
వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) నిర్దేశించిన 4 శాతంలోపే కొనసాగుతున్నందువల్ల వరుసగా మూడవసారి కూడా రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు– రెపో ప్రస్తుతం 6 శాతం) తగ్గే అవకాశం ఉందని ఫారిన్ బ్రోకరేజ్ సంస్థ– బ్యాంక్ ఆఫ్ అమెరికా– మెరిలించ్ (బీఓఎఫ్‌ఏ–ఎంఎల్) అంచనా వేసింది. ‘‘జూన్ 3 నుంచి 6వ తేదీ వరకూ జరిగే పాలసీ సమీక్ష సందర్భంగా మరోపావుశాతం రేటు కోత ఉంటుందని భావిస్తున్నాం’’ అని సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది.
ఇదే జరిగితే రెపో 5.75 శాతానికి దిగివస్తుంది. ఆరు నెలల్లో 75 బేసిస్ పాయింట్లు తగ్గించినట్లవుతుంది. పారిశ్రామిక వృద్ధి రేటు ఆందోళనకర స్థాయిలో పడిపోవడం (ఫిబ్రవరిలో 20 నెలల కనిష్ట స్థాయి 0.1 శాతం), రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్‌బీఐ నిర్దేశిత 4 శాతం దిగువనే (మార్చిలో 2.86 శాతం) ఉండటం వంటి అంశాలు ఆర్‌బీఐ మరోదఫా రేటు కోత అంచనాలకు ఊతం ఇస్తోంది. ఈ ఏడాది ‘‘దాదాపు సాధారణ’’ వర్షపాతం నమోదవుతుందని సోమవారం భారత వాతావరణ శాఖ పేర్కొనడం తాజా విశేషం. ఇది ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచే అంశం.
Comments
Please login to add a commentAdd a comment