Bank of America
-
అకౌంట్లో జీరో బ్యాలెన్స్.. ఖాతాదారుల గగ్గోలు
బ్యాంకులో తలెత్తిన సాంకేతిక లోపం ఖాతాదారుల గుండె ఆగిపోయినంత పనిచేసింది. ఉన్నట్టుండి అకౌంట్లలో జీరో బ్యాలెన్స్ చూపించడంతో కస్టమర్లు ఆందోళనకు గురయ్యారు. వేలాది మంది బ్యాంక్ ఆఫ్ అమెరికా ఖాతాదారులకు ఈ పరిస్థితి ఎదురైంది.బ్యాంక్ ఆఫ్ అమెరికా సేవల్లో బుధవారం మధ్యాహ్నం పెద్దఎత్తున అంతరాయం ఏర్పడింది. కస్టమర్లు తమ ఆన్లైన్ ఖాతాలను యాక్సెస్ చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తమ ఖాతాలో బ్యాలెన్స్ కనిపించడం లేదంటూ గగ్గోలు పెట్టారు. కొందరి అకౌంట్లలో జీరో బ్యాలెన్స్ కనిపించడం తీవ్ర ఆందోళనకు దారితీసింది.సాంకేతిక అంతరాయాలను ట్రాక్ చేసే ప్లాట్‌ఫామ్ డౌన్‌డెటెక్టర్‌లో దీనికి సంబంధించిన ఫిర్యాదులు వెల్లువెత్తాయి. న్యూయార్క్, లాస్ ఏంజిల్స్, శాన్ ఫ్రాన్సిస్కో, సీటెల్, డల్లాస్, ఫీనిక్స్, హ్యూస్టన్, చికాగో వంటి ప్రధాన నగరాల నుండి సమస్య గురించి ఎక్కువగా ఫిర్యాదులు వచ్చాయి. "ఖాతాలు తాత్కాలికంగా అందుబాటులో లేవు" అని కొంతమందికి, బ్యాంకింగ్ యాప్‌లోకి లాగిన్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ''కనెక్షన్ ఎర్రర్'' అని చాలా మందికి పాప్ అప్ మెసేజ్ చూపించింది.బ్యాంక్ ఆఫ్ అమెరికా అంతరాయంతో ప్రభావితమైన కస్టమర్లు తమకు తలెత్తిన ఇబ్బందులను ‘ఎక్స్’ (ట్విటర్), రెడ్డిట్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో షేర్ చేశారు. బ్యాంకు యాజమాన్యంపై ఆగ్రహం, అసంతృప్తి వ్యక్తం చేశారు. కొంతమంది కస్టమర్లు సమస్య ఎదురైనట్లు సీఎన్ఎన్ వార్త సంస్థకు ఇచ్చిన వివరణలో బ్యాంక్ ఆఫ్ అమెరికా అంగీకరించింది. సమస్యను పరిష్కరిస్తున్నామని, ఖాతాదారులకు క్షమాపణలు చెబుతున్నామని బ్యాంక్ పేర్కొంది. -
అదంతా ఇన్ఫోసిస్ చేసిందే.. ఐటీ దిగ్గజంపై క్లయింట్ నిందలు
దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ( Infosys )డేటా లీకేజీ నిందలు ఎదుర్కొంటోంది. ఇన్ఫోసిస్ కీలక క్లయింట్లలో ఒకటైన బ్యాంక్ ఆఫ్ అమెరికా ( Bank of America ) తమ 57,028 మంది కస్టమర్లను ప్రభావితం చేసిన సైబర్ దాడుల సంఘటనకు ఇన్ఫోసిస్ మెక్కామిష్ సిస్టమ్స్ ( Infosys McCamish Systems )కారణమని ఆరోపించింది. ఇన్ఫోసిస్ బీపీఎం అనుబంధ సంస్థ అయిన మెక్కామిష్ సిస్టమ్స్, గత ఏడాది నవంబర్‌లో జరిగిన సైబర్ సెక్యూరిటీ సంఘటనతో ప్రభావితమైంది. దాని ఫలితంగా నిర్దిష్ట అప్లికేషన్లు, సిస్టమ్‌లు అందుబాటులో లేకుండా పోయాయి. ఇన్ఫోసిస్ మెక్కామిష్ అనేది ప్లాట్‌ఫారమ్-ఆధారిత బీపీవో సంస్థ. ఇది జీవిత బీమా, యాన్యుటీ ఉత్పత్తులు, రిటైర్మెంట్ ప్లాన్లకు సంబంధించిన కంపెనీలకు సేవలను అందిస్తుంది. మెక్కామిష్ నిర్దిష్ట పరిశ్రమ క్లయింట్ల కోసం సాఫ్ట్వేర్లను పునఃవిక్రయిస్తుంటుంది. ఈ సంస్థను 2009లో ఇన్ఫోసిస్ బీపీఎం (గతంలో ఇన్ఫోసిస్ బీపీవో) కొనుగోలు చేసింది. "2023 నవంబర్ 3 సమయంలో ఇన్ఫోసిస్ మెక్కామిష్ సిస్టమ్స్ (IMS)లో సైబర్ దాడులు జరిగాయి. ఒక అనధికార థర్డ్ పార్టీ చొరబడి సిస్టమ్‌లను యాక్సెస్ చేసిన ఫలితంగా కొన్ని ఐఎంఎస్ అప్లికేషన్లు అందుబాటులో లేకుండా పోయాయి. బ్యాంక్ ఆఫ్ అమెరికా అందించే వ్యత్యాస పరిహారం ప్లాన్లకు సంబంధించిన డేటా ప్రభావితమై ఉండవచ్చని 2023 నవంబర్ 24న ఐఎంఎస్ తెలియజేసింది. అయితే బ్యాంక్ సిస్టమ్‌లపై ఎటువంట ప్రభావం లేదు" అని కస్టమర్లకు అందించిన నోటీసులో బ్యాంక్ ఆఫ్ అమెరికా పేర్కొంది. ఇదీ చదవండి: హడలిపోతున్న తరుణంలో చల్లటి కబురు.. ఐటీ కంపెనీల ప్లాన్ ఇదే..! -
శాండ్ విచ్ తిని, రూ. 6 లక్షల టిప్ ఇచ్చేసింది..!
అమెరికాకు చెందిన మహిళ పొరపాటున భారీ మొత్తంలో టిప్ ఇచ్చింది. ఆ తరువాత విషయం తెలిసి లబోదిబోమంది తప్పయిపోయింది నా డబ్బులు నాకు ఇప్పించండి మొర్రో అంటూ బ్యాంకును ఆశ్రయించింది. చివరికి ఏమైందంటే..! అమెరికాలోని ఇటాలియన్ సబ్ వే రెస్టారెంట్ కు వెళ్లిన కానర్ మహిళ శాండ్విచ్ (రూ. 628) ఆర్డర్ చేసింది. ఆ తరువాత బ్యాంక్ ఆఫ్ అమెరికా క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి అనుకోకుండా 7వేల డాలర్లు (రూ. 6 లక్షలకు పైగా) టిప్ ఇచ్చి వెళ్లిపోయింది. ఇది రెస్టారెంట్ సిబ్బంది తెగ సంతోషడిపోయారు. గొప్పమనసు అని పొడిగారు. కానీ ఆనక విషయం ఉసూరుమన్నారు. ఏం జరిగిందంటే కానర్ చెల్లించాల్సిన డబ్బును ఎంటర్ చేయాల్సిన చోట తన ఫోన్ నెంబర్లులోని చివరి అంకెల్ని ఎంటర్ చేసింది. దీంతో సంబంధం లేకుండానే బ్యాంక్ ఆఫ్ అమెరికా క్రెడిట్ కార్డు ట్రాన్సాక్షన్ పూర్తి అయింది. చివరికి బిల్లు చూసిన కార్నర్ గుడ్లు తేలేసింది. బ్యాంకుకు పరుగులు పెట్టింది. తన సొమ్మును తిరిగి ఇవ్వాలన్న ఆమె అభ్యర్థనను తొలుత తిరస్కరించారు. దీంతో చేసేదేమీ లేక కానర్ సబ్ వే మేనేజ్ మెంట్‌ను ఆశ్రయించింది. చివరికి పొరపాటున చెల్లించిన టిప్ మొత్తాన్ని తిరిగిచ్చేందుకు అంగీకరించింది. నెల రోజుల తరువాత క్లయింట్‌కు డబ్బును వాపసుకు అంగీకరించారని బ్యాంకు సిబ్బంది తెలిపారు. దీని బతికాను రా దేవుడా అనుకుంటూ ఊపిరి పీల్చుకుంది. -
డిసెంబర్ నాటికి నిఫ్టీ : 20,500
న్యూఢిల్లీ: ఈ ఏడాది డిసెంబర్ నాటికి నిఫ్టీ 20,500 పాయింట్లకు చేరొచ్చని అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ బ్యాంక్ ఆఫ్ అమెరికా తెలిపింది. అలాగే భారత ఈక్విటీ మార్కెట్ అవుట్‌లుక్‌ను అప్‌గ్రేడ్ చేసింది. బలమైన దేశీయ పెట్టుబడులు, అమెరికా ఆర్థిక మాంద్యం ఏర్పడకపోవచ్చనే అంచనాలు ఇందుకు కారణాలుగా చెప్పుకొచ్చింది. ఫైనాన్స్, పారిశ్రామిక, ఆటో, ఎఫ్ఎంసీజీ, ఫార్మా రంగాల లార్జ్, మిడ్ క్యాప్ షేర్లలోని ర్యాలీ దేశీయ మార్కెట్‌ను కొత్త గరిష్టాలకు తీసుకెళ్తుందని బ్రోకరేజ్ సంస్థ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఐటీ, వినిమయ, మెటల్, డిస్క్రీషనరీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవచ్చు అంటున్నారు. ‘‘ఏదైనా దిద్దుబాటు జరిగితే దేశీ, విదేశీ నిధుల రాకకు ఎలాంటి ఆటంకాలు లేకపోవడం, యూఎస్‌లో ఆర్థిక మాంద్యం తరహా పరిస్థితులు తలెత్తకపోవచ్చనే అంచనాల దృష్ట్యా డిసెంబర్ కల్లా నిఫ్టీ 20,500 స్థాయికి చేరొచ్చు. తర్వలో నిఫ్టీ వాల్యూయేషన్లు తన ధీర్ఘకాలిక సగటు 19,000 స్థాయిని అధిగమించవచ్చు. చారిత్రాత్మకంగా గమనిస్తే అమెరికా మాంద్యం ముగియడానికి కనీసం మూడు నెలల ముందు, ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు ప్రారంభానికి ఆరు నెలల ముందు నిఫ్టీ రాబడులు అధికంగా ఉన్నాయి. అలాగే నిఫ్టీ మార్కెట్ విలువలో మూడో వంతు ఇప్పటికీ దీర్ఘకాలిక సగటు కంటే తక్కువగా ఉంది. అందులో కొన్ని కంపెనీలు కొనుగోళ్లకు అవకాశం ఇస్తున్నాయి’’ అని బ్యాంక్ ఆఫ్ అమెరికా ఆర్థిక వేత్తలు తెలిపారు. క్రూడాయిల్ ధరలు పెరగడం, అస్థిరమైన రుతపవనాల ప్రభావంతో ద్రవ్యోల్బణ తారాస్థాయికి చేరుకోవడం, చైనా ఉద్దీపనలతో కమోడిటీల ర్యాలీతో స్వల్ప కాలం పాటు మార్కెట్ ప్రతికూలంగా ట్రేడవ్వొచ్చని బ్రోకరేజ్ సంస్థ వివరించింది. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలు సైతం నష్టభయానికి గురిచేస్తాయని పేర్కొంది. -
ఆర్థిక వ్యవస్థకు సవాళ్లున్నాయ్...
ముంబై: వచ్చే ఆర్థిక సంవత్సరం వృద్ధి, ద్రవ్యోల్బణం, ద్రవ్య విధాన సాధారణీకరణ, వినియోగ డిమాండ్ రూపంలో ఆర్థిక వ్యవస్థకు ఎన్నో సవాళ్లున్నట్టు బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ ఇండియా తెలిపింది. జీడీపీ 8.2 శాతం మేర వృద్ధి చెందొచ్చని, ఇంతకంటే తగ్గే రిస్క్‌లు కూడా ఉన్నట్టు పేర్కొంది. సాగు రంగం స్థిరంగా 4 శాతం మేర వృద్ధి సాధించడం, సేవల రంగం బలంగా ఉండడం వృద్ధికి మద్దతునిచ్చే అంశాలుగా తెలిపింది. స్థూల అదనపు విలువ (జీవీఏ) 2021–22లో 8.5 శాతం అంచనా నుంచి 2022–23లో 7 శాతానికి, జీడీపీ వృద్ధి 2021–22లో అంచనా 9.3 శాతం నుంచి 2022–23లో 8.2 శాతానికి తగ్గొచ్చని బ్యాంకు ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ పేర్కొంది. త్రైమాసికం వారీగా వృద్ధిలో హెచ్చుతగ్గులు ఉంటాయని నివేదికలో వివరించింది. 2022–23 మొదటి క్వార్టర్లో రెండంకెల వృద్ధి నమోదవుతుందని, నాలుగో త్రైమాసికంలో వార్షికంగా చూస్తే తక్కువ స్థాయికి చేరుతుందని అంచనా వేసింది. ప్రస్తుతం వ్యవస్థలో లిక్విడిటీ ఎక్కువగా ఉండగా.. దీన్ని సాధారణీకరించే దిశగా, ద్రవ్యోల్బణం నియంత్రణ దిశగా ఆర్బీఐ తీసుకునే చర్యలు, వినియోగ డిమాండ్‌పై పడే ప్రభావం జీడీపీ వృద్ధి అంచనాలను మరింత కిందకు తీసుకెళ్లే అంశాలుగా తెలిపింది. వినియోగంపై వడ్డీ రేట్ల ప్రభావం.. ‘‘బ్యాంకుల రుణ వితరణలో వృద్ధి 6 శాతంగా ఉంటే.. రిటైల్ రుణాలకు డిమాండ్ బలంగా 12 శాతం మేర ఉంది. మానిటరీ పాలసీ సాధారణీకరించినట్టయితే రుణ రేట్లు పెరగొచ్చు. ఇది వినియోగ డిమండ్‌ను దెబ్బతీస్తుంది’’ అని బ్యాంకు ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ ఇండియా పేర్కొంది. బలహీన రుతుపవనాల రూపంలోనూ మరో రిస్క్ ఉన్నట్టు తెలిపింది. 2022–23 సంవత్సరానికి రిటైల్ ద్రవ్యోల్బణం సగటున 5.6 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది. -
రేసు గుర్రాల్లా యూనికార్న్‌లు
ముంబై: మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఇటీవల స్టార్టప్‌లు దూకుడు చూపుతున్నాయి. అవకాశాలను అందిపుచ్చుకుంటూ పలు విభాగాలలో కంపెనీలు ఆవిర్భవిస్తున్నాయి. వెరసి దేశీయంగా స్టార్టప్‌ల హవా నెలకొంది. ఇప్పటికే బిలియన్ డాలర్ల (రూ. 7,300 కోట్లు) విలువను అందుకున్న స్టార్టప్‌లు 60కు చేరాయి. వీటిని యూనికార్న్‌లుగా వ్యవహరించే సంగతి తెలిసిందే. దేశీ స్టాక్ మార్కెట్లు బుల్ ట్రెండ్‌లో సాగుతున్నాయి. దీంతో ప్రైమరీ మార్కెట్ ఎన్నడూలేని విధంగా కళకళలాడుతోంది. ఈ బాటలో స్టార్టప్ యూనికార్న్‌లు సైతం పబ్లిక్ ఇష్యూల బాటపడుతున్నాయి. రానున్న రెండేళ్లలో 18 పెద్ద స్టార్టప్‌లు ఐపీవోలకు రానున్నట్లు వాల్‌స్ట్రీట్ బ్రోకింగ్ దిగ్గజం బ్యాంక్ ఆఫ్ అమెరికా(బీవో ఎఫ్ఏ) ఒక నివేదికలో పేర్కొంది. 12 బిలియన్ డాలర్లు... ఈ ఏడాదిలోనే దేశీయంగా 20 స్టార్టప్‌లు కొత్తగా యూనికార్న్ హోదాను అందుకున్నాయి. ఫలితంగా వీటి సంఖ్య 60ను తాకింది. స్టార్టప్‌లలో కొద్ది నెలలుగా భారీ స్థాయిలో పెట్టుబడులు తరలి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది చివరికల్లా వీటి సంఖ్య 100 మార్క్‌ను చేరవచ్చని పరిశ్రమవర్గాలు అంచనా వేస్తున్నాయి. గ్లోబల్ దిగ్గజం క్రెడిట్ స్వీస్ సైతం ఈ మార్చిలో ఇదే తరహా అంచనాలు వెలువరించడం గమనార్హం! రానున్న 24 నెలల్లో పబ్లిక్ ఇష్యూ ద్వారా నిధులను సమీకరించేందుకు దిగ్గజాలు బైజూస్, ఫ్లిప్‌కార్ట్, పేటీఎమ్, ఓలా, ఓయో తదితరాలు ప్రణాళికలు వేశాయి. అంతేకాకుండా పాలసీబజార్, పెప్పర్ఫ్రై, ఇన్మోబి, గ్రోఫర్స్, మొబిక్విక్, నైకా, ఫ్రెష్‌వర్క్స్, పైన్‌ల్యాబ్స్, ఫార్మ్ఈజీ, డెలివరీ, డ్రూమ్, ట్రాక్సన్ సైతం ఇదే బాటలో నడవనున్నాయి. తద్వారా సుమారు 18 కంపెనీలు 12 బిలియన్ డాలర్లు(రూ. 88,000 కోట్లు) వరకూ సమీకరించే యోచనలో ఉన్నట్లు బీవోఎఫ్‌ఏ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ ఎండీ గౌరవ్ సింఘాల్ తెలియజేశారు. భారీ ఇష్యూలు.. ఇప్పటికే సెబీ వద్ద పలు స్టార్టప్ దిగ్గజాలు ప్రాస్పెక్టస్ దాఖలు చేశాయి. వీటిలో పేటీఎం(రూ. 16,600 కోట్లు), ఓలా(రూ. 11,000 కోట్లు), పాలసీబజార్ (రూ. 6,000 కోట్లు), నైకా(రూ. 4,000 కోట్లు), మొబిక్విక్(రూ. 1,900 కోట్లు) ఉన్నాయి. ఇటీవల రూ. 6,300 కోట్లు సమీకరించిన జొమాటో స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయిన విషయం విదితమే. దేశీయంగా యూనికార్న్‌లు ఐపీవోలు చేపట్టడం ద్వారా సంప్రదాయ కుటుంబ బిజినెస్‌ల ట్రెండ్‌లో మార్పులను తీసుకువచ్చే వీలున్నట్లు సింఘాల్ అభిప్రాయపడ్డారు. దేశీ స్టాక్ మార్కెట్ల క్యాపిటలైజేషన్(విలువ)లో ఇంటర్నెట్ ఆధారిత కంపెనీల వాటా 1 శాతానికంటే తక్కువేనని పేర్కొన్నారు. యూఎస్ మార్కెట్లో 40 శాతం మార్కెట్ వాటాను ఇవి ఆక్రమిస్తున్నట్లు తెలియజేశారు. ప్రస్తుతం దేశీ ఈక్విటీ మార్కెట్ల విలువ రూ. 250 లక్షల కోట్లను తాకిన సంగతి తెలిసిందే. రానున్న ఐదేళ్ల కాలంలో యూనికార్న్‌ల సంఖ్య రెట్టింపుకావచ్చని అంచనా వేశారు. ఈ ఏడాది యూనికార్న్ హోదాకు చేరిన కంపెనీలలో షేర్‌చాట్, గ్రో, గప్‌షుప్, మీషో, ఫార్మ్ఈజీ, బ్లాక్‌బక్, డ్రూమ్, ఆఫ్‌బిజినెస్, క్రెడ్, మోగ్లిక్స్, జెటా, మైండ్టికిల్, బ్రౌజర్‌స్టాక్, ఆప్‌గ్రేడ్ తదితరాలున్నాయి. త్వరలో మరో 32... ఫ్యూచర్ యూనికార్న్ జాబితాలో చేరగల మరో 32 కంపెనీలను హురున్ ఇండియా తాజాగా ప్రస్తావించింది. ఇవి ఇప్పటికే 50 కోట్ల డాలర్ల విలువను అందుకున్నట్లు తెలియజేసింది. ఈ బాటలో 20 కోట్ల డాలర్ల విలువను సాధించిన మరో 54 సంస్థలు సైతం జోరు మీదున్నట్లు పేర్కొంది. భవిష్యత్‌లో యూనికార్న్‌లుగా ఆవిర్భవించగల కంపెనీల విలువను 36 బిలియన్ డాలర్లుగా అంచనా వేసింది. దేశీయంగా 60 కోట్లమంది ఇంటర్నెట్ యూజర్లున్నట్లు తెలియజేసింది. 2025కల్లా ఈ సంఖ్య 90 కోట్లను తాకనున్నట్లు వివరించింది. ప్రస్తుతం అత్యధిక యూనికార్న్‌లున్న దేశాల జాబితాలో అమెరికా(396), చైనా(277) తదుపరి మూడో ర్యాంకులో భారత్ నిలుస్తున్నట్లు పేర్కొంది. -
కరోనా 3వ వేవ్ : బ్యాంక్ ఆఫ్ అమెరికా కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: వ్యాక్సినేషన్ వేగవంతంతోనే ఎకానమీలో పురోగతి సాధ్యమని ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా పేర్కొన్నారు. రెండవ వేవ్ కేసులు తగ్గినప్పటికీ, పలు రంగాలపై దాని తీవ్ర ప్రభావం కొనసాగుతోందని అన్నారు. ఈ పరిస్థితుల్లో 2021–22 ఆర్థిక సంవత్సరం వృద్ధిపై అంచనాలను పునః సమీక్షించాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. (వృద్ధి రేటును ప్రభుత్వం 11 శాతం అంచనావేస్తుండగా, మూడీస్, ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్‌లు దాదాపు దీనికి ఒక అంకెకే పరిమితం చేస్తున్నాయి) అయితే దీర్ఘకాలంలో చూస్తే భారత్ ఆర్థిక మూలాలు పటిష్టంగా ఉన్నాయని పేర్కొన్నారు. గ్రూప్ సంస్థ– ఆల్ట్రాటెక్ సిమెంట్ వార్షిక నివేదికలో ప్రముఖ పారిశ్రామికవేత్త వివరించిన విశ్లేషణాంశాల్లో ముఖ్యమైనవి... ♦మొదటివేవ్‌తో పోల్చితే ఎకానమీకి రెండవవేవ్లో స్వల్ప నష్టం మాత్రమే సంభవించింది. వ్యాక్సినేషన్ పురోగతితో రవాణా, ఆర్థిక క్రియాశీలత మెరుగుపడుతుంది. ♦రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సరళతర ఆర్థిక విధానాలు, ప్రభుత్వ నుంచి పెరుగుతున్న మూలధన వ్యయాలు వృద్ధి రికవరీకి మద్దతునిస్తాయి. ♦దీనికితోడు ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, ఆస్తుల అమ్మకం, నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్‌లైన్ అమలు, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం, కొత్త కార్మిక చట్టం పెట్టుబడులకు తద్వారా దీర్ఘకాలంలో వృద్ధికి దోహదపడే అంశాలు. ♦ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్య వృద్ధి ధోరణి భారత్ ఎగుమతులకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది. దేశ వృద్ధి బాటలో ఇది అదనపు బలం. ♦దేశంలో ఆరోగ్య రంగానికి సంబంధించి మౌలిక సదుపాయాలు మరింత పెరగాలి. ♦అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ 2021లో ప్రపంచ వృద్ధిని 6 శాతంగా అంచనావేస్తోంది. అయితే వివిధ దేశాల్లో రెండవ, మూడవ వేవ్స్ సవాళ్లు పటిష్ట వృద్ధి అవుట్‌లుక్‌పై సందేహాలను వ్యక్తం చేస్తున్నాయి. కోవిడ్–19 విసిరిన సవాళ్ల నేపథ్యంలో వృద్ధి రికవరీ తీవ్ర ఒడిదుడుకులకు గురవుతోంది. ♦కరోనా సవాళ్లు కొనసాగినప్పటికీ, మన గ్రూప్ సంస్థల ఉద్యోగులు వ్యాపారం, కస్టమర్ సేవలపై తగిన విధమైన దృష్టి సారించారు. సిమెంట్ పరిశ్రమకు మెరుగైన అవకాశాలు ప్రభుత్వ వృద్ధి కార్యకలాపాలు తోడవడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సిమెంట్ పరిశ్రమకు మెరుగైన అవకాశాలు ఉంటాయని అల్ట్రాటెక్ సిమెంట్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా అన్నారు. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ప్రభుత్వం ఖర్చు చేయడం, మెరుగైన బడ్జెట్ కేటాయింపులతో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) వంటి సరసమైన గృహ నిర్మాణ పథకాలు సిమెంట్ పరిశ్రమ వృద్ధిని నడిపిస్తాయని వాటాదారులను ఉద్దేశించి తెలిపారు. ‘గృహ, మౌలిక సదుపాయాల రంగంతో సిమెంట్ డిమాండ్ ముడిపడి ఉంది. పరిమాణం పరంగా ఈ పరిశ్రమ వృద్ధి మార్గంలో ఉంది. ప్రభుత్వ లక్ష్యమైన 2022 నాటికి అందరికీ గృహాలు, నిర్మాణంలో ఉన్న పెద్ద మౌలిక సదుపాయాల ప్రాజెక్టులచే ఈ పరిశ్రమ ప్రేరణ పొందింది. 2020–21లో సిమెంట్ రంగం 10–12 శాతం తిరోగమన వృద్ధి నమోదు చేసింది. అయితే ఆర్థిక సంవత్సరం రెండవ అర్ధ భాగంలో త్వరగా కోలుకునే సంకేతాలను చూపించింది. గతేడాది మార్చి–ఏప్రిల్ లాక్డౌన్ అన్ని తయారీ రంగాలకు భారీ సవాళ్లను విసిరింది. మహమ్మారి ఉన్నప్పటికీ గ్రామీణ, చిన్న పట్టణాలు, రిటైల్‌లో సిమెంట్ వినియోగం బలమైన వృద్ధి కనబరిచింది’ అని ఆయన వెల్లడించారు. ఆసియా, పసిఫిక్‌లో డెల్టా భయాలు: మూడీస్ భారత్ ఎకానమీపై కోవిడ్–19 సెకండ్‌వేవ్ సవాళ్లు మరికొంతకాలం కొనసాగుతాయని సోమవారం విడుదల చేసిన ఒక నివేదికలో రేటింగ్ దిగ్గజం– మూడీస్ విశ్లేషించింది. ‘ఆసియా పసిఫిక్ ఎకనమిక్ అవుట్‌లుక్: ది డెల్టా రోడ్‌బ్లాక్’ అన్న శీర్షికన విడుదల చేసిన నివేదికలో కొన్ని ముఖ్యాంశాలను క్లుప్తంగా చూస్తే... సామాజిక దూరం అన్న అంశం ప్రస్తుత త్రైమాసికం (జూలై–ఆగస్టు–సెప్టెంబర్)పై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఇక రికవరీ ప్రారంభమయ్యేది ఈ ఏడాది చివరికేనని భావిస్తున్నాం. డెల్టా వేరియంట్ ప్రస్తుతం ఆసియా–పసిఫిక్ ప్రాంతంలో భయాందోళనలకు గురిచేస్తోంది. 2020తో పోల్చితే ఎకానమీ ఇప్పుడు కొంత తక్కువగా నష్టపోవడం కొంతలో కొంత ఊరట. భారత్ నుంచి ఎగుమతుల విలువ పెరుగుతోంది కానీ, దీనికి అధిక కమోడిటీ ధరలు, గత ఏడాది లో బేస్ ఎఫెక్ట్ కారణం. భారత్‌లో సెకండ్‌వేవ్ తగ్గుతున్నప్పటికీ, చిన్న సంస్థలు కోలుకోడానికి చాలా సమయం పడుతుంది. ఎగుమతులూ ఇప్పుడిప్పుడే నిలద్రొక్కుకుంటున్నాయి. వ్యాక్సినేషన్ మరింత వేగవంతం కావాల్సి ఉంది. 5.5 శాతం వరకూ ప్రపంచ వృద్ధి రేటు.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ (జీడీపీ) వృద్ధి రేటు 2021లో 5 నుంచి 5.5 శాతం శ్రేణిలో ఉంటుందన్నది తాజా అంచనా. ప్రపంచ వాణిజ్యం కూడా గణనీయంగా మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రపంచ పారిశ్రామిక ఉత్పత్తి కూడా పెరుగుతోంది. గ్లోబల్ సప్లై చైన్స్ యథాతథ స్థాయికి చేరుతున్నాయి. మూడవవేవ్ సవాళ్లు తీవ్రం కాకపోతే, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తిరిగి వేగంగా పురోగమిస్తుంది. 3వ వేవ్ వస్తే కష్టమే: బ్యాంక్ ఆఫ్ అమెరికా ముంబై: భారత్‌లో కోవిడ్–19 మూడవ వేవ్ సవాళ్లు తీవ్రమయితే, ఎకానమీలో సాధారణ పరిస్థితులు నెలకొనడానికి 2022 నాల్గవ త్రైమాసికం వరకూ సమయం పడుతుందని వా ల్ స్ట్రీట్ బ్రోకరేజ్ సంస్థ– బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ విశ్లేషించింది. ఈ పరిస్థితుల్లో 2022 తొలి నెలల వరకూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండి యా (ఆర్బీఐ) బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపోను యథాతథంగా 4 శాతంగానే కొనసాగించే వీలుందని వివరించింది. అప్పటికి సాధారణ పరిస్థితులు నెలకొంటే 2023 డిసెంబర్ నాటికి రెపో రేటు 5.5 శాతానికి పెరిగే అవకాశం ఉంటుందని పేర్కొం ది. మూడవ వేవ్ భయాలను పక్కనబెట్టి, ప్రస్తు త పరిస్థితు లకు అనుగుణంగా పరిశీలిస్తే, వృద్ధి, ద్రవ్యో ల్బణం లక్ష్యాల నెరవేరుతాయన్న అభిప్రాయా న్ని వ్యక్తం చేసింది. సరఫరాల సమస్యలను పరి ష్కంచడం ద్వారా రిటైల్ ద్రవ్యోల్బణం కట్టడిలో ఉంచడానికి (2 నుంచి 6 శాతం శ్రేణిలో) కేంద్రం తగిన చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నట్లు బ్యాంక్ ఆఫ్ అమెరికా నివేదిక విశ్లేషించింది. క్రూడ్ కష్టాలు... అయితే అంతర్జాతీయంగా పెరుగుదల ధోరణిలో ఉన్న క్రూడ్ ధరలు ఎకానమీకి కొంత ఇబ్బందిని సృష్టించే వీలుందని అంచనావేసింది. ‘‘తాజా పరిస్థితుల ప్రకారం 2022 రెండవ త్రైమాసికం నాటికి పాలసీ విధానం సరళతరత నుంచి తటస్థ స్థితికి చేరుకుంటుంది. 2022 జూన్‌లో లేదా ఆగస్టులో రెపో రేటు పెంపు ప్రారంభం కావచ్చు. 2023 మార్చి నాటికి 5 శాతం, 2023 డిసెంబర్ నాటికి 5.5 శాతానికి పెరిగే అవకాశం ఉంది’’ అని నివేదిక విశ్లేషించింది. -
సగటు ద్రవ్యోల్బణం 5 శాతం
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2021– 22) భారత్‌లో ద్రవ్యోల్బణం సగటున 5 శాతం స్థాయిలో ఉండొచ్చంటూ బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ అంచనా వేసింది. కాకపోతే గత అంచనా 4.7 శాతం కంటే ఇది ఎక్కువ కావడం గమనార్హం. జూన్ నెల గణాంకాలు భవిష్యత్తు అంచనాలకు కీలకమని పేర్కొంది. మే నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 6.3 శాతం స్థాయిలో ఉండడంతో ఈ బ్రోకరేజీ సంస్థ 30 బేసిస్ పాయింట్ల మేర తన అంచనాలను పెంచింది. అంతర్జాతీయంగా అధిక చమురు ధరల రూపంలో రిస్క్ ఉంటుందని అభిప్రాయపడింది. జూన్ నెలకు సంబంధించి వినియోగ ధరల ఆధారిత సూచీ (రిటైల్ ద్రవ్యోల్బణం/సీపీఐ) గణాంకాలు ఈ నెల 12న విడుదల కానున్నాయి. గత నెలకు సంబంధించి రిటైల్ ద్రవ్యోల్బణం 5.5 శాతంగా ఉండొచ్చని బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ అంచనా వేస్తోంది. కాకపోతే విశ్లేషకులు 6 శాతానికి పైనే నమోదు కావచ్చని భావిస్తున్నారు. -
ఐటీ ఉద్యోగులకు ఆటోమేషన్ గండం!
ముంబై: వివిధ రంగాల్లో.. ముఖ్యంగా టెక్నాలజీ విభాగంలో ఆటోమేషన్ వేగవంతం అవుతున్న నేపథ్యంలో దేశీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) కంపెనీలు ..భారీగా ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకునే యోచనలో ఉన్నాయి. 2022 నాటికి ఏకంగా 30 లక్షల మందికి ఉద్వాసన పలకనున్నాయి. జీతభత్యాలకు సంబంధించి కంపెనీలు ఏటా 100 బిలియన్ డాలర్ల దాకా ఆదా చేసుకునేందుకు ఇది తోడ్పడనుంది. బ్యాంక్ ఆఫ్ అమెరికా ఒక నివేదికలో ఈ అంశాలు వెల్లడించింది. దేశీ ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ లెక్కల ప్రకారం.. ప్రస్తుతం దేశీయంగా ఐటీ రంగంలో 1.6 కోట్ల మంది పైగా ఉద్యోగులు ఉన్నారు. వీరిలో సుమారు 90 లక్షల మంది తక్కువ స్థాయి నైపుణ్యాలు అవసరమైన ఉద్యోగాల్లోనూ, బీపీవో ఉద్యోగాల్లోనూ పనిచేస్తున్నారు. ఈ విభాగంలోనే ఉద్యోగుల తీసివేత ఉండనుంది. 90 లక్షల ఉద్యోగాల్లో సుమారు 30 శాతం .. అంటే 30 లక్షల కొలువులకు కత్తెర పడనుంది. ప్రధానంగా రోబో ప్రాసెస్ ఆటోమేషన్ (ఆర్పీఏ) ప్రభావమే ఇందుకు కారణం. ఆర్పీఏ కారణంగా సుమారు 7 లక్షల ఉద్యోగాలకు, ఐటీ కంపెనీలు టెక్నాలజీని అప్‌గ్రేడ్ చేసుకోవడం తదితర అంశాల మూలంగా మిగతా వాటికి కోత పడనుంది. ఆర్పీఏ వల్ల అమెరికాలో అత్యధికంగా దాదాపు 10 లక్షల కొలువులకు ముప్పు ఉంది. దేశీయంగా ఉద్యోగులపై వ్యయాలు వార్షికంగా సగటున 25,000 డాలర్లుగాను, అమెరికాలోని వారిపై వ్యయాలు 50,000 డాలర్లుగా లెక్కిస్తే.. ఉద్యోగాల్లో కోతలతో కంపెనీలు 100 బిలియన్ డాలర్ల మేర వార్షిక జీతభత్యాలు, సంబంధిత వ్యయాలు ఆదా చేసుకోనున్నాయి. టీసీఎస్, ఇన్ఫీ.. అన్నీ.. ‘‘ఆర్పీఏ అమలు ద్వారా తక్కువ నైపుణ్యాలు అవసరమైన ఉద్యోగాలకు సంబంధించి సుమారు 30 లక్షల కొలువుల్లో కోత పెట్టాలని టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్, టెక్ మహీంద్రా, కాగ్నిజెంట్‌తో పాటు ఇతర సంస్థలు యోచిస్తున్నట్లు కనిపిస్తోంది. దీనివల్ల వాటికి 100 బిలియన్ డాలర్ల మేర జీతభత్యాలు, ఇతర వ్యయాలు తగ్గుతాయి. ఆర్పీఏని విజయవంతంగా అమలు చేయగలిగితే ఐటీ కంపెనీలకు 10 బిలియన్ డాలర్ల దాకా, అలాగే కొత్త సాఫ్ట్వేర్లతో మరో 5 బిలియన్ డాలర్ల దాకా లాభించే అవకాశం ఉంది. మనుషులతో పోలిస్తే రోబోలు రోజంతా 24 గంటలూ పనిచేస్తాయి కాబట్టి కంపెనీలకు గణనీయంగా ఆదా అవుతుంది’’ అని నివేదిక పేర్కొంది. భౌతిక రోబోలు కాకుండా సాఫ్ట్వేర్ అప్లికేషన్ రూపంలో ఉండేదాన్ని ఆర్పీఏగా వ్యవహరిస్తారు. దీన్ని రోజువారీగా భారీ స్థాయిలో చేసే పనుల్లో ఉపయోగిస్తారు. దేశీ ఐటీకి ఆఫ్‌షోరింగ్ ఊతం.. అనేక సంవత్సరాలుగా విదేశీ సంస్థలు తమ ఐటీ అవసరాల కోసం భారత టెక్నాలజీ కంపెనీల వైపు చూస్తుండటంతో (ఆఫ్‌షోరింగ్) దేశీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం గణనీయంగా వృద్ధి చెందింది. 1998లో స్థూల దేశీయోత్పత్తిలో దీని వాటా 1 శాతంగా ఉండగా.. ప్రస్తుతం ఇది 7 శాతానికి చేరింది. ఆర్థిక వ్యవస్థకు అత్యంత వ్యూహాత్మకంగా ఎదిగింది. అయితే, గతంలో తమ కార్యకలాపాలను ఆఫ్‌షోర్ చేసిన చాలా మటుకు దేశాలు తమ స్వదేశాల్లో ఉద్యోగాల కల్పనపై ప్రస్తుతం దృష్టి పెడుతున్నాయి. నివేదిక ప్రకారం.. సంపన్న దేశాలు కూడా విదేశాలకు అవుట్సోర్స్ చేసిన ఐటీ ఉద్యోగాలను స్వదేశానికి తరలించడం లేదా స్థానిక ఐటీ ఉద్యోగులను ఉపయోగించుకోవడం లేదా ఆర్పీఏ వంటి విధానాల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. తద్వారా తమ డిజిటల్ సరఫరా వ్యవస్థను, దేశీయ టెక్నాలజీ ఇన్ఫ్రా రంగాన్ని భవిష్యత్‌లో సురక్షితంగా ఉంచుకోవాలని అవి భావిస్తున్నాయి. భారీ స్థాయిలో ఆటోమేషన్ అయినప్పటికీ.. జర్మనీ (26శాతం), చైనా (7శాతం), భారత్ (5శాతం), కొరియా, బ్రెజిల్, థాయ్‌ల్యాండ్, మలేషియా, రష్యా వంటి పెద్ద దేశాల్లో కార్మికుల కొరత ఏర్పడే అవకాశం ఉందని నివేదిక హెచ్చరించింది. అయితే, దీనికి విరుద్ధంగా దక్షిణాఫ్రికా, గ్రీస్, ఇండొనేíÙయా, ఫిలిప్పీన్స్ వంటి దేశాల్లో వచ్చే 15 ఏళ్ల పాటు కార్మికుల లభ్యత అధిక స్థాయిలో ఉంటుందని పేర్కొంది. చదవండి: నెలకు లక్షల ఆర్డర్లు, 4 వేల కోట్లు ఇన్వెస్ట్ చేసిన ఈకామర్స్ సంస్థ -
బ్యాంక్ ఆఫ్ అమెరికా: నియామకాల జోరు
సాక్షి,ముంబై: కోవిడ్-19 కాలంలోనూ దేశంలో 3,000 కొత్త నియామకాలు చేపట్టినట్టు బ్యాంక్ ఆఫ్ అమెరికా (బీఓఎఫ్ఏ) తెలిపింది. గందరగోళ పరిస్థితులు ఉన్నప్పటికీ వృద్ధి చెందగల సామర్థ్యం ఉందని భారత్ తన సత్తాను ప్రపంచానికి చాటిందని సంస్థ కంట్రీ హెడ్ కాకు నఖటే అన్నారు. (టెక్ జాబ్స్‌లో తగ్గని జోష్!) ‘భారత్‌లో చాలా ఎక్కువ మందిని తీసుకున్నాం. ఇతర ఎంఎన్‌సీలు సైతం ఇదే మాదిరిగా నియామకాలు జరిపాయి. ఖర్చు తక్కువ కావడంతో బ్యాక్ ఆఫీస్ పనుల కోసం భారత్‌లో ఉద్యోగులను ఈ కంపెనీలు రంగంలోకి దింపాయి. మహమ్మారి సమయంలో యూఎస్‌లో రిటైల్, చిన్న వ్యాపార రుణాల్లో పెరుగుదల నమోదైంది. ఈ రుణాలు భారత్‌కు చేరాయి. ఇక్కడి కంపెనీల్లో 47 బిలియన్ డాలర్లకుపైగా నిధులను అందించి ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్ కీలక పాత్ర పోషించాయి’ అని వివరించారు. ముంబై, హైదరాబాద్, గురుగ్రాం, చెన్నై, గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఉన్న బ్యాంక్ ఆఫ్ అమెరికాకు చెందిన గ్లోబల్ బిజినెస్ సెంటర్స్‌లో 23,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. -
దశాబ్దంలో మూడో అతిపెద్ద ఎకానమీగా భారత్
ముంబై: భారత్ ఆర్థిక వ్యవస్థ 2031-32 ఆర్థిక సంవత్సరం నాటికి ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవిస్తుందని బ్యాంక్ ఆఫ్ అమెరికా(బీఓఏ) సెక్యూరిటీస్ తన తాజా నివేదికలో పేర్కొంది. నిజానికి 2028-29 ఆర్థిక సంవత్సరం నాటికే భారత్ ఈ స్థాయిని అందుకోవాల్సి ఉన్నప్పటికీ, కరోనా ప్రతికూలతలు భారత్ వృద్ధి వేగాన్ని అడ్డగించాయని వివరించింది. యువత అధికంగా ఉండడం, ఫైనాన్షియల్ మార్కెట్లలో పరిపక్వత భారత్ ఆర్థిక వ్యవస్థకు సానుకూలతలని నివేదిక వివరించింది. గడచిన ఎనిమిది సంవత్సరాల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) సమర్థవంతమైన స్థాయిలో విదేశీ మారకద్రవ్య నిల్వలను(ప్రస్తుతం దాదాపు 550 బిలియన్ డాలర్లు) నిర్వహిస్తోందని, రూపాయి స్థిరత్వానికి, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి ధోరణుల నుంచి భారత్‌ను రక్షించడానికి ఈ చర్య దోహదపడుతుందని బ్యాంక్ ఆఫ్ అమెరికా విశ్లేషించింది. ఇక భారత్ బ్యాంకింగ్ మొండి బకాయిల సమస్య పరిష్కారంలో ‘బ్యాడ్ బ్యాంక్’ ఏర్పాటు ఆలోచన మంచి ఫలితాలను అందిస్తుందని వివరించింది. అయితే తీవ్ర స్థాయిలో ఉన్న క్రూడ్ ఆయిల్ ధరలు ఆర్థిక వ్యవస్థకు ఆందోళన కరమైన అంశంగా పేర్కొంది. 2024-25 నాటికి ఐదు ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరుకోవాలన్నది భారత్ లక్ష్యం. ఇప్పటి స్థానాలు ఇవీ... ప్రస్తుతం అమెరికా, చైనాలు (వరుసగా దాదాపు 16, 10 ట్రిలియన్ డాలర్లు) ప్రపంచ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో మొదటి రెండవ స్థానాల్లో ఉండగా, జపాన్ ఆర్థిక వ్యవస్థ మూడవ స్థానంలో ఉంది. జర్మనీ, భారత్‌లు నాలుగు, ఐదు స్థానాల్లో నిలుస్తున్నాయి. 2019-20లో భారత్ ఆర్థిక వ్యవస్థ పరిమాణం 2.65 ట్రిలియన్ డాలర్లుకాగా, 2020లో జపాన్ ఆర్థిక వ్యవస్థ పరిమాణం 4.87 ట్రిలియన్ డాలర్లు. జర్మనీ ఆర్థిక వ్యవస్థ పరిమాణం దాదాపు 3.8 ట్రిలియన్ డాలర్లు. చదవండి: కరోనా కాలంలో కొత్త కంపెనీల జోరు -
రూపాయికి ఆర్బిఐ బూస్ట్
ముంబై: భారత్ రూపాయి పటిష్టానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మార్చి నాటికి మరో 20 బిలియన్ డాలర్ల వ్యయం చేసే అవకాశం ఉందని వాల్‌స్ట్రీట్ బ్రోకరేజ్ బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ తన తాజా నివేదికలో పేర్కొంది. నివేదిక విడుదల సందర్భంగా బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ ఇండియా ఎకనమిస్టులు ఇంద్రనిల్ సేన్ గుప్తా, ఆస్తా గోద్వానీ తెలిపిన సమాచారం ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020 ఏప్రిల్– 2021 మార్చి) ఇప్పటి వరకూ ఆర్బీఐ తన ‘ఫారెక్స్ ఇంటర్వెన్షన్’ ద్వారా రూపాయి బలోపేతానికి 73.7 బిలియన్ డాలర్లు వెచ్చించింది. మార్చి నాటికి మరో 20 బిలియన్ డాలర్ల వ్యయం చేసే అవకాశం ఉంది. ఫారెక్స్ నిల్వలు మరింత పెరిగే చాన్స్! ఇక భారత్ విదేశీ మారకద్రవ్య నిల్వలను పెంచుకోవడంపై కూడా ఆర్బీఐ దృష్టి సారిస్తుంది. జనవరి 15వ తేదీ ముగిసిన వారంలో భారత్ విదేశీ మారకద్రవ్య నిల్వలు 586.1 బిలియన్ డాలర్లకు ఎగశాయి. ఇది లైఫ్‌టైమ్ హై కావడం గమనార్హం. దాదాపు 13 నెలల దిగుమతులకు ఈ నిధులు సరిపోతాయని అంచనా. జూన్ 5తో ముగిసిన వారంలో మొట్టమొదటిసారి భారత్ ఫారెక్స్ నిల్వలు అర ట్రిలియన్ మార్క్దాటి 501.70 బిలియన్ డాలర్లకు చేరాయి. అటు తర్వాత కొంచెం ఒడిదుడుకులు ఉన్నప్పటికీ, నిల్వలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. దిగుమతులకు సంబంధించి వ్యయాలు తగ్గడం ఫారెక్స్ నిల్వలు పెరగడానికి కారణాల్లో ఒకటి. రూపాయి @ 73.28 మరోవైపు ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ సోమవారం 21 పైసలు బలహీనపడి 73.28 వద్ద ముగిసింది. బలహీన ఈక్విటీ మార్కెట్, అంతర్జాతీయంగా డాలర్ బలోపేత ధోరణి దీనికి నేపథ్యం. సోమవారం ట్రేడింగ్ సెషన్లో రూపాయి 73.30 గరిష్ట–73.18 కనిష్ట స్థాయిల మధ్య కదలాడింది. శుక్రవారం రూపాయి ముగింపు 73.07. ఇక అంతర్జాతీయంగా చూస్తే, ఈ వార్తరాసే రాత్రి 10 గంటల సమయంలో ఆరు కరెన్సీ విలువల (యూరో, స్విస్ ఫ్రాంక్, జపనీస్ యన్, కెనడియన్ డాలర్, బ్రిటన్ పౌండ్, స్వీడిష్ క్రోనా) ప్రాతిపదకన లెక్కించే డాలర్ ఇండెక్స్ స్వల్ప పురోగతిలో 90.74 వద్ద ట్రేడవుతోంది (52 వారాల గరిష్టం 103.96. కనిష్టం 89.16). ఇక ఇదే సమయంలో రూపాయి విలువ స్వల్ప నష్టాల్లో 73.18 వద్ద ట్రేడవుతోంది. దేశీయంగా రూపాయికి ఇప్పటి వరకూ ఇంట్రాడే కనిష్ట స్థాయి 76.92 (2020, ఏప్రిల్ 22వ తేదీ). ముగింపులో రికార్డు పతనం 76.87 (2020, ఏప్రిల్ 16వ తేదీ). 2021–22లో 45 బిలియన్ డాలర్లు వెచ్చించే వీలు... కాగా, దేశంలోకి వచ్చీ–పోయే మొత్తం విదేశీ మారకద్రవ్యం మధ్య నికర వ్యత్యాసం– కరెంట్ అకౌంట్ లోటు (సీఏడీ) స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 0.5 శాతంగా ఉన్న పక్షంలో 2021–22లో రూపాయి పటిష్టతకు 45 బిలియన్ డాలర్లను వెచ్చించే అవకాశం ఉందని కూడా బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ ఎకనమిస్టులు అభిప్రాయపడ్డారు. అయితే ఇందుకు క్రూడ్ ధరలు సగటున బ్యారల్‌కు 50 డాలర్లు ఉండాల్సిన అవసరం ఉందని కూడా వారు అంచనావేశారు. 2008, 2013, 2018ల్లో రూపాయి విలువలో చోటుచేసుకున్న బలహీనతను తిరిగి చోటుచేసుకోకుండా ఆర్బీఐ తగిన అన్ని చర్యలూ తీసుకుంటుందని గత శనివారం నానీ పాల్కీవాలా సంస్మరణ సభలో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ పేర్కొన్న నేపథ్యంలో బ్యాంక్ ఆఫ్ అమెరికా తాజా నివేదిక విడుదల చేయడం గమనార్హం. డాలర్ బలహీనత కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్బీఐ ఫారెక్స్ కొనుగోలును కొనసాగిస్తుందని, తద్వారా రూపాయి బలహీనపడకుండా చూస్తుందని విశ్వసిస్తున్నట్లు నివేదిక తెలిపింది. డాలర్ మారకంలో రూపాయి విలువ డిసెంబర్ నాటికి సగటున 70.5 గా ఉంటుందని భావిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. -
ఖాతాలో కోట్లు : కంగుతిన్న కస్టమర్
అమెరికాలో ప్రసిద్ధి చెందిన సిటీ గ్రూప్ పొరపాటున 900 మిలియన్ల డాలర్లను వినియోగదారుల ఖాతాల్లోకి తరలించిన ఉదంతాన్ని మర్చిపోకముందే మరో దిగ్గజ బ్యాంకులో జరిగిన ఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. మసాచుసెట్స్‌లోని బ్యాంక్ ఆఫ్ అమెరికా కార్పొరేషన్ కస్టమర్ ఖాతాలో ఇంకా పెద్ద నగదు దర్శనమివ్వడం కలకలం రేపింది. అంతేకాదు బ్యాంకు ఎంతకీ ఈ విషయాన్ని గమనించక పోవడంతో సదరు కస్టమర్ స్వయంగా బ్యాంకును సంప్రదించడంతో సమస్య పరిష్కారమైంది. బ్యాంక్ ఆఫ్ అమెరికా వినియోగదారుడు, సైకియాట్రిస్ట్ బ్లేజ్ అగ్యురేకి ఈ వింత అనుభవం ఎదురైంది. తన ఖాతాలో ఎన్నడూ లేనంతగా 2.45 బిలియన్ డాలర్లు (సుమారు182 కోట్ల రూపాయలు) చూసి ఖంగుతిన్నాడు. మొబైల్, వెబ్ లో పరిశీలించి ఖాతాలో సొమ్మును ఒకటికి రెండుసార్లు తనిఖీ చేసుకుకున్నాడు. బ్యాంకు ఈ విషయాన్ని గుర్తిస్తుందని బ్లేజ్ ఎదురు చూశాడు. అయినా ఫలితం లేకపోవడంతో చివరికి బ్యాంకు రిలేషన్షిప్ మేనేజర్‌ను సంప్రదించి సమస్యను పరిష్కరించుకునే దాకా అతని కంటి మీద కునుకు పట్టలేదు. అయితే జస్ట్ ఇది..డిస్ ప్లే సమస్య తప్ప మరేమీ కాదని బ్యాంక్ ఆఫ్ అమెరికా ప్రతినిధి బిల్ హాల్డిన్ తేల్చిపారేశారు. ఈ పొరపాటును సరిదిద్దినట్టు ప్రకటించారు. మరోవైపు బ్యాంక్ ఆఫ్ అమెరికాలో ఇలాంటి తప్పిదాలు జరగడం ఇదే మొదటిసారికాదు. ఈ నెల ప్రారంభంలో కొంతమంది ఆన్లైన్ మొబైల్-బ్యాంకింగ్ ఖాతాదారులు బ్యాలెన్స్‌లు సరిపోలక ఆందోళన చెందారు. దీంతో ప్రపంచ బ్యాంకింగ్ వ్యవస్థ నిర్వహణ, సమగ్రతపై కస్టమర్ల నమ్మకాన్ని దెబ్బ తీస్తుందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా కాస్మెటిక్ దిగ్గజం రెవ్లాన్ సంస్థ అడ్మినిస్ట్రేటివ్ ఏజెంట్‌గా ఉన్న సిటీ గ్రూపు రుణదాతలకు పొరపాటున భారీ ఎత్తున చెల్లింపులు చేసిన సంగతి తెలిసిందే. -
చమురు ధరల పతనం భారత్‌కు వరం
న్యూఢిల్లీ: చమురు ధరల పతనం భారత ఆర్థిక వ్యవస్థకు ఎన్నో విధాలుగా కలిసొస్తుందని కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్, బ్యాంకు ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ అభిప్రాయం వ్యక్తం చేశాయి. దేశ చమురు అవసరాల్లో 84 శాతం మేర దిగుమతి చేసుకుంటున్న నేపథ్యంలో.. చమురు దిగుమతుల బిల్లు తగ్గడంతో కరెంటు ఖాతా లోటు (క్యాడ్), ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు తగ్గుముఖం పడతాయని, దీంతో అధిక జీడీపీ వృద్ధి రేటు సాధ్యపడుతుందని కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ అంచనా వేసింది. ధరల స్థిరత్వానికి వీలుగా ఉత్పత్తికి కోత విధించే విషయంలో రష్యా, సౌదీ అరేబియా మధ్య విభేదాలు తలెత్తడంతో.. సౌదీ అరేబియా ఏకపక్షంగా ధరలను తగ్గించడం ఫలితంగా బ్యారెల్ చమురు 30 డాలర్లకు పడిపోయిన విషయం గమనార్హం. ఇక అదే సమయంలో ఓపెక్ దేశాలకు, రష్యా తదితర నాన్ ఓపెక్ దేశాల మధ్య ఉత్పత్తి కోతకు సంబంధించిన అంగీకార గడువు మార్చిలో గడువు తీరిపోనుంది. దీంతో రోజువారీ ఉత్పత్తి 10 మిలియన్ బ్యారెళ్లకు చేరుతుందని అనలిస్టులు భావిస్తున్నారు. ముఖ్యంగా కరోనా వైరస్ ప్రభావంతో ప్రనపంచవ్యాప్తంగా చమురుకు డిమాండ్ తగ్గుతుండడం కూడా ధరలపై ప్రభావం చూపిస్తోంది. ‘‘చమురు ధర బ్యారెల్‌పై ప్రతీ 10 డాలర్ల పతనంతో 15 బిలియన్ డాలర్లు ఆదా అవుతుంది. ఇది జీడీపీలో క్యాడ్ 50 బేసిస్ పాయింట్ల మేర తగ్గేలా చేస్తుంది’’ అని కోటక్ తన నివేదికలో పేర్కొంది. దేశం నుంచి జరిగే ఎగుమతుల విలువ కంటే దిగుమతుల విలువ ఎక్కువగా ఉండడాన్ని క్యాడ్‌గా పేర్కొంటారు. ఈ రంగాలకు మేలు చమురు ధరలు తగ్గడం ఆటోమొబైల్స్, విమానయానం, రంగుల పరిశ్రమ, కన్జ్యూమర్ కంపెనీలు, సిటీ గ్యాస్ పంపిణీ సంస్థలు, చమురు విక్రయ సంస్థలకు కలసిసొస్తుందని కోటక్ తెలిపింది. కానీ, చమురు బ్యారెల్‌కు 35 డాలర్లకు దిగువన ఉంటే ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియాకు నికర నష్టాలు ఎదురవుతాయని అంచనా వేసింది. క్యాడ్ 0.7 శాతానికి తగ్గుతుంది చమురు ధరల పతనంతో 2020–21 ఆర్థిక సంవత్సరంలో కరెంటు ఖాతా లోటు 25 బేసిస్ పాయింట్లు తగ్గి జీడీపీలో 0.7 శాతానికి పరిమితం అవుతుందని బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ అంచనా వేసింది. కరోనా వైరస్ జనవరిలో వెలుగు చూసిన తర్వాత నుంచి చమురు ధరలు 45 శాతం వరకు క్షీణించాయి. 2020–21 ఆర్థిక సంవత్సరానికి భారత జీడీపీ వృద్ధి రేటు అంచనాలను 0.20 శాతం తగ్గించి 5.4 శాతానికి సవరించింది. ప్రపంచ వృద్ధి రేటు అంచనాలకు 0.60 శాతం కోత పెట్టి తాజాగా 2.2 శాతంగా ఉండొచ్చని పేర్కొంది. ఒకవేళ అంతర్జాతీయ మాంద్యం ఏర్పడితే ప్రపంచ వృద్ధి రేటు 1.4 శాతానికి, భారత జీడీపీ వృద్ధి రేటు 4.4 శాతానికి తగ్గొచ్చని బ్యాంకు ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ అభిప్రాయపడింది. -
వరుసగా మూడవదఫా రేటు కోత: బ్యాంక్ ఆఫ్ అమెరికా
వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిర్దేశించిన 4 శాతంలోపే కొనసాగుతున్నందువల్ల వరుసగా మూడవసారి కూడా రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– రెపో ప్రస్తుతం 6 శాతం) తగ్గే అవకాశం ఉందని ఫారిన్ బ్రోకరేజ్ సంస్థ– బ్యాంక్ ఆఫ్ అమెరికా– మెరిలించ్ (బీఓఎఫ్ఏ–ఎంఎల్) అంచనా వేసింది. ‘‘జూన్ 3 నుంచి 6వ తేదీ వరకూ జరిగే పాలసీ సమీక్ష సందర్భంగా మరోపావుశాతం రేటు కోత ఉంటుందని భావిస్తున్నాం’’ అని సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇదే జరిగితే రెపో 5.75 శాతానికి దిగివస్తుంది. ఆరు నెలల్లో 75 బేసిస్ పాయింట్లు తగ్గించినట్లవుతుంది. పారిశ్రామిక వృద్ధి రేటు ఆందోళనకర స్థాయిలో పడిపోవడం (ఫిబ్రవరిలో 20 నెలల కనిష్ట స్థాయి 0.1 శాతం), రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్బీఐ నిర్దేశిత 4 శాతం దిగువనే (మార్చిలో 2.86 శాతం) ఉండటం వంటి అంశాలు ఆర్బీఐ మరోదఫా రేటు కోత అంచనాలకు ఊతం ఇస్తోంది. ఈ ఏడాది ‘‘దాదాపు సాధారణ’’ వర్షపాతం నమోదవుతుందని సోమవారం భారత వాతావరణ శాఖ పేర్కొనడం తాజా విశేషం. ఇది ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచే అంశం. -
అరుదైన డెంగ్యూతో బ్యాంక్ ఎండీ మృతి
సాక్షి, ముంబై: డెంగ్యూ జ్వరం బ్యాంక్ ఆఫ్ అమెరికా ఎండీని బలితీసుకుంది. అరుదైన డెంగ్యూ-లింక్డ్ సిండ్రోమ్‌తో బ్యాంక్ ఆఫ్ అమెరికా (బీఓఏ) ఎండీ సంజీవ్ ఝా ముంబై లీలావతి ఆసుపత్రిలో కన్నుమూశారు. బ్యాంక్ ఆఫ్ అమెరికా గ్లోబల్ క్యాపిటల్ మార్కెట్ ఎండీ సంజీవ్ ఝా (34) ముంబై లీలావతి ఆసుపత్రిలో అరుదైన రుగ్మతతో చికిత్స పొందుతూ అధిపతి మంగళవారం మరణించారు. కొన్ని రోజుల అనారోగ్యం తరువాత, ఝాను ఆగష్టు 29న బాంద్రా ఆసుపత్రిలో చేర్చారు. దాదాపు ఏడు రోజుల తరువాత అతనికి అరుదైన హెచ్ఎల్హెచ్ సోకినట్టు గుర్తించారు. డెంగ్యూ జ్వరం మరింత ముదిరి, కాలేయంలో తెల్లరక్త కణాలు అసాధారణంగా పెరగడంతో ఇతర రక్తకణాలను నాశనం చేశాయి. దీంతో శరీరంలోని వివిధ అవయవాలు ప్రభావిత మయ్యాయి. ముఖ్యంగా కిడ్నీలు, లివర్ బాగా పాడైపోవడంతో ఆయన చనిపోయారని సీనియర్ వైద్యులు డా. సీసీ నయ్యర్ తెలిపారు. అయితే ప్లేట్లెట్స్ , రక్తమార్పిడి కారణంగా ఝా పరిస్థితి క్షీణించిందనీ కుటుంబ సభ్యులు, ఇతర స్నేహితులు చెప్పారు. -
బ్యాంకింగ్ నుంచి పావుశాతం రేటు కోత
బ్యాంక్ ఆఫ్ అమెరికా అంచనా న్యూఢిల్లీ: భారత్ బ్యాంకింగ్ తానిచ్చే రుణాలపై వడ్డీరేటును పావుశాతం వరకూ తగ్గించే వీలుందని బ్యాంక్ ఆఫ్ అమెరికా– మెరిలించ్ (బీవోఏఎంఎల్) అంచనా వేసింది. ఇండస్ట్రియల్ బిజీ సీజన్– అక్టోబర్ నెల ప్రారంభం అయ్యేనాటికే ఈ నిర్ణయం తీసుకునే వీలుందని వివరించింది. రుణ వృద్ధికి ఇది దోహ దపడుతుందని అంచనావేసింది. ఆర్బీఐ బ్యాంకులకు తానిచ్చే రుణ రేటు– రెపోను ఆగస్టు 2వ తేదీన 6.25 శాతం నుంచి 6 శాతానికి తగ్గించిన నేపథ్యంలో అంతర్జాతీయ బ్యాంకింగ్ సేవల దిగ్గజం– ఈ అంశంపై తాజా నివేదికను ఆవిష్కరించింది. బ్యాంకింగ్ తనకు రెపో ద్వారా అందిన రేటు ప్రయోజనాన్ని ఆటో, గృహ నిర్మాణ రంగాలకే కాకుండా మిగిలిన రంగాలకూ అందించాల్సిన అవసరం ఉందని పాలసీ సమీక్ష సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ చేసిన వ్యాఖ్యలను సైతం నివేదిక ఈ సందర్భంగా ప్రస్తావించింది. అదే విధంగా డీమోనిటైజేషన్ నేపథ్యంలో బ్యాంకింగ్ వద్ద భారీ నగదు లభ్యత (లిక్విడిటీ) ఉండడాన్నీ ఉటంకించింది. మరికొంతకాలం ద్రవ్యోల్బణం దిగువస్థాయిలోనే కొనసాగే వీలుందని పేర్కొంది. జూలై రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 2 శాతంగా అంచనా వేసింది. ఇక డిసెంబర్ పాలసీ సమీక్షలో ఆర్బీఐ రెపోను మరోశాతం తగ్గించే వీలుందని పేర్కొంది. -
ఇలాంటివి చాలా చూశాం!
‘ఎన్పీఏ’ తాజా నిబంధనలపై మూడీస్ వ్యాఖ్య వసూళ్లకు సుదీర్ఘ సమయం పట్టేస్తుందని వెల్లడి ముంబై: మొండిబకాయిల సమస్య పరిష్కారానికి ఉద్దేశించి తాజాగా ప్రతిపాదించిన చర్యల్లో కొత్తదనమేమీ లేదని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ వ్యాఖ్యానించింది. ఇవన్నీ కూడా గతంలో చూసినవేనని పేర్కొంది. మూలధనాన్ని సమీకరించుకోవడంలో బ్యాంకులకు ఎదురవుతున్న సమస్యలను పరిగణనలోకి తీసుకోలేదని... ఫలితంగా మొండిబకాయిలను రాబట్టుకునే ప్రక్రియకు చాలా సమయం పట్టేస్తుందని మూడీస్ ఒక నివేదికలో తెలిపింది. ‘ప్రభుత్వ రంగ బ్యాంకులు తగిన మూలధనం లేక వాస్తవ స్థాయిలో నికర నిరర్ధక ఆస్తులను (ఎన్పీఏ) రైటాఫ్ చేయలేక సతమతమవుతున్నాయి. కొత్త నిబంధనలు ఈ అంశంపై దృష్టి సారించలేదు. దీంతో ఎన్పీఏల పరిష్కారానికి సుదీర్ఘ సమయం పట్టేస్తుంది‘ అని వివరించింది. అయితే, నిరర్ధక ఆస్తుల పరిష్కార యంత్రాంగాన్ని పటిష్టం చేసేందుకు ఈ చర్యలు దోహదపడగలవని, రుణపరపతి పరంగా సానుకూలమైనవని పేర్కొంది. మొండి బాకీలను బ్యాంకులు తమంతట తాము రాబట్టుకోలేని పక్షంలో తగు చర్యల గురించి ఆదేశించేలా రిజర్వ్ బ్యాంక్‌కు అధికారాలు లభించేలా బ్యాంకింగ్ రంగ నియంత్రణ చట్టాలను సవరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మూడీస్ నివేదిక ప్రాధాన్యం సంతరించుకుంది. సుమారు రూ. 6 లక్షల కోట్ల ఎన్‌పీఏల్లో 70 శాతం పైగా... అంటే రూ.4.2 లక్షల కోట్లవరకూ 40–50 పెద్ద ఖాతాల వద్దే ఇరుక్కుపోయింది. ఈ నేపథ్యంలో కొత్తగా ప్రతిపాదించిన చర్యల ప్రకారం.. బ్యాంకులు వీటిపై దృష్టి సారించే అవకాశం ఉందని బ్యాంక్ ఆఫ్ అమెరికా– మెరిల్ లించ్ పేర్కొంది. -
భారత్ వృద్ధిరేటుకు ఐఎంఎఫ్ కోత
7.6% నుంచి 6.6%కి తగ్గింపు • నోట్ల రద్దు్ద కారణమని విశ్లేషణ • ద్రవ్యలోటు కట్టుతప్పుతుందన్న మూడీస్, బ్యాంక్ ఆఫ్ అమెరికా • క్యాడ్ పెరుగుతుందన్న నోముర వాషింగ్టన్, న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు, ఫిబ్రవరి 1 వార్షిక బడ్జెట్ నేపథ్యంలో భారత్ ఆర్థిక పరిస్థితి, ద్రవ్యలోటు, కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) వంటి స్థూల ఆర్థిక అంశాలపై అంచనాలు వెలువడుతున్నాయి. పెద్దనోట్ల రద్దు వల్ల తాత్కాలికంగా వినియోగం తగ్గుతుందని, దీనితో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2015–16) వృద్ధి రేటు 6.6 శాతానికి పడిపోతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అంచనావేసింది. ఇంతక్రితం ఈ అంచనా 7.6 శాతంగా ఉంది. ప్రపంచబ్యాంక్ కూడా వృద్ధి అంచనాను 7.6 శాతం నుంచి 7 శాతానికి తగ్గించింది. ఇక భారీ వృద్ధి, వ్యయాలు లక్ష్యంగా ఉండడం వల్ల వచ్చే ఆర్థిక సంవత్సరం (2017–18) ద్రవ్యలోటు లక్ష్యం నుంచి కేంద్రం పక్కకు తప్పుకునే అవకాశం ఉందని అంతర్జాతీయ ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ మూడీస్, ఆర్థిక సేవల దిగ్గజం బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిలించ్ అంచనా వేశాయి. నోట్ల రద్దు వల్ల కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) పెరిగే అవకాశం ఉందని జపాన్ బ్రోకరేజ్ సంస్థ నోమురా అభిప్రాయపడుతోంది. వివరాలు.., ప్రపంచవృద్ధి 3.1 శాతం: ఐఎంఎఫ్ 2016లో పలు ఆర్థిక వ్యవస్థల్లో ఉన్న తాత్కాలిక మందగమన ధోరణి 2017, 2018లో తిరిగి పుంజుకునే వీలుంది. 2016లో ప్రపంచ వృద్ధి 3.1 శాతంగా ఉంటుందని భావిస్తున్నాం. 2017,18 సంవత్సరాల్లో ఈ రేటు వరుసగా 3.4 శాతం, 3.6 శాతాలుగా ఉండొచ్చు. అయితే 2016కు సంబంధించి చైనా వృద్ధి రేటు అంచనాలను స్వల్పంగా 6.6 శాతం నుంచి 6.7 శాతానికి పెరిగే వీలుంది. అయితే ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా మాత్రం భారత్ కొనసాగుతుంది. 2018లో భారత్ వృద్ధి రేటు 7.7 శాతంగా ఉంటే, చైనా వృద్ధి రేటు 6 శాతంగా ఉంటుంది. వాణిజ్య అంశాలకు సంబంధించి రక్షణాత్మక విధానాలు కొంత ఒత్తిడులను సృష్టించే వీలుంది. ద్రవ్యలోటు 3.5 శాతం: బీఓఎఫ్ఏఎల్: కేంద్రం వచ్చే ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటు బాట తప్పే అవకాశం ఉందని అంతర్జాతీయ ఆర్థిక సేవల దిగ్గజ సంస్థ– బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిలించ్ అంచనావేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య వ్యత్యాసం– ద్రవ్యలోటు పరిమాణం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువతో పోల్చితే 3.5 శాతం (రూ.5.33 లక్షల కోట్లు) దాటకూడదన్నది బడ్జెట్ లక్ష్యం. అయితే వచ్చే ఏడాది ఈ రేటు 3 శాతానికి తగ్గాలన్నది ద్రవ్య బాధ్యత, బడ్జెట్ నిర్వహణా చట్టం చెబుతున్న విషయం. అయితే దీనికి భిన్నంగా ద్రవ్యలోటును రానున్న బడ్జెట్లో కూడా 3.5 శాతంగానే కొనసాగించే వీలుందని బ్యాంక్ ఆఫ్ అమెరికా అంచనావేస్తోంది. మూడీస్దీ అదే మాట... ఇక మూడీస్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కేంద్రం 3.5 శాతం ద్రవ్యలక్ష్యాన్ని సాధించే వీలుందని మూడీస్ పేర్కొంది. అయితే మౌలిక రంగాల వ్యయం అధికమయ్యే అవకాశం ఉన్నందున వచ్చే ఏడాది ద్రవ్యలోటును3 శాతానికి కట్టడిచేసే అవకాశాలు తక్కువగా ఉన్నాయని తన తాజా నివేదికలో వివరించింది. క్యాడ్ 1.3 శాతం: నోముర: 2017 స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో కరెంట్ అకౌంట్ లోటు 1.3 శాతంగా ఉంటుందని జపాన్ బ్రోకరేజ్ సంస్థ– నోమురా అంచానా వేసింది. ఇదిలాఉండగా, భారత్ వినియోగదారులు పూర్తిస్థాయిలో ఆశావహ ధోరణితో ఉన్నట్లు మాస్టర్‌కార్డ్ ఇండెక్స్ ఆఫ్ కన్సూమర్ కాన్ఫెడెన్స్ (హెచ్2 2016)నివేదిక తెలిపింది. -
వెనక్కురాని నోట్లు...రూ.50 వేల కోట్లే!
బ్యాంక్ ఆఫ్ అమెరికా అంచనా ముంబై: పెద్ద నోట్ల రద్దుతో ఆ నోట్లన్నీ బ్యాంకుల నుంచి బ్యాంకింగ్ రెగ్యులేటర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి చేరుతాయి. అలా చేరని మొత్తం విలువను మిగులుగా భావించడం జరుగుతుంది. సంబంధిత మొత్తం విలువను వినియోగం నిమిత్తం ప్రభుత్వానికి ఆర్బీఐ బదలాయిస్తుంది. డీమోనిటైజేషన్ ప్రారంభ కాలంలో ఇలా వచ్చే మొత్తం భారీగానే లక్షల కోట్లలో ఉంటుందని అంచనాలు వెలువడ్డాయి. అయితే అంతా కలసి ఈ తరహా నిధులు దాదాపు రూ.50,000 కోట్లే ఉంటాయని తాజాగా అంతర్జాతీయ గ్లోబల్ ఆర్థిక సేవల దిగ్గజం– బ్యాంక్ ఆఫ్ అమెరికా– మెరిలించ్ (బీఓఎఫ్ఏ–ఎంఎల్) అంచనా వేస్తోంది. ఇది తమ తొలి అంచనాలు రూ.95,000 కోట్లకన్నా దాదాపు సగానికి సగం తక్కువని కూడా పేర్కొంది. మరో లక్ష కోట్లు ఇలా... ఇక ఆదాయ స్వచ్చంధ వెల్లడి పథకాలు, నల్ల కుబేరులపై దాడులు, వారిపై పన్నులు అంతా కలిసి 2017 బడ్జెట్‌కు రూ.500, రూ.1000 పాత నోట్ల రద్దు ముందు, తర్వాత పరిణామాల వల్ల కలిసి వచ్చేది మొత్తంగా మరో దాదాపు రూ.1,00,000 కోట్లని, దీనితోసహా డీమోనిటైజేషన్ వల్ల బడ్జెట్‌కు లాభించేది రూ.1,50,000 కోట్లుగా ఉంటుందని బ్యాంక్ ఆఫ్ అమెరికా పేర్కొంది. తాము ఈ మొత్తాన్ని రూ.2,00,000 కోట్లని తొలుత అంచనా వేసినట్లు నేడు విడుదల చేసిన ఒక నోట్లో వివరించింది. మొత్తం రూ.15.55 లక్షల కోట్లలో రూ. 14 లక్షల కోట్లు డిసెంబర్ 19 నాటికే బ్యాంకింగ్‌కు చేరిపోయాయని తొలుత వచ్చిన వార్తల నేపథ్యంలో బ్యాంక్ ఆఫ్ అమెరికా తాజా నోట్‌ను విడుదల చేసింది. ‘‘ప్రత్యేక డివిడెండ్’’తో లాభమే! బ్యాంకులకు తిరిగి చేరని పెద్ద నోట్ల మార్పిడికి సంబంధించి ‘చెల్లింపు బాధ్యతను’ఆర్బీఐ రద్దు చేసుకునే వీలును కల్పిస్తూ, కేంద్రం ఆర్డినెన్స్‌ను కూడా జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనితో ఆర్బీఐ ‘ప్రత్యేక డివిడెండ్’కేంద్రానికి బదలాయించడానికి వీలు కలుగుతుంది. ఈ ‘‘ప్రత్యేక డివిడెండ్’’ను సామాజిక పథకాలపై వెచ్చించడానికి కేంద్రానికి వీలు కలుగుతుందని కూడా బ్యాంక్ ఆఫ్ అమెరికా తన నోట్లో వివరించింది. ద్రవ్యలోటు కట్టడి సాధ్యమే! ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ 3.5 శాతం ద్రవ్యలోటు (ప్రభుత్వ ఆదాయం– వ్యయం మధ్య వ్యత్యాసం. దీనిని ఒక నిర్దిష్ట ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తిలో కొంత శాతంగా ఉండాలని నిర్దేశిస్తారు) కట్టడి సాధ్యమేనని కూడా ఆర్థిక సేవల దిగ్గజ సంస్థ వివరించింది. స్వచ్చంధ ఆదాయ వెల్లడి పథకం ద్వారా ఒనగూరే మొత్తం బ్యాంకింగ్‌కు తాజా మూలధన కల్పన, ఏడవ ఆర్థిక సంఘం చెల్లింపులకు సరిపోయే వీలుందని అంచనావేసింది. నోట్ల రద్దుతో ఆర్థిక రంగం కుదేలు ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టిన అమెరికా ఆర్థికవేత్త హంకే వాషింగ్టన్: అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్థికవేత్త స్టీవ్ హెచ్ హంకే పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్ర సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టారు. ‘‘నగదుపై యుద్ధంతో భారత ఆర్థిక రంగం ఊహించినట్టుగానే కుచించుకుపోతుందన్నారు. నగదుపై పోరు మొదలు పెట్టడం ద్వారా ప్రధాని మోదీ అధికారికంగా భారత ఆర్థిక రంగాన్ని దిగువ వైపు నడిపించారు’’ అంటూ హంకే ట్వీట్ చేశారు. హంకే జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీలో అప్లైడ్ ఎకనమిస్ట్‌గా పనిచేస్తున్నారు. డీమోనిటైజేషన్ వల్ల తయారీ రంగం ఎక్కువగా దెబ్బతింటుందని... ఆర్థిక రంగంపై గణనీయమైన ప్రభావం చూపుతుందని హంకే తన ట్వీట్లో పేర్కొన్నారు. డీమోనిటైజేషన్ ఫలితంగా 2017లో భారత్ వృద్ధి పరంగా టాప్ ప్లేస్ నుంచి దిగజారుతుందన్నారు. బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించడం ఆర్థిక రంగం క్షీణతను అడ్డుకుని, ఇన్వెస్ట్మెంట్లను పెంచేందుకేనని హంకే పేర్కొన్నారు. గతేడాది నవంబర్ 8న కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో డిసెంబర్లో తయారీ రంగం పనితీరు పడిపోయింది. తయారీ రంగ కార్యకలాపాలను ప్రతిబింబించే నికాయ్ మార్కిట్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ పర్ఛెజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) నవంబర్‌లో 52.3గా ఉండగా, డిసెంబర్లో 49.6శాతానికి క్షీణించింది. -
‘గరీబ్ కల్యాణ్’తో ప్రయోజనాలు
తాజా ఆదాయ వెల్లడి స్కీమ్‌పై బ్యాంక్ ఆఫ్ అమెరికా విశ్లేషణ ద్రవ్యలోటు కట్టడికి దోహదపడుతుందని అంచనా న్యూఢిల్లీ: కేంద్రం ప్రకటించిన రెండవ విడత స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకం (ఐడీఎస్ 2) ద్వారా ప్రభుత్వం లక్షించిన రూ.లక్ష కోట్లు లభిస్తే ఇది ఆర్థిక వ్యవస్థకు ఎంతో మేలు చేకూర్చుతుందని అంతర్జాతీయ ఆర్థిక సేవల దిగ్గజ సంస్థ బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిలించ్ (బీఓఎఫ్ఏ–ఎంఎల్) విశ్లేషించింది. ఐడీఎస్ 2 ద్వారా రూ. లక్ష కోట్లు ఆదాయం లభిస్తుందని అంచనా వేస్తున్నట్లు పేర్కొంటూ, ఈ మొత్తం వస్తే వచ్చే ఆర్థిక సంవత్సరం (2017–18) ద్రవ్యలోటు (ప్రభుత్వ ఆదాయాలు– చేసే వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం) కట్టడికి ఇది ఎంతో దోహదపడే అంశంగా పేర్కొంది. ముఖ్యంగా ఏడవ వేతన కమిషన్ సిఫారసులకు అనుగుణంగా ఫండింగ్, బ్యాంకులకు మరింత మూలధం అందజేయడం వంటి అంశాల కోణంలో ఐడీఎస్ 2 ద్వారా లభించే ఆదాయం దోహదపడుతుందని బీఓఎఫ్ఏ అంచనావేసింది. కొత్త పథకం ఇదీ... ఐడీఎస్ 2 పథకాన్ని కేంద్రం డిసెంబర్ 16న ప్రకటించింది. మార్చి 31 వరకూ ఈ పథకం అమల్లో ఉంటుంది. దీని ప్రకారం పథకానికి దరఖాస్తు పెట్టుకునే ముందే ‘వెల్లడి మొత్తానికి’ సంబంధించిన మొత్తంలో మొదట 49.9 శాతం పన్ను చెల్లించాలి. అలాగే ఈ దరఖాస్తుకు ముందే ‘వెల్లడి మొత్తం’లో 25 శాతాన్ని వడ్డీరహిత రీతిలో నాలుగేళ్ల కాలానికి ‘లాక్–ఇన్’ విధానంలో డిపాజిట్ చేయాలి. మిగిలిన 25 శాతాన్ని వెనక్కు తీసుకోవచ్చు. అవినీతి, బినామీ ఆస్తుల నిర్వహణ, అక్రమ ధనార్జన, విదేశీ మారకద్రవ్య నిల్వల ఉల్లంఘనలు, ఫారిన్ బ్లాక్ మనీ, మాదకద్రవ్యాల అక్రమ రవాణా వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి ఈ పథకం వర్తించదు. -
భారీ ఐపీఓ బాటలో వొడాఫోన్!
రూ.13,200-16,500 కోట్ల రేంజ్లో హాంకాంగ్: భారత్‌లో ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)కు రావడానికి వొడాఫోన్ రంగం సిద్ధం చేస్తోంది. ఈ ఐపీఓకు లీడ్ మేనేజర్లుగా వ్యవహరించడానికి సిటిగ్రూప్, గోల్డ్‌మన్ శాక్స్, మోర్గాన్ స్టాన్లీ, బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్, యూబీఎస్ గ్రూప్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, కోటక్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ వంటి దిగ్గజ సంస్థలను వొడాఫోన్ గ్రూప్ ఆహ్వానించిందని సమాచారం. ఐపీఓ వ్యవహారాలను చూడడానికి రెండు వారాల్లో ఆరు సంస్థలను ఎంపిక చేయనున్నదని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఆరు సంస్థలను ఈ ఐపీఓ విలువ 200 కోట్ల డాలర్ల నుంచి 250 కోట్ల డాలర్ల(రూ.13,200 కోట్ల నుంచి రూ.16,500 కోట్లు) రేంజ్లో ఉంటుందని ఆ వర్గాల అంచనా. 2010లో ప్రభుత్వ రంగ కోల్ ఇండియా కంపెనీ ఐపీఓ ద్వారా 350 కోట్ల డాలర్లు సమీకరించింది. దాని తర్వాత ఇదే అతి పెద్ద ఐపీఓ కానున్నది. విశ్లేషకుల అంచనా ప్రకారం వొడాఫోన్ ఇండియా విలువ 2,000 కోట్ల డాలర్లు(రూ.1,32,000 కోట్లు) ఉంటుందని అంచనా. -
ది గ్రేట్ రాబరీ
ఆ నేడు 16 నవంబర్, 1976 ప్రపంచంలోనే అతి పెద్ద బ్యాంక్ దోపిడీ చేసిన దొంగలకు వందేళ్ల శిక్షను విధించింది ఈ రోజే! ఏడుమంది ఉన్న దొంగల గ్యాంగ్ ఒకటి 1975లో లండన్‌లోని బ్యాంక్ ఆఫ్ అమెరికాకు కన్నం వేసి ఎనభైలక్షల పౌండ్స్‌ను బ్యాగ్‌లో సర్దుకుంది. ఈ ఏడుగురులో ఒకడు .. ఆ బ్యాంక్ ఆనుపానులన్నీ తెలిసిన స్టాట్ బక్లీ! బక్లీ అదే బ్యాంక్‌లో ఎలక్ట్రీషియన్‌గా పనిచేసేవాడు. ఆ పనితో వచ్చే పదీపరక సరిపోక.. ఏకంగా బ్యాంక్ లాకర్స్ సీక్రెట్ కోడ్‌కే కీ తిప్పాలనే ప్లాన్ వేశాడు. అప్పటికే రాబరీలో అనుభవం ఉన్న తన స్నేహితులను కలిశాడు. బ్యాంక్‌ను బద్దలు కొట్టి బ్రహ్మాండంగా బయటపడ్డారు కూడా. తర్వాతే చిక్కొచ్చింది పంచుకునే లెక్కల దగ్గర. బ్యాంక్‌కి సంబంధించిన ప్లస్, మైనస్ పాయింట్స్ అన్నీ చెప్పి రాబరీ ప్లాన్‌ను ఈజీ చేసింది తనే కాబట్టి తనకు వాటా ఎక్కువ కావాలని వాదించాడు. మిగిలిన వాళ్లు ససేమిరా అన్నారు. దాంతో తనకు ఒక పెన్నీ కూడా ఎక్కువరాని మనీ మిగిలిన వాళ్లకూ దక్కడానికి వీల్లేదని బక్లీ వెళ్లి ఎంచక్కా పోలీసులకు అప్రూవర్‌గా మారిపోయాడు. కొసమెరుపు ఏంటంటే ఏడుగురు దొంగల్లో ఎక్కువ శిక్ష పడింది బక్లీకే. ఈ బృందానికంతటికీ వందేళ్ల శిక్షతోపాటు యాభై లక్షల పౌండ్ల జరిమానానూ విధించాడు జడ్జి అలెన్కింగ్ హామిల్టన్. -
వచ్చే ఏడేళ్లలో.. 3 ట్రిలియన్ డాలర్లకు మొబైల్ పేమెంట్స్
- బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్ అంచనా న్యూఢిల్లీ: దేశంలో మొబైళ్ల ద్వారా జరిగే చెల్లింపులు (మొబైల్ పేమెంట్స్) వచ్చే ఏడేళ్లలో 200 రెట్ల వృద్ధితో 3 ట్రిలియన్ డాలర్లకు చేరతాయని బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్ అభిప్రాయపడింది. ప్రస్తుతం మొబైల్ బ్యాంకింగ్ విలువ 16 బిలియన్ డాలర్లుగా ఉందని అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరంలో దేశంలో జరిగిన మొత్తం చెల్లింపులలో 0.1 శాతంగా ఉన్న మొబైల్ పేమెంట్స్ వాటా కూడా 10 శాతానికి పెరిగే అవకాశం ఉందని తెలిపింది. -
రేటు కోత ద్వారానే రికవరీ: బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిలించ్
న్యూఢిల్లీ : రిజర్వ్ బ్యాంక్ రెపో రేటు తగ్గింపు ద్వారానే తక్షణ భారత్ ఆర్థిక రికవరీ సాధ్యమవుతుందని గ్లోబల్ ఫైనాన్షియల్ దిగ్గజం- బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిలించ్ (బీఓఎఫ్ఏ-ఎంఎల్) తన తాజా నివేదికలో పేర్కొంది. వస్తువులు సేవల పన్ను (జీఎస్టీ), భూ సేకరణ సంస్కరణలు అమలయితే భారత్ ఆర్థికాభివృద్ధి జోరందుకుంటుందని ఇండియా మార్కెట్లు భావిస్తున్నాయని, అయితే వీటన్నింటికన్నా ముందు రెపో రేటు మరింత తగ్గింపు కీలకమని తాజా నివేదికలో విశ్లేషించింది. ఆగస్టు 4వ తేదీ ద్రవ్య పరపతి విధాన సమీక్ష సందర్భంగా ఆర్బీఐ మరోదఫా పావుశాతం రేటు కోత నిర్ణయం తీసుకుంటుందన్న అభిప్రాయాన్ని బీఓఎఫ్ఏ-ఎంఎల్ వెల్లడించింది. 2016 ప్రారంభంలో మరోదఫా పావుశాతం కోత ఉండవచ్చని కూడా అభిప్రాయపడింది.