
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) కీలక మూడు రోజుల పాలసీ సమావేశం బుధవారం ప్రారంభమైంది. గవర్నర్ శక్తికాంత్‌దాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ఈ కమిటీ దేశ ఆర్థిక వ్యవస్థ, వడ్డీరేట్లపై ప్రధాన నిర్ణయాలను శుక్రవారం వెలువరించనుంది. అంతర్జాతీయంగా ఏడేళ్ల గరిష్టానికి పెరిగిన కమోడిటీ ధరలు, దేశీయంగా ధరల తీవ్రత కట్టడి ఆవశ్యకత, రూపాయి బలహీనత, ఈక్విటీ మార్కెట్ల అనిశ్చితి వంటి అంశాలు ఈ సమావేశంలో ప్రధాన అజెండాగా ఉండనున్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ధరల కట్టడికి చర్యలు తీసుకుంటూనే, వృద్ధి లక్ష్యంగా యథాతథ రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 4 శాతం)ను కొనసాగించే అవకాశాలే అధికమని మెజారిటీ ఆర్థిక వేత్తలు భావిస్తున్నారు. ఇదే జరిగితే వరుసగా ఎనిమిది ద్వైమాసిక సమావేశంలోనూ ఆర్‌బీఐ యథాతథ రేటును కొనసాగించినట్లవుతుంది. 2020 మే 22 తర్వాత ఇప్పటి వరకూ రెపో విషయంలో ఆర్‌బీఐ యథాతథ పరిస్థితినే అను సరిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment