
Sakshi News home page

వడ్డీ భారం ఎందుకు తగ్గించట్లేదు? 

Published Fri, Feb 22 2019 4:20 AM | Last Updated on Fri, Feb 22 2019 4:20 AM

Will banks respond to RBI call for lower rates - Sakshi

ముంబై: బ్యాంకులు వడ్డీరేట్లు తగ్గించాల్సిన అవసరం ఉందని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్‌ శక్తికాంత దాస్‌ స్పష్టం చేశారు. రేటు తగ్గింపు అమల్లో జాప్యం ఎందుకని  బ్యాంకర్లను ప్రశ్నించారు. దాస్‌ గురువారం ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకర్ల చీఫ్‌లతో సమావేశమయ్యారు. రెపో   తగ్గింపు ప్రయోజనాన్ని కస్టమర్లకు బదలాయించడం, రుణ వృద్ధి వంటి అంశాలపై ఆయన బ్యాంకర్లతో చర్చించారు. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్, కొటక్‌ మహీంద్రా బ్యాంక్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ తదితర బ్యాంకుల చీఫ్‌లు ఈ సమావేశంలో పాల్గొన్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఫిబ్రవరి 7న ఆర్‌బీఐ రెపో రేటును 6.50 నుంచి 6.25 శాతానికి తగ్గించిన నేపథ్యంలో బ్యాంకర్లతో తాజాగా ఆర్‌బీఐ చీఫ్‌ సమావేశమయ్యారు. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం.. ‘‘ రేట్లును తగ్గించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం మనకు చెప్పింది. సెంట్రల్‌ బ్యాంక్‌ తన విధాన రేట్లను తగ్గించినప్పుడు కస్టమర్లకు ఈ ప్రయోజనం అందితీరాలి’’ అని గవర్నర్‌ స్పష్టం చేశారు. తమ నెలవారీ అసెట్‌ లయబిలిటీ కమిటీ సమీక్షల్లో వడ్డీరేట్ల తగ్గింపుపై దృష్టి సారించి ఒక నిర్ణయానికి వస్తామని శక్తికాంతదాస్‌కు బ్యాంకర్లు హామీ ఇచ్చినట్లు సమాచారం.   

దువ్వూరి నుంచీ ఇదే సమస్య... 
ఆర్‌బీఐ రేటు తగ్గిస్తున్నప్పటికీ, ఈ ప్రయోజనాన్ని బ్యాంకర్లు బదలాయించకపోవడంతో ప్రధానంగా పరిశ్రమ నుంచి విమర్శలను ఎదుర్కొనాల్సి వస్తోంది. నిధుల సమీకరణ వ్యయాల భారం, ఇప్పటికే ఉన్న మొండిబకాయిలు, తగ్గిపోతున్న మార్జిన్లు వంటి అంశాలను బ్యాంకులు సాకుగా చూపుతున్నాయి. గత పావుశాతం పాలసీ రేటు తగ్గింపు సందర్భంగా కూడా కేవలం రెండే బ్యాంకులు– స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్రలే రేటు తగ్గింపు నిర్ణయం తీసుకున్నాయి.

అదీ కేవలం ఐదు బేసిస్‌ పాయింట్లే (100 బేస్‌ పాయింట్లు ఒకశాతం) తగ్గించాయి. దువ్వూరి సుబ్బారావు గవర్నర్‌గా ఉన్న సమయం నుంచీ ఆర్‌బీఐ– బ్యాంకర్ల మధ్య పాలసీ రేటు బదలాయింపుపైనే వివాదం ఉంది. కేవలం ఇదే ప్రయోజనం నిమిత్తం 2013 జూలైలో దువ్వూరి బీపీఎల్‌ఆర్‌ ఆధారిత రేటు స్థానంలో బేస్‌ రేటును తీసుకువచ్చారు. అప్పటికీ ఫలితం రాకపోవడంతో తదుపరి గవర్నర్‌ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ నేతృత్వంలో ఆర్‌బీఐ 2015 ఏప్రిల్‌ నుంచి స్వల్పకాలిక నిధుల సమీకరణ వ్యయ ప్రాతిపాదికన ఎంసీఎల్‌ఆర్‌ను (మార్జినల్‌ కాస్ట బేస్డ్‌ ఫండింగ్‌) తీసుకువచ్చారు. అయినా తగిన ఫలితం రాలేదు. 

ఏప్రిల్‌ నుంచీ కొత్త రేటు విధానం? 
ప్రస్తుత నిబంధనల ప్రకారం– వడ్డీ తగ్గింపునకు ఆర్‌బీఐ కేవలం సూచనలు ఇవ్వగలదుతప్ప, ఎటువంటి ఆదేశాలూ జారీచేయలేదు. సమస్యను అధిగమించడానికి ప్రస్తుతం ఆర్‌బీఐ పరిశీలినలో ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌మార్క్‌ ఆధారిత ప్రైసింగ్‌ విధానం పరిశీలనలో ఉంది. శక్తికాంతదాస్‌ బాధ్యతలు చేపట్టడానికి ముందు ఆర్‌బీఐ గవర్నర్‌గా పనిచేసిన ఉర్జిత్‌ పటేల్‌ నుంచి ఈ విధాన ప్రతిపాదన తొలుత వచ్చింది. అయితే, దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అన్నీ బాగుంటే ఏప్రిల్‌లో కొత్త రేటు విధానం అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. 

వృద్ధి మందగమనం... ధరల స్పీడ్‌ తగ్గుదల

►రేటు కోతకు దోహదపడిన రెండు అంశాలు

►ఆర్‌బీఐ సమావేశ మినిట్స్‌లో వెల్లడి  

ముంబై: స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు మందగించడం, ధరలు తక్కువ స్థాయిలో ఉండడం.. రెండూ ఫిబ్రవరి 7వ తేదీ రెపో రేటు కోత నిర్ణయానికి దారితీశాయని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) పేర్కొంది. 4వ తేదీ నుంచి 7వ తేదీ వరకూ జరిగిన మూడు రోజుల సమావేశం సందర్భంగా కమిటీలోని ఆరుగురు సభ్యుల్లో నలుగురు రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐకి వచ్చే వడ్డీరేటు) తగ్గింపునకు ఓటు చేశారు. దీనితో ఈ రేటు 6.50 శాతం నుంచి 6.25 శాతానికి తగ్గింది. నాటి ఎంపీసీ సమావేశ మినిట్స్‌ గురువారం విడుదలయ్యాయి. ఈ  వివరాలను పరిశీలిస్తే... 

►రేటు తగ్గింపు ద్వారా వృద్ధికి ఊతం ఇవ్వవచ్చని ఆర్‌బీఐ భావించింది. ప్రస్తుతం ఈ అవసరం ఉందని గవర్నర్‌ భావించారు.  

►ప్రపంచ ఆర్థిక మందగమన పరిస్థితుల నేపథ్యంలో, ప్రైవేటు పెట్టుబడులు పెరగాల్సిన అవసరం ఉందని, అలాగే వినియోగం పటిష్టమవ్వాల్సిన పరిస్థితి ఉందని దాస్‌ తన వాదనలు   వినిపించారు.  

►వృద్ధి 7.4 శాతం ఉంటుందని ఆర్‌బీఐ పేర్కొంటుంటే, కేంద్ర గణాంకాల కార్యాలయం దీనిని 7.2 శాతంగానే  అంచనా వేస్తోంది.  ఇది వృద్ధి మందగమనానికి సంకేతం. రేటు తగ్గింపు ద్వారా వృద్ధికి ఊతం ఇచ్చే అవకాశాలు ఉన్నాయని మెజారిటీ సభ్యులు భావించారు.  

►బ్యాంకింగ్‌ వ్యవస్థలో రుణ వృద్ధి అనుకున్నంతగా లేకపోవడాన్నీ దాస్‌ ప్రస్తావించారు.  

►గవర్నర్‌ దాస్‌ సహా ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ మైఖేల్‌ పాత్ర, ఆర్‌బీఐయేతర సభ్యులు పామీ దువా, రవీంద్ర ఢోలాకియాలు రేటు కోతకు అనుకూలంగా ఓటు చేయగా, డిప్యూటీ గవర్నర్‌ విరాల్‌ ఆచార్య, ఆర్‌బీఐయేతర సభ్యులు ఛేతన్‌ ఘాటేలు రేటు కోతను వ్యతిరేకించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement